రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, జనవరి 2018, మంగళవారం

595 : 'భాగమతి' రివ్యూ - 5

  జి.అశోక్ దర్శకత్వంలో వచ్చిన ’భాగమతి’ కథ 2012 లోనే తయారై సిద్ధంగా వుందన్నారు. 2017 లో ఇదే దర్శకుడి ‘చిత్రాంగద’ విడుదలయ్యింది. అది స్ట్రక్చర్ తప్పిన మిడిల్  మటాష్ క్రియేటివిటీతో అట్టర్ ఫ్లాపయ్యింది. ఇప్పుడు 2018 లో ‘భాగమతి’ ని విడుదల చేశారు. చూస్తే ‘చిత్రాంగద’  ఏ స్ట్రక్చర్ తప్పిన మిడిల్ మటాష్ గా వుందో,  ‘భాగమతి’  అదే స్ట్రక్చర్ తప్పిన మిడిల్ మటాష్ తో వుంది. పైగా టైమింగ్స్ సహా అదే ప్లాటింగ్ (కథనం) తో వుంది. అంటే ‘భాగమతి’  కథ ముందు తయారైంది కాబట్టి ఆ క్రియేటివిటీయే కరెక్ట్ అన్పించి  ‘చిత్రాంగద’ కథనీ అలాగే తయారు చేశారన్న మాట. కానీ ఆ క్రియేటివిటీ తప్పని  చిత్రాంగద’ విడుదల తర్వాత తేలింది. అయినా ఈ క్రియేటివిటీకి  మాతృక అయిన ‘భాగమతి’ క్రియేటివిటీని సవరించుకోకుండా వున్నదున్నట్టు అలాగే తీసేశారు. అంటే దీనర్ధం,  అది క్రియేటివిటీ లోపమని అర్ధంగాక అయినా వుండాలి, లేదా  బిగ్ బ్యానరూ, అనూష్కా ఎలాగో బయట పడేస్తారనైనా అనుకుని వుండాలి. అదృష్టం బావుండి బైట పడేశారు. ఇక జి. అశోక్ ఇదే తరహా టెంప్లెట్ క్రియేటివిటీతో  ఇంకో బిగ్ బ్యానర్ నీ, స్టార్ వేల్యూనీ నమ్ముకుని ఇంకో భాగమతిని కూడా తీసెయ్యొచ్చు. విప్లవాత్మకంగా క్రియేటివిటీకి స్ట్రక్చర్ అవసరం లేదనీ, పునాదుల్లేకుండా ఇల్లు కట్టవచ్చనీ  నిరూపించవచ్చు...


        ‘భాగమతి’  కథ చూద్దాం : ప్రారంభంలో ఒక  అటవీ ప్రాంతంలో అదృశ్య శక్తేదో మనుషుల్ని చంపేస్తున్న ఓపెనింగ్ టీజర్ వుంటుంది.

A. ఫస్టాఫ్ : బిగినింగ్ విభాగం
         
1. (ట్రాక్ -1) :  ఆ తర్వాత ఢిల్లీలో కేంద్రమంత్రి ఈశ్వరప్రసాద్ (జయరాం)  ప్రెస్ మీట్ లో తన మీద వచ్చిన ఒక ఆరోపణని ఖండిస్తూ తనెంత సచ్ఛీలుడో చెప్పుకుంటాడు. 

          అటు కేంద్ర హోంమంత్రి ,  ముఖ్యమంత్రి మాట్లాడుకుని  ఈశ్వర ప్రసాద్ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అతను ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టకుండా వుండాలంటే విగ్రహాల దొంగతనాల వ్యవహారంలో అతడి మీదున్న ఆరోపణలకి సంబంధించి రహస్య సీబీఐ విచారణ జరిపి ఇరికించాలనుకుంటారు.

          సీబీఐ అధికారిణిగా వైష్ణవి (ఆశా శరత్)  తన బృందంతో దిగుతుంది. ఆమె గతంలో ఈశ్వరప్రసాద్ దగ్గర  పియ్యేగా  పనిచేసిన చంచల (అనూష్కా)  అనే ఐఏస్ ఆఫీసర్ ని ప్రశ్నించి ఈశ్వరప్రసాద్ మీద సాక్ష్యం సంపాదించాలనుకుంటుంది. 

          చంచల తను ప్రేమించిన శక్తి (ఉన్నీ ముకుందన్) అనే సామాజిక కార్యకర్తని చంపిన కేసులో జైల్లో వుంటుంది. 

          వైష్ణవి బృందంలోని సీబీఐ అధికారి సంపత్ (మురళీ శర్మ) చంచలని దూరంగా పాడుబడ్డ భాగమతి బంగళాకి తరలిస్తాడు. ఈ బంగళాలో భాగమతి దెయ్యమై వుందని ప్రజలు భయపడుతూంటారు. ఈ వాతావరణంలోనే చంచలని విచారిస్తూంటుంది వైష్ణవి. 

         
2. (ట్రాక్ -2) : చంచల ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇదులో ఐఏఎస్ ఆఫీసర్ గా చంచల ప్రాణాధార ప్రాజెక్టు కింద భూసేకరణ వ్యవహారాలు చూస్తూంటుంది. అ రైతుల ఆందోళనకి శక్తి నాయకత్వం వహిస్తూంటాడు. చంచలని వ్యతిరేకించిన ఇతను తర్వాత సహకరించడం మొదలెడతాడు. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడతారు. సీబీఐ సంపత్ తమ్ముడే శక్తి అని రివీలవుతుంది.

          3. (ట్రాక్ -3) : బంగాళాలో చంచలకి భయానక అనుభావా లెదురవుతూంటాయి. భాగమతి ఆత్మ ఆమెని ముప్పుతిప్పలు పెడుతూంటుంది.

          చివరికి భాగమతి ప్రత్యక్షమై తనెవరో ఏమిటో, తనకేం అన్యాయం జరిగిందో చెప్పుకుంటుంది. తను కాళంగి  రాజ్యపు రాణి. సేనాని చంద్రసేనుడు ఈ బంగళాలోనే  తనని బంధించి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. దీనికి భాగమతి పగబట్టింది. ఆ చంద్రసేనుడితో లెక్క తేల్చుకుంటానని శపథం చేస్తుంది.  దీంతో ఇంటర్వెల్.

B. సెకండాఫ్ : బిగినింగ్ విభాగం కంటిన్యూ
          4. (ట్రాక్ -1 కంటిన్యూ) : చంచల సైకిక్ ప్రవర్తన నాటకమని కొట్టి పారేస్తూ సీబీఐ బృందం విచారణ పేరుతో  ఆమెని మరింత  ఇబ్బంది పెడుతూంటుంది. ఇప్పుడు చంచల ఎదురు తిరగడం మొదలెడుతుంది.

          5. (ట్రాక్ -2 కంటిన్యూ) : చంచల ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతుంది. శక్తితో ఆమె ప్రేమ ఖాయం అవుతుంది. ఆ ఫంక్షన్ కి కేంద్ర మంత్రి ఈశ్వరప్రసాద్ కూడా వస్తాడు. చంచలకి శక్తితో ఫ్లాష్ కట్స్ పడతాయి. ఆ ఫ్లాష్ కట్స్ లో ఆమె అతణ్ణి చంపుతున్నప్పటి దృశ్యాలుంటాయి.

         
6. (ట్రాక్ – 1 కంటిన్యూ) : సిబీఐ బృందం సైకియాట్రిస్టు తో చంచలకి పరీక్ష చేయిస్తారు. చంచల తిరగబడి కొట్టడంతో అతను గాయపడతాడు. ఆమెకి నిజంగానే భాగమతి ఆత్మ ఆవహించిందని ధృవీ కరిస్తాడు.

         
7. (ట్రాక్ 3 కంటిన్యూ) : సిబీఐ సంపత్ బంగళాలోకి ప్రవేశించి నిజంగానే భాగమతి ఆత్మ వుందని నమ్ముతాడు. చంచలని మానసిక వైద్యశాలకి తరలిస్తారు.

C. బిగినింగ్ విభాగం ముగింపు : ప్లాట్ పాయింట్ - 1
        8. (కథా ప్రారంభం) : మానసిక వైద్య శాలకి చంచలని చూడడానికి కేంద్ర మంత్రి ఈశ్వర ప్రసాద్ వస్తాడు. ఇంత జరుగుతున్నా చంచల  తనపేరు బయట పెట్టడం లేదంటే ఆమెకి తన మీద ప్రేమ వున్నట్టేనని అంటాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య వున్నసంబంధం ఓపెన్ అవుతుంది.

D. మిడిల్ విభాగం (కథ కొనసాగింపు):
          9. ( ట్రాక్ -2 కంటిన్యూ) : ఫ్లాష్ బ్యాక్ లో  భూముల వ్యవహారం వస్తుంది. తనకి తెలియకుండా ఎక్కువ భూములు నోటిఫై చేసి సంతకాలు పెట్టించుకున్నాడని ఎదురుతిరుగుతుంది చంచల. ఆమె నోరు మూయించడానికి ఆమె చేతిలో శక్తి చనిపోయేలా చేస్తాడు  ఈశ్వర ప్రసాద్.

E. మిడిల్ విభాగం + ప్లాట్ పాయింట్ -2 + ఎండ్ విభాగం :
         
10. (కథ ముగింపు) : ఈ నేపధ్యంలో ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ ని ఇలారప్పించి పగదీర్చుకోవడానికే భాగమతి పూనినట్టు నటించి చంచల గేమ్  ఆడిందని  రివీల్ అవుతుంది. ఇద్దరి మధ్య ఘర్షణలో ఈశ్వరప్రసాద్ చనిపోతాడు.

చెప్పేదొకటి –జరిగేదొకటి!
     ఇలావున్న కథలో ముందుగా సెటప్స్ – వాటి పే ఆఫ్స్ ఎలావున్నాయో చూద్దాం : ఓపెనింగ్ టీజర్ గా చూపించిన గిరిజనుల ఊచకోత దృశ్యాలకి  అదృశ్య శక్తితో  ‘ప్రిడేటర్’ (1987) ఇన్ స్పిరేషన్ కన్పిస్తుంది. ఇవి మనం చూస్తున్నప్పుడు ఈ అదృశ్య శక్తి భాగమతియే  అన్న అభిప్రాయం కల్గుతుంది. ఎందుకంటే భాగమతి సినిమా కాబట్టి. హార్రర్ ఎలిమెంటు ఆమెతో తప్ప మరొకదానితో కనెక్ట్ అయి వుండదని భావిస్తాం కాబట్టి. 

          క్లయిమాక్స్ లో కేంద్రమంత్రి కుట్ర బయటపడినప్పుడు, ఫ్లాష్ బ్యాక్ లో ఈ ఊచకోత దృశ్యాలు వస్తాయి. ఇది భూములు ఖాళీ చేయించడానికి అతనే జరిపిస్తున్న  ఊచకోతగా,  సెల్ ఫోన్లో లైవ్ గా చంచలకి చూపిస్తూంటాడు, ఆమె మనోస్థైర్యాన్ని దెబ్బ తీయడానికి. 

          ఈ సెటప్ – దీని పే ఆఫ్  తప్పుదోవ పట్టించేవిగా  వున్నాయి. కథలో హార్రర్ ఎలిమెంటు భాగమతితో వున్నప్పుడు,  కథలో ఏ హార్రర్ సంఘటన జరిగినా అది భాగమతి కారణంగానే చూపించాలి తప్ప- వేరేగా చీట్ చేయడం సరికాదు. కనుక ఓపెనింగ్ టీజర్ ఫెయిలయ్యింది. ప్రేక్షకుల్ని మాయ చేయవచ్చు గానీ మోసం చేయకూడదనేది స్క్రిప్టింగ్ మర్యాద. 

          ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రిలు కలిసి కేంద్ర ఇరిగేషన్ మంత్రి  ఈశ్వర ప్రసాద్ ని  ఇరికించడానికి విగ్రహాల దొంగతనాలనే కేసు విచారణ జరిపించేందుకు పూనుకుంటారు. ఇందుకు ఈశ్వరప్రసాద్ మాజీ పియ్యే చంచలని ప్రశ్నించాలని సీబీఐ వైష్ణవి నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది. కానీ చంచల ఎందుకు జైల్లో వుందో తెలీదా? చంచల, ఆమె చంపిందంటున్న కార్యకర్త శక్తి,  భూసేకరణ వ్యవహారంలో వున్నారు. అదే భూసేకరణ  వ్యవహారంలో ఇరిగేషన్ మంత్రి ఈశ్వర ప్రసాద్ కూడా ఇన్వాల్వ్ అయి వున్నాడు. ప్రకటించిన 127 గ్రామాలని 135 గా మార్చి చంచలని మోసం చేశాడు. (తెలంగాణా ఎనిమిది మండలాల్ని ఆంధ్రాలో కలిపిన ఇన్స్ పిరేషనేమో). ఆ తర్వాత ఆమె శక్తిని చంపిందని జైలుకెళ్ళింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ముఖ్యమంత్రికి , కేంద్ర హోం మంత్రికీ అనుమానాలే రావా ఈశ్వర ప్రసాద్ మీద? చంచల సాయం తీసుకుని ఉన్న ఈ కేసునే తిరగదోడి ఈశ్వరప్రసాద్ ని జైలుకి పంపవచ్చుగా? ఇంకేదో విగ్రహాల దొంగతనాలంటూ చంచలని హింసించి ఈశ్వరప్రసాద్ ని ఇరికించాలన్న ఆలోచనెందుకు? ప్రేక్షకుల మీద అనవసరమైన సమాచార భారాన్ని మోపడం కాకపోతే?  ఆడుకోవడానికి ఒక బంతి అంటూ వున్నాక, ఆ బంతితోనే ఆట సాగుతుంది తప్ప,  గ్యాలరీలో ప్రేక్షకకులెవరో ఆకతాయిగా ఇంకో బంతి  విసిరారని, ఆడుతున్న బంతిని  వదిలేసి  ఆ వచ్చిపడ్డ కొత్త బంతి వెంటపడి పోతారా  ఆటగాళ్ళు? భూముల వ్యవహారమనే ఒక బంతిని ప్రేక్షకుల మీదికి ఆల్రెడీ విసిరాక, కాదని ఆకతాయి కథకుడు ఇంకో విగ్రహాల దొంగతన 
మనే బంతిని వేసి పాయింటుని  చీల్చి కూర్చుంటాడా? 

          కాబట్టి ఈ కామన్ సెన్సు తో చూస్తే, సీబీఐ విచారణ అనే  సెటప్ ని - పే ఆఫ్ చేయడంలో ఫెయిలయ్యారు. అంటే ఈ కథ వుండడానికి వీల్లేదు. వీల్లేని కథని చూపెట్టారు. ఒకటేదో  సెటప్ చేస్తే, దాని కుండాల్సిన పే ఆఫ్ ని వేరే క్లోనింగ్ చేసి వికృతిని చూపిస్తున్నారు, చూపించాల్సిన ప్రకృతిని కాదు. ఓపెనింగ్ టీజర్ తో ఇదే జరిగింది, ఇప్పుడూ ఇదే జరిగింది. 

          ఇంటర్వెల్లో భాగమతి ఆత్మని సెటప్ చేశారు. ఆ తర్వాత ఈమే లేదు, ఈమె కథా లే దు. అదంతా తన గేమ్  కోసం చంచల సృష్టి అన్నట్టుగా తేల్చేశారు. కాబట్టి భాగమతి అబద్ధం, సెటప్ అబద్ధమని తేలిపోయింది.  కనుకే పే ఆఫ్ లేకుండా పోయింది. భాగమతి చంచల సృష్టించుకున్న ఫాంటసీయే   అయితే, సినిమా టైటిల్ భాగమతి మీద వుండరాదు,  చంచల మీదే వుండాలి . అప్పుడే ప్రేక్షకులు తాము చీటింగ్ కి గురయ్యామని ఫీలవకుండా వుంటారు. పబ్లిసిటీలో కూడా భాగమతిని ప్రేక్షకులు అస్సలు వూహించరు కాబట్టి,   ఇంటర్వెల్లో ఆమె ఎంట్రీతో  షాకింగ్ గా సర్ప్రైజ్ అవుతారు, థ్రిల్లవుతారు. ఇది బాక్సాఫీసుకి చాలా ప్లస్ అవుతుంది. అప్పుడు చంచల కథ డెప్త్ లేని సాదా పొలిటికల్ థ్రిల్లర్ అవుతుందే, అప్పుడు దాంతో మహిళా ప్రేక్షకులకి ఇబ్బంది కదా అనుకుంటే – ఒక్కటే,  అన్యాయానికి బలైన మాజీ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రతిఫలింపజేయడమే. చంచలకి దీన్ని అలా టచ్ చేసివదిలేశారు. అలాకాకుండా పూర్తి స్థాయి పాత్రే అది కావాలి. 

          సరే, చంచల  భాగమతి ఆత్మ పూనినట్టు ప్రవర్తిస్తుంది. మరి ఈ సెటప్ కి పే ఆఫ్ ఏమిటి? ఆమెని ఆసుపత్రిలో చేర్చడమా? ఎలా చేర్పిస్తారు, జైల్లోంచి బంగళాకి రహస్యంగా తరలించి విచారిస్తున్నప్పుడు? 

          మరి ఆసుపత్రికి తరలింపు సెటప్ కి పే ఆఫ్ ఏమిటి? చంచల దగ్గరికి మంత్రి వచ్చేయడమా? ఎలా వచ్చేస్తాడు, చంచలతో తన మీద చేస్తున్న కుట్ర తెలిసిపోయి? చంచల దగ్గరికి దేనికొ స్తాడు- వస్తే గిస్తే చంపిపారెయ్యడానికే వస్తాడు. వచ్చి పైగా,  నా మీద మనసుపడి వాళ్ళకి చెప్పడం లేదా నా రహస్యాలని ఎలా అంటాడు?

          క్లయిమాక్స్ లో వచ్చే చివరి ఫ్లాష్ బ్యాక్ లో- చంచల చేతిలో శక్తి చనిపోయే ఫ్లాష్ బ్యాక్ లో- మంత్రి చంచల చేతిలో పిస్తోలు పెట్టి శక్తిని చంపమని బెదిరిస్తున్నప్పుడు, ఆమె ఆ పిస్తోలు తనకే గురిపెట్టుకుని చస్తానని  ఎదురు తిరగవచ్చుగా? అవతల జరుగుతున్న గిరిజనుల ఊచ కోతని మంత్రి సెల్ ఫోన్లో లైవ్ గా  చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూంటే, దాన్ని కూడా చంచల ఆపవచ్చుగా తనకే  పిస్తోలు గురి పెట్టుకుని?  శక్తి కూడా తనని చంపమనే చంచలని రెచ్చ గొట్టడ మేమిటి? చంపి హంతకురాలిగా భవిష్యత్తు నాశనం చేసుకుని ఆమె జైలుకి పోవాలని కోరుకుంటున్నాడా? అది  ప్రేమేనా? అసలక్కడ ఇద్దరికీ చచ్చేంత సీనులేదు. తమ ప్రేమ కోసం మంత్రిని అక్కడి కక్కడే కాల్చి చంపవచ్చు- మిగతా సంగతులు తర్వాత. అసలిది మెక్సికన్ స్టాండాఫ్ లాంటి సన్నివేశం. యుద్ధ కళలో దీనికో థియరీ కూడా వుంది. హాలీవుడ్ కౌబాయ్ సినిమాలు చూసి వుంటే వాటిలోంచి చాలా ఇన్స్ పిరేషన్ దొరికేది.
          ఇలా కీలక ఘట్టాలు, ప్లాట్ పాయింట్సూ  ఎక్కడికక్కడ కథ రద్దయి పోయే సెటప్స్ తోనే  వున్నాయి.


ఇక స్ట్రక్చర్ సంగతి 
     స్ట్రక్చర్ చూద్దాం : స్ట్రక్చర్ లేకుండా అదే అలవాటు పడ్డ  మిడిల్ మటాష్ కథా వంటకంతో, రెండు మూడు పెద్దా  చిన్నా సినిమాలు శరవేగంగా షూటింగులు జరుపుకుంటున్నాయనీ, ఇంకో రెండు మిడిల్ మటాషులు విడుదలకి చకచకా రెడీ అయిపోతున్నాయనీ చల్లని సేదదీర్చే సమాచారమందుతోంది. శుభం, గృహమే స్వర్గసీమ. మిడిల్ మటాషులే మేళతాళాలు. ఈ మూవీస్ కూడా ‘భాగమతి’ లాగే మట్టి అంటకుండా గట్టి హిట్టవ్వాలని కోరుకుందాం. ప్రేక్షకులు ఎక్కడైనా వినియోగదార్లు గానీ సినిమాల దగ్గర అంతగా కాదు కాబట్టి, నకిలీ  సినిమాలకైనా సగర్వంగా ఫెళఫెళలాడే అసలీ నోట్లే తీసిచ్చేస్తూంటారు కాబట్టీ,  కుచ్ భీ చల్తాహై. 

          పైన A - ఫస్టాఫ్ : బిగినింగ్ విభాగంలో 1 నుంచి 3  వరకు వున్న ఆర్డర్ లో మూడు విడివిడి ట్రాకులు తెరిచిపెట్టారు :  1. సీబీఐ ఎంక్వైరీ ట్రాకు, 2. చంచల ఫ్లాష్ బ్యాకు  ట్రాకు, 3. భాగమతి హార్రర్ ట్రాకు. ఈ మూడిటికి  సంబంధించిన సీన్లే ఫస్టాఫ్ లో రిపీటవుతూంటాయి. విడివిడిగా వీటిని ఫాలో అవడం, ఒక చోట ఆపిన వాటిని మళ్ళీ ఇంకోచోట మొదలెడితే,  జోడించుకుని ఫాలో అవడమనే అనవసర శ్రమ మనకుంటుంది.  

          వీటిలో ఏ ట్రాకు ప్రధాన కథనుకుని ఫాలో అవ్వాలి? భాగమతి ట్రాకే ప్రధాన కథనుకుంటూ ఫాలో అవ్వాలేమో, టైటిల్ అదే కాబట్టి. భాగమతి ట్రాకుతో ఈ మొదటి రెండు ట్రాకులు ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తాయని ఎదురుచూడాలి ? 

          ఫస్టాఫ్ గంటంపావంతా ఈ బిగినింగ్ విభాగంతోనే ఏ డెవలప్ మెంటూ లేక వూరికే అలా అలా గడిపేశాక, ఇంటర్వెల్ దగ్గర భాగమతి కన్పించడంతో ఆమె దగ్గర మొదటి రెండు ట్రాకులు కలిశాయా? ఇక్కడ బిగినింగ్ ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి, ఇంతసేపూ ప్రారంభం కాని కథ  ఇప్పుడు ప్రారంభమవుతోందని అన్పిస్తోందా? 

          కథ ప్రారంభమవ్వాలంటే ప్రధాన పాత్ర వుండాలి. ఆ ప్రధాన పాత్ర  ఇప్పుడు భాగమతియే అనుకోవాలా, టైటిల్  ఆమె మీదే  వుంది కాబట్టి? మరి ప్రధాన పాత్ర భాగమతి అయితే,  కథ ప్రారంభించాలంటే ఆమె సమస్యలో పడాలిగా? ఆమెకో చంద్ర సేనుడనే వాడితో  గతజన్మకి సంబంధించిన సమస్యేదో వెల్లడయ్యింది. మరి ఈ సమస్యలోకి మొదటి రెండు ట్రాకులు ఎలా వచ్చి కలిశాయో ఇక్కడ చూపెట్టాల్సింది చూపించారా?  ప్లాట్ పాయింట్ వన్ అన్పించే  ఈ ఘట్టంలో భాగమతి డిక్లేర్ చేసిన సమస్యతో ఆమెకో గోల్ ఏర్పడాలిగా? ఏమిటా గోల్? ఆ లెక్క తేల్చుకుంటానంటోంది గత జన్మలో చంద్రసేనుడి తోనేనా? అతనిప్పుడు ఈ జన్మలో వున్నాడా? వుంటే వెళ్లి చంపడానికి ఆత్మకి అడ్డేమిటి? కాబట్టి ఇదంతా ఆమె ప్రగల్భాలుగా తేలిపోతోంది. 

          బిగినింగ్ విభాగంలో ఓపెనింగ్ టీజర్ ని  ఇంటర్వెల్లోనో, ముగింపులోనో పే ఆఫ్ చేయవచ్చు 
గానీ, బిగినింగ్ విభాగంలో ప్రారంభించిన ట్రాకులు ప్లాట్ పాయింట్ వన్ని మించి దాటి పోవడానికి వీల్లేదు. అన్ని ట్రాకుల్నీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కొలిక్కి తెచ్చి, బిగినింగ్ ని ముగించేసి, ఆ ట్రాకులన్నీ  కలిసి విసిరే ఉమ్మడి సమస్యతో పోరాటంగా,  ప్రధాన పాత్రకి  గోల్ నివ్వాలి. అప్పుడే ఈ క్రియేటివిటీ స్ట్రక్చర్ లో వుంటుంది. 

          ఇలా ఈ ఇంటర్వెల్ ఘట్టం ప్లాట్ పాయింట్ వన్ ఘట్టమనుకుంటే దీనికీ స్పష్టత  లేదు. మొదటి రెండు ట్రాకులూ ఎలా కలుస్తున్నాయో తేలలేదు, గోల్ ఏమిటో కూడా స్పష్టత  లేదు. కాబట్టి ఈ ఇంటర్వెల్ ని ప్లాట్ పాయింట్ వన్నే అనుకుంటే, ఇక్కడే ఎట్టకేలకు  కథ ప్రారంభమవుతోందనుకుంటే, ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది మొత్తంగా కథకి బలహీనంగా, స్పష్టత లేకుండా, కన్ఫ్యూజింగ్ గా వుంది. ఇక్కడే కథేమిటో అర్ధమైపోవాలి. కానీ కథేమిటో ఇంటర్వెల్లో కూడా తెలియడం లేదు. చంచల ఫ్లాష్ బ్యాక్ లో అసలేం జరిగిందో తెలిస్తేగా కథేమిటో తెలియడానికి. కాబట్టి ఫ్లాష్ బ్యాక్ ఏమిటో పూర్తిగా తేలేవరకూ కథేమిటో తెలియజేయలేని దయనీయ స్థితిలో పడింది ఈ స్ట్రక్చర్ తప్పిన క్రియేటివిటీ.

          సరే, ఈ భాగమతినే  పట్టుకుని కొనసాగుతూ ఇప్పుడు ప్రారంభమైన అర్ధం కాని కథనే  సెకండాఫ్ లో చూద్దామంటే,  ఆమె చంచలకి పూని చంచల రూపంలో వుంది. అంటే చంచల ఎజెండా, ఇటు తన ఎజెండా భాగమతి పూర్తి చేసుకుంటుందని మనమనుకోవాలి. 

          పైన B. సెకండాఫ్ : బిగినింగ్ విభాగం కంటిన్యూ లో 4 నుంచి 8 ఆర్డర్ లో మళ్ళీ  ఫస్టాఫ్ లో ప్రారంభించిన సీబీఐ ఎంక్వైరీ, చంచల ఫ్లాష్ బ్యాకు, భాగమతి హార్రర్ ట్రాకులు మూడూ కంటిన్యూ అవుతూంటాయి.  

          అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాట్ పాయింట్ వన్ కాదన్న మాట! అక్కడ బిగినింగ్ ముగిసి ఇంటర్వెల్ తర్వాత మిడిల్ విభాగం ప్రారంభం కావడం లేదన్నమాట. ఇంకా బిగినింగే కొనసాగు
తోందన్న మాట. అంటే స్ట్రక్చర్ తప్పిందన్న మాట. స్ట్రక్చర్ తప్పి మిడిల్ మటాష్ వైపు ప్రయాణిస్తోందన్న మాట స్క్రీన్ ప్లేకి ఆయువు పట్టులాంటి మిడిల్ లేకుండా!

          ఇంటర్వెల్ లోనే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి వుంటే, మూడు ట్రాకులూ అక్కడే కలిసిపోయి, భాగమతి ట్రాకు  ఒక్కటే మిడిల్ లో కథలోకి రావాలి. అప్పుడా ట్రాకు చంచ వర్సెస్ సిబీఐ గా వుండాలి.  కానీ సీబీఐ ఎంక్వైరీ, చంచల ఫ్లాష్ బ్యాకు ట్రాకులు రెండూ విడివిడిగానే వచ్చేశాయి. కాబట్టి అది ప్లాట్ వన్నూ కాదు, ఇప్పుడు సెకండాఫ్ లో ఇది మిడిల్లూ కాదు. 

          కథేమిటో తెలియకుండా ఇంకా ఇలా ఫస్టాఫ్ బిగినింగ్ బిజినెస్సే నడుస్తోంది. ఈ బిజినెస్ చంచల హాస్పిటల్ సీనుతో పూర్తయ్యింది. ఇక్కడ మంత్రి రావడంతో ఫస్టాఫ్ నుంచీ ఈ గంటా 50 నిమిషాలూ జరుగుతున్న బిగినింగ్ బిజినెస్ అసలు దేనికో ఇప్పుడుమనకి అర్ధమై, బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది – ఇక్కడ కథేమిటో అర్ధమై, మంత్రితో చంచల  గోల్ తో మిడిల్ ప్రారంభమయ్యింది!  ఎప్పుడో కనీసం ఇంటర్వెల్ దగ్గర ప్రారంభ మవ్వాల్సిన మిడిల్ మొరాయిస్తూ  మొరాయిస్తూ ఇప్పుడు ప్రారంభమయ్యిందన్నమాట!

          మిడిల్ ఇప్పుడు ప్రారంభమైతే ఇంకేం కథ వుంటుంది, అదెంత సేపు వుంటుంది. మంత్రితో ఫ్లాష్ బ్యాక్ వచ్చి, చంచల చేతిలో శక్తి ఎలా చనిపోయాడో మనకి తెలియ జేశాకే కథ అర్ధమై, చంచల గోల్ తో మిడిల్లో పడింది కథ. ఈ కథ వెంటనే అక్కడే చంచల మంత్రితో తేల్చుకోవడంతో ముగిసి
పోయి, ఎండ్ కొచ్చేసింది. 

          ఈ కథతో భాగమతి కథకి ఏ సంబంధమూ లేదనీ, అదంతా మంత్రిని పట్టుకోవడానికి చంచల ఆడిన నాటకమనీ తేలిపోయింది. మిడిల్, ఎండ్ అంతా చంచల సాదా రొటీన్ పొలిటికల్ థ్రిల్లర్ కథే అయింది ఫ్లాట్ గా.


చిత్రాంగద చిత్రమే!
     ప్లాట్ పాయింట్ వన్ కి రావడానికి ఈ అదుపు తప్పి మిడిల్ స్పేస్ ని దురాక్రమించిన  బిగినింగ్ విభాగపు గంటా యాభై  నిమిషాల సుదీర్ఘ  నసపెట్టే బిజినెస్ లో, 4 సార్లు భాగమతి బంగళాలో భయపెడుతూ కాలక్షేపమే  చేశారు. ఫస్టాఫ్ లో చంచలతో మూడు సార్లు, సెకండా
ఫ్ లో సీబీఐ సంపత్ తో ఒకసారి, బంగళాలో అవే భయపెట్టే సీన్లు రిపీట్ చేశారు. ఇవి ఒక్కోటీ సుమారు ఏడు నిమిషాల చొప్పున,  మొత్తం సినిమాలో అరగంట తినేశాయి. ఏమీ లేని దానికి!

          ఇప్పుడు ‘చిత్రాంగద’  కొద్దాం. కథేమిటంటే,
సైకాలజీ బోధించే అసిస్టెంట్ ఫ్రొఫెసర్ చిత్ర (అంజలి) కాలేజీ అమ్మాయిలతో బాటు హాస్టల్లో వుంటుంది. హాస్టల్ లో దెయ్యం తిరుగుతోందనీ, ఆడ దెయ్యం మగవాడిలా మీద పడి కోరిక తీర్చుకుంటోందనీ అమ్మాయిలు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతూంటారు. దెయ్యం చిత్రే  అని బయటపడుతుంది. తనెందుకు మగపిశాచిలా ప్రవర్తిస్తోందో తెలుసుకోవాలని  నీలకంఠ (జయప్రకాష్)  అనే సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తుంది. హిప్నాటిక్ సెషన్ లో  ఒకావిడ ఎవరో ఒక వ్యక్తిని చెరువులో చంపేస్తున్నట్టు కన్పిస్తోందని చెప్తుంది. హత్య కలలోకి కూడా వస్తోందని చెప్పి, చెరువు  అమెరికాలో వుందని తెలుసుకుని ఫ్రెండ్ సువర్ణ (స్వాతీ దీక్షిత్) తో అక్కడికి బయల్దేరుతుంది.

         
అక్కడ పరిచయమైన పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో వుంటూ చెరువు దగ్గర వుండాల్సిన అరేబియా రెస్టారెంట్  కోసం వెతుకుతూంటుంది. తన ప్రవర్తనకీ, తనకి వస్తున్న కలకీ ప్రాంతంతో వున్న సంబంధం ఏమిటా అని శోధిస్తున్నప్పుడు, ఆమె నమ్మలేని నిజాలు ఆమె గురించే బయటపడతాయి. ఇలా గతజన్మలో తానెవరో తెలిసినప్పుడు బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇప్పుడు మాత్రమే కథేమిటో మనకి అర్ధమవుతుంది. ఎప్పుడు?  సెకండాఫ్ చాలా గడిచిపోయాక. అప్పటివరకూ బిగినింగ్ బిజినెస్ అంతా ఏమిటి? ఫస్టాఫ్ నుంచీ ఈ సెకండాఫ్ సగం వరకూ చిత్ర  తనకేం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నమే. రిపీటయ్యే పారా నార్మల్ అనుభవాలే – ‘భాగమతి’ లో బిగినింగ్ అంతా పైన చెప్పుకున్న రిపీటయ్యే హార్రర్ అనుభవాల్లాగా. ఇలా సేమ్ టు సేమ్ టెంప్లెట్ అన్నమాట.

మిడిల్ మటాష్ – ఎండ్ సస్పెన్స్
      ‘చిత్రాంగద’ లో  వున్నది ఎండ్ సస్పెన్స్ కథనం. సెకండాఫ్ సగం వరకూ ఏం జరుగుతోందో, కథేమిటో అర్ధంగాని  సస్పన్స్ ని సెకండాఫ్ సగంలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఓపెన్ చేసే, అప్పుడు కథ ఇదీ అని తెలియజేశారు. అంతవరకూ కథని మూసి పెట్టారు గనుక – చివర్లో ఓపెన్ చేశారు కనుక,  మిడిల్ మటాష్ అవుతూ ఎండ్ లో ఒపెనయ్యే సస్పెన్స్ అయ్యింది, లేదా ఎండ్ సస్పెన్స్  అయింది. ఇదంతా సహన పరీక్ష కాబట్టి అట్టర్ ఫ్లాపయ్యింది. కిందటి వ్యాసం ‘ఎండ్ సస్పెన్స్ అంటే కథా ప్రారంభం కాదు’ లో దీన్ని వివరించాం. 

          ‘భాగమతి’ లో కూడా ఎండ్ సస్పెన్స్ అవుతూనే మిడిల్ మటాష్ అయింది. ఎండ్ సస్పెన్స్ అని తెలియనివ్వకుండా కవర్ చేస్తూ, మిడిల్ మటాష్ అవకుండా చూడాలంటే, కిందటి వ్యాసంలో చెప్పుకున్నట్టు- ‘ఛేజ్ ఏ క్రూకేడ్ షాడో’ బ్రిటిష్ మూవీ లాండ్ మార్క్ స్కీము ఫాలో అవ్వాల్సిందే. ఇది తప్ప ఇంకో మార్గం లేనేలేదు. 

          వచ్చిన మంత్రితో చంచల ఇదంతా అతడిని రప్పించి చంపడానికే  నటించిన నాటకమని ట్విస్ట్ ఇచ్చాక – ఇక మిడిల్ ప్రారంభం కాకూడదు. ఆ నాటకమే మిడిల్ గా అప్పటికే పూర్తయి వుండాలి. ఇక మినిస్టర్ రాకతో ఉపసంహారమే వుండాలి- ఫినిషింగ్ టచ్ గా, లేదా మాస్టర్ స్ట్రోక్ గా. అప్పుడు మాత్రమే స్ట్రక్చరూ, దాంతో రసపోషణా పుష్కలంగా వున్న క్రియేటివిటీ అన్పించుకుంటుంది. 

          ‘ఛేజ్ ఏ క్రూకేడ్ షాడో’, దీంతో వచ్చిన ఇండియన్ వెర్షన్ లన్నీ బంగళాలో వున్న ఘరానా నేరస్థురాల్ని పట్టుకోవడానికి బృందం ఆ బంగళాలో చేరి సృష్టించే డ్రామాగా వుంటే, ‘భాగమతి’ లో, ఘరానా నేరస్థుణ్ణే  చంచల తనదగ్గరికి  రప్పించుకునే డ్రామా క్రియేట్ చేసింది. ‘ఛేజ్ ఏ క్రూకేడ్ షాడో’ స్కీము కాకతాళీయంగా ఇలా రివర్స్ లో కుదరడం బాగానే వుంది గానీ, అసలా స్కీమే  ఏంటో తెలుసుకుని చేయలేదు. 

          ఇంతకీ ప్రేక్షకుల్ని భయపెట్టింది భాగమతి ఆత్మ కూడా కాదా?  దెయ్యంలా చంచలే భయపెట్టి బురిడీ కొట్టించిందా ప్రేక్షకుల్ని? అవన్నీ ఫాల్స్ హార్రర్ సీన్లేనా? కథకుడి క్రియేటివిటీ ఇంత కలాగాపులగపు  కథ సృష్టిస్తుందా? హార్రర్ అని ఇందుకే అనాలా!

 -సికిందర్




















         








           
         












29, జనవరి 2018, సోమవారం

594 : 'భాగమతి' రివ్యూ - 3


            1. కథని ఎండ్ సస్పెన్స్ అని తెలియకుండా కవర్ చేసే విధానం : ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ (1958)
          2. కథని ఎండ్ సస్పెన్స్ అని తెలుపుతూనే దృష్టి మళ్ళించే విధానం : ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ – (2017)
          3. ఎండ్ సస్పెన్స్ కథ ఎలా వుంటుంది? A  అనే ఒక సంఘటన జరిగిందనుకుందాం.అదెలా జరిగిందో, ఎవరు చేశారో దర్యాప్తు అధికారికి తెలీదు. అతను B, C, D, E, F...ఇలా కొందర్ని అనుమానితులుగా భావించి దర్యాప్తు చేస్తూంటాడు. దర్యాప్తులో ఒకొక్కర్నీ నిందితులు కాదని నిర్ధారించుకుంటూ వస్తూ,  చిట్టచివరికి ఆధారాలతో సహా వాళ్ళల్లో ఒకర్ని పట్టుకుంటాడు. అప్పుడా ఆధారాలన్నీ ఆ నిందితుడికి ఆపాదించేందుకు విశ్లేషణలన్నీ చేసుకొస్తూ - ఆ నిందితుడు A అనే సంఘటనకి ఎందుకోసం, ఎలా పాల్పడిందీ  మొదట్నించీ మూసిన కథంతా చెప్పుకొస్తాడు. నిందితుడు తలవంచుకుంటాడు.

          ఇది ఏ మీడియాకి పనికొస్తుంది? నవలగా ప్రింట్ మీడియాకి పనికొస్తుంది.

          సినిమాకి ఎందుకు పనికి రాదు? సినిమాగా తీస్తే వచ్చే ఇబ్బందేమిటంటే, విజువల్ అప్పీల్ వుండదు. విజువల్ అప్పీల్ కి ఓపెన్ స్టోరీ యాక్షన్ తో వుండాలి. పై మూసిన కథలాగా కాదు. పై ఉదాహరణ ప్రకారం A అనే సంఘటన చూపించి,  B, C, D, E, F...లలో ఎవరు ఆ సంఘటనకి పాల్పడ్డారో చూపించకపోతే, దర్యాప్తు అధికారి ఒకరొకర్నీ ప్రశ్నిస్తూనే ఫస్టాఫ్ తోబాటు – సెకండాఫ్ లో చాలా వరకూ గడపాల్సి వస్తుంది. అంతవరకూ విషయ మేంటో అర్ధంగాక ప్రేక్షకుడి సహనం నశిస్తుంది. కథ ఎంతసేపూ ఆ దర్యాప్తు అధికారికీ, ఆ నిందితులకీ – వాళ్ళ వాళ్ళ మధ్య వుండిపోతుంది. వాళ్ళు వాళ్ళు మంతనాలాడుకుంటూ వుంటే ప్రేక్షకుడి కేం అర్ధంగాదు. థ్రిల్ ఫీల్ కాడు.  అంటే కథ వాళ్ళ మధ్య పాసివ్ గా వుండి పోతోందన్నమాట. కాబట్టి  సినిమా కొచ్చేసి  కథని  దాయకూడదు, కథనాన్ని మాత్రమే దాయాలి. కథ వచ్చేసి ఓపెన్ గా,  యాక్టివ్ గా ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ గా కన్పించి థ్రిల్ చేయాలి. 


       రెండో ఇబ్బంది – చివరికి నిందితుణ్ణి  పట్టుకుని దర్యాప్తు అధికారి ఆ సంఘటన తాలూకు కార్యకారణ సంబంధ విశ్లేషణంతా నిందితుడి కాపాదిస్తూ చెప్పుకొస్తూంటే, బోరు కొడుతుంది. ఎందుకంటే,  అతను చెప్పేవాటిని  ప్రేక్షకుడు మెదడుకి చాలా  పనికల్పించి అర్ధంజేసుకుంటూ, మొదట్నించీ ఏదేది ఎలా ఎందుకు జరిగాయో నిందితుణ్ణి దృష్టిలో పెట్టుకుని తులనాత్మక విశ్లేషణ చేసుకుంటూ కన్విన్స్ అయ్యే కష్టాన్ని, భారాన్నీ  మోయాల్సి వస్తుంది. అ సమయంలో దర్యాప్తు అధికారి ఎన్ని నిజువల్స్ (మాంటేజెస్) వేస్తూ ఎంత హడావిడీ చేసినా,  అవన్నీ అప్రస్తుతమైపోతాయి ప్రేక్షకుడికి. ఇలా  సస్పెన్స్ అంతా చివర్లో ఓపెన్ అయింది కాబట్టి దీన్ని ఎండ్ సస్పెన్స్ కథ అంటున్నారు. ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో మిస్టరీ సబ్ జానర్ కింది కొస్తాయి. 

          4. మరి ఇలాటి కథని సినిమాకి ఎలా మార్చుకోవాలి?
 పైనే చెప్పుకున్నట్టు A  అనే ఒక సంఘటన జరిగిందనుకుందాం. అదెలా జరిగిందో, ఎవరుచేశారో, ఎందుకు చేశారో  ప్రేక్షకుడికి మొత్తం చూపించేస్తారు. B  అనే వాడే  ప్రేక్షకుడికి స్పష్టంగా నిందితుడుగా కన్పిస్తూంటాడు. ఇంకా వేరే అనుమానితులుండరు. C అనే దర్యాప్తు అధికారికి B  తెలియవచ్చు, తెలియకపోవచ్చు, తెలిస్తే డైరెక్టుగా పట్టుకునే ప్రయత్నంతో  కథ నడుపుతాడు, తెలియకపోతే కొంత సమయం తర్వాత తెలుసుకుని, అప్పుడు పట్టుకునే ప్రయత్నంగా కథ నడుపుతాడు. పట్టుకున్నాక శిక్షిస్తాడు.

          ఇది ఏ మీడియాకి పనికొస్తుంది? ప్రింట్, విజువల్ రెండిటికీ పనికొస్తుంది. అయితే ప్రింట్ మీడియా నవలకి అంత బావుండక పోవచ్చు. నవల సినిమాలగా, సినిమా నవల లాగా వుండకూడదు. సినిమా అట్టడుగు స్థాయి సాహిత్య ప్రక్రియ. జనసామాన్యం కోసం దాన్నలాగే తీయాలి.

         సినిమాగా ఇలా తీస్తే కలిగే లాభాలు  – ఈ ఓపెన్ యాక్షన్ స్టోరీ వల్ల విజువల్ అప్పీల్ వుంటుంది. A అనే సంఘటన దగ్గరే అది ఎవరు చేశారో, ఎలా చేశారో, ఎందుకు చేశారో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఇక కథలో సమాచారానికి సంబంధించిన ఏ బ్యాగేజీనీ మోయ నవసరం లేకుండా, పాయింటు మీద దృష్టి పెతాడు. కథ పాత్రలకీ ప్రేక్షకుడికీ ఓపెన్ గా  వుంటుంది. ఓపెన్ గా  వుండనిది కథనమే. అంటే C ఎలా తప్పించుకుంటూ వుంటాడు, B పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తూ వుంటాడు- పరస్పరం సీన్ల వారీగా ఎత్తుగడలతో ప్రేక్షకుడు వూహించని కథనాన్ని సృష్టించుకుంటూ పోతూంటారు. అందువల్ల దీన్ని సీన్ టు సీన్ సస్పెన్స్ అంటారు. అందుకని ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ కింది కొస్తాయి.  
***
       5. పైన 3 లో చెప్పుకున్న ఎండ్ సస్పెన్స్ కథలకి ఎండ్ సస్పన్స్ అని  తెలియకుండా కవర్ చేస్తూ నడపడమెలా?  ప్రింట్ మీడియాకి పనికొచ్చేవని చెప్పుకున్న మిస్టరీ సబ్ జానర్ కథల్ని సినిమాకి మల్చి హాలీవుడ్ కొత్త ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో  A  అనే సంఘటన జరుగుతుంది. ఇది ప్రేక్షకుడికి చూపించరు. అసలు A అనే సంఘటన జరిగిందని ఎక్కడా ప్రస్తావించరు. ఫ్రెష్ గా ప్రారంభం B ని C పరిచయం చేసుకోవడంతో చూపిస్తారు. అక్కడ్నించీ అదే B కి D, E, F, G, H ...ఇలా ఎంతమందైనా పరిచయం కావొచ్చు. వీళ్ళతో B కి విచిత్ర అనుభవాలు ఎదురవుతూంటాయి. దీంతో మొదట పరిచయమైన C  డూప్లికేట్ అనీ,  తన మీద కుట్ర చేయడానికి వచ్చాడనీ మిగిలిన వాళ్ళకి చెప్పడంతో, కథ C  మీదికి మళ్ళుతుంది. దురుద్దేశం పెట్టుకుని విలన్ లా వచ్చినట్టు కనబడుతున్న C కుట్ర రట్టు చేసే క్రమంలో,  అసలు B నే విలన్ అన్న గుట్టు B ద్వారానే రట్టయ్యేలా సంఘటనలు జరుగుతాయి. మొత్తం కథ తిరగబడుతుంది.  అప్పుడు C, D, E, F, G, H ...అందరూ ఒకే బృందమని రివీలవుతుంది. వీళ్ళు B ని రౌండప్ చేసి, ఆనాడు  ఫలానా A  అనే సంఘటన జరగడానికి కారణం నువ్వు, ఇదిగో సాక్ష్యాలూ అని ప్రూవ్ చేసి పట్టుకుంటారు. 

          దీనివల్ల కలిగే లాభాలు – A అనే సంఘటనని దాచి పెట్టారు కాబట్టి,  C, D, E, F, G, H ... వగైరాలు B ని పట్టుకోవడానికి వచ్చిన దర్యాప్తు బృందంగా అస్సలు కన్పించరు. B తో వీళ్ళు సృష్టించి నడిపే డ్రామాని ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తూంటాడు. రొటీన్ A అనే సంఘటనకి B ని పట్టుకోవడానికి వచ్చిన గ్రూపు అని తెలియకపోవడంతో ప్రేక్షకుడు ఫ్రెష్ గా ఫీలవుతాడు. కథ పాసివ్ గా కాక, డ్రామా అని తెలియని డ్రామాతో యాక్టివ్ గా థ్రిల్లింగ్ గా వుంటుంది. దీంతో  ఇలాటి కథలు థ్రిల్లర్ జానర్ లో సినిమాలకి పనికిరాని మిస్టరీ సబ్ జానర్ ఉచ్చులోంచి బయటపడి, సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ గానే రూపం ధరిస్తాయి.

         1958 లో బ్రిటిష్ సినిమా ఇది సాధించి ఎండ్ సస్పన్స్ ని కవర్ చేసి లాండ్ మార్క్ మూవీగా నిలబడింది- అదే ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’

          దీన్ని అనుసరిస్తూ మొట్టమొదట బెంగాలీలో ఉత్తమ్ కుమార్ - షర్మిలా టాగూర్ లతో  ‘శేష్ అంక’ (1963) వచ్చింది. తర్వాత తమిళంలో శివాజీ గణేశన్ – బి. సరోజా దేవిలతో ‘పుథియ పరవై’  (1964), హిందీలో మిథున్ చక్రవర్తి – రాఖీ లతో ‘ధువా’ (1981), మలయాళంలో మమ్ముట్టి - శోభనలతో ‘చరితం’ (1989) వచ్చాయి.


          మిస్టరీ సబ్ జానర్ కి  మూవీ ఫ్రెండ్లీ క్రియేటివిటీ అయిన ఇలాటి కథలూ  స్ట్రక్చర్ లోనే వుంటాయి. పైన చెప్పుకున్న ఉదాహరణలో ఈ క్రియేటివిటీ వచ్చేసి, ప్లాట్ పాయింట్ వన్ గా C మీద అనుమానం, ప్లాట్ పాయింట్ టూగా C కాదు B అని దొరికిపోవడంగా వుంటుంది.  ఒకసారి పై సినిమాలు చూస్తే విజువల్ అప్రోచ్ బాగా అర్ధమవుతుంది. నిజానికి ఇలాటి కథ వేరే ట్రెండీ బ్యాక్ డ్రాప్ లో ఈ వ్యాసకర్త రాసింది ఇద్దరు దర్శకుల చేతులు మారుతూ గత రెండేళ్లుగా చక్కర్లు కొడుతోంది.
***
     6. పైన 3 లో చెప్పుకున్న  ఎండ్ సస్పెన్స్ కథని ఎండ్ సస్పన్సే అని తెలుపుతూనే దృష్టి మళ్ళించే విధానం – A  అనే సంఘటనని ప్రేక్షకుడికి చూపించేస్తారు.  అదెలా జరిగిందో, ఎవరు చేశారో  ప్రేక్షకుడితో పాటు దర్యాప్తు అధికారికీ  తెలీదు. అతను B, C, D, E, F...ఇలా కొందర్ని అనుమానితులుగా భావించి దర్యాప్తు చేస్తూంటాడు. మధ్యలో ఎక్కడో, ఆ  జరిగిన A  అనే సంఘటనలో మృతి చెందిన వ్యక్తి దర్యాప్తు అధికారికి తెలిసిన వాడుగా రివీల్ అవుతుంది. ఆ మృతి చెందిన వ్యక్తి ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో చాలా షాకింగ్ విషయాలుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ని మధిస్తూంటే  దానితో B, C, D, E, F...లలో అందరూ, లేదా ఒకరితో వున్న కనెక్షన్ బయటపడుతుంది. దీంతో దర్యాప్తు అధికారి ఆ నిందితుణ్ణి లేదా నిందితుల్ని పట్టుకుంటాడు. 

          దీంతో లాభాలు : అనుమానితుల్ని చూపిస్తూ  నిందితుణ్ణి పట్టుకునే బోరుకొట్టే రొటీన్ కి, ఫ్లాట్ గా వుండే కథనానికీ, ఫ్లాష్ బ్యాక్ వల్ల ప్రేక్షకుడి దృష్టి మళ్ళించి, కథకి చలనమూ డెప్త్ తీసుకురావొచ్చు. ఇలా ఇది ఎండ్ సస్పెన్స్ తో మిస్టరీ సబ్ జానర్ లోంచి బయటపడి, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫ్రెండ్లీ సబ్ జానర్ లోకొచ్చేస్తుంది. 

           ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ఇలాంటిదే. మర్డర్ మిస్టరీల
ఫార్ములాని బ్రేక్ చేసి, మూస చట్రంలోంచి మర్డర్ మిస్టరీ జానర్ ని ఎప్పుడో 1930 లలోనే బయట పడేసిన రచయిత్రి అగథా  క్రిస్టీ. ఆమె రాసిన నవలే  ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ మూవీ.

          ఇవీ మిస్టరీ,  సస్పన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ల సంగతులు. ఇలాస్పష్టత తెచ్చుకున్నాక, ఇప్పుడు ‘భాగమతి’ ఎందులో ఇమిడిందో, ఇమడకపోతే ఎందుకు ఇమడలేదో,  రేపు ముగింపు వ్యాసంలో చూద్దాం.


సికిందర్