లా ఆఫ్ ఎట్రాక్షన్ (ఎల్ ఓ ఏ) స్ట్రక్చర్ మానసికమైనదే కాదు, శారీరకమైనది కూడా. మనసెలా వుంటే శరీరం అలా వుంటుంది కాబట్టి. శరీర సహకారం లేకుండా మనసులో ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని ఎన్ని అఫర్మేషన్లు చేసుకున్నా వృధా.శరీరం అనుమతిస్తేనే అఫర్మేషన్లు పనిచేస్తాయి. మెదడు నుంచి గుండెకి, గుండెనుంచి పొట్టకీ వేగాస్ నాడి వ్యాపించి వుంటుంది. పొట్ట (గట్) ని సెకండ్ బ్రెయిన్ అనీ, గుండెని థర్డ్ బ్రెయిన్ అనీ అంటారు. మెదడులో రోజల్లా ఎంతలేదన్నా 60-80 వేల ఆలోచనలు పుట్టుకొస్తూంటాయి. నెగెటివ్ ఆలోచనలు 80 శాతం వుంటే పాజిటివ్ ఆలోచనలు 20 శాతం వుంటాయి. ఒక్కో ఆలోచనతో 2.5 ఓల్టుల విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ ఆలోచనలు మెదడులో న్యూరాన్లలో పుట్టి వేగాస్ నాడి ద్వారా గుండెకీ పొట్టకీ చేరతాయి. అలా శరీర కణజాలం (మొత్తం 80 ట్రిలియన్ల కణాలు) అంతటా వ్యాపించి జ్ఞాపకాలుగా తిష్టవేస్తాయి. అంటే మెదడు భాషంతా శరీర కణ జాలమంతా విని జ్ఞాపకాలుగా రికార్డు చేసుకుంటాయన్న మాట. మనుషులు వెధవ్వేషాలేసి తప్పించుకోకుండా శిక్షించడానికి డీఫాల్టుగా ఈ ఏర్పాటు అన్నమాట. మెదడు నుంచి పాజిటివ్ ఆలోచనలు వస్తే శరీర కణాలన్నీ ఆరోగ్యంతో డాన్సు చేస్తాయి. నెగెటివ్ ఆలోచనలు అందితే ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని మంచి మంచి రోగాలతో శిక్షిస్తాయి. ఇక్కడ బేసిక్ లా ఆఫ్ ఎట్రాక్షన్ తో ఏం జరుగుతుందంటే, దీంతో చేసే అఫర్మేషన్స్ లో ఫీలింగ్ వుండదు. ఫీలింగ్ లేకుండా బోలెడు ఎమోషన్ తో ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని ఎంత అరిచి గీపెట్టినా గాలిలో కలిసిపోవడ మే తప్ప విశ్వానికి అందవు. విశ్వానికి అర్ధమయ్యేది తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలు కాదు- ఫీలింగు భాష. కాబట్టి అలా చేసే అఫర్మేషన్లు శరీరాన్ని దాటి వెళ్ళవు, మెదడులో పుట్టే విద్యుత్ శరీరానికే పరిమితమైపోతుంది. అఫర్మేషన్లు లేదా ఇంకేవైనా ఆలోచనలు విశ్వానికి చేరాలంటే శరీరం వెలుపల విద్యుదయస్కాంత క్షేత్రమంటూ పుట్టాలి. ఈ విద్యుదయస్కాంత క్షేత్రం గుండెల్లో ఫీలింగ్ వల్ల ఏర్పడుతుంది. మెదడులో ఎమోషన్లు పుడితే గుండెల్లో ఫీలింగులు పుడతాయి. మెదడులో బంపర్ ఎమోషన్స్ తో చేసిన అఫర్మేషన్లని వేగాస్ నాడి గుండెకి అందిస్తూ, ‘నీకు ఓకేనా?’ అని అడుగుతుంది. అప్పుడు గుండె చిరాకు పడి ఇందులో ఫీలింగు లేదని రిజెక్ట్ చేస్తుంది. మరి చేసిన అఫర్మేషన్స్ తో గుండెల్లో ఫీలింగు పుట్టాలంటే ఏం చేయాలి? ఇదే అడ్వాన్సుడు లా ఆఫ్ ఎట్రాక్షన్ నేర్పుతుంది...
మనం ఫ్రీక్వెన్సీ తో మాత్రమే విశ్వంతో సంభాషించగలం. ఫ్రీక్వెన్సీ ఎలా పుడుతుంది? ఫ్రీక్వెన్సీ కంటే ముందు స్వాభావికంగా వైబ్రేషన్ వుంటుంది. సృష్టిలో సమస్తం వైబ్రేషన్ ని విడుదల చేస్తూంటాయి. సృష్టిలో ప్రతిదీ అణువులతో ఏర్పడి వుంది. ఈ అణువులు పరమాణువులతో కూడి వుంటాయి. ఈ పరమాణువుల కేంద్రకం (న్యూక్లియస్) లో న్యూట్రాన్లు, ప్రోటాన్లు వుంటాయి. వీటి చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ వుంటాయి. మన శరీరం సహా ప్రతి జీవిలో, ప్రతీ వస్తువులో పదార్ధ నిర్మాణమిదే. ఎలక్ట్రాన్ల పరిభ్రమణతో వైబ్రేషన్ (కంపనం) పుడుతుంది. ఈ వైబ్రేషన్స్ తీవ్రతని ఫ్రీక్వెన్సీ నిర్ణయిస్తుంది. ఫ్రీక్వెన్సీ ఫీలింగుల వల్ల పుడుతుంది. ఫీలింగు బలహీనంగా వుంటే బలహీన ఫ్రీక్వెన్సీ, బలంగా వుంటే బలమైన ఫ్రీక్వెన్సీ పుడతాయి. బలమైన ఫ్రీక్వెన్సీ విశ్వానికి చేరి మనకే తిరిగి వస్తుంది. వస్తున్నప్పుడు మనం కోరుకున్న గిఫ్ట్ తెచ్చి మన చేతిలో పెడుతుంది. ఇదే గమ్మత్తు!
బలమైన ఫీలింగుతో ‘నేను దర్శకుడ్ని అయ్యాను’ అని అఫర్మేషన్స్ ఇస్తే, విశ్వం స్పందించి దానికదే నిర్మాతని ఎక్కడో వెతికి గిఫ్ట్ రూపంలో అందిస్తుంది. అయితే ముందు ఫీలింగ్స్ కి కేంద్రమైన గుండెకి ఫీలింగ్స్ ని ఎలా తెలియజేయాలి? సింపుల్. చేస్తున్న అఫర్మేషన్ కి ‘ఎందుకంటే’ అని జోడించి చెప్పాలి. ‘నేను దర్శకుడ్ని అయ్యాను, ఎందుకంటే ఇది మా నాన్న కోరిక’, లేదా ‘ఎందుకంటే నన్ను పంపించిన మా వూరి వాళ్ళ కోరిక’, లేదా ‘ఎందుకంటే ప్రేక్షకులకి మరపురాని అనుభూతి నిచ్చేందుకు’, లేదా ‘ఎందుకంటే పేదలకి అన్నం పెట్టేందుకు’ ...
ఇలా సెంటిమెంటు జోడిస్తే గుండె ఫీలై ఓకే చేసి వేగాస్ నాడికి ఓకే చెప్తుంది. వేగాస్ నాడి మెదడుకి చెప్తుంది. మెదడు అఫర్మేషన్స్ వల్ల తనలో పుట్టిన ఎమోషన్స్ కి, గుండె నుంచి వచ్చిన ఫీలింగ్స్ తో వైబ్రేషన్స్ కి జోడిస్తే, విద్యుదయస్కాంత క్షేత్రమేర్పడి ఫ్రీక్వెన్సీ పుట్టి విశ్వం లోకి దూసుకెళ్ళి పోతుంది. విశ్వం పెద్ద మాయాజాలం. వెంటనే ఈ ఫీలింగుని గుర్తిస్తుంది. ఎందుకు గుర్తిస్తుంది? విశ్వమంటే విశ్వమంత ప్రేమగనుక. ఎవరిపట్లా బేధ భావం చూపక మనందరికీ ప్రేమని పంచి పెట్టాలనే పని చేస్తుంది. కాబట్టి దర్శకుడ వ్వాలన్న గోల్ ని ఎంతో ప్రేమిస్తూ వుండాలి.
మరి గుండె ఫీలింగ్స్ ని ఎలా గుర్తిస్తుంది? మెదడులో ఎమోషన్స్ కొన్ని హార్మోన్లని ఉత్పత్తి చేస్తాయి. వాటి ద్వారా గుర్తిస్తుంది. అంటే ఎమోషన్స్ మనసుకి సంబందినవైతే, ఫీలింగ్స్ శరీరానికి సంబంధించినవి.
మరిప్పుడు పొట్ట (గట్) చేసే పనేమిటి? ఇది విశ్వం నుంచి వచ్చే సంకేతాల్ని −పట్టుకుని అప్రమత్తం చేస్తుంది. దీనినే గట్ ఫీలింగ్ అంటాం. ఈ ఫీలింగ్ ని యాదృచ్చికంగా నమ్మేసి యాక్షన్ తీసుకుంటాం. ఒక గోల్ కోసం అఫర్మేషన్స్ చేస్తూంటే ఎప్పుడైనా విశ్వం అది నెరవేరే సంకేతాలు అందించవచ్చు. అది సిక్స్త్ సెన్స్ రూపంలో కావచ్చు, దివ్యదృష్టి రూపంలో కావచ్చు, మెదడులో మెరుపులు కావచ్చు, కలలూ కావచ్చు. నీ గిఫ్ట్ ప్యాక్ అయింది, అందుకోవడానికి రెడీ అవ్వు అని విశ్వం చెప్పడం. అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు ఎలర్ట్ గా వుండాలి. సంకేతాల్ని పసిగట్టి వాటి అర్ధాల్ని తెలుసుకుంటే ఆమేరకు వెంటనే రంగంలోకి దిగి గిఫ్ట్ అందుకోచ్చు. ఒక్కోసారి నేరుగా నిర్మాత నుంచే ఫోన్ రావచ్చు.మరిన్ని మార్గాలు రేపు మనసుకి సంబందించిన స్ట్రక్చర్ తెలుసుకున్న తర్వాత వివరంగా తెలుసుకుందాం.
−సికిందర్