రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 22, 2021

1010 : రివ్యూ

రచన - దర్శకత్వం : బగ్స్ భార్గవ కృష్ణ
తారాగణం : అర్జున్ రామ్ పాల్, మానవ్ కౌల్, ఆనంద్ తివారీ, రజిత్ కపూర్, మధూ సిమ్రన్ కౌర్ 
సంగీతం : సంజయ్ వాండ్రేకర్, ఛాయాగ్రహణం : దీప్ మెట్కర్ 
నిర్మాతలు :  జహానారా భార్గవ, ధీరజ్ వినోద్ కపూర్
విడుదల : జీ5 
***

      కోర్టు రూం డ్రామాలంటే ఒక హత్య, ఒక ముద్దాయి, ఇద్దరు లాయర్లు, ఒక జడ్జి, కేసు విచారణ, గ్యాలరీలో జనం, థియేటర్లో ప్రేక్షకులు, ప్రేక్షకులకి రొటీన్. ఎందుకని రొటీన్ అంటే అవి రొటీన్ గా ఎండ్ సస్పెన్స్ కథలు. కానీ హత్య కేసు కథలనేవి కేసు రహస్యాలు బయటపెట్టే టెంప్లెట్ తోనే ఎందుకుండాలి. ఇది రొటీన్. కేసు విచారణలో ముద్దాయే ఒక రహస్యమై కేసే స్థంభించిపోతే, కేసే లేకుండా పోతే అప్పుడేమిటి? ఇంకో ఎండ్ సస్పెన్స్ కథతో కోర్టు విచారణ చూసే రొటీన్ తప్పుతుంది. 
      యాడ్ ఫిలిమ్ మేకర్, నటుడు, దర్శకుడు బగ్స్ భార్గవ కృష్ణ సాధారణ హత్య కేసు విచారణ కథని, మధ్యలో ముద్దాయి మిస్టరీగా తిప్పేసి కోర్టు రూం డ్రామా రొటీన్ టెంప్లెట్ ని నిలువునా బద్దలు కొట్టాడు. ఈ మధ్య కూడా గరుడ వేగ’, పడిపడి లేచే మనసు’, నర్తన శాల’, 24 కిస్సెస్ లాంటి సెకండాఫ్ సిండ్రోమ్ కథలతో అలవాటుగా తెలుగు సినిమా లొచ్చాయి. ఇంటెర్వెల్ కి కథ తెగిపోయి సెకండాఫ్ సంబంధం లేని వ్యవహారమన్న మాట. దర్శకుడు బగ్స్ నెయిల్ పాలిష్ కథని సెకండాఫ్ సిండ్రోమ్ కి అందకుండా స్లీప్ వాకింగ్ చేసేశాడు. అంటే పాసివ్ గా కూర్చుని చేసే స్టోరీ రైటింగ్ ఇక పని చెయ్యదన్న మాట, బయటి ప్రపంచంలో కొచ్చి చేసే స్టోరీ మేకింగ్ ఇప్పటి అవసరమన్న మాట. 
        నేరం మెదడు చేస్తుంది. ముద్దాయి మీద కేవలం నేరారోపణ చేస్తారు. అయితే బోనులో నిలబడ్డ ముద్దాయి దోషిగా రుజువవుతూ, నిర్దోషి కూడా అయితే అప్పుడేమిటి? - ఈ స్టోరీ ఐడియాతో కథలోకి వెళ్తే, లక్నోలో వీర్ సింగ్ (మానవ్ కౌల్) అని ఒక స్పోర్ట్స్ కోచ్. ఇన్స్ పెక్టర్ సురేష్ అతడి ఫ్రెండ్. ఒక రోజు వూరి బయట ఇద్దరు పిల్లల కాలిన మృతదేహాలు దొరుకుతాయి. సాక్ష్యాధారాలు వీర్ సింగ్ నే పట్టిస్తాయి. ఇంకో అంతుచిక్కని 32 మంది పిల్లల హత్య కేసుల్లో కూడా అనుమానితుడవుతాడు. జైల్లో వేస్తారు. సిద్ధార్థ్ జైసింగ్ అలియాస్ సిడ్ (అర్జున్ రామ్ పాల్) డిఫెన్స్ లాయర్. కేసు చేపడతాడు. అమిత్ కుమార్ (ఆనంద్ తివారీ) ప్రాసిక్యూటర్. కిషోర్ భూషణ్ (రజిత్ కపూర్) జడ్జి . ఇద్దరు పిల్లల తాజా హత్యల మీద విచారణ ప్రారంభమవుతుంది. డీఎన్ ఏ సాక్ష్యంతో వీర్ సింగ్ మీద కేసు రుజువు చేస్తాడు అమిత్ కుమార్. సిడ్ ఏం చేయడానికీ వుండదు. ఈ సాక్ష్యం ఒప్పుకోవాల్సిందే, వీర్ సింగ్ ని ఇక వదులు కోవాల్సిందే. కానీ పంతానికి పోతాడు. ఈ సాక్ష్యం కచ్ఛితత్వాన్ని నమ్మనని, ఎఫ్బీఐ కి పంపాలనీ పట్టు బడతాడు. అమెరికాలో ఎఫ్బీఐకి పంపితే 50 శాతమే టాలీ అవుతున్నట్టు రిపోర్టు వస్తుంది. ప్రాసిక్యూటర్ అమిత్ కుమార్ ఇది ఒప్పుకోనని చిందులేస్తాడు. ఈ గొడవ తెగక ఇలా వుంటే, ముద్దాయి వీర్ సింగ్ లో వీర్ సింగ్ వుండడు, చారు రైనా అనే ఆవిడ వుంటుంది. చారు రైనా మీద కేసేలా నడుపుతారు? ముద్దాయి లోంచి వీర్ సింగ్ మాయమై పోయాడు - వీర్ సింగే లేడు, కేసే లేదు! జడ్జికి దిమ్మదిరిగి పోతుంది...

***

       న్యాయ వ్యవస్థకే సవాలు ఈ కేసు. సిడ్, అమిత్ కుమార్ లు ఇక పోట్లాట మానుకుని ఈ మిస్టరీ ఏంటో తేల్చేందుకు ఒకటవుతారు. జడ్జికి ఇంటి దగ్గర డ్రింక్ చేసే పడుచు భార్య శోభ (మధూ) తో పిచ్చెత్తుతూ వుంటుంది. కేసుకాని కేసు విచారణ కోర్టు హాల్లోంచి జడ్జి ఛాంబర్ కి ప్రైవేటుగా మారుతుంది. ముద్దాయి కాని ముద్దాయి జైల్లో చేతి గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటూ వుంటాడు. 

        పాయింటే మిటంటే, డిఐడి ( డిస్ససోషియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్) అని మనో రుగ్మత వుంది. స్ప్లిట్ పర్సనాలిటీ అన్నమాట. దీన్ని ఇదివరకు ఎంపిడి (మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్) అనే వాళ్ళు. దీంతో అపరిచితుడు వచ్చింది. డిఐడి లో రోగిలో రెండు నుంచి 400 దాకా ఎన్నయినా పర్సనాలిటీస్ వుండొచ్చు. డిఐడి తో హాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. 2017 లో ఎం. నైట్ శ్యామలన్, మెక్ ఎవాయ్ తో స్ప్లిట్ తీశాడు. ఇందులో 24 పర్సనాలిటీస్ బయటపడుతూ వుంటాయి మెక్ ఎవాయ్ లో.
        నెయిల్ పాలిష్ లో వీర్ సింగ్ లో వున్నది చారు రైనా ఆత్మనా, లేక అతనేనా? లేక చారు రైనాలా నటిస్తున్నాడా? అతడిలో వున్నది అతడే అయితే చారు రైనాగా ఎలా మారాడు? చారు రైనా ఎవరు? చారు రైనా గానే అతను మారాడని సైంటిఫిక్ గా రుజువైతే  కేసే మవుతుంది? శరీరం వీర్ సింగ్ ది, మెదడు చారు రైనాది. మెదడు నేరం చేయమంటుంది, శరీరం ఆ నేరం చేస్తుంది. పిల్లల్ని వీర్ సింగ్ శరీరమే చంపింది, కానీ చంపించింది అతడి మెదడే అని రుజువు లేదు. రుజువు చారు రైనాతో వుంది. మరి ఈ డిఐడి కేసు చిక్కు ముడి ఎలా వీడింది? జడ్జి ఎలా తీర్పు చెప్పాడు?

***

       డిఐడి తో వచ్చే సినిమాల మీద అమెరికాలో ఏమంత మంచి అభిప్రాయం లేదు. డిఐడి ని వాస్తవ దూరంగా భూతంలా చూపిస్తున్నారని ఆరోపణలు. జనాభాలో ఒక శాతం మందికే వుండే ఈ రుగ్మత హింసాత్మక చర్యలకి పాల్పడేలా చెయ్యదు. రోగులు తమని తాము కూడా హింసించుకోరు. ఇక హత్యలు చేసిన సంఘటనలు లేవు. ఇలాటి సినిమాల వల్ల ఈ రోగులు సమాజంలో వెలివేతకి గురవుతున్నారు. డిఐడి గురించి ఈ సినిమాలు ప్రేక్షకులకి తప్పుడు అభిప్రాయం కల్గించి, రోగుల్ని అంటరాని వాళ్ళుగా చేస్తున్నాయి. 

        అయితే నెయిల్ పాలిష్ లో వీర్ సింగ్ డిఐడి తో హత్యలు చేయలేదు. కేసు కొనసాగుతూండగా, జైల్లో జరిగిన ఒక సంఘటనతో డిఐడి కి లోనయ్యాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవసాయ చట్టాలు ఆపుతామంటే, రైతులు కాదన్నట్టు- జడ్జి కేసు నిరవధికంగా వాయిదా వేస్తానంటే బాధితులు ఒప్పుకోరు. అప్పుడు జడ్జి క్రియేటివ్ మైండ్ తో అందరికీ తృప్తి కల్గించేలా ఇంటలిజెంట్ తీర్పు చెప్తాడు. ఈ ఆలోచన ఇంట్లో డ్రింక్ చేసే పడుచు భార్య వల్ల వచ్చింది... 
        చాలా కాలం తర్వాత నాటి  హీరోయిన్ మధూ పడుచు భార్యగా కన్పించింది. అర్జున్ రామ్ పాల్ కి జాతీయ అవార్డు వస్తుందని దర్శకుడి నమ్మకం. యూపీలో చిత్రీకరణ చేశారు. సాంకేతికంగా బావుంది. ఎడిటింగ్ చాలా బావుంది. కోర్టు దృశ్యాలు ఆర్డర్ ఆర్డర్ అరుపులతో లేవు. సహజంగా వున్నాయి. జడ్జిని యువరానర్, మిలార్డ్ టెంప్లెట్ పిలుపులతో సంబోధించడం లేదు. లాయర్లు జడ్జితో ఫ్రీగా వుంటారు. జడ్జి ఛాంబర్లో జడ్జి ముందు కాలుమీద కాలేసుక్కూర్చుంటారు. జడ్జి కూడా కేసు తేల్చడానికి లాయర్లతో కలిసి పని చేస్తాడు. 
        సినిమాలు మారి పోతున్నాయి. విషయ ప్రధాన సినిమాలు వస్తున్నాయి. పాత విషయాలు, ఉన్న నమూనాలూ, బాక్సాఫీసు మూస లెక్కలూ పక్కన పెడుతున్నారు. ఎవరూ ఇంకొకర్ని అనుసరించడం లేదు. ఎవరి పంథా వాళ్ళదిగా డైవర్సిటీని ప్రదర్శిస్తున్నారు. డైవర్సిటీతోనే  ఇలాటి డిస్కవరీలుంటాయి.  

సికిందర్