రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, October 29, 2020

991 : హాలీవుడ్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు ఈ రోజు సాయంత్రం



...(మల్టీ టాస్కింగ్ మెడకి చుట్టుకుని బ్లాగు రెగ్యులారిటీ మీది కొచ్చింది...)


 రచన : దర్శకత్వం : జూ క్విర్క్ 
తారాగణం: సిడ్నీ స్వీనీ, మెడిసన్ ఐజ్మన్, జాక్స్ కొలిమన్, ఇవాన్ షా, జూలీ బెంజ్, బ్రాండన్ కీనర్ తదితరులు 
సంగీతం : గజెల్ ట్విన్, ఛాయాగ్రహణం : కార్మన్ కబనా, కూర్పు : ఆండ్రూ డెజెక్ 
బ్యానర్ : బ్లమ్ హౌస్ టెలివిజన్ 
విడుదల: అమెజాన్ స్టూడియో 
నిడివి : 90 నిమిషాలు
***

      మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ జానర్ హాలీవుడ్ లో పెద్ద మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ మార్కెట్. ఏడాదికి యాభై వరకూ విడుదలవుతాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 26 విడుదలయ్యాయి. వీటిలో రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాలు, హార్రర్ లు, సైన్స్ ఫిక్షన్లు, హై స్కూల్ రోమాన్సులు, హై స్కూలు హార్రర్లు ఇలా అన్నిరకాల సబ్ జానర్లు వున్నాయి. 13 నుంచి 19 ఏళ్ల మధ్య టీనేజీ పాత్రల మూవీస్ ని కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ అంటారు. దీని గురించి సవివరమైన ఆర్టికల్స్ ఇటీవల బ్లాగులో ఇచ్చాం. ఇక్కడ క్లిక్ చేయండి. దురదృష్టవశాత్తూ తెలుగు సినిమాలు ఈ జానర్ని గుర్తించి సొమ్ము చేసుకోవడం లేదు. అవే పాతికేళ్ళ వయసు పాత్రల డ్రై మార్కెట్ రోమాంటిక్ కామెడీలు, డ్రామాలు మాత్రమే పదేపదే తీస్తున్నారు. వీటిని కాస్త వాస్తవ జీవితాల్లోకొచ్చి, నేటి కెరియర్ ప్రభావిత రిలేషన్ షిప్స్ లో యువతీ యువకులెదుర్కొంటున్న వివిధ సమస్యల మీదనో, వికట ప్రేమల మీదనో ఫోకస్ పెట్టి రియలిస్టిక్ మూవీస్ తీసినా ఓ అర్ధం పర్ధం, బిజినెస్ మార్కెట్టు. 

    మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఏ సబ్ జానరైనా ప్రేమల గురించి కాదు, నేర్చుకోవడం గురించి. అప్పుడప్పుడే బయటి ప్రపంచంలో అడుగుపెట్టే 13-19 ఏజి గ్రూపుది టాలెంట్స్ వికసించే వయసు. అవి ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. వాటితో ఏదో తెలుసుకోవాలి, ఏదో చేయాలి, జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో కూడిన సంఘర్షణ. ఈ సంక్షుభిత ప్రయాణంలో జీవితంలో తెలియనివెన్నో తెలుసుకోవాలని ప్రయత్నించడం, నేర్చుకోవడం వంటివి చేసి 19 కల్లా పరిపక్వ వ్యక్తిగా/వ్యక్తురాలిగా ఎదగడం. ఇలా కమింగ్ ఆఫ్ ఏజి మూవీస్ టీనేజర్లు నేర్చుకోవడం - ఎదగడం పాయింటు చుట్టూ వుంటాయి. దురదృష్టమేమిటంటే, తెలుగులో ఈ ఏజి గ్రూపు టీనేజర్లు తమ జీవితాలు కనిపించని, వాటికి దారి చూపని అవే రోమాంటిక్ కామెడీలూ డ్రామాలకి కనెక్ట్ కాలేక, తమకోసం సినిమాలు తీసే యంగ్ మేకర్లు లేని లోటుకి ఒక అసంతృప్త ప్రేక్షక సమూహాలుగా మిగిలిపోతున్నారు. ఈ సెగ్మెంట్ లో మార్కెట్ ని సొమ్ము చేసుకునే స్పృహ ఏ మేకర్లకీ వుండడం లేదు. అవే రోమాంటిక్ కామెడీలు తీస్తూ డ్రై మార్కెట్లో ఒకటే కుమ్మడం, ఫ్లాపవడం. ఈ కుమ్మడంలో చూద్దామన్నా ట్వెంటీ ప్లస్ వాళ్ళకి కూడా పనికొచ్చే రియలిస్టిక్ సరుకు కనిపించదు. ఇంకా మేకర్ల వాళ్ళ అమ్మా నాన్నల కాలం నాటి పురాతన సినిమాలే!

    హాలీవుడ్ కమింగ్ ఆఫ్ ఏజీ మూవీలు తమ ఈ టీన్ క్లయంట్స్ సముదాయాన్ని  గౌరవిస్తున్నాయి. ఏటా యాభయ్యేసి సినిమాలతో వాళ్ళ ఆర్తిని తీరుస్తున్నాయి. ఈ కోవలో తాజా విడుదల నాక్టర్న్ సాఫ్ట్ సైకో హార్రర్ రూపాన్ని సంతరించుకుంది. పువ్వుపుట్టగానే వికసించిన రెండు నైపుణ్యాల కథ. అనుకున్నది సాధించడానికి ఎంత దాకా పోతావ్? పోయే దమ్ముందా? లేక రాజీపడి టాలెంట్ ని చంపుకుంటావా? పోయే దమ్మున్నా అది పోగాలపు దమ్ము కాకుండా చూసుకోగలవా? ఇదీ ఈ కవల టీనేజీ సోదరీమణులతో కొత్త దర్శకురాలి పాయింటు.

కథ 

    జూలియెట్ (జూల్స్- సిడ్నీ స్వీనీ), వివియన్ (వివి- మెడిసన్ ఐజ్మన్) లిద్దరూ టీనేజీ కవలలు. వివి రెండు నిమిషాలు పుట్టింది. కేసీ (జూలీ బెంజ్), డేవిడ్ (బ్రాండన్ కీనర్) లు తల్లిదండ్రులు. చిన్నప్పట్నుంచీ జూల్స్, వివిలు క్లాసికల్ పియానో సంగీతానికి జీవితాన్నితాకట్టు పెట్టేశారు. జూల్స్ కంటే వివికి టాలెంట్ ఎక్కువ. టీనేజర్లుగా మ్యూజిక్ అకాడెమీలో చేరతారు. జూలీకి సిగ్గెక్కువ, తడబడుతూ వుంటుంది. వివికి తెగువ ఎక్కువ. దూసుకుపోతుంది. టాలెంట్ ఒక్కటే చాలదని ప్రపంచ పోకడ అర్ధం జేసుకుని, అప్పుడే అకాడెమీలో బాయ్ ఫ్రెండ్ గా మాక్స్ (జాక్స్ కొలిమన్) ని పట్టేస్తుంది. తను ఉన్నత స్థాయి జులియర్డ్స్ లో పాల్గొనే అవకాశం పొందడానికి మ్యూజిక్ టీచర్ డాక్టర్ హెన్రీ కస్క్ (ఇవాన్ షా) ని లైంగికంగా లొంగ దీసుకుంటుంది. తాగుతుంది, పార్టీలు చేసుకుంటుంది. 

    ఇవేవీ చేయలేని జూల్స్ కుములుతూంటుంది. తన మ్యూజిక్ టీచర్ రోజర్ (జాన్ రోథ్మన్) చెప్పే నిదానమే ప్రధానం మాటలు నచ్చవు. వివి మీద ఈర్ష్యపుట్టి ఎలాగైనా ఆమెని బీట్ చేయాలనుకుని అహర్నిశలూ పియానో పాఠాల మీద వుంటుంది. ఇంతలో జులియర్డ్స్ లో పాల్గొనేందుకు వివి ఎంపికై పోతుంది. దీంతో జూల్స్ కి మతిపోతుంది. 

    వీళ్ళు అకాడెమీలో చేరే  ఆరు వారాల ముందు మోయిరా అనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె రాసిన నోట్ బుక్ జూల్స్ కి దొరుకుతుంది. అందులో మోయిరా గీసిన భయానక రేఖా చిత్రాలు, అర్ధం గాని భాషా వుంటాయి. జూల్స్ కిది థియరీ బుక్ లా కన్పిస్తుంది. దీంతో తిరుగుండదనుకుంటుంది. దాన్ని అనుసరిస్తూ పియానో ప్రాక్టీసు చేస్తూ, తననేదో ఆవహించినట్టు ట్రాన్స్ లోకెళ్లి పోతూంటుంది...

     ఏమిటీ ఈ నోట్ బుక్? వివి మీద పైచేయి కిది తోడ్పడిందా? దీంతో ఎదురైన  విపరిణామాలేమిటి? జూల్స్  ఏ జీవిత పాఠం నేర్చుకుంది? దాని ఫలితంగా చివరికి ఏం పొందింది? ఇదీ మిగతా కథ...

సిడ్నీ స్వీనీ సీన్ 

    ఇది పూర్తిగా జూల్స్ పాత్ర కథ. పాత్ర ఎజెండానే డ్రైవ్ చేసే పాత్ర ప్రయాణం. ఆమె దృక్కోణంలో మనం చూస్తూంటాం. ఈ పాత్ర నటించిన సిడ్నీ స్వీనీ లేని సీనంటూ లేదు. 23 ఏళ్లకే పన్నెండు సినిమాలు నటించింది. తన పాత్రలకి బయోగ్రఫీలు తయారు చేయించుకుంటుంది. పాత్ర శిశువుగా పుట్టినప్పట్నుంచీ స్క్రిప్టులో మొదటి పేజీ కొచ్చేవరకూ ఆఫ్ స్క్రీన్ జీవితాన్ని రాయించుకుని, ఆ మూలాల్నుంచీ పాత్రని పట్టుకుని నటిస్తుంది. దటీజ్ గ్రేట్. అందుకే పాత్రలా వుంది, రిపీటయ్యే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తాలూకు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, గుండె దడలతో, చేతివేళ్ళ వణుకుడుతో. మైక్రోలెవెల్ పాత్రచిత్రణకి మైక్రోలెవెల్ నటన. ఆమె డార్క్ మైండ్ లో గూడుకట్టుకున్న ఆలోచనలకి మొహం అద్దంలా. నోట్ బుక్ లోని డెవిల్స్ గైడెన్స్ జులియర్డ్స్ కి ఎంపికవ్వాలన్న ఏకైక గోల్ కోసమే తప్ప, సైకోగా మారిపోయి అల్లకల్లోలం సృష్టించాడానికి కాదు. గుంభనంగా తన గోల్ ని తను సైలెంట్ గా నెరవేర్చుకునే ఎజెండా. ఆ బుక్ వల్ల ట్రాన్స్ లో కెళ్ళిపోయి చిత్తభ్రమలకి లోనయ్యే షాకింగ్ సన్నివేశాలు కూడా మనకి తప్ప చుట్టూవున్న పాత్రలకి అర్ధం గావు. కేవలం మనకి జాలి పుట్టిస్తుందే తప్ప కథలో మరెవ్వరికీ కాదు. చివరికి ఆమె ఏం చేసిందో, ఎందుకు చేసిందో మనకి తప్ప పాత్రలకి కూడా తెలియని నిష్క్రమణ అసంపూర్ణంగా వున్న నోట్ బుక్ లో లిఖిస్తుంది. అదెవరూ తెలుసుకునే అవకాశం లేదు, మనం తప్ప. సిడ్నీ స్వీనీ ఈ పాత్రతో చాలా కాలం గుర్తుండి పోతుంది.

వివిగా మెడ్సన్ ఐజ్మన్ ఎక్స్ ట్రోవర్ట్ క్యారక్టర్ అయిప్పటికీ కవల జూల్స్ రహస్య ఎజెండా వల్ల కలల్ని భగ్నం చేసుకుని, హూందాగా ఓటమినొప్పుకుని తప్పుకునే కాంట్రాస్ట్ పాత్రలో వైబ్రంట్ గా కన్పిస్తుంది. తల్లిదండ్రుల పాత్రల్లో జూలీ బెంజ్, బ్రాండన్ కీనర్ లు డీసెంట్ గా వుంటారు. అయితే కూతుళ్ల మధ్య ఏం జరుగుతోందో, ప్రత్యేకించి చిన్నప్పట్నుంచీ స్ట్రగుల్ చేస్తున్న జూల్స్ గురించి అన్నేళ్లూ తెలుసుకోనే లేదా? ఇదొక అడ్డుపడే లోపం. మ్యూజిక్ టీచర్స్ గా ఇవాన్ షా, జాన్ రోథ్మన్ లకి కూడా కథకి తోడ్పడే మంచి పాత్ర చిత్రణలున్నాయి. టీచర్స్ గా వాళ్ళ డొల్లతనాన్ని సిడ్నీ స్వీన్ కడిగి పారేసే రెండు సన్నివేశాలు బలమైనవి. తక్కువ పాత్రలతో ఎక్కువ కథాబలమున్న మేకింగ్ ఇది.  

        కొత్త దర్శకురాలు జూ క్విర్క్ డ్రమెటిక్ గా, టెక్నికల్ గా ఎంత కళాత్మక చిత్రణ చేసి, కొత్త క్రియేటివ్ ఆలోచనలు రేకెత్తించిదో రేపు సమగ్ర స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.

సికిందర్