రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, అక్టోబర్ 2015, ఆదివారం

ఇవి స్క్రీన్ ప్లే సంగతులు..


        కొత్త దర్శకుడు శ్రీనివాస రెడ్డి సీనియర్ దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవంతో కథంటే ఏమిటో తెలుసుకున్న నాలెడ్జి ఆశ్చర్య పరుస్తుంది. వేసి చూసుకుంటే సీనియర్ల సినిమాలకీ, తను తీసిన సినిమాకీ తేడా ఏమిటో ఇప్పటికైనా తను పసిగట్టగల్గడం అనుమానమే. వాళ్ళ సినిమాల్లో వున్నది కథ ఐతే,  తన సినిమాలో లేనిది కథే. కథ లేకుండా సినిమా ఎలా తీస్తామని నిర్మాత దగ్గర్నుంచీ హీరో వరకూ అందరూ ప్రశ్నించ వచ్చు. ఆ కథగా అనుకుంటున్నది కథ కాదు, సీన్లే. అద్బుతమైన సీన్లు తీస్తున్నామనుకుని అదే కథ అనుకోవడం- కాగుతున్న నూనెలో నాలుగు బెండకాయలేసి తిప్పుతూ అదే వంట అనుకున్నట్టు. దర్శకుడి కాగుతున్న నూనె బ్రెయిన్. అందులో వేసిన బెండకాయలు సీన్లు. బెండకాయలేసే ముందు వంటకి ఏ స్ట్రక్చర్ వుంటుందో, దేన్ని బేస్ చేసుకుని వంట ప్రారంభిస్తారో-  ఆ ఉల్లి, పోపు, మిరప, కరివేపాకూ వగైరా వగైరా- లేకుండా వండి పడేసినట్టు,  దర్శకుడి సినిమా వంటకం కూడా సమస్య- సంఘర్షణ- పరిష్కారమనే బేసిక్స్ ని  వదిలేసి వండేసినట్టుంది చూస్తూంటే. 


            సమస్య ఉందిగా- హీరోని చంపాలని విలన్ అనుకోవడం?
          సంఘర్షణ ఉందిగా- హీరో ఎదురు తిరిగి పోరాడడం?
          పరిష్కారం ఉందిగా- విలన్ మీద హీరో గెలుపు?  ..అనుకోవచ్చు. మరెందుకు బోరు కొడుతోంది సినిమా?
          మూడూ తప్పే. 1- గోల్ హీరోకి లేదు, 2- హీరో రియాక్టివ్ గా అంటే, ఒక విధంగా పాసివ్ గా వున్నాడు, 3- ఇది కథే అని నమ్మితే ఏ కథో కూడా తెలీకుండా పోయింది.
***
            మొదట్నించీ వద్దాం..

.
          ఇబ్బందుల్లో పడ్డ ప్రేమికుల పెళ్ళిళ్ళు హీరో చేస్తూంటాడు. ఎందుకు చేస్తున్నాడనే దానికి గతితప్పి దాదాపు క్లయిమాక్స్ దగ్గర చెప్పారు. ఇది ఫ్లాష్ బ్యాక్ కాదు. ఈ చూపించిందాంట్లో విషయంతో, వర్తమాన కథలో హీరో డీల్ చేస్తున్న, లేదా సంఘర్షిస్తున్న హీరోయిన్ సహా ఏ పాత్రతోనూ ఎలాటి సంబంధం లేదు. కాబట్టి ఇది ఫ్లాష్ బ్యాక్ కాదు. కేవలం హీరో ఇప్పటి ప్రవర్తనకి వివరణ ఇచ్చుకునే అతడి వ్యక్తిగత అనుభవంతో కూడిన సర్కిల్ ఆఫ్ బీయింగ్ మాత్రమే. ఈ సర్కిల్ ఆఫ్ బీయింగ్ లో శివ అనే పేరుతో వున్న హీరో శివ కాదు, రామ్. శివ అనే క్లాస్ మేట్ తో గట్టి ఫ్రెండ్ షిప్ వుంటుంది. ఓ రోజు ఆ శివ ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకని తెలుసుకుంటే, ప్రేమించినమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటోంది. కాబట్టి ఆ కోపంతో అక్కడి కెళ్తే, ఆమె శవమై వుంటుంది. దాంతో రాం, శివగా పేరు మార్చుకుని, పెద్దలకారణంగా పెళ్ళికి నోచుకోని ప్రేమికులిలా చచ్చిపోకూడదని, తనే పెళ్ళిళ్ళు చేస్తున్నాడన్నమాట.

          ఇప్పుడు  తాజాగా,  ఇష్టపడ్డ వాడితో కేంద్ర మంత్రి కూతురి పెళ్లి చేసేసి పారిపోతూ రైలెక్కేస్తాడు. ఒక స్టేషన్లో రైలాగితే సిగరెట్ తాగి వస్తానని దిగి వెళ్తాడు. స్టేషన్ బయట సిగరెట్ తాగేందుకు లైటర్ తీస్తూంటే ఒకడు లాగేసుకుంటాడు. దాన్ని అక్కడే వున్న భోజిరెడ్డి పెద్ద కొడుక్కి ఇవ్వబోతాడు. ఇవ్వకుండా శివ ఫైటింగ్ మొదలెడతాడు. 


          ఇక్కడెందుకో ఓ హిందీ సినిమాలో క్లాసిక్ సీన్ గుర్తొస్తోంది. షోమాన్ మన్మోహన్ దేశాయ్ తీసిన  ‘రోటీ’  లో రొట్టె కోసం రోడ్డు పక్క రాజేష్ ఖన్నా ఫైట్ మాస్టర్ శెట్టి తో తలపడతాడు. రాజేష్ ఖన్నా కి ఆ రొట్టె చాలా అవసరం. అతడి జీవితం అలా వుంది. ఒక రొట్టె కోసం దేశంలో మాడుతున్న కడుపులెన్నో. దేశంలో ఆకలి కడుపులకి సింబల్ ఆ రొట్టె. దానికోసం ఆ ఫైట్ ఒక బలమైన సోషల్ కామెంట్. కాబట్టి ఈ పోరాట సీనుకి పూర్వరంగం ఇంత  బలంగా వుండి మనకే  ఆవేశాన్ని రగిలిస్తుంది- మనమే శెట్టీని కొట్టెయ్యాలన్పించేంతగా!


          సరే, శివ ఆ లైటర్ కోసం ముఠా అంతటినీ భోజిరెడ్డి పెద్ద కొడుకుతో సహా తన్ని, సిగరెట్ వెల్గించుకుని రైలెక్కేసి వెళ్ళిపోతాడు. ఈ సంఘటన శివ మీద భోజిరెడ్డికి పగని రగిలిస్తుంది. వాణ్ణి పట్టుకు రండని చెప్పి ముఠాని ఎగ దోస్తాడు. పట్టుకొస్తే వూరి జనం ముందు చంపి ప్రతిష్ట నిలుపుకోవాలని.

          ఇదీ కథకి ఏర్పాటయిన సమస్య లేదా పాయింటు. బిగినింగ్ విభాగాన్ని ముగిస్తూ ప్లాట్ పాయింట్ -1 ఏర్పాటు. ఇక్కడి నుంచీ మొదలయ్యే మిడిల్లో సంఘర్షణా పర్వం ప్రారంభించాలి.  ఎప్పుడైనా ఏ సినిమా కథ జాతకమైనా ఈ ప్లాట్ పాయింట్-1 అనే ఘట్టం ఆయురారోగ్యాల మీదే ఆధారపడి వుంటుంది. ఎందుకంటే సినిమా ఇక్కడ్నించీ ముందుకు నడవడానికి ఉప్పందే సన్నివేశం ఇదే కాబట్టి. మరి ఇంత  ఆయువు పట్టులాంటి ఈ సన్నివేశాన్ని ఎలా స్థాపించారో ఒకసారి చూద్దాం- ఈ సన్నివేశం బాగోకపోతే క్లయిమాక్స్ కూడా బాగోదు. యథా ప్లాట్ పాయింట్-1 తథా ప్లాట్ పాయింట్-2 అని కదా?


          చెక్ లిస్టు చూద్దాం-
          1- రైల్వే స్టేషన్ ముందు భోజిరెడ్డి పెద్ద కొడుకుతో హీరో పోరాడే ఈ సన్నివేశం నడుస్తున్న కథనంలోంచి సహజంగా పుట్టుకొచ్చిందా?
          2- ఈ సన్నివేశానికి కి లాజిక్ ఉందా?
          3- ఈ సన్నివేశానికి హీరో ఏమాశించి తెరతీశాడు?
          4- అప్పుడు హీరో కేమైనా గోల్ ఏర్పడిందా?
          5- ఏర్పడితే ఆ గోల్ లో ఎమోషన్ ఉందా?
          6-తను పాల్పడిన ఈ సన్నివేశం తాలూకు పరిణామాల హెచ్చరిక ఏమైనా ఉందా?
          ఇవీ కథకి కీలకమైన ప్లాట్ పాయింట్ -1 చెక్ లిస్టు ప్రశ్నలు.


          పై ప్రశ్నల్ని వివరించుకుంటే-
          1- ప్లాట్  పాయింట్ -1 సన్నివేశం నడుస్తున్న కథనంలోంచి సహజంగా పుట్టుకు రాకపోతే హీరో పాసివ్ అయిపోతాడు.
          2-ఈ సన్నివేశానికి లాజిక్ లేకపోయినా పాసివ్ అయిపోతాడు. ఎందుకంటే ఏ పాత్రా ఎట్టి పరిస్థితిలోనూ లాజిక్ ని ఎగెయ్యాలని చూడదు. లాజిక్ తో వున్న పాత్రని లొంగ దీసి లాజిక్ లేకుండా తన సౌలభ్యం కోసం నడిపించేది దర్శకుడే/ కథకుడే. ఎప్పుడైతే తానుగా నడిచే పాత్ర (యాక్టివ్) ని లొంగదీసి నడిపిస్తారో అప్పుడది పాసివ్ గా మారిపోతుంది.
          3- హీరో ఏదైనా ఆశిస్తేనే సన్నివేశానికి తెరతీయగలడు.
          4- ఈ సన్నివేశంలో హీరోకి గోల్ ఏర్పడకపోతే కథకి అర్ధమే లేదు, హీరోకి పనే లేదు, కథలో అంతా వూరికే చక్కర్లు కొడుతూ నిర్మాత ఇచ్చే డబ్బుని ఎంజాయ్ చేయడం తప్ప.
          5- గోల్ లో ఎమోషన్ లేకపోతే  ‘కిక్-2’ లోలాగే వుంటుంది పరిస్థితి.
          6- సన్నివేశంలో హీరో పాల్పడిన చర్య తాలూకు పరిణామాల హెచ్చరిక లేకపోతే కథలోనూ - కథలో పాత్రల మధ్యా టెన్షన్ అనేది వుండదు. 


          ఇప్పుడు సినిమాలో ఎలావుందో చూద్దాం-
          1- రైల్వే స్టేషన్ ముందు భోజిరెడ్డి పెద్ద కొడుకుతో హీరో పోరాడే ఈ సన్నివేశం నడుస్తున్న కథనంలోంచి సహజంగా పుట్టలేదు. నడుస్తున్న కథనం రైలెక్కి హీరో పారిపోతూ వుండడం. ఆ క్రమంలో రైల్లోనే కాకతాళీయంగా జరగాల్సిన ఈ సంఘటన రైల్లో జరగలేదు. అనుభూతి ఐక్యతని భంగపరుస్తూ ఎక్కడో స్టేషన్ బయట జరిగింది. మనం భోంచేస్తూ మధ్యలో లేచి పక్కింటి కెళ్ళి మంచి నీళ్ళు తాగి రాం కదా. అలాగన్న మాట.


          2- ఈ సన్నివేశానికి  లాజిక్ లేదు. ట్రైన్ స్టేషన్లో ఎంత సేపాగుతుంది? ఆ ఆగిన కొన్ని క్షణాల్లో హీరో వెళ్లి ఎలా సిగరెట్ తాగొస్తానంటాడు? ప్లాట్ ఫాం మీద తాగడానికి వీల్లేదు. స్టేషన్ బయటి కెళ్ళి తాగిరావాలి. అప్పటి దాకా రైలాగుతుందా? అయినా అలాగే స్టేషన్ బయటికెళ్ళి పాన్ షాపు దగ్గర తాగడానికి లైటర్ తీశాడంటే- కావాలని భోజిరెడ్డి పెద్ద కొడుకుతో దెబ్బలాట కోసం, ఆ దెబ్బలాట ద్వారా భోజిరెడ్డి కి పగ రగిలించడం కోసం, రైల్లో కుదరదని స్టేషన్ బయటికి స్థలమార్పిడి చేసి  లాజిక్ లేకుండా ఇంత ముఖ్య ఘట్టాన్నిసృష్టించారు. దర్శకుడు/కథకుడు ఇక్కడ హీరోని బయటికి తోలేశాడు. దీంతో ఇల్లాజికల్ గానూ పాసివ్ గానూ మారిపోయాడు హీరో. పావుగంట సేపు అతను ఫైట్ చేసి తీరిగ్గా వచ్చేదాకా రైలాగి వుందంటే  మొత్తం డ్రైవరూ స్టేషన్ మాస్టారూ అందరూ ముసుగుతన్ని నిద్రపోతున్నట్టా? 


          3- ఈ హీరో తన లైటర్ ని ఆశించి ఈ సన్నివేశానికి తెర తీశాడు. ‘శివ’ లో నాగార్జున పోగుపడిన క్రోధావేశాలతో సైకిలు చెయిను లాగి ప్రత్యర్ధిని  కొడుతూ సన్నివేశానికి తెరతీస్తాడు. మనశ్శాంతిని  ఆశించి ఉంటాడు. ఇక్కడ మన హీరోకి భోజిరెడ్డితో గానీ అతడి కొడుకులతో గానీ  ఏ పూర్వ వైరమూ లేదు. కేవలం తన దగ్గర అప్పటికప్పుడు లాక్కున్న లైటర్ కోసం పోరాటానికి దిగాడు. 


          4- హీరోకి ఎలాటి గోల్ ఏర్పడలేదు. ఎందుకంటే  ఆ లైటర్ తీసుకుని భోజిరెడ్డి పెద్ద కొడుకు పారిపోలేదు. పారిపోయి వున్నా  ఆ లైటర్ ని పొందాలన్న గోల్ హీరోకి ఏర్పడేదేమో! లైటర్ ని  పొందడం కూడా ఒక గోలేనా? అన్పించవచ్చు. ఇక్కడింతే దర్శకుడి రచన ప్రకారం. ఇంతకంటే విషయం లేదు.  ‘శివ’ లో నాగార్జున తిరగబడ్డంతో ఇక మాఫియా అంతు చూడడమే గోల్ గా ఉంటుందని అర్ధం జేసుకుంటాం.  కాబట్టి కీలకమైన ఈ ప్లాట్ పాయింట్ - 1 దగ్గర మన హీరోకి ఎలాటి ఆశయమూలేదు,  గోల్ కూడా ఏర్పడలేదు.


          5- గోలే లేనప్పుడు ఎమోషన్ కూడా ఇక్కడ ఏర్పడలేదు. వుంటే గింటే అది విలన్ భోజి రెడ్డి కి రాంగ్ ప్లేస్ లో, రాంగ్ టైంలో ఇక్కడ గోల్, ఎమోషన్ ఏర్పడ్డాయి. అంటే హీరో గోల్ నీ, ఎమోషన్ నీ  విలన్ హైజాక్ చేశాడన్న మాట. కథ అతడి చేతిలోకి వెళ్ళిపోయింది. హీరో పెయిడ్ హాలిడే ఎంజాయ్ చేయడమే. ఇక్కడ్నించే కథకి దుర్దశ మొదలయ్యింది. ‘శివ’ లో నాగార్జున  గోల్ కి వున్న ఎమోషన్ ఎలాటిదో వేరే చెప్పనక్కర లేదు. మన హీరో కనీసం ఆ లైటర్ కోసం చేస్తున్న పోరాటంలో  ఎమోషన్ పుట్టే అవకాశం ఎటూ లేదు. ఇందాక చెప్పుకున్న రాజేష్ ఖన్నా రొట్టె కి లాంటి పూర్వరంగంలో వున్న ఎమోషన్ లైటర్ తో వుండే అవకాశం లేదు కాబట్టి. అదే తను పెళ్లి చేయబోయే ఏ అమ్మాయి ఫోటోనో లైటర్ స్థానంలో ఉండుంటే ఎమోషన్ పుట్టేదేమో.


          6- హీరో పాల్పడిన సన్నివేశం (భోజిరెడ్డి పెద్దకొడుకుని కొట్టడం) తాలూకు పరిణామాల హెచ్చరిక మాత్రం వుంది, కానీ దానికి ఫీల్ లేదు.  భోజిరెడ్డి చంపడానికి సిద్ధమయ్యాడు. తప్పీజారీ ఒకవేళ హీరో చచ్చినా ఏ ఆశయం కోసం చచ్చినట్టు? ఉత్తి సిగరెట్ లైటర్ కోసమా? కాబట్టి కథలో- పాత్రల మధ్యా ఎక్కడా టెన్షన్ పుట్టలేదు. వరుణ్ సందేశ్ నటించిన ‘కుర్రాడు’ (2009) లో సెంట్రల్ పాయింటుగా బైక్ కోసం పోరాటం చేస్తే సినిమా ఏమైందో తెలిసిందే.
          వీటన్నిటి దృష్ట్యా ప్లాట్ పాయింట్ -1 విఫలమయింది.
***
     అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, చెప్పదల్చుకున్న కథేమిటో తెలియకపోవడం దగ్గరే. చెప్పదల్చుకున్నది హీరో హీరోయిన్ల ప్రేమకథా, లేకపోతే  హీరోకీ విలన్ కీ మద్య లడాయికి సంబంధించిన యాక్షన్ కథా తెలుసుకోక పోవడం దగ్గరే. చాలా సినిమాల్లో దర్శకులిలాగే బోల్తా పడుతున్నారు. మొన్నటికి మొన్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ లో చూశాం- కథ సీక్రెట్ కొరియర్ కి సంబంధించింది అయితే, చాంతాడంత ప్రేమకథ నడుపుకొచ్చి అదే ప్రధాన కథ అన్నట్టు తయారు చేశాడు. 

          ప్రస్తుత సినిమాలో విలన్ తో హీరో లడాయే ప్రధాన కథయితే అది కరెక్టే. ఎందుకంటే ప్రధాన కథకే ప్లాట్ పాయింట్స్ వుంటాయి. సబ్ ప్లాట్ కి వుండవు. అలాంటప్పుడు ఆ ప్రధాన కథని దృష్టిలో పెట్టుకునైనా ఇంకో ప్రధాన కథగా ప్రేమకథ చెప్పుకురాకూడదు. ‘స్వామిరారా’ లో ప్రధాన యాక్షన్ కథకి పోటీగా ప్రేమకథ నడపలేదు. అందులో రోమాన్స్ వుంటుంది గానీ అది ఆ యాక్షన్లో అంతర్లీనంగా వుండీ లేనట్టు వుంటుంది. ఈ రోజుల్లో  పూర్తి నిడివి ప్రేమ కథలెవరు చూస్తారు. సినిమాల్లో మూస ఫార్ములా ప్రేమలకి మించిన రియలిస్టిక్ ప్రేమలు షార్ట్ ఫిలిమ్స్ లో చూసేస్తున్నారు.

          ఈ కథకి నాల్గు పేజీల్లో మొదట సినాప్సిస్ రాసుకుని వుంటే అప్పుడే తెలిసిపోయేది- ఒకే సినిమాలో రెండు ప్రధాన కథలు చూపిస్తున్నానేంట్రా బాబూ అని. హీరోయిన్ తో ప్రేమ కథ- విలన్ తో యాక్షన్ కథ. మళ్ళీ ఇక్కడ తిరకాసు వుంది. విలన్ తో యాక్షన్ కథకీ ఠికానా  లేదు. ఎందుకంటే లైటర్ కోసం విలన్ కొడుకుని తన్నడం, ఆ తన్నిన హీరోని చంపాలని విలన్ పగబట్టడం యాక్షన్ కథకి చాలదు. ఇందుకే సినిమా చివరంటా విలన్ పెడబొబ్బలు పెట్టడం హాస్యాస్పదంగా మారిపోయింది. అదో కథే అన్పించక- కథకోసం వెతుక్కునే పనిలో విసిగిపోవడమే జరిగింది.


          ఇది ప్రేమకథ కాదనీ, విలన్ తో యాక్షన్ ప్రధాన కథ అనీ  గందరగోళాన్ని ఫిల్టర్ చేశాం. మళ్ళీ ఇక్కడ యాక్షన్ కథకి ఆ ప్లాట్ పాయింట్ -1 చాలదని పైన చెప్పుకున్నాం. అంటే ఆ ప్లాట్ పాయింట్ -1 యాక్షన్ కామెడీకి సరిపోతుందని అర్ధం. కాబట్టి ఫైనల్ గా ఈ సినిమా యాక్షన్ కామెడీ గానే వుండాలని తేలుతోంది. మెయిన్ విలన్ తప్ప అతడి ముఠా, సెకండ్ విలన్ సహా అతడి ముఠా చేసింది కూడా ఈ సినిమాలో కామెడీనే. 


          మరి అలాగైనా వుందా? లేదు. ఎందుకంటే ప్లాట్ పాయింట్ -1 దగ్గర గోల్ విలన్ కేర్పడింది. కనుక ఆ ప్లాట్ పాయుంట్- 1 లో ఉండే పైన చెప్పుకున్న ఆరు అంశాల్నీ- సరిదిద్ది హీరోకి ఆపాదిస్తూ గోల్ ని అతడికి ఏర్పాటు చేసినప్పుడు- చంపుతానని విలన్ పెడబొబ్బలు పెట్టినా నష్టం లేదు. మేనేజ్ చెయ్యొచ్చు. ఐతే అక్కడ లైటర్ స్థానం లో మరొకటుండాలి. హీరోయినే ఉండొచ్చు. హీరోయిన్ని పట్టుకోవడానికి రైలుదాకా వెంటాడి వచ్చిన భోజిరెడ్డి పెద్దకొడుకు అండ్ గ్యాంగ్ ని తన్ని హీరోయిన్ ని రక్షించవచ్చు హీరో. ఆ హీరోయిన్ భోజిరెడ్డి కూతురే అనుకుంటే హీరోని చంపాలన్న భోజిరెడ్డి పెడబొబ్బలకి అప్పుడు అర్ధంవుంటుంది. ఎందుకంటే అది గోల్ లా కాకుండా సహజమైన రియాక్షన్ కింద మారిపోతుంది గనుక. యాక్షన్ కి పాల్పడ్డ హీరోకి హీరోయిన్ ని కాపాడడం గోల్ అవుతుంది. అప్పుడీ గోల్ లో ఎమోషన్ గిమోషన్ వగైరాలన్నీ వచ్చి చొరబడి పోతాయి చక్కగా. కథకి జీవం కూడా వస్తుంది. 


          ఆ కూతురు (హీరోయిన్) ఇష్టం లేని పెళ్లిని తప్పించుకొస్తే ఆమెని హీరో కాపాడడమనే కథనం  ఈ సినిమా థీమ్ కి కూడా కనెక్ట్ అవుతుంది. అసలు థీమ్ ఏమిటి? అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇలాటి చిక్కుల్లోంచి కాపాడి ఇష్టపడిన పెళ్ళిళ్ళు చేసే హీరో కథేగా? మరి ఈ సినిమాలో విలన్ తో ప్రధాన కథలోగానీ, హీరోయిన్ తో ప్రేమ కథలోగానీ ఈ థీమ్ ఎక్కడ ప్రతిబింబించింది? థీమ్ ని పక్కకి తోసేసి ఒక పిచ్చి యాక్షన్ కథ, ఇంకో పిచ్చి ప్రేమకథ చెప్పుకొచ్చారే! ఇది కరెక్టే అనుకోవాలా?


          సినిమా క్లయిమాక్స్ దగ్గర చూపించిన హీరో గతం తాలూకు ( థీమ్  తాలూకు) ఆ సర్కిల్ ఆఫ్ బీయింగ్ ఎందుకని అర్ధం లేకుండా పోయిందంటే ఇందుకే! సినిమా సాంతం నడిపించిన యాక్షన్ కథకీ, ప్రేమకథకీ ఆ చూపించిన సర్కిల్ ఆఫ్ బీయింగ్ తో థీమాటిక్ కనెక్షన్ లేనందు వల్లే. ఎంత అనుభవమున్నా సినిమా కథ చాలా సులభం అనుకుంటే ఎలా? వొళ్ళు దగ్గర పెట్టుకుని నూటొక్క దిక్కుల్లోంచి పరికిస్తూంటే గానీ  ఓ మాదిరి కథ తయారవదు. ఇంకో చోట ఇలా ఉద్యోగం చేస్తే ఒక్క రోజు కూడా ఉంచరు. ఒకళ్ళు నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పుడు కుక్క చావు చావాల్సిందే అర్ధంపర్ధం వున్న కథ కోసం. అమెచ్యూరిష్ చేష్టలు పనికిరావు. పది పాత సినిమాలు పోగేసి రొడ్డ కొట్టుడు అరిగిపోయిన మూస ఫార్ములా కథ కూడా సవ్యంగా తయారుచేసుకో లేకపోతే ఇంకెందు కోసం ఫీల్డులో వుంటున్నట్టు?
***
        థీమ్ తో కనెక్ట్ కాకుండా కథెలా వుంటుంది. లంగరేయక పోతే యేటి వొడ్డున పడవ వుంటుందా? కాబట్టి  పైన చెప్పుకున్నట్టు ఆ విధంగా ప్లాట్ పాయుంట్- 1 దగ్గరే హీరోయిన్ని థీమ్ తో కనెక్ట్ చేసుకుంటే మొత్తం కథంతా ఏకత్రాటి పైకొచ్చేస్తుంది. ఈ సినిమాలో చూపించినట్టుగా అతుకుల బొంతలా విడివిడి మూడు (సర్కిల్ ఆఫ్ బీయింగ్ తో కలుపుకుని)   పురాణాల్లా వుండదు. 

          హీరోయిన్ తో పారిపోయినప్పుడు హీరో గోల్ ఆమె ఇష్టపడ్డ పెళ్లి చేయడమే. థీమాటిక్ మ్యాపుకి న్యాయం చేయడమే. ఈ క్రమంలో ఆమే అతణ్ణి ఇష్టపడొచ్చు.  దీన్ని పక్కన పెడితే, మొదట చంపడంగా వున్న విలన్ రియాక్షన్ సడలిపోతూ ఇంకేదో ప్రయోజనమాశించి హీరోతో సఖ్యతగా మారిపోవచ్చు. చివరి దాకా చంపుతాననే ఒకే ఘనీభవించిన రియాక్షన్ తో అతనుండిపోతే కథలో పస వుండదు, పైగా  యాక్షన్ కామెడీ అవదు. పరిస్థితి ఏకశిలా సదృశంగా ఉండిపోతే ఆత్మహత్యా సదృశమే యాక్షన్ కామెడీకి. విలన్ అనే వాడికి ఏ విలువలూ వుండవు. కూతురూ ప్రతిష్టా అనుకున్న వాడు కాస్తా ఇంకేవో తుచ్ఛ ప్రయోజనాలకోసం దిగజారి పోవచ్చు. వాటితో హీరోకి వల వేయడానికి ప్రయత్నించవచ్చు. హీరో కౌంటర్ ప్లానుతో అతణ్ణి ఇరికించి ఆడుకోవడం మొదలెట్టొచ్చు.

          సినిమాలో ఎలా చూపించారంటే, ప్లాట్ పాయింట్-1 దగ్గర పాసివ్ పాత్రగా ప్రాణప్రతిష్ట  చేసిన హీరోని  చివరంటా అలాగే నడిపించేశారు. అదెలా, ఇద్దరు విలన్ల గ్యాంగుల్నీ తంతూనే ఉన్నాడుగా అనొచ్చు. పాత్రచిత్రణలో తన్నడంలో తేడాలుంటాయి : వచ్చి మీద పడితే మాత్రమే ఆత్మరక్షణ చేసుకుంటూ తంతే పాసివ్ పాత్ర- తనే వెళ్లి వాళ్ళనే ఆత్మరక్షణలో పడేస్తూ తంతే యాక్టివ్ పాత్ర. ఈ తేడా తెలుసుకోకుండా ఏళ్ల తరబడీ యాక్షన్ సినిమాలు తీస్తూనే వున్నారు- పాసివ్ పాత్రలతో. వందల సార్లు వీటి గురించి రాస్తున్నా,  మళ్ళీ వారం వచ్చేసరికి ఇంకో పాసివ్ హీరోతో  ప్రతిష్టాత్మక సినిమా ప్రత్యక్షం. స్టార్లందరూ అంత బిల్డప్స్ తో నటిస్తున్నవి ఉత్త పాసివ్ పాత్రలు తప్ప మరేం కావు. 


          ఇలా మన హీరో గ్యాంగులు వచ్చి దాడి చేసినప్పుడే ఎదురుదాడి చేయడమనే  రియాక్టివ్ క్యారక్టర్ గా కొనసాగాడు తప్పితే- ఆ విలన్ తీసుకునే యాక్షన్ కి తన రియాక్షన్నే చూపిస్తూ పోయాడు తప్పితే- పరిస్థితిని తన చేతిలోకి తెచ్చుకుని, పైచేయిగా తనే యాక్షన్ తీసుకుని, విలన్ ని లాక్ చేసేసే కౌంటర్ ఆలోచన ఒక్కటీ చేయలేదు. పైగా పక్క పాత్రలు పొగుడుతూంటాయి హీరో బ్రెయిన్ పవర్ గురించి! 


          చిట్టచివరికి విలనే హీరోయిన్నెత్తుకుపోయి- హీరోని తనూరికి రప్పించుకుని పంచాయితీ పెట్టాల్సివచ్చింది! ఇదీ ఇంత భారీ సినిమాలో హీరో యాక్షన్ సైడ్ పాత్రచిత్రణ, రైటింగ్ సైడ్ నిర్వాకం. 


          ఇక హీరో ప్రేమ విషయానికొస్తే- ఈ ప్రేమేమిటి? ఇతనెలా ఇష్టం లేని హీరోయిన్ వెంట పడతాడు? థీమాటిక్ మ్యాప్ ఏమిటి? ఏ సర్కిల్ ఆఫ్ బీయింగ్ నుంచి, ఏ కమిట్ మెంట్ తో తను బయల్దేరాడు? ఇష్టపడ్డ  ప్రేమికుల పెళ్ళిళ్ళకి ఆటంకాలుండొద్దనే ఎజెండాతోనేగా చచ్చిపోయిన మిత్రుడి పేరు పెట్టుకుని? అలాంటప్పుడు  చివరిదాకా ఇష్టంలేని హీరోయిన్ని అలా వేధిస్తాడేమిటి? ప్రేక్షకులు అమాయకులనా?  హీరో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? క్యారక్టర్-  స్టోరీగీరీ ఏం పట్టించుకోకండి- నా ఇమేజి చూడండి- ఇమేజికి తగ్గట్టు హీరోయిన్ తో రోమాన్స్, సాంగ్స్, స్టె ప్పులూ, విలన్స్ తో ఫైట్స్ మాత్రమే చూసి, నా పెయిడ్ హాలీడేని ఎంజాయ్ చేయండనా?
***
         ప్రతిష్టాత్మకంగా తన సంస్థ ముప్ఫయ్యో వార్షికోత్సవానికి గుర్తుగా ఇంత భారీ సినిమాతో సీనియర్ నిర్మాత రవికిషోర్ ఇచ్చిన కొత్త అనుభూతి ఏమీ లేదు. అత్యవసరంగా ఆయన  ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. పైన చెప్పుకున్న కథాకథనాలకి, పాత్ర చిత్రణలకి తోడు- సినిమా మొదలవగానే హీరోతో ఒక సాహసం, ఆ వెంటనే ఒక గ్రూప్ సాంగ్, అదే కర్నూలు, అవే రౌడీల కుటుంబాలు, సినిమా చివర్లో ఒక ఫోక్ సాంగ్ అనే టెంప్లెట్ తోనే కొత్త దర్శకులూ, ఈ సినిమాలో అదేపనిగా క్లారిటీ, భయ్యా, బొంగేంకాదూ- అని అదే అనుకరణల టెంప్లెట్ మాటల రచయితలూ..రవికిషోర్ తీసే సినిమాలకి వన్నె చేకూర్చలేరు. తక్షణం ఆయన అప్రమత్తం కావాల్సి వుంటుంది.

-సికిందర్