రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఏప్రిల్ 2023, శనివారం

1321 : మూవీ నోట్స్

                సినిమా కథైనా మూడు ప్రధాన మలుపుల మీదే (ప్లాట్ పాయింట్ వన్, టూ, త్రీ) ఆధారపడుతుందన్న విషయం తెలిసిందే. సమస్య ఏర్పాటుతో మొదటి ప్రధాన మలుపు, విశ్రాంతి ఘట్టంతో రెండో ప్రధాన మలుపు, సమస్యకి ఇచ్చే పరిష్కారంతో మూడో ప్రధాన మలుపు, ఇంతే- ఇంతకంటే సినిమా కథంటే ఇంకేమీ లేదు తలబద్దలు కొట్టుకోవడానికి. ఈ మాత్రం కూడా చేసుకోక పోతేనే వస్తుంది ఫ్లాప్. కథలో ఈ ప్రధాన మలుపులు లేకపోయినా, లేదా అవి బలహీనంగా వున్నా ఆ కథ మూలన బడుతుంది. దాదాపు అన్ని సినిమాల్లో ఈ ప్రధాన మలుపులు బలంగానే వుంటాయి. వాటి మధ్య వాటి తాలూకు వుండాల్సిన కథనమే పస లేక, లేదా ఏజెంట్ లోలాగా కథని బట్టి ప్రధాన మలుపులు నిర్దేశించే దిశా గమనం లేక (ప్రధాన మలుపుల్ని గైడ్ పోస్టులని కూడా అన్నారు మరి) సినిమాలు ఫ్లాపవుతూంటాయి. కొన్ని సినిమాల్లో మూడో ప్రధాన మలుపు బలహీనంగా వుండి దాంతో క్లయిమాక్స్ తేలిపోతూంటుంది. మూడో ప్రధాన మలుపుతో క్లయిమాక్స్ సరీగ్గా రావడం లేదంటే దాని కారణం మొదటి ప్రధాన మలుపులో వుంటుందనీ - వెళ్ళి అక్కడ చక్కగా రిపేరు చేసుకోండయ్యా - అనీ  ఏనాడో 50-60 ఏళ్ళ క్రితం హాలీవుడ్ దర్శకుడు బిల్లీ వైల్డర్ చరిత్రలో నిలిచిపోయే సులువు చెప్పనే చెప్పాడు. అయినా మన తెలుగుకి ఈయనెవరో హాలీవుడ్డాయన చెప్పేదేంటీ, మన విద్య మనకుందని ఒక మిధ్యని సృష్టిస్తేనే అది శాకుంతలం అయి, షాకివ్వడానికి ఎప్పుడెప్పుడాని ఉవ్వీళ్ళూరుతూంటుంది  రిలీజుకి.

        త వ్యాసంలో శకుంతల సినిమా మూడు వెర్షన్లలో (1943,1966,2023) మొదటి ప్రధాన మలుపులు ఏఏ తీరున వున్నాయో పోల్చి చూశాం. ఏ వెర్షన్లో ఎంత బలంగా వుందో తెలుసుకున్నాం. మొదటి రెండు వెర్షన్ల కంటే (1943 హిందీ,1966 తెలుగు) 2023 తెలుగు వెర్షన్ ఎంత డొల్లగా వుందో చూశాం. ఈ డొల్ల తనమే ఇప్పుడు మూడో ప్రధాన మలుపుని పట్టి పల్లార్చింది. క్షత్రియురాలిగా పుట్టిన శకుంతల తాపస కన్యగా పెరిగింది. మొదటి ప్రధాన మలుపులో తాపస కన్య స్వభావంతోనే దుర్వాసుడి శాపంతో సమస్యలో పడింది. ఆ సమస్యకి పరిష్కారం కోసం మాత్రం మూడో ప్రధాన మలుపులో తన జన్మవృత్తాంతం తెలిసీ కూడా, ఇక తాడో పేడో తేల్చుకునే క్షత్రియ స్వభావంతో తిరగబడ లేదు. మొదటి ప్రధాన మలుపులో దుర్వాసుడంతటి వాడి శాపాన్ని కథకుడే బలంగా ఫీల్ కాలేదని మనం గత వ్యాసంలో తెలుసుకున్నప్పుడు, అక్కడ్నుంచీ కథనేం బలంగా ఫీలై నడప గలుగుతాడని కథకుడు.

1943 - ఏ శాతారాం స్టోరీ

ముందుగా రెండో ప్రధాన మలుపు చూద్దాం : 1943 శాంతారాం హిందీ శకుంతల లో శకుంతలని అత్తారింటికి సాగనంపడానికి ముస్తాబు చేస్తూంటారు. ఆయనకి నువ్వు గుర్తుండకపోతే ఉంగరం చూపించడం మర్చిపోకేం అని జాగ్రత్త చెప్తారు చెలికత్తెలు. కథలో ఈ ప్లాట్ డివైస్ గా ఉపయోగ పడుతున్న ఉంగరం కథేమిటంటే, శకుంతలని పెళ్ళాడేక దుష్యంతుడు ఆమెకి తొడిగిన ఉంగరమది. తర్వాత దుర్వాసుడు శకుంతలకి శాపం పెట్టి వెళ్ళిపోతూంటే చెలికత్తెలు కాళ్ళా వేళ్ళా పడతారు. పిట్టంత కేసుకి రాహుల్ గాంధీకి చట్టసభ, గృహ శోభ రెండూ ఊడిపోయేలా తీర్పిచ్చినట్టు తను పెట్టిన శాపం మరీ ఎక్కువైపోయిందని గ్రహించిన దుర్వాసుడు- శాపాన్ని వెనక్కి తీసుకోలేననీ, ఒక మార్గం చెప్తాడు. అదేమిటంటే, దుష్యంతుడిచ్చిన ఉంగరాన్ని చూపిస్తే అతడికి జ్ఞాపకం తిరిగి వస్తుందని. ఇదే ఇప్పుడు చెలికత్తెలు శకుంతలకి గుర్తు చేస్తున్నారు. 
        
ఇలా చెప్పించడం ముందేదో అనర్ధం జరగబోతోందని కథనంలో డైనమిక్స్ లేదా చైతన్యం కోసమే. ఒక పాటతో చాలా మంది (కణ్వుడు, కణ్వుడి ఇద్దరు శిష్యులు, శకుంతల పెంపుడు తల్లి గౌతమి, శకుంతల చెలికత్తెలిద్దరు, ఇతర ఆశ్రమ వాసులూ) తోడురాగా పయనం కడుతోంటే, కణ్వుడు ప్రకృతిని పిలుస్తాడు ఆశీర్వదించమని. ఒక్కసారిగా గాలి వీస్తుంది. పక్షులన్నీ అరుచుకుంటూ వచ్చేస్తాయి.
        
కణ్వుడంటాడు, ఆశ్రమపు మొక్కా మానూ అందరికీ... ఏ నీరు మీరివ్వకుండా చుక్క కూడా నోట్లో వేసుకునేది కాదో, ఏ పళ్ళూ పూలూ మీరివ్వకుండా పూజ గదిని అలంకరించేది కాదో-  ఆ మీ ముద్దుల శకుంతల ఈ రోజు పతి దగ్గరికి వెళ్తోంది. మీరంతా వీడ్కోలు పలకండి, ఆశీర్వదించండీ...’ అని. ఇది విని జింకలు కూడా వచ్చేస్తాయి.
        
మొక్కలతో, చెలికత్తెలతో శకుంతల ఆత్మీయ సంభాషణ తర్వాత కదులుతూంటే, కొంగు పట్టుకుని జింక లాగుతుంది. శకుంతల దాన్ని ఓదారుస్తుంది. ఇక అందర్నీ ఆలింగనం చేసుకుంటూ, ఎవరూ దుఖపడొద్దని ధైర్యం చెప్తుంది శకుంతల. ఆమె కంట్లో కూడా నీళ్ళు తిరుగుతాయి. ఈ కన్నీళ్లతో క్లోజప్ నీటి అలలతో డిజాల్వ్ అవుతుంది. ఏమిటా అని చూస్తే, నది నీరుతో సీను మారుతుంది (ట్రాన్సిషన్).
        
నదిలో పడవెక్కి ప్రయాణం కడుతుంది పెంపుడు తల్లితో, ఇద్దరు శిష్యులతో. పడవలో బక్క మొగుడు -బండ పెళ్ళాం కామెడీ చూసి బాధంతా మర్చిపోతుంది శకుంతల. పడవ సాగుతూంటే చేయి జారవిడిచి కూర్చున్న శకుంతల వేలి ఉంగరం జారి నీట్లో పడిపోతుంది. ఇది చూసుకోదు. ఆ ఉంగరాన్ని చేప మింగేస్తుంది. బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీకి పగలబడి నవ్వేస్తున్న శకుంతల క్లోజప్ హోమంతో డిజాల్వ్ అవుతుంది తర్వాతి సీనుకి (రెండో ట్రాన్సిషన్).
        
ఈ మొత్తం శకుంతలని సాగనంపే సీను రెండు పాటలతో కరుణ రసంతో నిండి వుండి ఒక మూడ్ లోకి తీసికెళ్తుంది. రెండు విషయాలు బలంగా హత్తుకుంటాయి : పక్షులు అరుచుకుంటూ రావడం, జింక కొంగు లాగడం రెండూ కరుణ రసానికి పరాకాష్టగా వుంటాయి. అల్టిమేట్ క్రియేషన్. డైనమిక్స్ (ద్వంద్వాల పోషణ) విషయానికొస్తే ఆనందంగా బయల్దేరుతున్న వేళ చెలికత్తెలు ఉంగరం గురించి చెప్పి విషాదాన్ని కల్పించడం, భారంగా బయల్దేరిన శకుంతలకి బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీతో ఆనందం కల్గడం వంటివి వున్నాయి.
        
ఇక ప్లాట్ డివైస్ అయిన ఉంగరం పోగొట్టుకునే సన్నివేశం... బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీకి నవ్వుతున్న శకుంతల చేయి పక్కకి జారవిడిస్తే వేలి ఉంగరం నదిలో పడిపోతుంది క్లోజప్ షాట్ లో రిజిస్టరవుతూ. ఉంగరం వదులుగా వుండి జారిపడి పోయినట్టు స్పష్టంగా చూపించాడు. అంత వదులుగా వుంటే ఇంకెప్పుడో ఇంకెక్కడో పడిపోయే వుండాలి. కాబట్టి కావాలని పడేసినట్టున్న ఈ షాట్ క్రియేషన్ దెబ్బతింది థ్రిల్ లేకుండా. ఇదే 1966 తెలుగు శకుంతల లో అద్భుతంగా వుంది. ఇప్పుడలా జారిపోయిన ఉంగరాన్ని నదిలో చేప మింగేస్తుంది.
        
అంటే ప్రేక్షకులకి తెలిసి, శకుంతలకి తెలియని విషయంతో సస్పెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు శకుంతల కేం జరుగుతుందన్న సస్పెన్స్. ఈ సస్పెన్స్ ఇక్కడ క్రియేటవక పోతే సీనుకి అర్ధం లేదు. సీన్లు వుండేవే పాత్ర గురించి కొత్త విషయం తెలియడానికి లేదా, కథని ముందుకు నడిపించడానికి. ఇక్కడ ఉంగరం పడిపోవడంతో ఈ సీను కథని ముందుకి నడిపిస్తోంది. సంఘటన లేకుండా సీనుంటే అది చీకేసిన మామిడి టెంకతో సరి సమానంగా వుంటుంది. 2023 వెర్షన్ లో ఇదే చూస్తాం.
        
ఇక ట్రాన్సిషన్స్- అంటే ఎడిటింగ్ ని కూడా సీనుని ఆసక్తికరంగా మార్చడానికి ఉపయోగించడం. ఇది కూడా కథనంలో భాగమే. ఇలా కూడా కథనం చేయాలి. మొదటి ట్రాన్సిషన్ ఆమె కన్నీటిని నీటి అలలు కమ్మేయడం- ఇదేమిటా అని చూస్తే ఆ డిజాల్వ్ తో నీటి అలలు నదిగా ఓపెనై సీను మారడంగా చూస్తాం. అంటే ప్రేక్షకులు లేజీగా సినిమా చూసేలా చేయకూడదు మంచి మేకరనేవాడు- అకస్మాత్తుగా ఇదేంట్రా అని లేచి కూర్చుని పరికించేట్టు చేసేదే నిజమైన మేకింగ్. ఇక చివర్లో ఆమె పగలబడి నవ్వుతున్న క్లోజప్ హోమం తో డిజాల్వ్ అయ్యే రెండో ట్రాన్సిషన్ సైతం తర్వాతి సీనుకి ప్రారంభం. ఆమె ఎంతనవ్వుతోందో అంత దుఖం ఎదర పొంచి వున్నట్టు సంకేతం.
    
ఇలా 1943 హిందీ వెర్షన్ శకుంతల లో రెండో ప్రధానమలుపు శకుంతలని చిక్కుల్లో పడేసే ఆందోళనకర సంఘటనతో, బోలెడు నాటకీయతతో బలంగా వుంది.
        
అన్ని వెర్షన్లలో గర్భవతైన శకుంతల అత్తారింటికి వెళ్ళే కథే వుంది. శకుంతల నాటకాన్ని ఒక జాతక కథ నుంచి తీసుకుని రాశాడు కాళిదాసు. బౌద్ధమతంలోని జాతక కథల్లోని  కట్టహరి అనే కథలో, వారణాసి రాజు వన కన్యని మోహించిన వెంటనే గర్భవతవుతుంది. అప్పుడామెకి ఉంగరమిచ్చి, కూతురుపుడితే ఇది పెట్టి పోషించుకో, కొడుకు పుడితే ఈ ఉంగరంతో వాణ్ని తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు (ఆడపిల్ల పట్ల ఫ్యూడలిజం మర్యాద). కొడుకే పుడతాడు. వాణ్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళకుండా తనే పోషిస్తూంటుంది (ఆమె ఆత్మాభిమానం). కానీ ఆ కొడుకు బోధిసత్వుడు తండ్రి ఎవరని అడిగేసరికి తీసికెళ్ళక తప్పలేదు. అప్పుడా ఉంగరాన్నీ, కొడుకునీ చూసిన రాజు కాదనలేక పోతాడు. కానీ ఈ వ్యవహారం తన ప్రతిష్ట పోగొట్టేలా వుందని నువ్వెవరో నాకు తెలీదు పొమ్మంటాడు.
        
అప్పుడామె, నిజం నిరూపించడానికి నా దగ్గర ఇంకో సాక్ష్యం లేదు. కొడుకుని పైకి విసురుతాను. వాడు గాలిలో ఆగిపోతే నీ కొడుకు, కిందపడి చచ్చిపోతే నీ కొడుకు కాదు అని కాళ్ళు పట్టుకుని పైకి విసురుతుంది. బోధిసత్వుడు గాలిలో బాసింపట్టు వేసుక్కూర్చుని, నేనే నీ కొడుకుని  అంటాడు. ఇక రాజు వాడ్ని స్వీకరించి తన వారసుడిగా, ఆమెని రాణిగా ప్రకటిస్తాడు. నిజం నేలమీద నోళ్ళ మధ్య బతకదని, దాని స్థానం పైనెక్కడో అతీతంగా వుంటుందనీ నీతి. అందుకే నేలమీద కుంటిదైన నిజం కాళ్ళు పట్టుకుని పైకి విసిరింది. ఆ నిజం గాలిలో రాజసంగా బాసింపట్టు వేసుక్కూర్చుని అబద్ధాల నోళ్ళు మూయించి పారేసిందన్న మాట.
        
దీన్ని కాళిదాసు హిందూ పురాణ కథగా మార్చేసరికి మహిమలు చోటు చేసుకున్నాయి. కాళిదాసుకి ఇంకో వెర్షన్ కూడా వుందని సమాచారముంది. అందులో శకుంతల పుట్టిన కొడుకుతోనే దుష్యంతుడి దగ్గరికి వెళ్తుంది- పై జాతక కథలో లాగా.

1966 తెలుగు- వెలుగు

ఇప్పుడు ఎన్టీఆర్- బి. సరోజాదేవిల శకుంతల రెండో ప్రధాన మలుపు చూస్తే- అద్భుతంగా ముస్తాబై శకుంతల బయల్దేరుతుంది. కణ్వ మహర్షి, అతడి ఇద్దరు శిష్యులు, శకుంతల పెంపుడు తల్లి గౌతమి, శకుంతల చెలికత్తెలిద్దరు, ఆశ్రమ వాసులూ వెంట వస్తూంటే, ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మా, అత్తవారింటికి పోయిరావమ్మా పాట నేపథ్యంలో సన్నివేశాలుంటాయి. కొంగు లాగిన జింకతో, కణ్వుడితో, చెలికత్తెలతో. ఇది ముగిసి కణ్వుడి శిష్యులతో, పెంపుడు తల్లితో పడవెక్కిన తర్వాత- తెడ్డు వేస్తూ పడవ వాడు - శెంగాయి కట్టిన సిన్నదీ చారడేసి కళ్ళు ఉన్నదీ అని శకుంతల నుద్దేశించి పాడ్డం మొదలెడతాడు. (శకుంతల నుద్దేశించిన ఈ పాటలో- ఆపలేని బల్ తాపముతోటీ అంగలారుస్తూ వున్నదీ అని రసికత్వమేంటో?).  
        
పాటని ఆనందిస్తూ శకుంతల నదిలో చేయిపెట్టి తానూ తెడ్డు వేస్తున్నట్టు మైమరపులో వుంటుంది. పాట సాంతం నీట్లో చేయి ఆడిస్తూనే పారవశ్యంతో వుంటుంది. నీట్లో చేపలు వచ్చిపోతూంటాయి. పాట ముగింపులో వేలి కున్న ఉంగరం జారిపోతుంది. నీట్లో మునుగుతున్న ఉంగరాన్ని ఒక చేప నోటితో అందుకుంటుంది. చేయి నీట్లో అలాగే వుంచి పారవశ్యంతో  కళ్ళు మూసుకునే వుంటుంది శకుంతల.
        
ఈ రెండో ప్రధాన మలుపులో నాటకీయత నది మీదే వుంది. అంతకి ముందు సాగనంపుతున్నప్పుడు వుండదు. ముఖ్యంగా ఆమె వీడ్కోలులో ప్రకృతిని భాగం చేయలేదు. చేసి వుంటే కరుణరస పూరిత మనోహర దృశ్యాలుండేవి. మూడు సార్లు కణ్వుడితోనే బాధ పంచుకోవడం వుంటుంది. జింక కొంగు లాగే దృశ్యం పాట మధ్యలో వేయడం వల్ల పాటే డామినేట్ చేసింది. పైగా పాటలో కణ్వుడు జింక పుట్టుపూర్వోత్తరాలు చెప్పడం వల్ల కూడా నాటకీయతకి నష్టం జరిగింది. ఇవన్నీ జరిగి, ఇక శకుంతల జింకతో సంభాషించేటప్పటికి ఆ దృశ్యం ప్రాధాన్యమే తగ్గిపోయింది. పైగా గుండెల్లోంచి పలికే పలుకులతో, వాటి తాలూకు భావోద్వేగాలతో కాకుండా, పాట వేసి దృశ్యాలు చూపించడం వల్ల కరుణ రసమే కాదు, అసలు ఏ రసానికీ స్థానం లేకుండా పోయింది.
        
నాటకీయత అంతా సంఘటన జరిగే పడవ ప్రయాణంతోనే వుంది. ఇదంతా లాజికల్ గా వుంది. పడవ వాడి పాటకి నీట్లో చేయిపెట్టి ఆడిస్తుంది (ఇక్కడొక పొరపాటు- ఆమె నీట్లో కుడి చేయి ఆడిస్తుంది. కానీ ఉంగరం వున్నది ఎడమ చేతికి. ఆ ఉంగరం కుడి చేతి నుంచే జారిపోయినట్టు చూపించారు. షూటింగ్ సౌలభ్యం కోసం తప్పలేదేమో. కెమెరాని అవతలి ఒడ్డు వైపు పెట్టి ప్రయాణాన్ని చూపించలేరుగా. బయల్దేరిన ఇవతలి ఒడ్డు పాయింటాఫ్ వ్యూతోనే వుండాలి).
        
ఇప్పుడామెకి ఇందాకటి బాధంతా తొలగిపోయింది- ఇప్పుడు తను పుట్టింటిది కాదు- మెట్టినింటిది. ఇప్పుడు పుట్టింటి ఎమోషనల్ బ్యాగేజీనంతా మోసుకుంటూ వెళ్ళడం సరికాదు. కాబట్టి మ్లానమైన మనసంతా నదినీటి ప్రవాహంలో కడిగేసుకుంది. ఇదొకటి, దీన్తర్వాత- సంఘటన సీక్వెన్స్- పాట మొదట్నుంచీ నీట్లో చేయి ఆడించడం వల్ల ముందు జరగబోయేది మొదటి సారి సినిమా చూసే వాళ్ళ వూహకి అందదు. There is no terror in the bang, only in the anticipation of it... అని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అన్నాడని చాలా సార్లు చెప్పుకున్నాం (అన్నట్టు ఇవ్వాళ  ఏప్రెల్ 29 ఆయన వర్ధంతి). శాంతారాం శకుంతల లో చేయినీ, సడెన్ గా ఉంగరం పడిపోవడాన్నీ ఒకేసారి చూపించడం వల్ల బ్యాంగ్ లేకుండా పోయింది. హిచ్ కాక్ చెప్పేది బ్యాంగ్ కి ముందు దాని తాలూకు కథనం చేసుకురావాలనే.
          
కాబట్టి ఇప్పుడు తెలుగు శకుంతల పాట చివర్లో బ్యాంగ్ కి సంబంధించిన కథనంగా నీట్లో చేయి ఆడిస్తూ వుంది. మధ్య మధ్యలో నీట్లో చేపలు కూడా కన్పిస్తున్నాయి. నీట్లో చేయి, చేపలు- ఈ సీక్వెన్సులో విజువల్ కథనం సాగుతూ- సహజంగానే నీట్లో చేయి అంత సేపూ తడవడం వల్ల ఉంగరం వదులై జారిపోయింది ( మనకి కూడా చిన్నప్పుడు ఇదే జరిగింది. వర్షంలో బాగా తడుస్తూ ఇంటి కొచ్చేటప్పటికి వేలికున్న తులం తూగే ఉంగరం మాయం!). ఆ ఉంగరాన్ని చేపమింగేయడంతో ఎపిసోడ్ పరిసమాప్తం.
        
ఇక్కడ కూడా ప్రేక్షకులకి తెలిసి, శకుంతలకి తెలియని విషయంతో సస్పెన్స్ క్రియేటయ్యింది. ఇక్కడ కూడా సంఘటన కథని ముందుకి నడిపిస్తోంది జటిలం చేస్తూ. . సంఘటనే జరక్కపోతే? అదెలా వుంటుందో శాకుంతలం లో చూద్దాం...
-సికిందర్       


21, ఏప్రిల్ 2023, శుక్రవారం

1320 : మూవీ నోట్స్


 

    'శాకుంతలం లాంటి ఒక సినిమా తీయడానికి గత వందేళ్ళల్లో 20 రిఫరెన్సులు వుండగా కూడా, శాకుంతలం ని ఇంత నిరంకుశంగా సమర్పించారంటే కాళిదాసుని, కాళిదాసుని విశదపర్చిన పూర్వ కళాకారుల్నీ కేర్ చేయకపోవడమే. కనీసం రెండు రిఫరెన్సులు తీసుకున్నా శాకుంతలం ఇంత రస విహీనమయ్యేది కాదు. 1943 లో హిందీ శకుంతల’, 1966 లో తెలుగు శకుంతల ఈ రెండూ సరిపోతాయి. శకుంతల గాథని 1920 లోనే రెండు సార్లు మూకీల కాలంలోనే సినిమాగా తీశారు. ఇందులో మొదటిది బ్రిటిష్ నటి డరోతీ కింగ్ డమ్ నటించింది. 1929 లో దేశంలో తొలి దర్శకురాలు ఫాతిమా బేగం దర్శకత్వం వహించింది. ఇప్పటికి మూకీల నుంచి టాకీలకి అప్ గ్రేడయ్యాయి సినిమాలు. మళ్ళీ 1931 లో ఖుర్షీద్ బేగం నటించింది. 1931 లోనే జేజే మదన్ దర్శకత్వంలో ఇంకోటి. 1932 లో సురభి కమలాబాయి నటన. 1940 లో ఎంఎస్ సుబ్బు లక్ష్మి నటన. 1941 లో జ్యోత్స్నా గుప్తా నటన. 1943 లో వి. శాంతారాం దర్శకత్వంలో జయశ్రీ -చంద్రమోహన్ లు నటించిన హిందీ వెర్షన్ ఎన్నదగింది. ఇది అమెరికాలో విడుదలైన మొదటి భారతీయ సినిమాగా నమోదైంది. దీంతో బాటు 1966 లో తెలుగులో కమలాకర కామేశ్వరరావు  దర్శకత్వంలో ఎన్టీఆర్- బి. సరోజాదేవిలు నటించింది మరో మంచి రిఫరెన్సు. ఇలా 2022 వరకూ 20 సార్లు తీశారు శకుంతల గాథ. కానీ ఇప్పుడు 21 వ సారి శాకుంతలం ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది అయింది.

        ఇంకా ఇక్కడ విదేశీ వెర్షన్లు కూడా చెప్పుకుంటే, 1820 లో జర్మన్ సంగీత కారుడు ఫ్రాంజ్ షూబర్ట్ ఒపేరా కోసం ప్రారంభించిన స్వర రచన అసంపూర్ణంగా మిగిలిపోయింది. శతాబ్దం తర్వాత 1921 లో ఇటాలియన్ సంగీతకారుడు ఫ్రాంకో అల్ఫానో స్వరపర్చిన  లా లెజెండా డీ శకుంతల అనే ఒపేరా సిద్ధమైంది. దీని రెండో వెర్షన్ 1952 లో ప్రదర్శించారు. 1838 లోనే ఎర్నెస్ట్ రేయెర్ స్వరపర్చిన సాకౌంటల అనే బ్యాలే వుంది. ఇంకా 1962 లో సోవియెట్ రష్యా  సంగీతకారుడు సెర్గీ బలసనియన్ స్వరపర్చిన ఇంకో బ్యాలే శకుంతల వుంది. ఇలా వుండగా 2006 ఏప్రెల్ 23 న ఫ్రాంకో అల్ఫాన్సో ఒపేరాని రోమ్ లో తిరిగి ప్రదర్శించారు (చిత్రపటం చూడండి).

అంటే, ప్రపంచ కళాకారుల్ని శతాబ్దాలుగా ఇంతగా ఆకర్షిస్తున్న కాళిదాసు శకుంతల క్లాసిక్ ని చాలా గ్రాఫిక్స్ పెంచి కాదు, కుంచెని  ముంచి భావాత్మకంగా పెయింటింగ్ చేయాలన్న మాట! 

        శకుంతల యాక్టివ్ క్యారక్టర్ కాదు. ఆమె భర్త దుష్యంతుడు కూడా యాక్టివ్ క్యారక్టర్ కాదు. అందుకని ఇది కథ కాదు, గాథ. అంటే పాత్రలు దేనికవి సంఘర్షణ అనుభవిస్తాయి తప్ప పరిష్కారం కోసం పరస్పరం సంఘర్షించుకోవు. చివర్లో మూడో పాత్ర వచ్చి పరిష్కరిస్తుంది. కాబట్టి పాత్రల మధ్య పరిష్కారం కోసం పరస్పర సంఘర్షణ వుండని ఇలాటి పురాణ గాథల్ని పరవశింపజేసే నాటకీయత ఒక్కటే కాపాడుతుంది. ఈ నాటకీయత గాథలో మూడు మలుపులు వచ్చే చోట్ల బలంగా, విజువల్ గా (అంటే సంఘటన ఆధారంగా) వుంటే, మలుపుల మధ్య కథనం కూడా అంతే రసోత్పత్తితో సమ్మోహనకరంగా వుంటుంది. దృశ్యాలు దృశ్యకావ్య హోదాని సంతరించుకుంటాయి. ఇదే చూస్తాం 1943, 1966 వెర్షన్లలో. ఈ క్రియేటివ్ ఎత్తుగడలు  గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకుడుకి తెలియదని చెప్పడం కాదు. శాకుంతలం పుణ్యమాని మనకి తెలియని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం మాత్రమే- రిఫరెన్సుల ఆధారంగా.

ఆరు ఘట్టాల గాథ

శకుంతల గాథ శకుంతల జననం, పెంపకం, పరిణయం, శాపం, తిరస్కారం, శాప విమోచనం అనే ఆరు ఘట్టాలుగా వుంది. ఈ ఆరు ఘట్టాల్లో స్టోరీలైన్ శకుంతల జీవిత చిత్రణే. ఆమె స్వశక్తు రాలు కాదు, పుట్టగానే అనాధ అయింది, అప్పట్నుంచీ పరాధీన గానే వుంది. పుట్టగానే శకుంత పక్షులు పెంచాయి. తర్వాత కణ్వ మహర్షి చెంతన దత్త పుత్రికగా  పెరిగింది. పోనీ దుష్యంతుడ్ని పెళ్ళి చేసుకుని స్థిరపడదామనుకుంటే, అతను మళ్ళీ వచ్చి తీసుకుపోతానని వెళ్ళి పోయాడు. యాగానికి వెళ్ళిపోయిన కణ్వుడి గైర్హాజరీలో తీసికెళ్ళ డం మర్యాద కాదని. ఇది చాలనట్టు దుర్వాసుడు వచ్చి ఆమెని శపించాడు, తర్వాత శాపవిమోచనం చెప్పినా, ఆ ఉంగరం పోగొట్టుకుని భర్త దగ్గర పరాభవాన్ని ఎదుర్కొంది. అడవుల్లో ఏకాకిగా మిగిలి బిడ్డని కంది. చివరికి భర్త తప్పు తెలుసుకుని వస్తే బాధల్లోంచి విముక్తి పొందింది. ఆడదానికే అన్ని పరీక్షలూ, ఆడదే అన్నీ భరించాలీ అనే ఇందులో నీతి. ఇప్పుడు కాదు, అప్పటి కాలంలో. అప్పట్లో ఆడదానికి చదువు వుండేది కాదు కాబట్టి.

        ఈ స్టోరీలైన్లో శకుంతల బాధల్ని భరించడమనే పాయింటు ప్రధానంగా వుంది. ఇది శోక రసం. పాయింటు ఇది కాబట్టి ఈ శోక రసాన్ని ప్రధాన రసంగా తీసుకుని కథనం చేస్తూ, దీనికి వీర, శృంగార, అద్భుత, బీభత్స - తత్సంబంధ రసాల్ని అనుబంధ రసాలుగా చేసుకుని ఆయా దృశ్యాల్ని అలంకరించ వలసి వుంటుంది. ఇంతలో శోకం, మరింతలో శృంగారం; ఇంతలో శోకం, మరింతలో అద్భుతం- ఇలా సుఖదుఖాల ద్వంద్వాలతో ఎత్తుపల్లాల ప్రయాణ మన్నట్టుగా ప్రేక్షకుల మెదళ్ళలో రిజిస్టర్ చేస్తూ పోవాలి శకుంతల జీవిత కథని. సీన్లు ఇలా టూ డైమెన్షనల్ గా సాగాలి. అప్పుడు గాథ ఫ్లాట్ గా మారే ప్రమాదం తప్పుతుంది.

         శాకుంతలం లో వున్నది సాంతం డైమెన్షన్లు లేని ఫ్లాట్ గా సాగే సీన్లే. ఏ సీనూ రసాలూరదు. మామిడి పండు చీకి రసాలు జుర్రుకుంటున్నట్టు వుండదు. పాత్రగా శకుంతల కంటే పెద్ద ట్రాజడీ, టార్చర్ ఈ రస విహీన రచనే.                

        ముత్యాల ముగ్గు లో సెంట్రల్ క్యారక్టర్ సంగీతది ఆమెకి జరిగే ట్రాజడీలోంచి పెల్లు బికేది శోక రసమే అయినా, సినిమా శోకరస ప్రధానం కాదు. శోక రసాన్ని ప్రధాన రసంగా చేసి కథ నడపలేదు. నడిపితే ఫ్లాపయ్యేది. ఆమె శోకాన్ని తీర్చేందుకు ఆమె పిల్లలతో అద్భుత రసాన్ని ప్రధాన రసంగా చేసి వినోదాత్మకంగా కథ నడిపారు. ఇది కాల్పనిక కథ కాబట్టి సక్సెస్ కోసం ఎలాగైనా స్వేచ్ఛ తీసుకోవచ్చు. శకుంతల లాంటి పురాణంతో స్వేచ్ఛ తీసుకోలేరు. శోక రసాన్నే ప్రధాన రసంగా చేసి గాథ నడపాల్సిందే. సంగీతంలో బాణీల్ని కూర్చినప్పుడు ఏ వాద్యపరికరం ఎక్కడ ఎప్పుడు ఎలా శృతి కలుపుతూ పలుకుతుందో - అలా గాథలో ప్రధాన రసానికి అనుబంధ రసాలు పలికినప్పుడు దృశ్యాలు కట్టి పడేస్తాయి.

        పైన చెప్పుకున్నట్టు 1921 లో ఇటాలియన్ సంగీతకారుడు ఫ్రాంకో అల్ఫానో లా లెజెండా డీ శకుంతల అని సిద్ధం చేసిన ఒపేరా నోట్సు అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం బాంబు దాడిలో ధ్వంసమయ్యాయి. అయినా పట్టువదలని అల్ఫానో 1952 కల్లా తిరిగి కొత్త నోట్సు పూర్తి చేసి ఒపేరాని ప్రదర్శించాడు. సంగీత రూపకంగా సాగే ఈ ఒపేరా చాలు- శకుంతల గాథలో పలికే వివిధ రసాల తీరుతెన్నులు తెలియడానికి. శాకుంతలం లో మణిశర్మ నేపథ్య సంగీతం ఏం పలికిందో, ఎందుకు పలికిందో వేరే స్టడీ చేయాలి సంగీతం తెలిసిన వాళ్ళు.

స్క్రీన్ ప్లేలో ఆ మూడు మలుపులు

శకుంతల గాథలోని  ఆరు ఘట్టాలు మూడు మలుపులతో వుంటాయి. ప్లాట్ పాయింట్ వన్, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ టూ. అంటే త్రీయాక్ట్స్ స్ట్రక్చరే. ప్రధాన పాత్రల మధ్య పరిష్కారం కోసం పరస్పర సంఘర్షణ వుండని త్రీ యాక్ట్స్. ప్లాట్ పాయింట్ వన్- దుర్వాసుడి శాప ఘట్టం. మిడ్ పాయింట్ -శకుంతల భర్త దుష్యంతుడి దగ్గరికి బయల్దేరే ఘట్టం. ప్లాట్ పాయింట్ టూ -దుష్యంతుడి సభలో శకుంతల పరాభవం. స్క్రీన్ ప్లేకి మూలస్తంభాలైన ఈ మూడు మలుపులూ శాకుంతలం లో తప్పుల తడకగా వున్నాయి. ఇందుకే వీటి మధ్య కథనం ఎక్కడికక్కడ కొడిగట్టిన దీపమైంది.

        1943 హిందీ శకుంతల లో ప్లాట్ పాయింట్ వన్ చూద్దాం :  తోటలో భర్త దుష్యంతుడి రాకకై నిరీక్షిస్తున్న శకుంతల (జయశ్రీ), నేస్తం లాంటి  జింక తన దగ్గరికి రావడంతో ప్రేమగా నిమురుతూ, ఎక్కడున్నావు ఇన్నాళ్ళూ, నన్ను మర్చిపోయావా?... నువ్వెందుకు మర్చిపోతావులే, నేనే మర్చిపోయా అని ఉలిక్కిపడి తేరుకుని, ఆఁ ? ... ఏమన్నాను నేనూ? మర్చిపోయానా? ఆఁ ?... అంటే... ఆయన కూడా ఇలాగే నన్ను మర్చిపోయాడా?’ అని బలహీన స్వరంతో అని, జింకని వదిలేసి ఆందోళనగా ఇంట్లోకి పరుగెత్తి, వేలికున్న ఉంగరం చూసుకుంటూ, మర్చిపోయావా నన్ను ప్రియా? నా గుండె తట్టుకోవడం లేదు... మర్చిపోయావా నన్ను ప్రియా?’ అని మరింత బలహీన స్వరంతో దుఖితురాలవుతున్నప్పుడు- గుమ్మంలోకి దుర్వాసుడు వచ్చేసి పిలుస్తాడు. ఒకసారి పిలుస్తాడు, రెండు సార్లు పిలుస్తాడు. పలకదు. తన దుఖంలో తానుంటుంది. ఇది గమనించని అతను, పిలుస్తున్నా పలక్కపోవడం అవమానంగా తీసుకుని శపిస్తాడు- నువ్వు ఎవర్నైతే తల్చుకుంటూ నన్నవమానించావో వాడు నిన్ను మర్చిపోవుగాక!  అని శాపం పెట్టి వెళ్ళిపోతాడు.

        అటు హస్తినాపురం రాజభవనంలో నిద్రిస్తున్న దుష్యంతుడు అదిరిపడి మేల్కొని సేవకుల్ని పిలుస్తాడు. సేవకులొచ్చి అడిగితే  ఏమీ చెప్పలేకపోతాడు.

        ఈ ప్లాట్ పాయింట్ వన్ దృశ్యంలో నాటకీయత శకుంతల జింకని పలకరించడంతో మొదలైంది. దుర్వాసుడు రాకముందు జింకని లీడ్ గా తీసుకుని మరపు గురించి, దాంతో ఆమెకి దుష్యంతుడి పట్ల కలిగిన సందేహాల గురించీ ఆందోళనకరంగా, శోక రసంతో సీను రన్ అవుతోంది. దుర్వాసుడొచ్చి అందుకు తగ్గట్టుగానే శాపం పెట్టడంతో (బీభత్స రసం) అవతల దుష్యంతుడు అన్నంత పనీ చేశాడు- శకుంతలని మర్చేపోయాడు. జింకతో మాట్లాడుతూ శకుంతల రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టింది (అద్భుత రసం). అందుకే అలా ఫీలయ్యింది. ప్రపంచంలో రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టేది ఇద్దరే - ఆడవాళ్ళు, జంతువులు. మగవాడు నెత్తి మీద ఢామ్మని పిడుగు వచ్చి పడే దాకా సోమరిగా టైమ్ పాస్ చేస్తూనే వుంటాడు.

        ఈ సీనులో ఇంకో అర్ధం కూడా చూడొచ్చు. ఆడదానివైనా నీ సిక్స్త్ సెన్స్ తో నువ్వు అనుమానిస్తే వెంటనే చర్య తీసుకో. అనుమానిస్తూ కూర్చోకు. అనుమానించిందే జరుగుతుంది. దటీజ్ హౌ మైండ్ వర్క్స్. శకుంతల అనుమాన నివృత్తికి పూనుకోకుండా వర్రీ అవుతూ కూర్చోవడం వల్లే ప్రకృతి ఆమె అనుమానాన్ని నిజం చేసేందుకు నెగెటివ్ ఫీలింగ్ రూపంలో దుర్వాసుడ్ని పంపింది.

        ఇలా ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుకి  డెప్త్ ఏర్పడింది. ఇందులో శాపంతో అవతల దుష్యంతుడి రియాక్షన్ కూడా చూపించి సర్కిల్ ని కంప్లీట్ చేశారు. ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా సరే. అయితే శకుంతలకి సంబంధించి రస పుష్టితో ఈ నాటకీయత కేవలం డైలాగులతో గాకుండా సంఘటనా పూర్వకంగా చూపించి వుంటే మరింత ప్రభావ వంతంగా వుండేది. ఎన్ని డైలాగులు చెప్పినా సంఘటన ఆధారంగా విజువల్ గా చెప్పినప్పుడే బలంగా రిజిస్టర్ అవుతుంది. 1943 లో వి శాంతారాం తలపోసిన నాటకీయత అప్పటి  విధానం కావొచ్చు. 1966 వచ్చేసరికి తెలుగులో కమలాకర కామేశ్వర రావు క్రియేషన్ విజువల్ నేరేషన్ కి ప్రాణం పోసింది. ఇదెలా వుందో చూద్దాం...

డెప్త్ లేని విజువల్ కాన్ఫ్లిక్ట్

1966 తెలుగు శకుంతల లో ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు మరపు గురించి ఫోర్ షాడోయింగ్ (పరిణామాల ముందస్తు హెచ్చరిక) సీను వుంటుంది. దుష్యంతుడు (ఎన్టీఆర్) శకుంతల (బి సరోజా దేవి) ని గాంధర్వ వివాహ మాడేక, గుర్తుగా ఉంగరమిచ్చి, మళ్ళీ వచ్చి తీసికెళ్తానని సెలవు తీసుకుంటున్నప్పుడు, శకుంతల బేలగా చూసి, నన్ను మర్చిపోతారేమో?’ అంటుంది. అందుకు దుష్యంతుడు, నేను మర్చిపోతానా? ఎంత మాట. నా ధర్మాన్ని మర్చిపోను, నన్ను నేను మర్చిపోను అని అనునయించి సెలవు తీసుకుంటాడు.

        దీని తర్వాత, ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ సీనులో- తోటలో శకుంతల ఆనందంగా విహరిస్తున్నప్పుడు చెలి కత్తెలు (శారద, గీతాంజలి) వచ్చి ఆటలు పట్టిస్తారు. శకుంతల, నా స్వామి నా కోసం కబురు పంపుతాడా?’ అంటుంది. ఆయన ఇప్పుడేం చేస్తూంటాడు అని కూడా అంటే, నీకంటే ఎక్కువ నీకోసం ఎదురు చూస్తూంటాడు అంటుంది చెలికత్తె. ఎలా?’ అంటే, ఏముందీ నీ బొమ్మని చూసుకుంటూ అంటుంది చెలికత్తె.

        అవతల హస్తినాపురంలో ఏవో మధుర వూహల్లో తేలిపోతున్న దుష్యంతుడ్ని చూసి భటుడు (పద్మనాభం), ఏంటో నీలో నువ్వు ముసిముసిగా  నవ్వుకుంటున్నావ్?’ అంటాడు. దుష్యంతుడు తేరుకుని బొమ్మ వేయడానికి సిద్ధమవుతాడు. అది చూసి భటుడు, కొంపదీసి అనాఘ్రాత పుష్పం ఆ అడవి పిల్లది కాదు కదా?’ అంటాడు.

        ఇటు తోటలో శకుంతల దుష్యంతుణ్ణి తల్చుకుంటూ మైమరపులో వుంటుంది. అక్కడికి దుర్వాసుడొచ్చి పిలిస్తే పలకదు. మళ్ళీ పిలిచినా తన లోకంలోంచి ఇవతలకి రాదు. దీంతో కోపంతో శపిస్తాడు. అతడి శాపం సృష్టించే కల్లోల వాతావరణానికి అవతల దుష్యంతుడు వేస్తున్న శకుంతల బొమ్మ ఎగిరిపోతుంది. ఈ గాలి దుమారమేమిటో అర్ధంగాక ఉక్కిరి బిక్కిరవుతాడు. ఆ బీభత్సానికి అతడి స్మృతి పథంలోంచి శకుంతల వైదొలగి పోతుంది.

        ఈ ప్లాట్ పాయింట్ వన్ దుష్యంతుడు వేస్తున్న బొమ్మ, గాలి దుమారం, బీభత్సం అనే సంఘటన ఆధారంగా విజువల్ యాక్షన్ తో వుంది. ఇది వి శాంతారాం సృష్టి కున్న డెప్త్ తో లేదు. అందులో మర్చిపోవడం అనే పాయింటుతో శకుంతల మానవ సహజ భయాలతో లాజికల్ గా వుంటే, తెలుగులో టీనేజి అమ్మాయి కలల విహారంతో డైమెన్షన్ లేకుండా సాదాగా వుంది ప్లాట్ పాయింట్ వన్ సీను ప్రారంభం- మర్చిపోవడమనే పాయింటు దీనికి ముందు సీనులో విడిగా వుండడం వల్ల - ప్లాట్ పాయింట్ వన్ సీను లో డెప్త్ లోపించింది.

        అదే శాంతారాం సృష్టిలో మర్చిపోవడమనే పాయింటుతోనే ప్లాట్ వన్ సీను రన్ అవడంతో డెప్త్, అర్ధం, పరమార్ధం కలిసొచ్చాయి. తెలుగులో తర్వాత దుర్వాసుడి శాపంతో విజువల్ యాక్షన్ని ప్రదర్శించింది సీను. దీంతో భౌతికంగా బలం చేకూరింది, మానసికంగా కాదు. అయినా ఈ హిందీ తెలుగు ప్లాట్ పాయింట్ వన్ సీన్లు ప్రేక్షకుల మెదళ్ళలో రిజిస్టర్ అయ్యేవే. తాజా శాకుంతలం లో కనీసం శాపం కూడా రిజిస్టర్ కాదు.

పాపం శాపం


        ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు ఫ్లాష్ బ్యాకుగా వేసిన సీన్లో, శకుంతలని పెళ్ళాడిన దుష్యంతుడు (దేవ్ మోహన్), శకుంతల (సమంత) తో అంటాడు- ‘...తొందరలోనే వచ్చి నిన్ను సకల రాజ లాంఛనాలతో తీసుకెళ్తాను, దిగులు పడకు దేవీ అని. దీనికి శకుంతల అంటుంది, పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. మీ ప్రేమకు కూడా దూరమైతే?’ అని. దీనికి దుష్యంతుడు అంటాడు, భవబంధాలకు దూరమైన కణ్వ మహర్షినే నీ ప్రేమతో కట్టి పడేశావు. చెట్లు పుట్టలు, జంతువుల ప్రేమను కూడా నీ సొంతం చేసుకున్నావు అని ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగి, ఇదిగో మన ప్రేమ చిహ్నం అంటాడు. ఇక వెళ్ళనా?’ అంటాడు. బాధతోనే తలూపుతుంది. వెళ్ళిపోతాడు.

                ఈ సీను చాలా అసహజంగా, పేలవంగా వుంది. డైలాగులు అర్ధరహితంగా వున్నాయి. పై రెండు హిందీ తెలుగు వెర్షన్లలో వున్నట్టుగా మర్చిపోవడం గురించి లీడ్ సీను, లేదా మెయిన్ సీను కాకుండా, ప్రేమ గురించి ఈ సీను వుంది. నన్ను మర్చిపోతారేమో?’ అనకుండా, మీ ప్రేమకి కూడా దూరమైతే?’ అంటుంది. కానీ తర్వాత దుర్వాసుడొచ్చి, దుష్యంతుడి ప్రేమకు దూరమవు గాక! అని శపించ బోవడం లేదు, దుష్యంతుడు నిన్ను మర్చిపోవుగాక! అని శపించడానికి రాబోతున్నాడు. కానీ సీను చూస్తే టార్గెట్ పాయింటు మరపు గురించి గాక, ప్రేమ గురించి వుంది! ఇలా వుంటే ఏం రక్తి కడుతుంది ఇంత పెద్ద సినిమా సీను?
                
            పైగా మీ ప్రేమకు కూడా దూరమైతే?’ అన్నప్పుడు దుష్యంతుడిచ్చిన అర్ధం లేని సమాధానం భవబంధాలకు దూరమైన కణ్వ మహర్షినే నీ ప్రేమతో కట్టి పడేశావు. చెట్లు పుట్టలు, జంతువుల ప్రేమను కూడా నీ సొంతం చేసుకున్నావు అని. అంటే, నా ప్రేమకు దూరమైనా నీకు చెట్టు పుట్టల ప్రేమ వుందిగా, జంతువుల ప్రేమ వుందిగా, మీ ఫాదర్ కణ్వ మహర్షి లవ్  కూడా వుంది, ఇంకేం అడ్జస్ట్ అయిపో అనా? ఏమిటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది? వీళ్ళు ప్రబంధ నాయికానాయకులా? వెనుక ఒక సీన్లో, నీకు జంతుజాలం ప్రేమ కాదు, మగని ప్రేమ కావాలని చెలికత్తెలు అన్నారే? వెనుక ఏం రాశారో చూసుకోరా?

                ఇక ఉంగరం సంగతి. ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగి, ఇదిగో మన ప్రేమ చిహ్నం అంటాడు. అది ప్రేమ చిహ్నమా, క్యాలండరా? ఆ ఉంగరం మీద ఎన్ని అక్షరాలున్నాయో అన్ని వారాల్లో తిరిగి వస్తాననని వాగ్దానం చేస్తూ, ఆమె లెక్కించుకోవడానికి ఇచ్చిన క్యాలండర్! పై హిందీ తెలుగు వెర్షన్లలో ఉంగరమివ్వడంలో ఇదీ అర్ధం. అంతేగానీ, మన ప్రేమకి చిహ్నంగా ఇదుంచుకో, వస్తా, నీకూ నాకూ ఇక బైబై! అని కాదు! ఇంత మైండ్ బ్లోయింగ్ గా రచన చేస్తే సినిమా గ్లోబల్ హిట్టే అవ్వాలి! 

                ఇక వెళ్ళనా అని వెళ్ళిపోతాడు. ఈ సీనంతా శకుంతల చెప్పలేని బాధతో, కన్నీళ్ళ తో వుంటుంది. దుష్యంతుడు వెళ్ళిపోవడం ఆమె కంత శిక్ష అన్నట్టు వుంటుంది.  అతను వెళ్ళిపోయాక ఆనందంగా పాట పాడుకుంటుంది. మానసిక స్థితిలో ఈ మార్పెందుకో తెలీదు. పాట పూర్తయ్యాక సకల రాజ లాంఛనాలతో దుష్యంతుడు వస్తూంటాడు. ఇదామె వూహ. వూహల్లో తరలి వస్తున్న దుష్యంతుణ్ణి చూసుకుంటూ మైమరపులో వుండగా, అట్నుంచి దుర్వాసుడు వస్తూంటాడు. దుర్వాసుడ్ని చూసి చెలికత్తెలు బెదిరిపోతారు. దుర్వాసుడి కోపం గురించి ఒక చెలికత్తె ఒక కథ చెప్తుంది. ఇలా దుర్వాసుడు దారిలో చెలికత్తె లతో పరిచయం ముగించుకుని శకుంతల దగ్గరి కొస్తాడు. ఆమె ఇంకా ఆ వూహా లోకంలోనే వుంటుంది. పిలిస్తే పలకదు. ఎంత పిలిచినా తిరిగి చూడదు. దీంతో తనని ఖాతరు చేయని శకుంతలని దుర్వాసుడు శపించి వెళ్ళిపోతాడు.

                ఇంటర్ కట్ లో ఈ శాపంతో అటు హస్తినాపురంలో దుష్యంతుడి రియాక్షన్ సీను హిందీ తెలుగు వెర్షన్లలో వున్నట్టు ఇక్కడ వుండదు. ఫ్లాట్ గా శకుంతల మీద సీనుతో పేలవంగా ముగిసిపోతుంది. దుర్వాసుడు వస్తూంటే సీన్లు వేసి అంత బిల్డప్ ఇచ్చారే గానీ, ఆ బిల్డప్ తో ఒరిగిందేమిటో చూపించలేకపోయారు. ఈ సీనులో మెయిన్ ఈవెంట్ అయిన దుర్వాసుడి శాపానికున్న శక్తి ఎలాంటిదో చూపించలేకపోయారు. అతడి శాపానికి హస్తినాపురం చేరే ఫ్రీక్వెన్సీ గానీ, వైబ్రేషన్ గానీ లేవు. మరి దుష్యంతుడు శకుంతలని  మర్చి పోయినట్టా, మర్చి పోనట్టా, ఏమైనట్టు? దారిలో సిగ్నల్ టవర్స్ లేకనా? జియో అంబానీకి చెప్పి ఏర్పాటు చేసుకోవాల్సుంటుందా? 

ఏ ఫ్రీక్వెన్సీ లేని, వైబ్రేషన్ లేని దుర్వాసుడి కూనిరాగం శాపంతో  సినిమా హిట్టవ్వాలని ఎలా ఆశిస్తారు. కథ పుట్టే ప్లాట్ పాయింట్ వన్ హిట్టవ్వకపోతే సినిమా ఎలా హిట్టవుతుంది. అసలు ఇది ప్లాట్ పాయింట్ వన్ సీను అని తెలుసుకుని రచన చేశారాని పెద్ద అనుమానం!

(మిగతా రేపుదయం)
—సికిందర్


14, ఏప్రిల్ 2023, శుక్రవారం

1319 : రివ్యూ

 

అయోతి  (తమిళం)
రచన- దర్శకత్వం : ఆర్. మంధిర మూర్తి
తారాగణం : శశి కుమార్, ప్రీతీ అస్రానీ, మాస్టర్ అద్వైత్, యశ్పాల్ శర్మ, అంజూ అస్రానీ, పాండీ తదితరులు
సంగీతం : ఎన్ ఆర్ రఘునందన్, ఛాయాగ్రహణం : మాధేష్ మాణిక్కం
బ్యానర్ : ట్రైడెంట్ ఆర్ట్స్
నిర్మాత : ఆర్ రవీంద్రన్
విడుదల :  ఏప్రెల్ 7, 2023, జీ 5
***
            మిళ సినిమా ఒక్కోసారి దాని సహజ రంగు దాచి పెట్టుకుని దర్శనమిస్తూంటుంది. రంగు చూస్తే రంగేళీ, హంగు చూస్తే కంగాళీ అన్నట్టు అరవ సినిమాలొస్తూంటాయి. అరవ సినిమాలకి కాస్త భిన్నంగా యూనివర్సల్ సినిమా అన్నట్టుగా తమిళ సినిమాలొస్తూంటాయి. వీటి కంటెంట్ గానీ, మేకింగ్ గానీ ప్రాంతీయ సరిహద్దుల్ని చెరిపేసే ప్రమాణాలతో వుంటాయి. అరవ సినిమాలు మూసలో పడి అక్కడే వుంటాయి. తమిళ సినిమాని నిలబెట్టుకునే కొత్త మేకర్లు కూడా అరుదుగా వుంటారు. ఆ అరుదైన కొత్త మేకర్లలో ఇవాళ ప్రశంసలు పొందుతున్న వాడు ఆర్ మంధిర మూర్తి.

        ప్రశంసలు దేనికంటే, అయోతి అనే మళ్ళీ తనే తీయలేడేమో అనేంత ఆశ్చర్య జనకంగా సినిమా తీసినందుకు. హీరో శశి కుమార్ తో హీరోయిజానికే హీరోయిజాన్ని నేర్పే నేర్పుతో ఆలోచనాత్మకంగా తీశాడు. ఆలోచనాత్మక విషయంతో సినిమాలు రావడం వేరు. ఆ విషయాన్ని చెప్పే విధం కూడా ఆలోచనలో పడేసే అయోతి లాంటి సినిమా వేరు.  విషయాన్ని చెప్పడంలో అమల్లో వున్న అన్ని పద్ధతుల్నీ తీసి పక్కనబెట్టి, తన పద్ధతిని విప్లవాత్మకంగా ముందుంచుతున్న కొత్త దర్శకుడి క్రియేటివ్ వైకల్పమేమిటో ఇక చూద్దాం...

కథ

అయోధ్య కి చెందిన బలరాం (యశ్పాల్ శర్మ) రామభక్తుడు. మతవాది. మహా కోపిష్టి. ఎవరి మాటా వినడు. మగ దురహంకారంతో భార్య జానకి (అంజూ అస్రానీ) తో క్రూరంగా ప్రవర్తిస్తాడు. పిల్లలు అతడ్ని చూసి వణికి పోతారు. కాలేజీకి వెళ్ళే టీనేజీ కూతురు శివానీ (ప్రీతీ అస్రానీ), స్కూలు కెళ్ళే కొడుకు సోనూ (మాస్టర్ అద్వైత్ ) ఇంట్లో తండ్రి లేనప్పుడు స్వేచ్ఛని అనుభవిస్తారు. తండ్రి కనపడగానే బిక్కచచ్చిపోతారు. ఇలాటి బలరాం కుటుంబంతో రామేశ్వరం తీర్థయాత్ర పెట్టుకుంటాడు. దురై చేరుకుని, అక్కడ్నించి టాక్సీలో వెళ్తారు. అసలే కోపిష్టి, పైగా గుట్కా తినే అలవాటు. గుట్కాతో టాక్సీని పాడు చేస్తూంటే డ్రైవర్ అభ్యంతరం చెప్తాడు. దీంతో పిచ్చి రేగిపోయిన బలరాం టాక్సీని స్పీడుగా తోలమని వేధిస్తాడు. తెల్లారేలోగా రామేశ్వరం చేరుకోవాలంటాడు. స్పీడు పెంచడానికి డ్రైవర్ ఒప్పుకోకపోవడంతో కొడతాడు. ఇద్దరూ మీద పడి కొట్టుకోవడంతో టాక్సీ అదుపు తప్పి యాక్సిడెంట్ పాలవుతుంది.

యాక్సిడెంట్లో తలకి తీవ్రగాయమైన జానకిని హాస్పిటల్ కి చేరుస్తారు. గాయపడ్డ డ్రైవర్, స్నేహితుడైన శశికుమార్ కి చెప్పడంతో, శశి కుమార్ అత్యవసరంగా వేరే హాస్పిటల్ కి తీసికెళ్ళాల్సిన జానకిని అంబులెన్స్ లో తీసుకుని బయల్దేరతాడు. మార్గ మధ్యంలో ఆమె చనిపోతుంది.
        
ఇప్పుడేం చేయాలి? భాష తెలియని ప్రాంతంలో మృత దేహంతో ఏకాకిగా మిగిలిన కుటుంబాన్నేం చేయాలి? ఎట్టి పరిస్థితిలో ఈ హిందీ కుటుంబానికి సాయపడాలని నిర్ణయించుకున్న తమిళ శశికుమార్, అయోధ్యకి మృత దేహం తరలింపుకి సంబంధించి ఎలాటి చట్టపరమైన అవాంతరాల్ని ఎదుర్కొన్నాడు? సాంప్రదాయం పేరుతో అడుగడుగునా అడ్డు తగులుతున్న బలరాంతో ఏ ఇబ్బందులు పడ్డాడు? దీనంగా మిగిలిన పిల్లల మొహాలు చూసి పట్టు వదలకుండా ఆ కుటుంబాన్ని ఎలా కష్టంలోంచి బైట పడేశాడు?   ఇదీ మిగతా కదిలించే కథ.

ఎలావుంది కథ

ఇది తమిళనాడులో నిజంగా జరిగిన కథ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తరాది వలస కూలీల మీద తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని అబద్ధపు ప్రచారం సాగించిన శక్తులకి చెంప పెట్టు లాంటి కథ. అయోధ్యలో నివసిస్తున్న ఉత్తరాది బ్రాహ్మణ కుటుంబాన్ని, తమిళనాడులోని రామేశ్వరం, మదురైలో నివసిస్తున్న తమిళుల్ని ఒకచోట చేర్చి, మానవత్వం మీద బలమైన విశ్వాసాన్ని కలిగించే - రచయిత ఎస్. రామకృష్ణన్ రాసిన కథ ఆధారంగా - తన తొలి సినిమా ప్రయత్నంగా దీన్ని అందించాడు కొత్త దర్శకుడు మంధిర మూర్తి.
        
ఒక మరణం ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తుంది. మనుషుల్లో, మానవ సంబంధాల్లో మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. అయితే మరణంతోనే ఈ మార్పులు జరగాలని కాకుండా ముందే మేల్కొంటే మరణమనే నష్టమే జరగదు. ఇది ఈ కథ చెప్పే ఒక వాస్తవమైతే, రెండో వాస్తవం- మతం కేవలం ఒక ఆచారం. ఇంకే అర్ధాలు కల్పించినా అది రాజకీయం. రేపటి భవిష్యత్తుకి ఆశాకిరణం (అయోతి) గా మతాన్ని చూడకపోయినా రాజకీయమే. రాజకీయంతో అవసరాలు తీరతాయా?
        
పై రెండు అంశాల్ని కలగలిపిన ఒక బలమైన భావోద్వేగభరిత కథగా ఇది తెరకెక్కింది. ఇందులో ముగింపులో తెలిసే అసలు విషయం కొసమెరుపుగా కథని ఆకాశానికెత్తేస్తుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే ఈ ముగింపులో చిన్న డైలాగు ఇంకో ఎత్తు. క్లుప్తంగా, మృదువుగా పలికే ఈ రెండు పదాల డైలాగు సినిమాని ఎక్కడికో తీసికెళ్ళిపోతుంది ఎమోషనల్ హై తో. ఇంతవరకూ కథలో తెలియని కోణం అమాంతం బయటపడి నిశ్చేష్టుల్ని చేస్తుంది. ఇందుకే ఇది రెగ్యులర్ అరవ సినిమా కాలేదు, అరుదైన తమిళ సినిమా అయింది.

నటనలు - సాంకేతికాలు

శశికుమార్ ది రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్ర కాదు. వూర మాస్ అరవ హీరోయిజాల తమిళ ప్రేక్షకులకి ఇదొక షాక్. అయితే ప్రారంభంలో సముద్ర తీరంలో సన్నాసుల్ని ఉతికే మాస్ ఎంట్రీ సీను పాత్రకి అవసరం లేకపోయినా దర్శకుడికి ఎత్తుగడగా తప్పనట్టుంది. ఇది తప్పితే శశికుమార్ సగటు మనిషి పాత్ర సహజత్వంతో ఎక్కడా రాజీపడదు. అతనెక్కడా నవ్వడు, పైగా ఒకే ఎక్స్ ప్రెషన్ తో వుంటాడు. మౌనంగా వుంటాడు. సన్నివేశం సహజ బలాన్ని ఉత్పత్తి చేస్తే నటుడికి భావ ప్రకటనతో పనుండదు. సన్నివేశాల్లో శశికుమార్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకపోయినా, అతడి మౌనంతో మైండ్ ని చదవగలం. ఈ సబ్ టెక్స్ట్ (ఉపవచనం) గురుదత్ ప్యాసా లోని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ టైపు కథనం వల్ల వస్తుంది.
        
ఎదుటి పాత్రలు వాటి ఆక్రోశాలతో ఎంత ప్రకోపితులైనా సరే, శశి కుమార్ సాక్షిలా వుంటాడు తప్పితే ఆ ఎమోషనల్ తూఫానులో తానూ సుడిగుండమై పోడు. సాక్షిలా గమనిస్తూ తగిన నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రత్యేకతే ఇతర పాత్రల్నుంచి అతడ్ని వేరు చేసి దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది. ఈ యాక్టివ్ పాత్ర హీరోయిజం విజువల్ గా, ఆబ్జెక్టివ్ గా  వుండకుండా, కనపడని సబ్జెక్టివ్ గా వుంటుంది.
        
కూతురి పాత్రలో ప్రీతీ అస్రానీ నటన బలమైన ముద్ర. యువ నటీమణుల్లో కావాల్సినంత సామర్ధ్యముంది. లపాకీ సినిమాల్లో వాళ్ళని టపాకీ పాత్రలకి పరిమితం చేయడంతో టాలెంట్ ని ప్రదర్శించుకోలేని స్థితిలో వుండిపోతున్నారు. తండ్రితో వేధింపులకి గురవుతూ అణిగిమణిగి వున్న కూతురు తను. ఇక మెడికల్ కాలేజీలో తల్లి శవపేటిక ముందు తండ్రి మీద తిరగబడి కళ్ళు తెరిపించే - లావాలా బ్రద్ధలయ్యే సీనుని హేండిల్ చేసిన విధం ఆమెకే సాధ్యమవుతుంది.  సినిమా మొత్తంలో సుడిగాలిలా కమ్మేసే సీను ఇదొకటే. తమ్ముడికి తనే దిక్కుగా మిగిలిన పరిస్థితి సహా సానుభూతి పొందే నటనకి గీటు రాయిలా నిల్చింది. శశి కుమార్ తర్వాత ప్రధాన ఆకర్షణ ఈమె నటనే. తమ్ముడుగా మాస్టర్ అద్వైత్ దైన్యంతో కూడిన మొహం ఒక వెంటాడే దృశ్యం.      
        
తల్లిగా అంజూ అస్రానీ భర్త పెట్టే బాధల్ని దాచుకుని ఓదార్పు చూపే సాత్విక పాత్రలో కన్పిస్తుంది. గుట్కా తినే తండ్రి బలరాం గా బాలీవుడ్ నటుడు యశ్పాల్ శర్మ వొంటి మీద రామభక్తి, ఇంట్లో రావణ కుయుక్తి పాత్రని బలంగా పోషించాడు. అయోధ్యలో అతడి వుండకూడని రావణ కుయుక్తి, రామేశ్వరంలో కూతురి చేతిలో హుళక్కి అయ్యే సన్నివేశంలో పురుగులా మిగిలి తెగ జాలిని పొందుతాడు. రామేశ్వరం వెళ్తే శని వదిలినట్టయింది. . 
        
భార్య మృతదేహంతో ప్రతీచోటా సాంప్రదాయం పేరుతో అడ్డుపడతాడు. పోస్ట్ మార్టం తో, పోలీస్ ప్రొసీజర్ తో, అవయవ దానంతో, ఏర్ పోర్టు రూల్స్ తో ప్రతీచోటా న్యూసెన్స్ చేస్తాడు. అవయవ దానమనేసరికి- నీయమ్మ ఏంట్రా -  గుండె తీసేసి, కళ్ళు తీసేసి, కిడ్నీలు కూడా తీసేసి స్వర్గాని కెలా పంపుతారురా? ఆమె ఆత్మ ఎలా శాంతిస్తుంది రా? - అంటూ కేకలేస్తాడు. శశికుమార్ మౌనం గా వుంటాడు.
        
శశి కుమార్ నేస్తంగా పాండీది కూడా కీలకపాత్రే.  విమాన టిక్కెట్ల కోసం బైక్ ని  అమ్మేసే శశికుమార్ ఇంకో స్నేహితుడు, ఉచితంగా శవపేటికని తయారు చేసిచ్చే ఇంకో పాత్ర, పోస్టుమార్టం విషయంలో పోలీసుల సహాయగుణం, మెడికల్ కాలేజీ సిబ్బంది ఔదార్యం, చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు లేకపోతే రూల్స్ లో లూప్ హోల్స్ ఏమున్నాయా అని వెతికే ఏర్ పోర్టు అధికారీ పాత్రలు కూడా ఆకట్టుకునే విధంగా వుంటాయి.
        
రెండు పాటలున్నాయి- పోలీస్ స్టేషన్లో దొంగలతో పోలీసులు పాడించే పాట (ఇది కావాలని రిలీఫ్ కోసం పెట్టినట్టుంది). ఈ పాటలో శశికుమార్, పాండీ బయట కూర్చుని వుంటారు. అరవ సినిమా అయితే దొంగలతో ఆడి పాడతారు. రెండో పాట సెకండాఫ్ లో మాంటేజ్ సాంగ్. ఈ సాంగ్ లో యశ్పాల్ శర్మ పాత్ర ఇంటి దగ్గర క్రూరత్వాలు బయట పడతాయి. అతడి పాత్ర నేపథ్యం ఇక్కడ వెల్లడవుతుంది.  
        
కెమెరా వర్క్, ఎడిటింగ్ నాణ్యంగా వున్నాయి.  కెమెరా వర్క్ లో అయోధ్యా, మదురై, రామేశ్వరం దృశ్యాలు, పాత్రల భావోద్వేగాల విజువల్స్ జ్ఞాపకముండి పోతాయి. కేవలం మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే - ఒక రోజులో పూర్తయ్యే స్వల్ప కథకి, ఎమోషన్లని తోడే ఎక్కువ సందర్భాలకి తావుండదు. అటువంటప్పుడు డల్ అయిపోతూంటుంది రన్. అందుకని చనిపోయిన తల్లిని చూసి ఏడ్చే పిల్లల విజువల్స్ ని- కథనం డల్ అయ్యే అవకాశమున్న రెండు మూడు చోట్లా రిపీట్ చేస్తూ ఎమోషనల్ హైని, కంటిన్యూటీనీ సాధించినట్టున్నాడు ఎడిటర్. ఇది అరవ సినిమా ఓవర్ మేలో డ్రామా అన్పించ వచ్చుగానీ, రన్ ని కాపాడ్డానికి చేసిన ఎడిటింగ్ కళ కూడా కావొచ్చు.

చివరికేమిటి

ఈ మధ్య వస్తున్న సస్పెన్స్ సినిమాల్ని మధ్య మధ్యలో నిద్ర మేల్కొని చూడాల్సి వస్తున్న క్రాఫ్టు చచ్చిపోయిన రోజుల్లో- సోషల్ జానర్ స్వల్ప కథ అయిన అయోతి లో, దృష్టి మరల్చలేని రెండు గంటల పకడ్బందీ కథనం చేయడంలో అనుసరించిన విధానం చూస్తే- కృత్రిమ ఫార్ములాలకి భిన్నంగా, ఆర్గానిక్ గా సహజ భావోద్వేగాల సృష్టే స్పష్టమవుతుంది. కదిలించే సన్నివేశాల పరంపరే ఈ స్వల్పకథకి బలం. పూర్తి విషాదంతో కూడిన సినిమా ఈ రోజుల్లో రిస్కే అయినా, ఆ విషాదం కథ లోతుల్లోంచి నిజంగా కదిలించే విషాదమైతే టీనేజర్ కూడా అతుక్కుపోయి చూస్తాడని ఇందువల్ల తెలుస్తోంది.
       
టీనేజర్స్ కి ప్రీతీ అస్రానీ టీనేజి పాత్ర
, పిల్లలకి మాస్టర్ అద్వైత్ బాల పాత్ర, జనరల్ యూత్ కి హీరో శశికుమార్ పాత్ర, గృహిణులకి అంజూ అస్రానీ తల్లి పాత్ర, పెద్దలకి యశ్పాల్ శర్మ పాత్రా ముట్టడించి అన్ని ఏజి గ్రూపులకి విజువల్ అప్పీల్ ని ఎడతెరిపి లేకుండా పంచుతోంటే, విషాదంతో నిండిన రెండు గంటల ఈ స్వల్ప కథ తేలిపోయే అవకాశం లేదు.
       
ప్రేక్షకుల్ని ప్లీజ్ చేయడానికి  రోమాన్స్ లేదు
, కామెడీల్లేవు, టైమ్ పాస్ పాటల్లేవు, ఎలాటి కమర్షియల్ హంగులూ లేవు. అసలు సాధారణంగా అనుకునే హీరోయిజమే లేదు. సబ్ ఫ్లాట్స్ లేవు. ఎక్కువ పాత్రల్లేవు. కేవలం మరణమనే విషాదంతో, మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే ఒకే లైనుతో, దాని చుట్టూ సంఘర్షణతో మాత్రమే ఈ స్వల్ప కథ వుంది.
       
ఈ సంఘర్షణలో సాధారణంగా హీరోకి వుండే ప్రత్యర్ధి లేడు. పరిస్థితులే వివిధ అడ్డంకులుగా వుంటాయి. మృత దేహం తరలింపు కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి చేయాల్సిన పనులకి సంబంధించి. స్క్రీన్ ప్లేలో 25 వ నిమిషంలో యశ్పాల్ శర్మ - టాక్సీ డ్రైవర్ కొట్లాడుకుని జరిగే యాక్సిడెంట్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇదే కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ లో హీరో శశి కుమార్ వుండడు. అమల్లో వున్న నియమాల ప్రకారమైతే టాక్సీ డ్రైవర్ గా శశికుమారే వుంటాడు. కాన్ఫ్లిక్ట్ లో అతనుండాలి కాబట్టి. కానీ ఈ నియమాన్ని పాటించలేదు కొత్త దర్శకుడు. అయినా కథ గానీ
, పాత్ర గానీ దెబ్బ తినలేదు. ఇదొకటి గమనించాల్సిన విషయం.
       
ఫస్ట్ యాక్ట్ అయోధ్యలో 10 వ నిమిషంలో యశ్పాల్ శర్మ రామేశ్వరం ప్రయాణం గురించి కుటుంబానికి చెప్పాక
, రామేశ్వరం సముద్ర తీరంలో సన్నాసులతో పైటింగ్ తో ఎంట్రీ సీను వేసుకుని వెళ్ళిపోతాడు హీరో శశికుమార్. ప్లాట్ పాయింట్ వన్ లో మదురై సమీపంలో యాక్సిడెంట్ తర్వాత, టాక్సీ డ్రైవర్ ఫోన్ చేయడంతో, అంబులెన్స్ డ్రైవర్ గా శశికుమార్ కాన్ఫ్లిక్ట్ లోకి - సెకండ్ యాక్ట్ లో ఎంటరవుతాడు. ఇది గమనించాలి.
       
ఇక్కడ్నుంచి మృతదేహాన్ని అయోధ్యకి తరలించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకదాని తర్వాతొకటి కాన్ఫ్లిక్టుల వరస మొదలవుతుంది. ఆ రోజు దీపావళి పండుగ సెలవు కాబట్టి ఈ పరిస్థితి. కథనంలో ఐరనీ ఏమిటంటే
, ఒక  వైపు మృతదేహంతో పాట్లు, మరో వైపు తెల్లారినప్పట్నించే వీధుల్లో టపాకాయలతో పండుగ సందడి. అయితే ఎవరైనా శుభమా అని దీపావళి పండుగ రోజు ఇల్లు వదిలి తీర్ధ యాత్ర పెట్టుకుంటారా అన్నది ప్రశ్న.  పెట్టుకుంటారేమో అదేమంత పెద్ద విషయం కాదనుకుంటే, అఖండ సాంప్రదాయ వాదియైన బలరాం (యశ్పల్ పాత్ర) లాంటి వాడు పెట్టుకుంటాడా అన్న పాత్ర చిత్రణకి సంబంధించిన ప్రశ్న తలెత్తుతూనే వుంటుంది. పండుగ సెలవుతో అవాంతరాల కోసమే కొత్త దర్శకుడు పాత్రచిత్రణని బలిపెట్టి వుండాలి.
       
రెండోది యశ్పాల్ దగ్గర డబ్బుల్లేకపోవడం. పేదవాడైన శశికుమార్ పర్సులో వున్న రెండు మూడొందలు ఖర్చు పెట్టేసి ఇబ్బంది పడడం. ఎక్కడో పర రాష్ట్రానికి ప్రయాణం పెట్టుకున్న యశ్పాల్ దగ్గర టాక్సీ ఫేర్ కి మించి డబ్బులే వుండవా
? అయోధ్యలో మిత్రుడికి ఫోన్ చేస్తే, విమాన టికెట్లు నేను చూసుకుంటాను, దిగులు పడొద్దంటాడు మిత్రుడు. ఈ లోపాలు కూడా గమనించాలి.
       
ప్రీతీ అస్రానీ తల్లికి రామేశ్వరంలో కట్టుకోవడానికి సెలెక్టు చేసే చీర
, తమ్ముడు హుండీలో డబ్బు దాచుకునే చర్యా- ఈ రెండూ తర్వాత ప్లాట్ డివైసుల రూపంలో అవసరంలో అనూహ్యంగా తెరపైకొచ్చి థ్రిల్ చేస్తాయి. స్వల్ప కథ సింగిల్ లైను కుంగ కుండా ఇలాటి క్రియేటివ్ ఎలిమెంట్స్ ప్రయోగం కూడా తోడ్పడింది.
       
భాషల విషయంలో రాజీ పడలేదు కొత్త దర్శకుడు.
హిందీ మాట్లాడే పాత్రలు హిందీయే మాట్లాడడం, తమిళం మాట్లాడే పాత్రలు తమిళమే మాట్లాడడం చేస్తాయి. ఎవరి మాతృభాషలో ఆ పాత్రలు మాట్లాడ్డం వల్ల సహజత్వమే కాకుండా, ఎదుటి పాత్ర భాష అర్దంకాని టెన్షన్, భావోద్వేగాలు కూడా ఏర్పడుతూ కథనం బలీయమవుతూ పోవడానికి తోడ్పడింది.
       
ప్రత్యర్ధి లేని కథనంలో కథనం చప్పబడకుండా వివిధ ప్రభుత్వ లాంచనాల సమస్యలే టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫుని పెంచుతూపోయే క్రమం కన్పిస్తుంది. ప్రభుత్వ లాంచనాలకి సంబంధించి కొత్త దర్శకుడు మంచి రీసెర్చి చేసినట్టు కన్పిస్తుంది. సన్నివేశాల్లో బలీయమైన హ్యూమన్ డ్రామా సృష్టి వల్ల డాక్యుమెంటరీ అయ్యే ప్రమాదం కూడా తొలగిపోయింది. పౌరుల
జీవితాల భద్రత కోసం రూపొందించిన ప్రభుత్వ నిబంధనల మధ్య చిక్కుకున్న సామాన్య ప్రజల వేదనని, వాటిని పాటించడంలో వున్న ఆచరణాత్మక సమస్యల్ని, ఓ పరాయి పట్టణంలో చిక్కుకుపోయిన దిక్కులేని కుటుంబాన్ని ప్రతీకగా చేసి చూపించాడు కొత్తదర్శకుడు. పోలీసు రిపోర్టులో పేరులో స్పెల్లింగ్ తప్పులు చూసి ఏర్ పోర్టు అధికారి అనుమతి నిరాకరించే లాంటి బ్రిటీష్ కాలం నాటి ఆఫీసర్ల బాబు డమ్ ఇంకా వేళ్ళూ నుకోవడం ఒక విచారకర స్థితి.

'
అయోతీ
ని వైవిధ్యం కోసం ప్రయత్నించే మేకర్లు రిఫరెన్సుగా వుంచుకోవచ్చు. కథ చెప్పడంలో అమల్లో వున్న సాంప్రదాయాల్ని కాసేపు పక్కన బెట్టి, ఒక క్రియేటివ్ వైకల్పం చూపిస్తున్న కొత్త దర్శకుడు మంధిర మూర్తి మలి ప్రయత్నమెలా వుంటుందో ఇక చూడాలి.

—సికిందర్