రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, April 13, 2022

1156 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : నెల్సన్
తారాగణం : విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగిబాబు, అంకుర్ అజిత్ వికల్, రెడిన్ కింగ్స్లే తదితరులు
సంగీతం అనిరుధ్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
బ్యానర్ : సన్ పిక్చర్స్
నిర్మాత : కళానిధి మారన్
విడుదల : ఏప్రెల్ 13, 2022

        ళయ దళపతి విజయ్ పానిండియా మాస్టర్ తర్వాత మరో పానిండియాగా బీస్ట్ దేశ విదేశ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ఒరిజినల్ దర్శకుడు మురుగదాస్ పారితోషికం తగ్గించుకోని కారణాన వూస్టింగ్ అయి, అతడి స్థానంలో దర్శకుడుగా నెల్సన్ బాధ్యతలు చేపట్టాడు. తమిళనాడులో విజయ్ సినిమాలు వరుసగా హిట్టవుతూ వచ్చాయి. అయితే పానిండియా విడుదలగా మాస్టర్ విఫలమైంది. ఇతర తమిళ పానిండియాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీస్ట్ పానిండియా తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదలై  గ్లోబల్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందివిజయ్ మాస్టర్ సహా ఇటీవల అజిత్ పానిండియా వలిమై’, సూర్య పానిండియా ఈటీ తమిళనాడులో మాత్రమే హిట్టయ్యాయి. హద్దులు మీరిన తమిళతనంతో తమిళ ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించే అత్యుత్సాహానికి పోయి, పానిండియా హోదా కోల్పోతున్న తమిళ బిగ్ బడ్జెట్ సినిమాల సరసన ఇప్పుడు బీస్ట్ కూడా నిలబడదు కదా?ఈ విషయం తెలుసుకోవడానికి ముందుకెళ్దాం...

కథ

రా లో సీనియర్ ఫీల్డ్ ఆపరేటివ్ వీర రాఘవన్ (విజయ్). ఇతను రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఒక ఆపరేషన్ చేపట్టి ఉమర్ ఫరూఖ్ అనే టెర్రరిస్టుని పట్టుకుంటాడు. ఈ క్రమంలో డిపార్ట్ మెంట్లో ఒకడు కావాలని ఇచ్చిన తప్పుడు సమాచారంతో  పొరపాటున ఓ బాలిక వీర చేతిలో చనిపోతుంది. ఈ బాధ తట్టుకోలేక ఉద్యోగానికి దూరమవుతాడు. కొన్ని నెలలు గడిచిపోతాయి.

        ఒక పార్టీలో ప్రీతి (పూజా హెగ్డే) పరిచయమై వెంటనే ప్రేమలో పడుతుంది. ఈమె ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేస్తూంటుంది.  ఒక రోజు వీర ఈమెతో ఒక మాల్ లో వున్నప్పుడు, ఆ మాల్ ని ఐఎస్ఎస్ తీవ్రవాదులు ముట్టడించి జనాల్ని బందీలుగా పట్టుకుని, తమ నాయకుడు ఉమర్ ఫరూఖ్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు.      

దీంతో ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరపడానికి అల్తాఫ్ హుస్సేన్ (సెల్వ  రాఘవన్) అనే అధికారి వస్తాడు. మాల్ లో వీర వున్నాడని తెలుసుకుని అతడ్ని అభ్యర్ధిస్తాడు. మరోవైపు తీవ్రవాదులకి నాయకత్వం వహిస్తున్న ఉమర్ సైఫ్ (అంకుర్ అజిత్ వికల్) తో బేరసారాలు మొదలు పెడతాడు. ఇందులో కేంద్ర హోమ్ మంత్రి ఉమర్ సైఫ్ తో కుమ్మక్కై వుంటాడు ప్రధాన మంత్రి పదవి కోసం. ఇప్పుడు వీర ఏం చేశాడు? తీవ్రవాదుల్ని ఎలా ఎదుర్కొని బందీల్ని విడిపించాడు? హోమ్ మంత్రి కుట్రని ఎలా బట్టబయలు చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది మరో హాస్టేజ్ డ్రామా జానర్ కథ. ఈ ఏప్రెల్ ఫస్టునే జాన్ అబ్రహాం తో ఇలాటిదే ఎటాక్ చూశాం. ఇందులో ఎలాగైతే అంత సీను లేని టెర్రరిజానికి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సూపర్ సోల్జర్ బిల్డప్ తో జాన్ అబ్రహాం విరుచుకుపడి విఫలమయ్యాడో, అలా ఇప్పుడు విజయ్ కూడా డమ్మీ టెర్రరిస్టుల మీద బీస్ట్ నంటూ భారీ బిల్డప్పులతో మీద పడి విఫలమయ్యాడు. సూపర్ సోల్జర్లూ, బీస్టులూ పరాక్రమించడానికి అక్కడ అంత పరిస్థితి డిమాండేమీ చేయడం లేదు.

        పైగా టెర్రరిస్టులతో ఈ హాస్టేజ్ డ్రామాని కామెడీ చేశాడు దర్శకుడు నెల్సన్. శివ కార్తికేయన్ తో తను తీసిన  డాక్టర్ డార్క్ కామెడీ తో హిట్టవడంతో అదే డార్క్ కామెడీ ఫార్ములాని ఇక్కడా ప్రయోగించాడు. దీంతో అభాసుపాలైంది కథ. హాస్టేజ్ డ్రామాకి కామెడీ పనికి రాదని ఓ 150 కోట్ల  రూపాయలు ఖర్చు పెట్టి చూసుకుంటే గానీ తెలియలేదు.    హాస్టేజ్ డ్రామా జానర్ మర్యాదలు కొన్ని వుంటాయి. అవి తప్పితే కనీస మర్యాద కూడా లేని రేటింగ్ కి సిద్ధపడాల్సిందే.

నటనలు- సాంకేతికాలు 

అవతల ఘోస్ట్ వుంటే తను బీస్ట్ గా వున్నప్పుడు విజయ్ పాత్రకి అర్ధం పర్ధం వుంటుంది. అతి బలహీన డమ్మీ టెర్రరిస్టు విలన్ కోసం తను బీస్ట్ కానవసరం లేదు. ఈ అసమాన ఈక్వేషనే విజయ్ పాత్ర బలాన్ని పూర్వపక్షం చేసింది. ఈ పాత్రని చాలా స్టైలిష్ గా, గ్రాండ్ గా, వీరాభిమానులు విర్ర వీగేలా నటించాడు.

        కాకపోతే సరైన విలన్ లేకపోవడంతో ఏకపాత్రాభినయంలా వుంటుంది. ప్రారంభ దృశ్యాల్లో పదిహేను నిమిషాల పాటు సాగే యాక్షన్ - ఆపరేషన్లో బాలిక పాత్ర వల్ల పెల్లుబికిన  హ్యూమన్ డ్రామా విజయ్ పాత్రని పతాక స్థాయిలో నిలబెడుతుంది. ఈ ఓపెనింగ్ ఇమేజి ఈ మధ్య వచ్చిన యాక్షన్ సినిమాలన్నిటిలో గొప్పదని చెప్పుకోవచ్చు.       

ఆ తర్వాత కథలో కొస్తే ఈ హ్యూమన్ డ్రామా, పతాక స్థాయి పాత్రా అర్ధం పర్ధం లేని హాస్టేజ్ డ్రామా పాలబడి పలచనై- చులకనై-వికలమై  పోయాయి. తన ఇళయ దళపతి ఇమేజి ఏం చేసీ ఇక సినిమాని కాపాడలేకపోయింది. అఫ్ కోర్స్, తమిళనాట హిట్ చేసేస్తారు వీరాభిమానులు. పానిండియా ఆశలు మాత్రం వదులుకోవాల్సిందే.

        పూజా హెగ్డే వుందంటే వుంది. ఎక్కడుందో గుర్తుకొచ్చి అప్పుడప్పుడు వెతుక్కుంటే బందీల సమూహంలో ఎక్కడో కన్పిస్తుంది. బందీగా చిక్కుకుపోవడంతో సినిమా మొత్తం వుండాల్సి వచ్చింది గానీ, లేకపోతే ఫస్టాఫ్ ఓ పాటా, రెండు రోమాంటిక్ సీన్లుచేసి వెళ్ళిపోవాల్సిన పని. బందీగా ఫుల్ లెన్త్ వుండమని ఆమెకి మూడున్నర కోట్లు ఇచ్చారు. మంచి బేరమే.

        హీరో హీరోయిన్లు ఏమో గానీ, ఈ సినిమాలో గ్రేట్ నటనలు చేసింది సెల్వ రాఘవన్, వీటీవీ గణేష్ ఇద్దరే. వీళ్ళిద్దరి సహజత్వానికి, కొత్తగా నవ్వించగల శక్తికీ మార్కులిచ్చుకోవాల్సిందే. అల్తాఫ్ హుస్సేన్ గా సెల్వ రాఘవన్, సెక్యూరీటీ ఏజెన్సీ ఓనర్ గా గణేష్ కథ కాని ఈ కథ నుంచి కొంతైనా రిలీఫే. కమెడియన్ యోగిబాబుకి మాత్రం కామెడీ కుదర్లేదు. ఇక టెర్రరిస్టుల లీడర్ గా అంకుర్ అజిత్ వికల్ మెత్తటి మనిషి పాత్రలేస్తే బావుంటాడు. మెత్తటి మనుషులుగా వున్న టెర్రరిస్టుల క్యాంపుని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చీట్ చేసి, ఎక్కడో జార్జియాలో చిత్రీకరించారు. మెత్తటి మనుషులైన టెర్రరిస్టుల్ని చూపించడానికి జార్జియా దాకా వెళ్ళి సెట్ వేయడం అవసరమా? టెర్రరిజం సినిమాలకి అమ్రిష్ పురి లాంటి విలన్లు దొరకడం లేదేమో. టెర్రరిస్టులతో బాటే వాళ్ళూ దేశంలో లేకుండా వెళ్ళి పోయి వుంటారా?

        రిచ్ క్వాలిటీ మేకింగ్, అదిరిపోయే విజువల్స్, ఔట్ డోర్ లొకేషన్స్, టాప్ యాక్షన్ సీన్స్, కాస్ట్యూమ్స్, అనిరుధ్ మ్యూజిక్, సీజీ ... ఇలా సాంకేతికాలు గొప్పవే. హాస్యప్రియుడైన దర్శకుడి ఆపుకోలేని కామెడీతోనే సమస్య. వేళాకోళమైంది సీరియస్ సబ్జెక్టు.

చివరికేమిటి 

దర్శకుడు నెల్సన్  హాస్యప్రియత్వపు జోరుతో  'దేవదాసు' తీసినా కామెడీగానే వుండేలా వుంది. 'బీస్ట్' లో చాలా ఫన్నీ డైలాగులు రాశాడు. చాలా చోట్ల నవ్వకుండా వుండలేం. అయితే కథ విడిచి కామెడీతో, నిర్మాణ విలువలతో సాము చేస్తే కథకే మోసం వస్తుంది. కేవలం కామెడీలూ, నిర్మాణ విలువలూ సినిమాని నిలబెట్టలేవు. ఫస్టాఫ్ ఓపెనింగ్ యాక్షన్, తర్వాత లవ్ ట్రాక్, ఆ తర్వాత టెర్రరిస్టుల ముట్టడీ, మాల్ లో బందీల పరిస్థితి, ఇంటర్వెల్లో హోమ్ మంత్రి ఎత్తుకు విజయ్ పై ఎత్తూ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో సాగుతున్నవి కాస్తా- సెకండాఫ్ ప్రారంభమయ్యేసరికి సెకండాఫ్ సిండ్రోమ్ లో పడిపోయింది కథ. మాల్ లో అర్ధం పర్ధం లేని కథనం, లాజిక్ లేని మలుపులూ సాగిసాగి సుఖాంతమయ్యాక- ప్రభుత్వం అప్పగించేసిన టెర్రరిస్టుని మళ్ళీ విజయ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (జార్జియా) వెళ్ళి, ఈ సారి ఫైటర్ విమానంతో ఇంకో సుదీర్ఘ ఆపరేషన్ జరపడం...ఇదంతా అతి.

        విఫలమవుతున్న తమిళ పానిండియాల పక్కన ఇది మరొకటి. 'బీస్ట్' ని నిర్మాతలు హిందీలో ప్రమోట్ చేసే కార్యక్రమమే పెట్టుకోలేదు. 'బీస్ట్' నే కాదు, 'వలిమై', 'ఈటీ' లని కూడా నార్త్ లో ప్రమోట్ చేయలేదు. తమిళనాడు, హైదరాబాద్ ల వరకే పరిమితమవుతున్నారు. తెలుగు పానిండియాలకి తెలుగు స్టార్లు నార్త్ చుట్టేసి పరిచయాలు పెంచుకుంటున్నారు. నార్త్ ప్రేక్షకులకి దగ్గరవుతున్నారు. తమిళ స్టార్లు నార్త్ ని పట్టించుకోక పోవడం కూడా ప్లాపులకి కారణం కావచ్చు. 'బీస్ట్' ఒక గుణపాఠం.

—సికిందర్