రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, జనవరి 2017, ఆదివారం

స్పెషల్ ఆర్టికల్!

సినిమా రచన పక్కా వ్యాపారం చేసుకునే కళయినప్పుడు, పక్కా వ్యాపార దృక్పథంతోనే ఓపెనింగ్ సీను వుండాలని  తెలిసిందే గానీ, తెలిసినట్టు వుండడం లేదు చిత్రీకరణలు. సినిమా వ్యాపారం కోసం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ఆడియో ఫంక్షన్ మొదలైన ప్రచార సాధనాలుపయోగించినట్టే, సినిమా కథనీ  ఒక ‘టీజర్’ తో మొదలెడితే అది ఆ కథని ప్రేక్షకులకి హాట్ కేకులా అమ్ముడుబోయే సరుకుగా మార్చేసే వీలుంది. సినిమా ప్రచారంకోసం ప్రసారం చేసే టీజర్ ఆ సినిమా మొత్తంగా ఏమిటో, దేని గురించో చెప్పవచ్చు. కథకి ఉపయోగించే ‘టీజర్ సీను’  ఆ చెప్పాలనుకున్న కథకి ప్రేక్షకులు వెంటనే అతుక్కుపోయేలా చేస్తుంది. హాలీవుడ్ లెక్కల్లో స్క్రీన్ ప్లే మొదటి పదీ పదిహేను పేజీల్లో ఆకట్టుకోకపోతే ఆ స్క్రీన్ ప్లేని నిర్మాతలు తిరస్కరిస్తారు. టాలీవుడ్ లెక్కల్లో  ఇంటర్వెల్ సమయం ముంచుకొస్తున్నా కథ ఆకట్టుకోకపోతే  నిర్మాతలకి ఏమీ అన్పించక పోవచ్చుగానీ  ప్రేక్షకులకి ఏదో అన్పిస్తుంది. ఇలాకాకుండా మొదటి పేజీతో నే, లేదా మొదటి షాటుతోనే, లేదా మొదటి సీనుతోనే, ఇంకా లేదా మొదటి  సీక్వెన్సు తోనే అయస్కాంతంలా కథకి ఆకర్షిస్తే అంతకన్నా బలమైన చిత్రణ వుండదు- పైగా ఎన్నో విధాలుగా కాలం కూడా పొదుపయ్యే అవకాశం వుంటుంది- స్క్రీన్ టైముని సేవ్ చేసుకునే అవకాశం.  


      ఆల్రెడీ తెలుగు సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగులు లేవా? వున్నాయి. వాటితో ప్రేక్షకుల్ని కట్టి పడెయ్యడం లేదా? లేదు. ఎందుకులేదు? వాటితో  వ్యాపార దృక్పథం కాక గొప్ప క్రియేటివిటీ ఏదో ప్రదర్శించుకోవాలన్న కోణం వుండడం వల్ల. గ్లామర్ కి కళ తోడయినప్పుడే రాణిం చినట్టు, పక్కా వ్యాపార యావ వున్నప్పుడే కమర్షియల్ సినిమా క్రియేటివిటీ క్రియేటివిటీ అన్పించుకుంటుంది. లేకపోతే కొందరు మేధావులు చూసే ఆర్ట్ సినిమా హస్తకళా నైపుణ్యం అన్పించుకుంటుంది. తెలుగు సినిమాల ఓపెనింగ్ బ్యాంగులు  హస్తకళా నైపుణ్యాలు. కమర్షియల్ బ్యాంగు లిచ్చే లెక్క వేరే వుంటుంది. అదే తెలుసుకోబోతున్నాం.

          ప్రేక్షకుల్ని థియేటర్లకి పరిగెత్తించడానికి రకరకాల క్రేజీ టీజర్లు ఛానెళ్ళలో వదుల్తారు. తీరా ఆ సినిమాల్ని చూస్తే బలహీనంగా ఎత్తుకుంటాయి కథని. టీజర్లు చూసి ఏ ఉత్సాహంతో ప్రేక్షకులు థియేటర్లకి వస్తారో, ఆ ఉత్సాహం రెట్టింపయ్యేలా సినిమా ఓపెనింగ్ దృశ్యాలున్నప్పుడే బయటి టీజర్లకి అర్ధంపర్ధం వుంటుంది. అడ్వర్టైజింగ్ కొత్త పుంతలు తొక్కుతూంటే, సినిమా మేకింగ్ మాత్రం అదే పాత హొయలు పోతోంది. కొందరంటారు- రేపు టీజర్ కి కట్ చేయాల్సిన షాట్లని దృష్టిలో పెట్టుకునే సీన్లు తీస్తున్నామని. టీజర్! టీజర్ ని దృష్టిలో పెట్టుకుని షాట్లు! కథని దృష్టిలో పెట్టుకుని కాదు! ఫోటో షూట్స్ తోనూ ఇలాగే చేస్తున్నారు. పోస్టర్ల కోసం చేసే ఈ క్రేజీ ఫోటో షూట్ దృశ్యాలు సినిమాల్లో  వుండవు. ఇలా ఆధునిక వ్యాపార దృక్పథం సినిమా చుట్టే కన్పిస్తుంది- సినిమాలోపల పక్కా వ్యాపార దృక్పథం ఏమీ వుండదు.          ఒకప్పుడు టీవీ ఛానెళ్ళే లేనప్పుడు, థియేటర్ లకి మాత్రమే కొన్ని సినిమాల ట్రైలర్లు వచ్చేవి. థియేటర్లో ట్రైలర్లు చూసి థియేటర్లకే  వెళ్లి సినిమాలు చూసేవాళ్ళు. రెండూ అక్కడే కానిచ్చుకోవడం.  కొన్ని సినిమాలు ఆ ట్రైలర్లు ఇచ్చే కిక్కు కంటే ఎక్కువ కిక్కుతో కథని ఎత్తుకునేవి. అలాటి ఒక సినిమా 1982 లో మిథున్ చక్రవర్తి మ్యూజికల్ సూపర్ హిట్ ‘డిస్కో డాన్సర్’ (బాలకృష్ణతో ‘డిస్కో కింగ్’). విడుదలకి ముందే అన్నీ సూపర్ హిట్ సాంగ్సే బప్పీ లహరీ సంగీతంలో. సినిమా ప్రారంభమే డిస్కో డాన్సర్ సిగ్నేచర్ ట్యూన్ తో ఉత్సాహపరుస్తూ టైటిల్స్ పడతాయి- టైటిల్స్ పూర్తవగానే వెంటనే చాలా సర్ప్రైజింగ్ గా ఇంకో పాటతో కిక్కిస్తూ దృశ్యం  మొదలవుతుంది. బయట వింటూ వున్న ఈ పాట ఇప్పుడే వుంటుందని ఎవరూ వూహించరు. చాలా ఆనందపడి పోతారు. ఇంతే కాదు,  ఇంకా సర్ప్రైజింగ్ గా ఈ పాటలో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కన్పిస్తాడు! రాజేష్ ఖన్నా చిన్నప్పుడు మిథున్ చక్రవర్తి తండ్రిగా  అప్పీయరెన్స్ ఇస్తాడు! ఈ రాజేష్ ఖన్నా- చిన్నప్పటి మిథున్ చక్రవర్తిల మీద వీధిలో చుట్టూ జనం మధ్య సూపర్  హిట్ సాంగ్ మొదలవుతుంది. ఈ సాంగ్ ద్వారా (ఓపెనింగ్ సీన్ ద్వారా) మిథున్ చిన్నప్పుడే ఒక నిరుపేద స్ట్రీట్ సింగర్ కొడుకనీ, తనకీ ఆ విద్య అబ్బిందనీ మనకి తెలిసేలా చేస్తాడు దర్శకుడు. అంతే కాదు, వీధిలో తండ్రితో కలిసి పాడుతూంటే, ఎదుటి బంగళా లోంచి  రిచ్ బాలిక (హీరోయిన్ అన్నమాట) చూస్తూంటుంది...  ఇంతకీ ఆ సూపర్ హిట్ పాట – ‘గోరోఁ కీ నా కాలోఁ కీ,  యే దునియా హై దిల్ వాలోఁ కీ...(తెల్లోళ్ళదీ కాదు, నల్లోళ్ళదీ కాదు, ఈ లోకం మనసున్నవాళ్ళదే!). ఇలా పాటతో కలిపి కథ చెబుతూ ఈ ఓపెనింగ్ సీనుని ఒక పరిపూర్ణ ఈవెంట్ గా మార్చేశాడు దర్శకుడు బి. సుభాష్. 


          ప్రారంభ సీనుని  ఒక ఈవెంట్ గా మార్చడం! మళ్ళీ ఒక ‘గాడ్ ఫాదర్’ లోనే చూస్తాం! కానీ  ఈ సుభాష్ ఓపెనింగ్ సీను నేడు  చెప్పుకుంటున్న ఓపెనింగ్ బ్యాంగే! కమర్షియల్ విలువలతో కూడిన ఈ ఓపెనింగ్ బ్యాంగు ఒక టీజర్ లా పనిచేస్తోంది కథకి! ఇది చూసింతర్వాత ఇక కథ మొత్తం చూడాలని ఉత్సుకతకి లోనవకుండా వుంటారా ప్రేక్షకులు! దటీజ్ రియల్ టీజర్ అన్నమాట స్టోరీకి!  

          టీజర్ సినిమాలో ఉండాలే గానీ, బయట ఎన్నుంటే ఏం లాభం. ఒకసారి  ‘డిస్కో డాన్సర్’ వీడియో యూ ట్యూబ్ లో చూస్తే బాగా అర్ధమవుతుంది  స్టోరీ టీజర్ మహత్తు. ఎప్పట్నుంచో  టీజర్ పేరుతో కాదుగానీ, ఒక క్యాచీ ట్యూన్ గల పాటతో తో సినిమా ప్రారంభిస్తే కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుతుందని ఎందరికో చెప్పి చూశాడీ వ్యాసకర్త. ఇందులోని మజా వాళ్ళకి తెలీడం లేదు. బోరు ఫీలవుతూ సినిమాలకి ఆలస్యంగా వచ్చే వాళ్ళు కూడా ఆ పాట చూడాలని ముందే వచ్చేస్తారు...


          నేటి సినిమాల క్రియేటివిటీ వీలైనన్ని కోణాల్లో కమర్షియాలిటీలో భద్రతని చూసుకోవాల్సి వుంటుంది. ఇదివరకు చెప్పుకుంటూ వున్న ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో భాగంగా సినిమా కథకి క్రియేటివ్ యాస్పెక్ట్ తో బాటు, మార్కెట్ యాస్పెక్ట్ కూడా వుండాలని చెప్పుకున్నాం. తమలోకంలో తాముండి  రాసే వాళ్ళకి, తీసే వాళ్ళకీ ప్రపంచ పోకడ అంతగా పట్టదు. తాము రాసిందే, తీసిందే ఎప్పటికీ చెల్లుబాటు అవుతుందను కుంటారు. కానీ మార్కెట్ ఎప్పటి కప్పుడు మారిపోతూ వుంటుంది. సినిమా రంగాన్ని కాస్సేపు పక్కన పెడదాం, పత్రికా రంగాన్నే తీసుకుంటే అది క్షణం క్షణం సోషల్ మీడియాతో పోటీ పడాల్సి వస్తోంది. పత్రికలే కాకుండా ఛానెళ్ళూ సోషల్ మీడియా వేగాన్ని అందుకోవడానికి ఉరుకులు  పరుగులు తీయాల్సి వస్తోంది. వార్త వీటికి అందేలోగా సోషల్ మీడియాలో ప్రపంచం చుట్టేస్తోంది. పైగా మీడియా సంస్థలకి ఏ వార్త ఎలా ఇవ్వాలో ఒక పాలసీ వుంటుంది. స్వేచ్చా విహంగమైన సోషల్ మీడియాకి ఏ పాలసీ వుండదు గనుక నిజాలు ఆ వేదికపై బయటపడుతూంటాయి. ఇది కూడా తలనొప్పిగా మారింది మీడియా సంస్థలకి. అయితే నిజాల కంటే అబద్ధాలే సులువుగా బాగా త్వరగా అర్ధమవుతాయి కాబట్టి ఈ వంకతో సోషల్ మీడియా అభిశంసనలకి గురవుతూంటుంది సదా. అయినా ఒక్కోసారి మీడియా సంస్థలకి శృంగభంగం తప్పడం లేదు- ఎలాగంటే, ఇటీవలే ఒక తెలుగు ఛానెల్లో ఒక ‘వివాదాస్పద అంశం’ పైన అన్ని పక్షాల వాళ్ళూ కూర్చుని వేడివేడిగా వాదించుకుంటున్నారు. అంతలో ఒకాయన ఫోన్ చేసి, అదేం చర్చ- ఈ అంశంపైన కోర్టు స్టే ఇస్తే ఇక ఒకర్నొకరు నిందించుకునే పాయింటు ఎక్కడిది – అనేసరికి అందరి పరువూ పోయి తెల్లమొహాలేశారు యాంకరు సహా! వేగంలో, వేడిలో కోర్టు స్టే ఇచ్చిన విషయం కూడా తెలుసుకోకుండా భారీ చర్చపెట్టుకుని తమ విశ్వసనీయతే కోల్పోయారు. ఇదంతా సోషల్ మీడియాతో ఎడతెగని పోటీ వల్లే!

           సినిమా రంగం కూడా దీనికి అతీతం కాదు.
ఇటీవల ‘న్యూ యార్కర్’  మ్యాగజైన్ ఒక ఆర్టికల్ ని ప్రచురించింది. సోషల్ మీడియాలో షేర్ చేసే వైరల్ కంటెంట్ ఫండమెంటల్స్ ని వివరిస్తూ రాసిన ఈ ఆర్టికల్ సినిమా రైటర్స్ కి పనికొస్తుందని తెలిపింది. వైరల్ కంటెంట్ ఫండమెంటల్స్ మీద  రీసెర్చర్లు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసంఖ్యాక నెటిజనులు వైరల్ కంటెంట్ ని షేర్ చేయడం వెనుక గల సైకలాజీ ఏమిటన్న దాని  మీద ఈ పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటికి వెలువడిన ఫలితాలు  విజయవంతమైన స్క్రీన్ ప్లేలు రాయాలంటే ఇక పైన ఏం చేయాలో సూచిస్తాయి.

        సోషల్ మీడియాలో కొన్ని కంటెంట్స్ మాత్రమే వైరల్ అవుతూ, కొన్నిఅంతగా షేర్ అవకపోవడం వెనకాల నెటిజనుల సైకాలజీ ఏమిటంటే ఒకటి- ఆ కంటెంట్ ఇంట్రస్టింగ్ గా వుండాలి, రెండు- అరిస్టాటిల్ సూత్రాలకి న్యాయం చేయాలి, మూడు- ఎమోషనల్ అప్పీల్ వుండాలి, నాల్గు- క్వాలిటీ వుండాలి...ఈ నాల్గు ఎలిమెంట్స్ వున్న కంటెంట్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(మిగతా రేపు)
-సికిందర్
http://www.cinemabazaar.in