రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, మార్చి 2016, శనివారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- 10
(స్ట్రక్చర్ నేర్చుకునే ఆసక్తి పరులందరికీ జరుగుతున్న జాప్యానికి  మరొక్కసారి సారీ చెప్పుకుంటూ, ఈ పదవ భాగం నుంచీ వ్యాస పరంపరని తిరిగి కొనసాగిస్తూ, ఇక క్రమం తప్పకుండా వారంవారం అందించి ముగిస్తామని ఇంకోసారి ప్రామీస్ చేస్తూ...మరొక్కసారి స్వాగతం!)

తెలుగుసినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాల్లో భాగంగా ‘శివ’ ని ఆధారంగా చేసుకుని బిగినింగ్ విభాగ రచన గురించే చెప్పుకున్నాం. ఇంకా మిడిల్ విభాగాన్ని ప్రారంభించేముందు, మిడిల్ ఏ సైజులో, ఏ నిష్పత్తుల్లో ఉండాలో, వుండనప్పుడు ఫలితలెలా వుంటాయో  గత రెండు వ్యాసాల్లో చెప్పుకొచ్చాం. ఒకరు తయారు చేసే కథల మీద ఎక్కువగా  మిడిల్ విభాగం మీదే ఇతరుల చేతులు పడతాయి. అందువల్ల మిడిల్ విభాగపు స్ట్రక్చర్ చెదిరిపోయే అవకాశాలే ఎక్కువ వుంటాయి. దీన్ని రచయితలు ఆపలేకపోవచ్చు.  రాజీ పడడమో, లేదా కథ వెనక్కి తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలి తప్ప మరో మార్గం లేదు. అలా కాకుండా కథ మీద ఎన్ని అమృత హస్తాలు పడ్డా పూర్తిగా చెడిపోకుండా  కాపాడుకునే రహస్యమేదైనా వుందా అన్న అన్వేషణలో భాగంగా గత వ్యాసం(ఫిబ్రవరి 4, 2016) వెలువరించాం. ఇక తర్వాతి భాగం కొనసాగిద్దాం.

       సినిమా కథెప్పుడూ రచయిత భావ స్వేచ్ఛ కాదు. దర్శకుడి భావ స్వేచ్ఛ కావొచ్చు, అరుదుగా నిర్మాత భావస్వేచ్ఛ కావొచ్చు. అయితే ఈ భావ స్వేచ్ఛతో వుండే  ప్రమాద మెంతవరకూ అంటే, దాంతో పైపై నియమాల ఉల్లంఘన జరిగేంతవరకూ మాత్రమే. ఈ నియమాల అడుగున కథకో ఆత్మ వుంటుంది. ఆ ఆత్మని దెబ్బతీసే దాకా భావ స్వేచ్ఛ పోదు. చాలా మందికి కథకి ఆత్మ ఉంటుందనే తెలీదు. కాబట్టి ఆ లోతులదాకా  వాళ్ళ ఆలోచనలు సాగవు. ఒకవేళ ఆత్మ వుంటుందని తెలిసిపోయి, దానిమీద కూడా చేతులేద్దామనుకుంటే, అది సాధ్యంకాని పద్ధతిలో లాక్ వేస్తామన్న మాట. ఆత్మకి లాక్ వేసేస్తాం. అయినా కూడా  తాలిబన్ మర్కటాలు బామియాన్ బుద్ధ  విగ్రహాల్ని కూల్చినట్టు, ఆ లాక్ ని కూడా పేల్చేసి కథా సౌధాన్ని కూల్చే సాంస్కృతిక విద్రోహానికి పాల్పడుతూంటే మాత్రం, కథని ఎత్తుకుని పారిపోయే పూర్తి రాజ్యాంగ హక్కు ప్రతీ రచయితకీ  ఎలాగూ వుంటుంది.

          మిడిల్ విభాగంలో కథాత్మకి ఈ లాక్ వేసే రహస్యాన్నే  మనం తెలుసుకోబోతున్నాం. రహస్యాన్ని ఇంత ఓపెన్ గా చెప్పేస్తే వాళ్లకి తెలిసి పోతుంది కదా, అప్పుడేం లాభమని అన్పించవచ్చు. వాళ్ళు కూడా తెలుసుకుంటేనే  బావుంటుందని..  తాలిబన్లు అన్పించుకోవడం ఎవరికీ ఇష్టముండదన్న నమ్మకంతో.

          సినిమా కథని మౌఖికంగానే చెప్పే సాంప్రదాయం కొనసాగుతోంది. రచయిత తన స్నేహితులకి, అదే రచయిత  దర్శడికి, దర్శకుడు నిర్మాతకి, ఆపైన హీరోకీ మౌఖికంగానే కథ చెప్పుకుంటారు. చదువుకోమని ఫైలు ఇచ్చేసి రావడం వుండదు.  ఇలా ఒకరి నుంచి  ఒకరికి మౌఖికంగా చేరే కథ మారకుండా ప్రసారమవుతూ వుంటుంది. మౌఖికంగా చెలామణిలో వున్నంతవరకూ ఢోకా వుండదు. ఓవరాల్ గా అది ఓకే అయ్యి, ఆతర్వాత రాత పనిలో కొచ్చే టప్పటికి రోజుకో రకంగా మారిపోతూ వుంటుంది. ఎన్ని చేతులు పని చేస్తే అన్ని రకాలుగా మారిపోతూ వుంటుంది. ఇందుకే స్టీఫెన్ కింగ్ కూడా అన్నాడు- మిలియన్ డాలర్లు పెట్టి నా నవల కొనుక్కుని, దాంతో సంబంధంలేని సినిమా ఎందుకు తీస్తారో అర్ధం కాదని!  

          కాబట్టి తెలుగు సినిమా రచయితలు  ఈ ప్రపంచంలో తామొక్కరే బాధితులమని ఆత్మస్థైర్యం  కోల్పోనవసరం లేదు, హాలీవుడ్ లో కూడా తమలాంటి బాధితులు తోడుగా వున్నారు.

          కథల్ని క్రియేట్ చేయలేని వాళ్ళే ఎక్కువ. వాళ్ళే కథలమీద గొప్ప గొప్ప వ్యాఖ్యానాలూ విమర్శలూ చేస్తారు. కథల్ని  ముందు పెట్టుకుని డిస్కస్ చేస్తారు, డిసెక్షన్ చేస్తారు, మొత్తంగా డిమాలిష్ చేస్తారు. డిస్కషన్స్ కి వచ్చేవాళ్ళు చాలా మంది ఒక్క  కథ రాయలేరుగానీ, పేపర్ మీద ఓ రైటర్ మెదడులోంచి బయటికి తీసి అక్షర రూపమిస్తే, అది ముందు పెట్టుకుని జడ్జీ లైపోతారు, అలా కాదు ఇదిలా వుండాలని మార్చేస్తూంటారు. పైగా నిర్ణయించే హోదాలో వున్న తామే గొప్ప వాళ్ళమని ఫీలైపోతూ, ఆ రైటర్ ని హీనంగా చూస్తారు, అతణ్ణి తప్పించేస్తారు. కోటి రూపాయల సినిమా అయినా పుట్టడానికి కారణమైన రైటర్ ఎక్కడో నించుని, తను వేసిన బీజం మీద జరుగుతున్న తమాషానీ, దాంతో వాళ్ళ కోరికల్నీ జాలిగా చూస్తూంటాడు. 

          కనుక సున్నిత  హృదయులు కథలు రాసుకుని ఇక్కడికి రానక్కర్లేదు. పత్రికకి కథ ఇస్తే దాన్ని విడివిడిగా పాఠకులు చదువుకుంటారు. సినిమాని ఒకే సారి థియేటర్ కి వెయ్యిమంది చొప్పున, కొన్ని వందల థియేటర్లలో కొన్ని లక్షలమంది ఏకకాలంలో చూస్తారు. ఏమాత్రం తేడాగా వున్నా అన్ని లక్షలమంది  గోలగోల చేసి ఒకే సారి తిప్పి కొడతారు. సినిమా వాళ్లకి నిత్యం ఈ భయం వెన్నాడుతూంటుంది. పత్రికలకి ఈ సమస్య వుండదు. పత్రికల్లో ఆ ఒక్క కథే కాకుండా ఇంకా కొన్ని కథలూ, శీర్షికలూ వుంటాయి. బాగా లేని కథ కల్గించే  అసంతృప్తిని  ఇవి కవర్ చేస్తాయి. సినిమా వాళ్ళకి కవర్ చేసుకోవడానికి ఏమీ మిగలదు, నెత్తి  మీద గుడ్డ తప్ప. అందుకని వాళ్ళ దృష్టి కోణం లోంచి కూడా చూడాలి. సమంజసమైన వాళ్ళ అభద్రత వీలైనంత ఎక్కువమందితో  సలహాసంప్రదింపుల్ని కోరుతుంది కథల మీద. వచ్చిన చిక్కేమిటంటే వాళ్ళందరూ  నిష్ణాతులు కారు. లేకపోతే ఇంత చేసినా ఏటేటా 90 శాతం సినిమాలెందుకు ఫ్లాపవుతాయి? 

          కాబట్టి, హిచ్ కాక్  చెప్పినట్టు సినిమా తీయడమంటే 90 శాతం పేపర్ వర్కే,  90 శాతం ఫ్లాపులు తీయడం కాదు! ఇక్కడేం జరుగుతోందంటే, హృదయంలోంచి వచ్చిన, ఓ సుముహూర్తాన సబ్ కాన్షస్ మైండ్ అందించిన, దాన్ని నల్గురూ  మౌఖికంగా చెప్పుకుని ఆనందించిన కథే, పేపర్ మీదికి వచ్చేటప్పటికి ఒరిజినాలిటీని కోల్పోయి రకరకాలుగా మారిపోతోంది! 

          నిజంగా సినిమా రంగం చాలా విచిత్రమైనది. సమాజానికి రివర్స్ గేర్ లో వుంటుంది! మానవ చరిత్రలో చూసుకుంటే, కథలు మౌఖికంగా చెప్పుకుంటూ పోతున్నంత కాలం రకరకాలుగా మారిపోతూ ఉండేవి, అవే రాతల్లో  కొచ్చేటప్పటికి మారకుండా స్థిరంగా  వుండిపోతున్నాయి శతాబ్దాల కాలం. లిపి రెండంచుల కత్తి అన్నమాట!

          తాజాగా ఇటీవల భూటాన్ రచయిత్రి  కంజాంగ్ చోడెన్ ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్న దాని ప్రకారం, భూటాన్ లో కథా సాహిత్య మనేది గత యాభై ఏళ్ళు గానే ప్రచురిత మవుతోంది. యాభై ఏళ్ల క్రితంవరకూ శతాబ్దాల పాటు కథలు జనం నోళ్ళలోనే నానేవి. ఒకతరం నుంచి ఇంకో తరానికి మౌఖిగంగానే వ్యాప్తి చెందేవి. ఒక కథని ఎవరో ఒక గ్రామంలో పుట్టిస్తే అది విని పక్క గ్రామంలో ఇంకెవరో తనదైన  కళాపోషణతో ఇంకోలా చెప్పే వాడు. ఇది విని ఇంకొకడు ఇంకోలా చెప్పేవాడు. పాయింటు ఒకటే, వ్యాఖ్యానాలు వేర్వేరుగా ప్రచారమయ్యేవి. శతాబ్దాల పాటు ఇదే జరుగుతూ వచ్చింది.  ఏ కథ పుట్టినప్పుడు ఎలా ఉండేదో ఎవరికీ తెలీదు. ఈ కథల్ని ఇలాగే  మౌఖిక రూపంలో వదిలేస్తే కొన్నాళ్ళకి  అంతరించిపోతాయని, ఇంగ్లీషులో వాటిని రాసి రికార్డు చేశారు రచయిత్రి. అప్పటినుంచి ఇవి మారకుండా స్థిరంగా ఉండిపోయాయి. మహాజనుల మౌఖిక  స్టోరీ డెవలప్ మెంట్  ప్రక్రియకి ఇక ఫుల్ స్టాప్ పడింది. భూటాన్  లో పిల్లలు ఈ ప్రింటైన జానపద, పురాణ కథలే ఇప్పుడు చదుకుంటున్నారు.

          మరో వైపు చూస్తే,  హాలీవుడ్ స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ జానపద కథలు అక్షర రూపం దాల్చడంతో ఆ సంపదకి తీరని హానియే  జరిగిందని  అభిప్రాయపడ్డారు. 1970 లలో జేమ్స్ బానెట్ రచయితనవుదామని హాలీవుడ్ వచ్చారు. గొప్ప క్వాలిటీతో స్క్రిప్టులూ నవలలూ రాద్దామనుకున్నారు. కొన్నేళ్ళు స్క్రిప్టు లేవో రాసి, ఇక గొప్ప నవల రాద్దామనుకుని ఆర్నెల్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆరునెలల్లో  600 పేజీలు రాసినా ఆ కథ అంతు చిక్కడంలేదు. దీంతో గొప్ప కథని సృష్టించాలంటే తనకున్న శక్తి చాలదని, ముందు అసలు కథంటే ఏమిటో తెలుసుకుంటేనే రాయగలనని అనుకుని, ఇంకో మహా ప్రయాణానికి ఒడిగట్టారు. ప్రయాణం కట్టేటప్పుడు పదేళ్ళు పడుతుందని ‘కాసాబ్లాంకా’ రచయితకి చెప్పి వెళ్లారు. 

          ఇరవై ఏళ్ళ వరకూ పత్తా లేరు. ఈ ప్రయాణంలో ఎక్కడెక్కడున్నారో తెలీదు. కథంటే ఏమిటో తెలుసుకోవాలన్న పట్టుదలతో రుషిలా మారిపోయి, ప్రపంచ పురాణాలు ( హిందూ పురాణాలు సహా) , జానపద కథలే కాకుండా, వందలాది సినిమాలూ  పరిశీలించారు, పరిశోధించారు. సంఘర్షణ పడ్డారు, చివరికి తను  కనుగొన్నది రాసుకుని బయటికి వచ్చారు. 1999లో దాన్ని ప్రచురించారు. అదే
‘Stealing Fire From The Gods’  (దేవతలనుంచి దివ్యమంత్రాన్ని తస్కరిద్దాం!) అన్న కథలకి బైబిల్లాంటి గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీల్లో కోర్సుల్లో  బోధిస్తున్న పాఠ్యాంశం. అంతర్జాతీయంగా  రచయితల, దర్శకుల కళ్ళు తెరిపించిన స్క్రీన్ ప్లే శాస్త్రం. 

          మొట్టమొదట లిపి లేని కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో  పుట్టిన జానపద కథలు మౌఖికంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతూ, నిరంతరం మార్పు చెందుతూ ఉండేవి. అవి అరేబియన్ నైట్స్ కథలైనా కావొచ్చు, కాశీ మజిలీ కథలైనా కావొచ్చు- ఏ భాషల్లో ఏవైనా  కావొచ్చు. లిపి లేని కాలంలోప్రజల నోళ్ళల్లో నానుతూ ఆయా కాలాలకి తగ్గ జ్ఞాన సంపదతో, అనుభవాలతో, విలువలతో కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటూ మహాప్రయాణం సాగిస్తున్న అవి, లిపిని కనుగొనడంతో ఇక మార్పు చెందని శిలాక్షరాలుగా బందీ అయిపోయాయి. ఇవ్వాళ్ళ మనం చదువుతున్న జానపద కథలు మారే ప్రసక్తే లేదు. ఒక కాలంలో ఆగిపోయిన ఈ కథలవల్ల, ఇంకోనష్టం కూడా జరిగింది. అదేమిటంటే, మా నవ జాతి నేటి కాలంలో ఎదుర్కొంటున్న వివిధ కొత్త సమస్యలకి అవి ఏ మాత్రం సైకోథెరఫీ చేయలేకపోతున్నాయి. ప్రతీ జానపద కథా సైకో థెరఫీ చేస్తూనే  పుట్టింది. సైకో థెరఫీ కోసం, మానసిక రుగ్మతల్ని తొలగించుకోవడం కోసం ఇవి పుట్టాయి. పుట్టిన ప్రతీ జానపద కథా ప్రపంచంలో ఒకే కథా నిర్మాణంతో పుట్టింది. బిగినింగ్, మిడిల్, ఎండ్ అనే పద్ధతిలో. ఏ పద్ధతిలో, లేదా నిర్మాణంలో  కథ చెప్తే మానవ మస్తిష్కం స్వీకరించగలదో, మానవ మస్తిష్కానికే  తెలుసు కాబట్టి, ఆ కథ చెప్పే విధాన ప్రక్రియని యధాలాపంగా మానవ మస్తిష్కమే సరఫరా చేస్తూ వస్తోంది యుగాలుగా. జన్యువుల ద్వారా మానవకోటికి ఈ విద్య తరతరాలుగా సంక్రమిస్తూ వస్తోంది.

          ఇంతకీ ఈ బిగినింగ్, మిడిల్, ఎండ్  నిర్మాణంలో అంతస్సూత్ర మేమిటి? ఏది వీటిని  కలిపి వుంచుతోంది? కథంటే సైకో థెరఫీ గనుక, ఆ సైకాలజీ లోంచే, మానసిక అవసరాలకోసమే,  కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్స్ ని మధించి పుట్టింది కథనేది. నిత్యం స్వర్గంలాంటి కాన్షస్ లో తారట్లాడుతూ, అటు నిగూఢ రహస్యాల మహా సముద్రంలాంటి సబ్ కాన్షస్ లోకి వెళ్లేందుకు, కనీసం తొంగి చూసేండుకూ జంకుతుంది మన టక్కరి  ఇగో.  అలాటి జిత్తులమారి ఇగో ని,  సబ్ కాన్షస్ లోకి బలవంతంగా నెట్టి,  దాని భయాలన్నీ తీర్చి ఒడ్డున చేర్చడమే ఏ కథ పరమార్ధమైనా!

          మనం ఇగోని హీరోగా చేసి దాన్ని బిగినింగ్ ( కాన్షస్ మైండ్) సుఖ సంతోషాల నుంచి, మిడిల్ ( సబ్ కాన్షస్) లోకి నెట్టి, అక్కడి శక్తులతో సంఘర్షింప జేసి, విజేతగా ఎండ్ ( తిరిగి కాన్ష మైండ్) లోకి తీసుకొచ్చేస్తామన్న మాట. కాబట్టి కథంటే  సబ్ కాన్షస్ లో ఇగో చేసే జర్నీ. రచయితలకి మానసిక శాస్త్ర పరిచయంలేకపోతే, కనీసం తమ సొంత మైండ్ ఎలా పనిచేస్తుందో తమకే తెలియకపోతే  రాణించడం కష్టం.  ప్రపంచంలో ఏదైనా మైండ్ లోంచే, మైండ్ రిసీవ్ చేసుకునే స్ట్రక్చర్ తోనే, మైండ్ కోసమే పుడుతోంది. ప్రజలకి ఓ కథ / సినిమా నచ్చ లేదంటే అది సైకో థెరఫీ చేసే మైండ్ లోంచి పుట్టలేడనే అర్ధం. అంటే కాన్షస్- ఇగో- సబ్ కాన్షస్ ల ఇంటర్ ప్లే తో రాయలేదనే అర్ధం! సినిమా స్క్రీన్ ప్లే అంటే కాన్షస్- సబ్ కాన్షస్ ల ఇంటర్ ప్లే అని సశాస్త్రీయంగా నిరూపించాడు జేమ్స్ బానెట్. ఈ పుస్తకాన్ని  ప్రతివొక్కరూ విధిగా చదివి అర్ధం జేసుకోవాలి!  ఉచితంగా పీడీఎఫ్ ప్రతిని కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

-సికిందర్