రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, May 11, 2019

823 : స్క్రీన్ ప్లే సంగతులు -2

     స్ట్రక్చర్ లేకుండా కూడా సినిమాలు తీయవచ్చు. కాకపోతే ఆ స్ట్రక్చర్ రూల్స్ కూడా తెలిసి వుండాలి. రూల్స్ తెలియకుండా రూల్స్ ని బ్రేక్ చేయలేం. కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పాలంటే పాత సాంప్రదాయం గురించి తెలిసి వుండాలి. తెలిసివుంటే అప్పుడు స్ట్రక్చర్ కి బైపాస్ సర్జరీ ఎలా చేయవచ్చో, బైపాస్ రోడ్డు ఎలా వేసుకోవచ్చో, రాజమండ్రి రోడ్ -కం -రైలు బ్రిడ్జి కూడా ఎలా కట్టుకోవచ్చో చక్కగా తెలుస్తుంది. ఐతే దీనికి సాహసించే వాళ్ళు తక్కువ. తెలిసితెలిసి ఎవరు కామధేనువుతో పెట్టుకుంటారు. కనకవర్షం కురిపించే స్ట్రక్చర్ తో మంకీ బిజినెస్ ఎవరు చేయాలనుకుంటారు. దీన్నియూరప్ దేశాల్లో వరల్డ్ మూవీస్ తో చూసుకుంటున్నారు. వరల్డ్ మూవీస్ లిటరరీ మూవీస్. నవలల్లాగా వుంటాయి. తెలుగులో మన ‘ప్రేమనగర్’ నవలని నవల్లాగే కథానిర్మాణంతో తీసి వుంటే ఒక్కరోజు కూడా ఆడేది కాదు. ‘నేను పుట్టాను, అప్పుడే గిట్టాను’ గా పాట మారిపోయేది. ‘కష్టాలెత్తుకొచ్చిందీ కొన్న నవలా’ గా ఇంకో పాట మారిపోయేది. స్ట్రక్చర్ తో కమర్షియల్ సినిమా ఆసాములెవరూ కోరోకోరి పెట్టుకోరు. కాకపోతే తరాలుగా శిలాసదృశంగా వుండిపోతున్న స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడవచ్చు. ఇంతవరకే లాభసాటిగా  చేసుకోగల్గింది. దీని గురించి బ్లాగులో ఆల్రెడీ కొన్ని పోస్టులున్నాయి. 

         
రి అరుదుగానైనా స్ట్రక్చర్ ని తీసి పక్కన పెట్టేసిన కమర్షియల్ హిట్సే లేవా అంటే వున్నాయి. ఉదాహరణకి రెండు కన్పిస్తున్నాయి : ఫారెస్ట్ గంప్, భలేభలే మగాడివోయ్. ఫ్లాప్స్ లేవా? ఎందుకు లేవు - స్ట్రక్చర్ ని ఎగేసిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆటోనగర్ సూర్య, మను, ఆ!...లాంటివి ఫ్లాపయ్యాయి. మరి మహర్షి? ఇది స్ట్రక్చర్ వద్దనుకుంటూనే స్ట్రక్చర్ లో వుండాలని ప్రయత్నించింది. మరి ఫారెస్ట్ గంప్, భలేభలే మగాడివోయ్ ఎలా పెద్ద హిట్స్ అయ్యాయి? స్ట్రక్చర్ ని ఎగేయాలనుకుంటే క్యారెక్టర్ తో దున్నేయాలన్నాయి. మరి మహేష్ బాబు క్యారెక్టర్ తో దున్నేయలేదా? ఆయన కాసేపే పొలం దున్నేడు. అయినా హిట్టయిందంటున్నారుగా?
***
           ‘ఫారెస్ట్ గంప్’ ప్రసిద్ధ నవలే. టాం హాంక్స్ తో దీన్ని సినిమాగా తీసిన రాబర్ట్ జిమెకిస్ దీంతో ఆస్కార్ అవార్డు నందుకున్న ప్రసిద్ధ దర్శకుడే. ఉత్తమ నటుడుగా టాంహాంక్స్ కీ, ఉత్తమ  రచయితగా ఎరిక్ రోత్ కీ కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. అయితే ఎరిక్ రోత్ స్ట్రక్చర్ ని వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించి నవలలోని టాంహాంక్స్ పాత్ర చిత్రణతో చాలా మ్యాజిక్ చేశాడు. మహేష్ బాబు మహర్షి పాత్రకి గోలైనా వుంది, ఫారెస్ట్ గంప్ కి గోల్ కూడా వుండదు. గోల్ బదులు గోల్ లేని లోటుని తీర్చే ‘డ్రమెటిక్ క్వశ్చన్’ ని ప్రయోగించాడు. ఇలా రూల్స్ తెలిస్తే రూల్స్ నెలా బ్రేక్ చేసి హిట్ చేసుకోవాలో తెలుస్తుంది. స్ట్రక్చర్ లేని ఫారెస్ట్ గంప్  పూర్తి వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి. 

          ఇక దర్శకుడు మారుతి తీసిన ‘భలేభలే మగాడివోయ్’ స్ట్రక్చర్ లేకపోయినా అంత హిట్టయ్యిందంటే మారుతికి స్ట్రక్చర్ తెలిసి బైపాస్ సర్జరీ చేశారని కాదు. నాని పాత్రని పట్టుకుని కథనంలో ఒక జోష్ తో, ఒక వూపుతో బ్యాంగు తర్వాత బ్యాంగు, పది నిమిషాలకో బ్యాంగ్  చొప్పున ఇచ్చుకుంటూ పోవడం వల్లే - నాని క్యారెక్టర్ బస్తీమే సవాల్ గా స్ట్రక్చర్ ని ఎగేసుకుంటూ వెళ్ళిపోయింది.

          ‘మిగతా ఏం రాసుకుంటారో రాసుకోండి, యూఆర్ ఫ్రీ. నాకు మాత్రం పది నిమిషాలకో సారి గట్టి వామ్మో (
Whammo =  immense energy; vigor) చొప్పున పడాలని గుర్తెట్టుకోండి, యూఆర్ నాట్ ఫ్రీ!’  అనేవాడు పూర్వమెప్పుడో ఎడ్డీ మర్ఫీతో ‘బేవర్లీ హిల్స్ కాప్’ సిరీస్ హిట్స్ తీసిన ఈజిప్షియన్ నిర్మాత. ‘వామ్మో’ని మన తెలుగులో ‘బ్యాంగ్’ అనుకోవచ్చు. ఆ రచయితలు  అలాగే పది నిమిషాలకోసారి  గట్టి ‘బ్యాంగ్’ పడేలా సంఘటనల్ని సృష్టించే వాళ్ళు హీరో ఎడ్డీ మర్ఫీ కోసం. ఆ సినిమాలు హిట్టయ్యేవి. ఇదెక్కడి మంత్రమో అర్ధంగాదు. ఇది మారుతి అక్కడ దాక్కుని వినేసి, తన సినిమాకి తెచ్చి పెట్టేసుకున్నారనుకుంటామా? అనుకోలేం, ఏదో అలా జరిగిపోయింది. ఇలా నాని నటించిన మతిమరుపు పాత్ర, ప్రతి పది నిమిషాలకో బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ పైలా పచ్చీసుగా సాగిపోతూ వుండడంతో, స్ట్రక్చర్ తో పనే లేకుండా పోయింది. 

మహర్షి కథ - ఫస్టాఫ్ -  మిడిల్ -1
       యూఎస్ లో రిషి కుమార్ (మహేష్ బాబు) ఓ మల్టీనేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీలో తన అమోఘ మేధస్సుతో త్వరత్వరగా ఎదిగి సీఈవో స్థాయికి చేరుకుంటాడు. ఈ సందర్భంగా స్టాఫ్ అతణ్ణి సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. వైజాగ్ లో రిషీ పూర్వ సహ విద్యార్ధుల్ని, ప్రొఫెసర్నీ (రావురమేష్) రప్పించి సర్ప్రైజ్ పార్టీ ఇస్తుంది. ఈ సందర్భంగా రిషి గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. 

బిగినింగ్
          వైజాగ్ లో రిషిది  మధ్యతరగతి కుటుంబం. ఎంటెక్ చదువుతూంటాడు. తల్లిదండ్రలు (జయసుధ, ప్రకాష్ రాజ్) వుంటారు. తండ్రి ఎదుగూ బొదుగూ లేని క్లర్క్ ఉద్యోగం చేస్తూంటే రిషి చిన్నచూపు చూస్తాడు. తను తండ్రి లాంటి సగటు జీవితం కోరుకోడు. జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకుని తండ్రికి చూపించాలన్న కసితో వుంటాడు. దీంతో మానవ సంబంధాల్ని పట్టించుకోడు. తన అభివృద్ధే మతంగా విజయాలు అందుకోవాలని దురుసుగా ప్రవర్తిస్తూంటాడు. 

          కాలేజీలో పూజా (పూజాహెగ్డే), రవిశంకర్ (అల్లరి నరేష్) రిషికి క్లోజ్ అవుతారు. పూజా రిషిని ప్రేమిస్తుంది. రవిశంకర్ రామవరం అనే వూళ్ళో ఓ పేద రైతు (తనికెళ్ళ భరణి) కొడుకు. బాగా చదువుకుని తండ్రి కష్టాలు తీర్చాలన్న పట్టుదలతో వుంటాడు. వూళ్ళో ఒక మోతుబరి (సాయికుమార్) కూతురితో ప్రేమలో వుంటాడు. ఇది మోతుబరికి నచ్చదు. సగటు విద్యార్ధిగా వున్న రవిశంకర్ ని రిషి తెలివైన వాడుగా తీర్చి దిద్దుతాడు. ఇదిలా వుంటే, రిషి రూపొందించిన ఒక సాఫ్ట్ వేర్ ని చూసి మంచి జాబ్ ఆఫర్ ఇస్తుంది ఓ అమెరికన్ కంపెనీ. పూజా అభినందించి ప్రేమని వ్యక్తం చేస్తుంది. తనకి ప్రేమలు కుదరవని, సక్సెస్ సాధించడమొక్కటే తన ధ్యేయమని చెప్పేసి ఆమెతో తెగదెంపులు చేసుకుంటాడు రిషి. రవిశంకర్ నచ్చజెప్ప బోతే లెంపకాయ కొట్టి వెళ్ళిపోతాడు.  

      ఇంతలో రిషి ప్రతీ సెమెస్టర్ లో టాప్ రావడాన్ని సహించని ఓ ఎంపీ (ముఖేష్ రిషి) కొడుకు రిషిని ఎగ్జామ్ పేపర్ దొంగతనం కేసులో ఇరికిస్తాడు. దీంతో రిషి డీబార్ అవుతాడు. అంతలో ఇది తప్పుడు కేసని విడుదల చేసేస్తారు. రిషి ఇక ఎగ్జామ్స్ రాసేసి కంపెనీలో జాయిన్ అవడానికి యూఎస్ కి ప్రయాణం కడతాడు  (ప్లాట్ పాయింట్ -1)
మిడిల్ -1 కంటిన్యూ 
       తండ్రి మరణవార్త విని తిరిగి వస్తాడు. అప్పుడు తండ్రి గురించి అతడికి తెలియని విషయం చెప్తుంది తల్లి. తల్లిని తీసుకుని యూఎస్ కొచ్చేస్తాడు రిషి.ఇవీ గత జ్ఞాపకాలు. ఇప్పుడు తేరుకుని చూస్తే,  వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళల్లో రవిశంకర్ , పూజా వుండరు. రిషి నిలదీస్తాడు. పూజా అక్కడే గేమింగ్ కంపెనీలో జాబ్ చేసుకుంటోందని చెప్తాడు ప్రొఫెసర్. రవిశంకర్  ఆ రోజు ఎగ్జామ్ పేపర్ దొంగతనం తన మీదేసుకుని రిషిని కాపాడేడనీ, దాంతో చదువూ చెడి, ఇది తట్టుకోలేక తండ్రీ మరణించి, రవిశంకర్ వూళ్ళోనే  వుంటున్నాడనీ చెప్పుకొస్తాడు ప్రొఫెసర్. ఇక వెంటనే రవిశంకర్  దగ్గరికి బయల్దేరి పోతాడు రిషి (ఇంటర్వెల్)

సెకండాఫ్ - మిడిల్ -2
       రామవరం చేరుకుంటాడు రిషి. అక్కడ రవిశంకర్ టెంటు కింద ఒక్కడే కూర్చుని వుంటాడు. ఇద్దరూ పరస్పరం ఉద్వేగానికి లోనై ఆలింగనం చేసుకుంటారు. తనతో యూఎస్ వచ్చేయమంటాడు రిషి. రానంటాడు రవిశంకర్. వూళ్ళో పరిస్థితి చెబుతాడు. పక్కనే సముద్రంలో గ్యాస్ పడి ఆ పైపు లైను కోసం వూళ్ళు ఖాళీ చేయిస్తున్నారనీ వలసపోతున్న వాళ్ళని చూపిస్తాడు. తను మాత్రం ఇది జరగనివ్వనంటాడు. రామవరం వూరుని కాపాడు కుని తీరతానంటాడు. 

          రిషి వెళ్లి కలెక్టర్ ని కలుస్తాడు. అవి బీడు భూములనీ, ఇప్పుడెవరూ వ్యవసాయం చేయడం లేదనీ, నేషనల్ ప్రాజెక్టు కింద భూసేకరణ జరుగుతోందనీ చెప్తాడు కలెక్టర్. రిషి మంత్రిని కలుస్తాడు. ఆ మంత్రి ప్రభుత్వాలు పాలన చేయడం లేదనీ, కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నాయనీ, వెళ్లి వివేక్ మిట్టల్ ని కలవమనీ అంటాడు. ముంబాయిలో కార్పొరేట్ బాస్ వివేక్ మిట్టల్ (జగపతిబాబు) ని కలుసుకుంటాడు రిషి. ఆ ఒక్క వూరుని వదిలేయమంటాడు. వదిలేది లేదంటాడు మిట్టల్. అయితే చూస్కుంటానంటాడు రిషి. 

          రిషి తన కంపెనీ ఆఫీసుని రామవరానికి మార్చేస్తాడు. ఇక్కడ్నించే కార్యకలాపాలు కొనసాగుతాయని స్టాఫ్ ని పిలిపించుకుంటాడు. ఇది తెలుసుకున్న గేమింగ్ కంపెనీ బాస్ టీం లీడర్ పూజని, రిషి అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందిగా కోరతాడు. పూజా అయిష్టంగా వెళ్లి కలుస్తుంది గేమింగ్ యాప్ డీల్ కోసం. ఇది చూసి రవిశంకర్, పూజకీ ఆమె కొలీగ్ కీ తన ఇంట్లో బస ఏర్పాటు చేస్తాడు. పూజాకి రిషి మీద నమ్మకం కలగదు. ఏదో స్వార్ధం వుంటే తప్ప ఇక్కడ మకాం పెట్టడని రవిశంకర్ తో అంటుంది.

          రిషిని మీడియా వాళ్ళు చుట్టేస్తారు. ఇక్కడికెందుకు ఆఫీసు మార్చారని అడుగుతారు. మీ ఫ్రెండ్ ని మీతో రమ్మంటే రావడం లేదని ఇక్కడే ఆఫీసు తెరిచారట, మీతో ఎందుకు రావడం లేదని అడుగుతారు. అతన్నే అడగమంటాడు రిషి. టెంటు కింద కూర్చున్న రవిశంకర్,  తను అమెరికా వెళ్లి వచ్చే వరకూ ఈ వూరు వుంటుందన్న నమ్మకం లేదంటాడు.  అందుకని ఇక్కడే వుండి వూరుని కాపాడుకుంటానంటాడు.

        రవిశంకర్ మాటలతో వూళ్ళో కదలిక వచ్చి అందరూ అతడికి మద్దతుగా టెంటు కింద కూర్చుని ఉద్యమం ప్రారంభిస్తాడు. ఇది చూసి రిషి ఆనందిస్తాడు. రవిశంకర్ ప్రేమిస్తున్న అమ్మాయి తండ్రితో మాట్లాడి ఇద్దర్నీ ఒకటి చేస్తాడు. రిషి మమ్మల్ని కలిపాడు, నువ్వుకూడా రిషీని నమ్మి చూడమంటాడు రవిశంకర్ పూజాతో. ఆమె ఆనందంతో ఫోక్ సాంగేసుకుంటుంది రిషితో.      
   
          ఒక వ్యక్తి (రాజీవ్ కనకాల) వచ్చి రవిశంకర్ ఉద్యమానికి చుటుపక్కల గ్రామాల్లో మద్దతు కూడగడతాడు. దీంతో 40 గ్రామాల ప్రజలు రవిశంకర్ కి మద్దతుగా వస్తారు. ఇది తెలుసుకుని మిట్టల్ వచ్చేస్తాడు. అప్పుడొక్క గ్రామమే అడిగాను, ఇప్పుడు 41 గ్రామాలు వదులుకోమంటాడు  రిషి. మిట్టల్ రవిశంకర్ కి బేరం పెడతాడు నష్టపరిహారం పెంచుతూ. ప్రజలు అటు మొగ్గుతారు. రవిశంకర్ ఒంటరి అవుతాడు. ముంబాయి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి రిషి మీద ఆరోపణలు చేస్తాడు మిట్టల్. నిజానికి రిషి తన ప్రాజెక్టులో వాటా అడిగాడనీ, ఇవ్వనందు వల్లే ఇలా చేస్తున్నాడనీ అంటాడు. దీంతో గ్రామాల ప్రజలందరూ రిషి ద్రోహి అనీ,  వెళ్లిపోవాలనీ తిరగబడతారు (ప్లాట్ పాయింట్ -2)

ఎండ్ 
      రిషి తిరిగి వెళ్ళిపోదామంటే తల్లి వద్దంటుంది. గెలుపోటముల గురించి అతడి నమ్మకాల్ని గుర్తు చేస్తుంది. దీంతో టెంటు కింది కెళ్ళిపోయి ఒక్కడే కూర్చుంటాడు రిషి. మిట్టల్ మనుషులు దాడి చేస్తారు. ఆ దాడిని తిప్పి కొట్టి రైతుల మీద దృష్టి సారిస్తాడు. ఓ ముసలి రైతుని అడిగి సాధకబాధకాల్నితెలుసుకుంటాడు. అతడితో దుక్కి దున్నుతాడు, నారు వేస్తాడు, పంట పండిస్తాడు. ఈ క్రమంలో మిట్టల్ ఇక రవిశంకర్  మీద హత్యాప్రయతం జరిపిస్తాడు. రవిశంకర్ని కాపాడి హాస్పిటల్లో చేర్పిస్తాడు రిషి.
          గూగుల్ సెర్చి చేస్తాడు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుంటాడు. మీడియా మీట్ పెడతాడు. రైతుల గురించీ, వ్యవసాయం గురించీ ఉపన్యాసమిస్తాడు. వ్యవసాయం తగ్గిపోతే కల్తీ ఆహారమే దక్కుతుందనీ హెచ్చరిస్తాడు. అతడి ఉపన్యాసంతో పెద్ద కదలిక వస్తుంది. తిరిగి వ్యవసాయాలు మొదలవుతాయి. ప్రభుత్వం దిగి వచ్చి ఎవరి  భూములు వాళ్ళకి అప్పజెప్పేస్తుంది. మిట్టల్ కి వ్యతిరేకంగా అతడి కొడుకు ఇచ్చిన స్టేట్ మెంట్ తో,  మిట్టల్ ని అరెస్టు చేస్తుంది ప్రభుత్వం. రిషి రైతుల సహాయార్ధం ఏడువేల కోట్లు ప్రకటించడంతో ముగింపు. 

క్రియేటివ్ యాస్పెక్ట్
      పై కథని తెరకెక్కించినప్పుడు కొన్ని మంచి ప్రయత్నాలు జరిగాయి. ప్రారంభంలో హీరో పరిచయ పాట రొటీన్ గా గ్రూప్ డాన్సర్స్ లేకుండా హీరో తత్వాన్ని తెలియబర్చే విషయంతో వుండడం, ఇంటర్వెల్లో రొటీన్ గా విలన్ని ప్రవేశపెట్టి. ఛాలెంజి విసరడం లాంటి అరిగిపోయిన మూస కథనాన్ని దూరంగా వుంచడం, ఇంటర్వెల్లో రొటీన్ బ్యాంగు లేకుండా, హీరో ఇండియా ప్రయాణంతో ఫస్టాఫ్ నుంచి సెకెండాఫ్ లోకి స్మూత్ ట్రాన్సిషన్ గా కథనం వుండేలా చూడడం లాంటివి. ఈ మంచి ప్రయత్నాలు సెకెండాఫ్ లో కన్పించవు. ఫస్టాఫ్ లో కూడా కథనానికి డైనమిక్స్ విషయం పట్టించుకోని కొన్ని సీన్లున్నాయి. ఒక సీన్లో రెండు విషయాలు చెప్పే అవకాశాన్ని జారవిడుచుకోవడం వల్ల అనవసరంగా సీన్లు పెరిగాయి. 

          ఫస్టాఫ్ మిడిల్ -1 తో ప్రారంభమవుతుంది. గ్లోబల్ కంపెనీ సీఈవోగా  రిషి అప్పాయింట్ కావడంతో. ఈ సందర్భంగా అతణ్ణి కీర్తించే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తుంది- ‘నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం’ అని. ఈ పాట  దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో వుంది, రిషి పాయింటాఫ్ వ్యూలో కాదు. రిషి ఈ స్థాయిని అందుకోవడమే మిత్రుడు రవిశంకర్ గుప్త త్యాగం వల్లనైతే, దర్శకుడు ఈ విజయం క్రెడిట్ రిషిదే అన్నట్టు ఎలా  ‘నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం’ అని ప్రేక్షకులకి ఎస్టాబ్లిష్ చేస్తాడు?  ఇలా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు రవిశంకర్ చేసే త్యాగమనేదే వుండ కూడదు. రిషి సొంత టాలెంట్ తోనే  ఈ సక్సెస్ సాధించి వుండాలి. కాబట్టి సాటి మనుషులతో ఎలాటి సెంటిమెంట్లు లేని, సక్సెస్ కోసం ఇగో సెంట్రిక్ గా ప్రవర్తించే రిషి- ఇలా గ్లోబల్ సీఈవోగా సక్సెస్ అయినప్పుడు- ‘నేనే సమస్తం, నేనే సిద్ధాంతం’ అని ప్రథమ పురుషలో పాడుకుంటే పాత్రోచితంగా వుంటుంది. ‘నేనేనేనే’ అనుకుంటూ అతను తన మీద తనే పాడుకునే పాట డైరెక్ట్ గానూ, పవర్ఫుల్ గానూ వుంటుంది. తర్వాత ఈ సక్సెస్ రవిశంకర్ పెట్టిన భిక్ష అని తెలిశాక, పాడుకున్న ఈ పాటే తనని వెక్కిరిస్తుంది. ఇది పాత్రకి అవసరమైన ఐరనీని సృష్టిస్తుంది.  ఇలాటి డైనమిక్సే పాత్రలతో, కథనంతో చాలా చోట్ల కొరవడ్డాయి. కథనమంటే ఏమిటి? ఒకటి జరిగితే దానికి వ్యతిరేకంగా ఇంకోటి జరగడమేగా.  


           ఇది దర్శకుడు హీరోకి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్న తప్పుదోవ పట్టించే పాట. దీని చరణాలు కూడా దర్శకుడు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నట్టు  - ‘నీదొక మార్గం అనితర సాధ్యం,  నీదొక పర్వం శిఖరపు గర్వం’ - అంటూ వున్నాయి. ‘నాదొక మార్గం నాదొక పర్వం’ అంటూ రిషియే పొటమరించిన అతిశయంతో పాడుకోవాలి. తనని తను అతనే బల్లగుద్ది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దీంతో ప్రేక్షకుల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది, వెంటనే క్యారెక్టర్ తో ఎటాచ్ అయిపోతారు. ఈ లోకం ద్వంద్వాలతో నిండి వుంది. ఏదీ ఎవడబ్బ సొత్తూ కాదు. చీకటి వెలుగులు, ఎండా వానలు, సుఖదుఃఖాలు, బొమ్మాబొరుసూ... ఇలా ద్వంద్వాలతోనే నడుస్తోంది సమస్తం. రిషి ప్రస్తుతం బొమ్మేసుకుని ఈ బొమ్మ తనదేనని ఎంజాయ్ చేస్తున్నాడు. బొరుసు కూడా పడుద్ది, పడబోతోంది. ఈ ద్వంద్వాల విన్యాసాలే డైనమిక్సు, కథనం. దీనికి రిషి తనమీద పాట తనే పాడుకోవడం తోడవాలి. 


          ఆత్రేయగారు ‘నేను పుట్టాను, లోకం మెచ్చిందీ - నేను ఏడ్చాను, లోకం నవ్విందీ’ అని అక్కినేని పాయింటాఫ్  వ్యూలో రాశారేగానీ, దర్శకుడు కేఎస్ ప్రకాశరావు జోక్యం చేసుకుని - ‘నువ్వు పుట్టావు, లోకం మెచ్చిందీ – నువ్వు  ఏడ్చావు, లోకం నవ్విందీ’ అని తన పాయింటాఫ్  వ్యూలో  కీర్తిస్తూ పాట రాయించుకోలేదు.
(ఇంకా వుంది)

సికిందర్