రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, April 23, 2018

639 : దృష్టి


        త్సాహికులు సినిమాల్లో  దర్శకత్వ అవకాశాల కోసం షార్ట్ మూవీసే తీయక్కర్లేదు. షార్ట్ మూవీస్ ఖర్చుతో  సిన్మా తీసేయొచ్చు. సినిమా రంగంలో  సహాయ దర్శకులు  దర్శకత్వ అవకాశాల కోసం కథలు పట్టుకుని తిరిగితిరిగి అలసిపోనవసరం లేదు. తామే సినిమా తీసేయొచ్చు. డిజిటల్ టెక్నాలజీతో  అరచేతిలోకి  సినిమా వచ్చిందే అనుకుంటున్నారు గానీ, అవకాశాలు కూడా అరచేతిలోనే వున్నాయని తెలుసుకోవడం లేదు. బడ్జెట్టే అరచేతిలోకి వచ్చేశాక ఇంకా నిర్మాతల వేటేమిటి? ఈ ఔత్సాహికులు, సహాయ దర్శకులూ వాళ్ళ కథల విషయంలో తప్ప,  మరి దేని గురించీ సృజనాత్మకంగా ఆలోచించరని ఒక డీఐ కలరిస్టు తీవ్ర అసంతృప్తిని  వ్యక్తం చేశారు. నిజమే, నూతి లోంచి బయటికొచ్చి కాస్త సృజనాత్మకంగా ఆలోచిస్తే ద్వారాలన్నీ తెర్చుకునే వున్నాయి...అప్పట్లో  దర్శకుడు మారుతీ ఫైవ్ డీ కెమెరా  లెన్సులతో ప్రయోగాలూ అవీ చేస్తూ, లక్షలు ఖర్చుపెట్టి, సుదీర్ఘకాలం ‘ఈ రోజుల్లో’  తీస్తున్న కాలంలో,  అటు అస్సాం లో ఒక ఐఐటీ డ్రాపవుట్,  95 వేలతో నెలరోజుల్లో సినిమాయే తీసేశాడు. దాన్ని అస్సాం లోనే గాక, సబ్ టైటిల్స్ వేసి ఢిల్లీ, ముంబాయి, పుణే, కోలకతా, అహ్మదాబాద్, చెన్నై,బెంగుళూరు నగరాల్లోనూ  విడుదల చేసింది పివిఆర్ మల్టీ ప్లెక్స్ నెట్వర్క్ సంస్థ. ఆ సినిమా పేరు ‘లోకల్ కుంగ్ ఫూ’. దీని ఘన విజయం తర్వాత,  ఆ కొత్త దర్శకుడు 30 లక్షలతో ‘లోకల్ కుంగ్ ఫూ –2’ కూడా తీసి మరోసారి వార్తల్లో కెక్కాడు. నాకు రెండుకోట్లు కావాలి, మూడు కోట్లు కావాలి అనడమిక అమాయకత్వం! ఆర్ధిక వనరుల దుర్వినియోగం!

         
కెన్నీ బాసుమటారీ ఈ విజయ గాథకి నాయకుడయ్యాడు. తను ప్రేమించే కుంగ్ ఫూ కామెడీ తీయడానికి కోట్లు పెట్టే నిర్మాతల కోసం అస్సలు ప్రయత్నించలేదు. తను అసలే కొత్త ముఖం. తనకి సినిమాల్లో అనుభవం కాదుకదా, పెద్దగా పరిచయాలు కూడా లేవు. అలాటిది తనని నమ్మి ఎవరో కోట్లు పెడతారనుకోవడం  భ్రమ అనుకున్నాడు. అలాగని తన దగ్గరున్న కొద్ది పాటి డబ్బులు పెట్టుకుని కుంగ్ ఫూ కామెడీని  షార్ట్ మూవీగా  కూడా తీయాలనుకోలేదు. చిన్నప్నట్నుంచీ కుంగ్ ఫూ మీద వీడియోలు తీసి తీసి చూసుకుని ఆనందిస్తూనే వున్నాడు. ఇక షార్ట్ మూవీస్ జోలికి వెళ్ళకూడదనుకున్నాడు. ఆ లోకమే వేరు,  అందులో పడితే  టైం వేస్టనుకున్నాడు. తీస్తే సినిమానే తీయాలని సంకల్పించుకున్నాడు. కానీ తగిన డబ్బులేకుండా ఎలా? 

          చిన్నప్పట్నించీ చదువు మీద కన్నా కామిక్ పుస్తకాలు చదవడం మీదే ఆసక్తి. అందుకని బుద్ధి కూడా ఆ స్థాయి దాటి ఎదగలేదు.
ఢిల్లీ ఐఐటీ లో చేరినప్పుడు ఆ ఇంజనీరింగ్ విద్య అస్సలు అబ్బలేదు. అక్కడ మెడ బట్టుకుని గెంటేసే లోగా తనే జంప్ అయిపోయాడు. జంప్ అయిపోయి ఒక రోమాంటిక్ నవల రాశాడు. ‘చాకొలెట్ – గిటార్ – మోమోస్’ అని రాసిన నవలకి రివ్యూలు బాగానే వచ్చాయి. ఇక సినిమా నిర్మాత లెవరో వచ్చి  తలుపు తడతారని ఎదురు చూశాడు. ఎవరూ వచ్చి తలుపు తట్టలేదు.

చేతిలో కెమెరా ఒక్కటే 
       ఇక పెట్టే బేడా సర్దుకుని  స్వరాష్ట్రం అస్సాం వచ్చేశాడు. అక్కడ గౌహతీలో ఒక లోకల్ ఛానెల్లో  న్యూస్ యాంకర్ గా చేరాడు. ఆ ఉద్యోగంలోనే మూడేళ్ళూ గడిపేశాడు. అప్పుడు మేన మామ అన్నాడు – ఇదే నేనైతే ఇలా సుఖంగా కూర్చుండి పోను, బయల్దేరి నా కలలేమిటో తీర్చుకుంటానని. అప్పుడు కెన్నీకి బల్బు వెలిగి ముంబాయి వెళ్లిపోయి  బాలీవుడ్ లో వాలిపోయాడు. నటుడిగా, రచయితగా పని చేయాలనుకున్నాడు. ఓ  మూడేళ్ళూ బాలీవుడ్ లో నటుడు, రచయిత అవడానికి బదులు ఆరు టీవీ యాడ్స్ లో నటించాడు. చానెల్ వీ కామెడీ షో ‘బాలీవుడ్ నాన్ సెన్సెక్స్’  లో నటించాడు. తర్వాత బాలీవుడ్లో నటుడిగా రెండు అవకాశాలొచ్చాయి. ‘షాంఘై’, ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’  లలో రెప్పపాటు కాలం కన్పించే  పాత్రల్లో నటించాడు. స్క్రిప్టు రైటింగ్ నేర్చుకుందామని ఇనిస్టిట్యూట్ లో చేరాడు. అక్కడ సినిమాల కోసమే స్క్రిప్టులు డెవలప్ చేద్దామని వాడుకున్నారు. నాల్గు స్క్రిప్టులు వాళ్ళ కోసం డెవలప్ చేశాడు. వాటిలో ఒకటి సినిమాగానే మొదలవలేదు. రెండు దాదాపు మొదలవబోయాయి. ఒకటి మొదలై మూలన బడింది. ఇక ఎడిటింగ్ వైపుకి వెళ్లిపోయి డాక్యుమెంటరీ ఎడిటింగ్  చేశాడు. అన్న టోనీ సంగీత రంగంలో వున్నాడు. అన్నతో కలిసి మ్యూజిక్ ఆల్బం చేశాడు. ఇలా ఒక గోల్ అంటూ లేకుండా ఏది పడితే అది చేయసాగాడు.

          చిట్ట చివరికి ఇక కుంగ్ ఫూ కామెడీ తీయడానికి డిసైడ్ అయిపోయాడు. నిర్మాత ఎవరూ వద్దు, తనే నిర్మాత. తనే దర్శకుడు, హీరో, రచయిత, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ కంపోజర్, అప్పుడపుడు మేకప్ మాన్, అప్పుడప్పుడు కెమెరా మాన్, అప్పుడప్పుడు ఎలక్ట్రీషియన్, కుక్, డ్రైవర్!

        అన్న ఆడియో స్టూడియో వుండనే వుంది, ఒక చిన్న కానన్ ఎసెల్లార్ కెమెరా కొనుక్కుంటే సరిపోతుంది. కుంగ్ ఫూ కామెడీయే  ఎందుకు తీయాలంటే,  అస్సాంలో కుంగ్ ఫూ నేర్చుకోని మగ పిల్లలు, ఆడ పిల్లలు అంటూ ఎవరూ లేరు. వాళ్ళందరూ చూస్తారు. తను చిన్నప్పట్నుంచీ కుంగ్ ఫూలో ఆరితేరిన వాడే. ఇరవై ఏళ్లుగా కుంగ్ ఫూ మాస్టర్ గా వుంటున్న మేనమామ నేర్పాడు. ఒక ఆరు కుంగ్ ఫూ ఫైట్లు పెట్టుకుని, వాటి మధ్య లవ్ స్టోరీ పెట్టుకుని,  కామెడీగా తీస్తే వర్కౌట్ అవుతుంది. దేశం లోనే ఇంత వరకూ కుంగ్ ఫూ కామెడీ ఎవరూ తీయలేదు. కాబట్టి అందరి దృష్టిలో పడుతుంది.

          అమ్మదగ్గర అరవై వేలు అడుక్కున్నాడు, తన దగ్గర ముఫై ఐదు వేలున్నాయి. ఇంతకి  మించి ఒక రూపాయీ పెట్టదల్చు కోలేదు వెంచర్ కి. 95 వేల అల్ట్రా లో- బడ్జెట్ మూవీ, అంతే. 44 వేలు పెట్టి కానన్ కెమెరా కొన్నాడు. 55 - 250 ఎంఎం లెన్సులకి 11 వేలు అయింది. 5 వేలు పెట్టి వీడియో మిక్సర్ కొన్నాడు. మెమరీ కార్డులు, బ్యాటరీ, ఫిల్టర్లు మొదలైన వాటికి మరో 7 వేలు ఖర్చయ్యాయి. చేతిలో 28  వేలు మిగిలాయి. ఇవి నటీనటులకి, ప్రాపర్టీస్ కి, చిలరమల్లర వాటికీ వుంచుకోవాలి.

ప్రొఫెషనల్ గా ఫైట్స్ 
      నటీనటులందరూ బంధువులూ స్నేహితులే. లొకేషన్స్ వాళ్ళ ఇళ్లే. నయాపైసా ఖర్చు లేదు. వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళే  తిని వాళ్ళ బట్టలే వాళ్ళు వేసుకుని వస్తారు.  ఒక్క హీరోయిన్ గా ఒప్పుకున్న లోకల్  మలయాళీ యాంకర్ సంగీతా నాయర్ కే పారితోషికమివ్వాలి. ఆమె ఒక్కతే  అత్యధిక పారితోషికం పొందింది. ఆమె మూడు వేలు తీసుకుంది. ఉదయం పూట టిఫిన్ బదులు రెండు గుడ్లు పెడుతూంటే తింటూ పోయింది. ఇంతోటి సినిమాకి పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఈవెంట్ కూడా! ఈమే, తన అన్న టోనీ కలిసి ఎఫైర్ నడిపి పెళ్ళికూడా చేసేసుకోవడం ఇంతోటి సినిమాకి అంతోటి న్యూస్ ఐటెం!

          గౌహతి లోనే షూటింగ్ చేస్తున్నప్పుడు స్క్రిప్టులో వాడొచ్చి ఆ కామెడీ పెట్ట మంటాడు, వీడొచ్చి ఈ  జోకు పెట్టమంటాడు. బావుంటే పెట్టుకోక తప్పుతుందా? ఫ్రెండ్ బొంజో గాడు తన పాట పెట్టమన్నాడు. వాడు పాట గాడు. ఒక పాట రాసి ట్యూన్ కట్టాడు. ‘నెంబర్ వన్ అండర్ 18 డాన్’ అనే పాట. ఈ పాట విని పడీపడీ నవ్వాల్సి వచ్చింది. వాడి మీదే ఆ పాట పెట్టేసి షూట్ చేసేస్తే పీడా వదిలింది.

          ఒక్కడికీ నటన రాదు. కథ మొత్తం కామెడీయే. కాబట్టి కామిక్ టైమింగ్ నేర్పడం కోసం  రిహార్సల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇది కొన్ని రోజులు సాగింది. ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం, పంచులివ్వడం విరగబడి  నేర్చుకున్నారు. సినిమాలో వీళ్ళని చూస్తే  కొత్త వాళ్ళని ఎవరూ అనుకోరు. ఒక్కరూ డబ్బులు అడగలేదు. నూడుల్స్ పెడితే చాలన్నారు.

       ఇక ఫైట్స్ విషయం. ఇది చాలా కీలకం. దీనికోసం మాత్రం డిటైల్డ్ గా  స్టోరీ బోర్డు వేసుకోవాల్సి వచ్చింది. ప్రతీ పంచ్, ప్రతీ కిక్ కనెక్ట్ అయ్యేట్టు, టైట్ గా వుండేట్టు,  కష్టపడి షాట్స్ లిస్టు తయారు చేసుకోవాల్సి వచ్చింది. కుంగ్ ఫూ మాస్టర్ మేనమామ ఫైట్స్ కంపోజ్ చేస్తే, ఆయన స్టూడెంట్స్ కొందరు ఫైటర్స్ గా  పనిచేశారు. మేనమామ ‘ది మాస్టర్’ అనే పాత్ర కూడా వేశాడు. ఫైట్ సీన్స్ కి వైర్ వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి వాటికి బడ్జెట్ లేదు. గాలిలోకి ఎగిరి కిక్ లిచ్చుకునే షాట్స్ గాల్లోకే ఎగిరి కిక్ లిచ్చుకున్నారు. హీరోగా తను కుంగ్ ఫూ నేర్చుకున్న ఫైటరే అయినా,  గాల్లోకి ఎగిరి నప్పుడు మాత్రం కిక్ మిస్ అయ్యింది. తనూ విలన్ ఫేస్ టు ఫేస్ పైకి గాల్లోకి జంప్ చేసినప్పుడు, తన ఛాతీ మీద విలన్ కిక్కివ్వాలి. ఆ మొదటి టేకులోనే ఆ కిక్ మిస్ అయ్యి, తన తొడకి ఫెడీమని తగిలింది. రెండు వారాలు హాస్పిటల్లో పడ్డాడు. 

          తర్వాత 28 టేకులు తీస్తే,  పర్ఫెక్టుగా అనుకున్న విధంగా షాటు వచ్చింది. ఈ షాట్ నే పోస్టర్ మీద లీడ్ విజువల్ గా వాడుకోవడం జరిగిందన్నమాట. ఫైట్ సీన్లు కన్విన్సింగ్  గా, ప్రొఫెషనల్ గా అన్పించడానికి, ఒక్కో షాట్  కోసం మూడ్రోజులు ఉదయానే మూడేసి గంటలు ప్రాక్టీసు చేయాల్సి వచ్చింది. ఎక్కువ లెంత్ వుండే కాంప్లికేటెడ్ షాట్స్ కి ఇంకా ఎక్కువ రోజులు ప్రాక్టీసు చేయాల్సి వచ్చేది. రెండు వేల రూపాయలు ప్యాడ్స్ కీ, ఇతర ప్రొటెక్షన్ గేర్స్ కీ ఖర్చయ్యాయి. 

          ఇలా కెన్నీ కన్నీ సవాళ్ళే. ఇక నటీనట వర్గం చూస్తే, బయట ఫ్రెండ్స్ తో బాటు, యాంకర్ సంగీతాతో బాటు, తన కుటుంబం అంతా తారాతోరణమై కదలివచ్చింది. ఒక్క అమ్మ తప్ప, నల్గురు కజిన్లు, ఇద్దరు అంకుల్సు, ఇద్దరు ఆంటీలు, తన అన్న, ఓ ఎనభై ఏళ్ల తాతగారూ! ఇలా మూడుతరాల కుటంబ వారసత్వాన్ని ఒకేసారి  ఎస్టాబ్లిష్ చేసినట్టయింది.

విడుదల విజయం 
     అతి పెద్ద సవాలు టెక్నికల్ సైడు వుంది. ఇంతకి ముందు కెమెరాలతో పనిచేసిన అనుభవం లేదు. ఎండ దంచుతున్నప్పుడు బర్నవుట్స్ ని ఎలా హేండిల్ చేయాలో తెలీలే దు. ఫ్రేములో ఒకవైపు తెల్లగా వస్తే,  ఇంకో వైపు నల్లగా వస్తోంది. ఇంటర్నెట్ లో చదివి తెలుసుకున్నాడు పరిష్కారం. కొందరు ఫోటోగ్రాఫర్  ఫ్రెండ్స్ ని కూడా అడిగాడు. దాంతో వాళ్ళ సలహా మీద న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్లు వాడడడం మొదలెట్టాడు. మెరుపు వేగపు యాక్షన్ సీన్స్ కి తనే ప్రయోగాలూ అవీ చేసి చేసి, హై షటర్ స్పీడ్స్ వాడాలని మర్మం తెలుసుకున్నాడు. ఇక ఇండోర్ లైటింగ్ విషయా
నికొస్తే, గదుల్లో 200 వాట్స్ బల్బులు మూడువేసి షూట్ చేసేశాడు. 

          నటిస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది స్టూడెంట్లూ, ఏవో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళే. దీంతో షెడ్యూల్స్ ని సమన్వయం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. డైరీ పెట్టుకుని ఒక్కొక్కరి షెడ్యూల్స్ రాసుకోవడం మొదలెట్టాడు. కొందరికి స్కూల్స్ లో క్లాసులున్నాయి, కొందరికి గిటార్ క్లాసులున్నాయి, మరికొందరికి ఉద్యోగాలున్నాయి. వీళ్ళతో షెడ్యూల్స్ ని ఎలా మేనేజ్ చేయాలో అదంతా పెద్ద తలనొప్పే అయిపోయింది.

          మొత్తానికి నెలరోజుల్లో షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఎడిటింగ్ తనే ఇంటి దగ్గర చేసుకున్నాడు. సౌండ్ కోసం, మ్యూజిక్ కోసం ముంబాయిలో అన్న స్టూడియో కెళ్ళాడు. స్క్రీనింగ్ చేసి చూసుకుని సంతృప్తి చెంది, ట్రైలర్ తయారు చేసి యూ ట్యూబ్ లో పెట్టాడు. ఆ ట్రైలర్ చూసిన పివిఆర్ ఎగ్జిక్యూటివ్ దర్లోవ్ బారువా, దీనికి కమర్షియల్ సినిమా విలువలున్నాయని గుర్తించి,  కెన్నీని పిలిపించుకున్నాడు. అస్సాంతో బాటు ఇతర నగరాల్లో విడుదల చేద్దామని, ఒక వెర్షన్  హిందీ డబ్బింగ్ చేయమని కోరాడు. హిందీ డబ్బింగ్ కి  డబ్బులే లేవని చెప్పేశాడు కెన్నీ. దాంతో  సబ్ టైటిల్స్ వేసి విడుదల చేశారు. ఈ జరిగిందంతా 2013 లో. ఈ 83 నిమిషాల తొలి కుంగ్ ఫూ కామెడీకి అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.  కెన్నీ పెట్టింది 95 వేలే అయినా, పబ్లిసిటీకి మరో ఆరులక్షలు పీవీఆరే భరించింది. మొత్తం కలిపి 30 లక్షల వరకూ వసూలు చేసింది. ఇందులో సుమారు యాభై శాతం కెన్నీకి వస్తే, యూనిట్ లో అందరికీ తలా కొంత పంచాడు. 

          అస్సాం లో వున్నవే 45 థియేటర్లు. వీటిలో 12 థియేటర్లే దొరికాయి. దీంతో అన్ని ప్రాంతాల వాళ్ళూ చూడలేకపోయారు. చూసిన వాళ్ళు మాత్రం విపరీతంగా అభిమానించారు. కొన్నేళ్లుగా హిట్లే లేక నష్టాల్లో వున్నా అస్సాం సినిమా పరిశ్రమ ఒక్కసారిగా పులకించింది ఈ విజయంతో. నటులు కానికొత్త నటీనటులందరికీ ప్రజల్లో మంచి క్రేజ్ వచ్చింది. వాళ్ళు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. గుర్తుండి  పోయే పాత్రలతో యూత్ కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది ఈ మూవీ. దీని తర్వాత ‘లోకల్ కుంగ్ ఫూ 2’ అని సీక్వెల్ తీసినా విజయమే లభించింది. అయితే అదే సమయంలో (ఏప్రెల్ 2017) ‘బాహుబలి-2’ విడుదల కావడంతో ‘కుంగ్ ఫూ 2’ ని అర్ధాంతరంగా థియేటర్ల నుంచి ఎత్తేసి అన్యాయమే  చేశారు. ‘కుంగ్ ఫూ 2’  తీయడానికి 30  లక్షలు మాత్రమే ఖర్చయ్యింది. షేక్స్ పియర్ నాటకం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఆధారంగా దీన్ని తీశాడు.
***
        టోటల్ జీరో నుంచి మొదలైన ఈ  విజయ గాథ చూసినప్పుడు ఇందులో ప్రధానంగా ఐదు కన్పిస్తాయి – షార్ట్ మూవీస్ డబ్బులతో షార్ట్ మూవీస్ కాదు, సినిమా తీయవచ్చని. ఒక నిర్మాత దొరికి సినిమా తీయాలనుకుంటే,  ఎక్కువలో ఎక్కువ 30 లక్షల్లో తీయవచ్చని. ఈ సెగ్మెంట్ ని రెగ్యులర్ సినిమాల మేకింగ్ అద్దాలతో చూడవద్దని. తమకు తామే అవకాశాలు సృష్టించుకోవచ్చని.  ఈ నాల్గూ  చేయడానికి ఏ నామోషీ ఫీలవనవసరం లేదని. 

          షార్ట్ మూవీ తీయడానికి మూడు నాల్గు లక్షలా? సినిమా స్థాయిలో రెడ్ కెమెరాలా? క్రేన్లా? ఈ దుబారా ఆపి, సినిమాలకి ఏం ఆదా చేసి చూపిస్తారో ఆలోచించాలి. కుప్ప తెప్పలుగా తీస్తున్న షార్ట్ మూవీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో చెత్త బాగా  పేరుకుపోయింది. ఇదొక ఆన్ లైన్ పర్యావరణ సమస్య. ఇదొక డంపింగ్ యార్డుగా తయారైంది. 

          షార్ట్ మూవీ తీయాలి, అది చూపించి నిర్మాతల దగ్గర దర్శకత్వ అవకాశాలు పొందాలి- ఇవి కాలం తీరిన ఆలోచనలు. కథలు రాసుకోవాలి, ఆ కాగితాలు  పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతూనే వుండిపోవాలి  - ఇవి ఓల్డు మద్రాసు ఆలోచనలు. 

          మళ్ళీ క్రౌడ్ ఫండింగ్ అంటూ ఒకటి. సినిమాల్ని చందాలేసుకుని తీసే స్థాయికి  దిగజార్చనవసరం లేదు. ఇదెప్పుడూ వర్కౌట్ కాలేదు. కమర్షియల్ గా ఏమాత్రం పనికి రాలేదు కూడా. పైగా మేకర్ చందాదారుల్లో విశ్వసనీయతని కోల్పోతాడు. ఈ క్రౌడ్ ఫండింగ్ ప్రయత్నాలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ కోసమే. తీరా అదొక షార్ట్ మూవీలా వుంటుంది. ముక్కు ఎక్కడ వుందంటే చుట్టూ తిప్పి చూపించినట్టు – సినిమాల్లోకి ఎంట్రీ షార్ట్ మూవీస్ కాదు, క్రౌండ్ ఫండింగ్ కాదు- సినిమాల్లోకి ఎంట్రీ ఇన్నోవేటివ్ ఆలోచనలతో సూటిగా సినిమాయే! 

          అలాటి ఇన్నోవేటివ్ ఆలోచనలతో కెన్నీ సినిమాల్లోకి ఎంట్రీ సంపాదించాడు. కేవలం ఒక్క కెమెరా, దాని సంబంధిత పరికరాలు పట్టుకుని! అతను షార్ట్ మూవీస్ వైపు వెళ్ళే చాపల్యాన్ని ప్రదర్శించి వుంటే,  చచ్చినా అలాటి కమర్షియల్ సినిమా తీయగల్గి వుండేవాడు కాదు. మెదడులో మెట వేసిన షార్ట్ మూవీస్ బాపతు ఆలోచనలకి కుంచించుకుపోయి దెబ్బ తినిపోయే వాడు. 

          షార్ట్ మూవీస్ ని ఒక విధానానికి వాడుకుంటే మంచిదే. డిజిటల్ కానప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కి ఒక హోదా వుండేది. జాతీయ అంతర్జాతీయ ఫెస్టివల్స్ ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు. అదే వృత్తిగా దేశావిదేశాలు పట్టుకుని తిరిగే వాళ్ళు. డిజిటల్ అయ్యాక గల్లీల్లో తీస్తున్న షార్ట్ మూవీస్ గల్లీల్లోనే వుండిపోతున్నాయి. ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప జాతీయ అంతర్జాతీయ లక్ష్యాలతో షార్ట్ మూవీస్ తీస్తున్న వాళ్ళు లేరు. అవే రవితేజ మార్కు డైలాగులు, అవే పవన్ కళ్యాణ్ టైపు యాక్టింగులు – మొత్తంగా ఒక రొట్ట లవ్ స్టోరీ! ఇదే షార్ట్ మూవీస్ డైరీ.  

          అయితే షార్ట్ మూవీస్ ట్రెండ్ ఒకందుకు మంచికోసమే మొదలైంది. ఒకప్పుడు డిటెక్టివ్ సాహిత్యం వచ్చేసి అలగాజనంలో పఠనాసక్తి రేకెత్తించినట్టు- తర్వాతి తరంలో కథలతో, సాహిత్యంతో సంబంధాల్ని తెగతెంపులు చేసుకున్న జెనెక్స్ – లేదా జెన్ వై జనరేషన్ కి - షార్ట్ మూవీస్ వచ్చేసి ఏకంగా కథలు రాసుకునే వైపు మళ్ళించేశాయి. లేకపోతే జీవితంలో ఎప్పుడు కథలు రాస్తారని! ఆనాడు డిటెక్టివ్ సాహిత్యం చదవడం అలవాటు చేస్తే, ఈనాడు షార్ట్ మూవీస్ కథలు రాయడం అలవాటు చేశాయి.

        అయితే కోతికి కూడా అప్రయత్నంగా కొబ్బరి చిప్ప దొరుకుతుంది. దాన్ని అటు పెట్టి ఇటు పెట్టి కొడుతూ వుంటుంది. అలాగే కొబ్బరి చిప్పలా  దొరికిన షార్ట్ మూవీస్ తో అందులోనే కొట్టుకు చస్తున్నారు. షార్ట్ మూవీని పెంచితే సినిమా అవుతుందన్న ఆలోచన రావడానికి – ప్రపంచం వైపు చూస్తేగా? ప్రపంచంలో మూవీ మేకింగ్ లో సంభవిస్తున్న పరిణామాలు కనీసం అరచేతిలోనే వున్న ఇంటర్నెట్ లో తెలుసుకోవాలన్న ఆసక్తిగానీ,  పరిజ్ఞానం గానీ లేవని చాలామంది అంటున్నారు. చాలా  వెనుకబడిన వర్గంగా  సాధ్యంకాని   కలలు గంటూ గడిపేస్తున్నారని అంటున్నారు. 

          అందుకే మార్కెట్ లో అందుబాటు ధరల్లో కొత్త కెమెరాలొచ్చాయన్నా,  తమ విలువేదో తగ్గించి మాట్లాడుతున్నట్టు  ఫీలైపోవడం.  తమది బిగ్ వైపర్ స్థాయికి తగ్గని లెవెల్ అని పోజు కొట్టడం. ఈ పోజులు కొట్టడంలోనే జీవితం గడిచిపోతుంది, ఏమీ జరగదు. కళ్ళ ముందు ప్రపంచం తెర్చుకుంటే కదా జ్ఞానోదయమై కింకర్తవ్యం బోధపడేది.

          పోనీ కంటెంట్ పరంగా ఏం సాధిస్తారంటే, అవే బజారు కుక్కలు కూడా తిరిగి చూడని  రొట్ట ప్రేమకథలు. కెన్నీకూడా ప్రేమ కథే అనుకుని వుంటే ఇవ్వాళ్ళ ఈ వ్యాసం రాయడానికి వుండేది కాదు. అతను ఇంకో ఉద్యోగం చేసుకునే వాడు, మనమింకో వ్యాసం రాసుకునే వాళ్ళం. అతను తమ అస్సాం సంస్కృతిలో భాగమైనపోయిన కుంగ్ ఫూ మీద కన్నేశాడు. అస్సామీయుల జీవితం అస్సామీయులకి చూపించాడు.

      అలాగే ఇటు కోస్తాలో ఇప్పుడేం సంస్కృతులున్నా, ఒకప్పుడు ఎడ్ల బండి పందాలుండేవి. సినిమాల్లో ఒక కమర్షియల్ ఎలిమెంటుగా వుండేవి. వీటి మీద తీయొచ్చు. హీరో విలన్లు ఒక పాత తెలుగు సినిమాలో  ఈ పందాలు చూసి, హీరోయిన్ కోసం ఎడ్ల పందాలకి దిగితే వినోదానికి వినోదమూ, మరుగున పడ్డ పందాలకి ప్రమోషనూ అన్నట్టు వుంటుంది. తెలంగాణాలో మర్చిపోయిన గిల్లీ దండా, ఖోఖో వున్నాయి.

          వీటిని జానర్ స్పృహ లేకుండా అడ్డగోలుగా తీయకూడదు. బూడిదలో పోసిన పన్నీరవుతుంది. వీటిని అచ్చమైన కామిక్ థ్రిల్లర్స్ గా తీస్తేనే  మార్కెట్ యాస్పెక్ట్ వుంటుంది. అప్పట్లో 95 వేలతో కేన్నీ తీస్తే,   ఇప్పుడు ఓ ఐదు లక్షల్లో ముగించ వచ్చు – అతను అనుసరించిన వ్యూహాన్ని తుచ తప్పకుండా అనుసరించి. అతను సినిమా టెక్నీషియన్లు ఎవరినీ వాడుకోలేదు. ఇది గుర్తుంచుకోవాలి. 

          ఇక రెండో సెటప్, అతను 30 లక్షల్లో తీసిన సీక్వెల్. ఇది తాజాగా గత సంవత్సరమే తీశాడు. ఎలా తీశాడో అధ్యయనం చేస్తే నిర్మాతల మీద చాలా భారం తప్పించినట్టవుతుంది.ఈ రెండు సినిమాలూ కెన్నీ యూ ట్యూబులో ఫ్రీగా పెట్టాడు, చూడొచ్చు.


సికిందర్