రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 24, 2015

ఆనాటి సినిమా!

హాస్యభూషణం హాజర్ హై!!

విలన్ :  హీరోని ఏడ్పించేవాడు
కామిక్ విలన్ : ప్రేక్షకుల్ని నవ్వించేవాడు
హీరోయిక్ విలన్ : సాంతం పబ్లిక్ ని ప్రేమించేవాడు
ఒకసారి పబ్లిక్ తో ప్రేమలో పడ్డాక, ఇక వాంటెడ్ డెడ్ ఆర్ ఆలైవ్ పోస్టర్ని పరపరా చింపేసుకుని, పబ్లిక్ కి సరెండరై పోయినట్టే విలన్ అనేవాడు!!


    త్రికా రచనకి నిజాలు ముఖ్యం. సినిమాకి నిజాలుగా భ్రమింపజేయడం అతి ముఖ్యం. భ్రమింపజేయడమే నటుల మెయిన్ బిజినెస్. భ్రమా బేరం లేక భుక్తి లేదు.
కడారు నాగభూషణం (1921 – 1995) అనే  భ్రమల బేహారి వాస్తవికతని రక్తికట్టించే విలనిజం నుంచీ సహజ కథానాయకుడిగా కూడా సమాజానికి దొరికిపోయేముందు, నాటక సమాజానికి గొప్ప సెటైరిస్టుగా, అధిక్షేపణ  లాక్షిణికుడుగా చిక్కాడు. చిక్కాక సినిమా నిర్మాతలకి చిక్కడు-దొరకడు  అయిపోయాడు – ‘నెలలో మొదటి వారం నో షూటింగ్స్ ప్లీజ్...నేనెక్కడికో వెళ్ళిపోయి నా ‘రక్తకన్నీరు’ నాటకం వేసుకుంటా...పది లక్షలి సిస్తామన్నా కెమెరా ముందుకు రానంటే రానంతే, దట్సాల్!’ 



               న్నెన్ని ‘రక్త కన్నీళ్లు’ అని! ఆలిండియా లెవెల్లో అక్షరాలా ఐదు వేల నాలుగు వందల ముప్ఫై రెండు ప్రదర్శనలు! మన హైదరాబాదీ ‘అద్రక్ కె పంజే’ ( అల్లం కొమ్ములు) ఫేమ్ బాబ్బన్ ఖాన్ పదివేల ప్రదర్శనలతో గిన్నీస్ బుక్ రికార్డు కెక్కిన తర్వాత, తనే ఆ స్థాయిలో కాకపోయినా తెలుగులో ప్రదర్శనల రికార్డు నెలకొల్పిన రంగ స్థల కళాకారుడు. పాతికేళ్ళ పాటూ వందలాది రంగస్థల కళాకారులకి ఉపాధీ, రెండు దశాబ్దాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి అధ్యక్ష బాధ్యతలూ, ఇంకా ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఉపాధ్యక్ష పదవిలో కొన్నాళ్ళూ, రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడెమీ సలహాదారుగా సేవలూ, వామపక్ష భావజాలం కారణంగా ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయాలపై,  సామాజిక పరిణామాలపై, కొత్త కొత్తగా వ్యంగ్య బాణాల సంధింపూలూ! అసలు  ‘రక్తకన్నీరు’ నాటకమేంటో  మనం నిక్కర్లేసుకున్న ఆ రోజుల్లో బుద్ధికి పట్టు బడలేదు గానీ, ఓ సన్నివేశం జన్మకి గుర్తుండి పోతుంది- కుష్టు రోగంతో బాధపడుతున్న ప్రధాన పాత్రధారి నాగభూషణం చుట్టూ ముసిరే ఈగల ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ మాయాజం అప్పుడే ఎంత థ్రిల్!

    ‘నాటకాల రాయుడు’ విషయాని కొస్తే,  ఐది నాగభూషణం కామెడీతనానికి పరాకాష్ఠ! రవి ఆర్ట్ థియేటర్స్ అని సినిమా నిర్మాణ సంస్థ స్థాపించి ‘ఒకే కుటుంబం’, ‘ప్రజానాయకుడు’ అనే రెండు సినిమాల్ని నిర్మించినా, దిడ్డి శ్రీనివాసరావు అనే మరో నిర్మాతకి చెందిన హరిహరా ఫిలిమ్స్ బ్యానర్లో ‘నాటకాల రాయుడు’తో సోలో హీరోగా వచ్చాడు. ఏ. సంజీవి దీని దర్శకుడు. నాటకాల మీద చచ్చే మోజు పెంచుకుని ఇంట్లోంచి ఉడాయించే ఓ ఔత్సాహిక నటోత్తముడి అనుభవాలే ఈ సినిమా ఇతివృత్తం.

  ‘నాటకాల రాయుడు’ విషయాని కొస్తే,  ఐది నాగభూషణం కామెడీతనానికి పరాకాష్ఠ! రవి ఆర్ట్ థియేటర్స్ అని సినిమా నిర్మాణ సంస్థ స్థాపించి ‘ఒకే కుటుంబం’, ‘ప్రజానాయకుడు’ అనే రెండు సినిమాల్ని నిర్మించినా, దిడ్డి శ్రీనివాసరావు అనే మరో నిర్మాతకి చెందిన హరిహరా ఫిలిమ్స్ బ్యానర్లో ‘నాటకాల రాయుడు’తో సోలో హీరోగా వచ్చాడు. ఏ. సంజీవి దీని దర్శకుడు. నాటకాల మీద చచ్చే మోజు పెంచుకుని ఇంట్లోంచి ఉడాయించే ఓ ఔత్సాహిక నటోత్తముడి అనుభవాలే ఈ సినిమా ఇతివృత్తం.



          బుచ్చి బాబు ( నాగభూషణం) కి నాగయ్య- హేమలత లాంటి తల్లి దండ్రులు, అనిత లాంటి చెల్లెలు, సత్యనారాయణ, సీత లాంటి అన్న వదినెలతో అన్యోన్య కుటుంబం. ఎక్కడో చిన్నపాటి గుమాస్తా ఉద్యోగం చేస్తాడు కానీ నాటకాలే ఊపిరి. మహానటుడు అయిపోవాలన్నదే ఏకైక లక్ష్యం. దీంతో తండ్రితో  చివాట్లు. నాటకాలంటూ ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రిళ్లు గోడ దూకి వచ్చి, చెల్లెలు అన్నం పెడితే తినేసి, ఆమె పాడితే హాయిగా కళ్ళు మూసుకుని గుర్రు పెట్టడం హాబీ. 

        చెల్లెలి పెళ్ళికి కట్నం తెస్తానంటాడు పెద్ద హీరోలా. తీరా ఆఫీసులో తన నాటకాల దురద ఆపుకోలేక, ‘మయసభ’ సీను విరగదీసి నటించి పారేసి, ఆ న్యూసెన్సు కి ఉన్న ఆ పాటి ఉద్యోగమూ ఊడబీకించుకుని -ఉత్త చేతుల్తో జీరోలా ఇంటికి రావడం! 

          తండ్రితో వాగ్యుద్ధం జరిగి, నాటకాలే తనకు నాగరికమని నగరం బాట పట్టేస్తాడు. అక్కడ ఓ నాటకాల కంపెనీ పద్మనాభం సైధవుడిలా అడ్డు తగిలేసరికీ, అసలిక్కడ ఎంట్రీ సంపాదించాలంటే ఇంకెక్కడో ప్రముఖ రంగస్థల నటీమణి గీతాదేవి ( కాంచన) ని మచ్చిక చేసుకోవాలని, వెళ్ళేసి ఆమె ఇంట్లో పని వాడుగా చేరిపోతాడు. తనని బాగా ఎంటర్ టెయిన్ చేస్తున్న ఈ గమ్మత్తయిన శాల్తీలో  ఏకంగా ఆమె ఒక అజ్ఞాత కళాకారుణ్ణే చూసి, బాగా ఎంకరేజి చేస్తుంది. అయితే అప్పటికే ఆ కంపెనీలో పాపులర్ స్టేజి నటుడు ప్రేమ్ కుమార్ ( ప్రభాకర రెడ్డి) అనే అతను హీరోగా  ప్రొసీడ్ అవుతున్నాడు. గీతాదేవికి లైనేస్తూ కూడా ప్రోసీడవుతున్నాడు. ఇప్పుడు వీడెవడో బుచ్చి బాబు గాడు తనకి పొటెన్షియల్ డేంజర్ గా అన్పించేసరికి ఏకడం మొదలెడతాడు.

          దీంతో చాలా తిప్ప లొచ్చేస్తాయి బుచ్చిబాబుకి. ప్రేమ్ కుమార్ చేతిలో సఫా అయ్యే దుస్థితి కూడా దాపురిస్తుంది. ఇంకో వైపు గీతాదేవి తనకి క్లోజ్ గా మూవ్ అవడమేమిటో , ఆ కవ్వింపు లేమిటో ఎటూ అర్ధం కాని స్థితి. ఒకమ్మాయి వుందంటే, ఆమెతో ప్రేమ కలాపాలకి ట్రయల్ వేసుకోవచ్చని కూడా తెలీని అమాయక ప్రాణి అతను. ఇలా ఈ ప్రమాద ప్రమోదాల సయ్యాటలో చిక్కుకుని గిలగిల్లాడు తూంటాడు. పెట్టుకున్నలక్ష్యం కాస్తా గల్లంతై పోతుంది.

                   ఆద్యంతం నాగభూషణం చాలా యాక్టివ్ గా, చలాకీగా రక్తి కట్టించే ఈ నవ్వుల ప్రపంచంలో తీరని విషాదం కూడా వుంది. నాగభూషణం – అతడి కుటుంబపు పరిస్థితుల అనులోమ- విలోమ సంబంధం, రేఖా గణితం ఈ సినిమా కథా కథనాలకి బలమైన వెన్నెముక గా నిలుస్తాయి. ఎలాగంటే అతనెక్కడో మహా నగరంలో పైపైకి ఎదుగుతూ వుంటే, అటు వూళ్ళో కుటుంబం నానాటికీ దిగజారి పోతూ వుంటుంది. తను చాలా చాలా గొప్ప వాడైపోయేసరికి, ఆ కుటుంబంలో ఓ మరణం సంభవించి, ఇంకో జననం తో ముక్కలై, భిక్షాటన చేసే దౌర్భాగ్యం. ఇప్పటి సినిమాల్లో కొరవడిన కరకు వాస్తవ జీవిత మంతా ఇందులో జడలు విప్పుకుంటుంది...

      తల్లి ఆశీర్వాద బలంతోనే  తానిలా గొప్ప వాణ్ణయి పోయాననుకుని మురిసిపోతాడు. ఆ తల్లి ఎప్పుడో గతించిన విషయం కూడా తెలీదు! ఆ కుటుంబంలో పెళ్ళి శుభకార్యానికి  డబ్బెప్పుడూ నిలవదు. మొదటిసారి డబ్బు దొంగల పాలవగానే, అంతవరకూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన ఆ కుటుంబం ఒక్కసారి భగ్గుమనేస్తుంది. కలలో కూడా ఊహించని కటువైన మాటలు పేలతాయి వాళ్ళ మధ్య. ఆ పరస్పర దూషణలు, దెప్పి పొడుపులు తనకి కూడా తగిలి కుమిలికుమిలి పోతుందా పెళ్లి కున్నఅమ్మాయి. దర్శకుడు సంజీవి ఈ దృశ్యాన్ని నాగయ్య, హేమలత, సత్యనారాయణ, అనిత లతో అత్యంత బలంగా సృష్టించాడు. సినిమాకి ఇదే హైలైట్.

          ఈ సినిమాలో వినోద విషాద ఘట్టాలన్నిటిలో గొల్లపూడి మారుతీ రావు కలం బలం కట్టి పడేస్తుంది మరి నోరెత్త నీయకుండా.  నాటకాల అనుభవముంటే ఆ సినిమా రచనే వేరు. ఇక సినిమా ప్రారంభమే ప్రభాకర రెడ్డి, కాంచనల మీద అతి సుదీర్ఘంగా  ఐదు నిమిషాలా నలభై సెకన్ల పాటూ సాగే పద్య గానముంటుంది. పద్యాలు వడ్డాది రాస్తే, పాటలు ఆత్రేయ రాశారు. జికే వెంకటేష్ సంగీతంలో ‘నీలాల కన్నుల్లో మెల్ల మెల్లగా’ అనే సిస్టర్ సాంగ్, ‘వేళ చూడ వెన్నెలాయె’ అనే కాంచన మీద సూపర్ హిట్ బ్యూటీఫుల్ సాంగ్ రెండూ అలరిస్తాయి. కమల్ ఘోష్ తెలుపు- నలుపు కెమెరా పనితనం ఈ సినిమాలో ఓ కవితా గానమే.

        నాటక దృశ్యాల్లో నాటకం చూసే ప్రేక్షకులు ఊహించలేని లొకేషన్ మార్పులు, సీక్వెన్సులూ పంటి కింద రాళ్ళలా తగుల్తాయి. స్టేజి  మీద నాటక ప్రదర్శనలో ఇవి అసాధ్యం. సినిమాయే  కదా- దీనికి వుండే సినిమాటిక్ లిబర్టీ అనే లైసెన్సుతో నాటక కళదుంప తెంచి నట్టుంది. నాటక రంగ నిపుణుడైన నాగభూషణం వీటిని అనుమతించడం ఆశ్చర్యమే. ఏమైనా భావి తరాలకి నాగభూషణం అందించిన ఓ మంచి వినోద కాలక్షేప మనొచ్చు ఈ సినిమాని!


***

డైలాగ్ డిష్ 

నాగభూషణం
*  దేశంలో పూలన్నీ మహా నాయకులకూ మహా నటులకూ దండల కిందే  సరిపోతున్నాయి, ఇక ముత్తయిదువులకెందుకుంటాయ్.
*  ఒరే కంచుకీ, పరమ దుర్మార్గుడును , సకల ఉద్యోగి దండునకు శత్రువూ అయిన ఆ మేనేజారథముడెక్కడ?
*  ఈ రోజుల్లో నటీమణుల రికమెండేషను లేకపోతే నాటక కంపెనీల్లో మేనేజర్లు వేషాలివ్వరు, అందుకని అంతఃపురం లోంచి నరుక్కు పోదామని ఇటోచ్చా.
*  మహా నటుడు అంతః పురంలో ఉండగలడు, అవసరమైతే అంట్లూ తోమగలడు.
*  మీ అమ్మగారి తద్దినమంటే నటించా సార్, లేకపోతే నటించే వాణ్ణి కాను సార్!
కాంచన
*  జీవితంలో తిండీ నిద్రా తప్ప ఇంకేమీ లేవా బుచ్చిబాబూ!
*  నాటకంలో ప్రేమని నటించే ఆడది కూడా ప్రేమని మనసులో పవిత్రంగా దాచుకుంటుంది.
*  ఇవ్వాళ్ళ కార్లలో తిరిగే చాలా మంది నటుల్ని చాలా మంది ఈర్ష్యగా చూస్తారు గానీ, అప్పటివాళ్ళ దీక్షా తపస్సుల వెనుక ఎన్ని బాధ లున్నాయో, ఎన్ని గాథలున్నాయో అర్ధం చేసుకుంటే ఆ చూపుని వాళ్ళు మళ్ళించు కుంటారు.

కొన్ని ఫన్నీ సీన్స్

          * నాగభూషణం ఆఫీసు మేనేజరిచ్చిన పెద్ద కవరు పోస్ట్ చేయడాని కెళ్తే అది పోస్ట్ బాక్సులో పట్టదు. దాంతో ఆ కవర్ని రెండు ముక్కలు చేసి, పోస్ట్ బాక్సులో కుక్కుతాడు- మొదటి భాగం, రెండో భాగం అంటూ!
          *నాగభూషణం టాలెంట్ కి టెస్టు పెడుతుంది నాటక కంపెనీ. నాగభూషణం రాకెన్ రోల్ డాన్స్ తో విరగ్గొట్టేస్తాడు. తోటి కళాకారులతన్ని బంతాట ఆడేసుకుంటారు. కింద పడిపోతాడు నాగభూషణం. ప్రభాకర రెడ్డి, పద్మనాభం ఇద్దరూ సంతోషిస్తారు, కాంచన చిన్న బుచ్చుకుంటుంది.
          * నాగభూషణం అలా నడుచుకుంటూ వస్తూంటే, ఓ వ్యక్తి ఎదురవుతాడు. నాగభూషణం ఆగిపోయి ‘ఆఁ-!’  అంటాడు. ఆ వ్యక్తి కూడా నోరు తెర్చు కుని ఆఁ-!’ అంటాడు. వెంటనే నాగభూషణం అతడి నాలుక మీద పోస్టల్ స్టాంపు పెట్టి తీస్తాడు. ఆ తడితో కవరు మీద అతికించుకుని వెళ్ళిపోతాడు.  
          * టైటిల్స్ లో కర్రసాము, కత్తి యుద్ధాలు ‘రాఘవులు అండ్ పార్టీ’ అని వేయడం నవ్వు తెప్పిస్తుంది!



—సికిందర్ 

(జనవరి 2010 –‘సాక్షి’)