రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 13, 2022

1116 : స్క్రీన్ ప్లే సంగతులు

థలో తగినంత సంఘర్షణ లేకపోతే ఏం చేస్తారు? అప్పుడు పాత్రకి మరిన్ని బాహ్య లేదా అంతర్గత అడ్డంకుల్ని జోడించడం చేస్తే, పాత్ర లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కువ సంఘర్షించేలా చేస్తుంది. తగినంత సంఘర్షణ లేకపోతే పాత్ర వెంటనే దాని లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇది కథని బలహీనం చేస్తుంది. కథలో పాత్ర లక్ష్యం కోసమే సంఘర్షిస్తుంది. అంటే సంఘర్షణ అనేది లక్ష్యాన్ని కథగా మారుస్తుందని అర్ధం జేసుకోగలం.          

యితే మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్న కథ అలాంటిది కాకపోతే? మన కథకి సంఘర్షణని జోడించడం మనస్కరిచక పోతే ఏం చేస్తాం? ఇక్కడ కథల గురించి మనకుండే అవగాహనని విస్తరించుకుని చూడాలి. విభిన్న కథా కథనాల నిర్మాణాలేమిటో తెలుసుకోవాలి. మనం పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినట్లయితే, కథల్లో సమస్యని పరిష్కరించడాన్నేకథ లంటారన్న అభిప్రాయంతో పెరిగి వుంటాం. సమస్యని పరిష్కరించడమే కథ ఐనట్లయితే, ఆ సమస్య పాత్రకి లక్ష్యాన్ని, లాభ నష్టాల్ని, సంఘర్షణనీ కల్పిస్తుంది. ఇలా సమస్యని పరిష్కరించడమే పాత్ర కర్తవ్యమవుతుంది.
        
అయితే మన కలవాటైన ఈ నాటకీయ ఉత్థన పతనాల (డ్రమెటిక్ ఆర్క్) కథన శైలి అన్ని కథలకీ, ముఖ్యంగా పాశ్చాత్యేతర సంస్కృతులకి వర్తించదు. మరీ ముఖ్యంగా, మనం అలవాటు పడినట్టు, విభిన్న కథా నిర్మాణాలతో కూడిన కథలు సంఘర్షణపై ఆధారపడవు. అలాగని సంఘర్షణ లేదు కాబట్టి వీటిని కథలుగా పరిగణించ వీల్లేదని కాదు. సంఘర్షణ లేకపోవడమే వీటిని వైవిధ్య కథలుగా మార్చేస్తుంది. దీన్నుంచి మనం నేర్చుకోవాలి. 

సంఘర్షణ రహిత లేదా స్వల్ప సంఘర్షణల కథా నిర్మాణాలు :
        సంఘర్షణని విస్మరించే, లేదా స్వల్ప సంఘర్షణకి భిన్నమార్గాల్నవలంబించే కథా నిర్మాణాలు చూద్దాం : 1) కిషోటెన్‌కేట్సు:  ఈ నాలుగు అంకాల కథా నిర్మాణం (ఫోర్ యాక్ట్స్ స్ట్రక్చర్) చైనీస్, కొరియన్, జపనీస్ కథల్లో కన్పిస్తుంది. శతాబ్దాల నాటి కథనాల నుంచి ఆధునిక మాంగా, నింటెండో వీడియో గేమ్‌ల వరకూ దీన్ని చూడొచ్చు, 2) రోబ్లెటో: సాంప్రదాయ నికరాగ్వాన్ కథా శైలి. ఇందులో పాత్ర ప్రయాణ మార్గాలు అనేకం వుండి, పునరావృత మవుతూ వుంటాయి, 3) డైసీ-చైన్ ప్లాట్ : ఒక కేంద్రీయ పాత్రంటూ లేకుండా, ఒక కథా వస్తువుని లేదా ఆలోచనని అనుసరించే నిర్మాణం, 4) ఫ్యాన్ ఫిక్షన్ ఫ్లఫ్”:  పాత్ర  ఇంటరాక్షన్స్ (పరస్పర చర్యల) పై దృష్టి పెట్టే సంఘర్షణా రహిత నిర్మాణం, 5) ఓరల్ స్టోరీ టెల్లింగ్ : సంఘర్షణని కాకుండా నైతిక సందేశాన్ని నొక్కి చెప్పే నిర్మాణం, 6) రషోమన్-స్టైల్ ప్లాట్ : విభిన్న దృక్కోణాల నుంచి  పునరావృతమయ్యే సంఘటనలతో కూడిన నిర్మాణం.

విభిన్న నిర్వచనం :
        మనం పాశ్చాత్య-సంస్కృతి దృక్కోణంలో కథ చెప్పడంలో కూరుకుపోయి వుంటే, సంఘర్షణ లేని కథల్ని బోరుగానే ఫీలవుతాం. వాటినసలు కథలుగానే పరిగణించం. సరే, అయితే అసలు కథని కథగా మారుస్తున్న దేమిటో అర్థం చేసుకోవడానికి వెనక్కి వెళ్దాం. నేను నా బ్లాగులో తరచుగా వివరిస్తున్నట్టుగా, అన్ని రకాల కథలూ  'మార్పు' ఆధారంగానే నిర్మాణాలు జరిగాయి. చాలా పాశ్చాత్య-శైలి కథా కథనాలు సంఘర్షణ ప్రభావిత 'మార్పు' పై ఆధారపడి వుంటాయి. 'మార్పు' అంటే పాత్ర మారడం, పరివర్తన చెందడం. ఇందులో కథానాయకుడు బాహ్య లేదా అంతర్గత సంఘర్షణల్ని అధిగమించడం లేదా, వాటి నుంచి నేర్చుకోవడం (లేదా అధిగమించడంలో లేదా నేర్చుకోవడంలో విఫలమవడం) వుంటుంది.

        ఇలా పాత్ర సంబంధిత మార్పుతో కూడిన కథలకి మనం అలవాటు పడ్డాం. దీనికి వ్యతిరేకంగా పైన చెప్పుకున్న ఆరు పాశ్చాత్యేతర నిర్మాణాలున్నాయి. ఇవి పాత్ర మార్పు పై కాకుండా పఠితలో మార్పుపై దృష్టి పెడతాయి.  ఉదాహరణకి, రషోమన్-శైలి కథలు ఒకే సంఘటనకి వివిధ పాత్రలు చెప్పే భిన్న భాష్యాల్ని ప్రేక్షకుల ముందు పెడతాయి. వాటిలో ఏది యదార్థమో ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. ఫ్యాన్‌ఫిక్ "ఫ్లఫ్" కథల్లో, పాఠకులు తమ అభిమాన పాత్రలు చెప్పే, చేసే, ఆలోచించే, ప్రవర్తించే లేదా విభిన్న పరిస్థితులలో ప్రతిస్పందించే తీరుని తీసుకుని, వాటికి విస్తరించిన తమ వూహా కల్పనని జోడిస్తారు.

        ఇక కిషోటెన్‌కేట్సులో, కథలోని మూడో అంకంలో వూహించని ట్విస్టు వస్తుంది. ఈ ట్విస్టు ప్రేక్షకులు కథని చూసే దృక్కోణాన్ని మార్చేస్తుంది. సాధారణ ప్లాట్ ట్విస్ట్ కంటే పాఠకుల దృక్పథాన్ని మార్చడం గురించి ట్విస్ట్ ఎక్కువగా వుంటుంది. అందుకని మొదటి రెండంకాలతో సంబంధం లేకుండా ఈ ట్విస్ట్  వుంటుంది.

        ఈ ఉదాహరణ చూడండి... మై నైబర్ టోటోరో అనే జపనీస్ యానిమేషన్ లో సంఘర్షణ లేదు, ప్రత్యర్థి లేడు. ఇద్దరమ్మాయిల తల్లి అనారోగ్యంతో వుంటుంది. ఈ అనారోగ్యం కథలో సాధించాల్సిన సమస్య కాదు. కేవలం ఒక పరిస్థితి. ఆమె ఆరోగ్యం మెరుగుపడడం అనేది అమ్మాయిల చర్యలతో సంబంధం లేనిది. అమ్మాయిల పని మ్యాజికల్ పవర్స్ తో వున్న పొరుగు వ్యక్తి గురించి తెలుసుకోవడం గురించే. అతడ్ని స్నేహితుడిగా చేసుకోవడం గురించే. ఆ స్నేహితుడితో కలిసి ప్రపంచాన్ని రక్షించడమో, లేదా దురుసు మనుషుల నుంచి ఈ ప్రత్యేక స్నేహితుడిని రక్షించడమో కాదు. అలాంటిదేమీ లేదు. కేవలం స్నేహం చేయడమే.

—జామీ గోల్డ్