రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, మే 2020, బుధవారం

944 : సందేహాలు - సమాధానాలు


Q:  నాకు ఒకచోట అవకాశముంది. కానీ కథ చేస్తూంటే మనసులో చూసిన రకరకాల సినిమాలన్నీ మెదులుతున్నాయి. ఆ సీన్లు, యాక్షన్, కామెడీలు గుర్తుకు వస్తోంటే రాయలేక పోతున్నాను. అలా నేను రాయగలనా? వాటిని బట్టి నా కథ మారిపోతుందా? అన్న సందేహాలు వస్తున్నాయి. నా సమస్యకి పరిష్కారం సూచించగలరు. నా సమస్య నా అవుట్ పుట్ ని దెబ్బతీస్తోంది.
విఎల్ ఏ, అసోసియేట్ 

A:    ఇన్పుట్స్ అలా వుంటే అవుట్ పుట్ దెబ్బతినక ఏమవుతుంది. ఈ సమస్య చాలా మందితో వుంది. కథ రాస్తూంటే చూసిన సినిమాలన్నీ గుర్తుకు రావడం. అన్నం తింటూంటే చూసిన అన్నాలన్నీ గుర్తుకు రావు మరెందుకో. ఒకవేళ గుర్తుకు వచ్చినా తింటున్న అన్నం తినేసే చేయి కడుక్కుంటారు. సినిమాలెన్ని గుర్తుకొస్తున్నా రాస్తున్న కథ రాసేసి చెయ్యి దులుపుకో వచ్చుగా. ఒక సినిమా చూస్తూంటే చూసిన సినిమాలన్నీ గుర్తుకొస్తూ చూడకుండా చేస్తున్నాయా? మైండ్ ఎలాటిదంటే దానికి ఫోకస్ కావాలి. ఫోకస్ లేకపోతే అదే పనీ చెయ్యదు. ఫోకస్ అంటే ఈ క్షణం మీద ఏకాగ్రత నిలపడం. ఇటు ఎడమవైపు గడిచిపోయిన క్షణాలకీ, అటు కుడి వైపు ముంచుకు రానున్న క్షణాలకీ గట్టిగా తలుపులు బిడాయించేసి, మధ్యలో కూర్చుని ఇప్పటి చేతిలో వున్న క్షణాల మీద ఫోకస్ పెడితే మైండ్ మాట వింటుంది.

       దీన్ని పని విధానంలోకి మార్చుకుంటే - మీకు వచ్చిన అవకాశంతో స్మాల్ మూవీ కథ చేస్తున్నప్పుడు, ఇటు చూసిన స్టార్ మూవీస్ కీ - అటు నానా జాతి ఇతర మూవీస్ కీ తలుపులు గట్టిగా మూసేసి - నా స్మాల్ మూవీ, నా కథా - అనుకుని వుండిపోవాలి. చేసేది స్మాల్ మూవీ అయినప్పుడు చూసిన స్టార్ మూవీస్ ఆలోచనలు, ఆర్ట్ మూవీస్, షార్ట్ మూవీస్, వరల్డ్ మూవీస్ ఆలోచనలూ మనసులో ఎందుకు రానిస్తారు. మీ స్మాల్ మూవీ కథ మీద మీరు ఫోకస్ పెట్టండి. దానికుండే పరిమితుల మీద ఫోకస్ పెట్టండి. దాంతో వుండే క్రియేటివిటీ మీద ఫోకస్ పెట్టండి. అవసరమనుకుంటే మీ స్మాల్ మూవీ పరిధిలో వుండే జానర్లో రెండు మూడు ఇతర మూవీస్ చూడండి రిఫరెన్స్ కోసం, అంతే. కుడి ఎడమల తలుపులు మూసేసి మధ్య గదిలో మీ కథతో కూర్చోండి. ఒక బాలీవుడ్ యువ రచయిత్రి కిటికీ తెరలు కూడా వేసేసి చీకట్లో కూర్చుని రాస్తుంది. చీకట్లో ఎలా రాస్తుందంటే లాప్ టాప్ మీద టపటపా కొడుతుంది.

Q:  త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అన్ని కథలకు పాటించాలంటారు. ఈ స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తూ విజయాలు సాధించిన కొన్ని సినిమాలు లేవంటారా?
        2. రోమాంటిక్ డ్రామాల్లో ఓపెన్ డ్రామా మంచిదా లేదా ఎండ్ సస్పెన్స్ మంచిదా? కేవలం థ్రిల్లర్స్ లోనే కాకుండా ఇతర జానర్స్ లో ఎండ్ సస్పెన్స్ వుండదంటారా?
        3. కొన్ని సినిమాల్లో హీరో ఫిజికల్ గా కాకుండా మెంటల్ యాక్షన్ తో వుంటాడు. యాక్టివ్ పాత్ర ఇలా వుండొచ్చా?
వీఏడీ, అసోసియేట్ 

A: త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అన్నాక కథకి బిగినింగ్, మిడిల్, ఎండ్ (ఆది మధ్యంతాలు) వుంటాయి. వీటిలో దేన్నీ తీసేసి స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం కుదరదు. కాకపోతే ఆది మధ్యంతాల ఆర్డర్ ని మార్చవచ్చు. ఇదే చేస్తున్నారు. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ లేదా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో కథ చెప్పడం. లీనియర్ గా వుండే ఆర్డర్ ని నాన్ లీనియర్ గా మార్చి కథనం చేయడం. అచ్చులో కథ, స్టేజి నాటకం, ప్రభుత్వానికొక విన్నపం, మిత్రుడికొక లేఖ, కంపెనీకొక బిజినెస్ లెటర్ - ఏది తీసుకున్నా ఆదిమధ్యంతాలు లేకుండా రాయలేరు. కాకపోతే కథ, నాటకం లాంటి కళా సృష్టులకి తప్ప, ప్రభుత్వానికి విన్నపం, మిత్రుడికి లేఖ, కంపెనీకి బిజినెస్ లెటర్ - మొదలైన వాటిని నాన్ లీనియర్ గా కూడా రాయలేరు. రాస్తే ఎవడ్రా వీడు? అనుకుంటారు అవతలి వాళ్ళు. ఇక మిడిలో, బిగినింగో లేకుండా రాస్తే, వాళ్ళ రెస్పాన్స్ ఎలా వుంటుందో వూహించుకోవాల్సిందే. 

     ఎందుకో అనుమానం వచ్చి గూగుల్ చేస్తే, ఒక తెలుగు బ్లాగులో ప్రముఖ కథా రచయిత్రి గురించి వుంది. ఆమె ఆది, అంతం లేకుండా మధ్యమం తోనే కథలు రాశారట. ఇదెలా అని, ప్రముఖ సాహిత్య విమర్శకుడు కేపీ అశోక్ కుమార్ గార్ని అడిగితే, ఆమె పాత్రల కష్టాలు రాసుకుంటూ పోతూ పోతూ ఎక్కడో ఆపేసేదనీ, అవి కథలు కావనీ అన్నారు. ఇంకో ప్రముఖ రచయిత కథల్లో అది మధ్యమం అంతం పరస్పర సంబంధం లేకుండా దేనికది ముక్కలుగా వుంటాయన్నారు. కథా రచనే తెలియని ఇలాటి ప్రముఖులున్నారన్నారు. 

        స్ట్రక్చర్ ని బ్రేక్ చేయలేరు. ఫ్లాష్ బ్యాక్, మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్, హైపర్ లింక్, ఫెబులా, రివర్స్ క్రోనాలాజికల్, రోషోమన్, సర్క్యులర్ ...ఇలా పదివరకూ వుండే కథన  రీతుల్ని చూసి స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడమనుకుంటున్నారు. వీటిలో వుండే సీన్స్ ని లీనియర్ గా పేర్చుకుంటూ పోతే వాటిలో ఆదిమధ్యంతాలే వుంటాయి! బిగినింగ్ తో మొదలై, మిడిల్ తో నడిచి, ఎండ్ తో ముగుస్తాయి. కాబట్టి ఇది స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం కాదు, స్ట్రక్చర్ కి లోబడి క్రియేటివిటీ చేసుకోవడం. 

        స్ట్రక్చర్ లో మూడంకాల నిష్పత్తుల్ని కూడా మార్చలేరు. బిగినింగ్ ని మిడిల్ కి మించిన నిడివితో సెకండాఫ్ లో వరకూ పొడిగిస్తే, అప్పటి వరకూ కథే ప్రారంభం కాక, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే తయారవుతుంది. తెలుగులో ఇలాటి సినిమాలెన్నో కుప్ప తెప్పలుగా వచ్చి ఫ్లాపయ్యాయి. అదే ఎండ్ ని మిడిల్ కి మించిన నిడివితో చేస్తే, కొన్ని రొటీన్ కథల బోరు తప్పించవచ్చు. ‘ఈక్వలైజర్ 2’ లోలాగా. ఈ రొటీన్ మాఫియా రివెంజి కథని మిడిల్ ని పావు వంతుకి కుదించి, వెంటనే సెకండాఫ్ లో పది నిమిషాల కల్లా క్లయిమాక్సుని ప్రారంభించేశాడు. ఇది స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడమంటారా? కాదు, బోరు కొట్టే మిడిల్ ని తగ్గించే క్రియేటివిటీ. స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడమంటే కథాంగాలైన బిగినింగ్, మిడిల్, ఎండ్ లలో  ఏదో ఒకదాని, లేదా రెండిటి, ఇంకాలేదా మూడిటి నడుమూ విరగ్గొట్టి మూలన కూర్చోబెట్టడమన్న మాట. సింపుల్ గా చెప్పుకుంటే, బామ్మ మనవడికి కథ చెప్పినా అది మూడంకాలతో స్ట్రక్చర్లోనే వుంటుంది. స్ట్రక్చర్ అంటే  ఏమిటో తెలుసుకోకుండా దాన్ని బ్రేక్ చేయాలనే ఆలోచనలు అర్ధం లేనివి.

        స్ట్రక్చర్ లేకుండా కథ సంజయ్ దత్ జీవిత కథ లాంటిది వుండొచ్చు. సంజయ్ దత్ బయోపిక్ గా రాజూ హిరానీ తీసిన ‘సంజు’ కి స్ట్రక్చర్ వుండదు.
ఫస్టాఫ్ ఒక జీవిత ఘట్టం (డ్రగ్స్) తో, సెకండాఫ్ ఇంకో జీవిత ఘట్టం (గన్స్) తో వుంటుంది. ఈ రెండు జీవిత ఘట్టాలకీ కవరింగ్ లెటర్ లాగా ఇంకో ఘట్టముంటుంది : ఫైనల్ గా సంజయ్ జైలు శిక్ష అనుభవించే ఘట్టం. అంటే 1980 లలో డ్రగ్స్ ఘట్టం, ’90 లలో గన్స్ ఘట్టం, 2000 లలో జైలు శిక్ష ఘట్టమూ అన్న మాట. ఇలా త్రికాలాల కథగా అలంకరణ చేశారు. రెండు భూత కాలాలు, ఒక వర్తమాన కాలం. నిజజీవితంలో ఈ మూడు ఘట్టాల్లో సంజయ్ దత్ ఒక దారితప్పిన పాసివ్ క్యారక్టర్ అని లోకానికి తెలిసిందే. అందువల్ల ఈ కథని సినిమా కథగా చూడలేదు ప్రేక్షకులు. అతడి జీవితం గురించి తెలుసు కాబట్టి క్రోనాలజీ చేసిన అతడి ట్రాజడీగా, ఓ డాక్యుమెంటరీగా సర్ది చెప్పుకున్నారు ప్రేక్షకులు. ఇదే ఫిక్షన్ పాత్రతో,  పిక్షన్ కథని, స్ట్రక్చర్ లేకుండా కొన్ని ఘట్టాలుగా పేర్చుకుంటూ పోతే చూడగలరా? సమయానికి పేరు గుర్తుకు రావడం లేదు గానీ, ఇలా తీసిన సినిమా తెలుగులో ఒకటి వచ్చి ఫ్లాపయ్యింది. 

       
2. ఈ ప్రశ్న మీరు ‘డియర్ జాన్’ ని దృష్టిలో పెట్టుకుని అడిగి వుంటారు. ‘డియర్ జాన్’ రోమాంటిక్ డ్రామాలో వున్నది ఎండ్ సస్పెన్స్ కాదు, ట్విస్ట్. జాన్, సవన్నాలు ప్రేమించుకుంటారు. సవన్నాతో టైరీకి క్రష్ వుంటుంది. జాన్ యుద్ధాని కెళ్ళిపోతాడు. ఉత్తరాలు రాసుకుంటూ వుంటారు. సవన్నా ఉత్తారాలు రాయడం మానేస్తుంది. యుద్ధం తర్వాత జాన్ తిరిగి వెళ్తే, సవన్నా టైరీని కాక, టిమ్ అనే ఇంకొకడ్ని పెళ్లి చేసుకుని వుంటుంది. ఇది ఎండ్ సస్పెన్స్ కాదు, ట్విస్ట్. 

       ఎండ్ సస్పెన్స్ ఎలా వుంటుందంటే, ఒక హత్య జరుగుతుంది. ఎవరు హత్య చేశారో ప్రేక్షకులకి చెప్పరు. అనుమానితుల్ని చూపిస్తూ వీళ్ళలో ఎవరు హత్య చేసి వుంటారని చివరిదాకా ప్రశ్నలతో నడిపి (సహన పరీక్ష పెట్టి), అప్పుడు వాళ్ళలో ఒకర్ని హంతకుడుగా రివీల్ చేస్తారు. చివరి దాకా హంతకుడెవరో చెప్పకుండా, టీవీ రియాల్టీ షో క్విజ్ పోటీల్లో లాగా దాచారు కాబట్టి ఎండ్ సస్పెన్స్.
      ‘డియర్ జాన్’  రోమాంటిక్ డ్రామాని ఎండ్ సస్పెన్స్ చేస్తే ఇలా వుంటుంది - జాన్ సవన్నాలు ప్రేమించుకుంటారు. సవన్నాతో క్రష్ వున్న టైరీ పాత్ర వుండదు. జాన్ యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఉత్తరాలు రాసుకుంటారు. సవన్నా రాయడం మానేస్తుంది. ఎందుకు మానేసింది? చచ్చిపోయిందా? యుద్ధమయ్యాక జాన్ వెళ్లి చూస్తే టిమ్ ని పెళ్లి చేసుకుని వుంటుంది. ఓస్ ఇంతేనా, సావలేదన్న మాట దీని సోకు మాడా - అనుకుని తిట్టుకుంటారు ప్రేక్షకులు. 

        ఇదే సినిమాలో చూపించినట్టు ఓపెన్ కథలో క్రష్ వున్న టైరీని చూపిస్తే, ఆమె చచ్చిందనుకోరు ప్రేక్షకులు. వాణ్ణి చేసుకుని వుంటుందిలే, ఇప్పుడు జాన్ గారు ఏం చేస్తాడో చూద్దామని సీన్ టు సీన్ సస్పెన్స్ అనుభవిస్తారు. తీరా చూస్తే ఆమె క్రష్ వున్న టైరీతో కాక, ఫ్రెష్ గా వున్న టిమ్ తో వుండేసరికి అదో ఆనందించదగ్గ ట్విస్ట్. ఏ జానర్ కీ ఎండ్ సస్పెన్స్ మంచిది కాదు. 

      3. హీరో ఫిజికల్ గా కాకుండా మెంటల్ యాక్షన్ తో వుంటే యాక్టివ్ పాత్ర అవుతాడా అంటే, విలనే అవుతున్నప్పుడు హీరో ఎందుకు కాడు. విలనేం చేస్తాడు? తీరి కూర్చుని మెంటల్ వర్క్ చేస్తూ అనుచరులతో దాడులు (ఫిజికల్ యాక్షన్) చేయిస్తూంటాడు. ఇలా చేసి పాసివ్ అయిపోడుగా? పాపాలు పండే వరకూ ఇలా చేసి, చివర్లో ఫిజికల్ యాక్షన్లో హీరోతో తన్నులు తింటాడు. హీరోకూడా మెంటల్ యాక్షన్ తో యాక్టివ్ గా వుండొచ్చు, ‘అంతిమ తీర్పు’ లో కృష్ణం రాజులాగా. కమ్యూనికేషన్స్ మాధ్యమంగా. ఫోన్ కాల్స్ తో పనిజరిపించుకోవడం కూడా యాక్షనే. ఫిజికల్ యాక్షన్ జరిపించడం. ‘ముత్యాలముగ్గు’ లో విలన్లు వాళ్ళలో వాళ్ళకి తేడా లొచ్చి కొట్టుకుని నాశనమైపోతారు. క్లయిమాక్స్ లో హీరో ఒక్క ఫోన్ కాల్ తో విలన్స్ మధ్య గొడవలు పెట్టించి వాళ్ళూ వాళ్ళూ క్లయిమాక్స్ జరిపించుకునేలా చేయొచ్చు. ఎంతసేపూ హీరోతో  క్లయిమాక్స్ యాక్షన్ అనే రోటీనేనా? చిచ్చు పెట్టిన హీరో ఎక్కడో ఎంజాయ్ చేస్తూంటాడు, విలన్లు కొట్టుకుని చచ్చి పోతూంటారు. ఇది కూడా హీరో మైండ్ లో సృష్టి జరిగిన ఫిజికల్ యాక్షనే. ఇలా ఏ జానర్ కి ఆ జానర్ మెంటల్ యాక్షన్ గా చేసుకోవచ్చు.

సికిందర్