రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, జూన్ 2019, సోమవారం

835 : ఇండీ సంగతులు

    ‘అంగమలై డైరీస్’ ని అంగమలై పట్టణపు కథగా అంగమలైలో ఎందుకు తీయాలి? ఎందుకంటే ఆ దర్శకుడు, ఆ రచయిత ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి. దర్శకుడు లిజో జోస్ పెలిసరీ అక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో చలకుడిలో నివసిస్తే, రచయిత వినోద్ చంబన్ జోస్ అంగమలై లోనే నివసించాడు. అంగమలై వాళ్లకి కొట్టిన పిండి. అక్కడి లోకల్ కల్చర్, జీవితం, మనుషుల తీరుతెన్నులు క్షుణ్ణంగా తెలుసు. క్రైస్తవులు ప్రధానంగా వుండే ఆ పట్టణంలో ఎటు చూసినా క్రైస్తవ సంస్కృతే కన్పిస్తుంది. అయినంత మాత్రానా క్రైస్తవ సంస్కృతితో తమకి తెలిసిన నేటివిటీ దొరికిందని అంగమలై లొకేషన్ గా ముఠా తగాదాల కథ చెప్పాలా? కానేకాదు. క్రైస్తవ సంస్కృతితో బాటు అంగమలై పోర్క్ వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడి ప్రజలు ఇష్టపడి రోజూ తినే ఆహారం పోర్క్ మాంసాహారం. నాలుగున్నర కోట్ల టర్నోవర్ తో అతి పెద్ద వ్యాపారంగా ఎందరికో జీవనోపాధి కల్పిస్తోంది. సీమపందుల పెంపకం, అమ్మకం పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రేక్షకులకి అర్ధ మవడానికి సినిమాలో పోర్క్ డిపో అతని చేత ఇదంతా చెప్పించి, కథకి కేంద్రబిందువుగా  ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా ముఠా తగాదాలకి అంగమలై అంతర్భాగమైన పోర్క్ బిజినెస్ ని నేపధ్యంగా తీసుకుని వాస్తవికతని, విశ్వసనీయతని సమకూర్చారు. 

         
ఇందులో నటించిన 86 మందీ కొత్త వాళ్ళు స్థానికులే. ఈ వూరు మనుషులెలా వుంటారో  వీళ్ళూ అలా వుంటూ నటించలేదు, ప్రవర్తించారు. వాళ్ళ వేష భాషలు, హాస్యం, స్థానికత అక్కడివే, సినిమా కోసం మార్చుకోలేదు. క్రిస్టియన్ ఫ్లేవర్ తో మ్యూజిక్ అక్కడిదే. గోవా నేపధ్యంలో కొంకణీ సినిమాల క్రిస్టియన్ ఫ్లేవర్ ఎలావుంటుందో, అంగమలైలో అది సరీగ్గా కుదిరింది. ఒక ప్రాంత నేటివిటీని సజీవ ప్రపంచంగా మన కళ్ళ ముందు ప్రతిష్టించాలంటే, మైక్రో లెవెల్లో చూపించాలి. ఓవరాల్ గా కెమెరా పాన్ చేసి ఇది ఫలానా ప్రాంతమంటే సరిపోదు. ప్రేమమ్, ఆర్డినరీ, అనార్కలీ వంటి మలయాళ సినిమాల్లో లొకేషన్స్ స్టూడెంట్స్ బస్సులు కట్టుకుని వెళ్లి విహరించే టూరిస్టు కేంద్రాలయ్యాయంటే, వాటిని మైక్రో లెవెల్లో చూపించడం వల్లే. అంగమలై పట్టణపు మైక్రో లెవెల్ చిత్రీకరణ కూడా చూస్తే, మనకి కూడా అక్కడికి వెళ్లి తిరిగి రావాలన్పిస్తుంది- పోర్క్ తినడానికి కాదు. మోనార్క్ లా ఫోటోలు దిగి రావడానికి... 
          హీరో గ్రూపు పోర్క్ ఇరవై రూపాయలు తక్కువకి అమ్ముతున్నారని, డిపో గ్రూపు అభ్యంతరం చెప్పడంతో మొదలయ్యే ఘర్షణలు... డిపో గ్రూపు విసిరిన బాంబు వల్ల హీరో పోర్క్ షాపు ధ్వంసమవడం, హీరో విసిరిన బాంబు వల్ల ఎదుటి గ్రూపులో ఒకడు చనిపోవడం, అది హత్య కేసుగా హీరో మెడకి చుట్టుకోవడం, అందులోంచి బయటపడేందుకు అవసరమైన ముప్ఫై లక్షల కోసం ప్రయత్నించడం...ఇలా అతి సాధారణంగా, బలహీనంగా వుంటుంది కథ. దీన్ని బలమైన కమర్షియల్ కథగా మార్చకుండా, రియలిస్టిక్ ధోరణులతో ఇండీ ఫిలిం (ఇండిపెండెంట్ సినిమా అనే సమాంతర సినిమా) గా తీశారు. సమాంతర సినిమా ఎప్పుడూ కమర్షియల్ ధోరణులతో  వుండదు. సమాంతర సినిమాలుగా మొదటి తరంలో ఆర్ట్ సినిమాలు, కొత్త రూపంగా కమర్షియల్ - ఆర్ట్ కలగలిసిన క్రాసోవర్ సినిమాలు, వీటి  కొనసాగింపుగా వరల్డ్ మూవీస్ అనుకరణలు వచ్చి, చివరిగా ఇండీ ఫిలిం దగ్గరాగింది ప్రస్తుతం సమాంతర సినిమా ప్రస్థానం. 


           ఇండీ ఫీలిం దర్శకుడు ఫీలయ్యి ఇండిపెండెంట్ గా ఇష్టమొచ్చినట్టు తీసుకునే వేదిక. దీన్ని కమర్షియల్ సినిమాల ‘క్యాలిక్యులేటర్’ తో చూసి ఇందులో ఇది లేదు, అది లేదంటే కుదరదు. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడడం అసలే కుదరదు. ఎలా చూపించిన కథ అలా చూడాల్సిందే. విమర్శకి తావులేదు. కానీ ఇండీ ఫిలిం జానర్ మర్యాదలు తెలియకుండా, ఏ కొంచెం కమర్షియల్ కథనం చేసినా, ఫార్ములా చిత్రణలు చేసినా, కృత్రిమ పాత్రల్ని చూపించినా, ఆ దర్శకుడే దెబ్బతింటాడు. అప్పుడది ఇండీ ఫిలిం కాక, దేనికీ చెందని అనాధ అవుతుంది.

టెక్నిక్కే వేరు
      టెక్నికల్ గా కూడా కమర్షియల్ పంథా వుండదు. కమర్షియల్ సినిమా షాట్స్, టేకింగ్స్, లైటింగ్, టింట్స్ వగైరా వాడరు. దృశ్యాలు సహజంగా, కూల్ గా వుంటాయి. యాక్షన్ సీన్లు, ఛేజింగులు, ఫైటింగులు కూడా కమర్షియల్ సినిమాల టైపులో వుండవు. నిజ జీవితంలో మన కళ్ళ ముందు ఎలా జరుగుతాయో అలా యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. ఇక హింస వుంటే దానికి యాంటీగా నేపధ్యంలో హార్ష్ గా వుండని మృదువైన వాతావరణం కల్పించడంతో ఆ హింస కూడా కళాత్మకమై పోతుంది. ‘అంగమలై డైరీస్’ లో లైట్స్ వాడలేదు. సహజ వెలుతురులోనే షూట్ చేశారు. అవన్నీ రియల్ లొకేషన్సే. మార్కెట్, కాలనీలు, పోర్క్ ప్రాంగణాలు వగైరా. షూటింగ్ లో లైటింగ్ యూనిట్ లేదు. జిబ్, ట్రాక్స్, ట్రాలీలు ఏవీ లేవు. ఎక్కువగా హేండ్ హెల్డ్ కెమెరాలతోనే షూట్ చేశారు. క్లయిమాక్స్ ఫైటింగ్ టేకింగ్ కి అంతర్జాతీయంగా పేరొచ్చింది. వెయ్యి మందితో, అదీ రాత్రిపూట, ఎక్కడా కట్ లేకుండా, కెమెరాని మూవ్ చేస్తూ, సింగిల్ టేక్ లో 12 నిమిషాల యాక్షన్ సీనంతా తీశారు.

          ఇలా మేకింగ్ లో ఈ ఎఫెక్ట్స్ అన్నీ వ్యూహాత్మకంగా ఏర్చికూర్చి – పొందుపర్చడంతో  ఈ ఇండీ ఫిలిం ఇండీ ఫిలిమ్స్ లో మేటిగా తయారయ్యింది. బాక్సాఫీసు సక్సెస్ కూడా చవిచూసింది. రెండున్నర కోట్ల బడ్జెట్ కి 20 కోట్లు వసూలు చేసింది. జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. ఒకటి రెండు అంతర్జాతీయ ఇండీ ఫిలిమ్స్ ఫెస్టివల్స్ కి కూడా వెళ్ళింది. కొంత మంది దీన్ని క్లాసిక్ కల్ట్ అని కూడా అంటున్నారు. 

          ఇక తెలుగుకి వద్దాం. తెలుగులో ఎప్పుడో గానీ ఇండీ ఫిలిం రాదు. వస్తే చీప్ గా  తీసిన కమర్షియల్ సినిమాల్లాగా వుంటాయి. ఇండీ ఫిలిం క్రాఫ్ట్ ఏ మాత్రం వుండదు. మైక్రో లెవెల్ చిత్రీకరణతో, పర్సనల్ గా అనుభవించిన జీవితంలోంచి ఆ దర్శకుడి వాయిస్ లా వుండవు. ఇక జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందడం, అమెరికన్ మీడియాలో కూడా రివ్యూలకి నోచుకోవడం, ఫెస్టివల్స్ కి వెళ్ళడం, కల్ట్ క్లాసిక్ అన్పించుకోవడం లాంటివి అస్సలు వూహించలేం. 

రీమేకా?! 
      అలాటిది ఒక ఇండీ ఫిలింని రిమేక్ చేస్తే? ఈ ప్రశ్న షార్ట్ ఫిలింని రిమేక్ చేస్తే?  అన్నట్టుంటుంది. షార్ట్ ఫిలిమ్స్ లాగే ఇండీ ఫిలిమ్స్ పర్సనల్ డైరీలు. కాకపోతే పొడిగించిన పర్సనల్ డైరీలు. అవి కమర్షియల్ సినిమాలు కావు - కొనుక్కొ చ్చుకుని గబగబా రిమేక్ చేసుకుని, చకచకా కరెన్సీ లెక్కెట్టుకుందా
మనుకోవడానికి. ఆ దర్శకుడి పర్సనల్ డైరీ అతను ఫీలైన సాంస్కృతిక కళాభివ్యక్తి. దాన్ని తెచ్చుకుని ఇంకో దర్శకుడు రిమేక్ చేయడమేమిటి? చేతనైతే దాని స్ఫూర్తితో తాను ఇంకోటి ఫీలై తన డైరీ లాగా ఏదైనా తీసుకోవాలి.

          అస్సాంలో మార్షల్ ఆర్ట్స్ అక్కడి జీవితంలో ఒక భాగం, సంస్కృతి. చిన్నప్పట్నించే ఆడా మగా పిల్లలు నేర్చుకుంటారు. ఈ సంస్కృతి తెలిసిన కుర్రాడు కేన్నీ డియోరీ బాసుమటారీ అనే వాడు, తన ఈ సాంస్కృతిక కళాభివ్యక్తితో సినిమా తీసేద్దామనుకున్నాడు. తన దగ్గరున్న35 వేలతో కెమెరా కొనుక్కుని, వాళ్ళమ్మ దగ్గర బంగారం కుదువ బెట్టి, లక్షరూపాయలతో ‘లోకల్ కుంగ్ ఫూ’ అనే ఇండీ ఫిలిం తీసేశాడు. తెలుగులో లక్షరూపాయలు, ఇంకా వీలయితే ఆ పైన పెట్టుబడితో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఆలోచించడం దగ్గరే  వుండి పోతునప్పుడు, తను ఏకంగా లక్షతో ఇండీ ఫిలిమే తీసి చూపెట్టాడు. యూట్యూబ్ లో ట్రైలర్ పెడితే పీవీఆర్ సంస్థ చూసి డీల్ కుదుర్చుకుని, దేశంలో  ప్రధాన నగరాల్లో రోజూ ఒక ఆట చొప్పున విడుదల చేసింది. 26 లక్షలు వచ్చాయి. ఆరు లక్షలు ప్రమోషనల్ ఖర్చులు తీసేసి, పది లక్షలు ఈ కొత్త ఇండీ దర్శకుడు కేన్నీ కిచ్చింది. అస్సాం యూత్ లో ఇదొక కల్ట్ ఫిలింగా  నమోదైంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో బాటు, మరికొన్ని అవార్డులు వచ్చాయి. అస్సాం యూత్ లో కెన్నీ సెలెబ్రిటీ అయిపోయాడు. వెంటనే ‘లోకల్ కుంగ్ ఫూ -2’ ని ప్రకటించి, 15 లక్షలు క్రౌడ్ ఫండింగ్ కెళ్తే, 30 లక్షలు వచ్చిపడ్డాయి! నేరుగా కుంభ స్థలాన్ని కొట్టలేరు. తన ఆట స్థలంలో తను ఫ్రెష్ గా ఆడుకుంటే కుబేరులే దిగివస్తారు. తన ఆట స్థలంలో కేన్నీ ఫ్రెష్ గా ఆడుకున్నాడు, పీవీఆర్ వచ్చి ఉద్ధరించింది. 

       సాంస్కృతిక కళాభివ్యక్తియే, ఇంకాస్త ఇన్నోసెన్సే ఇండీ ఫిలిమ్స్ కి  ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకెళ్ళే  ప్రధాన ముడి సరుకులుగా వుంటాయి. అలాంటిది ‘అంగమలై డైరీస్’ సాంస్కృతిక (పోర్క్ బిజినెస్) కళాభివ్యక్తినీ, అందులోని ఇన్నోసెన్స్ నీ, తెలుగులోకి రొడ్ద కొట్టుడు వూర మాస్ ఫలక్ నుమా దాస్ గా మార్చి పారేస్తే సరిపోతుందా? ‘ఫలక్ నుమా దాస్’ అని టైటిల్ పెట్టడంలోనే అర్ధమవుతోంది - ‘అంగమలై డైరీస్’ ని వూర మాస్ గా అర్ధం జేసుకుని రీమేక్ చేశారని. గతంలో తమిళంలో ‘నేరం’ అనే ఇండీ ఫిలింని అది ఇండీ ఫిలిం అని తెలీక, కమర్షియల్ తెలుగులో సందీప్ కిషన్ తో ‘రన్’ గా రీమేక్ చేశారు. కమర్షియల్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇందులో విలన్ ఉత్తుత్తిగానే ఒక ఆటో గుద్దుకుని కథ మధ్యలోనే ఠపీమని చచ్చిపోతాడు. ఇది డార్క్ కామెడీ. ఇండీ ఫిలింకి చెల్లుబాటయ్యే డార్క్ కామెడీ. కమర్షియల్ సినిమా కథకి ఓ పద్ధతీ పాడూ వుంటాయి. ఇండీకి వుండనవసరం లేదు. ఇది తెలీక ఇండీ ‘నేరం’ ని కమర్షియల్  ‘నేరం’ అనుకుని, బేరమాడుకుని, ‘రన్’ గా రీమేక్ చేస్తే ప్రేక్షకులు ఒకటే రన్!  ఇదే తమిళ ఇండీ ‘నేరం’ ని అదే దర్శకుడు మలయాళంలో రీమేక్ చేస్తే హిట్టయ్యింది! ఎవడి సొంత కవిత్వం వాడే చెప్పగలడు. ఇప్పుడింకో జోకేమిటంటే, ‘అంగమలై డైరీస్’ ని హిందీలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ దొరలు వచ్చారట! ఒక స్థానిక సాంస్కృతిక సన్నివేశాన్ని ఇంకో స్థానిక సన్నివేశంలో పెట్టి ఎలా చూపిస్తారో ఏమిటో. అంగమలై పట్టణపు సంస్కృతితో  ‘అంగమలై డైరీస్’ ని అక్కడి ‘కట్టా లోకల్’ గా, అంటే పక్కా లోకల్ గా ఆ దర్శకుడు ఇండీ ఫిలింగా తీసుకుని సక్సెస్ అయితే, దాన్ని తెలుగులో ‘పక్కా మాస్’ గా తీసి అట్టర్ ఫ్లాపయ్యారు. 

మాస్ మసాలా!
     టేకింగ్ అంతా కమర్షియల్ మాస్ టేకింగే, రియలిస్టిక్ ఫీల్ ఎక్కడా వుండదు. బీజిఎమ్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) లో థీమ్, లోకల్ కల్చర్ కన్పించవు. రెగ్యులర్ యాక్షన్ మూవీ మ్యూజిక్కే. ముఠాల పాత్రలు,  పాత్రధారుల తీరుతెన్నులు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నిట్లో ఒకేలా వుండే రౌడీ గెటప్సే. అవే జుట్లు, గడ్డాలు, మాసిన జీన్స్, టీస్. ఒరిజినల్ లో (అంగమలై డైరీస్ లో) లాగా 86 మంది ఫలక్ నుమా వాసులు ఎవరూ లేరు. ఫలక్ నుమా లోకి దిగుమతైన రెగ్యులర్ తెలుగు సినిమా మాస్ మొహాలే ఇవి. ఒరిజినల్ లో ఒకరిద్దరు తప్ప,  షేవ్ చేసుకునే నీటుగా వుంటారు. రౌడీ లుక్స్ వుండవు. ఇక హీరో ఆంటోనీ వర్ఘీస్ మొహంలో ఇన్నోసెన్సే వుంటుంది. బియ్యే తప్పి కేబుల్ టీవీ బిజినెస్ చేస్తూంటాడు. తల్లి వుంది. చెల్లెలి పెళ్లి చేయాలి. అందుకని పోర్క్ బిజినెస్ కూడా చేద్దామని ఫ్రెండ్స్ తో ఎంటర్ అవుతారు. అతడి లవ్ ట్రాక్ లో ఇద్దరు అమ్మాయిలుంటారు. మొదటి అమ్మాయి పెళ్లి చేసుకుని సింగపూర్ వెళ్ళిపోతుంది. రెండో అమ్మాయి జర్మనీలో నర్సు. ఈమెని పెళ్లి చేసుకుని జర్మనీలో సెటిల్ అవుదామనుకుంటాడు. ఇది కూడా జరక్క ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.  సింగపూర్, జర్మనీలతో తెలుగులో ఈ ట్రాక్ ఫలక్ నుమా నేటివిటీకి కృత్రిమంగా వుంటుంది. ఇక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా సినిమాటిక్. 

          ‘అంగమలై డైరీస్’ ప్రారంభంలో పోర్క్ స్టాల్స్ ని ఎక్కువగా చూపిస్తూ కథా నే పధ్యాన్ని పరిచయం చేస్తూంటారు. తెలుగులో ఫలక్ నుమా దేనికి ప్రసిద్దో చూపించలేక పోయారు. ఫలక్ నుమా దాటి సీటీ అంతా రౌండేశారు. మదీనా దగ్గర నాయబ్ హోటల్లో పాయా, షాదాబ్ హోటల్లో బిర్యానీ అంటూ, ఇంకా ఇతర చోట్లలో  ఫేమస్ అడ్డాలు చూపించుకుంటూ పోయారు. అసలు ఫలక్ నుమా ప్యాలెస్ ని చూపించడానికి కథ ప్రకారం వీలు పడలేదు. ఈ కథాకాలం 2005. అయినా ఇప్పుడు ఫలక్ నుమా ప్యాలెస్ అప్పటి ఫలక్ నుమా ప్యాలెస్ కాదు. మధ్యలో 2010 లో తాజ్ ఫైవ్ స్టార్ హోటల్ గా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు చూపెట్ట లేరు. ఎక్కడో మదీనా దాకా వెళ్ళకుండా, ఫలక్ నుమా లోనే రెండు పెద్ద ఇరానీ రెస్టారెంట్స్ వున్నాయి. ఇంకా చిన్న చమన్, మహంకాళీ గుడిలతో బాటు ఇంజన్ బౌలీ, ఆలియా బాద్ వంటి ఫేమస్ సెంటర్స్, రైల్వే స్టేషన్ వున్నాయి. మదీనా దగ్గర నాయబ్, షాదాబ్ హోటల్స్  అంటూ చూపెట్టారే గానీ,  కథా కాలం ప్రకారం అప్పట్లో మదీనా హోటల్ కూడా వుంది. మదీనా చాయ్ వుంది. ఫలక్ నుమా దాస్ ని ఎలా చూపెట్టారంటే, హైదరాబాద్ మొత్తం ఒకే నేటివిటీ అన్నట్టు చూపెట్టారు. 

          కానీ ఆబిడ్స్ నేటివిటీ జూబిలీ హిల్స్ లో వుండదు. అల్వాల్ నేటివిటీ చిక్కడపల్లిలో వుండదు. ఇలా ఫలక్ నుమా నేటివిటీ అంటూ వుంటే దానికో ఫీల్ తో దాని నేటివిటీయే  వుంది. ఓల్డ్ సిటీ నేపధ్యంగా హైదరాబాదీ కామెడీ - యాక్షన్ సినిమాలు వస్తూంటాయి. ఇవి ఇటు మహారాష్ట్ర, కర్ణాటక సరిహాద్దు జిల్లాల్లో వరకూ పాపులర్. వాటిలో వుండే ఓల్డ్ సిటీ సంస్కృతి, భాష, జోకులు ఏవైతే వుంటాయో అది పక్కా నేటివిటీ. అందుకే క్రేజ్. 

          ఇక హీరో తను ప్రేమిస్తున్న అమ్మాయిని ఒక స్టూడెంట్ టీజ్ చేశాడని కొట్టడానికి వెళ్ళే కాలేజీ ఎక్కడో ఉస్మానియా యూనివర్సిటీ. ఫలక్ నుమాలోనే కాలేజీలున్నాయి. కాకుండా కమర్షియల్ సినిమాల్లో బిల్డప్ లాగా, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం కావాల్సి వచ్చింది. ఇక ప్రతీవారం ఎక్కడెక్కడి గ్యాంగ్స్ చేరి మాట్లాడుకుంటాయని ఒక బార్ సెట్ చేశారు. ఫలక్ నుమాలో ఇది నిజం కాదు. అప్పట్లో దర్బార్ ఒక్క చోటే జరిగేది. చార్మినార్ పక్క రోడ్డులో ఒక హోటల్లో. అర్ధ రాత్రి దాటాక షట్టర్స్ వేసి లోపల లోన్ మాఫియా దర్బార్ పెట్టి, బాకీదార్లని చావగొడుతోంటే భయంకరమైన అరుపులు రోడ్డంతా విన్పించేవి. పోలీసులు చూసీ చూడనట్టు వెళ్లి పోయేవాళ్ళు. ఆప్పట్లో ఓల్డ్ సిటీలో లోన్ మాఫియానే పెచ్చరిల్లింది. ఇదేం లేకుండా ఓ బార్ సెట్ వేసి ముచ్చట్లు చూపించారు. 

సాంస్కృతిక నేపధ్యం లేదా?
      ఇంతకీ ఫలక్ నుమా సంస్కృతి ఏమిటి? హైదరాబాద్ హిందూ ముస్లిం సంస్కృతి, బిర్యానీ సంస్కృతి.  మలయాళంలో ఆ క్రైస్తవ సంస్కృతి, పోర్క్ ప్రశస్తి ఆ ఇండీ ఫిలింకి ఆత్మలా వుంటాయి. బ్యాక్ డ్రాప్ లో ఈ సోల్ ని బలంగా ఫీలయ్యేట్టు చేశాడు దర్శకుడు. ఇందుకే ఈ బలహీన కథ కూర్చోబెట్ట గల్గింది ప్రేక్షకుల్ని. తెలుగులో ఇలా లేదు. హిందూ ముస్లిం సంస్కృతి, బిర్యానీ ప్రశస్తి ఎక్కడా ఎస్టాబ్లిష్ కాకుండా, గ్యాంగ్ వార్స్ తో ఈ మటన్ కథ కమర్షియల్ పంథాలో పైపైన వుండిపోయింది. 

          ఐతే అంగమలై పోర్క్ వ్యాపారానికి ప్రసిద్ది. దీన్ని మొదటి సారిగా ప్రపంచ దృష్టికి తెస్తూ దీని నేపధ్యంలో కథ నడిపాడు దర్శకుడు. దీంతో కథే కొత్తగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీతో  ఈ నావెల్టీ లేదు. హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధి అని ఎప్పుడో తెలిసిన పాత మాటే. ఇంకా కొత్తగా చెప్పడానికీ, చూపించడానికీ ఏమీ వుండదు. కాబట్టి బిర్యానీ చుట్టూ కథగా మార్చి చూపించినా ఇక వర్కౌట్ కాదు. ఏం చేయాలో అర్ధం గాక మటన్ కొట్టు పెట్టారు. అంగమలై లో పోర్కే ప్రధాన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారంలోకి హీరో వెళ్ళడం సహజ ప్రక్రియ. ఫలక్ నుమా లో ఏ సహజ ప్రక్రియ హీరోని మటన్ వైపు లాగింది? అంగమలై హీరో చిన్నప్పట్నుంచీ సీమ పందుల్నీ, పోర్క్ దుకాణాల్నీ చూస్తూ పెరిగాడు. ఇంట్లో అదే తిన్నాడు. చిన్నప్పుడు హీరో ఇంట్లో మదర్ పోర్క్ వండుతూంటేనే సీను ఓపెనవుతుంది. అదే వడ్డిస్తుంది. ఫలక్ నుమా హీరోకి ఇవన్నీ ఎక్కడున్నాయి మటన్ వ్యాపారమనే సహజ ఐడియా రావడానికి. ఎక్కడో మూసీ దగ్గర జియా గూడలో గొర్రెల కబేళాలో గొర్రెలు కొని తెచ్చుకుని మటన్ కొట్టే అనుభవమెక్కడిది? ఇదంతా కమర్షియల్ సినిమా చిత్రణ కింద మారిపోయింది లాజిక్ లేకుండా.  

          ‘అంగమలై డైరీస్’ ని ఉద్దేశ పూర్వకంగానే తెలుగు ప్రేక్షకులకోసం మాస్ కమర్షియల్ గా మార్చి వుంటే అదీ వర్కౌట్ అవదు. ఇందులో వున్న బలహీన కంటెంట్, ఇండీ ఫిలింకి సూటయ్యేదే గానీ కమర్షియల్ సినిమా స్థాయికి కాదు. దర్శకుడు విశ్వక్సేన్ ఇంకేదో తనకి తెలిసిన నేటివిటీతో తనదైన సెన్సిబుల్ ఇండీ ఫిలిం తీయాల్సింది, లేదంటే ఇంకో కథతో నేటివిటీ లేని మాస్ తీసుకోవాల్సింది. ‘అంగమలై డైరీస్’ తో బ్యాడ్ జడ్జిమెంట్. 

సికిందర్
telugurajyam.com