రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, November 13, 2020

998 : రివ్యూ

 

  అందరూ కొత్త వాళ్ళే ప్రయత్నించిన అమెరికాలో తెలుగు ఇండియన్ సైకో కిల్లర్ మూవీ గతం. ఇలా అంటున్నందుకు బాధపడక పోతే, కాస్తాలోచిస్తే, ఇలాటి మూవీస్ అఫెన్సివ్ గా వుంటాయి. గతంలో తెలుగులో, హిందీలో ఇలాటి ఫారిన్ నేపథ్యాల్లో తీసిన ఇండియన్ పాత్రలతో క్రైమ్ సినిమాలు, మాఫియా సినిమాలూ చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నే రేకెత్తించేలా వుండేవి. ప్రేక్షకులంగా మనం ఇలా చూపించింది చూసి ఎంజాయ్ చేయలేం కదా? మధ్యలో దేశం గుర్తొచ్చి ఎంజాయ్మెంటు చెడగొడుతుంది. సినిమా చూడవయ్యా అంటే దేశాన్ని గుర్తు చేసుకోవడం నాన్సెనూ సైకో తనమూ అన్పించవచ్చు. మనం సైకోలమే, కానీ ఫారినర్లు ఇలాటి సినిమాలు చూస్తే ఫారిన్లో కూడా ఇండియన్లు ఇంతేనేమో అనుకోవడం సైకోతనం కాబోదు. అమెరికాలో కొందరు ఎన్నారై నేరగాళ్ళు వుండొచ్చు. ఎఫ్బీఐ వేటాడుతున్న టాప్ 10 నేరగాళ్ళల్లో భద్రేష్ కుమార్ వుండొచ్చు. ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి భార్యని చంపి అరెస్టయిన నర్సన్ వుండొచ్చు. కాల్ సెంటర్ స్కామ్ చేసి దొరికిపోయిన కొందరు ఇండియన్ యూత్ వుండొచ్చు. పరాయి దేశాల్లో ఇది తప్పూ అని చెప్పే బదులు గ్లోరిఫై చేసే సినిమాలు వస్తున్నాయి, అదీ సమస్య. ఫారిన్ వెళ్ళి సెటిలవడమంటే ఇండియన్ స్టయిల్ నేరాల్ని అక్కడ దిగుమతి చేసుకోవడమా? ఫ్రాన్స్ లో ఉగ్రవాదాన్ని దిగుమతి చేసుకుంటున్న ఒక వర్గానికీ మనకీ తేడా ఏముంది?

    క్రైమ్ జానర్ అసలు ఎజెండా నైతిక విలువల్ని గుర్తు చేయడమే, స్థాపించడమే. అప్పుడే కథా ప్రయోజనమనే మౌలికాంశం నెరవేరుతుంది. సాధ్యం కాకపోతే ఇలాటి సినిమాల్ని తెలుగు రాష్ట్రాల నేపథ్యంగా తీసుకోవచ్చు. సినిమాల్ని సినిమాల్లాగా చూడాలన్న అర్ధం లేని వాదం పని  చెయ్యదు. కమర్షియల్ సినిమా అనేది అతి పెద్ద మాస్ మీడియా అయినంత మాత్రాన బాధ్యత వుండదని కాదు. 

        నీతి శతకం ఆపి విషయానికొస్తే, ఖచ్చితంగా ఇది కథాపరంగా పాక్షికంగా, మేకింగ్ పరంగా ఫర్వాలేదనిపించేలా కొత్త వాళ్ళు చేసిన మంచి ప్రయత్నం, సందేహం లేదు. పాత్రల పరంగా అందరూ కొత్తవాళ్లు కావడంతో పోల్చుకోవడానికి గడ్డాలు అడ్డం వస్తున్నాయి. నటనల పరంగా కథే రిలీఫ్ లేని సీరియస్ మూడ్ కావడంతో, సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో సేఫ్ అయిపోయారు కొత్త నటులూ, నటీమణులూ. సైకో రిషిగా రాకేష్, గర్ల్ ఫ్రెండ్ అదితిగా పూజిత, సైకోని పట్టుకునే అర్జున్ గా నిర్మాతల్లో ఒకరైన భార్గవ, ఈయన కొడుకు హర్షగా హర్షా ప్రతాప్, అందరూ మాటలు పలకడానికి నోటికి పనిచెప్పినట్టు కన్పిస్తారు. బిహేవియర్ ద్వారా కూడా భావ ప్రకటన చేసి వుండాల్సింది. ఎలాగూ ఈ మూవీని థియేటర్లలో సామాన్య ప్రేక్షకులకి ఉద్దేశించినట్టు లేదు. డైలాగులు ఇంగ్లీషులో ధారాళంగా ప్రవహించాయి. కొన్ని చోట్ల కథలో మలుపుల్ని తెలియజేసే కీలక డైలాగులు కూడా ఇంగ్లీషులోనే వున్నాయి. సామాన్యులకి కథెలా అర్ధమవుతుంది. అందుకని నెటిజన్లని ఉద్దేశించినప్పుడు, ఇన్ని డైలాగుల్ని కూడా తగ్గించి, ఫిలిమ్ ఈజ్ బిహేవియర్ అని దృష్టిలో పెట్టుకుని, యాక్షన్ ద్వారా అంటే చేతల ద్వారా చెప్పిస్తే - ఈ టెక్నిక్ ఆకర్షణగా వుండేది. 
        
        నిడివి గంటా 40 నిమిషాలే అయినా నిదానమైన నడకవల్ల రెండు గంటలు గడిచిపోయినట్టు అన్పిస్తుంది. మిస్టరీకి వేగం తక్కువ వుండొచ్చు; థ్రిల్లర్ కి వేగమెక్కువ వుండాలి. మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణం, శ్రీచరణ్ పాకాల సంగీతం ఫర్వాలేదన్పించే స్థాయిలో  వున్నాయి. పాటల్లేవు. కొత్త దర్శకుడు కిరణ్ కొత్తవాడు అన్పించేలా లేడు. కాకపోతే కథనంలో పాక్షికంగానే సక్సెస్ అయ్యాడు.

***

        అమెరికాలో వుంటున్న రిషి (రాకేష్) ఒక ప్రమాదానికి లోనై హాస్పిటల్లో వుంటాడు. స్పృహలో కొచ్చాక జ్ఞాపక శక్తి కోల్పోయి వుంటాడు. గర్ల్ ఫ్రెండ్ అదితి (పూజిత) ని కూడా గుర్తు పట్టడు. తన కెవరున్నారంటే తల్లి లేదనీ, తండ్రి వున్నాడనీ చెప్తాడు. తండ్రి దగ్గరికి వెళ్దామని తీసుకు బయల్దేరుతుంది. దారిలో కారు పాడయితే అర్జున్ (భార్గవ) అనే వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి తన ఇంటికి తీసుకుపోతాడు. ఆ ఇంట్లో అర్జున్ కొడుకు హర్ష (హర్షా ప్రతాప్) కూడా అర్జున్ తో పాటు సైకోలా ప్రవర్తిస్తాడు. ఆ రాత్రి కొన్ని ఇబ్బందికర అనుభవాలతో రిషి అదితితో పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ అడ్డుకుంటాడు. రిషి ఆ ఇంట్లో ఇరుక్కుంటాడు.

        ఎవరీ అర్జున్, హర్ష? ఎందుకు రిషిని, అదితిని ట్రాప్ చేశారు? జ్ఞాపక శక్తి కోల్పోయిన రిషి గతమేమిటి? అతడి గతంతో ఈ తండ్రీ కొడుకుల గతంతో వున్న సంబంధమేమిటి? ఎవరు సైకో, ఎవరు కాదు?... అన్న ప్రశ్నలతో కొనసాగేదే మిగతా కథ.

***


       ఇది సైకలాజికల్ కథ కాదు, అంటే ఇందులో పాత్ర ఎందుకు సైకలాజికల్ పేషంట్ గా మారాడన్న విచిత్స, చికిత్స అన్నది గాకుండా, ఒక సైకోగా చేస్తున్న నేరాలకి ఎలా అడ్డు కట్ట వేశారన్న కథ. సైకో థ్రిల్లర్. ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ కథనం. ఈ నాన్ లీనియర్ కథనం పోనూపోనూ ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్ లో పడి, నిలబెట్టుకున్న నవ్యత కాస్తా డీలా పడిపోయింది క్లయిమాక్స్ సహా.

        స్ట్రక్చర్ లేదని కాదు, వుంది. నాన్ లీనియర్ లో చెదిరిపోయింది. మొదటి పది నిమిషాల్లోపు రిషి అదితిలు  అర్జున్ ఇంట్లో ప్రవేశించడంతో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. ఇక మిడిల్ సంఘర్షణలో వూహించని మలుపు తిరుగుతుంది. పాత్రలు తారుమారైపోతాయి. సైకోగా రిషి తేలతాడు, తన కూతుర్ని హత్య చేసిన రిషి చేత నిజం చెప్పించే పథకంతో అర్జున్ రివీలవుతాడు.

        
        అంటే ఎండ్ సస్పెన్స్  కథనాలకి 1958 లో పరిష్కారం సూచించిన 'టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' టెక్నిక్ అన్న మాట. దీని గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. దీని హిందీ రీమేకుగా 'ధువా' వస్తే, తర్వాత ఇంకో రీమేకుగా హిందీలోనే 'ఖోజ్' వచ్చింది. దీన్ని అప్పట్లో తెలుగులో 'పోలీస్ రిపోర్ట్' గా రీమేక్ చేశారు. 'పోలీస్ రిపోర్ట్' అప్పట్లో బాగా తీయలేదనీ, ఇప్పుడు తీయవచ్చాని ఒక దర్శకుడు అడిగారు. అదే కథ ఎన్నిసార్లు తీస్తారు. 'గతం' లాగా ఇంకేదైనా కథతో తీయొచ్చు.
        
        కాకపోతే 'ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' లో పాత్రలు చిట్ట చివర్లో రివీలవుతాయి, 'గతం' లో మిడిల్ మధ్యలో రివీల్ అయ్యాయి. అంతే  తేడా. ఈ రివీలయ్యే ముందు వచ్చే ట్విస్టుల మీద ట్విస్టులకి మొదట జస్టిఫికేషన్ కన్పిస్తుంది. ఇంట్లో సింగిల్ లొకేషన్లో నైట్ పూట జరిగే చిన్న కథ కాబోలన్న అభిప్రాయం కల్గించడం వల్ల. సింగిల్ లొకేషన్లో ఒక పూట లేదా ఒక రోజులో ముగిసే చిన్న కథలకి హాలీవుడ్ కథనం ట్విస్టులతోనే వుంటుంది. లేకపోతే అదే లొకేషన్లో తక్కువ టైమ్ స్పాన్ లో కదలని సీన్లు బోరు కొడతాయి. ట్విస్టులతో ఎప్పటికప్పుడు వేగంగా కథ రీఫ్రెష్ అవాల్సిందే.
        
    అయితే ఎప్పుడైతే మిడిల్ మధ్యలో పాత్రలు తారుమారై అసలు కథ బయటపడుతుందో- అప్పుడు ఈ ట్విస్టులు చీటింగ్ అనిపిస్తాయి. వాటికి అర్ధం కనిపించదు. ఇదొక పూటలో ముగిసిపోయే చిన్న కథ కాదని ఇప్పుడు తేలింది కాబట్టి.
        
        కొన్ని రోజుల స్పాన్ తో వుండే పెద్ద కథల్లో మల్టీపుల్ ట్విస్టులుండవు. వుంటే హిందీలో 'క్యాష్' లా నవ్వులపాలవుతుంది సినిమా. పెద్ద కథలు ఒకే ట్విస్టు కేంద్రంగా వుంటాయి- 'తూర్పు- పడమర' లాగా. ట్విస్టు అంటే పొడుపు కథ. పొడుపు కథ అన్నాక దాన్ని విప్పాలిగా. అందుకే పైన చెప్పుకున్నట్టు హాలీవుడ్ సింగిల్ లొకేషన్ చిన్న కథల్లో ఒక ట్విస్టు ఇచ్చి, దాన్ని విప్పి, ఇంకో ట్విస్టు ఇస్తూ పోతారు. 'గతం' లో ఇది కూడా జరగలేదు. 
        
       కథల్లో ఏది జరిగినా పాత్రల గోల్ ప్రకారమే జరుగుతుంది. మెమరీ తెప్పించడానికి రిషి బ్రెయిన్లో ట్రిగ్గర్ పాయింట్ ని యాక్టివేట్ చేయడం గోల్ అయినప్పుడు, ఆ ట్రిగ్గర్ పాయింటుతో సంబంధం లేని ట్విస్టులు అతడికెలా ఇస్తారు. వూరికే ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి కాకపోతే. అందుకే వర్కౌట్ కాలేదు.

***

       పాత్రలు తారుమారయ్యాక అసలు కథ చెప్తూ మూడు ఫ్లాష్ బ్యాకులు వస్తాయి. ఇక్కడే తప్పులో కాలేశారు. మొదటిది రిషి చేసిన హత్య గురించి, రెండోది అతడికి యాక్సిడెంట్ జరిగిన విధం గురించి, మూడోది మెమరీ తెప్పించడానికేం చేయాలా అన్న దాని గురించి. వీటిలో మొదటిది మాత్రమే చూపించి, బోరు కొట్టే మిగిలిన రెండూ ఎత్తేయాల్సిన పని. గతంలో రిషి- అర్జున్ లు ఏ సంఘటనతో కనెక్ట్ అయ్యారో ఆ హత్య గురించి తప్ప ఇంకో ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు. కథ శిల్పం చెడి, బ్యూటీ పోతుంది. మిగిలిన రెండు ఫ్లాష్ బ్యాకుల్లో విషయాన్ని క్లయిమాక్స్ కి సర్దేసి- 'ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' చూపిన మార్గంలో ఏకకాలంలో రిషితో బాటూ ప్రేక్షకులూ ఉలిక్కిపడేలా ప్రయోగించాల్సిన తురుపు ముక్క. ఒక సారి  హిందీ 'ధువా' లో క్లయిమాక్స్ లో అమ్జాద్ ఖాన్ నేతృత్వంలోని సీబీఐ బృందం ఆధారాలు చూపిస్తూ రాఖీని రౌండప్ చేసే డ్రమెటిటిక్, క్లాసిక్ సీను చూడండి.

***

       ఈ కథకి గోల్, డ్రమెటిక్ క్వశ్చన్ ఏదైనా వుంటే, రిషి మెమరీ తెప్పించడమే. ఇదొక్కటే కథ. కథంటే ఇప్పుడు లైవ్ గా జరిగేదే. దీని మీదే ప్రక్షకులు దృష్టి పెట్టి యాక్టివ్ గా వుంటారు. దీన్నోదిలేసి ఎప్పుడో గతంలో జరిగిన ఫ్లాష్ బ్యాకులేస్తే దృష్టి చెదిరి పాసివ్ అయిపోతారు ప్రేక్షకులు. ఎందుకంటే అది కథ కాదు కాబట్టి. లైవ్ గా జరుగుతున్న కథకి గత సమాచారమివ్వడం కాబట్టి. అనవసరంగా లైవ్ లో జరుగుతున్న ఆసక్తికర కథనాపి పాత సమాచారమిస్తున్నారు కాబట్టి. రాంగోపాల్ వర్మ ఏ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాకుల జోలికి ఎందుకు పోలేదో ఒకసారాలోచిస్తారు కాబట్టి. ప్రేక్షకులు తెలివైన వాళ్ళు కాబట్టి. ఫ్లాష్ బ్యాకులంటే శుభ్రమైన కథ వెన్నులో బాకులు దింపడమే కాబట్టి. అదేం గొప్ప టెక్నిక్కేం కాదు కాబట్టి. 

        
        అందుకని రిషి కి యాక్సిడెంట్ ఎలా అయ్యిందీ అన్న బోరు కొట్టిన ఫ్లాష్ బ్యాక్ అప్రస్తుతం కథకి. అది మెమరీ వచ్చాక అమ్జాద్ ఖాన్ టైపులో అతడికే ఇవ్వాల్సిన డోస్. అలాగే మెమరీ ఎలా తప్పించాలా అని ఆలోంచించే సీన్లూ, డాక్టర్ తో తెలుసుకునే ప్రక్రియలతో కూడుకున్న ఇంకో బోరు కొట్టేసిన ఫ్లాష్ బ్యాక్ కూడా అనవసరం. ట్రిగ్గర్ పాయింటుని ఎలా యాక్టివేట్ చేస్తారో చెప్పేశాకా ఇంకా చూపించడమెందుకు. చెప్పకుండా చూపించేసి అమ్జాద్ ఖాన్ టైపులో చివర్లో ఫాస్ట్ గా చెప్పేస్తే ప్రేక్షకులు బ్రతికి పోతారు గాని. ప్రేక్షకులు- ప్రేక్షకులు- ప్రేక్షకులు- ప్రేక్షకుల్ని మర్చిపోయి కథ చేస్తే అదేమంత ఆరోగ్యవంతంగా వుండక పోవచ్చు.

సికిందర్