రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, జూన్ 2016, శనివారం

షార్ట్ రివ్యూ!

రచన- దర్శకత్వం : రాజసింహ 
తారాగణం: సందీప్‌ కిషన్‌, నిత్యామీనన్‌, రవికిషన్‌, రాహుల్ దేవ్, అలీ, నళిని, అజయ్‌, రోహిణి, సప్తగిరి, పృధ్వీ, తాగుబోతు రమేష్‌, ఝాన్సీ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
బ్యానర్‌: అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌, నిర్మాత: భోగాది అంజిరెడ్డి
విడుదల :  జూన్‌ 10, 2016
***
     ఒక్క హిట్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న సందీప్ కిషన్ మళ్ళీ ప్రయోగాలబట్టి ‘ఒక్క అమ్మాయి తప్ప’ లో నటించాడు. మొన్నే ‘రన్’ అనే ప్రయోగాత్మకంలో నటించి విఫలమయ్యాడు. ప్రస్తుత ప్రయత్నం తెలుగు సినిమాల్లో ఇంతవరకూ ఎవరూ చేయని సాహస ప్రయోగమే నిజానికి. తెలుగు సినిమాల్ని మూస నుంచి కమర్షియల్ గా కొత్త బాట పట్టించే ప్రయోగాలు తప్పకుండా  జరగాల్సిందే. కొత్త దర్శకుడు రాజసింహ ఈ కొత్త ప్రయోగం చేస్తూ వీలైనన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ప్రవేశపెట్టాడు. దర్శకుడి విజన్ ని  పూర్తిగా నమ్మిన సందీప్ కిషన్ పారితోషికాన్నికూడా  త్యాగం చేసి, ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ తో కలిసి నటించాడు. మరైతే ఈ త్యాగం, దర్శకుడి విజన్ ఏమైనా సార్ధకమయ్యాయా లేక షరామామూలు బాక్సాఫీసు తిరస్కరణకి గురయ్యాయా ఓసారి చూద్దాం... 

కథ 
      కృష్ణ వచన్ (సందీప్ కిషన్)  రెండో తరగతి చదివేటప్పుడు క్లాస్ మేట్ మ్యాంగో (నిత్యామీనన్) ని ప్రేమిస్తాడు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆమెకు జాతీయ పతాకం అందిస్తూ పెళ్లి చేసుకుంటానని ప్రామీస్ చేస్తాడు (పుట్టే పిల్లల గురించికూడా మాట్లా డేస్తాడు- ఏమంటే వీడి మాటల్ని కామెడీగా తీసుకుని మనం నవ్వాలి!). ఆమె తిప్పి కొట్టేస్తుంది. పెద్దయ్యాక వచన్ కి చదువు నచ్చక కాలేజీ మానేసి, పేకాటలో ఆరితేరతాడు. జీవితంలో గెలవాలంటే మ్యానిపులేషన్స్ కాదనీ, క్యాలిక్యులేషన్స్ అవసరమనీ చెప్తూంటాడు(ఆవారా హీరోల పాత్రలు ఇలాగే  గాలి కొటేషన్లు చెప్తూంటాయి). ఒకరోజు ఏదో పనిమీద బైక్ మీద వెళ్తూంటే ఫ్లై ఓవర్ మీద రెండు లారీలు గుద్దుకుని ట్రాఫిక్ జామ్ అయి అందులో చిక్కుకుంటాడు. ఒక షేర్ ఆటోలో ప్రయాణిస్తున్న మ్యాంగో కూడా ఆ జామ్ లో చిక్కుకుంటుంది. ఆమె చిన్నప్పటి మ్యాంగో అని తెలీక టీజ్ చేస్తాడు వచన్. ఈ ట్రాఫిక్ జామ్ ని కావాలనే  అన్వర్(రవికిషన్)  అనే హైటెక్ టెర్రరిస్టు సృష్టిస్తాడు. అక్కడ పెట్టిన బాంబుల్ని పేల్చేస్తానని బెదిరించి జైల్లో వున్న ఇంకో టెర్రరిస్టు అస్లం ఖాన్(రాహుల్ దేవ్) ని విడుదల చేయించుకోవాలని పథకం వేస్తాడు. అయితే బాంబులకి కనెక్షన్స్ ఇవ్వడానికి పంపించిన అనుచరుడు మాయమవడంతో అయోమయంలో పడ్డ అన్వర్, ఫ్లై ఓవర్ మీద చిక్కుకున్న వచన్ ని టార్గెట్ చేసి ఆ పని అతడితో చేయించుకోవాలనుకుంటాడు. దూరంగా బిల్డింగ్ లోంచి ఈ పథకం వేస్తున్న అతను- ఆటోలో వున్న మ్యాంగో మీద టెలిస్కోపిక్ రైఫిల్ ని గురిపెట్టి బెదిరిస్తూ, వచన్ ని లొంగ దీసుకుంటాడు. 

        ఇదీ విషయం. ఇప్పుడు వచన్ ఏం చేశాడు? అన్వర్ బెదిరింపులకి లొంగిపోయిన తను అతను  చెప్పినట్టే చేశాడా? మ్యాంగో తన చిన్ననాటి లవర్ అని ఎప్పుడు తెలుసుకున్నాడు? ప్రమాదంలో వున్న ఆమె ప్రాణాలనీ,  మిగతా ప్రజల ప్రాణాలనీ  ఎలా కాపాడాడు? చివరికేమైంది? ఇవన్నీ వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిన  విషయాలు.

ఎలావుంది కథ
     ర్శకుడు రాజసింహ కొన్నేళ్ళ పాటు ఈ కథ పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాననీ, అప్పట్లో ఎవరికీ నచ్చలేదనీ  చెప్పుకున్నాడు. 1960 లో ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కి రైటర్ లారీ కోహెన్ ఓ కథ చెప్పాడు. ఐడియా  బాగానే వుంది గానీ దీన్నెలా తీయాలబ్బా అని సందేహంలో పడ్డాడు హిచ్ కాక్. దర్శకుడు రాజసింహ నాల్గేళ్ళ  క్రితం హీరో సందీప్ కిషన్ కి ఇదే కథ చెప్పి ఒప్పించానని చెప్పుకున్నాడు. రైటర్ లారీ కోహెన్ చివరికి 1990లలో తన కథకి ఒక తుపాకీ గురిపెట్టిన విలన్ ని సృష్టిస్తే అప్పడు కథ దారిలో పడింది. రాజసింహ తన సినిమాకి అదే తుపాకీ గురిపెట్టిన  విలన్ ని పెట్టుకున్నాడు. రైటర్ లారీ కోహెన్ స్క్రిప్టు చివరికి 2002 లో తెరకెక్కింది. రాజసింహ సినిమా చివరికి 2016 లో తెరకెక్కింది. లారీ కోహెన్ సినిమా వచ్చేసి  ‘ఫోన్ బూత్’ అయితే, రాజసింహ సినిమా వచ్చేసి ‘ఒక్క అమ్మాయి తప్ప’. లారీ కోహెన్ ఒరిజినల్ ఐడియాని పట్టుకుని 42 ఏళ్ల పాటూ శ్రమిస్తే, లారీకోహెన్ ఐడియాని చప్పున కాపీ కొట్టేసిన రాజసింహ పన్నెండేళ్ళ పాటూ నిర్మాతల చుట్టూ తిరగడానికి పరిశ్రమించాడు. ఐతే కాపీలూ లీకులూ ఒకరితో ఆగవు. అవి పవిత్ర తీర్ధ జలాలు, అలా ప్రవహిస్తూనే వుంటాయి. రాజసింహ కథలో టెర్రరిజం పార్టు కొంచెం మార్పులతో ఉన్నదున్నట్టు మొత్తం ఇంకో కొత్త నిర్మాత దగ్గర ఫైలు సిద్ధంగా వుంది, ఆయన దానితో పరిశ్రమిస్తున్నాడు. దాంతో ఎటూ తెగక అదృష్టవశాత్తూ ఈ వ్యాసకర్త ఆయన పరిశ్రమలో పాలుపంచుకోవడం మానేసి తప్పించుకున్నాడు! కొన్ని మిరకిల్స్ ఇలా జరుగుతూంటాయి...

        ప్రేమ- టెర్రరిజం సజాతి కమర్షియల్ జానర్లే. టెర్రరిస్టు కోరిక థ్రిల్లింగ్ పాయింటే. కాకపోతే ఈ ఐడియాని అమలు పరచడానికి దర్శకుడు ‘బర్నింగ్ ట్రైన్’ అనే హిందీ, ‘ట వరింగ్ ఇన్ ఫెర్నో’  అనే హలీవుడ్ డిజాస్టర్ మూవీస్ కూడా చూసివుంటే ఒక మంచి అవగాహన ఏర్పడేది. ‘ఫోన్ బూత్’  ఐడియా చాలా చిన్నది. అదో పర్సనల్ కథ. ఫోన్ బూత్ కి  ఫోన్ చేయడాని కెళ్ళిన  హీరోకి అక్కడే ఓ కాల్ వస్తుంది. అతను భార్య కళ్లుగప్పి సాగిస్తున్న రహస్యప్రేమాయణం గురించి విలన్ చెప్పి- ఈ దాగుడు మూతల్ని ఇద్దరికీ ఓపెన్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు, రహస్యంగా టెలిస్కోపిక్ రైఫిల్ తో కనిపెడుతూ. ఈ విలన్ అనైతిక ప్రవర్తనలని సహించడు.  ఇప్పడు హీరో కుటుంబ జీవితం, రంకు జీవితం, సొంత ప్రాణాలూ ఏమయ్యాయనేదే కథ. 

        రాజసింహకి హిచ్ కాక్ కంటే  బ్రహ్మాండమైన ఐడియా వచ్చి ఈ కథ ఫ్లై ఓవర్ కెక్కింది. సువిశాలమైంది. తను హేండిల్ చేయలేనంత విశ్వరూపం ధరించింది. ముప్పాతిక వంతు సినిమా ఫ్లై ఓవర్ మీద అనే కాన్సెప్టు వరకూ ఆహ్వానించదగ్గదే, దీన్ని అమలు పర్చేసరికి కాన్సెప్టు చెల్లా చెదురయ్యింది.  కారణం స్క్రీన్ ప్లేనే!

ఎవరెలా చేశారు
       సందీప్ కిషన్ దురదృష్ట మేమిటో గానీ నటించగల శక్తి వున్నతనకి, ఫాలోయింగ్ కూడా వున్న తనకి సినిమాలు హేండిచ్చేస్తున్నాయి. నటన అంటే పాత్రే  కాదనీ, పాత్ర చిత్రణ కూడాననీ గ్రహిస్తే ఈ తిప్పలు తప్పుతాయేమో.  గెలవాలంటే మ్యానిపులేషన్స్ కాదనీ, క్యాలిక్యులేషన్స్ అవసరమనీ చెప్పుకున్న తన పాత్రే,  విలన్ మ్యానిపులేషన్ ని తన క్యాలిక్యులేషన్ తో తిప్పికొట్ట గల అవకాశమున్నా బేలగా మిగిలిపోవడం నటన అన్పించుకోకపోగా,  ఆ నటన పేలవంగా,  అర్ధరహితంగా వుంటుంది. తను విలన్ చెప్పినట్టు బాంబులకి కనెక్షన్ ఇవ్వకముందు జరిగే బోలెడు డ్రామాలో,  నిత్యామీనన్ ని అటు పక్కనుంచి ఆటో దింపేసి తీసికెళ్ళి పోయుంటే విలన్ చేసేదేమీ వుండదు. 

        నిత్యా మీనన్ కి షేర్ ఆటోలో కూర్చుని డైలాగులు చెప్పడం, డ్రీమ్ సాంగులేసుకోవడం తప్ప చేయడానికేమీ లేకుండా పోయింది. బాగా విర్రవీగి నటించింది మాత్రం టెర్రరిస్టు పాత్రలో రవికిషనే. రాహుల్ దేవ్ జైలుకి పరిమిత మైపోయాడు. కమెడియన్లు అలీ, సప్తగిరి, తాగుబోతు, ధన రాజ్, వేణు, ఫిష్ వెంకట్ లు- ఫ్లై ఓవర్ యాక్షన్ మధ్య మధ్యమ్  అకస్మాత్తుగా వూడిపడి కామెడీలు  చేస్తూంటారు. ఈ కామెడీల్ని విడిగా ఎంజాయ్ చేయగలమేమో గానీ,అర్ధం లేకుండా ఫ్లై  ఓవర్ డ్రామా లోకి జొరబడుతూంటేనే ఇబ్బంది. 

        ఈ సినిమాకి అసలైన హీరో సందీప్ కిషన్ మేనమామ ఛోటా కె. నాయుడు. తన కెమెరా వర్క్ తో నాయుడు ఇంకో మెట్టు పైకెక్కారు. తెలుగు సినిమాకి- అందునా ఓ థ్రిల్లర్ కి-  ఇంత క్వాలిటీ విజువల్స్, దానికి మళ్ళీ  వరల్డ్ క్లాస్ డీఐ కూడా ఇవ్వడం ఇదే ప్రథమం. ఆద్యంతం కళ్ళప్ప గించి చూసేలా చేసి,  ఈ సినిమాలో అన్ని లాజిక్ పరమైన లోపాలనీ మటుమాయం చేయగల్గిన మంత్రజాలం ఆయనదే. అయినా అంతిమంగా ప్రతికూల ప్రభావాన్నే  ఈ సినిమా చవి చూసిందంటే ప్రధాన కారణం స్క్రీన్ ప్లేనే. 

చివరికేమిటి
     క్కడో చూసి తను రాసుకున్నదే వేదం అనుకోకుండా కొత్త దర్శకుడు రాజసింహ కాస్త స్క్రీన్ ప్లే మీద కూడా రీసెర్చి చేసుకోవాల్సింది. ఫ్లై ఓవర్ మీద మందిని పోగేసి ‘ఫోన్ బూత్’ ఐడియాని అమలు చేసే ముందు- ఆ మందిని పోగేసే క్రమం ఎలా వుంటుందో, ప్రమాద ఘంటికలు ఎప్పుడు మోగుతాయో ఆ టైమింగ్ ని తెలుసుకోవాల్సింది- ‘బర్నింగ్ ట్రైన్’, ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’, ఆఖరికి ‘టైటానిక్’ కూడా చూసి! 

        ‘బర్నింగ్ ట్రైన్’ లో జరగబోయే ప్రమాదం ప్రేక్షకులకి కూడా ముందు తెలీదు. ఈ మల్టీ స్టారర్ లో  ఒకరొకరే స్టార్లు  ట్రైన్ ఎక్కడం, వాళ్ళ పలకరింపులు, పరిచయాలు, జీవితాలు, ప్రేమలు, పాటలూ ఇవన్నీ స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగపు బిజినెస్  కింద పూర్తయ్యాక, ప్రయాణిస్తున్న ట్రైను ట్రైను బ్రేకులూడదీసి బాంబులు పెట్టారని తెలుస్తుంది. ఇలా మిడిల్ విభాగం ప్రారంభమవుతుంది. ఇక బిగినింగ్ విభాగంలో చూపించిన బిజినెస్ తాలూకు అంశాలేవీ ఇక్కడ అడ్డుపడవు. మిడిల్ అంటే సంఘర్షణే  కాబట్టి పాత్రలన్నీ ప్రమాదంలో పడ్డ ప్రయాణంతో రకరకాలుగా సంఘర్షించడమే మొదలెడతాయి. హేమా హేమీలతో ఈ హిట్ ని 1979 లో బీఆర్ చోప్రా నిర్మించారు.  

         ‘ది టవరింగ్ ఇన్ ఫెర్నో’  లో ఒక 135 అంతస్తుల ఆకాశహార్మ్యం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆహ్వానితులందరూ రావడం మొదలెడతారు. ‘బర్నింగ్ ట్రైన్’ లో లాంటి బిగినింగ్ విభాగపు బిజినెస్సే వుంటుంది. గంట సేపటి తర్వాత అగ్నిప్రమాదం సంభవించి మిడిల్ విభాగంలో పడుతుంది కథ. ఇక అప్పుడు ప్రాణాలకోసం అందరూ సంఘర్షించడమే వుంటుంది. హేమాహేమీలతో 1974 లో తీసిన దీనికి ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు నామినేషన్ దక్కింది. ఇతర విభాగాలో ఐదు ఆస్కార్ అవార్డులు సాధించింది. 

        ‘టైటానిక్’ కూడా ప్రేమకథ ఎష్టాబ్లిష్ అయ్యాకే(బిగినింగ్ విభాగం) నౌక ప్రమాదంలో పడుతుంది. 

        రాజసింహ స్క్రీన్ ప్లేకి ఇలాటి అంక విభజన లేదు. బిగినింగ్, మిడిల్ కలగాపులగమైపోయాయి. మిడిల్ విభాగంలో ఓపెన్ చేయాల్సిన కుట్రకి సన్నాహాల్ని బిగినింగ్ లో హీరో ప్రేమని ఎస్టాబ్లిష్ చేస్తున్న బిజినెస్ తో కలిపేశారు. కామెడీలూ గీమిడీలూ అన్నీ ఇష్టారాజ్యం చేశాయి ఎక్కడబడితే అక్కడ. దీంతో స్క్రీన్ ప్లేకి వుండే విభాగాలూ,  వాటిలో వేటికవి జరగాల్సిన బిజినెస్సులూ  దర్శకుడికి తెలియవేమో అన్న సందేహాలేర్పడ్డాయి.

        శుభ్రంగా  బిగినింగ్ ని ప్రారంభించి అందులో హీరో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్, ఆతర్వాత హీరోయిన్ పరిచయం, ఆమెతో ట్రాకు, ఇద్దరూ పరస్పరం గుర్తించుకుని ప్రేమలో పడ్డం, ఇతర కమెడియన్ల ట్రాకులూ వగైరా  నడిపి- ఓ శుభోదయాన ఎవరి పనులమీద వాళ్ళు, ఇంకా ఆ ప్రయాణంలో మరి కొన్ని కొత్త పాత్రలూ కలిసి వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా  ఫ్లై ఓవర్ మీద లారీలు గుద్దుకుని ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో,  మొత్తం పరిచయం చేసిన పాత్రలన్నీ అందులో చిక్కుకోవడంతో బిగినింగ్ విభాగాన్ని ముగిస్తే సరిపోయేది. 

        ఇప్పుడు మిడిల్ ని ప్రారంభిస్తూ అసలా లారీలతో ప్రమాదాన్ని  విలన్ సృష్టించాడని ఓపెన్ చేస్తూ,  వాడి అసలు కుట్రని బయటపెడితే  ఈ ట్విస్ట్  షాకింగ్ గా  వుండి - మిడిల్ లో పాత్రల పరిచయాలూ, ప్రేమ ట్రాకులూ, ఇంకే కాలక్షేప కామెడీలూ లేకుండా పాయింటుతో ఏకత్రాటి పైకొచ్చేసేది కథ. ప్రమాదంలో పడ్డాక ‘టైటానిక్’ లో ప్రేమ కథ ఎలా సాగిందో చూసుకోవచ్చు. అగ్ని ప్రమాదం సంభవించాక ఒకటి కాదు, ఐదు ప్రేమ కథలూ ఎలా కొనసాగాయో ‘ది టవరింగ్ ఇన్ ఫెర్నో’లో పరిశీలించుకోవచ్చు. 

        పరిశీలన లేకుండా తోచినట్టూ రాసేసుకుంటే అది స్క్రీన్ ప్లే అవదు, దానికి ప్రేక్షకులు దాసోహం కారు!

-సికిందర్ 
http://www.cinemabazaar.in/