రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఫిబ్రవరి 2018, ఆదివారం

603 : క్రియేటివిటీ సంగతులు!


స్ట్రక్చర్ ని  కాస్సేపు పక్కన పెడదాం, అసలు ఈ క్రియేటివిటీ ఏంటో చూద్దాం. తెలుగు సినిమా అనేది క్రియేటివ్ ఆలోచనల పరంగా ఇంకా సంధి కాలంలోనే కొట్టు మిట్టాడుతోంది. గడిచిపోయిన తొలి వ్యాపార యుగం దాటిరావడానికి మొరాయిస్తోంది. తొలిస్వర్ణయుగం (1931 - 51), మలిస్వర్ణ యుగం (1951 -71) ముగిసిపోయి,  తొలి వ్యాపార యుగం (1971 – 2001) కూడా గడిచి పోయి రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా 1971 – 2001 నాటి తొలి వ్యాపార యుగం దగ్గరే తచ్చాడుతోంది తెలుగు సినిమా క్రియేటివిటీ. నేటివిటీ పేర, ప్రేక్షకుల భావోద్వేగాల పేరా ఆ సంధి కాలంలోనే అవాస్తవిక, కృత్రిమ సర్కస్సులు చేస్తోంది. దాంతో చేదు అనుభవాలు చవి చూస్తోంది. నేటివిటీలు మారిపోతున్నాయి, సంస్కృతులు సన్నగిల్లుతున్నాయి,ఇంటర్నెట్ జీవితాల
వుతున్నాయి, భావోద్వేగాలూ అందుకనుగుణమైన  సంగతులు పట్టుకుని కొత్త పుంతలు తొక్కు
తున్నాయి. తరాల అంతరాలు చెరిగిపోయాయి. ఇంటర్నెట్  కలిపేస్తున్న జీవితాల్లో అన్ని వయసుల వారూ కలిసిమెలిసి  సాగుతున్నారు. పరస్పర ఫిర్యాదులు లేవు, జనరేషన్ గ్యాప్ సంఘర్షణల్లేవు. అయినా ఇంకా  అదే ముప్పై ఏళ్ళనాటి పాతకాలం మూస క్రియేషన్లతో  సినిమాలు చుట్టేస్తున్నారు. ఈ మూసతో అనుసంధానం కాలేక మలి వ్యాపార యుగపు ప్రేక్షకులు  గోలెడుతున్నారు. యుగ ధర్మాల్ని క్రోడీకరించుకుని దిశా నిర్దేశం చేయాల్సిన గొప్ప గొప్ప సీనియర్లు, అనుభవజ్ఞులు సైతం  సంధికాలంలోనే గడ్డ కట్టిన క్రియేటివిటీతో  అక్కడే  ఇరుక్కుపోయారు. సినిమా క్రియేటివిటీ వ్యాపారంతో  కూడుకున్నదని తెలిసికూడా కాలం చెల్లిపోయిన పాత ఫ్యాషన్ చొక్కాలు సినిమాలకి ధరింప జేస్తున్నారు.  తొలి వ్యాపార యుగం దాని కాలజ్ఞానంతో ఎంత విజయవంతమో, మలి వ్యాపార యుగాన్ని  అజ్ఞానంతో అంత దివాలా కోరుతనంగా తయారు చేస్తున్నారు  – నిత్యం  90 శాతం ఫ్లాపుల పుణ్యంతో ఇంకా ఇంకా. సింపుల్ గా చెప్పాలంటే , శుభ్రంగా  వ్యాపారం మర్చిపోయారు! 

         
కల్చర్ తాజా బాధితురాలు ‘గాయత్రి’. దీనికి సంధి కాలపు మార్కెటబిలిటీ లేని క్రియేటివిటీ తప్ప స్ట్రక్చర్ పట్టలేదు. స్ట్రక్చర్ లో ఆలోచిస్తే,  కూతురి అన్వేషణలో వున్న శివాజీ (బిగినింగ్),  తీరా కన్పించిన కూతురు దుర్మార్గుడని తిరస్కరించాక (మిడిల్) - ఆమె అపార్ధం తొలగించడానికి స్ట్రగుల్ చేస్తూంటే, పటేల్ ఇచ్చిన ఆఫర్ తో అతని బదులు తను జైలుకెళ్ళి ఇరుక్కుని,  కూతురి  అపార్ధం తొలగడంతో ( ఎండ్) -   ఆమెతో కలిసి పటేల్ అంతు చూశాడు – అనే క్రమంలో వుండాలల్సిన  కథ. 

          ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఇలా కూతురితో తలెత్తిన సమస్యా,  దాని పరిష్కారమూ  అన్న రెండు మూల స్తంభాలాధారంగా వున్నప్పుడే, ఈ కథకి స్క్రీన్ ప్లే అనే సౌధం నిలబడగల్గేది. 

          కానీ ఈ స్క్రీన్ ప్లేకి మొదటి మూలస్తంభమే వుంది, రెండోది కన్పించడంలేదు. శివాజీ యాక్టివ్ పాత్రగా లేడు, పాసివ్ గా కన్పిస్తున్నాడు. ఏది ప్రధాన కథో తెలియడం లేదు, గాయత్రీతో  -  పటేల్ తో రెండు వేర్వేరు కథల్లాగా అన్పిస్తున్నాయి. ఏది ప్రధాన జానరో, ఏది దాని తాలూకు సబ్ జానరో తెలియడంలేదు, రెండూ కలిసి పోయి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
ఫ్యామిలీ డ్రామానో, ఫ్యామిలీ థ్రిల్లరో అర్ధం గావడం లేదు.  గాయత్రితో ఫ్యామిలీ డ్రామాగా వుంటూ,  ఒక్కసారిగా  పటేల్ రాకతో ఫ్యామిలీ థ్రిల్లర్ గా మారిపోయి,  సెకండాఫ్ సిండ్రోంలో పడిపోతోంది.  ఇలా సెకండాఫ్ లో కథ ప్లేటు ఫిరాయించి వేరే కథలుగా మారిపోయిన సెకండాఫ్ సిండ్రోములు - సర్దార్ గబ్బర్ సింగ్, దొంగోడు, ధమ్, తేరేనామ్, హవా, జ్యోతిలక్ష్మి, సైజ్ జీరో వగైరా వగైరా  ఎన్నో అట్టర్ ఫ్లాపుల జాబితాలో చేరిపోతోంది ‘గాయత్రి’ కూడా. క్రియేటివ్ యాస్పెక్ట్ రీత్యా స్ట్రక్చర్ పరిస్థితి ఇదీ.

―2―
మార్కెట్ యాస్పెక్ట్  కొద్దాం. ఇక మోహన్ బాబు యువతరం ప్రేక్షకుల్లో పాగా వేయాలనుకుంటే, వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా తన పాత్రల తీరుతెన్నుల్ని  మార్చుకోవాల్సిందే. ఇవాళ్ళ సినిమాలు  ప్రధానంగా యూత్ కోసం, తర్వాత మిగిలితే వాళ్ళ అమ్మా బాబుల కోసం. సీనియర్ మోహన్ బాబు అయినా రంగంలో వుండాలంటే యూత్ కోసమే వుండాలి తప్ప, వాళ్ళ అమ్మా బాబుల్ని రంజింప జేస్తానంటే అమ్మాబాబులు ఆల్రెడీ అలసిపోయారు. ఇవాళ్ళ తెలుగు సినిమాలకి యూత్ అప్పీల్  గా మిగిలిన  అంశాలు రెండే రెండు - ఎకనమిక్స్, రోమాంటిక్స్. మోహన్ బాబు మొదటిది ప్రతిబింబించేలా మొదటి పాత్ర పోషణ చేశారు. డబ్బుకోసం ఇతరుల బదులు జైలు కెళ్ళడం. అయితే ఆ ఎకనమిక్స్ తో ఎక్కడా ఆకట్టుకోలేదు. డబ్బు నెక్కడా చూపించలేదు. మాటల్లో తప్ప విజువల్ ప్రెజెన్స్ లేదు. ఆ డబ్బుతో విలాసవంతమైన ఎదుగుదల లేదు. అది నెగెటివ్ షేడ్ అవుతుందని అభ్యంతరం చెప్పదల్చుకుంటే, అసలలా చట్టాన్ని ఏమారుస్తూ ఒకరి బదులు జైలు కెళ్ళడమే పెద్ద నేరం. ఆ డబ్బుతో అనాధ పిల్లల్ని పోషించడం ఇంకా తప్పు. 

          రెండోది, ఈ వుండీ లేని ఎకనమిక్స్ తో యూత్ అప్పీల్ కి,  అనాధాశ్రమం నడపడమనే ఏ మాత్రం పొంతన లేని సంధి కాలపు పాత సుత్తి వ్యవహారం తోడయ్యింది. దీంతో మోహన్ బాబు మొదటి పాత్ర యూత్ అప్పీల్ కి పూర్తిగా దూరమైపోయింది. యూత్ కి కనెక్ట్ కాకుండా పోయారు. మోహన్ బాబు ఇంకా మధ్య వయస్కులైన తన పాత అభిమానుల కోసమో, మరెవరి కోసమో ఆ కాలపు పాత్ర చిత్రణ చేసుకుంటానంటే కుదిరే పరిస్థితి లేదు. వర్గాల కతీతంగా  ప్రేక్షకులందరి అప్పీలూ ఇవాళ్ళ  ఈ రెండిటికే - ఎకనమిక్స్, రోమాంటిక్స్. 

          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎకనమిక్స్, రోమాంటిక్స్.
          ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్, ఎంటర్ టైన్మెంట్ – ఇదే మలి వ్యాపార యుగపు సినిమా స్టయిల్.

―3―
పోనీ రోమాంటిక్స్ చూద్దామన్నా, దీని జాడ ఎక్కడా కనబడదు. యువ గాయత్రి పాత్రతో కూడా. మోహన్ బాబు మొదటి పాత్ర శివాజీకి యుక్త వయసు వెర్షన్ పోషించిన విష్ణుతో కూడా రోమాన్స్ కన్పించదు, ఏదో కాసేపు ఫ్లాష్ బ్యాకులో శ్రియతో పాత తరహా ప్రేమ తప్ప. యూత్ అప్పీల్ కి వీలుండే గాయత్రికి ప్రేమాయణం లేకుండానే డ్రైగా చూపించడం మార్కెట్ యాస్పెక్ట్ అయిన రోమాంటిక్స్ కి విరుద్ధం. ఇలా మార్కెట్ యాస్పెక్ట్ కి  వుండాల్సిన ఎకనమిక్స్ లేదు, రోమాంటిక్స్ లేదు. మార్కెట్లో యువ ప్రేక్షకులు -  యువ ప్రేక్షకులు అంటూంటారే గానీ ఎవరా యువప్రేక్షకులు? వాళ్ళల్లో అమ్మాయిల్లేరు. చాలా వరకూ అబ్బాయిలే యువప్రేక్షకులుగా పోషిస్తున్నారు సినిమాల్ని. అమ్మాయిల్ని ఆకట్టుకునే పాత్ర చిత్రణలు లేకపోవడం అమ్మాయిలు దూరమవడానికి కారణం. కాబట్టి ‘గాయత్రి’ అని టైటిల్ పెట్టుకున్నప్పటికీ  అమ్మాయిలు డుమ్మా కొట్టడానికి కారణమిదే. కనీసం - ‘గాయత్రి’ క్యారక్టర్ యూత్ అప్పీల్ తో వుందని, ఆమె యూత్ ఫుల్ రోమాంటిక్స్ కి మోహన్ బాబు చేసే డిగ్నిఫైడ్ హెల్ప్ ‘పింక్’ లో అమితాబ్ లాగా ఏంతో అప్డేట్ అయి  వుందనీ, మౌత్ టాక్ వచ్చేలా సినిమా ధోరణి వుంటేగా!

―4―
          ఫ్యామిలీ డ్రామాలు నేటి దైనందిన  జీవితాల్లో  ఎదురవుతున్న సమస్యలతో (ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్) ఎంతో పకడ్బందీగా, ఆధునికంగా  తీస్తే తప్ప ఈ రోజుల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కథని ఎకనమిక్స్ తోనో, రోమాంటిక్స్ తోనో ముడి పెట్టి ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ ప్రధాన కథగా చేసి చూపించాల్సి వుంటుంది. అంటే శివాజీకి కూతురు కన్పించడం లేదన్న ధ్యాస తప్ప, దాంతో కూతురికోసం సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్లేవర్ తో తీవ్ర ప్రయత్నాలు తప్ప, ఇంకో వ్యాపకం వుండడానికి కుదరదు. ఉపాధి కోసం స్టేజి నటుడి టాలెంట్ ని నేరస్థులకి డబుల్ గా వ్యవహరిస్తూ జైలుకెళ్ళి వస్తూండే బిజినెస్ గా వుంటే వుండొచ్చు. కూతరు కన్పించడం ప్లాట్ పాయింట్ వన్ గా వుంటూ, ఆమె తిరస్కరించడంతో మిడిల్ సంఘర్షణగా కొనసాగుతూ,  మధ్యలో విలన్ గాయత్రీ పటేల్ పరిచయంతో, సంఘర్షణ కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్నగా మారుతూ, చివరికి జైలు కెళ్ళి పటేల్ తో మోసపోయి, కూతురి ఆర్గ్యుమెంటే నెగ్గి తను తలొగ్గి,  ప్లాట్ పాయింట్ టూ కొచ్చి, ఇక కూతురితో కలిసి పటేల్ ని ఎదుర్కొనే ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా ముగియాలి. ఇందులో ఫ్యామిలీ డ్రామా వుంటే అంతర్లీనంగా ఎలాగూ వుంటుంది. దానికోసం తహతహలాడుతూ కథనే ఫ్యామిలీ డ్రామాగా మార్చేయ నవసరం లేదు.


―5―
          కూతురి ఆర్గ్యుమెంట్ నేపధ్యంలో నైతిక విలువల ప్రశ్న అంటే ఏమిటి? కథంటే ఆర్గ్యుమెంట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. రెండు పాత్రల మధ్య తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ సహిత  కథనమనీ, చివరికి ఆ ఆర్గ్యుమెంట్ తాలూకు జడ్జి మెంట్ తో ముగింపనీ. ఇది ఏ కథయినా డిమాండ్ చేసే దాని ప్రాథమిక హక్కు. దీన్ని కాదనడానికి వీల్లేదు. 

         గాయత్రి ఆర్గ్యుమెంట్ ఏమిటి? పుట్టగానే తన తండ్రి శివాజీ తాగుడు కోసం వెయ్యి రూపాయలకి తనని అమ్మే ప్రయత్నం చేశాడని కదా? ఇదామె అపార్ధమే కావొచ్చు. కానీ ఆమె పుట్టక ముందు నుంచీ తను చేస్తున్న పనేమిటి? తన నాటక కళని తప్పుడు విధానంలో జీవిక కోసం వాడుకుంటూ - చట్టాన్ని ఏమారుస్తూ -  ఆయా నేరస్థుల రూపంలో వాళ్ళ బదులు తను జైలు కెళ్ళి వస్తున్నాడు. ఒక క్రిమినల్ గా రూపాంతరం చెందాడు. అదామె అపార్ధమైతే, ఇది తన నైతిక విలువల ప్రశ్న. దీనికేం సమాధానం చెప్తాడు కూతురికి? ఈ అనైతిక ప్రవర్తన ఆమె చేసుకున్నఅపార్ధాన్ని పూర్తిగా బలపర్చేట్టు లేదా? ఇది కాదా ఫ్యామిలీ డ్రామా అంటే? తప్పిపోయిన కూతురు దొరికి, ఆ తండ్రీ కూతుళ్ళు కన్నీళ్లు కార్చే  పై పై ఉపరితల  మెలో డ్రామాయేనా ఇంకా తెలుగు సినిమా మార్కు ఫ్యామిలీ డ్రామా అంటే?  పాత్రల లోలోపలి కుళ్ళు అలాగే మిగిలిపోతూ? ఈ హిపోక్రసీకే  - ఫాల్స్ డ్రామాకే ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారా?

―6―
        అనాధ పిల్లల సంరక్షణతో, జైలుకి రాకపోకలతో, ఇంకొన్ని మంచి పనులతో  శివాజీని చూపించుకొస్తూ, ఒకచోట అనుకోకుండా కూతురు గాయత్రితో సంఘటన సృష్టించారు. తండ్రీ కూతుళ్ళమని వాళ్ళిద్దరికీ తెలియని డ్రామా బావుంది. దుండగుల బారి నుంచి ఆమెని కాపాడేస్తాడు. ఆమె సెల్ ఫోన్ కింద పడిపోయి వుంటుంది. తీసి ఆమె కివ్వబోయేంతలో ఆమె ఆటోలో వెళ్లిపోతూంటుంది. ఇంటికొచ్చి ఛార్జింగ్ పెడతాడు. సెల్ ఛార్జి అయ్యాక స్క్రీన్ వెలుగుతుంది. అప్పుడా స్క్రీన్ సేవర్ గా ఆమె తల్లి ఫొటో డిస్ ప్లే అవుతుంది. ఆ తల్లి (శ్రియ) శివాజీ భార్యే! ఇదెంతో కదలించే  మంచి మెలో డ్రామాగా వుంటుంది (ఇది తప్ప ఈ ఫ్యామిలీ డ్రామాగా తీసిన సినిమాలో ఇంకొక్క కదిలించే సన్నివేశం కూడా లేదు). 

          పుట్టగానే కన్పించకుండా పోయిన కూతురి కోసం తను పడుతూ వచ్చిన ఆవేదన ఇక తీరిపోయిన క్షణాలు! పట్టరాని ఆనందం. సర్వసాధారణంగా ప్లాట్ పాయింట్ ఘట్టం ఒక సీరియస్ గా తలెత్తే సమస్యతో ఉద్రిక్తంగా వుంటుంది. ఆ సీరియస్ సమస్యని సాధించే గోల్ తో పాత్ర ప్రయాణం మిడిల్లోకి సంఘర్షణాత్మకంగా వుంటుంది. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా వుంది అపూర్వంగా. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఆనందభరితంగా తయారైంది. కథకి అనితరసాధ్యంగా కుదిరిన ప్లాట్ పాయింట్ వన్ మలుపు ఇది. సర్వ సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచి పాత్రకి సీరియస్ ప్రయాణంగానే వుంటుంది. ఇక్కడ దీనికి విరుద్ధంగా,  ఇక్కడ్నించీ శివాజీకి సంతోషకరమైన ప్రయాణంగా వుంది - కూతురు దొరికిందనీ, కూతుర్ని కలుసుకోబోతున్నాననీ!

          ఇంతమంచి ప్లాట్ పాయింట్ వన్ తో శివాజీ ఓ హేపీ సాంగ్ కూడా పాడుకోవడం ప్లాట్ పాయింట్ వన్ ని విజువల్ గా ఇంకెంతో ఎలివేట్ చేసింది. ప్లాట్ పాయింట్ వన్ ని అనుసరించి పాటెప్పుడూ వుండదు. ఇక్కడ ఇలా చక్కగా  కుదిరింది.  తీరా పాట తర్వాత ఆ కూతుర్ని కలుసుకోబోతూంటే, నిండు సభలో తండ్రి గురించి ఆమె చెప్పే మాటలు వింటాడు - తండ్రి ఎంత దుర్మార్గంగా తాగుడు కోసం తనని అమ్మేశాడో అని. దీంతో శివాజీ ప్రపంచం తలకిందు లవుతుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ ఇలా రివర్స్ అయింది. నిజానికి హేపీ గా వున్న ప్లాట్ పాయింట్ వన్ తో,  మిడిల్ కూడా కూతురి కలయిక పరంగా హేపీగా కొనసాగుతుందనీ, సంఘర్షణకి బదులు మిడిల్ కూడా ప్రయోగాత్మకంగా ఇక్కడ హేపీగా కొనసాగబోతోందనీ అన్పించి అత్యంత  ఆసక్తి రేపుతుంది. అలా కలుసుకునీ జీవితాల్ని ఆనందమయం చేసుకున్న తండ్రీ కూతుళ్ళకి  వూహించని విపత్తు ఏదో ఎదురవుతుందనీ ఒక అభిప్రాయం కల్గుతుంది. విపత్తు లేకపోతే ఇది కథగా వుండదు, కమర్షియల్ సినిమాకి పనికి రాని గాథగానే  ముగిసే ప్రమాదముంది.

          అయితే విపత్తు కూతురి మాటల్లోంచే పుట్టింది. శివాజీలో సంఘర్షణ మొదలవుతుంది. తను తాగుడు కోసం పురిటి పిల్లని అమ్మేశాడా? ఇరవై ఏళ్ళనాటి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఇందులో నాటక నటుడుగా ప్రేమించి పెళ్ళిచేసుకున్నగురువు కూతురు క్యాన్సర్ సోకడంతో,  శివాజీ తన నట వృత్తిని నేరప్రవృత్తిగా మార్చుకుంటాడు. వైద్యం డబ్బుల కోసం మొదటి సారిగా ఒకరిలా నటిస్తూ జైలుకెళ్ళి వస్తాడు. వస్తే భార్య చనిపోయిందని తెలుస్తుంది. ప్రసవించిన కూతుర్ని అనాధాశ్రమం వాళ్ళు తీసికెళ్ళి పోయారని అంటాడు స్నేహితుడు. తాగుబోతు అయిన స్నేహితుడు,  పుట్టిన శివాజీ కూతుర్ని వెయ్యి రూపాయలకి అమ్మేయబోతూంటే అనాధాశ్రమం వాళ్ళు  పట్టుకుని తీసికెళ్ళి పోయారు. ఇదీ విషయం.

          పెద్ద విషయం కాదు. ఆ అనాధాశ్రమం తెలుసుకుని శివాజీ వెళ్లి కూతుర్ని అప్పుడే తెచ్చుకోవచ్చు. ఈ లాజిక్ ని (కామన్ సెన్స్ ని) దాటవేశారు.

          ఈ ఫ్లాష్ బ్యాక్ కూతురు గాయత్రికి శివాజీ పంపిన డైరీలో రివీలవుతుంది. అతడి డైరీ చదువుకున్న ఆమె వెంటనే తండ్రి మీది ద్వేషం తొలగించుకుంటుంది. ఆమె పాయింటాఫ్ వ్యూలో ఒక ఫ్లాష్ కట్ పడుతుంది. అందులో పదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి యేడని  అనాధాశ్రమం అతణ్ణి అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ,  పుట్టగానే తాగుడుకోసం నిన్నమ్మేసి  పోయాడని  అసహ్యభావంతో అంటాడతను. 


           ఇక్కడ ఈ రెండూ గందరగోళంగా వున్నాయి. ఒకటి- తండ్రి పంపిన డైరీ చదవగానే ఆమె  ద్వేషమంతా తొలగిపోవడం. ఆ డైరీలో రాసిందే నిజమని ఎలా నమ్ముతుంది తను? అసలు డైరీ ఎలా రాస్తాడు? ఆ డైరీ లోనే నటుడిగా తన నేరప్రవృత్తి గురించి ఎలా బయట పెట్టుకుంటాడు? దొరికిపోడా? ఇప్పుడు కూతురికి దొరికిపోలేదా? ఒక తప్పు చేయలేదని ఆమెకి చెప్పబోతూ రెండో తప్పుతో దొరికిపోలేదా? అయినా డైరీ చదివిన కూతురుకి ఈ విషయమే పట్టదు. 

          ఇక ఇప్పుడామెకి  పదేళ్ళ వయసులో అనాధాశ్రమం అతనితో కట్ షాట్ పడుతుంది. తన తండ్రి ఏమయ్యాడని అడుగుతుంది. ఇంకెక్కడి తండ్రీ, పుట్టిన నిన్ను తాగుడికి అమ్మేయబోతే పట్టుకున్నాం – అని అసహ్య భావంతో అంటాడతను. ఒక అనాధా శ్రమం నడిపే అతను  అనాధ పిల్ల సందేహం ఇలాగే తీర్చి గాయపరుస్తాడా? జీవితాంతం బాధ పడేలా చేస్తాడా? 

          ఇలాటి అవాస్తవిక, అసహజ చిత్రణలతో, పైపై కథనాలతో చాలా బలహీనపర్చారు. 

దీన్నిసినిమాని సినిమాలాగే చూడాలన్న గొప్ప కొటేషన్ తో సమర్ధించుకో వచ్చు కథకుడు. అతడి విచక్షణకే వదిలెయ్యాలి. సినిమాని సినిమాలాగా చూడడానికి అడ్డగోలుగా రాసి పారేయ్యొచ్చు.

.         ఇలా కూతురికి అపార్ధం కల్గించడమూ (అనాధాశ్రమం అతనితో), ఆ అపార్ధాన్ని తొలగించడ మూ (తండ్రి డైరీతో) ఇలా చాలా ఆషామాషీగా చేసేశాక, ఇక మోహన్ బాబు రెండో పాత్ర గాయత్రీ  పటేల్ అనే విలన్ ఎంట్రీ. ఇక్కడ్నించీ ఫ్యామిలీ డ్రామాగా నడుస్తున్న కథ కాస్తా ఫ్యామిలీతో సంబంధంలేని వేరే థ్రిల్లర్ గా మారిపోతుంది. దీనికైతే ఏ  కామన్ సెన్సూ పట్టించుకోలేదు. పెద్ద మొత్తానికి ఆశపడి గాయత్రీ పటేల్ బదులు అతడిలా నటిస్తూ తను జైలు కెళ్తున్నప్పుడు, అసలు పటేల్ కి పడ్డ శిక్షేంటో తెలుసుకోడా? పటేల్ కి ఉరి శిక్ష పడితే, ఆ విషయం తెలుసుకోకుండా జైలుకెళ్ళి పోయి, ఉరి సమయానికి లబలబలాడడమేనా? లబలబలాడితే ఆడియెన్స్ కేంటి? అది అతడి ఖర్మ, అనుభవించాలి. ఈ అరగంట పాటు దృశ్యాల్లో ఇలాటి కామన్ సెన్సే లేని ట్విస్టు మీద ట్విస్టులెన్నో. శివాజీ తను పటేల్ కాదని చెప్పడానికి ఒక్క ఆధార్ కార్డు చాలు, కూతురితో ఒక్క బ్లడ్ టెస్టు చాలు. ఎందుకీ నసంతా,  ఏదో గొప్ప థ్రిల్లర్ లాగా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తూ? 

          అసలు అంతకి ముందు జైలు కెళ్ళే ఒక సందర్భంలో,  శివాజీ పృథ్వీలా నటిస్తూ అతడి బదులు జైలు కెలా వెళ్తాడు? పృథ్వీ హైట్ ఎక్కడ?  తన హైట్ ఎక్కడా? పోలీసులు అంత లాలీపాప్ గాళ్ళా? కోర్టుల్ని కూడా ఇలాగే ఏమారుస్తాడు శివాజీ. తను నేరం చేస్తున్నట్టుగానే ఫీల్ కాడు. ఇరవై ఏళ్లుగా ఇలా మారువేషాలతో మోసాలు చేస్తున్నాడని యంత్రంగానికీ తెలీదు. ఇలాగే  ముగుస్తుంది కథ!

          క్రియేటివిటీని ఇంత అడ్డగోలుగా చేసుకుంటూ స్ట్రక్చర్ ని ద్వేషించడం ఎంతవరకు సబబు? ఇది బాగా ఆలోచించుకోవాలి.  స్ట్రక్చర్ లేని క్రియేటివిటీలే 90 శాతం ఫ్లాపులకి కారణం. క్రియేటివిటీ స్ట్రక్చర్ లోకొచ్చినప్పుడు ‘గాయత్రి’ లాంటివి  గాయపడవు. శివాజీకీ, గాయత్రీ పటేల్ కీ మధ్య గాయత్రులు గల్లంతవరు.
.
సికిందర్