రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, April 20, 2015

రైటర్స్ కార్నర్

   
   
కంపెనీ, చక్ దే ఇండియా, బంటీ ఔర్ బబ్లీ , శుద్ధ్ దేశీ రోమాన్స్ వంటి హిట్  సినిమాల రచయిత జైదీప్ సహానీ రాయటర్ వార్తా సంస్థ కిచ్చిన ఇంటర్వ్యూ లో తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. అవేమిటో ఈ కింద చూద్దాం..
?  శుద్ధ్ దేశీ రోమాన్స్ ప్రమోషన్ సందర్భంగా మీకూ దర్శకుడు మనీష్ శర్మ కీ అధిక  ప్రాధాన్య మిచ్చారు. అదెలా జరిగింది?
* ఇది మమ్మల్నే ఆశ్చర్య పర్చింది. మాకు తెలియని కొత్త అనుభవమిది. మా మార్కెటింగ్ మేనేజర్లు ప్రొమోస్ లో మా ఇద్దర్నీ ఉపయోగించుకుంటే ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకర్షించ వచ్చని భావించారు. నా దర్శకుడే కాదు, నిర్మాత కూడా రచయితగా నాకింత గౌరవ మివ్వడం నా అదృష్టం..
?   ఏ రచయితనీ ప్రమోషన్ లో ఇంతలా వాడుకోలేదేమో!
నిజమే, ఒక మంచి సాంప్రదాయం ఇలా ప్రారంభమైతే రచయితలకి మంచిదే..
?  నిర్మాతలు రచయితల కివ్వాల్సిన విలువ ఇవ్వడం లేదంటారా?
*   మంచి రచన వల్ల సినిమా ఎంత లాభపడుతుందో తెలిసిన నిర్మాతలు తప్పక రచయితలకి  విలువిస్తారు. ఇది మంచి నిర్మాతలు గుర్తించినంతగా అల్లాటప్పా నిర్మాతలు గుర్తించ లేరు. నేను రాయడం ప్రారంభించిన రోజుల్లో రచయితలకి విలువ లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. ఇప్పుడు చాలా మంది నిర్మాతలే గాకుండా పరిశ్రమలో ఇతరులూ కథా రచనని ఇతర శాఖలతో సమానంగా గుర్తిస్తున్నారు. ఒకప్పుడు సలీం- జావేద్ ల కాలం లో ఈ గుర్తింపూ, స్పృహా ఎక్కువ వుండేవి. తర్వాత కాలంలో ఏమైందో ఏమో కథా రచయితా అతడి రచనా సోదిలోకి లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆదరిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు సినిమాకి రైటరెవరూ అని ఆరాతీస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. ఇక సినిమా రివ్యూలలో నైతే ఇంకా రచయితల గురించి రాయాలన్న ఆలోచన కన్పించడం లేదు..
?  ప్రేక్షకులు దేన్ని కోరుకుంటున్నారో టికెట్ల అమ్మకాలు తెలియజేస్తాయి. అలాటి బ్యాంగ్, ఫ్లాష్ వున్న కథలు మీరివ్వ లేరా?
* సామాన్య ప్రజల గురించి, వివిధ వృత్తివ్యాపకాల్లో వున్న వాళ్ళ గురించీ నేను రాయడాని కిష్ట పడతాను. ఆఫీసు కెళ్ళకుండా, టాయిలెట్ కెళ్ళకుండా, తినకుండా తిరిగే పాత్రల్ని నేనూహించలేను. మన చుట్టూ వుండే  కథల్నే ప్రజల కోసం రాస్తాను. అయితే ప్రేక్షకుల విలువైన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వినోదం గురించి కూడా ఆలోచిస్తాను.
?  అంటే మీరు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తారన్న మాట?
* వాళ్లకి బోరు కొట్టించకూడదు కదా? అదేసమయంలో పాత్రల్నికూడా దృష్టిలో పెట్టుకుంటాను.
?  మీరెక్కువగా రాయరెందుచేత?
* గత పదిహేనేళ్ళలో  ఏడెనిమిది సినిమాలే రాశాను. నా వృత్తిని గౌరవించే వాళ్ళనే ఎంపిక చేసుకుని రాస్తూంటాను కాబట్టి సినిమాల సంఖ్య తక్కువే వుంటుంది. నన్ను గౌరవించక పోయినా లెక్క చెయ్యను- నా వృత్తిని గౌరవించాలి. నేను దర్శకుడిగా మారకపోవడానికి కారణ మీదే..రచనా వృత్తి మీద గౌరవం. పైగా వీలైనంత ఎక్కువ మంది ప్రతిభ గల దర్శకులకి రచన చేసి దాన్ని వాళ్ళెంత థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తారో చూడాలన్న ఆసక్తి నాకెక్కువ!
?  మీరు రాసే విధానం ఏమిటి?  ఎలా ప్రారంభిస్తారు?
* ఒక్కో సినిమాకి ఒక్కో విధంగా వుంటుంది. నాకు సంబంధించినంతవరకూ సినిమా అనేది పాత్రల గురించి వుండాలి, జానర్ గురించి కాదు. ఏదైనా సబ్జెక్ట్ నా దృష్టిని ఆకర్షిస్తే, దానికి సంబంధించిన సమాచారాన్ని పక్కాగా  సేకరించడంలో ఎక్కువ కాలం గడిపేస్తాను. ఈ సబ్జెక్టుల్లో కొన్ని తెరకెక్క వచ్చు, కొన్ని పనికి రాకపోయినా వాటి మీద చేసిన వర్క్ అంతా ఒక మంచి అనుభవంగా మిగిలిపోతుంది. రాయడానికి నాకో టైం టేబుల్ అంటూ వుండదు. చాలా అరుదుగా రాస్తాను. ‘కంపెనీ’ అనే మాఫియా సినిమా కోసం, ‘చక్ దే ఇండియా’ అనే స్పోర్ట్స్ సినిమా కోసమూ ఎంతో రీసెర్చి చేయాల్సి వచ్చింది. ఎంత రిసెర్చి చేయడానికైనా సిద్ధ పడతాను తప్ప, ఎక్కడినించీ కథల్ని మాత్రం దొంగిలించను. నా జీవితంలో ఎవరి దగ్గరా పెన్సిలు కూడా దొంగిలించ లేదు. ‘ఖోస్లా కా ఘోస్లా’  రాయడానికి పెద్దగా కష్ట పడలేదు. నేనూ ఆ సినిమా  దర్శకుడు దిబంకర్ అలాటి వాతావరణంలోనే పెరిగాం గనుక!
?  హీరో హీరోయిన్ల చుట్టూ మీరు కథ లెందుకు రాయరు?
* ఏమో తెలీదు. పాత్రలంటే నాకు కక్కుర్తి ఎక్కువ కావడం వల్లనేమో. కొత్త కొత్త తరహా పాత్రలకోసం కక్కుర్తి పడతాను. వివిధ యాసల కోసం కూడా కక్కుర్తి పడతాను. రైటర్ కిది సహజం. పాత్రల కక్కుర్తి, యాసల కక్కుర్తి, భిన్న జారుల- ఆర్ధిక గ్రూపుల కక్కుర్తీ ఇదంతా ఏటో తీసికెళ్ళి పోయి నా చేత రాయిస్తున్నాయి. నా దృష్టిలో మెయిన్ స్ట్రీమ్  కమర్షియల్ సినిమాలు  నాటు మోటు సినిమాలు. ఈ ట్రాప్ లో పడకుండా కథలో ఎదురయ్యే ప్రతీ మెయిన్ స్ట్రీమ్ ఘట్టాన్నీ నా కక్కుర్తులతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాను.
?  రాయడంలో మీకెదురయ్యే అతి కష్టమైన పార్టు ఏది?
* ఏదీ లేదు. నిజానికి నాకు నచ్చని మరొకరి కథ మీద పనిచేయడమే కష్టమైన పార్టు. కథ
బావుంటే అందులో కష్టమైన పార్టు అంటూ ఏమీ వుండదు.

?  రచయితలకి మంచి పారితోషికాలు లభించక పోవడం పై మీరేమంటారు? మీరెలా డిమాండ్ చేస్తారు?
చెప్పడం కష్టం. నిర్మాతలతో ఎవరికీ వాళ్ళు మాట్లాడుకోవాలి. మన అలవాట్లు, ఖర్చులు తగ్గించుకుంటే పెద్దగా డిమాండ్ చేసే అవసరం రాకపోవచ్చు. మనం రాజాలా బతకాలనుకుంటే డిమాండ్ చేయవచ్చు. కానీ మనం రాజాలా బతకడం కోసం ఎవరూ భారీ పారితోషికా లివ్వరు. నా కలాటి భారీ ఆశలేం లేవు- నా భారీ ఆశలల్లా పాత్రల కోసమే వుంటాయి, నాకోసం నేను ఆశలు పెట్టుకోను.
?  హిందీ సినిమాలకి సెకండాఫ్ శాపం అనేది వెన్నాడుతూనే వుంది కదా - ఒక గొప్ప అయిడియాతో మొదలైన కథ సెకండాఫ్ కొచ్చేసరికి దారితప్పి గందరగోళం అవుతోంది- రచయితగా మీరెలా ఎదుర్కొంటారు దీన్ని?
అది సెకండాఫ్ శాపం కాదు, ఇంటర్వెల్ శాపమనాలి దాన్ని. కొన్ని రకాల సినిమా కథలకి ఇంటర్వెల్ అడ్డంకి గా మారుతుంది, ‘రాకెట్ సింగ్’ లో లాగా. ఒక మూడ్ ని క్రియేట్ చేయాలనుకుంటాం...ఆత్మావలోకనం చేసుకునే మూడ్...ఇంటర్వెల్ తర్వాత అదే మూడ్ ని రీక్రియేట్ చేసి ముందుకు కొనసాగుతాం..దీనికి ఇంటర్వెల్ శాపం. ఇంటర్వెల్ లేకపోతే  ఏ సమస్యా లేదు.
?   శుద్ధ్ దేశీ రోమాన్స్ లాంటి కథ ఎలా రాశారు?
 
* రోమాన్స్ తో నా కెక్కువ అనుభవం లేదు. బంటీ ఔర్ బబ్లీ లో కూడా వున్నది ప్రేమ కథ అని
నేననుకోను. ఇంటర్వెల్ సమీపిస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు ఫీలవడం మొదలెడతారు. అప్పుడు నేను ఇంటర్వెల్ రాసేసి పారిపోయాను- ఎందుకంటే దాన్ని డీల్ చేయడం నావల్ల కాలేదు. ఏదో ఒక సమయంలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారని నాకు తెల్సు. అందుకని వాళ్ళని ఫోర్సు చేయలేదు. నా పాత్రల్ని నేను ఫోర్స్ చేయను. చాలా లైట్ టచ్ లో ఉంచుతాను. ఈ కోణంలో చూస్తే ఇదే  నా మొదటి రోమాంటిక్ సినిమా అవుతుంది. అది బావుందా లేదా నాకైతే తెలీదు.
?  మరి ఏ రకమైన ప్రేమకథ మీరు చెప్పాలని ప్రయత్నించారు?
* రోమాంటిక్ కామెడీ రాయడం అనవసరమని నా అభిప్రాయం. నాకు తెలిసి అన్ని రోమాన్సులలోనూ కామెడీయే అంతర్లీనంగా వుంటుంది. ప్రత్యేకంగా రాయనవసరం లేదు. రోమాంటిక్ కామెడీ అనే మాటకే అర్ధం లేదు. కానీ మన దేశంలో  గత పది పదిహేనేళ్ళుగా రిలేషన్ షిప్స్ ని యూత్ చూస్తున్న తీరు పూర్తిగా మారిపోయింది. ముందు తరం వాళ్ళకంటే ధైర్యం చేసి వుంటున్నారు. ఒకటి కాకపోతే ఇంకోటిగా నాల్గైదు రిలేషన్ షిప్స్ తో కూడా ఎక్కడో అక్కడ స్థిర పడ్డం లేదంటే,  వాళ్ళు ఇంకా ఇంకా బెటర్ ని ట్రై చేసి చూద్దామని అనుకుంటున్నట్టే. ఒక పట్టణానికీ మెగా సిటీకీ తేడా ఏమిటంటే, యూత్ పట్టణ సాంప్రదాయ జీవితాన్ని కలిగి ఉంటూ మెగా సిటీ ఆధునికతతో నిత్యం సంఘర్షిస్తూ వుంటారు.  మన కల్చర్ తో మనం చాలా హిపోక్రసీ తో వుంటాం కదా, ఈ యూత్ వచ్చేసి నీరు పల్ల మెరుగు అన్నట్టు తమ దారి తాము వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు.                                                                             *