రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఫిబ్రవరి 2018, సోమవారం

607 : నోట్ - 2


       
       ష్యూ క్లోజ్ అయ్యేట్టు లేదు. వాట్సాపులు, మెసెంజరులు బిజీ అవుతున్నాయి. ఫోన్ కాల్స్ లో చెప్పిందే చెప్పి నచ్చజెప్పాల్సి వస్తోంది. ఫైనల్ గా  ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చి ఇష్యూ క్లోజ్ చెయ్యాలి. ప్రపంచం ఆగిపోదు, the show must go on! ఈ బ్లాగులో రివ్యూలు రానంత  మాత్రాన కొంపలేమీ అంటుకోవు. కానీ ఇలా రివ్యూలు మానెయ్యాల్సిన పరిస్థితిని కల్పించిన వాళ్ళెవరు?  సినిమా వాళ్ళే!  రివ్యూలు రాస్తున్నంత కాలం ఈ వ్యాసకర్త ఏనాడూ సినిమా ప్రయత్నాలు చేసిందీ లేదు. ఎందుకంటే ఒకర్ని అడుక్కోవాలంటే మనసొప్పదు. చాలా వరకూ అజ్ఞాతంగా వుంటూ రివ్యూలూ ఇతర వ్యాసాలూ రాసి అవతల పడెయ్యడమే తప్ప, వాటినుంచి  మైలేజీ ఆశించే పని కూడా పెట్టుకోలేదు. సినిమా రచయితల సంఘంలో సభ్యత్వం లేదు. క్రిటిక్ అని భావించుకోలేదు కాబట్టి ఆ సంఘాల్లోనూ సభ్యత్వం లేదు. ఏ బంధనాలూ లేని ఫ్రీ బర్డ్ లా  వుంటే, ఒకరొకరే వచ్చి పట్టుకోవడం మొదలెట్టారు. 

          ఎవరు వీళ్ళు? ఒక దర్శకుడు దశరథ్ దగ్గర్నుంచీ అమలాపురంలో ఆటో డ్రైవర్ దుర్గారావు వరకూ వున్నారు. బెల్లంపల్లిలో ఒక అనంత్ దగ్గర్నుంచీ,  విజయవాడలో ఆదిత్యా చౌదరి వరకూ వున్నారు. 1996 లో ప్రారంభించి ఆంధ్రభూమిలో రాస్తున్నప్పట్నించే మొదలయ్యింది. కేరాఫ్ ఆంధ్ర భూమికి ఉత్తరాలు రాసి మేమొచ్చేస్తున్నామని అనే వాళ్ళు. వచ్చి రివ్యూలు రాసేవాడితో ఏంచేస్తారో అర్ధమయ్యేదిగాదు. రావద్దనే చెప్పాల్సి వచ్చేది. ఇక్కడొచ్చి బాధలు పడేకంటే అక్కడే ఫాస్ట్  ఫుడ్ సెంటర్ నడుపుకుని జీవించడం బెటరని చెప్పినా వినేవాళ్ళు కాదు. దుర్గారావొక్కడే  ఆగిపోయాడు. ఇప్పటికీ ఫోన్లు చేసి సినిమాల్ని ఎనాలిసిస్ చేస్తూంటాడు. ఇలా బయటి వాళ్లెందరో వున్నారు. దర్శకుడు దశరథ్ పిలిపించుకుని స్క్రీన్ ప్లే బుక్ ప్లాన్ చేద్దామన్నారు. అది ముందుకు సాగలేదు. ఇక అసిస్టెంట్లు, అసోషియేట్లు సరేసరి. సినిమా ఫీల్డులో అమాయకులకి ఒక నమ్మకముండేది. ఆంధ్రభూమి వెన్నెల్లో రివ్యూలు రాసే వాళ్ళు గొప్ప మేధావులని. ఎంత మేధావులో రాస్తున్న వాళ్లకి పరస్పరం తెల్సు. తెలుగు సినిమాలు తీయడానికీ, రివ్యూలు రాయడానికీ పెద్దగా మేధావితనం అవసరం లేదనీ తెలుసు. కానీ అమాయకులు అలా  బిల్డప్ ఇచ్చేసి ఆంధ్రభూమి ఆఫీసుకొచ్చేసి, బయట టీస్టాల్  దగ్గర ఫ్యాన్స్ గా ప్రకటించుకునే వాళ్ళు. కొందరు కృష్ణానగర్ లో ఫ్యాన్స్ క్లబ్ పెట్టుకుంటామంటే తిట్టి పంపాల్సి వచ్చింది. ఆంధ్రభూమి సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారు ఈ వ్యాసకర్త ఏం రాస్తున్నా, ఎలా రాస్తున్నా  ఏమీ అనేవారు కాదు. పైగా కొన్ని రివ్యూలకి  హెడ్డింగులు మార్చి ఘాటు హెడ్డింగులు పెట్టేవారు. నిర్మొహమాటంగా రాయడం ఆయనిచ్చిన స్వేచ్ఛ వల్లే సాధ్యమైంది. ఆయన లేకపోతే ఈ వ్యాసకర్త డబ్బాలు కొడుతూ అందర్నీ సంతోష పెట్టేలా రివ్యూలు రాస్తూ బతికే వాడేమో. ఈ నిర్మాణాత్మక నిర్మోహమాటానికి నెగెటివ్ అనే పేరొచ్చింది. ఏటేటా 90 శాతం అట్టర్ ఫ్లాపులు తీస్తున్న వాళ్ళే  సినిమా ఫీల్డుకి నెగెటివ్ లు కారేమో అన్పించేది మనకి.  దర్శకుడు వీర శంకర్ వెబ్ సైట్ పెట్టి రివ్యూలు రాయిస్తున్నప్పుడు, వీడికి దర్శకత్వం ఛాన్సు రాక, రైటర్ గా అవకాశాలు దొరక్క అక్కసు తీర్చుకుంటున్నాడనీ, కృష్ణా  నగర్ చీప్ లిక్కర్ బ్యాచి అనీ బూతులతో దీవిస్తూ  కామెంట్లు పెట్టే వాళ్లు  సినిమా వా
ళ్ళే. పట్టించుకోలేదు. ఇలాటి వాళ్ళు 90 శాతం అట్టర్ ఫ్లాపులిచ్చే  ఫీల్డుకి పట్టిన అదృష్టవంతులనీ తెలుసు. ఇలా రివ్యూలు రాస్తే కాదు, ఒక సినిమా తీసి చూపించమనే వాళ్ళూ వున్నారు. వాళ్ళే  ఒక్క రివ్యూ రాసి చూపించగల్గితే,  సినిమాలు తీయడానికి వాళ్ళెంత అర్హులో తేలిపోతుంది కదా?  రివ్యూలు రాయడం చాలా ఆషామాషీ బాధ్యత లేని తనమనుకుంటున్నారు ఇప్పటికీ.

          మొత్తానికి వెన్నెల ఇంఛార్జులుగా మారుతూ వుండే చల్లా శ్రీనివాస్, అబ్దుల్, వీఎస్ ఎన్ మూర్తి ముగ్గురూ శాస్త్రి గారిచ్చిన  స్వేచ్ఛ ని అనుభవించారు. కానీ మొదట్లో వెన్నెల ఇంఛార్జిగా  వున్న అఫ్సర్ గారు ఈ వ్యాసకర్తచేత ఆదివారం ఆంధ్రభూమికి క్రైం కథలు రాయించుకునే వారు. ఒక రోజు అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడీయోంకా ఖిలాడీ చూసి నవ్వొచ్చి,  రివ్యూలాంటిది రాసి అఫ్సర్ గారికి చూపిస్తే, ఆయనా నవ్వుకుని కంటిన్యూ చేయమన్నారు. ఆ నవ్వులాట వెన్నెల ద్వారా ప్రసిద్ధ రచయిత మైనంపాటి భాస్కర్ కీ చేరి ఆంధ్రభూమి గేటు బయట ఆలింగనం చేసుకున్నారు. అలా యాక్సిడెంటల్ రివ్యూ రైటర్ అయ్యాక, మొదలయ్యింది అసిస్టెంట్ల, అసోషియేట్ల రాక. ఇప్పటికొచ్చి చూసుకుంటే ఓ డెబ్బై మంది వుంటారు. 

          చల్లా శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి వెళ్ళాక అక్కడ ఆదివారం ఆంధ్ర జ్యోతి ఇంఛార్జి ఎడిటర్ కె. వసంత లక్ష్మి గారికి చెప్పి క్రైం కథలు రాయించాడు. రెండేళ్ళు రాశాక  ఆపమని చెప్పి, వసంత లక్ష్మి గారు ఒక సినిమా కాన్సెప్ట్ ఇచ్చారు. వివిధ శాఖల టెక్నీషియన్లని వారం వారం పరిచయం చెయ్యమని. అలా 45 మంది వివిధ శాఖల టెక్నీషియన్లని ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, సాహిత్యాభిలాష గల ఛోటా కె నాయుడు,  ఇంటర్వూ రాశాక తనకి చూపించి మరీ ముద్రించాలన్నారు. రాసి చూపించాక చాలా ఫీలయ్యారు శైలికి. భుజం మీద చెయ్యేసి అటూ ఇటూ ఫిలాసఫర్ లాగా నడిచారు. అప్పటికి దశరథ్ కావాలని అడిగి రాయించుకున్న బిగ్ కమర్షియల్ స్క్రిప్టు ఈ వ్యాసకర్త దగ్గరుంది. ఇప్పుడు ఛోటా కె నాయుడు గారికి చెప్తే ఎక్కడో ఆయన సెట్ చేసేస్తారు. అయినా చెప్పలేదు.  మనం వెళ్ళింది పత్రిక తరపున ఇంటర్వ్యూ చేయడానికే గానీ, ఈ అవకాశాన్ని సొంత అవసరాలకి వాడుకోవడానికి కాదు. తిరిగి చల్లా  శ్రీనివాస్ ఆంధ్రజ్యోతికి వచ్చి క్రైం స్టోరీలు అడిగితే ప్రస్తుతం తొమ్మిది  నెలలుగా అవి రాయడం జరుగుతోంది. ఇలా అడిగితే తప్ప ఒకర్ని ఇబ్బంది  పెట్టి అడుక్కుని మరీ వెంటపడి రాసే అలవాటు లేకపోవడం చేత, సినిమా రైటర్ కాలేకపోయాడీ వ్యాసకర్త.  ఇది మంచిదే అయ్యింది కదా రివ్యూలు రాసుకుంటూ హేపీగా గడపడానికి? 

          ఇలాటి వాణ్ణి  అసిస్టెంట్లు, అసోషియేట్లు ముగ్గులోకి లాగడం  మొదలెట్టారు. వాళ్ళ కథలకోసం ఏళ్లతరబడి ఎంతో సమయం, శక్తీ కరిగిపోయేది.  కానీ ఏదీ వృధా పోదు – 
nothing goes waste  in God’s grand economy .  ప్రతీ ఒక్కరూ ఎదగాలని  స్ట్రగుల్ చేస్తూంటారు.  ఎవర్నీ చిన్న చూపు చూడలేం, ఎదుగుదల వైపు మనం వుండక తప్పదు. నమ్మి వచ్చిన వాళ్లకి సాయపడాలి. అపాత్ర దానమనేది ఒక నమ్మకం మాత్రమే –nothing goes waste  in God’s grand economy అనేదే సత్యం. చేజారిన నీళ్ళు కూడా నేలని తడుపుతాయి. అక్కడో మొక్కో సూక్ష్మ జీవులో బతుకుతాయి. ఏదీ వృధా పోదు. 

          ప్రతీ ఏటా 70 మంది కొత్త దర్శకులు వస్తే డెబ్బై మందీ అట్టర్ ఫ్లాపవుతున్నారు. వాళ్ళల్లో ఒకరో ఇద్దరో ఈ వ్యాసకర్తతో సంబంధమున్న వాళ్ళే. తీరా సమయం వచ్చేసరికి వాళ్ళేదో రాసుకుని, తీసుకుని,  వాళ్ళ దారిని వాళ్ళు వెతుక్కుని వెళ్ళిపోతున్న వాళ్ళే. ఇది తప్పేం కాదు. మనసుకి నచ్చినట్టు  చెయ్యాలి. ఎక్కువమంది అవకాశాల కోసం ఇప్పటికీ స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళే వున్నారు. ఎప్పుడూ కాంటాక్టులో  వుంటూ,  అవసరమైతే కొత్తవి రాయించుకుంటూ కొన్నేళ్లుగా మిత్రులైపోయి వున్నారు. ఇలా వివిధ దశల్లోనో  (వన్ లైన్ ఆర్డరో, ట్రీట్ మెంటో,  డైలాగ్ వెర్షనో), మొత్తంగానో,  మూడు డజన్ల స్క్రిప్టులు రాసి,  ఒక్కటీ తెరకెక్కకుండా తిరుగుతున్న రైటర్ కాని  రైటర్ ఎవరైనా ప్రపంచంలో వున్నాడంటే,  అది ఈ వ్యాసకర్తేనని ఇప్పటికీ జోకులేసుకోవాల్సి వస్తోంది. మనం సాధించిన రికార్డు ఇదే! 

          టాప్ స్టార్ కి స్క్రిప్టు రాసి, కొన్నేళ్ళు చూసి చూసి,  అపాయింట్ మెంట్ కి కూడా మనమే పూనుకుని ఏర్పాట్లు చేస్తే, ఆ అసోషియేట్ అప్పుడే డాక్టర్ దాసరి నారాయణ రావు గారిలా ఎక్స్ ప్రెషనిచ్చి అపాయింట్ మెంటే లేకుండా చేసుకుంటే ఏం చేయగలం. ఇలాటి మన డొమైన్ కాని పన్లు కూడా చేయాల్సి వచ్చేది. ఒక పేరున్న కో డైరెక్టర్ ఏరికోరి స్క్రిప్టు రాయించుకుని, తీరా ఇంకో సినిమాకి కో డైరెక్టర్ గానే జంప్ అయిపోతే ఏం చేయగలం. దశాబ్డంన్నర కాలంగా ఇలాటి ఫన్నీ సీన్లు ఎన్నో. 

          ఈ కాలంలో వేరే దర్శకుల ఓ నాల్గు సినిమాలు చేయకపోలేదు. వాటిలో రెండిటికి పే రేసుకోలేదు. ఒకదానికి మారు పేరు వేశాం. ఇంకోదానికి వద్దన్నా పేరేసేశారు. ఒక సినిమా చేస్తే మళ్ళీ చేస్తామో లేదో నమ్మకమే లేనప్పుడు, పేరేసుకోకుండా వుంటే రివ్యూ రైటర్ గా  కొనసాగ వచ్చన్న ముందు చూపుతోనే తప్ప మరొకటి కాదు. పేరేసిన సినిమా ఒక్క రోజే ఆడడంతో ఎవరి దృష్టిలో పడలేదు. చాలా హేపీ అన్పించింది. కానీ అప్పటికే యూసుఫ్ గూడా సెంటర్లో పోస్టర్ మీద పేరు చూశామని ఎవరో చెప్పనే చెప్పేశారు. విషయమేమిటంటే,  బతుకమ్మ అప్పట్నించీ సీనియర్ దర్శకుడు టి. ప్రభాకర్ గారంటే  గౌరవముంది. విభేదించి వెళ్ళిపోయినా ఫీలవకుండా మళ్ళీ పిలిపించుకుంటారు. ఆయన ఒక లిమిట్ లో ఆలోచిస్తారు. మనం ఇంకెక్కువ ఆలోచిస్తాం. కాబట్టి ఆయన లిమిట్ లో తీసే సినిమాలకి వర్క్ చేసి పే రేసుకోకుండా వుంటే చాలనుకుంటాం. ప్రస్తుతం ఆయన బిత్తిరి సత్తితో చేస్తున్న ‘తుపాకీ రాముడు’కి కూడా పిలిపించుకుని వర్క్ చేయించుకున్నారు. ఇలా పేరేసుకోకుండా వర్క్ చేసినా, బయట వేరే సినిమాలకి రివ్యూలనేవి రాయకూడదు. ఈ మానసిక సంఘర్షణ వుంటూనే వుంది.

          ఇప్పుడు పదేళ్లో ఐదేళ్లో స్ట్రగుల్ చేసి, క్రియేటివిటీ పరంగా ఈ వ్యాసకర్తతో ఒకే వేవ్ లెంత్ తో వుంటూ వస్తున్న నమ్మిన  మిత్రులకి  రాసిచ్చాంగా  పొమ్మనలేం. ఇంకా వాళ్ళతో పూర్తి స్థాయిలో రాసి, చివరంటా అందుబాటులో వుండాలి. మరో ఇద్దరో ముగ్గురో  మంచి గాలప్ మీద  వచ్చేస్తున్నారు. రేపో ఎల్లుండో ఫైనల్ గా వచ్చి పడతారు అనేట్టున్నారు. ఇలాంటప్పుడు ఇది పూర్తి స్థాయి వృత్తి అయిపోతుంది. రివ్యూలు ఇక ప్రవృత్తి కూడా కాదు. మానెయ్యాలి. ఇంత ఎథిక్స్ ఆలోచిస్తే ఎలా అని కొందరు అంటున్నారు. రివ్యూలు రాయాల్సిందే అంటున్నారు. ఇలా సినిమా వాళ్ళే  అనడం విచిత్రం, ఇతర పాఠకులు సరే. ఇదిక కుదరదని అంటున్నాం. ఇలాటి తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోక తప్ప లేదు. ఇటు వైపు లాగిందే సినిమా వాళ్ళు. ఇది గమనించాలి. 

          రివ్యూలు లేకపోయినా బ్లాగులో ఇతర పనికొచ్చే ఆర్టికల్స్ కొనసాగుతాయి. స్క్రీన్ ప్లేకి సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు  ప్రత్యక్ష మవుతాయి. ఇప్పుడు స్వీయానుభవం లోంచి రాసేవి కూడా కొన్ని జత కలుస్తాయి.ఇంతేకాకుండా ఎప్పట్లానే అసోషియేట్లకి అందుబాటులో వుండడం జరుగుతుంది. సేవలు యధావిధిగా కొనసాగుతాయి. అవన్నీ కథల గురించే. నిర్మాతలకి డబ్బులొచ్చే కమర్షియల్ కథల గురించి. వీటికి సంబంధించిన రీసెర్చ్ ఎప్పుడూ వుంటుంది. హాలీవుడ్డే  టాలీవుడ్ కి ఆదర్శం. వేరే  డబ్బులు రాని వరల్డ్ మూవీస్ బాపతు కథలు కాదు, షార్ట్ ఫిలిమ్స్  బాపతు కథలు కాదు. వీటికి దూరం.

-సికిందర్
         



         

.