రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, అక్టోబర్ 2016, శుక్రవారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : చందు ఎం.
తారాగ‌ణం: చైత‌న్య అక్కినేని, శృతీహాస‌న్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అవంతికా వందనపు, పృథ్వీ, బ్రహ్మాజీ, నర్రా శీను, శ్రీనివాస‌రెడ్డి, అరవింద్ కృష్ణ, చైతన్య కృష్ణ, ప్ర‌వీణ్‌, వైవా హర్ష, నోయెల్‌, అక్కినేని నాగార్జున‌, ద‌గ్గుబాటి వెంక‌టేష్‌ త‌దిత‌రులు
కథ :
అల్ఫోన్స్ పుథ‌రిన్‌, సంగీతం : గోపీసుంద‌ర్‌, రాజేష్ మురుగ‌న్‌, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
బ్యానర్ : సితార
ఎంట‌ర్ టైన్మెంట్స్‌, నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
విడుదల : 7 అక్టోబర్, 2016

***
      నాగచైతన్యకి ఓ హిట్ కావాలి. లేకపోతే పెళ్లి ముందు ఏమీ బాగోదు. దీన్ని ఎప్పట్నించో ప్లాన్ చేస్తూ వూరిస్తూ, రకరకాల వూహాహగానాలని భరిస్తూ, చివరికి అనుకున్న మలయాళ రీమేక్ ‘ప్రేమమ్’ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. గత దసరాకి తండ్రి నాగార్జున వచ్చి ‘సోగ్గాడే చిన్నినాయనా’ తో హోరెత్తించినట్టు ఈ దసరాకి తను వచ్చాడు. వచ్చింది హోరెత్తించడానికేనా,  లేకపోతే  బోరెత్తించడానికా ఈ కింద తెలుసుకుందాం.

కథ
    మొదటి కథ : తాడేపల్లి గూడెంలో పదో తరగతి చదివే విక్రం వాత్సల్య అలియాస్ విక్రం ప్రేమ కవితలు రాస్తూ సుమ (అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) ని ప్రేమిస్తాడు. ఆమె వెంట పడే ఇంకెంత మందో ప్రేమికుల్ని అధిగమించి చివరికెలాగో చిన్న పిల్ల సింధు (అవంతికా వందనపు) కిచ్చి ప్రేమ లేఖ పంపుతాడు. రెస్పాన్స్ గా సుమ అతడింటికి వస్తానని అంటుంది. ఆనంద పడతాడు విక్రం. సుమ విక్రం ఇంటికి  తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకు వచ్చి పరిచయం చేస్తుంది. ఖంగు తిన్న విక్రం ఆమె మోసం చేసిందని తిట్టుకుని, మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. 

        రెండో కథ : ఐదేళ్ళ తర్వాత విక్రం ఇంజనీరింగ్ చదువుతూంటాడు. ఎదిగిన యువకుడి పౌరుషం, దౌర్జన్యం వగైరాలతో కాలేజీలో గ్యాంగ్ ని మెయింటెయిన్ చేస్తూ బాస్ లా చెలామణీ అవుతూంటాడు. ఆ కాలేజీకి గెస్ట్ లెక్చరర్ గా సితార (శృతీ హాసన్) వస్తుంది. మరాఠీ అయిన ఈమెని చూడగానే ప్రేమలో పడతాడు విక్రం. ఇతడితో బాటు ఓ లెక్చరర్ (నర్రా శీను) కూడా ప్రేమలో పడతాడు. ఇతడికి తోటి లెక్చరర్ (బ్రహ్మాజీ) ఐడియా లిస్తూంటాడు. విక్రం ఫీలింగ్స్ ని సితార గుర్తిస్తుంది. ఇంతలో సెలవులు రావడంతో సొంతవూరు పుణేకి బయల్దేరుతుంది. ఆ బస్సు యాక్సిడెంట్ అయి జ్ఞాపకశక్తి కోల్పోతుంది. వెళ్లి చూసిన విక్రం ఆమె తనని గుర్తించకపోవడంతో బాధపడి ఆమెని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో  ఆమె కజిన్ (అరవింద్ కృష్ణ)  తో ఆమె పెళ్లి నిశ్చయమైందని  కబురు వస్తుంది. 

        మూడో కథ :  పదేళ్ళ తర్వాత విక్రం ఒక రెస్టారెంట్ నడుపుతూంటాడు. ముప్పయి దాటుతున్న వయసులో మెచ్యూరిటీతో వుంటాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయి (మడోన్నా సెబాస్టియన్) పరిచయమవుతుంది. ఇప్పుడీమెతో ప్రేమలో పడ్డ విక్రం కథ ఏ మలుపులు తిరిగిందన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
    మలయాళీ కథ కావడంతో వారం వారం  వెక్కిరించి  వెళ్ళిపోతున్న మన ఇడ్లీ కథలా లేదు. మనవాళ్ళందరూ కొన్నాళ్ళు కేరళలో జీవించి వస్తే తెలుగులో ఇలాంటి డిఫరెంట్ కథలు స్వయంగా తయారు చేసుకోవడంలో ప్రతిభాశాలురు కాగలరు. ఇది మూడు దశల హీరో ప్రేమ ప్రయాణం. ‘పెళ్లి చూపులు’ లాగా సెమీ రియాలిస్టిక్ కథలా సాగే ఈ కథలో మళ్ళీ మలుపులూ ముగింపూ వచ్చేసి రొటీన్ ఫార్ములా ప్రకారం వుండడమే లోపం. ఈ మలుపులూ ముగింపూ వున్నంత కృత్రిమత్వంతో పోటీ పడుతూ మళ్ళీ భావోద్వేగాలు కూడా ఒక దశనుంచి ఇంకో దశలోకి ప్రభావవంతంగా బదీలీ కాకపోకాడం ఇంకో లోపం. ఈ విషయంలో ఒరిజినల్ నే తుచా తప్పకుండా ఫాలో అయ్యరేతప్ప సరిదిద్దుకోలేదు. సరిదిద్దితే ఏమవుతుందో నన్న భయం కావచ్చు. ఏమైనా మూస ప్రేమ సినిమాలే కుప్ప తెప్పలుగా వచ్చిపడుతున్న మార్కెట్ లోకి,  కాస్త స్వచ్ఛ భారత్ పనిని  చేపట్టి వాటిని ఊడ్చేసే వూపుతో తెలుగులో ఓ ఫ్రెష్ కథ వచ్చినందుకు ఆనందించక తప్పదు.

ఎవరెలా చేశారు
      ఎక్కడ్నించో ఓ కథ పట్టుకొచ్చి రీమేక్ చేస్తే తప్ప నాగచైతన్య కి ఓ సక్సెస్ దక్కలేదు. దీన్ని బట్టి ఒక యువ స్టార్ ని నిలబెట్టడానికి తెలుగులో ఎంత సృజనాత్మక దారిద్ర్యం వుందో తెలిసిపోతోంది. ఈ అవకశాన్ని చైతన్య కష్టపడి సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాటిదే కథ, పాత్ర,  తెలుగులో ఎవరైనా ఒరిజినల్ గా చేసుకుని వస్తే స్వీకరించే వాడా అన్నదీ ప్రశ్నార్ధకమే. ఇంకో భాషలో ప్రూవ్ అయితే తప్ప కొత్తదనం అక్కర్లేదనుకునే మైండ్ సెట్ స్టార్లనుంచి కూడా పోవాలి. నాగచైతన్య ఈ మూడు పాత్రల్ని ఏ పాత్రకా పాత్ర ఎదుగుదలని దృష్టిలో పెట్టుకుని సహజ నటనతో పట్టాలు తప్పకుండా చూసుకున్నాడు. పదహారేళ్ళ కుర్రాడి పాత్ర, రఫ్ గా తిరిగే యువకుడి పాత్ర, మళ్ళీ డీసెంట్ గా ప్రవర్తించే ముప్పయ్యో పడిలో పడ్డ పాత్ర. అమ్మాయిలతో వియోగాలన్నీ కూడా నిగ్రహంతో పోషించాడు. అయితే ఆ బాధ- బ్యాక్ డ్రాప్ తర్వాతి దశల్లోకి బదిలీ అయి వుంటే ఇంకా బలంగా వుండేది పాత్ర. హీరో గతం తెలుస్తున్నప్పుడు (సర్కిల్ ఆఫ్ బీయింగ్) ఆ గతం తాలూకు బాధ ప్రస్తుత జీవితంలో ప్రతిఫలించినప్పుడే ఎఫెక్టివ్ గా వుంటుంది పాత్ర చిత్రణ.

        ఇక హీరోయిన్లు ముగ్గురిలో శృతీ హాసన్ కే ఎక్కువ భాగం కథ వుంది. లెక్చరర్ పాత్రని హూందాగా పోషించుకొచ్చింది. మళ్ళీ చివర్లో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో  సెంటిమెంట్స్ ని ఎలివేట్ చేసినట్టయ్యింది. మిగతా ఇద్దరు  హీరోయిన్ల పాత్రలకి ఇంత ఎమోషనల్ టచ్ లేకపోవడంతో అంతంతమాత్రంగా కన్పిస్తారు. 

        అతిధి పాత్రకి సరైన నిర్వచనం ఇప్పుడు కుదిరింది. అదీ వెంకటేష్ తో. ఆ అయిదు నిమిషాలూ కన్పించిపోయే సన్నివేశంలో ఒక సెటైర్, ఒక చరుపు, ఒక చమత్కారం, ఒక ముద్రవేసి వెళ్ళడం ఎప్పటికీ గుర్తుండి పోయే అతిధి పాత్రాభినయం. 

        అక్కినేని నాగార్జున ముగింపులో వచ్చేసి- ఇంట్లో ముద్దు చేయాల్సిన కొడుకుని ఉప్పొంగిపోతూ విశాలమైన వెండితెర మీద బహిరంగంగా చేసి - మరోసారి వియ్ ఆర్ ఫ్యామిలీ అని అనవసరంగా చాటారు. ఇది ప్రేక్షకులకి ఎప్పుడో తెలిసిందే. 

        ఇతర పాత్రల్లో ప్రతి ఒక్కరూ శృతిమించకుండా నటించారు, కొందరు నవ్వించారు. మూడో కథకి శ్రీనివాస రెడ్డి కామెడీ ప్రధాన ఆకర్షణ.
        సంగీతం, ఛాయాగ్రహణం, లొకేషన్స్, ప్రొడక్షన్ విలువలూ అన్నీ బావున్నాయి.

చివరికేమిటి 
       దర్శకుడు చందూ ఎం. మలయాళ ‘ప్రేమమ్’ ని అదే పేరుతో రీమేక్ చేసి చెడగొట్టలేదు. ఐతే గురుదత్ తీసిన ‘ప్యాసా’ లో మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ తరహా కథనానికీ తను చేసిన కథనానికీ తేడా వుంది. తను చేసిన దానికి ఎమోషన్లు  ఒక కాలావధి లోంచి ఇంకో కాలావధి లోకి క్యారీ కాలేదు. ఒకటి ముగిసిపోయిన ప్రేమ దశ- దాని ప్రస్తావన గానీ ఛాయలు గానీ తర్వాతి దశలో కనిపించనక్కర్లేదనుకోకుండా,  పాత్ర దాన్ని ఫీలవుతున్నట్టు పాత్ర చిత్రణ చేసి వుంటే కథ ఇంకా బలంగా వుండేది. అదే గురుదత్ హీరో పాత్ర ఎక్కడికక్కడ బాధాకరమైన అనుభావాలని మెలోడ్రామా లేకుండా దర్శకుడు కట్ చేస్తున్నా, ఆ బాధని మనమింకా ఫీలవుతూ వుండేలా హీరో పాత్ర అప్రతిహతంగా దాన్ని మోస్తూనే వుంటుంది. 

        ఇక మలుపులూ ముగింపూ మళ్ళీ మూస ఫార్ములాయే. రీమేక్ ని అనడంలేదు, ఒరిజినల్ దర్శకుడే వీటికీ విరుగుడు కనిపెట్టివుంటే ఇప్పుడు తెలుగులో ఇంకో ఎడ్యుకేషన్ లా వుండేది. ఫస్టాఫ్ లో మొదటి కథ, రెండో కథ సగమూ బలమైన వీక్షణానుభవాన్ని ఇవ్వకపోవడానికి కారణాలివే. సెకండాఫ్ లో శృతీ హాసన్ తో కొనసాగే కథ తప్ప మళ్ళీ మూడో కథ మామూలే. అయితే పరమ పాత మూస ప్రేమ సినిమాల్ని ఈ రోజుల్లో కూడా ఎంతో ఔదార్యంతో భరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఈ వారం ‘ప్రేమమ్’ ని ప్రీమియం ఎంటర్ టైనర్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు.


-సికిందర్
http://www.cinemabazaar.in