రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 1, 2022

1139 : బుక్ రివ్యూ

        స్క్రీన్ ప్లే పుస్తకాల్లో థియరీ గురించే వుంటుందని  తెలిసిందే. ఈ థియరీకి  క్లాసిక్ సినిమాలే ఉదాహరణగా వుంటాయి తప్ప, థియరీ ప్రకారమే వుంటూ చాలా సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయో వుండదు. 100 అద్భుత చిత్రాలు, 50 స్వర్ణ యుగ సినిమాలంటూ థియరీని వివరించని పుస్తకాలూ ఓ పక్క రెగ్యులర్ గా వస్తూంటాయి. ఇవి సినిమా లవర్స్ కి తప్ప, మేకర్స్ కి ఏ మేరకు ఉపయోగ పడతాయో తెలీదు. సినిమాల్ని విశ్లేషించి, థియరీ ప్రకారమే ఇదిగో ఇందుకు హిట్టయ్యింది, ఇందుకు ఫ్లాపయ్యిందీ అంటూ మేకర్స్ కి ఉపయోగపడే పుస్తకాలు దాదాపూ దొరకవు. థియరీ రాయడం ఈజీ, వున్న అదే థియరీని తిరగేసి మడతేసి రాస్తే ఇంకో కొత్త పుస్తకమై పోతుంది. ఇలా ఇదొక మల్టీ మిలియన్ డాలర్ బిజినెస్ అయింది. కానీ స్క్రీన్ ప్లే ఎనాలిసిస్ రాయడం అంత తేలిక కాదు. అయితే స్క్రీన్ ప్లే ఎనాలిసిస్ తెలియకుండా మంచి మేకర్ కాలేరు. క్రియేటివ్ పవర్స్ సొంతమవవు. క్రియేటివ్ పవర్స్ అంటే - వూహా శక్తి, కల్పనా శక్తి, ఈ రెండిటితో ఒక రూపమిచ్చే సృజనాత్మక శక్తి  - ఒనగూడాలంటే విమర్శనాత్మక, విశ్లేషణాత్మక శక్తులు మొదట సమకూరాలి.

        ళ్ళీ ఇక్కడ విమర్శ వేరు, విశ్లేషణ వేరు. విమర్శించే వ్యక్తికి విశ్లేషణ వచ్చి వుండాలని లేదు. సినిమాలో ఏది ఎందుకు బాగాలేదో వివరించకుండా, బాగాలేదు అని విమర్శ రాసేసి వెళ్ళిపోతాడు. విమర్శలకి గురవుతాడు. విశ్లేషించే వ్యక్తి థియరీని దృష్టిలో పెట్టుకుని ఏది ఎందుకు బాగాలేదో, బావుందో చెప్తాడు. విమర్శకైనా విశ్లేషణకైనా థియరీ తెలిసి వుండాలి. ఎటు తిరిగీ థియరిస్టుల దగ్గరికే వస్తాం. థియరీ కేవలం స్ట్రక్చర్ చెప్తుంది. కానీ ఈ స్ట్రక్చర్ తో క్రియేటివిటీ తెలియకపోతే సినిమా ఏమవుతుంది? ఇది తెలుసుకోవడానికే ఈ పుస్తకాన్ని పరిచయం చేసుకుంటున్నాం...

        గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్ అన్న పుస్తకం 1998 లో వెలువడింది. సినిమా రచయితా, యూనివర్సిటీలో స్క్రీన్ ప్లే ప్రొఫెసరూ అయిన థామస్ పోప్ రాసిన ఈ పుస్తకం, 2005 లో మన దృష్టి కొచ్చింది. దీంతో మొట్ట మొదటిసారి ఎవ్వరూ చెప్పని ‘ఎండ్  సస్పెన్స్ కథల గుట్టు తెలిసింది. థియరీతో ఇది తెలియదు, సినిమాల విశ్లేషణతో తెలుస్తుంది. ఈ పుస్తకంలో వున్నది థామస్ పోప్ చేసిన సినిమా విశ్లేషణలే. ఇందులో హిట్టయిన, ఫ్లాపయిన 25 సినిమాల్ని గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్ గా విభజించి, గుట్టు మట్లు వివరించాడు. Learning the Craft of Screen writing Through 25 of  the BEST and WORST Films in History’ అన్నది పుస్తకం ఉప శీర్షిక.

        (మనం కూడా ఇలాటి పుస్తకమొకటి  రాయాలని ఉద్రేక పడ్డామప్పుడు. గుడ్ స్క్రిప్ట్స్ అనీ, బెస్ట్ ఫిలిమ్స్ అనీ పేరు పెట్టి రాస్తే ఫర్వాలేదు గానీ; మరీ బ్యాడ్ స్క్రిప్ట్స్ అనీ, వరస్ట్ ఫిలిమ్స్ అని కూడా తగిలించి పుస్తకమేస్తే ప్రాణాలు దక్కవని మానుకున్నాం).

        257 పేజీల ఈ పుస్తకం రెండు భాగాలుగా వుంది : స్ట్రక్చర్ పరంగా,క్యారక్టర్ పరంగా. ఒక్కో సినిమా బావుండడానికైనా, లేకపోవడానికైనా, కారణమైన క్రియేటివ్ అభివ్యక్తి ఎలా పని చేసిందో విస్పష్టంగా పొందుపర్చి వుంది. ఫ్లాష్ బ్యాక్స్ కథనమనే క్రియేటివ్ అభివ్యక్తితో సిటిజన్ కేన్’, స్ట్రక్చర్ పునరావిష్కరణకి పల్ప్ ఫిక్షన్’, తప్పుడు సెకండ్ యాక్ట్ కి ది జివెల్ ఆఫ్ ది నైల్’, సెకండ్ యాక్ట్ లో పాసివ్ విలన్ పాత్రకి పిజ్జీస్ ఆనర్’, విలన్ గా యాంటీ హీరోకి కాసా బ్లాంకా’, హీరోగా విలన్ కి ది డే ఆఫ్ ది జాకాల్’…  ఇలా 25 సినిమాల విశ్లేషణతో స్క్రీన్ ప్లే రచన భోదించడం వుంది.  అవసరమైన చోట్ల వన్ లైన్ ఆర్డర్ తో వివరించడం కూడా వుంది.       

        సినిమా విజయానికి అందరూ బాధ్యులే. పరాజయానికి మాత్రం ఎవరూ బాధ్యత తీసుకోరు. దర్శకుడి ఖాతాలో పడేసి పోతారు. ఆ దర్శకుడికి రెండేళ్ళూ ఇంకో సినిమా వుండదు. మిగిలిన వాళ్ళు అవకాశాలతో ముందు కెళ్ళి పోతారు. అయితే కర్మ ఫలం తప్పదని, దర్శకుణ్ణి బాధ్యుడుగా చేసిన వాళ్ళూ అనుభవిస్తారనీ తెలిపే దృష్టాంతాలుంటాయి. ఇలా ఒక సినిమా స్క్రిప్టు తయారవడానికి ముందూ తర్వాతా జరిగే సంగతులు కూడా పుస్తకంలో వినోదాన్ని అందిస్తాయి. కథ వెనుక కథ ఏం జరిగిందో ఇంటర్వ్యూలు కూడా చేసి ఈ విశ్లేషణలు చేశాడు రచయిత.

        పాసివ్ పాత్రలు, పాసివ్ యాక్టివ్ పాత్రలు, సెకండాఫ్ సిండ్రోములు, మిడిల్ మటాషులు, ఎండ్ సస్పెన్సులు, పాత్ర చిత్రణ లోపాలూ  వంటి ఎన్నో సమస్యలు స్ట్రక్చర్ థియరీ నేర్చుకుంటే తెలీవు. ఇవి స్ట్రక్చర్ కి లోబడి కథ నడిపే నేర్పుకి సంబంధించిన సమస్యలు. క్రియేటివిటీ సమస్యలు. క్రియేటివిటీ కార్యకారణ సంబంధంతో వుంటుంది. ఇలా అనుకుని రాస్తే, అలా జరుగుతుంది, అలా జరిగితే అది ఇలా జరగడానికి కారణమవుతుందనే యాక్షన్ రియాక్షన్ల పరంపరతో కథనం సాగిపోతూ వుంటుంది. కారణం సరైనదైతే కార్యం సవ్యంగా వుంటుంది. లేకపోతే అపసవ్యంగా మారి మరిన్ని అపసవ్యాల్ని సృష్టిస్తుంది. ఇవన్నీ ఈ పుస్తకం చదివితే తెలుస్తాయి. ఏం చేయవచ్చో, ఏం చేయకుండా జాగ్రత్త పడొచ్చో తెలుసుకోవడానికి ఈ పుస్తకం మంచి రిఫరెన్సుగా వుంటుంది.

        పుస్తకం అమెజాన్లో వుంది. ధర రూ 4,342. 00 పైసలు అని వుంది. ఈఎంఐ లు కూడా వున్నాయట. ఈపాటికి హార్ట్ స్ట్రోకు వచ్చేసి వుంటుందని తెలుసు. పీడీఎఫ్ లింకులున్నాయి, నిర్భయంగా వుండొచ్చు. 2005 లో పంజాగుట్టలో బాంబే నుంచి వచ్చి పెట్టిన బుక్ ఎగ్జిబిషన్లో 500 రూపాయలకి దొరికింది.

—సికిందర్