రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, అక్టోబర్ 2017, శనివారం

527 : రివ్యూ!




రచన- దర్శకత్వం :  సి. సత్యం
తారాగణం : భరత్,  సృష్టి, నాగినీడు, తనికెళ్ల భరణి, రఘుబాబు, తులసి, ప్రగతి, ధనరాజ్సత్య, ‘తాగుబోతు' రమేష్ తదితరులు
సంగీతం: శేఖర్చంద్ర,  కెమెరా: సాయి శ్రీరామ్
బ్యానర్
: ఎస్‌.వి.కె. సినిమా
నిర్మాత
: వంశీకృష్ణ శ్రీనివాస్
విడుదల : అక్టోబర్ 6, 2017

***
      కొత్త దర్శకులు తమకి  తెలిసిన సినిమా రకాలు రెండే అన్నట్టు  వారం వారం విఫలమై   వెళ్ళిపోతున్న ప్రస్తుత కాలంలో, ఇంకో కొత్త దర్శకుడు ఆ రెండిట్లో ఒక రకాన్ని తనుకూడా ఫాలో అయిపోతూ విఫలమయ్యాడు. రోమ కామెడీ అనే ప్రేమడ్రామా, దెయ్యం కామెడీ అనే హార్రర్ ట్రామా. ఈ రెండు రకాలని పంచుకుని  రెండు బ్యాచులుగా తయారై  థియేటర్ల దగ్గర ప్రేక్షకులు కనపడకుండా కర్ఫ్యూ విధిస్తున్నారు.  షోలు క్యాన్సిల్ చేయించుకుంటున్నారు. రేయ్ నిన్నే- అని పిల్చినా కూడా తిరిగి చూడని ప్రేక్షకులని గంపగుత్తగా  పెంచుకుంటు న్నారు. ఒకనాడు శాటిలైట్ హక్కుల బూమ్ లో చిన్నా చితకా చిల్లర  సినిమాలన్నీ శాటిలైట్ హక్కుల కోసమే తీశారు తప్ప ప్రేక్షకుల కోసం కాదు. ఇప్పుడు శాటిలైట్ హక్కులుకూడా లేకపోయాక, ఇప్పుడైనా ప్రేక్షకులకోసం తీయకుండా ఓ సినిమాకి దర్శకుడు అన్పించుకోవడమే టార్గెట్ అన్నట్టు అవే ఫ్లాపయ్యే రోమ కామెడీ లు, అవే దెయ్యం కామెడీలు తీసుకుంటూ అభివృద్ధి అనే మాటకి రెండు దశాబ్దాల దూరంలో గడిపేస్తున్నారు. 

        రివాజుగా ప్రస్తుత దర్శకుడు కూడా అదే 2000 - 2005 మధ్య యూత్ సినిమాల పేరుతో వెల్లువెత్తిన ‘లైటర్ వీన్ లవ్ స్టోరీస్’ అపజయాల బూమ్ లోనే   వుండిపోయి వీణ వాయించాడు. నేటి నెట్ యుగపు యూత్ కి కావాల్సింది గిటార్ సినిమాలు. అందుకే ఈ వీణ సినిమాల ముఖం చూడకుండా  ‘గిటార్ లవ్స్’ రుచి చూపిస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులుగా మారిపోతున్నారు పొలోమని యూత్. కాస్త ఆ టాలీవుడ్ అనే హోదా నుంచి దిగివచ్చి, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి చూసి,  ఇక నైనా  ఈ దుకాణాలు కట్టేస్తారా ?


తెలిసిన రకాలు రెండే. ఇంకాస్త విస్తరిస్తే పెద్ద స్టార్ల యాక్షన్ సినిమాలు. ఈ రెండు దశా బ్దాలుగా ఇవే  చూస్తూ పెరిగిన కొత్త దర్శకులు, రచయితలూ చాలా దురదృష్ట వంతులు. ఈ దురదృష్ట వంతుల్ని ఈ రెండు దశాబ్దాల ఈ రెండు మూడు రకాల సినిమాలే తయారు చేశాయి. కిందటి తరం దర్శకులు రచయితలూ చాలా అదృష్టవంతులు. వాళ్ళ కాలంలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, భక్తీ, పౌరాణిక, జానపద, క్రైం, గూఢచార, కౌబాయ్, విప్లవ, చారిత్రక, దేశభక్తీ  వగైరా వగైరా  లేనిదంటూ లేని రకాల సినిమాలూ చూస్తూ పెరిగారు – ఆల్ రౌండర్ దర్శకులుగా, రచయితలుగా  అయ్యారు. విభిన్న సినిమాలని ప్రేక్షకులకి పంచారు.

‘ఓయ్ నిన్నే’ ఏనాటిదో చిన్నప్పట్నుంచి కలిసి పెరిగే కయ్యాల బావామరదళ్ళ అదే పాత పల్లెటూరి కథ. తమ మధ్య వున్నది ప్రేమే అని తెలీక ఆడే  అదే పాత డ్రామా. ఈ డ్రామా కూడా ఎలా నడపాలో తెలియక సెకండాఫ్ సాంతం అర్ధరహితంగా మార్చేసిన వైనం. ఎందుకంటే, ఇలాంటి ప్రేమ డ్రామాల్లో  పాత్రల మధ్య సమస్యలకి 2000 – 2005 బాపతు యూత్ సినిమాల్లో కూడా పరిష్కారాలు గందరగోళమే. కాబట్టి అదే గందరగోళం వారసత్వంగా వచ్చిందిప్పుడు. 


          హీరో రైతు అవాలనుకుంటాడు. హెడ్ మాస్టారైన తండ్రి  ఇంకా బాగుపడే పనేదైనా  చూసుకోమంటాడు. దీంతో ఇద్దరికీ  విభేదం. హీరోకి  చిన్నతనం నుంచీ కలిసి పెరిగిన మరదలుగా హీరోయిన్. ఇద్దరి మధ్య ఎప్పుడూ కయ్యాలు. ఆవారా హీరోకి ఇంట్లో లభించని ఆదరణ హీరోయిన్ ఇంట్లో లభిస్తుంది. ఇటు  హీరో తండ్రి హీరోయిన్ ని  కన్నకూతురిలా ఆదరిస్తాడు. హీరోయిన్ పెళ్లి చేయాలనుకుంటాడు హీరోయిన్ తండ్రి. వేరే పెళ్లి కొడుకు వస్తాడు. ఇప్పుడు హీరో హీరోయిన్లకి ఆందోళన. హీరో మీద ప్రేమ వుందని హీరోయిన్ ఎలా చెప్పాలి? హీరోయిన్ మీద ప్రేమే వుందని  హీరో కూడా ఎలా చెప్పాలి? ఇదీ సమస్య. ఇదీ ఇక ముందు కథ. ఎన్ని సార్లు అదేపనిగా చూడాలి ఈ అరిగిపోయిన పాతచింతకాయ కథ. 

          కొత్త దర్శకుల రోమప్రేమ డ్రామాలు రెండు రకాలు :  ప్రేమల్ని వెల్లడించుకోలేక హీరోహీరోయిన్లు హీనంగా బతకడం, అపార్ధాలతో విడిపోయి హీనంగా ప్రేక్షకుల్ని బాధించడం ఈ మధ్యే  తమిళ టైటిల్ తో తెలుగు రోమడ్రామా  ‘కాదలి’ లో  ఇద్దరు హీరోలలో ఎవరికి  ప్రేమ చెప్పాలో తెలియక,  ముగ్గురు ప్రేక్షకులున్న థియేటర్లో కనికరం లేకుండా హింసించింది హీరోయిన్ సెకండాఫ్ అంతా.  సేమ్ సీన్ ఇప్పుడు, కాకపోతే హీరో హీరోయిన్లు ఇద్దరూ టార్చర్ పెట్టేస్తారు.

సినిమాలు తొలి స్వర్ణయుగం,  మలి స్వర్ణయుగం,  వ్యాపారయుగం కూడా ముగిసి పోయి,  ఫైనల్ గా దివాలాయుగం నడుస్తోంది మహర్దశగా. 

          షరా మామూలుగా కొత్త హీరో హీరోయిన్లు. హీరో ఇంకా  శిక్షణపొందాలి. హీరోయిన్ కి ఇలాటి సినిమాల బారి నుంచి కొంత  రక్షణ కల్పిస్తే  కాస్త ఎదిగే అవకాశాలున్నాయి. కమెడియన్ల  కామెడీకి  అర్ధంలేదు. నాగినీడు, తనికెళ్ళ, తులసిలవి పాత మూస పాత్రలు. కానీ ఆ కాలంలో ఇలాటి పాత్రలైనా వాస్తవిక దృక్పథంతో వుండేవి. కొడుకు రైతు అవుతానంటే ఉపాధ్యాయుడైన నాగినీడుకి ఏమిటి అభ్యంతరం – ఇప్పుడు ఉద్యోగాలు వదులుకుని వ్యవసాయాల్లో అద్భుతాలు చేస్తున్న ఇంజనీర్లు వుండగా?  వ్యవసాయ రంగంలో ఇలాటి వారు వస్తే భవిష్యత్తులో ఆత్మహత్యలు చేసుకునే రైతులు వుంటారా? అన్ని కాలాలకి కలిపి ఒకే పాత్రచిత్రణలు సరిపెట్టేయడం ఎందుకంటే,  2000 - 2005  మధ్య తమ టీనేజిలో చూసి మోహం పెచుకున్న యూత్ సినిమాల జ్ఞానం ఇదే కాబట్టి.

          ఈ వృధా ప్రయాసకి శేఖర్ చంద్ర సంగీతం,  కోనసీమ అందాలు చూపించిన  సాయి శ్రీరాం ప్రయత్నం వృధాపోయాయి. నాల్గు వారాలు తమ కళానైపుణ్యాల్ని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలంటే అసలంటూ సినిమాలో విషయముండాలిగా?  

          పెద్ద విడుదలలు లేక ఖాళీగా వున్న ఈ వారంలో విడుదలైన పాత దర్శకుడి  ‘లావణ్యా విత్ లవ్ బాయ్స్’, మరో కొత్త దర్శకుడి ‘నేను కిడ్నాప్ అయ్యాను’  కూడా  సొమ్ము చేసుకోలేకపోయాయి షరా మామూలుగా.


-సికిందర్
https://www.cinemabazaar.in