రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, ఆగస్టు 2016, మంగళవారం

రైటర్స్ కార్నర్!
బాలీవుడ్ లో నవతరం రచయితలు జోరు మీదున్నారు. విజయాలు సాధించిన కొందరు నవతరం రచయితల్ని చూసి మరింతమంది కొత్త రచయితలు వచ్చేస్తున్నారు -  ఈరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుందామని. అయితే విజయాలు సాధిస్తూ  రోల్ మోడల్స్ గా కన్పిస్తున్న ఈ  నవతరం రచయితలకీ అటు తర్వాత కూడా అదే  స్ట్రగుల్ తప్పడం లేదు. అనామకులుగా బాలీ వుడ్ లో ప్రవేశించి నేడు ప్రముఖులైపోతున్న నవరతం రచయితలూ రచయిత్రులూ  ఆ వెంటనే అనామకులైపోయే ప్రమాదంలోనూ  పడుతున్నారు. బాలీవుడ్ లోకి వస్తున్న కొత్త రచయితల సంఖ్యా పెరిగిపోయి-   నిర్మాతలకీ  ఛాయిస్ లు పెరగడంతో  వున్న ప్రముఖ నవతరం రచయితలూ కమాండ్ చేయలేని, డిమాండ్ కూడా చేయలేని సగటు రచయితల పరిస్థితిలో పడిపోతున్నారు. పీకూ, ఎన్ హెచ్- 10, తనూ వెడ్స్ మను రిటర్న్స్, దమ్ లగాకే హైసా...మొదలైన నవతరం రచయితలు  రాసిన సినిమాలు బాగా సొమ్ములు చేసుకుని వుండవచ్చు గాక, విధూ వినోద్ చోప్రా లాంటి నిర్మాత- దర్శకుడు, రణవీర్ సింగ్ లాంటి స్టార్ కలిసి రచయితలకి మంచి పారితోషికాలివ్వాలని రచయితల తరపున మాట్లాడి వుండవచ్చు గాక – కానీ వాస్తవ పరిస్థితుల్లో మార్పేమీ రావడం లేదు. కారణం- ప్రధానంగా మంచి స్క్రిప్టుని  గుర్తించి ఓకే చేయగల్గినా, దాని విలువని అంచనా వేయలేకపోవడమే. సినిమా పూర్తయ్యే వరకూ  కూడా అదెంత మేరకు  కలెక్ట్ చేయగలదో వూహించ లేకపోవడమే. దీంతో  కొత్త రచయితలకి బొటాబొటీ ఇచ్చేసి పంపించేస్తున్నారు. తీరా ఆ స్క్రిప్టుతో తీసిన సినిమా పెద్ద హిట్టయి కూర్చుంటోంది...నిర్మాతకి  ఊహించని లాభాలు, రచయితకి  ఆ దక్కిన బొటాబొటీ తోనే జీవితం. 

          సినిమా రచయితల  సంఘాన్ని ఆధునికంగా ఏర్పాటు చేసుకున్నారు- కానీ అక్కడ రచయితల సమస్యలు ఇంకా పురాతన మైనవే. ఆర్ధికంగా రచయితలుగా కొనసాగలేక ఇంకో వృత్తి కూడా చూసుకోవాల్సిన పాత సమస్యల్నే ఇంకా ఎదుర్కొంటున్నారు. 

జుహీ చతుర్వేదీ
        అయినా ఇదేమీ గుర్తించకుండా నవతరం రచయితలుగా పాపులరైన  జుహీ చతుర్వేదీ, ఉర్మీ జువేకర్, హిమాంశూ శర్మల వంటి వాళ్ళని చూసి బాలీవుడ్ లోకి కొత్త కొత్త రచయితలు  వచ్చి పడుతున్నారు. ఇది మంచిదే. దర్శకులే రచనలు చేసుకుంటున్న కాలంలో  ఎవరైనా దర్శకులవుదామనే మోజుపడుతున్నారు తప్ప, రచయితలవుదా మనుకోవడం లేదు. అయితే పైన చెప్పుకున్న ఆ ముగ్గురు రచయితల స్పూర్తితో ఇప్పుడు తండోపతండాలుగా రచయితలవుదామని రంగ ప్రవేశం చేస్తున్నారు.  కానీ ఇక్కడి వాస్తవ పరిస్థితులు వాళ్ళూ గమనించడం లేదు. ఈ నేపధ్యంలో విక్కీ డోనార్, పీకూ ల వంట టి డిఫరెంట్ సినిమాలకి రాసిన జుహీ  చతుర్వేదికి అసలు స్ట్రగుల్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఆమెకి ఆల్రెడీ అడ్వర్ టైజింగ్ కెరీర్ వుంది. కాబట్టి ఆర్దిక సమస్యలు లేవు.  ‘నేను విక్కీ డోనర్ రాస్తున్నప్పుడు  రాస్తున్నానని ఎవరికీ  తెలీదు. జాబ్ చేసుకుంటూనే రాశాను. ఆ జాబ్ కూడా ఉదయం నుంచీ రాత్రి పొద్దు పోయేవరకూ వుండేది. ఆ తర్వాతే రాసేదాన్ని. ఎన్నో నెలల పాటు రాత్రి పూట రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయాను. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కేవలం సినిమా రచన మీదే దృష్టి పెట్టి కొనసాగడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు’ అంటారామె.

          లక్నోలో పుట్టి పెరిగిన ఆమె, అక్కడే  లొరెట్టో  కాన్వెంట్ లోనూ, ఆ తర్వాత లక్నో కాలేజ్  ఆఫ్ ఆర్ట్స్ లోనూ  విద్య పూర్తి చేశారు. 1996 లో ఢిల్లీ వచ్చి ప్రసిద్ధ  ఒజిల్వీ అండ్  మాథర్ యాడ్ ఏజెన్సీలో కాపీ  రైటర్ గా చేరారు. లజ్ పత్ నగర్ లో అద్దెకున్నారు. అక్కడి పరిసరాల వాతావరణమే ఆమె రాసిన ‘విక్కీ డోనర్’ లో కన్పిస్తుంది.  2008 లో ఢిల్లీ నుంచి  ముంబాయి వచ్చి  లియో బార్నెట్ అనే యాడ్ కంపెనీ లో చేరారు. అప్పుడే మొదటి సినిమా ‘షూ బైట్’  కి మాటలు రాశారు. కానీ అది విడుదల కాలేదు. 2012 లో సొంతంగా ‘విక్కీ డోనర్’ రాసే ముందు సంవత్సరం జాబ్ వదిలేశారు. 

          ‘పీకూ రాసిన తర్వాత కూడా నా అడ్వర్టైజింగ్ కెరీర్ అనే ఒక అండ ఉందన్న ధైర్యంతోనే  సినిమాల్లోకి రావడానికి సాహసం  చేశానని చెప్పగలను. ఢిల్లీలోనైనా ముంబాయి లోనైనా ముందు బ్రతకడానికి డబ్బుకావాలి. ఇక్కడ స్క్రిప్టూ దాంతోబాటు రైటర్లూ ఎంతో ముఖ్యమనే చెప్తారు. అయినా పారితోషికాలు చాలా తక్కువ వుంటాయి. అడ్వాన్సు తీసుకున్నప్పటి నుంచీ సినిమా అపూర్తయ్యే వరకూ చాలాకాలం పడుతుంది. అంత కాలం పాటు  అప్పుడప్పుడు అందే డబ్బుతో ముంబాయిలో జీవనం కష్టమైపోతుంది’ అనికూడా జుహీ అంటారు.

హిమాంశూ శర్మ
         హిమాంశూ శర్మ కైతే ముంబాయిలో అద్దెలు కట్టుకోవడమే పెను సమస్యగా మారింది. తను కూడా లక్నో నుంచి వచ్చాడు. ‘తనూ వెడ్స్ మను రిటర్న్స్’  తో జాక్ పాట్  కొట్టాడు. 
‘సినిమా అనేది దర్శకుల మీడియా కాబట్టి దర్శకుణ్ణి అవుదామనే నేను ముంబాయి వచ్చాను. కానీ అసిస్టెంట్  డైరెక్టర్ గా చేరడం మాత్రం నా కిష్టముండేది కాదు. రైటర్ గా అయితే రాసుకోవడానికి ఎవర్నీ అడుక్కోనవసరం లేదు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ని కలిసి నా సబ్జెక్టు  విని అభిప్రాయం చెప్పమన్నాను. ఆ సబ్జెక్టు  ఆయనకు నచ్చి డెవలప్ చేయమన్నారు. నెలకు ఇరవై  వేలు చొప్పున శాలరీగా ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ కి కూడా అంతేకదా వస్తుది, పైగా అది ఘోరమైన జాబ్’ అంటారు తను. అయితే ఈ మాట అసిస్టెంట్ గా పని చేసిన అనుభవంతోనే చెప్తారు. 

          హిందీ సాహిత్యంలో పట్టభద్రుడైన హిమాంశూ ఎన్డీ టీవీ లో ఓ హెల్త్ కేర్ షోతో కెరీర్ ప్రారంభించారు. అక్కడ్నించీ రిస్క్ తీసుకుని బాలాజీ సీరియల్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నిద్దామని ముంబాయి వచ్చారు. ఒకటి రెండు సీరియల్స్ చేసి ఆనంద్ రాయ్ కి అసిస్టెంట్ గా  వెళ్ళారు. తర్వాత 2008 లోవిజయ్ కృష్ణ ఆచార్య  తీసిన ‘తాషాన్’ కి కూడా అసిస్టంట్ గా పనిచేశారు. అసిస్టెంట్ వృత్తి అధ్వాన్నమైనదని అప్పుడు గుర్తించి రచన మీదికి దృష్టిని  మళ్ళించారు. 

          ఇక ఊర్మీ జువెకర్ కైతే మొదటి నుంచీ సినిమా రచయిత్రి కావాలనే వుంది. 2015 లో దిబాకర్ బెనర్జీ తీసిన ‘డిటెక్టివ్ బియోంకేష్ బక్షీ’  కి సహ రచయిత్రిగానూ, 2012  లో ‘షాంఘై’ కీ, ఇంకా ముందు  2008 లో ‘ఓయ్ లక్కీ ఓయ్’  కీ సహ రచయిత్రిగా పనిచేసిన ఈమె పూర్వం డాక్యుమెంటరీ లకి పనిచేశారు. ‘పదహారేళ్ళ క్రితం నుంచీ ఈ రంగంలోనే పాట్లు పడుతున్నాను.  అప్పట్లో ఇంకా సినిమా వాళ్ళంటే మన ఇరుగుపొరుగులో అంత గౌరవ భావం వుండేది కాదు. అలాటి పరిస్థితుల్లోంచి  ఇప్పుడు విలువ ఇస్తున్న కాలంలోకి నా ప్రయాణం సాగించాను. నాకింకా వేరే ఏ పనీ చేతగాకనే ఈ రంగంలో కొచ్చాను’ అంటారీమె. 

          తను  ఎంత కృషి చేసినా, ఎంత ప్రావీణ్యం చూపినా వచ్చే ఆదాయం నెలఖర్చులకి చాలేది కాదు. ‘ఒక దర్శకుడు ఒక హిట్ ఇస్తే రెండు మూడు సినిమాలకి అడ్వాన్సు తీసుకునే అవకాశముంది, రచయితలకి ఆ అవకాశం లేదు. ఒక బిగ్ బడ్జెట్ సినిమాకి రాసే అవకాశం వస్తే అప్పుడు కేవలం మన టాలెంట్ నే నమ్ముకుని ప్రూవ్ చేసుకోవాలి తప్ప, మరి దేన్నీ కాదు. షార్ట్ కట్స్ ఇక్కడ పనిచెయ్యవు, పసి గట్టేస్తారు. ఇక రాసిన స్క్రిప్టులు ఓకే కాక మురిగిపోవడం,  నా ఐడియాలు ఇతరులు తస్కరించడం ఇవన్నీ అనుభవించాను. ఈ రంగంలో ఇది సహజమే, ఈ  వృత్తిలో ఇవి కూడా ఒక భాగం’ అని కుండబద్దలు కొడతారు. 

ఉర్మీ జువెకర్
        కెరీర్ భద్రత తలమీద కత్తిలా వేలాడ్డం విజయవంతమైన రచయితలూ అనుభవించేదే నని జుహీ అంటారు. ‘దీనికి నేనేం భయపడను.  కానీ మనం కాస్త ఎక్కువ డబ్బు సంపాదిస్తాం చూడండి, అప్పుడు చాలా మంది అదో రకంగా చూస్తారు. విక్కీ డోనర్ తర్వాత నేను కాస్త గౌరవప్రదమైన పారితోషికానికి నోచుకుంటే కొందరికి కడుపు మండి పోయింది. అలాగని ఎక్కువ డబ్బొంచ్సిందనీ సంతోషించలేం, ఆ మేరకు పిండి పారేస్తారు మనల్ని’ అని జుహీ వాస్తవం చెప్తారు. 

          అయితే పారితోషికాల విషయంలో హిమాంశూకి సదభిప్రాయమే వుంది. దశాబ్ద కాలంగా పరిస్థితి మెరుగు పడిందంటారు- ‘మనం ఎంత బాగా రాస్తే అంత  ఎక్కువ ఇస్తున్నారు. అంత  మాత్రాన ప్రతీ దర్శకుడూ ప్రతి రచయితా ధనికులైపోతున్నారని కాదు, కానీ బెటర్ పొజిషన్ లోకే వస్తున్నారు. ఒకప్పుడు  సలీం- జావేద్ లు బాలీవుడ్ ని శాసించారు. అలాటి అదృష్టం మాత్రం ఇప్పుడెవరికీ వరించదు’ 

          కాబట్టి సారాంశంలో తేలేదేమిటంటే బాలీవుడ్ లో సినిమా రైటింగ్ ని  ఒక వృత్తిగా ఎంచుకుని పరుగులు తీసి రావడం- అదీ ఓ ఇద్దరు ముగ్గురు నవతరం రచయితల సక్సెస్ ని  చూసి ఆవేశ పడ్డం అంత ఉచితమైనది కాదు. ఈ ముగ్గురు సక్సెస్  సాధించిన నవతరం రచయితలూ కూడా దశాబ్దానికి పైబడి కృషి చేస్తేనే ఇప్పుడు నవతరం రచయితలు  కాగలిగారు. పైగా వీళ్ళకి రచయిత లవడానికి తగిన సాంస్కృతిక నేపధ్య ముంది. పేరొచ్చాక కూడా పరిస్థితుల్లో  మార్పేమీ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, రాత్రికి రాత్రే ఎవరూ పాపులర్ రచయితలు  కాలేరనీ, ఎవరికీ ఎర్రతివాచీలు పర్చి స్వాగతం పలకరనీ వాస్తవాలు గుర్తించి ఆ పైన నిర్ణయించుకుంటే మంచిది.

-మిడ్ డే సౌజన్యంతో.