రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, జులై 2017, శుక్రవారం

489- రివ్యూ!
రచన- దర్శకత్వం: సంపత్నంది
తారాగణం: గోపీచంద్, హన్సిక, కేథరిన్, సచిన్ఖేడ్కర్, ముఖేష్రుషి, నికితన్ ధీర్, నికెళ్ళ ణి, చంద్రమోహన్, వెన్నెలకిషోర్ తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్, ఛాయాగ్రహణం: సౌందర రాజన్
బ్యానర్ :
శ్రీ బాలాజీ సినీ మీడియా
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు
విడుదల : జులై 28, 2018
***
      యా
క్షన్ హీరో గోపీచంద్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తూ, సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతం నందా’ గా తెరపైకొచ్చాడు చాలా కాలానికి. దీనికంటే ముందు బి. గోపాల్ దర్శకత్వంలో రావాల్సిన ‘ఆరడుగుల బుల్లెట్’  విడులవుతూ ఆగిపోయింది. రవితేజతో ‘బెంగాల్ టైగర్’  తీసిన సంపత్ నంది మళ్ళీ కూడదీసుకుని, భారీ సెంటిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ తో ఈ శుక్రవారం విచ్చేశాడు. ఇప్పుడు తెలుగులో కన్పించని హీరోయిన్ హన్సిక, ఎప్పుడో తెలుగులో కన్పించిన కేథరిన్ హీరోయిన్లుగా తమవంతు పాత్ర పోషించారు. మరోసారి తమన్ తన బాణీలు విన్పించి మెప్పించడానికి తయారయ్యాడు. ఐతే అత్యంత భారీ ఖర్చుతో అట్టహాసంగా తీసిన ఈ బిగ్ కమర్షియల్ లో  వున్న విషయమేమిటి, అదెంతవరకూ రాణించిందీ ఓసారి పరిశీలిద్దాం..

 కథ 
       అమెరికాలో మొదలవుతుంది. అక్కడ ఘట్టమనేని విష్ణు ప్రసాద్ (సచిన్ ఖెడేకర్) వ్యాపారంలో టాప్ 50 లిస్టులో ఫోర్బ్స్ పత్రిక కెక్కుతాడు. దీన్ని కొడుకు గౌతమ్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో సెలబ్రేట్ చేసుకుంటాడు. అత్యంత ధనికుడైన తను  డ్రగ్స్ మత్తులో మునిగితేలుతూ కష్టమంటే తెలియకుండా పెరిగాడు. పబ్ లో బేరర్ (తనికెళ్ళ భరణి) చేసిన చిన్న తప్పుకి పొగరుతో లెంపకాయ కొడతాడు. దీంతో  బేరర్ అనే ఒక మాట కళ్ళు తెరిపిస్తాయి- ఫోర్బ్స్ తో గుర్తింపు వచ్చింది మీనాన్నకి, నీకు కాదు. నువ్వెవరు? నేను బెరర్ని, వాడు క్లీనర్, నువ్వెవరు చెప్పుకోవడానికి?-   అని నిలదీస్తాడు బేరర్. దీంతో అంతర్మథనం మొదలవుతుంది గౌతమ్ కి. తానెవరో తెలుసుకోవడానికి కారెక్కి పిచ్చిగా ప్రయాణం కడతాడు. వద్దని గర్ల్ ఫ్రెండ్ ముగ్ధ (కేథరిన్) చెప్పినా వినకుండా వెళ్ళిపోతాడు. యాక్సిడెంట్ చేస్తాడు. కొద్దిలో చావు తప్పించుకుంటాడు నందా (గోపీచంద్ -2). ఇతనొచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికే. అచ్చం తనలాగే వున్న ఇతడి కథ తెలుసుకుంటాడు గౌతమ్. హైదరాబాద్ బోరబండలో తన బండబారిన జీవితం చెప్పుకుంటాడు మాస్ నందా క్లాస్ గౌతంకి. అయితే మనం  స్థానాలు మార్చుకుందామని అతడింటికి గౌతమ్ వెళ్తాడు, గౌతం ఇంటికి నందా వెళ్లి సెటిలవుతాడు. గౌతం అక్కడ జీవితంలో తను పొందని నిజమైన భావోద్వేగాలెలా వుంటాయో చవిచూస్తూంటే, అక్కడ నందా వేరే పథకం వేస్తూ బిజీగా వుంటాడు. ఏమిటా పథకం, దాంతో ఏం చేశాడు, ఇద్దరూ ఏమయ్యారు, జీవితం గురించీ ఏం తెలుసుకున్నారు...అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      చాలా పరిచయమున్న పాత కథే. కొత్తదనం లేదు. ఒకేలా వుండే ఇద్దరు పరస్పరం స్థానాలు మార్చుకోవడం గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. దీన్ని కొత్తబాట పట్టించింది హాలీవుడ్ ‘ఫేస్ ఆఫ్’ ... ‘గౌతంనందా’ లో స్థానాలు మార్చుకునే కథకి పాయింటు పక్కదారి పట్టినట్టు తేలుతుంది. దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడో, మనం కన్ఫ్యూజ్ అవుతున్నామో గానీ- చెప్పింది ఒకటైతే చేసింది  మరొకటిగా కథ నడుస్తుంది. నువ్వెవరు? అని తండ్రితో పోల్చి కొడుకుని ప్రశ్నించాడు బేరర్.  అప్పుడా కొడుకు తను ఎంజాయ్ చేస్తున్న తండ్రి సంపదని పౌరుషంతో త్యజించి,  సొంత కాళ్ళ మీద ఎదిగి తనకంటూ ఐడెంటిటీ సంపాదించుకోవడానికి సిద్ధమవుతాడని మనం ఆశిస్తాం. కానీ జరిగేది వేరు. తానెవరో తెలుసుకోవడానికి ప్రయాణం కడతాడు. నువ్వెవరు? అని ఇంకేదో అర్ధంలో అడగలేదు బేరర్. అలా అడిగితే నేను ఆత్మని అని తెలుసుకోవడానికి క్షణం పట్టదు. నీకేం ఐడెంటిటీ వుందని మాత్రమే  బేరర్ అడిగాడు. తనని చూపించుకుని బేరర్ని అని, ఇంకోడ్ని చూపించి వాడు క్లీనరనీ అన్నాడు. మరి గౌతం ఎవరు? అతడి పోర్టుఫోలియో ఏమిటి? ఇదీ పాయింటు. ఈ పాయింటు వేరే పాయింటుగా మారిపోయి పైన చెప్పినట్టు వేరే కథ నడుస్తుంది.  

ఎవరెలా చేశారు 
      ద్విపాత్రాభినయానికి వచ్చిన  ఈ అవకాశాన్ని గోపీచంద్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశాడు- మనకూ ఎంజాయ్ మెంటు నిచ్చాడు. రెండో కంత్రీ పాత్రతో నవ్విస్తూ కూడా పోయాడు. మొదటి పాత్రకి ఇచ్చిన రిచ్ బిల్డప్, స్టయిలిష్ ఇమేజి మొదటి అరగంట సేపు ఒక ఫాంటసీలోకి ప్రయాణంలాగా మార్చేస్తాయి. తానెవరు? అన్న ప్రశ్న వేధిస్తూంటే కనబరచిన హావభావాలు, కన్నీటి ధారా బాగా కనెక్ట్ అవుతాయి ప్రేక్షకులకి. ఈ ప్రశ్నకి తాను వెతుక్కుంటున్న జవాబు వేరే అన్నది  వేరే సంగతి. నీ తండ్రి సంపద అనుభవిస్తూ దౌర్జన్యం చేస్తున్నావ్ సిగ్గులేదా- అన్నట్టే వున్న బేరర్ గోడు కాస్తా,  తన సొంత గోడు అయిపోవడమే క్యారక్టర్ ని ఫాలో కాకుండా చేస్తుంది ఆలోచనాపరులకి. నీ ఐడెంటిటీ ఏమిటీ అని బేరర్ అడిగితే- డబ్బున్న నాన్న తనకి ప్రేమని పంచలేదని, ప్రేమంటే ఏమిటో తెలియకుండా పోయిందనీ, ఆకలి ఎరుగని జీవితంవల్ల కష్టాలంటే ఏమిటో తెలియకుండా పోయాయనీ, తనకి ఏ ఎమోషనూ లేకుండా పోయాయనీ, ఎమోషన్స్ తెలుసుకోవడానికే ప్రయాణం కడుతున్నాననీ, తండ్రి మీదికి తప్పు నెట్టేసి పలాయనం చిత్తగించినట్టుంది పాత్ర!

          రెండో పాత్ర ఇంట్లో మకాం వేసి చేసేదంతా స్లమ్ జీవితాన్ని చవి చూస్తూ, బాధలెలా వుంటాయో  స్వయంగా తెలుసుకుని, అమ్మ చేతి  వంట, వడ్డనా  ఎలా వుంటాయో రుచి చూసి, చెల్లెలితోనూ  నాన్నతోనూ  సెంటిమెంట్లు ఎలావుంటాయో అనుభవించి తరించడమే. ఇదంతా పూర్తయి అమెరికాలో తన తండ్రి కంపెనీ బాధ్యతలు స్వీకరించే సమావేశంలో,  ఆ తండ్రి తనకి కేటాయించిన లక్షల కోట్ల షేర్స్ ని పేదవాళ్ళకి దానమిచ్చేసి గొప్పవాడై పోతాడు! 

          అప్పుడు మనకి తనికెళ్ళ గారి బేరర్ ఓ మూల నిల్చుని మొత్తుకుంటున్నట్టు మైండ్ లో బొమ్మ తిరుగుతుంది – ‘ఓరి పిచ్చినాన్నా!  నే చెప్పింది నీ తండ్రి సొమ్ము నువ్వు దానం చేసి న్యూస్ కెక్కాలని కాదురా, ఆటోగ్రాఫులు ఇవ్వాలని కాదురా, నువ్వో రూపాయి సంపాయించి చూపించమనే!’ అని.

       ఇప్పుడా తండ్రి అనుకుంటాడు- ఫోర్బ్స్ కెక్కిన నేను గొప్పా, వీడు గొప్పా అని. ఇద్దరూ గొప్పే. డబ్బు గడించినవాడూ గొప్పే, దానమిచ్చేవాడూ గొప్పే, కాకపోతే దానమిచ్చేవాడు సొంత సొత్తు లోంచి ఇచ్చుకోవాలి. 

          సారీ సంపత్ నందీ, ఈసారి మీరు చాలా కన్ఫ్యూజ్ చేసేశారు.  వర్కౌట్ కాదు.
          హన్సిక, కేథరిన్ లు గ్లామర్ బొమ్మ పాత్రలకి సరిపోయారు. ముఖేష్ రిషీ విలనీ రొటీనే. ఇద్దరు కమెడియన్లున్నా ఆ కామెడీ సాదాగానే వుంది. ప్రొడక్షన్ విలువలుమాత్రం అత్యంత భారీతనంతో వున్నాయి. హీరో రిచ్ నెస్ గురించి తీసిన దృశ్యాలు ఫాంటసీ చూస్తున్నట్టున్నాయి. ఇది కరెక్ట్ గా వర్కౌట్ చేసిన డైనమిక్స్. ఈ అమెరికన్ లైఫ్  తర్వాత బొరబండ స్లమ్స్ కి కథ వచ్చినప్పుడు తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ఈ డైనమిక్సే ‘కాబిల్’ లో హీరోయిన్ పాత్రతో చేసి సక్సెస్ అయ్యాడు సంజయ్ గుప్తా. ఇక యాక్షన్ సీన్స్, పాటల చిత్రీకరణా వగైరా అంతా టాప్ క్లాస్. థమన్ నేపధ్య సంగీతం కూడా బాగా రాణించింది. డైలాగ్స్ బలంగానే వున్నాయి- పక్కదారి పట్టిన పాయింటుకి న్యాయం చేస్తూ. కానీ తండ్రి పాత్రలో చంద్రమోహన్ – నేను మూడు పూటలా మందులు ఎందుకు వేసుకోవడంలేదో తెలుసా?  వేసుకుంటే మీ ముగ్గిరికీ భోజనం వుండదని - అనడం మాత్రం అభ్యంతరకరంగా వుంటుంది. 

చివరికేమిటి 
      కథ రొటీనే అయినా ఇది టెంప్లెట్ లో లేకపోవడం చాలా పెద్ద రిలీఫ్. ఎలాటి ఓపెనింగ్ బ్యాంగులు లేకుండా కథకి పనికొచ్చే విషయంతో నేరుగా ప్రారంభమవుతుంది. గౌతం పాత్రనే పట్టుకుని పోతుంది. ఇరవై ఐదో నిమిషంలో నందా పాత్ర తగలడంతో మొదటి మలుపు వస్తుంది. అక్కడ్నించీ ఇరవై ఐదు నిమిషాలు నందా ఫ్లాష్ బ్యాక్. ముఖేష్ రిషీ విలనీ,  నందా మీద హత్యా ప్రయత్నం...ఇలా ఫస్టాఫ్ అంతా చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ సెంటిమెంట్ల బరుఫుకింద కుయ్యో మంటుంది  మొదటి అరగంటకి పైగా. చివరి అరగంట రెండు పాత్రల అమీతుమీతో యాక్షన్లో కొస్తుంది. 

          తనికెళ్ళ భరణి ఎందుకు పీకారోగానీ,  ఆ పీకిన క్లాసు యూత్ అప్పీల్ వుండే పాయింటుకి దారితీసేదే. డబ్బు సంపాదించడం ఎప్పుడూ యూత్ అప్పీల్ వుండే క్రేజీ పాయింటే. ఏడుస్తూ సెంటిమెంట్లు పొందడం యూత్ అప్పీల్ వున్న పాయింటు కాదు. ‘బ్రహ్మోత్సవం’ ఇది గమనించలేకే, ఏడుతరాల బంధువుల అన్వేషణ అనే ముసలి పాయింటు పట్టుకుని పోయింది. మార్కెట్ యాస్పెక్ట్ లో సరీగ్గా స్క్రిప్టుని  బైండింగ్ చేసుకోకపోతే గుదిబండవక తప్పదు.

          విషయం, పాత్ర ఎటెటో పోయినా గోపీచంద్ తన లోకంలో తాను  రెండు పాత్రల్నీ ఎంజాయ్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడనేది నిజం. తెలుగు ప్రేక్షకులందరూ ఈ మధ్య విషయమూ పాత్రా చూడ్డం లేదు కాబట్టి- ఇలా ఫటాఫట్ హీరోయిజాలు  చాలేమో  సినిమాలు తీయడానికి.

-సికిందర్ 

27, జులై 2017, గురువారం

488 - రివ్యూ!

     రచన – దర్శకత్వం : అలంకృతా శ్రీవాస్తవ్
తారాగణం : కొంకణా సేన్ శర్మరత్నా పాఠక్ఆహనా కుమ్రాప్లబితా బోర్థాకూర్సుశాంత్ సింగ్విక్రాంత్ మాసీ, జగత్ సింగ్ సోలంకీ తదితరులు 
సంగీతం : జేబున్నీసా బంగాష్మంగేష్ ధక్డేఛాయాగ్రహణం : అక్షయ్ సింగ్
బ్యానర్ : ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్
నిర్మాత ; ప్రకాష్ ఝా
విడుదల : 21 జులై, 2017 
                                                                                                                                                   ***


     సెన్సార్ బోర్డుతో యుద్ధానికి దిగి,  భారీగా 27 కట్స్ తో పహ్లాజ్ నిహ్లానీతో మోరల్ పోలీసింగ్ చేయించుకుని, ఎట్టకేలకు విడుదలైన ‘లిప్ స్టిక్ అండర్ మై బురఖా’ ఒక కరకు వాస్తవాన్ని కళ్ళ ముందుంచుతోంది మోరల్ పోలీసింగ్ చేయకుండానే  : మధ్యతరగతి స్త్రీలు   స్వేచ్ఛ కావాలనో, హక్కులుండాలనో ఎంత గొంతు చించుకున్నా, ఆ గొంతులకంటే వ్యవస్థలు పెద్దవి. ఒక్క ఇటుకని కూడా కదల్చలేరు- మత వ్యవస్థలోంచి, రాజకీయ వ్యవస్థలోంచీ. వూరికే ఇంట్లో వాళ్ళని అడిపోసుకుంటే కూడా లాభంలేదు. వాళ్ళు కూడా  ఈ రెండు వ్యవస్థలకి తరాలుగా బందీలే. 

          న్నతవర్గాల స్త్రీలకి దాదాపు స్వేచ్ఛ వుంటుంది. ఈ స్వేచ్ఛ ఆకర్షణల్ని సృష్టిస్తూంటుంది.  ప్రపంచం ఆకర్షణలు  – కోరికలు అనే రెండుగా విడిపోయివుంది. ఉన్నత వర్గాలు ప్రదర్శించే ఆకర్షణలు, వాటికోసం అర్రులు చాచే మధ్యతరగతి కోరికలు. ఈ గ్యాప్ ని పూడ్చే ప్రయత్నం పైనుంచి ఉన్నత వర్గాలతో జరగదు, ఎప్పుడూ కింది నుంచి మధ్యతరగతి జీవులతో ఊర్ధ్వ ముఖంగానే  జరుగుతూంటుంది. ఎంతకీ ఆ నీలాకాశం అందదు, ఇంతలో రాలిపడి మళ్ళీ వ్యవస్థల బందీకానాలో ముడుచుకోవడమే.

       రకరకాల స్వేచ్ఛలు  కావాలంటే ముందుగా  ఆర్ధిక స్వేచ్ఛ సాధించేందుకు సమయమంతా వినియోగించు- అప్పుడు పబ్బులు, మాల్సు, మల్టీ ప్లెక్సులు, బాయ్ ఫ్రెండ్స్,  కాస్త వయసు మళ్లినావిడకైతే ఫోన్ సెక్స్- అన్నీ చెంతకు వస్తాయి. ఎవరూ అభ్యంతర పెట్టరు. ఆర్ధిక స్వేచ్ఛ లేకుండా అప్పుడే స్వేచ్ఛ పేరుతో ఈ ఆకర్షణల వెంట పడ్డావా- ఈ రియలిస్టిక్ మూవీలో అభాగినుల గతే నీకూ పడుతుంది. స్వేచ్ఛని ఉన్నత వర్గాలు బాహాటంగా అనుభవిస్తాయి. అనుకరణ జీవులైన మధ్యతరగతి వర్గాలు దొంగ చాటుగా అనుభవించాలని చూస్తాయి- అదేం స్వేచ్ఛ? ముందు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని సాధిస్తే ఈ ఖర్మే వుండదు. పొందిన ఆర్ధిక స్వేచ్ఛనంతా కూడా దుర్వినియోగం చేసుకుని డ్రగ్స్ కేసులో దొరికిపోవాలనుంటే దొరికిపో. కానీ డ్రగ్స్ కేసులో దొరికిపోయి హెడ్ లైన్స్ సృష్టించడానికి ఏళ్ల కేళ్ళు  అంత  కష్టపడి గడించిన ఆర్ధిక స్వేచ్ఛంతా  అవసరం లేదు. మధ్యతరగతి జీవిగానే రెండువేలు ఎక్కడ అడుక్కున్నా, చిటికెడు డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు, పట్టుకుని ప్రెస్ మీట్ లో పెట్టేవాళ్ళూ ఎప్పుడూ వుంటారు. 

      బురఖా పంజరానికి సింబల్. లిప్ స్టిక్ స్వేచ్ఛకి సంకేతం. పంజరంలో ఈ నల్గురు లిప్ స్టిక్ పక్షులు బయట  రహస్యంగా ‘స్వేచ్ఛ పొందుతూంటారు. ముందుగా కాలేజీ టీనేజీ రిహానా (ప్లబితా బోర్థాకూర్) చక్కగా బురఖా వేసుకుని బయల్దేరి దారిలో తీసిపారేసి,  లోపలున్న జీన్సూ టీ షర్ట్స్ తో టూవీలర్ మీద జామ్మని కాలేజీకి దూసుకుపోతుంది. ఆమెకి చాలా కోరికలున్నాయి. అందుకని కాలేజీ నుంచి వస్తూ షాపింగ్ మాల్స్ లో ఖరీదైన వస్తువులు కొట్టేసి వస్తూంటుంది. ఆమెకింకో కోరిక వుంది- మిలీ సైరస్ లాగా సింగర్ నవ్వాలని. దానికి ఓ బ్యాండ్ గ్రూప్ లో చేరి పాడుతూంటుంది. అక్కడ ధృవ్ అనే బాయ్ ఫ్రెండ్ ఏర్పడతాడు. ఈమె చేసే ఈ రహస్య కార్యకలాపాలేవీ ఇంట్లో బురఖాలు తయారు చేసే  తల్లిదండ్రులకి తెలియకుండా వుంటాయి.


          లీలా (
ఆహనా కుమ్రా) అనే ఓ ఇరవై ఏళ్ళు పైబడ్డ అమ్మాయి బ్యూటీ పార్లర్ నడుపుతూంటుంది. ఆమెకి ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ( విక్రాంత్ మాసీ)వుంటాడు. తల్లికి దొరక్కుండా అతడితో ఎక్కడపడితే అక్కడ  సెక్స్ స్వేచ్ఛ పూర్తిగా అనుభవిస్తూ వుంటుంది. కానీ ఈ ఇరుకు వూళ్ళోంచి ఢిల్లీ పారిపోయి, అక్కడ ప్రతిరోజూ బాయ్ ఫ్రెండ్ తో హనీమూన్ లా గడపాలనీ  కోరికలుంటాయి. 

          షిరీన్ (కొంకణా సేన్ శర్మ) అనే ముప్పై పైబడ్డ ముగ్గురు పిల్లల తల్లి వుంటుంది. ఈమె ఓ కంపెనీలో సేల్స్  ఎగ్జిక్యూటివ్. భర్త రహీం (సుశాంత్ సింగ్) సౌదీ వెళ్లి వచ్చి ప్రస్తుతం ఖాళీగా వుంటున్నాడు. తన ఉద్యోగం గురించి అతడికి తెలియనివ్వకుండా రహస్యంగా ఆఫీసు కెళ్ళి వస్తూంటుంది. రాత్రయితే ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అతడికి సెక్స్ కావాలి. ఈ మారిటల్ రేప్ ని భరిస్తూ, అనేక గర్భాలు అబార్షన్ చేయించుకుంటూ నిస్సారంగా జీవిస్తూంటుంది. 

     ఉష (రత్నా పాఠక్) అనే 55 ఏళ్ల విడో వుంటుంది. ఈమెకి అప్పుడే వయసై పోలేదనీ, ఇంకా అనుభవించాల్సింది వుందనీ వుంటుంది. హిందీ  రోమాంటిక్ నవలలు చదువుతూ ఫాంటసీల్లో బతుకుతుంటుంది. జగత్ అనే ఒక స్విమ్మింగ్ కోచ్ పరిచయమై, స్విమ్మింగ్ నే ర్చుకునే వంకతో అతడి స్పర్శలోని  హాయిని అనుభవిస్తూ వుంటుంది. రాత్రి పూట రోజీ పేరుతో అతడికి ఫోన్ చేసి ఫోన్ సెక్స్ కి  పాల్పడుతూంటుంది. చాలా గ్లామరస్ గా తయారై హుషారుగా తిరుగుతూంటుంది. 

          ఈ నల్గురూ విడివిడిగా ఈ రహస్య కలాపాలతో ‘స్వేచ్ఛ’ ని పొందుతూ వుంటారు. అప్పుడు మాల్ లో చోరీ కేసులో రిహానా దొరికిపోతుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడు. ఆమెని విడిపించుకున్న తండ్రి,  కాలేజీ మాన్పించి ఇంట్లో బురఖాలు కుట్టమంటాడు. సంబంధాలు చూడమని భార్యతో చెప్తాడు. మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటుంది రిహానా. 

          లీలా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తూ తల్లికి దొరికిపోతుంది. ఆమెని రెండు పీకి సంబంధం చూసి నిశ్చితార్ధం కూడా చేస్తే, బాయ్ ఫ్రెండ్ తోనే ఎంజాయ్ చేస్తూంటుంది. ఆ తల్లి, పెళ్లి కొడుకు వదిలి పారేస్తారు. 

          షిరీన్ కి నలభై వేల జీతంతో ప్రమోషన్ వస్తుంది. ఆమె ఉద్యోగం చేస్తోందన్న సంగతి భర్తకి తెలిసిపోయి రేప్ చేసి, ఉద్యోగం మానేసి,  ఇంట్లో పడుండమంటాడు.

          ఉష సీక్రెట్ లవ్ చుట్టు  పక్కల తెలిసిపోయి ఆమెని వీధికి లాగి అల్లరల్లరి చేస్తారు. ఇది జగత్ చూస్తాడు. తనతో ఫోన్ సెక్స్ చేస్తోంది ఈమేనని అప్పుడు తెలుసుకుని,  అనరాని మాటనేసి వెళ్ళిపోతాడు.

          ఎలా మొదలయ్యారో మళ్ళీ అదే స్థితికి- అదే పంజరంలోకి వచ్చి  చేరుకున్న  నల్గురూ ఓ గదిలో చేరతారు. ఏదో పైకెగురుదామనుకుంటే, ఇంకింత  అధఃపాతాళంలోకే  పడ్డారు. ధూమపానం  చేస్తూ కబుర్లాడుకుంటారు. జనం చించి పారేసిన ఉష దాచుకున్న నవలలుంటాయి రకరకాల రోమాంటిక్ టైటిల్స్ తో. వాటితో కాసేపు ఆ ఓల్డ్ లేడీని ఆటలు పట్టిస్తారు. ఒక నవల చివరి మూడు పేజీలు  చదవలేదని, చదివి విన్పించమనీ  అంటుందామె. ఇప్పుడా రోజీ కథ ముగింపు చదివి విన్పిస్తుంది రిహానా. చాలా ఫీలవుతారు. 

        ప్రారంభంనుంచీ వాయిసోవర్ లో అప్పుడప్పుడు వచ్చే రోజీ కథ ఈ  నవల్లోనిదన్న మాట. మొత్తం కథలో  ఈ నల్గురికీ వర్తించే వెన్నో వున్నాయి. ఒక ప్రధాన పాత్రంటూ లేకుండా, నల్గురి వేర్వేరు కథలుగా వున్న స్క్రీన్ ప్లేకి,   వాయిసోవర్ లో రోజీ కథనం ఒక బ్రిడ్జింగ్ ఫోర్సుగా కలిపి వుంచుతుందన్న మాట.

          ఈ పాత్రల్ని మర్చిపోలేం, ఈ నటుల్ని మరచిపోలేం, ఈ దర్శకురాలినీ మర్చిపోలేం. ప్రముఖ దర్శకుడైన నిర్మాత ప్రకాష్ ఝానీ కొనియాడలేక వుండలేం. చాలాకాలం పాటు ఈ సినిమా మనుషులనే వాళ్ళని వెంటాడుతూంటుంది. స్వేచ్ఛ అంటే ఏమిటో, అందులోనూ మధ్యతరగతి ఆడవాళ్ళు అర్ధం చేసుకోవాల్సిన స్వేచ్ఛ అంటే ఏమిటో, అదెలా లభిస్తుందో, ఎలా లభించదో, ఎప్పుడు లభిస్తుందో, ఎప్పుడు లభించదో - ఒక్క డైలగుతోనూ చెప్పకుండా, పరిణామాల క్రమం చూపించి వదిలేసిన ఈ క్రియేషన్ ఒక అద్భుతమైన అనుభవం ప్రేక్షకులకి.

-సికిందర్
         
         
488- రివ్యూ!


రచన- దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
తారాగణం : శృతి, పూజా గాంధీ, సంజన, వి శంకర్, మార్కండ్ దేశ్ పాండే, రఘు ముఖర్జీ, భాగ్యశ్రీ, రవి కాలే, పెట్రోల్ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు
సంగీతం : అర్జున్ జన్య, ఛాయాగ్రహణం : వెంకట్ ప్రసాద్
బ్యానర్ : నిర్మాత
: వెంకట్, విడుదల : 22 జులై, 2017

***

        హిట్టయిన కన్నడ ‘దండుపాళ్యం’ ని తెలుగులోనూ బాగానే రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఐదేళ్ల తర్వాత దీని సీక్వెల్ గా ‘దండుపాళ్యం- 2’ విడుదలయింది. యాక్షన్ / హార్రర్  సినిమాలే సీక్వెల్స్ గా విడుదలవుతాయని తెలిసిందే. ఐతే ‘దండుపాళ్యం’ సీక్వెల్ ఏ రకంగా సీక్వెల్ అవుతుంది? సీక్వెల్ కి కూడా భాగాలుంటాయా? అపుడు దాని ప్రభావం ఎలా వుంటుంది? ఓసారి చూద్దాం...

కథ  
          ‘దండుపాళ్యం’ లో 80 హత్యలు చేసిన కిరాతక దోపిడీ ముఠా దొరికిపోయి జైలు కెళ్తారు. ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ఆరేళ్ళ విచారణా ననంతరం ఈ పదకొండు మంది సీరియల్ కిల్లర్స్ కీ మరణ శిక్షలు పడతాయి. అయితే అభివ్యక్తి (శృతి) అనే జర్నలిస్టు  వీళ్ళు  నేరస్థులని నమ్మదు. ఈ కేసులో పోలీసుల పాత్రని అనుమానించి దర్యాప్తు చేయడం మొదలెడుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా ముఠా సభ్యులని జైల్లో కలుస్తుంది. అప్పుడు వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పుకొచ్చేదే ఈ సీక్వెల్ కథ...
ఎలావుంది కథ
         దండుపాళ్యం’ లాగే ఇదీ పూర్తిగా నిజకథ  కాదు, కాల్పనికం చేశారు. కర్నాటకలో నిజ కథకి 1930 లలో బీజాలు పడ్డాయి. ఐతే  1996 – 2000 మధ్య ఈ చివరి తరం గ్యాంగ్ సభ్యులు పాల్పడ్డ దోపిడీ హత్యలు రాష్ట్రాన్ని గజగజ లాడించాయి కాబట్టి,  దీన్ని కాల్పనికం చేసి  మొదట 2012 లో ‘దండుపాళ్యం’ తీస్తూ వాళ్ళు పట్టుబడినట్టు ముగించారు. ఇప్పుడు సీక్వెల్ తీస్తూ ఇదే కర్కోటక ముఠా అమాయకులనీ, పోలీసులు వీళ్ళని ఇరికించి అన్యాయంగా మరణశిక్షలు పడేలా చేశారనీ చూపిస్తూ  సానుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. తాజాగా కర్నాటక హైకోర్టు జులై 21 న ఈ పదకొండు మందిలో ముగ్గురికి ఉరిశిక్షలు రద్దు చేసింది కూడా. దీనిమీద పోలీసులు సుప్రీం కోర్టు కెళ్ళినా ప్రయోజనం లేనంత డబ్బా కేసు పెట్టారు. ఈ సీక్వెల్ లో కథకోసం కొన్ని కల్పితాలు చేశారు. వాటిలో ఒకటి- ఎలాటి సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, కేవలం సాక్షుల చేత చెప్పించి కేసులు  నడిపించారని.  ఈ కథలో చెప్పినట్టుగా, ఐదేళ్లుగా దొరక్కుండా ఎనభై హత్యలు చేశారని చెబుతున్న ముఠాని ఒకవేళ కేసుల్లో  ఇరికించాలనుకుంటే, పోలీసులు అంత  బలహీనంగా కేసులు పెడతారా అన్న సందేహం వస్తుంది.  ఇంత బలహీన కేసు మరణ శిక్షల దాకా వెళ్తుందా?  వాస్తవంగా ముద్దాయిల్లో ఆరుగురి మీద రేప్ నేరాలకి రుజువుల్లేవని కూడా కొట్టేసింది  హైకోర్టు.  హత్య కేసుల్లో అతిముఖ్యమైన సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, చెప్పుడు సాక్ష్యాలతో  ఏ కోర్టూ విచారణ చేపట్టదు. ఇలా సీక్వెల్ లోనే అర్ధంలేని కల్పన చేశారు. ఈ కేసుని ప్రాథమిక స్థాయిలో ట్రయల్ కోర్టు చేపట్టిందంటేనే  ఎంతో కొంత మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నట్టే. ఆ మెటీరియల్ ఎవిడెన్సులో భాగమైన వేలిముద్రలు కలవక ముగ్గురికి మరణశిక్షల్ని రద్దు చేసింది హైకోర్టు.
          కాబట్టి నిజంగా జరిగింది  చూస్తే  పోలీసుల అసమర్ధత కన్పిస్తుంది. దీన్ని సినిమాకోసం లాజిక్ చూడకుండా పోలీసుల కుట్రగా మార్చి, నిందితుల్ని అమాయకుల్ని చేసి సీక్వెల్ నడిపించారు.  ఇలాటి  క్యారక్టర్ రివర్సల్ మూసఫార్ములాకైతే చెల్లుతుందేమోగానీ, రియలిస్టిక్ సినిమాతో కాదు.  ఇక దీన్నెలా జస్టిఫై చేశారో సీక్వెల్లో తేల్చలేదు. నడుస్తూ నడుస్తూ వున్న సీక్వెల్ ని ఠకీ మని ఆపేసి,  ముగింపు ఆగస్టులో చూడండని ప్రకటన వేసి షాకిచ్చారు. ముగింపు కోసం ఇంకోసారి డబ్బులు పెట్టుకుని చూడాలా? ఇదెవరూ నోరత్తలేని మోసమే పూర్తి సినిమా చూపించకుండా. ‘దండుపాళ్యం’ ని పాడియావు చేసి సాధ్యమైనంత పిండుకోవాలని చూస్తున్నారు. ‘దండుపాళ్యం – 2’ రెండు భాగాలుగా వుంటుందని ముందే చెప్పివుంటే అదివేరు.
          ఇకపోతే ముగింపు లేని సినిమాకి రివ్యూ  ఏమిటి? ఎలా రాస్తాం? ఏమో!
ఎవరెలా చేశారు
          పోలీసు అధికారిగా రవిశంకర్ కి చాలా పనుండే సీక్వెల్ ఇది. ‘
దండుపాళ్యం’లో ముఠా పాల్పడ్డ ఘోరాలు చూపిస్తే, ఇప్పుడు పోలీసుల అకృత్యాలు చూపించడం మొదలెట్టారు. ఈ అకృత్యాలకి సారధి రవిశంకర్ పాత్ర. కౄర నీచ నికృష్ట పాత్రని కూల్ గా పోషించాడు. కూలీల చేత చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి పెట్టే చిత్ర హింసల్లో అతి పచ్చిగా కన్పిస్తాడు. ఇతనూ ఇతడి సహోద్యోగులు ఇద్దరూ టార్చర్ సెక్షన్ చూసుకుంటే, ఇక పదకొండు మంది ముఠా చిత్రహింసలకి అల్లాడే బ్యాచిగా కన్పిస్తారు. బ్యాచిలో పూజా గాంధీ బాధిత పాత్రలో ఎంత జీవించినా దాని ప్రభావం ప్రేక్షకుల మీద పడే అవకాశం లేదు. ఆమె పచ్చి హంతకురాలని ముందే చూసేశారు ప్రేక్షకులు. ఇదే పరిస్థితి బ్యాచిలో మిగతా అందరితోనూ.  

          సంజన గురించి పెద్ద హైప్ వచ్చింది. ఈ సీక్వెల్ లో ఆమె ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. బ్యాగ్ గ్రౌండ్ ఆర్టిస్టుగా రెండు మూడు సీన్లలో కన్పించి అవుట్ అయిపోతుంది. టెక్నికల్ గా ఛాయాగ్రహణం, బిజిఎంలు బలంగా వున్నాయి. ఛాయాగ్రహణంలో పోలీస్ టార్చర్ కి అవసరమైన చోట్ల డచ్ యాంగిల్స్ వాడుకున్నారు. ఇది కేవలం ఒక రియలిస్టిక్ మూవీ లాంటిదే తప్ప డార్క్ మూవీ కాదు, ఏ నోయర్ కాదు- కథాపరంగానూ, చిత్రీకరణ పరంగానూ. సంభాషణల్లో పదేపదే పచ్చి బూతులు దొర్లాయి. 
చివరికేమిటి
         
ఫస్టాఫ్ మరణ శిక్షలు పడ్డ దోషులు జైలుకి రావడం, వీళ్ళు దోషులని నమ్మని జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడం, జైల్లో వాళ్ళని కలుసుకోవడం వుంటాయి. సెకండాఫ్ లో వాళ్ళు జర్నలిస్టుకి తమ ప్లాష్ బ్యాకుగా చెప్పుకునే జీవితాలుంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతూనే పోలీస్ టా ర్చర్ల  ఎపిసోడ్లు మొదలవుతాయి. పూజా గాంధీ టార్చర్ తో అకస్మాత్తుగా సెకండాఫ్ ముగిసి,  ముగింపు ఆగస్టుకి వాయిదా వేశాం పొమ్మనడం వుంటుంది. 

          ఫస్టాఫ్ లో త్వరత్వరగా పది నిమిషాల్లో జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడంతో బిగినింగ్ ముగిసి  ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. బహుశా సెకండాఫ్ చివర్లో పూజా గాంధీ టార్చర్ తో  ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ మధ్యలో నడిచే మిడిలంతా, ఫస్టాఫ్ లో బావున్న మిడిల్ వన్ వదిలేస్తే, సెకండాఫ్ లో మిడిల్ టూలో,  ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అనాసక్తికరం, అనవసరం, బాక్సాఫీసు అప్పీల్ లేనితనం, పరమబోరు కొట్టే నాటకం. ఎంత కౄరులో ‘
దండుపాళ్యం లో చూపించాక, ఇప్పుడెంత కల్లాకపటం ఎరుగని నగరానికి వలస వచ్చిన అమాయక జీవులో చూపిస్తే, నవరసాల్లో ఇదే రసమవుతుంది ప్రేక్షకులు  కనెక్ట్ అవడానికి? ‘నిర్భయ’ దోషులు పూర్వం ఏంతో పవిత్రులని చెప్తే చెల్లుతుందా? యాకుబ్ మెమన్ ఉరి రద్దుని కోరడమెలాంటిదో, దండుపాళ్యం ముఠా పట్ల సానుభూతిని ప్రోది చేయడం అలాంటిదే అన్నట్టు తేలింది. 

          వీళ్ళని సంచార జాతిగా చూపిస్తూ, గుడిసెల్లో జీవించడం, పందుల్ని పెంచడం, అర్ధాకలితో అలమటించడం, అన్నం అడుక్కుంటూ తిరగడం, జబ్బుతో చావడం...ఒకటని కాదు, ఇప్పటి సినిమాల్లో కన్పించని  సినిమా కష్టాలన్నీ, కన్నీళ్ళన్నీ వున్నాయి. ఆర్టు సినిమా కళలన్నీ వున్నాయి. 

          సెకండాఫ్ లో సంగం ఈ జీవితాలు, సగం పోలీస్ టార్చర్. విషయంలేని ఈ వృధానంతా  అరికడుతూ జర్నలిస్టు పాత్రతో ప్రస్తుతానికి వచ్చి వేగవంతం చేయాల్సింది. కానీ దీన్ని పాడియా వుగా చూస్తూ, ఇంకా ప్రేక్షకుల జేబుల్లోంచి డబ్బులు పిండుకునే ఉద్దేశంతో సాగదీశారు. ఇంత ఫ్లాష్ బ్యాక్ చెబుతున్న హంతక ముఠా నిజమే చెప్తున్నారని మనమెలా నమ్మాలి? దీనికి జర్నలిస్టు దొరకబుచ్చుకున్న ఒక్క ఆధారమూ విశ్వనీయత కోసం ఎస్టాబ్లిష్  చేయలేదు. 

          ముగిసిపోయిన ‘
దండుపాళ్యం’ దారుణ చరిత్రని కెలికి ఇంకేదో చేయాలనుకున్నారు. దీన్ని ఆగస్టు ముక్కలో ఎలా జస్టిఫై చేస్తారో చూసేందుకు, ఈ రివ్యూని కూడా ముగింపు వాయిదా వేసి  వెళ్లిపోదాం.

-సికిందర్
         
         
         

26, జులై 2017, బుధవారం

487- నాటి సినిమా!

       పాత్రికేయుడు థామస్ ఫ్రీడ్మన్ తరచూ ఓ మాట అంటూంటాడు - ప్రపంచంలో ఉగ్రవాద సమస్య తీరడానికి, ఆ వైపు ఆకర్షితులవుతున్న వాళ్ళతో మత పెద్దలు కూర్చుని రచ్చబండ  సమావేశాలు జరుపుకోవాలని. కులపంచాయితీలకి, కట్టుబాట్లకు, సెంటిమెంట్లకి ప్రబల గుర్తుగా వుండే విలేజి రచ్చబండ  తీర్మానాలు, అంత బలమైన ప్రభావం చూపగలవని ఆయన నమ్మకం. కానీ దురదృష్ట వశాత్తూ ఇలాటి సమావేశాలు ఉగ్రవాద తండాల్లోనే  జరుగుతూ, అసంఖ్యాక లేతపిండాలు కరుడుగట్టిన  టెర్రరిస్టులుగా తయారై లోకం మీద పడడాన్ని చూస్తున్నాం. 

          ప్రజాపాలనేది పాజిటివ్ అర్ధంలోకంటే, నెగెటివ్ కోణంలోనే సమాంతర వ్యవస్థ రూపంలో సూపర్ హిట్టవుతుందేమో! ఉగ్ర తండాల్లో తాలిబన్లు, గ్రామాల్లో భూస్వాములు, నగరాల్లో మాఫియాలు... సినిమాల్లో బొబ్బిలిబ్రహ్మన్న! 


             ఔను వాళ్ళిద్దరూ మెలికపడ్డారు...ఫిలిం ఈజ్ బిహేవియర్ అన్నట్టే, స్టార్ ఈజ్ ఆర్గ్యుమెంట్ అని కూడా అన్నారు పెద్దవాళ్ళు. బ్రహ్మన్న ఈ రెంటినీ మెలేసి, ధర్మపీఠం  స్థాపించి కూర్చున్నాడు! ఫ్రీడ్మన్ మార్కు విలేజి రచ్చబండ స్థానే, ధిక్కార ధోరణితో సమాంతర  వ్యవస్థనే స్థాపించాడు. నేరం జరిగిందా, ఇక పోలీసులకి నో ఎంట్రీ. విచారణ తనదే, తీర్పు కూడా తనదే. తీర్పుని శిరసావహించకపోతే  గ్రామబహిష్కారం లేదా అక్కడున్న కత్తితో చటుక్కున శిరవిచ్ఛేదం!  ఎంత తీవ్రవాదం...టోటల్లీ అబ్నార్మల్ క్యారక్టర్!

          ఒక సహజవిరుద్ధమైన పాత్రతో రచయిత / దర్శకుడు ప్రేక్షకుల మనస్సుల్లోకి ప్రవేశపెట్టాలనుకునే వాదం ఒప్పించేదిగా వున్నప్పుడే అది విజయవంతమవుతుంది. సినిమా ఆసాంతం కథనం పేరుతో  చేసేదే వాదం అయినప్పుడు, దానికో నాదం వుంటుంది.వాదాన్ని నాదంలా వినిపించడంలో విఫలమైతే  అభాసవుతుంది. బ్రహ్మన్న తన బిహేవియర్ ని, ఆర్గ్యుమెంట్ నీ అంతబాగా వొంటబట్టించుకున్నాడు కాబట్టే, పాత్ర ప్రయాణాన్ని నల్లేరు మీద నడకలా మార్చుకోగలిగాడు. దీన్నే ‘ధర్మాధికారి’ గా హిందీలో దిలీప్ కుమార్ తో కృష్ణంరాజే రీమేక్ చేస్తే, కోలుకోలేని నష్టాలే తేలాయి.  కారణం? దిలీప్ మెత్తటి నటుడు. కృష్ణం రాజులా కళ్ళెర్ర జేసి పౌరుషాగ్నిని రగిలించడం కష్టం. కృష్ణంరాజుకి కళ్ళే నటనకి తరగని ఆస్తి. సంచలన క్యారక్టర్ వుంటే చాలదు, దానికి తగ్గ ఆర్టిస్టు బలం తోడవాలని దిలీప్ కుమార్ తో తేలింది. బిహేవియర్, ఆర్గ్యుమెంట్, ఆర్టిస్టు బలం - ఈ మూడూ ఇనుమడింప జేసే టాలెంట్ కృష్ణం రాజుది. గోపీ కృష్ణా మూవీస్ సంస్థ స్థాపించి, నిర్మించిన ‘కృష్ణవేణి’ (1974) లో వాణిశ్రీ పోషించిన మతిస్థిమితం కోల్పోయిన సహజ విరుద్ధపాత్ర ఆమె టాలెంట్ తో ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే! 

   ‘బొబ్బిలిబ్రహ్మన్న’ రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రాసిన సిద్ధాంత గ్రంథం – ‘తెలుగు సినిమా సాహిత్యం- కథ, కథనం, శిల్పం’ - లో ఓ చోట ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వివరిస్తూ, తెలియని అద్భుత శక్తేదో ఆ కష్టమైన సన్నివేశాన్ని రాయించిందంటారు.  మనం చెప్పుకోవాలంటే, ఆ సన్నివేశాన్నలా వుంచి, అసలు బ్రహ్మన్న అనే అసాధారణ పాత్రనే ఆ అద్భుత శక్తేదో సృష్టించిందనాలి.

      ఈ బ్రహ్మన్న బొబ్బిలి బ్రహ్మన్నల వంశంలో నాల్గవతరం మనిషి. 1857 సిపాయీల తిరుగు బాటప్పుడు, బ్రిటిష్ సైనికులు కోటిపల్లి గ్రామంలో అరాచకాలు చేస్తారు. దీని మీద తిరగబడ్డ మొదటి తరం బ్రహ్మన్న కత్తిపట్టి అరాచక మూకల్ని తెగ నరుకుతాడు. అప్పుడు తెల్లదొర బ్రహ్మన్నని మాయోపాయంతో పట్టుకుని చెట్టుకి ఉరి తీయిస్తాడు. అలా వీరస్వర్గం పొందిన ఆ మొదటి  బ్రహ్మన్న వేలాడిన చెట్టునే నరికి, దాని మొదల్లో అతడి కత్తినే అధికారానికి గుర్తుగా నాటుతారు గ్రామస్థులు. అప్పట్నించీ బ్రహ్మన్న వంశస్థులు గ్రామం లోకి పాలకుల ప్రవేశాన్ని నిషేధించి, ధర్మాన్ని తామే కాపాడుకుంటూ వున్నారు. ఇదంతా ప్రారంభ దృశ్యాల్లో జయసుధ బుర్రకథగా  చెప్పుకొచ్చే ఫ్లాష్ బ్యాక్.  

          ఈ నేపధ్యంలో ఇప్పటి బ్రహ్మన్న పాత్రచిత్రణలో ఓ సమస్య లేకపోలేదు. ఓ సన్నివేశంలో నిందితుడి కోసం గ్రామాని కొచ్చే పోలీసు అధికారిని బ్రహ్మన్న ఆపేస్తూ, అధికారుల వెలికి  తన కారణాలు చెప్తాడు – ‘ఆ నాడు తెల్లవాడు తన సైనికుల చేతిలో పరిపాలన పెడితే, మగవాడి ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. మలినాడు నిజాం నవాబు ఖాసీం రజ్వీ చేతిలో అధికారం ఉంచితే, ఆడవాళ్ళ శీలానికి భద్రత లేకుండా పోయింది, ఈ  నాడు ప్రజాప్రభుత్వాలు మీ పోలీసుల చేతుల్లో ప్రజల బతుకులు పెడితే...’ అంటూ పోలీసుల ఘోరాలు వార్తా పత్రికల్లో చూపిస్తానంటాడు. 

          ఇప్పటి బ్రహ్మన్న కార్యాచరణకి ఈ కారణాలు చాలవనిపిస్తాయి. ఎప్పుడో శతాబ్దాల క్రితం 1857 లో గ్రామంలో జరిగిన సంఘటనలు,  ముత్తాత బలిదానమూ వగైరా ఇప్పటి తన ప్రవర్తనకి ఇంకా చోదక శక్తులుగా వుంటాయా? పాతికేళ్ళ క్రితం తన తల్లి దండ్రుల్ని చంపిన విలన్ ని కళ్ళారా చూసిన హీరో, ఎప్పుడో పెద్దయ్యాక పగతీర్చుకోవడమే ఒక అసహజ చిత్రణ.  అలాటిది 152 ఏళ్ల తర్వాత ఇంకా పాలనా వ్యవస్థ మీద బ్రహ్మన్న పగబట్టి కూర్చోవడం అతి అన్పిస్తుంది. ఆ చెప్పే కారణాలకి కూడా పొంతన కన్పించదు. బ్రిటీష్ పాలనలో అరాచకాలు  సరే, మధ్యలో ఖాసీం రజ్వీ అరాచకాలు  కోస్తాలో ఎక్కడ జరిగాయి.  తెలంగాణాలో జరిగిందాన్ని కోస్తా కెలా అన్వయిస్తాడు. తన ప్రాంతం  గురించే  మాట్లాడాలి. నిజాం కూడా పాలనని రజ్వీ చేతిలో పెట్టలేదు. ఏ నిజాంల  కాలంలో కూడా మతకలహాలు  జరగలేదు. ఇక రాజ్యం పోతుందన్న దుగ్ధకొద్దీ ఖాసీం రజ్వీ దాన్ని ఎదుర్కోవడానికి నిజాంని కాదని రజాకార్లని సృష్టించి ఎగదోశాడు. ఇక బ్రహ్మన్న పాత్ర వున్న కోస్తాలో బ్రిటిష్ పాలనపోయి భారత పాలన మాత్రమే వచ్చింది. 


     బ్రహ్మన్న ఇప్పుడు చర్యకి పూనుకోవాలంటే ప్రత్యక్ష అనుభవాలతో కూడిన ఫ్లాష్ బ్యాక్ పడాలేమో? పాతికేళ్ళ తర్వాత విలన్ మీద పగదీర్చుకునే హీరోకైనా చిన్నప్పుడు  ఏం జరిగిందో అతడితోబాటు అది చూసిన ప్రేక్షకులకి, అతడి పగతో కనెక్ట్ అయ్యే ఎమోషన్ పుట్టుకొస్తుంది. కానీ బ్రహ్మన్న కీ సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేదు. అతను బ్రిటిష్ కాలంనాటి సంఘటనలు చూడలేదు, ప్రేక్షకులు చూశారు. బ్రహ్మన్నతో ప్రేక్షకులకి ఈ ఎడం వుంది. అల్లూరి సీతారామరాజు కూడా మన్యం ప్రజల బాధలు కళ్ళారా చూసి, చలించిన ఫలితంగానే చర్యకి పూనుకున్నాడు. ఇప్పటి బ్రహ్మన్నకి విన్న విషయాలే తప్ప, కన్న విషయాలూ  బాధాకర అనుభవాలూ లేవు. అతను సుఖంగా కాలం గడుపుతున్నాడు. ప్రేక్షకులకి కళ్ళారా చూపించిన పూర్వకాలపు దృశ్యాలు, బ్రహ్మన్నకి అనుభవం కావాలంటే, కనీసం అతడి తండ్రి చనిపోతూ చెప్పాలి, చెప్పి వంశానుగతంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించాలని మాట తీసుకోవాలి- అప్పుడే ప్రేక్షకులతో ఎడం తీరే అవకాశం వుంటుంది. 

          ఇదే విషయం రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ముందు పెడితే, ఫ్లాష్ బ్యాకులు ఎక్కువై పోతాయన్నారు. జయసుధ బుర్ర కథతో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ సరిపోతుందన్నారు. అది ప్రేక్షకులకి చెప్పారు, బ్రహ్మన్నకి చెప్పినట్టు చూపించలేదు కదా అంటే, దానికేదో చెప్పారు. మరి సెకండాఫ్ లో అన్నపూర్ణతో కృష్ణంరాజు ఫ్లాష్ బ్యాక్ గురించి అడిగినప్పుడు, దానికి టకటకా చెప్పేసి కన్విన్స్ చేశారుగానీ; అంతటి బ్రహ్మన్న, తన మీద వచ్చిన ఆరోపణలకి ఆ ఫ్లాష్ బ్యాకే చెప్పి, ప్రత్యర్ధి నోర్మూయించలేకపోతే, మళ్ళీ తన కొడుకే వచ్చి కాపాడాల్సి వస్తే, అది కూడా చాలక అన్నపూర్ణ కూడా వచ్చి బలపరచాల్సి వస్తే, బ్రహ్మన్న పాత్ర దయనీయ స్థితిలో పడిపోలేదా అన్న ప్రశ్నకూడా మనకి ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రశ్నలకి వివరణల  సంగతెలా వున్నా, ఎప్పుడో 1984 లో రాసిన స్క్రిప్టు సంగతులు ఇంకా గుర్తుండడం చూస్తే ఆయన జ్ఞాపక శక్తి అమోఘమన్పిస్తుంది. 

          ఇలా పైవిధంగా సహజ విరుద్ధ సినిమాటిక్ పాత్ర బ్రహ్మన్న కి కాస్త అతి కూడా జత కలిసింది. చర్యకీ కారణానికీ ఎడం వుంటే అతిగానే వుంటాయి పాత్రలు. తాలిబనిజంతో కూడిన నెగెటివిజం,  యాంటీ హీరోయిజములే  బ్రహ్మన్న విలక్షణ వ్యక్తిత్వం. ప్రేక్షకులు నిజ జీవితంలో ఏసు క్రీస్తు, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ ల వంటి అహింసా  మూర్తుల్ని హీరోలుగా పరిగణినిస్తారనీ, అదే సినిమాల్లో కొచ్చే టప్పటికి, హీరో వయోలెంట్ గా వుంటేనే అభిమానిస్తారనీ, ఓ హాలీవుడ్ రచయిత సెలవిచ్చాడు. ఇలాంటి వయోలెంట్ బ్రహ్మన్న తాపత్రయమంతా కూడా ధర్మం కోసమే. 

          ఈ ధర్మపీఠం మీద ఆధిపత్యం కోసం పెద వెంకటరాయుడుగా రావుగోపాలరావు  కుతంత్రాలు. ఈయనది  కామిక్ విలనీ. బృహన్నల లాంటి కొడుకుగా  సత్యనారాయణనీ, చాణక్య చిట్కాలు చెప్పే గుడిపూజారి గా నూతన్ ప్రసాద్ నీ, ఇంకా అటలు పట్టించి  పరువు తీసే బార్బర్ గా  అల్లురామలింగయ్యనీ వెంటేసుకుని ఏం తీర్పులు  చెప్తాడో దేవుడెరుగు- ఎలాగైనా ధర్మ పీఠం తనకి కావాలంటే కావాలంతే! దీనికోసం బ్రహ్మన్నని ఇరుకున బెడుతూ  ఏదో వొక సమస్య  తెచ్చి పెడుతూంటాడు. ఓసారి ఖర్మకాలి  సత్యనారాయణ తన మగటిమిని నిర్ధారించుకునే ప్రయోగం చేసి, జయసుధ అక్క పాత్రతో నీచానికి పాల్పడతాడు. దీనికి బ్రహ్మన్న ఒకటే తీర్పు చెప్తాడు – అదే అమ్మాయితో పెళ్లి, లేదా రావుగోపాలరావ్ అండ్ కంపెనీ గ్రామం నుంచి వెలి! 


  భలే ఇరకాటంలో పడతాడు రావుగోపాలరావు. పైగా కొడుకు పాల్పడ్డ నీచానికి ఆ అమ్మాయి మాట కూడా పడిపోయింది. కొడుకు ఇలా మూగదాన్ని చేసుకోవాల్సి వస్తే, బ్రహ్మన్న కూతురు కూడా కళ్ళు లేని దాన్ని చేసుకునేట్టుగా పథకమేస్తాడు. 

    బ్రహ్మన్న కూతురుగా ముచ్చెర్ల అరుణ, భార్యగా శారద వుంటారు. తమ్ముడిగా కృష్ణంరాజు (ద్విపాత్రాభినయం) వుంటాడు. ఈ తమ్ముడి ప్రేమికురాలు జయసుధ. రాజేష్ ని అరుణ రహస్యంగా ప్రేమిస్తూంటుంది. వీళ్ళిద్దర్నీ లేచిపోయేలా చేస్తే బ్రహ్మన్న పదవీ భ్రష్టు డవుతాడని చిట్కా చెప్తాడు నూతన్ ప్రసాద్. దీన్ని కృష్ణంరాజు,  జయసుధలు విఫలం చేస్తారు. రావుగోపాలరావు ఇక సొంత చిట్కా ప్రయోగిస్తాడు. దీంతో అరుణ వల్ల  ఒకడు కళ్ళు పోగొట్టుకుంటాడు. ఈ పంచాయితీ ధర్మపీఠం ముందుకొస్తుంది. తన కూతురు ఈ గుడ్డి వాణ్ణే చేసుకోవాలని తీర్పు చెప్పేస్తాడు బ్రహ్మన్న. కృష్ణం రాజు అడ్డుపడి ఆమె ప్రేమిస్తున్న రాజేష్ తోనే  పెళ్లి జరిపించేస్తాడు. దీంతో వీళ్ళందర్నీ గ్రామబహిష్కారం చేస్తాడు బ్రహ్మన్న. ఇది తట్టుకోలేక  శారద వెళ్లి వాళ్ళని చూసొస్తానంటే, ఆమెనీ బహిష్కరించి ఏకాకి అయిపోతాడు  బ్రహ్మన్న

          ఇదంతా చూసి ఆనందిస్తూంటాడు రావుగోపాలరావు. అప్పుడు  ఒకటొకటే నిజాలు బయట పడుతూంటాయి. అడ్డంగా బ్రహ్మన్నకి దొరికిపోతాడు. తరిమి తరిమి మరీ వధిస్తాడు బ్రహ్మన్న. ఇక ధర్మ పీఠాన్ని తమ్ముడికి అప్పజెప్పేసి జైలు కెళ్ళిపోతాడు.

          దీనికి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన మార్కు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ వుంటాయి. చక్రవర్తి సంగీతం. ఇప్పుడా పాటలూ నృత్యాలూ బలహీనంగా అన్పిస్తాయి. సలీం నృత్య దర్శకుడు. కొన్ని చోట్ల కృతకంగా వుంటుంది కథనం.

       1984 లో ఇది విడుదలయింది. అప్పటికింకా కాస్త మిగిలిన జమీందారీ వ్యవస్థనీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థనీ ప్రతిబింబిస్తుంది. మధ్య తరగతి ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా  వేరు. అవి ఫ్రీగా మసలుకుంటాయి. జమీందారీ ఉమ్మడి కుటుంబాల్లో కుటుంబ పెద్దని చూసి జడుసుకు చస్తుంటారు కుటుంబ సభ్యులు. చివరాఖరికి ఆ కుటుంబ పెద్ద బుద్ధి తెచ్చుకోవడమే పని. ఇది  సినిమాలకి అలవాటయిన ఫార్ములా. ఇంకో పదేళ్ళ తర్వాత ఇలాటి జమీందారీ కథతోనే మోహన్ బాబు ‘పెద రాయుడు’ తీశారు

           
-సికిందర్
(సెప్టెంబర్ 13, 2009 – ‘సాక్షి’)
http://www.cinemabazaar.in