రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఏప్రిల్ 2017, బుధవారం








     ‘‘హాలీవుడ్లో సిడ్ఫీల్డ్‌  అని రచయిత ఉన్నాడు. స్క్రీన్ప్లే ఎలా రాయాలనే విషయంలో ఆయన సబ్కా బాప్‌. స్క్రీన్ప్లే మీద బుక్స్రాశాడు. హాలీవుడ్అంతా ఆయన్నే ఫాలో అవుతోంది. నేనూ బుక్చదివా. అలాంటాయన రెండు సినిమాలకు కథలు రాస్తే, రెండూ ఫ్లాపే. థియరీ వేరు, ప్రాక్టికల్వేరు. సినిమా హిట్టూఫ్లాపులు మన చేతుల్లో ఉండవు’’ – ‘రోగ్’  విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ లో పూరీ జగన్నాథ్ స్టేట్ మెంట్. 

         కలం కోతికి ఇలా అన్పించడం లేదు. దాని ఇన్ఫర్మేషన్ వేరే వుంది : సిడ్ ఫీల్డ్ హాలీవుడ్ లో సినిమాలకి కథలూ స్క్రీన్ ప్లేలూ రాశారు నిజమే, కానీ అది ‘స్క్రీన్ ప్లే గురు’ గా మారడానికి చాలా ముందు. 1967 లో డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ గా ప్రవేశించి ‘స్ప్రీ’ అనే ఒక డాక్యుమెంటరీకి రాశారు. తర్వాత హలీవుడ్ లో స్ట్రగుల్ చేస్తూ ఏడు స్క్రీన్ ప్లేలకి సహ రచయితగా పనిచేశారు. అక్కడ విసిగి ‘సినీమొబైల్’ అనే కంపెనీలో స్క్రిప్టులు చదివే ఉద్యోగంలో కుదిరారు. అక్కడ రెండు వేల స్క్రిప్టులు చదివి, వాటిలో స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని పట్టుకున్నారు. ఇక తన గమ్యం ఏమిటో అర్ధమైంది. దానివైపు సాగిపోయారు. స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని కొత్తగా నిర్వచిస్తూ మూడు స్క్రీన్ ప్లే పుస్తకాలూ రాశారు. అవి బ్రహ్మాండాన్ని బద్దలు చేశాయి. 1979 నుంచీ స్క్రీన్ ప్లే ట్యూటర్ గా మారిపోయారు. ఇంకా పుస్తకాలూ రాశారు. 29 భాషల్లో ఈ పుస్తకాలు అనువాదమయ్యాయి. ‘స్క్రీన్ ప్లే వర్క్ బుక్’ అన్న పుస్తకం ఒక్కటే 40 సార్లు పునర్ముద్రితమైంది. ఈ పుస్తకం 400 విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకమైంది. సిడ్ ఫీల్డ్ కి హాలీవుడ్ సినిమాలకి కథలు రాసేంత తీరికా ఆసక్తీ లేవు. ప్రపంచవ్యాప్తంగా వర్క్ షాపులు నిర్వహిస్తూ తన స్టూడెంట్స్ కి  శిక్షణ ఇవ్వడంతోనే సరిపోతోంది. ఆయన స్కూల్ నుంచి వచ్చిన శిష్యులు ఎవరంటే- ఆస్కార్ అవార్డ్ విజేత  దర్శకుడు ఆల్ఫాన్సో క్వారాన్ (గ్రావిటీ),  గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి నామినేట్  అయిన  రచయిత/ దర్శకుడు జడ్ అపటోవ్ (బ్రైడ్స్ మెయిడ్స్, గర్ల్స్),  మూడు సార్లు ఆస్కార్ కి నామినేట్ అయిన రచయిత/ నిర్మాత ఫ్రాంక్ డరబొంట్ (షషాంక్ రిడెంప్షన్, ది గ్రీన్ మైల్), ఆస్కార్ కి నామినేట్ అయిన రచయిత్రి  అన్నా హేమిల్టన్ ఫెలాన్ ( మాస్క్, గోరిల్లాస్, మిస్ట్),  రెండు సార్లు ఆస్కార్  కి నామినేట్ అయిన దర్శకుడు/రచయిత జాన్ సింగిల్టన్ ( బాయ్స్ అండ్ ది  హుడ్, పోయెటిక్ జస్టిస్), రచయిత్రి రాండీ మేయన్ సింగర్ (మిసెస్ డౌట్ ఫైర్), రచయిత్రి లారా ఎస్క్యూవేల్ (లైక్ వాటర్ ఫర్ చాకొలేట్), రచయిత కెవిన్ విలియంసన్  (వాంపైర్, స్క్రీమ్  -1,2,3,4) తదితరులెందరో  వున్నారు. ఇంతే కాదు, సిడ్ ఫీల్డ్ ముంబాయి వచ్చి అమీర్ ఖాన్ నటించిన ‘రంగ్ దే బసంతీ’,  షారుఖ్ ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’  అనే రెండు విజయవంతమైన బాలీవుడ్  సినిమాలకి పనిచేసి వెళ్లారు కూడా. 

       విషయం ఇలా వుండగా, ‘హాలీవుడ్లో సిడ్ఫీల్డ్‌  అని రచయిత ఉన్నాడు’ - అని పూరీ తేలిక చేసి మాట్లాడడం అన్యాయం. ‘అలాంటాయన రెండు సినిమాలకు కథలు రాస్తే, రెండూ ఫ్లాపే. థియరీ వేరు, ప్రాక్టికల్వేరు’ అనడం ఇంకా అన్యాయం. సిడ్ ఫీల్డ్  రచయితగా స్ట్రగుల్ చేస్తున్న కాలంలో అదృష్టవశాత్తూ తన గమ్యం ఏమిటో తెలిసిపోయాక, తను కనుగొన్న స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని పట్టుకుని అటువైపుగా సాగిపోయారు. విశ్వవిద్యాలయ్యాల్లో పాఠ్యాంశమయ్యారు. ఆస్కార్ స్థాయి రచయితల్ని, దర్శకులని అందించిన అంతర్జాతీయ గురువు అయ్యారు. 70 ఏళ్ల  వయసులో బాలీవుడ్ వచ్చి రెండు హిట్ సినిమాలకి రాసిపోయారు. థియరీ వేరు- ప్రాక్టికల్ వేరు అని  అలవాటుగా అనేస్తూంటారు. అసలు థియరీ తెలుసుకోకుండా చేస్తున్న ప్రాక్టికల్స్ తోనే వరస ఫ్లాపులు. పాత మూసగా, అవే ఫార్ములా నమ్మకాలతో రాసుకుంటున్న స్క్రీన్ ప్లేలకి దీటుగా స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని నవీకరించి సులభంగా అర్ధమయ్యేట్టు చేసిన  ఒక ప్రఖ్యాత పండితుడి సేవల్ని గుర్తించకుండా,  చులకన చేసి మాటాడ్డం సీనియర్ దర్శకుడుగా తనకి ఎంతవరకు సబబో పూరీ విజ్ఞతకే వదిలేద్దాం.

-సికిందర్