రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జులై 2017, గురువారం

488- రివ్యూ!


రచన- దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
తారాగణం : శృతి, పూజా గాంధీ, సంజన, వి శంకర్, మార్కండ్ దేశ్ పాండే, రఘు ముఖర్జీ, భాగ్యశ్రీ, రవి కాలే, పెట్రోల్ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు
సంగీతం : అర్జున్ జన్య, ఛాయాగ్రహణం : వెంకట్ ప్రసాద్
బ్యానర్ : నిర్మాత
: వెంకట్, విడుదల : 22 జులై, 2017

***

        హిట్టయిన కన్నడ ‘దండుపాళ్యం’ ని తెలుగులోనూ బాగానే రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఐదేళ్ల తర్వాత దీని సీక్వెల్ గా ‘దండుపాళ్యం- 2’ విడుదలయింది. యాక్షన్ / హార్రర్  సినిమాలే సీక్వెల్స్ గా విడుదలవుతాయని తెలిసిందే. ఐతే ‘దండుపాళ్యం’ సీక్వెల్ ఏ రకంగా సీక్వెల్ అవుతుంది? సీక్వెల్ కి కూడా భాగాలుంటాయా? అపుడు దాని ప్రభావం ఎలా వుంటుంది? ఓసారి చూద్దాం...

కథ  
          ‘దండుపాళ్యం’ లో 80 హత్యలు చేసిన కిరాతక దోపిడీ ముఠా దొరికిపోయి జైలు కెళ్తారు. ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ఆరేళ్ళ విచారణా ననంతరం ఈ పదకొండు మంది సీరియల్ కిల్లర్స్ కీ మరణ శిక్షలు పడతాయి. అయితే అభివ్యక్తి (శృతి) అనే జర్నలిస్టు  వీళ్ళు  నేరస్థులని నమ్మదు. ఈ కేసులో పోలీసుల పాత్రని అనుమానించి దర్యాప్తు చేయడం మొదలెడుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా ముఠా సభ్యులని జైల్లో కలుస్తుంది. అప్పుడు వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పుకొచ్చేదే ఈ సీక్వెల్ కథ...
ఎలావుంది కథ
         దండుపాళ్యం’ లాగే ఇదీ పూర్తిగా నిజకథ  కాదు, కాల్పనికం చేశారు. కర్నాటకలో నిజ కథకి 1930 లలో బీజాలు పడ్డాయి. ఐతే  1996 – 2000 మధ్య ఈ చివరి తరం గ్యాంగ్ సభ్యులు పాల్పడ్డ దోపిడీ హత్యలు రాష్ట్రాన్ని గజగజ లాడించాయి కాబట్టి,  దీన్ని కాల్పనికం చేసి  మొదట 2012 లో ‘దండుపాళ్యం’ తీస్తూ వాళ్ళు పట్టుబడినట్టు ముగించారు. ఇప్పుడు సీక్వెల్ తీస్తూ ఇదే కర్కోటక ముఠా అమాయకులనీ, పోలీసులు వీళ్ళని ఇరికించి అన్యాయంగా మరణశిక్షలు పడేలా చేశారనీ చూపిస్తూ  సానుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. తాజాగా కర్నాటక హైకోర్టు జులై 21 న ఈ పదకొండు మందిలో ముగ్గురికి ఉరిశిక్షలు రద్దు చేసింది కూడా. దీనిమీద పోలీసులు సుప్రీం కోర్టు కెళ్ళినా ప్రయోజనం లేనంత డబ్బా కేసు పెట్టారు. ఈ సీక్వెల్ లో కథకోసం కొన్ని కల్పితాలు చేశారు. వాటిలో ఒకటి- ఎలాటి సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, కేవలం సాక్షుల చేత చెప్పించి కేసులు  నడిపించారని.  ఈ కథలో చెప్పినట్టుగా, ఐదేళ్లుగా దొరక్కుండా ఎనభై హత్యలు చేశారని చెబుతున్న ముఠాని ఒకవేళ కేసుల్లో  ఇరికించాలనుకుంటే, పోలీసులు అంత  బలహీనంగా కేసులు పెడతారా అన్న సందేహం వస్తుంది.  ఇంత బలహీన కేసు మరణ శిక్షల దాకా వెళ్తుందా?  వాస్తవంగా ముద్దాయిల్లో ఆరుగురి మీద రేప్ నేరాలకి రుజువుల్లేవని కూడా కొట్టేసింది  హైకోర్టు.  హత్య కేసుల్లో అతిముఖ్యమైన సర్కమ్ స్టేన్షియల్, మెడికల్, ఫోరెన్సిక్ సాక్ష్యాలు లేకుండా, చెప్పుడు సాక్ష్యాలతో  ఏ కోర్టూ విచారణ చేపట్టదు. ఇలా సీక్వెల్ లోనే అర్ధంలేని కల్పన చేశారు. ఈ కేసుని ప్రాథమిక స్థాయిలో ట్రయల్ కోర్టు చేపట్టిందంటేనే  ఎంతో కొంత మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నట్టే. ఆ మెటీరియల్ ఎవిడెన్సులో భాగమైన వేలిముద్రలు కలవక ముగ్గురికి మరణశిక్షల్ని రద్దు చేసింది హైకోర్టు.
          కాబట్టి నిజంగా జరిగింది  చూస్తే  పోలీసుల అసమర్ధత కన్పిస్తుంది. దీన్ని సినిమాకోసం లాజిక్ చూడకుండా పోలీసుల కుట్రగా మార్చి, నిందితుల్ని అమాయకుల్ని చేసి సీక్వెల్ నడిపించారు.  ఇలాటి  క్యారక్టర్ రివర్సల్ మూసఫార్ములాకైతే చెల్లుతుందేమోగానీ, రియలిస్టిక్ సినిమాతో కాదు.  ఇక దీన్నెలా జస్టిఫై చేశారో సీక్వెల్లో తేల్చలేదు. నడుస్తూ నడుస్తూ వున్న సీక్వెల్ ని ఠకీ మని ఆపేసి,  ముగింపు ఆగస్టులో చూడండని ప్రకటన వేసి షాకిచ్చారు. ముగింపు కోసం ఇంకోసారి డబ్బులు పెట్టుకుని చూడాలా? ఇదెవరూ నోరత్తలేని మోసమే పూర్తి సినిమా చూపించకుండా. ‘దండుపాళ్యం’ ని పాడియావు చేసి సాధ్యమైనంత పిండుకోవాలని చూస్తున్నారు. ‘దండుపాళ్యం – 2’ రెండు భాగాలుగా వుంటుందని ముందే చెప్పివుంటే అదివేరు.
          ఇకపోతే ముగింపు లేని సినిమాకి రివ్యూ  ఏమిటి? ఎలా రాస్తాం? ఏమో!
ఎవరెలా చేశారు
          పోలీసు అధికారిగా రవిశంకర్ కి చాలా పనుండే సీక్వెల్ ఇది. ‘
దండుపాళ్యం’లో ముఠా పాల్పడ్డ ఘోరాలు చూపిస్తే, ఇప్పుడు పోలీసుల అకృత్యాలు చూపించడం మొదలెట్టారు. ఈ అకృత్యాలకి సారధి రవిశంకర్ పాత్ర. కౄర నీచ నికృష్ట పాత్రని కూల్ గా పోషించాడు. కూలీల చేత చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి పెట్టే చిత్ర హింసల్లో అతి పచ్చిగా కన్పిస్తాడు. ఇతనూ ఇతడి సహోద్యోగులు ఇద్దరూ టార్చర్ సెక్షన్ చూసుకుంటే, ఇక పదకొండు మంది ముఠా చిత్రహింసలకి అల్లాడే బ్యాచిగా కన్పిస్తారు. బ్యాచిలో పూజా గాంధీ బాధిత పాత్రలో ఎంత జీవించినా దాని ప్రభావం ప్రేక్షకుల మీద పడే అవకాశం లేదు. ఆమె పచ్చి హంతకురాలని ముందే చూసేశారు ప్రేక్షకులు. ఇదే పరిస్థితి బ్యాచిలో మిగతా అందరితోనూ.  

          సంజన గురించి పెద్ద హైప్ వచ్చింది. ఈ సీక్వెల్ లో ఆమె ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. బ్యాగ్ గ్రౌండ్ ఆర్టిస్టుగా రెండు మూడు సీన్లలో కన్పించి అవుట్ అయిపోతుంది. టెక్నికల్ గా ఛాయాగ్రహణం, బిజిఎంలు బలంగా వున్నాయి. ఛాయాగ్రహణంలో పోలీస్ టార్చర్ కి అవసరమైన చోట్ల డచ్ యాంగిల్స్ వాడుకున్నారు. ఇది కేవలం ఒక రియలిస్టిక్ మూవీ లాంటిదే తప్ప డార్క్ మూవీ కాదు, ఏ నోయర్ కాదు- కథాపరంగానూ, చిత్రీకరణ పరంగానూ. సంభాషణల్లో పదేపదే పచ్చి బూతులు దొర్లాయి. 
చివరికేమిటి
         
ఫస్టాఫ్ మరణ శిక్షలు పడ్డ దోషులు జైలుకి రావడం, వీళ్ళు దోషులని నమ్మని జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడం, జైల్లో వాళ్ళని కలుసుకోవడం వుంటాయి. సెకండాఫ్ లో వాళ్ళు జర్నలిస్టుకి తమ ప్లాష్ బ్యాకుగా చెప్పుకునే జీవితాలుంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతూనే పోలీస్ టా ర్చర్ల  ఎపిసోడ్లు మొదలవుతాయి. పూజా గాంధీ టార్చర్ తో అకస్మాత్తుగా సెకండాఫ్ ముగిసి,  ముగింపు ఆగస్టుకి వాయిదా వేశాం పొమ్మనడం వుంటుంది. 

          ఫస్టాఫ్ లో త్వరత్వరగా పది నిమిషాల్లో జర్నలిస్టు దర్యాప్తు చేపట్టడంతో బిగినింగ్ ముగిసి  ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. బహుశా సెకండాఫ్ చివర్లో పూజా గాంధీ టార్చర్ తో  ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ మధ్యలో నడిచే మిడిలంతా, ఫస్టాఫ్ లో బావున్న మిడిల్ వన్ వదిలేస్తే, సెకండాఫ్ లో మిడిల్ టూలో,  ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అనాసక్తికరం, అనవసరం, బాక్సాఫీసు అప్పీల్ లేనితనం, పరమబోరు కొట్టే నాటకం. ఎంత కౄరులో ‘
దండుపాళ్యం లో చూపించాక, ఇప్పుడెంత కల్లాకపటం ఎరుగని నగరానికి వలస వచ్చిన అమాయక జీవులో చూపిస్తే, నవరసాల్లో ఇదే రసమవుతుంది ప్రేక్షకులు  కనెక్ట్ అవడానికి? ‘నిర్భయ’ దోషులు పూర్వం ఏంతో పవిత్రులని చెప్తే చెల్లుతుందా? యాకుబ్ మెమన్ ఉరి రద్దుని కోరడమెలాంటిదో, దండుపాళ్యం ముఠా పట్ల సానుభూతిని ప్రోది చేయడం అలాంటిదే అన్నట్టు తేలింది. 

          వీళ్ళని సంచార జాతిగా చూపిస్తూ, గుడిసెల్లో జీవించడం, పందుల్ని పెంచడం, అర్ధాకలితో అలమటించడం, అన్నం అడుక్కుంటూ తిరగడం, జబ్బుతో చావడం...ఒకటని కాదు, ఇప్పటి సినిమాల్లో కన్పించని  సినిమా కష్టాలన్నీ, కన్నీళ్ళన్నీ వున్నాయి. ఆర్టు సినిమా కళలన్నీ వున్నాయి. 

          సెకండాఫ్ లో సంగం ఈ జీవితాలు, సగం పోలీస్ టార్చర్. విషయంలేని ఈ వృధానంతా  అరికడుతూ జర్నలిస్టు పాత్రతో ప్రస్తుతానికి వచ్చి వేగవంతం చేయాల్సింది. కానీ దీన్ని పాడియా వుగా చూస్తూ, ఇంకా ప్రేక్షకుల జేబుల్లోంచి డబ్బులు పిండుకునే ఉద్దేశంతో సాగదీశారు. ఇంత ఫ్లాష్ బ్యాక్ చెబుతున్న హంతక ముఠా నిజమే చెప్తున్నారని మనమెలా నమ్మాలి? దీనికి జర్నలిస్టు దొరకబుచ్చుకున్న ఒక్క ఆధారమూ విశ్వనీయత కోసం ఎస్టాబ్లిష్  చేయలేదు. 

          ముగిసిపోయిన ‘
దండుపాళ్యం’ దారుణ చరిత్రని కెలికి ఇంకేదో చేయాలనుకున్నారు. దీన్ని ఆగస్టు ముక్కలో ఎలా జస్టిఫై చేస్తారో చూసేందుకు, ఈ రివ్యూని కూడా ముగింపు వాయిదా వేసి  వెళ్లిపోదాం.

-సికిందర్