రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, August 26, 2022

1196 : లైగర్

    లైగర్ సృష్టించిన హంగామా విడుదల కాగానే అయ్యో రామా అయిపోయింది... ముంబాయి నేపథ్యంతో పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ తో తీసిన ఆంధ్రావాలా (2004) కూడా ఇలాగే మార్నింగ్ షోకల్లా కుప్పకూలింది. ఇప్పుడు ముంబాయి బ్యాక్ డ్రాప్ తోనే విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ కూడా మార్నింగ్ షోకే కుప్పకూలింది. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ షో ఇంటర్వెల్ కే కుప్ప కూలింది. నత్తి వల్ల లైగర్ లోకల్ గానే లేచి గాండ్రించ లేకపోయాడు, ఇక గ్లోకల్ గా తన వాణి ఏం వినిపిస్తాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ పానిండియా కలలు బాక్సాఫీసుతో తలపడలేక చతికిలబడ్డాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో మైక్ టైసన్నే క్లయిమాక్స్ లో కొట్టగల్గిన రౌడీ స్టార్, బాక్సాఫీసు కొట్టిన రౌండ్ హౌస్ కిక్ కి తట్టుకో లేక టేక్ డౌన్ అయిపోయాడు. అయినా ఏం ఫర్వాలేదు. ఇప్పుడు సినిమా బిజినెస్ ప్రాఫిట్టే!

        లైగర్ ని 110 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 90 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్ రావాలంటే 180 కోట్లు వసూలు చేయాలంటున్నారు. ఇది జరగని పని. అయితే బాక్సాఫీసులో జరగని పని ఓటీటీలో జరిగి పోతుంది. ఇంకా లాభాలే వస్తాయి. ఓటీటీ ఎక్కువగా ఇలాటి అట్టర్ ఫ్లాప్ సినిమాల అడ్డాగా పురోభివృద్ధి చెందుతోంది. ఫ్లాప్ మరకలంటిన సినిమాల్ని ఓటీటీ వాషింగ్ మెషీన్ లో వేసి తీస్తే, తెల్లగా వెండితెర లాగా నిగనిగ లాడతాయి. కనుక ఓటీటీ వుండగా పూరీ జగన్నాథ్ అవే ప్రాచీన నిల్వ కథలతో, అవే సినిమాలు అలాగే నిర్భయంగా, సాలా క్రాస్ బ్రీడ్ అనుకుంటూ తీస్తూ పోవచ్చు.

విషయం ఇది కాదు, పానిండియా అంటూ సౌత్ సినిమాలు చేస్తున్న దండయాత్రకి బాలీవుడ్ గజగజ వణుకుతోంది. అలాంటప్పుడు ఇలా బాలీవుడ్ ముంగిట తెలుగు సినిమాలు గజగజ వణుకుతూ నిలబడితే బావుండదు. ఇలాటివి ఇంకో రెండు వస్తే లైట్ తీసుకుంటుంది బాలీవుడ్. సౌత్ నుంచి వచ్చే పానిండియా సినిమాల్లో తెలుగుకే ఎక్కువ గుర్తింపు వుంది బాలీవుడ్ లో, హిందీ రాష్ట్రాల్లో. తాజాగా నిఖిల్ నటించిన  కార్తికేయ 2 కూడా దీనికి ఉదాహరణ. నిఖిల్ లాంటి చిన్న హీరో సినిమా పానిండియా మార్కెట్ లో 100 కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ వూహించలేదు.

బాహుబలి రెండు భాగాలతో మొదలైన తెలుగు పానిండియా టూర్ ఆర్ ఆర్ ఆర్’, పుష్ప లతో తారాస్థాయికి చేరుకుని కార్తికేయ2 తో నిలదొక్కుకుంది. ఇదే తమిళం నుంచి వచ్చిన విక్రమ్ మినహా వాలిమై’, బీస్ట్’, ఈటీ వంటి పానిండియాలు ఫ్లాపయ్యాయి, తమిళనాడులో హిట్టయ్యాయి. కారణం ఇవి మరీ పాత మూసగా వుండడం లైగర్ లాగే. ఇక కన్నడ నుంచి కేజీఎఫ్ రెండు సినిమాలూ పానిండియాకి కల్ట్ మూవీస్ అయి, బాలీవుడ్ కి కుదుపునిచ్చాయి. సంఖ్యాపరంగా చూస్తే తెలుగు పానిండియాలే ఇవ్వాళ బాలీవుడ్ లో, హిందీ రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా వున్నాయి.

హిందీ రాష్ట్రాల్లో ప్రేక్షకులు హిందీ సినిమాలతో విసిగిపోయారు. బి సి సెంటర్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకి హిందీ మాస్ సినిమాలు రావడం లేదు. తెలుగు మాస్ సినిమాలు అక్కడి నగరాల్లో మల్టీ ప్లెక్సుల్లోనే గాక, వూళ్ళల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఈ లోటుని తీరుస్తున్నాయి. దీంతో తెలుగు సినిమాలు, తెలుగు స్టార్లూ హిందీ ప్రేక్షకులకి దగ్గరై, హిందీ స్టార్స్ ని కన్నెత్తి చూడ్డం లేదు ప్రేక్షకులు. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, పృథ్వీరాజ్, షంషేరా, షేర్ దిల్, ఎటాక్, బచ్చన్ పాండే వంటి స్టార్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. వీటిలో మూడు అక్షయ్ కుమార్ వే వున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రేపు సెప్టెంబర్ 9 న విడుదలయ్యే మల్టీ స్టారర్  బ్రహ్మాస్త్రం మీదే పంచప్రాణాలు పెట్టుకుని వున్నారు.

సీఐఐ సౌత్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నివేదిక ప్రకారం, 2021లో సినిమాల అఖిల భారత బాక్సాఫీసు కలెక్షన్లలో 62 శాతం సౌత్ సినిమాల నుంచే వచ్చాయి. ఈ ధోరణి మరింత బలపడుతోందని నివేదిక చెప్తోంది. నిజమే, గత కొన్ని సంవత్సరాలుగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులని ఆకర్షిస్తున్న బాలీవుడ్, సింగిల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని వదిలేసింది. దేశంలో ఎక్కువ మంది సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులే వున్నారు- దీంతో సింగిల్ స్క్రీన్ మసాలాలతో వస్తున్న సౌత్ సినిమాల్ని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ప్రేక్షకులు.

పై నివేదిక ఇంకో విషయం కూడా చెప్తోంది : మహమ్మారి తర్వాత వినోద ప్రాథమ్యా లు మారి పోతున్నందున, సినిమా ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి సౌత్ నిర్మాతలు సూపర్ స్మార్ట్ మార్కెటింగ్ నిపుణుల్ని నియమించుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచుల ప్రీ-ప్రొడక్షన్ సర్వేలని  కూడా నిర్వహిస్తున్నారు.

 

ఫిక్కీ కూడా ఒక నివేదిక విడుదల చేసింది : సింగిల్ స్క్రీన్ థియేటర్‌లకి తగ్గ హిందీ సినిమాల్లేక వాటి ఆదాయాలు క్షీణించడం, అవి మూతబడడం జరిగిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్టు ధరలు 50 నుంచి  70 రూపాయల మధ్యే వుండడంతో, మూడు రెట్లు ధరలు ఎక్కువ వుండే మల్టీ ప్లెక్సుల్లో ఆడే హిందీ సినిమాలే తీస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ ని కలుపుకుని మల్టీ ప్లెక్సుల్లో కూడా సౌత్ పానిండియా లు దండయాత్ర మొదలెట్టడంతో బాలీవుడ్ కి మల్టీప్లెక్స్ ప్రేక్షకులు  కూడా చేజారిపోతున్నారు. ఢిల్లీ, యూపీ, తూర్పు పంజాబ్ సర్క్యూట్‌ల పంపిణీదారులైతే హిందీ సినిమాలకి జనాలతో వున్న అనుబంధం తెగి పోయిందనీ, మల్టీప్లెక్సులు   ఎక్కువ డబ్బుని  తెచ్చిపెడుతున్నందున నిర్మాతలు మెట్రో-సెంట్రిక్ లేదా ఓవర్సీస్ మార్కెట్లకి సరిపోయే సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారనీ,  ఇక సింగిల్ స్క్రీన్స్ తో మేం వ్యాపారాలు మూసుకోవాల్సిందేననీ వాపోతున్నారు.

ఇలా హిందీ రాష్ట్రాల్లో సినిమాల పరంగా శూన్యమేర్పడితే ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ సొమ్ముచేసుకునే పానిండియా సినిమా ఫార్ములా యేదో తెలుగు సినిమాల్లో కనిపెట్టాలే తప్ప, ఇంకా తెలుగు ధోరణిలో అరిగిపోయిన మూస దగ్గరే ఆగిపోతే లైగర్ లాంటి అనుభవాలే ఎదురవుతాయి.
***