రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, September 29, 2020

983 : రివ్యూ


 దర్శకత్వం : రణదీప్ ఝా 
తారాగణం : బరుణ్ సోబ్తీ, సచిన్ ఖెడేకర్, ఎనాబ్ కిజ్రా, పూర్ణేందు భట్టాచార్య, సాన్యా బన్సల్, తదితరులు 
మూల కథ : సందీప్ గడే, కథ : జీబ్రాన్ నూరానీ, స్క్రీన్ ప్లే : జీషాన్ ఖాద్రీ, సంగీతం : నమన్ అధికారి, సగీష్ భండారీ తదితరులు, ఛాయాగ్రహణం : పీయూష్ పుటీ  
నిర్మాతలు : ప్రియాంకా బస్సీ, శాలినీ చౌదరీ, జీషాన్ ఖాద్రీ
విడుదల : ఇరోస్ నౌ 
***

        మర్షియల్ సినిమా అంటే గుండుగుత్తగా హీరోల మీద వుండే క్లయిమాక్సులు. హీరో మాత్రమే విలన్ని ఓడించే మార్పు లేని ముగింపులు. అప్పుడెప్పుడో 1955 లో దొంగ రాముడు లో సావిత్రి క్లయిమాక్స్ జరిపి అక్కినేని నాగేశ్వరరావుని విడిపిస్తే అదో వెరైటీ. దీన్ని ఇప్పటి కాలానికి సవరిస్తే, హీరో రిమోట్ కంట్రోల్ చేస్తూంటే హీరోయిన్ ముగించే, ఇన్నోవేట్ చేసిన క్లయిమాక్స్ అవచ్చు. కానీ కథనంతో కమర్షియల్ సినిమా వెరైటీని కోరుకోదు. కనీసం ఈక్వలైజర్ 2  లాగా సెకండాఫ్ పది నిమిషాలే కథ, నలభై నిమిషాలూ సుదీర్ఘ  క్లయిమాక్స్ అనే రివర్స్ ఇంజనీరింగ్ కి కూడా ఒప్పుకోదు. ఎంత మూసలో వుంటే అంత సుఖం, భద్రత  ఫీలవుతుంది. రియలిస్టిక్ సినిమాలు కూడా ఇదే  ధోరణిలో వుంటున్నాయి. కాకపోతే కొన్ని ట్రాజడీలుగా ముగుస్తాయి. ఈ ట్రాజడీలు కూడా వూహకందేలా ఫార్ములాగానే వుంటాయి. వూహకందకుండా ట్రాజడీగా ఒకటి కాదు, రెండు లీడ్ క్యారక్టర్ల పరాజయంగా వుంటే ఎలా వుంటుంది? దీనికి ఏ ఎలిమెంట్ తోడైతే అంత బలంగా వుంటుంది? కమర్షియల్ సినిమా కలల్ని చూపిస్తుంది, రియలిస్టిక్ సినిమా వాస్తవ పరిస్థితి చూపించి కళ్ళు తెరిపిస్తుంది. తమ అదుపులో లేని వాస్తవ పరిస్థితిని గెలవడం సగటు వాస్తవిక పాత్రలకి సాధ్యమవుతుందా? కాదు. అందువల్ల హాలాహల్ క్లయిమాక్స్ కమర్షియల్ సినిమా కళ్ళు తెరిపించే క్రియేటివ్ క్లయిమాక్స్ అవుతోంది.

    కొత్త దర్శకుడు రణదీప్ ఝా దీన్నోక కొత్త అనుభవాన్నిచ్చే పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తీయలేదు, చిత్రీకరించలేదు, చెక్కాడు. చుట్టడం కూడా చేసే దర్శకులు వుంటున్న కాలంలో, చెక్కుడు దర్శకుడుగా చెక్కడం అంటే ఏమిటో ఈ కింది విధంగా చూపించాడు...

కథ 

     మెడికల్ స్టూడెంట్ అర్చన (ఎనాబ్ కిజ్రా) రాత్రిపూట ఘాజియాబాద్ హైవేమీద బాయ్ ఫ్రెండ్ ఆశీష్ తో గొడవపడుతుంది. ఒక ట్రక్కు వేగంగా దూసుకురావడంతో ఆశీష్ తప్పించుకుని, అర్చన ట్రక్కుకింది కొచ్చేసి చచ్చిపోతుంది. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా నమోదు చేసి, రోహతక్ లో వుండే ఆమె తండ్రి డాక్టర్ శివ శంకర్ శర్మ(సచిన్ ఖెడేకర్) కి సమాచారమందిస్తారు. డాక్టర్ శర్మ ఇది ఆత్మహత్య అంటే నమ్మడు. పోస్ట్ మార్టం రిపోర్టు తప్పుగా వుంది. ఇదే నిజమనీ, అనవసరంగా గొడవపడకుండా వెళ్లిపొమ్మనీ ఇన్స్ పెక్టర్ అంటాడు. ఇన్స్ పెక్టర్ ని అనుమానించిన శర్మ, ఎస్సై యూసుఫ్ ఖురేషీ (బరుణ్ సోబ్తీ) ని కలిసి రెండు లక్షలు లంచమిస్తాడు. అడ్డగోలుగా లంచాలు మేసే యూసుఫ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య (పూర్ణేందు భట్టాచార్య) దగ్గరి కెళ్ళి బ్లాక్ మెయిల్ చేసి, అయిదులక్షలు తీసుకుంటాడు. యూసుఫ్ ని నమ్మిన శర్మ కూతురు బాయ్ ఫ్రెండ్ ఆశీష్ గురించి ఆరాతీసి యూసుఫ్ కి చెప్తాడు. కేసుతో ఎవరితో సంబంధముంటే వాళ్ళ దగ్గర లంచాలు మేసే ఆలోచనతో వున్న యూసుఫ్, శర్మని వెంటేసుకుని బాయ్ ఫ్రెండ్ ఆశీష్ వేటలో పడతాడు. ఇప్పుడేం జరిగిందనేది మిగతా కథ. 

నటనలు, సాంకేతికాలు

      ఇది శర్మా యూసుఫ్ రెండు ఆసక్తికర పాత్రల కథ. యూసుఫ్ పాత్ర మరింత ఆసక్తి కల్గించే రియలిస్టిక్ పోలీసు పాత్ర. ప్రతీ సీనులో ఈ పాత్ర నటించిన బరుణ్ సోబ్తీ మీదే వుంటుంది మన దృష్టంతా. అవకాశవాది, లంచగొండి. ఒకసారి ఇతడితో విసిగిపోయిన కొందరు దుప్పటి కప్పి కొట్టి పారిపోతారు. ఎవరు కొట్టారో తెలీక ఇక కుంటుకుంటూ నడుస్తాడు. డాక్టర్ శర్మ దగ్గర లంచం తీసుకున్నది గాక, ఆ అవకాశంతో కేసుతో సంబంధం వున్న వాళ్ళ దగ్గరా లంచాలు లాగి వదిలేస్తూంటాడు. ఈ క్రమంలో కేసుని తారుమారు చేస్తున్న ఇన్స్ పెక్టర్ కి తన కౌంటర్ ఇన్వెస్టిగేషన్ తో అడ్డు తగలుతూంటాడు, ఈ కేసు తన డ్యూటీ కాకపోయినా. ఇలా చేస్తూ సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అయ్యేలోపు మనసు మార్చుకుని డాక్టర్ శర్మ కోసం నిజాయితీ గా పని చేస్తూంటాడు. సస్పెండ్ అయ్యాక ఎక్కడపడితే అక్కడ ఇన్స్ పెక్టర్ కి తలనొప్పి తెప్పిస్తాడు. ఎన్ కౌంటర్లు, హత్యలు కూడా చేస్తూ ఇన్స్ పెక్టర్ సిండికేట్ ని కాపాడ్డానికి  ప్రయత్నిస్తూంటే, తను సిండికేట్ ని పట్టివ్వడానికి, తద్వారా దుర్మరణం చెందిన శర్మ కూతురికి న్యాయం చేయాడానికి రిస్కు తీసుకుని కృషి చేస్తూంటాడు. పాత్ర చిత్రణ, నటనా రెండూ బరుణ్ ని హైలైట్ చేశాయి. 

డాక్టర్ శర్మగా సచిన్ ఖెడేకర్ రెండో ప్రధానాకర్షణ. కూతుర్ని పోగొట్టుకున్న అతడి కోపం, పట్టుదలా ఎంత దూరమైనా అతణ్ణి తీసికెళ్లిపోతుంది. సిండికేట్ ని ఎదుర్కోవడానికి తన శక్తి చాలకపోయినా, దుండగులు తనని కొట్టి వెళ్ళినా, వెనకడుగేయని సంకల్ప బలం. ఒక పెన్ డ్రైవ్ తో సిండికేట్ ని తుదముట్టించగలడు. ఆ పెన్ డ్రైవ్ కి యాభై లక్షల కోసం వూళ్ళో క్లినిక్ అమ్మేసి, భార్యనీ, చిన్న కూతుర్నీ ఆందోళనలో పడేస్తాడు. ఇంతా చేసి, ఆ ప్రొఫెసర్ కి డబ్బిచ్చి మోసపోతాడు. పెన్ డ్రైవ్ లేదు ఏమీ లేదు. తననీ యూసుఫ్ నీ టపటపా కొట్టేసి వెళ్లిపోతారు నోయిడా గ్యాంగ్.  

ఇలా సచిన్ ఖెడేకర్, బరుణ్ సోబ్తీ ఇంట్రెస్టింగ్ జంట. డాక్టర్ గా సచిన్ మేధ ఆయితే, ఎస్సైగా బరుణ్ చేత. సచిన్ మేధస్సు నుపయోగించి ఆలోచించి చెప్తే, అతణ్ణి తీసుకుని బరుణ్ యాక్షన్లోకి దిగిపోతాడు. ఇద్దరూ మందు మిత్రులవుతారు. సిండికేట్ చేతిలో ఇద్దరూ సఫరవుతారు. ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఆశీష్ తల్లి దగ్గరికి ఇద్దరూ పోతారు. కొడుకు ఎక్కడున్నాడో ఆమె తెలియదంటే బయటి కొచ్చేస్తారు. ఆమె అబద్ధం చెప్తోందని సచిన్ అంటాడు. టేబుల్ మీద ఆల్బెట్రాల్ బాటిల్ వుంది. ఆస్తమా పేషెంట్స్ వాడతారు. అది వాడితే కనుగుడ్లు పెద్దవిగా అవుతాయి. ఆమె కళ్ళు మామూలుగా వున్నాయి. ఆ బాటిల్ ఆమె కొడుకు కోసం తెచ్చి వుంటుంది. అదెప్పుడో తీసికెళ్లి అందిస్తుంది. నీకు కొడుకు హాస్టల్లో ఇన్హేలర్ దొరికింది గా. అంటే కొడుకే ఆస్తమా పేషెంట్ అన్నమాట...ఈమెని కనిపెట్టి ఫాలో అవుదాం  ఇలా నిశిత దృష్టితో గమనించి క్లూలు ఇస్తూంటాడు సచిన్.         

        ఇందులో వివిధ స్థాయుల్లో విలన్ల రూపంలో  అధికారులు, ఓ డాక్టర్, ఓ ప్రిన్సిపాల్, ఓ బడా రాజకీయ నాయకుడూ వుంటారు. ఎవరూ మాస్ విలన్స్ గా వుండరు. నీటుగా, మర్యాదస్తుల్లా వుంటారు. నైస్ గా మాట్లాడతారు. అంతా రియల్ గా వుంటుంది. ఏదీ సినిమాటిక్ గా వుండదు. డైలాగులు కూడా సినిమాటిక్ గా వుండవు. సినిమా చూస్తున్నట్టు వుండదు. కెమెరా మూవ్మెంట్స్ కూడా సినిమా చూపించవు, పరిస్థితిని  చూపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంతే. ఎడిటింగ్ ఇంకో ఎస్సెట్. సీన్ల స్మూత్ ట్రాన్సిషన్స్ పరిస్థితినే ఎలివేట్ చేస్తాయి. ఔట్ డోర్ లొకేషన్స్, మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్, హోటల్స్, పోలీస్ స్టేషన్లు మొదలైన రియల్ లొకేషన్లు అత్యంత వాస్తవికంగా కన్పిస్తాయి. 

కథా కథనాలు 

   హాలాహల్ (గరళం) కథకి -2013 మధ్య ప్రదేశ్ వ్యాపమ్ (వ్యావసాయిక్ పరీక్షా మండల్) స్కామ్ - మెడికల్ సీట్ల భారీ కుంభకోణం ఆధారం. ఎంట్రెన్స్ పరీక్షలు, అడ్మిషన్లు, రిక్రూట్ మెంట్లతో ఓ మహా దోపిడీయే సాగింది. పలుకుబడిగల రాజకీయ నాయకులు,  జ్యూనియర్, సీనియర్ అధికార్లు, వ్యాపారవేత్తలు సిండికేట్ గా ఏర్పడి, ఎంట్రెన్స్ రాయడానికి నకిలీ అభ్యర్ధుల్ని నియమించడం, పరీక్షా హాలు సీటింగ్ ఏర్పాట్లని తారుమారు చేయడం, ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమితులైన అధికార్లని కొనేసి, ఫోర్జరీ చేసిన ఆన్సర్ షీట్లని సరఫరా చేయడం వంటివి పథకం ప్రకారం జరిపి, కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి...

ఈ నేపథ్యాన్ని సినిమాకి ఉత్తరప్రదేశ్ లో సృష్టించి ఈ కథని నడిపారు. స్ట్రక్చర్లో వున్న దీని స్క్రీన్ ప్లే -ఇంటలిజెంట్, క్రియేటివ్ వర్క్ చేయాలనుకునే భావి దర్శకులకి ఒక గైడ్. మామూలు క్రియేటివ్ వర్క్ కాదు, నోనాన్సెన్స్ క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ కి ఒక్క సీను ఉదాహరణగా తీసుకుంటే, క్లయిమాక్స్ లో సచిన్ ఖెడేకర్ కి కొన్సెలింగ్ చేస్తున్న పద్ధతిలో విలన్ వివరిస్తాడు చాలా స్మూత్ గా. సీన్ కట్ అవుతుంది. రోహతక్ లో ఆందోళనలో వున్న సచిన్ భార్యా కూతురు అతణ్ణి వచ్చెయ్యమని అంతకి ముందే కోరతారు. ఇప్పుడు టేబుల్ దగ్గర కూర్చున్న కూతురు, తలుపు వైపు చూస్తుంది. ఆమె మొహం ప్రసన్నమవుతుంది. షాట్ కట్ అయిపోతుంది. ఆమె తలుపు వైపు అలా ఏం చూసి ప్రసన్నమై వుంటుంది? సచిన్ వచ్చేసి వుంటాడు. ఇలా సచిన్ ని చూపించకుండానే ఆ అర్ధంలో షాట్ తీశాడు క్రాఫ్ట్ తెలిసిన దర్శకుడు. ఇది మర్చిపోలేని బ్యూటీఫుల్ షాట్.

విలన్ చేసిన కౌన్సెలింగ్ కి తన మంచి చెడ్డలు అర్ధమైపోయే వుంటాయి సచిన్ కి. పోరాటం విరమించాడు. తప్పదు. ఈ వ్యవస్థలో సామాన్యుడికి గత్యంతరం లేదు. ఇప్పుడున్న కుటుంబాన్ని కాపాడుకోవాలి. మరి న్యాయం? న్యాయం జరగాలని రూలుందా? న్యాయమే జరుగుతుందని సినిమాలు చూపించి మభ్యపెడుతున్నాయి. న్యాయం జరగదు, ఇది వాస్తవం. ఎందుకు జరగదు తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. న్యాయం చెప్పే సిండికేట్లు, కేట్లు, డూప్లికేట్లు పలికే సుభాషితాలు ఆరోగ్యకరమైనవి. 

అగథా క్రిస్టీ ఫేమస్ డిటెక్టివ్ పాత్ర హర్క్యూల్ పైరట్ లా గుబురు మీసాలు పెంచుకుని వీరంగం వేసిన ఎస్సైకి కూడా ఇదే గుణపాఠం. వ్యవస్థలో అతను ఆఫ్టరాల్ ఎస్సై. పెద్ద తలకాయలతో పెట్టుకోకూడదు. లంచాలు తిని ఉద్యోగం చేసుకుంటే చాలు. 

        ఎంత సింపుల్ గా వుంటుందో, అంత బలంగా వుంటుంది సందేశాత్మక ముగింపు. అయితే ఒక తప్పుంది. సిండికేట్ మీద డాక్టర్ ఆధారాలన్నీ సేకరించాక, సిండికేట్ ముందుకెళ్లి మీడియా ముందు రట్టు చేస్తానని సవాలు విసరడం రొటీన్ మూస ఫార్ములా సీను. ఈ రియలిస్టిక్ జానర్ మర్యాదలకి ఇది తగదు. దీనివల్ల ఏమైందంటే సిండికేట్ ఎలర్ట్ అయిపోయి కథకి నష్టం జరిగింది. గుట్టు చప్పుడవకుండా మీడియా ముందుకెళ్ళకుండా అనవసర హీరోయిజం ఏమిటి?

ఇక సీను తర్వాత సీన్ల క్రమం, కూర్పు ఇంకో క్రాఫ్టు. సీన్ల ప్రారంభ ముగింపులు అనూహ్యంగా థ్రిల్లింగ్ గా చేశారు. సెంటి మెంట్లు, మెలోడ్రామాలూ ఎక్కడికక్కడ లేకుండా చూసుకున్నారు. అవన్నీ సన్నివేశాల్ని బట్టి, కథ నడకని బట్టి మనం ఫీలవుతాం. 1970 లలో ఆర్ట్ సినిమాలకి తిరుగుబాటుగా రాబర్ట్ బ్రెసన్ శైలిలో తనదైన బ్రాండ్ ఆర్ట్ సినిమాలతో ఆశర్యపర్చిన మణికౌల్ దృష్టిలో, నటులు నటులు కాదు, మానవ రూపానికి మోడల్స్. నటులు పాత్ర అంతర్ముఖాన్ని బహిర్గతం చేస్తారు, మోడల్స్ బాహిర్ రూపంతో అంతర్ముఖాన్ని ఊహాత్మకం చేస్తాయి. అంటే పాత్ర లోపల ఏం ఫీలవుతోందో అంతరార్థాన్ని మన వూహకి వదిలేస్తాయి. ఇదే జరుగుతుంది హాలాహల్ లో. తప్పక చూడాల్సిన క్రియేషన్. 

సికిందర్