రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 8, 2020

997 : సందేహాలు -సమాధానాలు

 


          Q : సినిమాల్ని మీరిలా విమర్శిస్తున్నారు, మీరొక సినిమా తీసి చూపించరాదా?
దర్శకుడు
          A : సరే, రివ్యూ రైటర్ల నుద్దేశించి రొటీన్ గా అనేసే మాటే ఇది. ఫర్వాలేదు. దీని ఉపయోగమేమిటో తెలీదు. ఇదెలా వుంటుందంటే, పొలిటికల్ జర్నలిస్టుని పరిపాలించి చూపించరాదా అన్నట్టుంటుంది. సినిమాలు తీయడం మన పనికాదు, ఆ ప్రయత్న మెప్పుడూ చేయలేదు. అవసరమున్న వాళ్ళకి స్క్రిప్టుల్లో తోడ్పడడం వరకే. విమర్శిస్తున్నారనంటే అర్ధం విమర్శ చేయడం లేదని. విమర్శ చేయడం వేరు, విమర్శించడం వేరు. విమర్శ చేయడం దోష -అదోషా నిరూపణ చేయడం. విమర్శించడం నెగెటివ్ మనస్తత్వంతో బాగా ఉడికిపోవడం. దీనివల్ల ఉపయోగమేమిటి? ప్రపంచంలో వున్న విద్వేషం చాలనట్టు. మనం కూడా నెగెటివిజమనే ఇంకో అన్ ప్రొడక్టివ్ యాక్టివిటీ చేపట్టనవసరం లేదు కదా మైండ్ చెడ గొట్టుకుంటూ. ఎదుట వున్న విషయంలో మంచి చెడ్డలు విడమర్చి చెప్పగల్గితే ఉపయోగం వుండొచ్చు విమర్శించడమంటే కూల్చివేత, విశ్లేషించడం నిర్మాణం. నిర్మాణం వైపే వున్నాం కదా ఇంత కాలం. నిర్మాణం చేతగాక కూల్చివేత మొదలెడితే అప్పుడు రివ్యూలు రాయడం మానేద్దాం. నిర్మాణంలో కూడా వంకర మనస్తత్వం చూస్తే ఏమీ చేయలేం. 90% అట్టర్ ఫ్లాపులంటే వంకర మనస్తత్వం ఎక్కడుందో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం. విమర్శే కాదు ఆత్మవిమర్శ కూడా అవసరం. రివ్యూలనే అంటే కాదు, రెండు దశాబ్దాలుగా 90% అట్టర్ ఫ్లాపుల్ని కూడా చూడాలి. ఇంతే చెప్పగల్గింది. మిమ్మల్ని గోప్యంగా వుంచడానికి, మీరు కోరినట్టు ప్రశ్నకి మీ పేరివ్వలేదు. ధన్యవాదాలు. 
    Q : హాయ్ సార్, నా పేరు రాజేష్ అసోసియేట్ డైరెక్టర్ ను. నేను చాలా రోజుల నుంచి మీ బ్లాగ్ ఫాలో అవుతున్నాను. స్టోరీ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో మీరు చెప్పిన ఎన్నో అమూల్యమైన విషయాలను అన్నింటినీ ఒక బుక్ లాగా కూడా చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నేను కొంతమంది స్నేహితుల స్టోరీ కోసం వర్క్ చేస్తున్నప్పు
డు వాటిలో స్టోరీ అండ్ సిచువేషన్ గురించి కొన్ని అనుభవాలు నాకు ఎదురయ్యాయి. మీరు ఒక ఆర్టికల్ లో చెప్పినట్టు, హీరో ప్యాసివ్ పాత్ర గా ఉండి ఒక సిచువేషన్ లో ఇరుక్కోవడం అన్నది కథ కాదు గాథ అవుతుంది అన్నారు. అదే హీరో స్టోరీ లో ఉండి ఒక సిచువేషన్ నుంచి ఎలా బయట పడాలి అని తనకు తాను ప్రయత్నాలు చేసినప్పుడు అతను యాక్టివ్ క్యారెక్టర్ అవుతాడు, అది స్టోరీ అవుతుంది అని చెప్పారు. కానీ నేను వర్క్ చేసిన కొన్ని స్క్రిప్ట్ లలో హీరో పాత్ర ముందు సిచువేషన్ లో ఉండి తర్వాత స్టోరీ లోకి రావడం జరిగింది. అంటే ఫస్టాఫ్ అంతా ప్యాసివ్ గా ఉండి సెకండ్ హాఫ్ లో యాక్టివ్ క్యారెక్టర్ అయింది. అలా ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించండి.
రాజేష్, అసోసియేట్

        A : ఆర్టికల్స్ ని బుక్ లాగా చేసి పెట్టుకున్నందుకు కంగ్రాట్స్. ఈ సిట్యుయేషన్ ని, స్టోరీనీ తెలుగులో చెప్పుకుంటే అనువుగా వుంటుంది. సిట్యుయేషన్ అంటే పరిస్థితి, స్టోరీ అంటే కథ. పరిస్థితి విడిగా వుండదు, కథలోంచే పుడుతుంది. అయితే పరిస్థితుల సమాహారమే కథ కాదు. అది గాథ. గాథలో పరిస్థితులకి రియాక్షనంటూ వుండదు. హీరో బాధపడుతూ బాధపడుతూనే వుంటాడు చివరి దాకా. ఎవరో వచ్చి ఆదుకుంటే బయట పడతాడు. లేకపోతే పరిస్థితులకి బలై విషాద ముగింపు తెచ్చుకుంటాడు. ఇది పాసివ్ పాత్ర లక్షణం. కాబట్టి కమర్షియల్ సినిమాలు గాథల జోలికి పోకూడదు. సూపర్ స్టార్ సినిమాలైనా సరే. పోతే బ్రహ్మోత్సవం లాంటివి కూడా ఫ్లాపయ్యాయి. అది ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. ఈ విషయం చాలా సార్లు చెప్పుకున్నాం. 

      కథలో ఇలా కాదు, పరిస్థితులున్నా ఆ పరిస్థితుల్ని దాటి గెలిచే ప్రయత్నంతో సమస్యా పరిష్కారముంటుంది. ఇదీ కమర్షియల్ సినిమాల కవసరం. కథంటే ఆర్గ్యుమెంట్, దానికి జడ్జిమెంట్. గాథంటే కార్యాచరణ లేని ఒట్టి స్టేట్ మెంట్. ఈ నిర్వచనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రపంచానికి ఇంట్రెస్టింగ్ గా వుండేవి కథలే. 

        ఇప్పుడు మీరు వర్క్ చేసిన స్క్రిప్టుల విషయాని కొద్దాం. హీరో పాత్ర ముందు వివిధ పరిస్థితుల్లో వుండి తర్వాత కథ లోకి రావడమనేది కరెక్టే. కాకపోతే ఎప్పుడు కథలోకి వచ్చాడన్నది ముఖ్యం. ఆ స్క్రిప్టుల్లో ఫస్టాఫ్ అంతా పరిస్థితులతోనే వుండి, సెకండాఫ్ కథలోకి రావడమనేది తప్పు. 

  స్క్రిప్టు బలం బలహీనతలు టైమింగ్ మీద ఆధారపడుంటాయి. అందుకే రెండు గంటల సినిమా అంక విభజనని టైమింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఏర్పర్చారు. మొదటి అంకం అంటే ఫస్ట్ యాక్ట్, అంటే బిగినింగ్ అరగంట; రెండో అంకం అంటే సెకండ్ యాక్ట్, అంటే మిడిల్ గంట; మూడో అంకం అంటే థర్డ్ యాక్ట్, అంటే ఎండ్ అరగంట. ఇందులో మధ్యలో గంట పాటు సు దీర్ఘంగా వుండే మిడిల్ అనేది సినిమాకి కథ. ముందు అరగంట వుండే బిగినింగ్ ఆ కథకి ఉపోద్ఘాతం. చివరి అరగంట ఎండ్ అనేది మిడిల్లో కథకి చూపించే పరిష్కారం.

        ఇప్పుడు బిగినింగ్ అరగంట కొన్ని పరిస్థితులుంటాయి. ఇవన్నీ ఒకటై పాత్రని ప్లాట్ పాయింట్ వన్ దగ్గరికి నెట్టి గోల్ ని ఏర్పరుస్తాయి. ఈ అరగంట పరిస్థితుల్లో పాత్ర పాసివ్ గా వుండొచ్చు. కానీ ఎప్పుడైతే అరగంట బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ అనే మొదటి మలుపు వచ్చిందో, అక్కడ్నించీ పాత్ర గోల్ కోసం పరిస్థితుల మీద తిరగబడ్డమే వుంటుంది. అంటే యాక్టివ్ గా మారిపోవడం. ఈ ప్లాట్ పాయింట్ వన్ అనేది గంట పాటు మిడిల్ కి ప్రారంభం. అంటే కథా ప్రారంభం. కథా ప్రారంభమన్నాక పాత్ర ఇంకా పాసివ్ గా వుండేందుకు వీల్లేదు. ఈ మిడిల్లో ఎదురయ్యే కొత్త పరిస్థితులతో పొరాడి తీరాల్సిందే. 

        ఇప్పుడు ఇదే అరగంట బిగినింగ్ పరిధి దాటి మిడిల్ పరిధిలోకి వచ్చిందనుకోండి. అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ మిడిల్ పరిధిలోకి జరిగి కథా ప్రారంభం ఆలస్య మైపోతుంది. కథా ప్రారంభం ఎంతాలస్య మైతే అంత మిడిల్ కాలవ్యవధి తగ్గి, కథ బలహీనమవుతుంది. ఇంకా కథ మొదలు కావడంలేదని బోరు కూడా కొడుతుంది. అందుకే అంకాలకి టైమింగ్స్. 

        ఈ బిగినింగ్ కాస్తా ఇంటర్వెల్ దాకా జరిగిందనుకోండి, సగానికి సగం మిడిల్ కి కోత పడుతుంది. అప్పుడు ఇంటర్వెల్ దగ్గర గానీ ప్లాట్ పాయింట్ వన్ తో కథా ప్రారంభం జరగదు. అప్పుడు ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో మిడిల్ కి అరగంట మాత్రమే కథ మిగిలినట్టు.     అంటే అరగంట వుండాల్సిన బిగినింగ్ బరితెగించి మిడిల్ ని అవతలకి నెట్టి పారేసి, ఇంటర్వెల్ దాకా గంట సమయం తనే మింగెయ్యడమన్న మాట. ఈ గంట సేపూ ఉపోద్ఘాతమే చెప్పుకుంటూ బోరు కొట్టించడ మన్నమాట. సగం సినిమా ఈ గంట సేపూ వివిధ పరిస్థితులతో పాత్ర పాసివ్ గానే వుండి పోవడమన్న మాట. ఇదే మీరనే స్క్రిప్టుల్లో జరిగింది. వెంటనే ఆ స్క్రిప్టుల్ని మార్చుకొమ్మని చెప్పాలి. 

        జిమ్ కెళ్తాం. ఐదు నిమిషాలు వామప్ చేసి అరగంట వర్కౌట్ చేస్తాం. అరగంట వామప్ చేస్తామా? నవ్విపోతారు. వామప్ అనేది బిగినింగ్, వర్కౌట్ అనేది మిడిల్, ఇక ఎండ్ కండలు పొంగిన శరీరం. ఏ పనిలో నైనా త్రీ యాక్ట్ స్ట్రక్చరే వుంటుంది. లేకపోతే హ్యూమన్ బ్రెయిన్ ఒప్పుకోదు. హ్యూమన్ బ్రెయినే వొక త్రీయాక్ట్ స్ట్రక్చర్. మన బ్రెయిన్ మన కర్ధం గాకపోతే ఏదీ అర్ధంగాదు. ఫస్టు నిన్ను నీవు తెలుసుకో. సింపుల్ గా అర్ధమయ్యే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ క్లాసిక్ ది పవరాఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్ చదవొచ్చు. ఫ్రీ పిడిఎఫ్ డౌన్ లోడ్ వుంది. పురాణాలు చదవొచ్చు. రైటర్స్ కీ బేసిక్ నాలెడ్జి చాలా అవసరం. బ్రెయిన్ అర్ధంగాక పోతే ఏ బ్రెయిన్ తో రాస్తాడు. ఇవి చదివితే హ్యూమన్ బ్రెయిన్ ఎలా పని చేస్తుందో తెలుస్తుంది. దాంతో త్రీ యాక్ట్ స్ట్రక్చరెందుకో తెలుస్తుంది. 

        సమస్యేమిటంటే, యంగ్ ఏజీలో ఇవి పట్టవు. ఎవడ్రా నాకు చెప్పేదన్పిస్తుంది. ఈ దశ అందరం ఎదుర్కొన్న వాళ్ళమే, వెనుకనున్న వాళ్లూ ఎదుర్కోవాల్సిన వాళ్ళే. ఈ దశదాటే దాకా పట్టు కోసం మునక లేయడమే. దాటాక వేస్ట్ అనుకున్న ఇలాటి పుస్తకాలు అర్ధమవుతాయి. లైఫే ఒక త్రీయాక్ట్ స్ట్రక్చరని అప్పుడర్ధ మవుతుంది. జీవితాన్నిదాటి కళ వుంటుందా, వుండదు. ప్రఖ్యాత  రచయిత సోమర్సెట్ మామ్ ఏమన్నాడో చూడండి- Imagination  grows  by  exercise, and  contrary  to  common  belief,  is  more powerful  in  the  mature  than  in  the  young.’  

        కథల రహస్యమేమిటో, బ్రెయిన్ కోసం సినిమాలెలా పని చేస్తాయో తెలియాలంటే, జేమ్స్  బానెట్  స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్ చదవొచ్చు. ఈ ఫ్రేమ్ వర్క్ లో గొప్పగొప్ప హాలీవుడ్ సినిమాల విశ్లేషణ వుంటుంది. 

        ఇక ఆపి పాయింటు కొద్దాం :  శివ లో బిగినింగ్ అరగంట నాగార్జున పరిస్థితుల్ని గమనిస్తూ పాసివ్ గా వుంటాడు. అరగంటకి ఒకానొక పరిస్థితికి సైకిలు చెయిన్ తీసుకుని తిరగబడతాడు. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంతో యాక్టివ్ గా మారిపోయి, మాఫియాతో నేరుగా తలబడే గోల్ ఏర్పడిపోయి, కథ ప్రారంభ మైపోతుంది. ఇదే సైకిలు చెయిన్ ఘట్టం ఇంటర్వెల్ కి జరిగిందనుకోండి, అప్పుడు శివ పరిస్థితి? అందుకని పాత్ర పాసివ్ గా వుండేందుకు బిగినింగ్ అరగంట వరకే అనుమతి. దాటిందో స్ట్రక్చర్ చెడగొట్టినట్టు. శివ సినిమా చూడడం సిడ్ ఫీల్డ్ స్కీన్ ప్లే స్ట్రక్చర్ బుక్ చదవడమే. తెలుగు సినిమాలు కూడా 2000 కి పూర్వం స్ట్రక్చర్ తోనే వుండేవి. పాసివ్ క్యారక్టర్లు వుండేవి కావు. తర్వాత గ్లోబలైజేషన్ తో స్ట్రక్చర్ ఎగిరిపోయి, ఫటాఫట్ జయలక్ష్మి ఐపోయింది లోకం. 

        Q : 'క్షణం' = బన్నీ లేక్ ఈజ్ మిస్సింగ్, గాన్ బేబీ గాన్, ఫ్లయిట్ ప్లాన్ ఇంకా కొన్ని సినిమాల మిక్సింగ్ ను మీరు పదే పదే ఎలా సమర్థిస్తారు ? 'పెళ్లిచూపులు' = ది హండ్రెడ్ ఫుట్ జర్నీ, నాక్డ్ అప్, షెఫ్ సినిమాల మిశ్రమమే కదా? పైన చెప్పిన ఆ సినిమాల  మాతృకలు  మీకు తెలియదని కాదు. కానీ ఒక ఒరిజినాలిటీ లేని కృతకమైన స్ట్రక్చర్ ను మీరు పదే పదే ఎందుకు మెన్షన్  చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఉవాచ. కొత్తగా వస్తున్న రైటర్స్, డైరెక్టర్స్ కాపీ కొట్టి సినిమాలు తీయాలా ? లేక మీలాంటి గొప్ప విశ్లేషకుల పరిశీలనను అనుసరించి సినిమాలు తీయాలా ? లేక వల్లంపాటి గారి కధ లేదా నవల శిల్పం అనుసరించాలా ?
పేరు లేదు

       A : పేరు తెలియజేస్తే బావుండేది. ఒక సినిమాని మొత్తంగా కాపీ కొట్టే కంటే కొన్ని సినిమాల్ని కలిపి తీసి సక్సెస్ చేసుకోవడం నయమే. అందుకు కూడా క్రియేటివిటీ అవసరం కాబట్టి. అలాటి క్రియేషన్స్ కృతకంగా ఎందుకుంటాయి. పెళ్ళిచూపులు తలంగాణా భాష, నేటివిటీలతో సహజ సినిమా. క్షణం అనే థ్రిల్లర్ అన్ని సినిమాలు కలిపి తీసినా మల్టీ షేడ్స్ తో ఎలా నిలబడిందో దాని మీద రాసిన స్క్రీన్ ప్లే సంగతులు ఒకసారి చూడండి. పెళ్లి చూపులు దర్శకుడు మీరు చెప్పిన హాలీవుడ్ సినిమాలని అనుసరించానని చెప్పిన మాట వీకీపీడియాలో బహిరంగంగానే వుంది. వాటిలో ఏ వొక హాలీవుడ్ ని కాపీ కొట్టినట్టు చెప్పినా కేసులు పడేవి. 

        ఇక కొత్తగా వస్తున్న దర్శకులు, రచయితలు కాపీకొట్టి తీయవచ్చా అంటే తీయవచ్చు. గంటలో ఎక్కడ్నుంచి కాపీ కొట్టారో ట్విట్టర్ లో టాంటాం అయిపోతుంది. నెటిజన్లని తక్కువ అంచనా వేయకూడదు. అయినా ఫర్వాలేదనుకుంటే కాపీ కొట్టుకుంటూ వుండొచ్చు. ఫారిన్ సినిమాలతో కేసులు మీద పడే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు ఏదో చేసి. పక్కనున్న వాడి కథ కాపీ కొడితే ఇక్కడే దొరికిపోయి, కాపీ కొట్టలేదని ఛానెల్స్ లో తెలుగు ప్రేక్షకుల ముందు, ప్రజా కోర్టులో  అరుపులకి దిగాలి, ఛీఛీ అన్పించుకోవాలి. అంత సన్మానం జరుగుతుంది. అరుపులు మంచివా సద్బుద్ధి మంచిదా ఆలోచించుకోవాలి. 

        పోతే మనం గొప్ప విశ్లేషకులం కాదు గానీ, నిత్య విద్యార్ధులమైతే చాలు. సినిమాల్ని ఎవర్ని ఫాలో అయి తీయాలన్నది కాదు, ఏ విధానాన్ని అనుసరించాలన్నది నిర్ణయించుకోవాలి. విధానాలకి ఎవరూ బాసులు కారు. రెండు విధానాలున్నాయి : స్ట్రక్చర్ స్కూలు, క్రియేటివ్ స్కూలు. స్ట్రక్చర్ స్కూలు క్రియేటివిటీని కాపాడుతుంది, క్రియేటివ్ స్కూలు స్ట్రక్చర్ ని పక్కన పెడుతుంది. ఛాయిస్ మీదే. డాక్టర్ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి నవలా శిల్పం’, కథా శిల్పం లాంటి సాహిత్య పుస్తకాలు చదువుకుంటే సినిమాలకి మంచిదే. ఈ పుస్తకాలు కూడా స్ట్రక్చర్నే చెప్తాయి.  

సికిందర్