రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, మార్చి 2020, గురువారం

923 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -4
       క్రైం థ్రిల్లర్ రాయడం కష్టమేం కాదు, అదెలా రాయాలో ఇలా రాసి తెలియ
జేయాలంటేనే రొంబ కష్టం. క్రియేటివిటీ గాల్లోంచి వస్తుందనుకుంటే గాలి కబుర్లు పోగేసు
కోవడమే. మెదడులోంచి వస్తుందనుకుంటే ముష్టి ఆలోచనలు జమ చేసుకోవడమే. మెదడుకి ఎన్నోషరతులుంటాయి. అవిదాటి బయటికి రాదు, బయటికి చూడదు గాక చూడదు.  క్రియేటివిటీకి నాల్గు మెట్లుంటాయి : 1. తయారీ, 2. నాన బెట్టడం, 3. బల్బు వెలగడం, 4. రాసెయ్యడం. తయారీ అంటే సమాచార సేకరణ, నాన బెట్టడమంటే సేకరించిన సమాచారం మైండ్ లో సింక్ అవడానికి కొన్నాళ్ళు అలా వదిలెయ్యడం, బల్బు వెలగడమంటే సింక్ అయిన విషయం లోంచి ఒక ఐడియా బల్బులా వెలగడం, రాసెయ్యడమంటే, ఆ వెలిగిన ఐడియా పెట్టుకుని కథ డెవలప్ చేసుకోవడం...ఈ ప్రాసెస్ లో వెళ్తేగానీ క్రైం థ్రిల్లర్ కుదరదు. ఒక హత్య కేసుతో క్రైం థ్రిల్లర్ (పోలీస్ డిటెక్టివ్) కథ రాయాలనుకున్నారనుకుందాం (హత్య కేసుతోనే రాస్తారు), ముందుగా ఏ రకం హత్యో నిర్ణయించుకుంటే ఆ రకమైన సమాచారం సేకరించుకోవచ్చు. గన్ తోనా, బాంబు తోనా, కత్తితోనా, ఉరితాడుతోనా, విషంతోనా ...ఏదైతే ఆ మేరకు సమాచారం. 

       
సమాచారంలోంచి ఒక పాయింటు పట్టుకోవడానికి కొన్నాళ్ళలా మనసులో వదిలెయ్యాలి. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మనసులో నలుగుతూన్న సమస్యకి కలల రూపంలో వచ్చే క్రియేటివ్ పరిష్కారాల గురించి చెప్తాడు. అలా స్ఫురించిన ఐడియాని మించింది వుండదు. లేదా మనమేదో పనిచేసుకుంటు        న్నప్పుడు చటుక్కున ఐడియా మెరుస్తుంది నలుగుతూన్న విషయం లోంచి. అప్పుడా ఐడియా పట్టుకుని కథ అల్లుకోవాలి. ఐతే మూసఫార్ములా కథ అల్లుకోవాలనుకుంటే ఈ వ్యాసం పనికిరాదు. జానర్ మర్యాదలతో రియలిస్టిక్ కథ అవసరమనుకుంటేనే ఈ వ్యాసం తగిన సమాచారమందిస్తుంది. 


     ఈ వ్యాసాలకి సంబంధించి ఇంకో సందేహం ఇలా అందింది - నేనొక క్రైం కథ రాస్తున్నాను. అందులో హీరోయిన్ ఒక హత్య చేయాలి. ఈ హత్య దొరక్కుండా చేయాలని రీసెర్చి చేస్తుంది. అలాటి పాయిజన్ కోసం ఇంటర్నెట్ లో సెర్చి చేస్తుంది. నా సందేహం ఏమిటంటే, అలాటి పాయిజన్ నిజంగా వుందా అనేది. నెట్ లో ఎంత సెర్చ్ చేసినా దొరకలేదు, ఏం చేయాలంటారు?- అని. ఇటీవల కేరళలో ఓ కేసు పట్టుకున్నారు. ఆ కామర్స్ గ్రాడ్యుయేట్ గత 14 ఏళ్లుగా కుటుంబంలో ఆరు హత్యలు చేసింది. ఆరో హత్యతోనే అన్ని హత్యలూ బయట పడ్డాయి. ఎలా చేసింది? సహజ మరణాలన్పించేలా స్లో పాయిజన్ తో. ఆ పాయిజన్ సయనైడ్. ఏ పాయిజన్ తో హత్య చేసినా కొంత కాలమే తప్పించుకోగలరు. ఇవాళ్టి  ఫోరెన్సిక్ టాక్సికాలజీతో తెలిసిపోతుంది. కనుక ఏ పాయిజన్ అనేది ముఖ్యం కాకూడదేమో కథకి, చంపి దొరక్కుండా తప్పించుకునే డ్రామా ఏదైనా వుంటే అది ముఖ్యమవాలేమో స్క్రీన్ ప్లేకి ఆలోచించాలి. గేరీ రాడ్జర్స్ అని మాజీ పోలీస్ డిటెక్టివ్, ఫోరెన్సిక్ కరోనర్ (శవ పంచాయితీ జరిపే అధికారి) వున్నాడు. ఈయన రచయితలకి రాసుకోవడానికి పనికొచ్చే క్రైం ఇన్వెస్టిగేషన్ సలహా సంప్రదింపుల కేంద్రంగా వున్నాడు. ఈయనేమంటాడంటే,  రచయితలు క్రైం ఇన్వెస్టిగేషన్లో ముఖ్యమైన నాల్గు విషయాలు గుర్తుంచుకోవాలంటాడు. అవి హంతకుడు దొరికిపోవడానికి వుండే కారణాలు : 1. తనకి సంబంధించిన ఏదో ఆధారం వదిలేసి పోవడం, 2. ఏదో వస్తువు అక్కడ్నించి తీసికెళ్ళడం, 3. ఎవరో అతణ్ణి చూసిన సాక్షిగా వుండడం, 4. చేసింది తనే ఎవరికో చెప్పేసుకోవడం. పోలీస్ డిటెక్టివులు ఈ నాల్గు కోణాల్లోనే దర్యాప్తు చేస్తారని అంటాడు. 

       
కాబట్టి చంపి దొరక్కుండా తప్పించుకునే పాత్ర, పై నాల్గు పనులూ చేయకూడదంటాడు. 1. తనకి చెందిన ఆధారాలకి సంబంధించి ఇవి వదలకూడదు : వేలిముద్రలు, పాదరక్షలు, టైరు గుర్తులు, గన్ తో కాలిస్తే గన్ పౌడర్ అవశేషాలు, పంటి గాట్లు, గోళ్ళ రక్కుళ్ళు, చేత్తో రాసిన, లేదా ముద్రిత పత్రాలు, శిరోజాలు, సిగరెట్ పీకలు, చూయింగ్ గమ్, పళ్ళ పుల్లలు, గ్లవ్స్, పర్సు, ఐడీ కార్డులూ వగైరా. 2. హత్యా స్థలం నుంచి తీసికెళ్ళ కూడనివి : హతుడి డీఎన్ ఏ, వాహనం, ఆభరణాలు, డబ్బు, బ్యాంక్ కార్డులు, సెల్ ఫోన్, కంప్యూటర్ రికార్డులు, హత్యాయుధం కత్తి అయితే ఆ కత్తి, తాడు అయితే ఆ తాడు, గన్ అయితే ఆ గన్... 3. ఎవరూ చూడకుండా వుండాలంటే జాగ్రత్తలు : ఎవర్నీ వెంట తీసికెళ్ళ కూడదు, చుట్టు పక్కల ఎవరి కంటా పడకూడదు, సీసీ కెమెరాల పరిధిలోకి వెళ్ళకూడదు, హత్యా స్థలంలోంచి వెళ్ళిపోయాక కూడా ఎక్కడా రోడ్ల మీద సీసీ కెమెరాలకి చిక్కకూడదు. వైన్ షాపుకి వెళ్ళకూడదు. 4. చేసింది తాగి వాగకూడదు. మందు ఫ్రెండుకి, గర్ల్ ఫ్రెండుకే కాదు, దొరికిపోతే పోలీసులకి కూడా చెప్పకూడదు. తెలియకుండా పోలీసు ఇన్ఫార్మర్లు వుంటారు. జాగ్రత్త పడాలి...

ఎలా రాయాలి?
       పోలీస్ డిటెక్టివ్ స్క్రీన్ ప్లే ఎలా రాయాలనేది చూద్దాం : దీనికి హత్యే కేంద్రబిందువు కావాలి. ఈ హత్య చుట్టే కథ నడవాలి. ఈ ప్రధాన హత్యకి అనుబంధంగా మరికొన్ని హత్యలు జరగవచ్చు. అర్జున్ -విజయ్ ఆంటోనీలు నటించిన ‘కిల్లర్’ (2019) లో లాగా. అయితే జరిగిన మొదటి హత్యే కథకి ప్రధాన హత్యగా తీసుకోవాలి. అనుబంధ హత్యలు కొత్త క్లూస్ కి దారితీసే ఉద్దేశంతో కథకి ఉపయోగపడాలి. ప్రధాన హత్య ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జరిగిందనుకుందాం, అప్పుడా క్రైం సీన్ సృష్టి నిర్దుష్టంగా వుండేట్టు చూసుకోవాలి. హత్యాస్థలంలోకి పోలీసులు, క్లూస్ టీం పాత్రలు ఎంటరైనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సినిమాల్లో (కిల్లర్, ధృవ) క్లూస్ టీం రావడం రావడం వొట్టి చేతులతో అక్కడి వస్తువులు ఎడాపెడా ముట్టేసుకుంటూ వుంటారు, లైట్ స్విచ్చులేసేస్తూ వుంటారు. ఇది చాలా సిల్లీగా వుంటుంది. చేతులకి గ్లవ్స్ గానీ, అవిలేనప్పుడు కనీసం కర్చీఫ్ గానీ లేకుండా చేతులేస్తే, వేలిముద్రలు వంటి సాక్ష్యాధారాలు గల్లంతై పోతాయి. ఆనాడెప్పుడో   కొమ్మూరి సాంబశివరావు రాసిన డిటెక్టివ్ నవలల్లో చూడండి- పాత్రలు ఎంత జాగ్రత్త తీసుకుంటాయో. సిగరెట్ పీకని సైతం కర్చీఫ్ తో ఎత్తి పట్టుకుంటాయి. ప్రసిద్ధ క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ నవలల్లో కొన్నిట్లో, అతను క్లయంట్ తో వెళ్తే అనుకోకుండా హత్యా దృశ్యం ఎదురయ్యే సన్నివేశం వుంటుంది. అప్పుడా క్లయంట్ తెలియక ఏదైనా ముట్టుకోబోతే, తన ఊతపదం టట్ టట్ - అంటూ తిట్టేవాడు. ఏ నేరస్థలమైనా నేరస్థుడు వదిలే సాక్ష్యాధారాలతో కూడి వుంటుంది. వాటిని కలుషితం చేస్తే కేసే గల్లంతై పోవచ్చు. ఆరుషీ జంట హత్యల కేసులో జరిగిందిదే. 

        నేరస్థల పరిశీలనా ప్రక్రియకి ఇండియాలో ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటూ వుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం అందిందగ్గర్నుంచీ ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాల వరకూ. ఎవరైనా తీసేది ఒకే పోలీస్ డిటెక్టివ్ క్రైం థ్రిల్లరైనా, ఈ నాలెడ్జిని సముపార్జించుకుంటే ఏం తీస్తున్నారో గైడెన్స్ వుంటుంది, ఒక స్పష్టత వుంటుంది. 15 పేజీల ఈ పీడీఎఫ్ కాపీని ఈ వ్యాసం చివర ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పొందవచ్చు. దీన్ని సమగ్రంగా అవగాహన చేసుకుంటే కథని బట్టి ఏం కావాలో, ఎంత కావాలో అంతే తీసుకుని సీనాఫ్ క్రైంని పకడ్బందీగా రాసుకోవచ్చు. 

మరణ సమయ నిర్ధారణ 
       పాత డిటెక్టివ్ నవలల్లో హత్యాస్థలంలోకి ఫోరెన్సిక్ డాక్టర్ వచ్చి ప్రాథమిక శవ పరీక్ష చేసే వాడు. మరణ సమయాన్ని అక్కడే చెప్పేవాడు. విదేశీ డిటెక్టివ్ నవలల ప్రభావంతో కావచ్చు అలా రాశారు. ఫోరెన్సిక్ డాక్టర్ నే పోలీస్ డాక్టర్ అనేవారు. ఆయన వచ్చేవరకూ అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే వారు కాదు. ఆయన శవాన్ని పరీక్షించాకే మొదలెట్టే వారు. మరణ సమయాన్ని ఒక కాల వ్యవధితో చెప్పేవాడు. 2 -4 గంటల మధ్య అనో, 12 - 5 గంటల మధ్య అనో. ‘కిల్లర్’ లో ఇలా కాల వ్యవధితోనే వుంటుంది. మన సినిమాల్లో ఈ విషయంలో జాగ్రత్తే పాటిస్తున్నారు. కొన్ని హాలీవుడ్ సినిమాల్లోనే ఇన్ని గంటలకని తప్పుగా చెప్తున్నారని గేరీ రాడ్జర్స్ రాశాడు. అలా చెప్పడానికి చనిపోయే     సమయంలో స్టాప్ వాచీ పెట్టుకుని డాక్టర్ అక్కడున్నాడా అని హాస్య మాడేడు. ఇదలా వుంచితే, హత్యాస్థలానికి పోలీస్ డాక్టర్ వచ్చే విషయంలో అమెరికాలో ప్రతిపాదనలు చేస్తున్నారు. డాక్టర్ వచ్చి దృశ్యపరంగా చూస్తే మరణం గురించి ఎక్కువ విషయాలు తెలుస్తాయని అంటున్నారు. శవస్థితి, శవం పడున్నతీరు మొదలైన ఆధారాలతో హత్య ఎలా జరింగిందో కూడా డాక్టర్ చెప్పగలడంటున్నారు, కేవలం తన దగ్గర కొచ్చిన శవానికి పోస్ట్ మార్టం చేయకుండా. 

        సాధారణంగా సినిమాల్లో హత్యాస్థలంలో హంతకుడికి సంబంధించి వస్తు రూపంలో ఏదో క్లూ దొరికినట్టు చూపించి, దాన్నాధారంగా పట్టుకునే ప్రయత్నాలు చూపిస్తూంటారు. మంచిదే, అయితే ఈ టెంప్లెట్ కాకుండా, మెడికల్ ఆధారాలతో కూడా పట్టుకునే ప్రయత్నాలు చూపిస్తే కొత్తదనం వస్తుంది. పెర్రీమేసన్ నవలల్లో ఇవే ఎక్కువ వుంటాయి. కత్తిగాయం ఎంత లోతుకి దిగింది, గాయం ఒకే కత్తితో అయిందా, లేక ఆ గాయంతో కొనప్రాణంతో వున్న బాధితుడ్ని ఇంకెవరో వచ్చి, ఇంకో కత్తిని అదే గాయంలోకి దింపి పూర్తిగా చంపారా లాంటి సస్పెన్సుని క్రియేట్ చేస్తాడు - పెర్రీ పెసన్ ని సృష్టించిన సుప్రసిద్ధ క్రిమినల్ లాయర్ ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్. పెర్రీ మేసన్ బుక్స్ బెంగుళూరు పబ్లిషర్ మాస్టర్ మైండ్ బుక్స్ నుంచి పొందవచ్చు. వెల వంద రూపాయలుంటుంది. 

     పోస్ట్ మార్టం లివిడిటీ అనే మరో మెడికల్ ఎవిడెన్స్ వుంటుంది. శవం ఏ శరీర భాగాలు నేలకి తాకుతూ వుంటాయో గురుత్వాకర్షణ వల్ల రక్తం అక్కడికి లాగేసుకుని, ఆ భాగాల మీద మచ్చలేర్పడతాయి. ప్రాణం పోయిన అరగంటకి ఈ ప్రక్రియ మొదలవచ్చు. శవాన్ని కనుగొన్నప్పుడు ఈ మచ్చలు పైన కనబడితే, శవాన్ని ఎవరో తిరగేసినట్టు అర్ధం. అంటే హత్య జరిగిన అరగంట తర్వాత ఇంకెవరో ఇక్కడికి వచ్చినట్టు. శవ భంగిమ చాలా ఇంపార్టెంట్ ఈ కేసుల్లో. ఇలాటి పాయింట్లు లాగి కథ చేసినప్పుడు ఇంకింత ఉన్నతంగా వుంటుంది. పోస్ట్ మార్టం లివిడిటీ గురించి యూట్యూబ్ లో వీడియోలుంటాయి. 

        రిగర్ మార్టిస్ అని ఇంకో మెడికల్ ఎవిడెన్స్. అంటే శవం కొయ్యబారడం. చనిపోయిన నాల్గు గంటలకి ఇది జరుగుతుంది. ఈ స్థితి 18 గంటలు వుండి ఆతర్వాత సడలుతుంది. అక్కడ్నించీ కుళ్లే దశ ప్రారంభమవుతుంది. మరణ సమయాన్ని రిగర్ మార్టిస్ ద్వారా నిర్ధారిస్తారు. రిగర్ మార్టిస్ లో అసాధారణ శవ భంగిమ వుంటే, ఇంకో చోట చంపి ఇక్కడ పడేసినట్టు అనుమానిస్తారు.

        పోస్ట్ మార్టం (శవ పరీక్ష) లో మరణ కారణాన్ని తెలుసుకుంటారు. హత్యాయు
ధాలకి సంబంధించి గన్స్ గురించి బాలస్టిక్స్ సైన్స్ వుంది. ఏ బులెట్ ఏ గన్ నుంచి వచ్చింది, ఎంత దూరంనుంచి ఏ కోణంలో పేలింది, నేరుగా తగిలిందా, లేక ఇంకేదేనా వస్తువుకి తగిలి పరావర్తనం చెంది తగిలిందా వంటి నిర్ధారణలు చేస్తారు. కత్తి గాయాలు, ఫలానా కత్తి హత్యాయుధమని నిర్ధారణ, దహనం కేసుల్లో, ఉరితీత కేసుల్లో, నీట మునక కేసుల్లో, విషప్రయోగం కేసుల్లో ఇలా దేనికా సైన్స్ విభాగముంది. డాక్టర్ కె. సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ ఓపీ మూర్తిలు రాసిన ‘ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ’ అన్న ప్రసిద్ధ గ్రంథం అన్ని రకాల మరణాలకి సంబంధించి విజ్ఞాన సర్వస్వంలా వుంటుంది రైటర్స్ కి. 


      ఇక వేలిముద్రల ఎవిడెన్స్ సరే. హత్యా స్థలంలో సాక్ష్యాలేవైనా వాటి పరిరక్షణకి అమెరికాలో ఒక విధానాన్ని అమలు చేయాలనీ ఆలోచిస్తున్నారు. హత్యాస్థలం లోకి వివిధ అధికారులు వచ్చి పోతూంటారు. దీన్ని నియంత్రించేందుకు ఒక రికార్డు నిర్వహించాలని, వచ్చిన అధికారులు క్రైమ్ సీన్ని కలుషితం చేయకుండా అరికట్టాలనీ యోచిస్తున్నారు. ఇలాటిది కథలో కల్పిస్తే స్పూర్తిదాయకంగా వుంటుంది. 

        కథ దేశవాళీగా వుండాలనుకుంటే, దేశంలో నిత్యం ఎన్నో హత్యలు జరుగుతూంటాయి. ఆ క్రైం న్యూస్ ని ఫాలో అయితే చాలా కొత్త సమాచారం, కొత్త కథలు, కొత్త కోణాలు దొరుకుతాయి. ఉదాహరణకి ఇలాటి వాటి ఆధారంగా రాసిన రెండు నిజ కేసులు ఈ వ్యాసం కింద ఇచ్చిన పీడీఎఫ్ లింకులు క్లిక్ చేసి చూడవచ్చు. ఇవి ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో ‘క్రైం స్టోరీ’ శీర్షికకి రాసినవి. కాకపోతే నిజ కేసుల ఆధారంగా సినిమా తీసి, ఇది నిజంగా జరిగిన కథ అంటూ పోస్టర్ల మీద వేస్తే ఆ సినిమా ఫ్లాపవుతుంది. ఇలా వేసుకున్న ఎలాటి సినిమా అయినా ఫ్లాపే అయింది. టీవీ లోనే నిజ కథలు వస్తున్నప్పుడు, థియేటర్లో వంద రూపాయలు వదిలించుకుని మరీ చూడాలనుకోరు ప్రేక్షకులు. 

        ఇలా పై విధంగా హీరో కోసం (పోలీస్ డిటెక్టివ్) ఒ క్రైం సీన్ ని స్థాపించాక, ఇన్వెస్టిగేషన్ తాలూకు కథనం తీరుతెన్నుల గురించి వచ్చే వ్యాసంలో చూద్దాం...


24, మార్చి 2020, మంగళవారం

922 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -3        క్రైం థ్రిల్లర్ జానర్ (పోలీస్ డిటెక్టివ్) సినిమాల గురించి చెప్పుకుంటున్నాం. వీటి కథాకథనాలెలా వుంటాయన్నది ప్రస్తుత విషయం. అన్ని జానర్ల కథాకథనాల నిర్మాణం ఒక్కటే : త్రీ యాక్ట్ స్ట్రక్చర్. బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలు. బిగినింగ్ ప్రారంభమే ఒక హత్యతో వుండొచ్చు. పోలీస్ డిటెక్టివ్ రంగ ప్రవేశం చేసి దాని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడు, ఓ అరగంట స్క్రీన్ టైంలో ప్లాట్ పాయింట్ వన్ వచ్చి బిగినింగ్ ముగియ వచ్చు. ఈ ప్లాట్ పాయింట్ వన్ లో హంతకుడు రివీల్ అవచ్చు. ఇలా ఇక్కడ స్క్రీన్ ప్లే మిడిల్లో పడినప్పుడు, ఆ హంతకుణ్ణి పట్టుకునే కథ మొదలవచ్చు.
       
వ్యాసాలకి సంబంధించి అందిన కొన్ని సందేహల్లో, మిస్టరీ జానర్ ఎండ్ సస్పెన్స్ అయినప్పుడు, ఎండ్ సస్పెన్స్ కథనంతో వున్న ‘రాక్షసుడు’ అనే పోలీస్ థ్రిల్లర్ కూడా మిస్టరీ జానరే కదా, అది సక్సెస్ అయింది కదా, అలాంటప్పుడు పోలీస్ డిటెక్టివులని క్రైం థ్రిల్లర్ గా కాకుండా, మిస్టరీగానే తీయొచ్చు కదాని ఒక సందేహం అందింది. ముందుగా స్క్రీన్ ప్లే అంటే ఏమిటో శాస్త్రీయంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈ శాస్త్రీయతని పాటించాలా వద్దా రైటర్స్ కి / మేకర్స్ కి వదిలేద్దాం. ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నట్టు, విజువల్ మీడియా అయిన సినిమాలకి ఎండ్ సస్పెన్స్ తో వుండే మిస్టరీలు వర్కవుట్ కావడంలేదని, హాలీవుడ్డీయులు సీన్ టు సీన్ సస్పెన్స్ కథనాలకి తెరతీశారు. మిస్టరీల్లో లాగా కాకుండా కథని ఓపెన్ చేసేసి, సీను సీను కీ యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ సస్పెన్సు వుండేలా కథనాల్ని మార్చారు. హంతకుణ్ణి చివరి వరకూ ప్రేక్షకుల నుంచి దాచి పెట్టకుండా, వాడు తెలిసిపోయేలా, వాణ్ణి పట్టుకునే ఎలుకా పిల్లీ ఓపెన్ గేమ్ గా చేశారు. 


       ఇలా చేయడానికి స్క్రీన్ ప్లేలకి వుండే శాస్త్రీయ పునాదినే తీసుకున్నారు. విజువల్ మీడియా అయిన సినిమాలకి పాత్ర (హీరో) వుంటే - దానికి ఎదుటి పాత్ర (విలన్) తెరమీద కన్పిస్తేనే కథ. మన అంతరంగంలో నిత్యం జరిగే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే తెరమీద కన్పించాలి. ఈ ఇంటర్ ప్లే ఈ రెండు ముఖ్యపాత్రలు వుంటేనే వస్తుంది : 1. హీరో (కాన్షస్), 2. విలన్ (సబ్ కాన్షస్). త్రీ యాక్ట్స్ స్క్రీప్లేల నిర్మాణ రహస్యమిదే. ఎండ్ సస్పెన్స్ కి జవాబుగా ఇలా ఇంటర్ ప్లేతో  సీన్ టు సీన్ సస్పెన్స్ కి పూనుకున్నాక, సాధారణ నవలా మర్డర్ కథలు వెండితెర మీద ఎక్కువ చైతన్యంతో రసవత్తర మయ్యాయి. 

        ఎండ్ సస్పెన్స్ కథనాల్లో ఈ ‘ఇంటర్ ప్లే’ వుండదు. హంతకుడు (విలన్) ఎవరో చివరివరకూ హీరోకీ, ప్రేక్షకులకీ తెలీదు. ఇలా హీరో మాత్రమే హత్యా దర్యాప్తు పరంగా తెరమీద కన్పిస్తూ, చివరివరకూ, అతను కనుక్కునే వరకూ విలన్ కన్పించకపోవడంతో, వాళ్ళిద్దరి మధ్యా ‘ఇంటర్ ప్లే’ కి అవకాశం లేని కర్వ్యూ ఈ బాపతు సినిమాల్లో రాజ్యమేలుతోంది. అందువల్ల స్క్రీన్ ప్లేల శాస్త్రీయత ఇక్కడ దెబ్బతిని పోతోంది.  

        కరోనా కర్ఫ్యూ పెట్టినా జనాలు రోడ్ల మీదికి ఎందుకొస్తున్నారంటే - దే వాంట్ ఇంటర్ ప్లే. పోలీసులతో బాహాబాహీ. యాక్షన్. మనిషి బేసిక్ స్క్రీన్ ప్లే సైకాలజీ. బ్రెయిన్ ఆ విధంగా జెనెటికల్ గా వైరింగ్ అయి వుంది. ఇందాక కేసీఆర్ అన్నట్టు, కన్పిస్తే కాల్చివేత కూడా పెడితే ఇంకా మజా వస్తుంది వాళ్ళ ఇంటర్ ప్లేకి. ఈ వైరింగ్ ఎండ్ సస్పెన్స్ లో వుండదు. అంతా ఏకపక్ష పాసివ్ కథనం. ఇంటర్ ప్లేకి కర్ఫ్యూ విధిస్తే అది ఎండ్ సస్పెన్స్ తో కూడిన మిస్టరీ కథ అవుతోంది.  

        ఇలావుంటే, ఈ ఎండ్ సస్పెన్స్ కి జవాబుగా సీన్ టు సీన్ సస్పెన్స్ కి పైన చెప్పిన విధంగా తెరతీశాక, ఇంకోవైపు ఎండ్ సస్పెన్స్ తో ఇంకో ప్రయోగం కూడా చేశారు. దీని సాంకేతిక పదమేదీ మన దృష్టికి రాలేదు. మనవరకూ ‘కవరింగ్ లెటర్ కథన’ మని ఏదో పేరుపెట్టి పిలుద్దాం.  అంటే అసలు హత్య జరిగినట్టు ఎక్కడా తెలీదు. ఒక కథ నడుస్తూంటుంది. ఆ త్రీ యాక్ట్ కథలో లీనమైపోతాం. ఈ కథ వెళ్లి వెళ్లి చిట్టచివరికి ఒక ట్విస్టుతో అసలు కథ - అంటే మరుగున వున్న హత్యానేర కథని రివీల్ చేస్తుంది. అంత సేపూ పాత్రలు నడిపిన కథంతా - ఈ అసలు కథని రివీల్ చేయడానికి పన్నిన వ్యూహమని అప్పుడు మనకి తెలుస్తుంది. జరిగిన ఒక హత్యలో హంతకుణ్ణి పట్టుకోవడం గురించే నడిచే ఈ వేరే కథ, ఎండ్ సస్పెన్స్ ఫీలవకుండా కవర్ చేసేస్తుంది. అంటే పైపైన నడుస్తున్న ఈ కథలో ఇంటర్ ప్లేకి తోడ్పడే పాత్రలుంటాయి. అందువల్ల ఎండ్ సస్పెన్స్ అనుమానం, ఫీల్ రాదు.

        ఈ కవరింగ్ లెటర్ కథనానికి 1950 లలో బ్రిటన్నుంచి ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే బ్లాక్ అండ్ వైట్ మూవీ అంకురార్పణ చేసినట్టు కనపడుతుంది. దీన్నాధారంగా చేసుకుని 1980 లలో హిందీలో ‘ధువాఁ’ (పొగ) వచ్చింది. మిథున్ చక్రవర్తి, రాఖీ, అమ్జాద్ ఖాన్ లతో. ఈ మూవీ చూద్దామన్నా నెట్ లోగానీ, సీడీల కాలంలో సీడీగా గానీ దొరికేది కాదు. ఇప్పుడు మళ్ళీ వీకీపీడియాలో ఎందుకో ఒకసారి కథ చూద్దామని చూస్తే, ఆశ్చర్యకరంగా యూట్యూబ్ లో వీడియోనే ప్రత్యక్షమైంది! దీని లింక్ ఇస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసి ఈ మూవీ చూడండి
– ఎండ్ సస్పెన్స్ కథకి ఎండ్ సస్పెన్స్ ని మరిపించే ‘కవరింగ్ లెటర్ కథనం’ అంటే ఏమిటో తెలుస్తుంది. ఈ ‘ధువాఁ’ నే ఆధారంగా చేసుకుని తమిళ మలయాళ కన్నడల్లో అప్పట్లో సినిమాలొచ్చి బాగా ఆడాయి. 


     ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘రాక్షసుడు’ కధనం కూడా ఇదే కాబట్టి. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన, తమిళ రీమేక్ ‘రాక్షసుడు’ (2019) పోలీస్ థ్రిల్లరే, చిన్నచిన్న ఆడపిల్లల్ని చంపే సైకో కిల్లర్ కథ. పూర్తిగా చూస్తేగానీ ఇది ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తెలీదు. తెలియకుండా వుంచిన ప్రయోగం మధ్యలో టీచర్ పాత్ర మీదికి దృష్టి మళ్ళించి అతనే కిల్లర్ అన్నట్టుగా కథ నడపడం. దీంతో విలన్ రూపంలో అతను కన్పించి ‘ఇంటర్ ప్లేకి’ న్యాయం చేశాడు. డిటెక్టివ్ పోలీస్ థ్రిల్లర్ జానర్ మర్యాద పాటిస్తూ సీన్ టు సీన్ యాక్షన్ తో కూడిన సస్పెన్స్ కథనం ఇలా కుదిరింది. చివరికి సీరియల్ కిల్లర్ ఇతను కాదని, అసలు వేరే పాత్రతో రివీలవుతుంది. అప్పుడు మాత్రమే ఇదంతా ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తెలుస్తుంది. ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అన్పించకుండా, టీచర్ రూపంలో కరివేపాకు పాత్రతో, కవరింగ్ లెటర్ కథనం చేశారన్న మాట. 

        ఇదే మామూలు ఎండ్ సస్పెన్స్ మిస్టరీగా తీస్తే ఇలా వుండేది : ఆడపిల్లల్ని చంపుతున్న సీరియల్ కిల్లర్ ఎవరు - ఎవరు - ఎవరూ అని దీర్ఘాలు తీస్తూ చివరిదాకా తీరుబడిగా కథ నడిపి, అప్పుడు సీరియల్ కిల్లర్ని, అంటే విలన్ని రివీల్ చేసేవాళ్ళు. దీంతో ఇది చూసే వాళ్లకి పెద్ద సహన పరీక్షై, సినిమా సంతనూతలపాడు కెళ్ళిపోయేది. మాస్ మార్కెట్ అయిన కమర్షియల్ సినిమాలకి ‘ఇంటర్ ప్లే’ వుండాల్సిందే. క్లాస్ మార్కెట్ అయిన ఆర్ట్ సినిమాలకి ‘ఇంటర్ ప్లే’ లేకపోయినా మేధావులు చూసి చప్పట్లు కొడతారు. మేధావుల సినిమాలు మాస్ మార్కెట్ చూడదు, మాస్ మార్కెట్ సినిమాలు మేధావులు చూడరు. ఆర్ట్  సినిమాలు చూసి మెచ్చుకునే వాళ్ళకి  వాటి ఆర్ధిక లాభ నష్టాలు కూడా పట్టవు.

        ఇంతాచేస్తే ‘రాక్షసుడు’  పోలీస్ డిటెక్టివ్ సినిమా కాదు. అలవాటుగా, షరా మామూలుగా ఎస్సై సినిమానే. సీరియల్ కిల్లర్ కేసులు మామూలు పోలీస్ స్టేషన్లో  వుండవు. క్రైం బ్రాంచ్ పొలీస్ డిటెక్టివులు చూసుకుంటారు.

       రేపు అసలు విషయానికొద్దాం...

సికిందర్

19, మార్చి 2020, గురువారం

921 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -2


         త వ్యాసంలో మిస్టరీలకీ, క్రైం థ్రిల్లర్స్ కీ వుండే తేడాల గురించి తెలుసుకున్నాం. మిస్టరీల కింద వచ్చే డిటెక్టివ్ కథలు పడక్కుర్చీ మేధావి కథలనీ, క్రైం థ్రిల్లర్స్ కింద వచ్చే పోలీస్ డిటెక్టివ్ కథలు చక్కగా మూవీ ప్రేక్షకుల కథలనీ గమనించాం. మూవీ ప్రేక్షకుల పోలీస్ డిటెక్టివ్ కథల గురించి ఇప్పుడు చూద్దాం. దీన్నేపోలీస్ ప్రొసీజురల్ మూవీస్ అని కూడా అంటారు. అందుకని ఇవి ప్రొఫెషనల్ గా రాసి, ప్రొఫెషనల్ గా తీస్తారు. ఇలా తీసినప్పుడు నేరపరిశోధనల్లో పోలీస్ శాఖ వాస్తవికంగా ఎలా పనిచేస్తుందో ప్రేక్షకులు తెలుసుకుని, వెండితెర మీద కొత్తానుభూతిని పొందడానికి వీలవుతుంది. ఒక రకంగా ఇవి ఎడ్యుకేట్ చేస్తాయి. అయితే ఈ ఎడ్యుకేషన్ కి పరిమితులుంటాయి. ఈ ప్రక్రియని కథకెంత అవసరమో అంతే  తీసుకోవాలి తప్ప, కథని మింగేసేలా పాండిత్య ప్రకర్షతో  పోలీస్ మాన్యువల్ లా తయారు చేయకూడదు. ప్రేక్షకుల ఆసక్తి పోలీసుకీ క్రిమినల్ కీ మధ్య నడిచే డ్రామాతోనే వుంటుంది తప్ప, మధ్య మధ్యలో వచ్చే ఇన్వెస్టిగేషన్ మీద అంతగా వుండదు. కాబట్టి ఇన్వేస్టిగేషన్ ని - పోలీస్ ప్రొసీజర్ని ఏ బలమైన సన్నివేశంలో భాగంగా చేసి చూపిస్తే థ్రిల్లింగ్ గా వుంటుందో, ఆ బలమైన సన్నివేశాలకే ప్లాట్ డివైస్ లా వాడుకుంటే మంచిది. 

        పోలీస్ ప్రొసీజర్ని తెలుసుకోవడానికి మార్గాలున్నాయి. ఈ మార్గాల్లో సినిమాలు, టీవీ సిరీస్ లు, యూట్యూబ్, వెబ్సైట్స్, పుస్తకాలు వగైరా వున్నాయి. తెలిసివుంటే పోలీసు అధికారులూ వుంటారు. అమెరికాలో సార్జంట్ పాట్రిక్ ఓ డానెల్ రచయితలకీ, హాలీవుడ్ స్క్రీన్ రైటర్లకీ టెక్నికల్ అడ్వైజర్ గా వుంటున్నాడు. ఈయన పక్కాగా పోలీసు కథలు రాసుకోవడానికి పనికొచ్చే ‘కాప్స్ అండ్ రైటర్స్’ అని పుస్తకం కూడా రాశాడు. నెట్ లో వ్యాసాలూ రాస్తున్నాడు. పోలీస్ డిటెక్టివ్ తో క్రైం థ్రిల్లర్ రాయాలనుకున్నప్పుడు తగు సమాచారం కోసం రీసెర్చి చేసుకోక తప్పదు. మేకర్లకి తెలుగుతో బాటు హిందీ ఇంగ్లీషు కూడా వచ్చి వుండాలి. తెలుగుతప్ప ఇంకేమీ రాదంటే జ్ఞాన ద్వారాలు మూసుకుపోతాయి. మిడి మిడి జ్ఞానంతో రాసుకుని, తడిపొడి సినిమాలు తీసుకోవాల్సివుంటుంది.  

        హిందీ తెలిస్తే ఇంకెందుకు మంచిదంటే, తెలుగులో ఈ సంబంధమైన టీవీ సిరీస్ లేవు కాబట్టి. సినిమాలెలాగూ లేవు. ‘నేరాలు ఘోరాలు’ లాంటి జనరల్ మాస్ సిరీస్ తప్ప పోలీస్ ప్రొసీజురల్స్ లేవు. హిందీలో సోనీ టీవీలో ‘సీఐడీ’ అని మెగా సిరీస్ వస్తోంది. యూట్యూబ్ లో పాత ఎపిసోడ్లు కూడా వుంటాయి. ఇవి చూస్తే ప్రొఫెషనల్ గా మన నేటివిటీకి ఎలా చేసుకోవచ్చో అవగాహన కలుగుతుంది. ‘సురాగ్ -ది క్లూ’ అని చాలా పూర్వం అధికారి బ్రదర్స్ దూరదర్శన్ కి అందించిన సిరీస్ కూడా యూట్యూబ్ లో లభిస్తాయి. యూట్యూబ్ లోనే క్రైం సీన్ రీ కన్ స్ట్రక్షన్, పోస్ట్ మార్టం సహా ఫోరెన్సిక్ పద్ధతులు విజువల్ గా చూసుకోవచ్చు. ఇంకా ‘జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్’, ‘ఈ - పాఠశాల’ వంటి వెబ్సైట్స్ లో మన దేశంలో నిజ కేసుల క్రైం సీన్ రీ కన్ స్ట్రక్షన్, పోస్ట్ మార్టం విశ్లేషణ లెలా చేస్తారో రియల్ కేసు రిపోర్టులు లభిస్తాయి. ఇక హాలీవుడ్ లో వచ్చిన సినిమాలూ చూడొచ్చు. పోతే పోలీస్ నవలలు, కథలు చదవాలి. తెలుగులో వీలయితే కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు చదివితే బేసిగ్గా ఈ జానర్ కథాకథనాల ప్రక్రియ, క్లూస్ ప్లే చేసే విధానం, సస్పెన్సు పోషణా పద్ధతులు వగైరా ప్రాథమిక జ్ఞానం పొందే  అవకాశముంది. క్రైం సాహిత్యంవల్ల లాజికల్ మైండ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ (సమయస్ఫూర్తి) బాగా పెరుగుతాయి. కొమ్మూరి నవలల్ని విజయవాడ ‘సాహితీ ప్రచురణలు’ లో, లేదా అమెజాన్ లో పొందవచ్చు. వెల నలభై రూపాయలు.

జానర్ తో జాగ్రత్త
        ఫోరెన్సిక్, అటోప్సీ ఆధారాలు, ఇతర సాక్ష్యాధారాల సేకరణా, సెర్చి వారెంట్లూ ఇంటరాగేషన్, లీగల్ విషయాలూ వగైరా పోలీస్ డిటెక్టివ్ -క్రైం థ్రిల్లర్ సబ్ జానర్ కథల్లో భాగంగా వుంటాయి. లాజిక్ అనేది, అంటే కామన్ సెన్స్ అనేది, ఈ కథల్లో విడదీయలేని స్క్రిప్టింగ్ టూల్. జానర్ మర్యాద. సాక్ష్యాధారాలంటూ చూపించాక లాజికల్ వివరణా, ఆ సంబంధమైన కథనమూ తప్పనిసరై పోతాయి. కామన్ సెన్స్ లేకుండా సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో విహరిస్తామంటే కుదరదు. జానర్ మర్యాద ఒప్పుకోదు. హీరోతో హీరోయిన్ ఈ సీనులో ఏం మాట్లాడాలా లాజికల్ గా తేలక రోజుల తరబడి తర్జనభర్జనలు పడే తలకాయలే, కేసులో సాక్ష్యాధారాల దగ్గరకొచ్చేసరికి నిమిషంలో లాజిక్ ని, కామన్ సెన్స్ నీ తీసి అవతల పడేసి సీను చేసి పడేసేస్తారు. ఆపరేటింగ్ పార్టుతో స్వేచ్ఛ తీసుకోవచ్చు. ఒక కేసులో పోలీసు, క్రిమినల్ ని ఛేజ్ చేసి కాల్చి చంపాడనునుకుందాం. వెంటనే ఆ కేసులో  అలాగే కంటిన్యూ అయిపోతూ శుభం పడేదాకా సంగతి చూసుకుంటూనే వుంటాడు. నిజజీవితంలో వెంటనే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చుంటాడు. లేదా డెస్క్ జాబ్ కి పరిమితమవుతాడు. విచారణ ముగిసేదాకా ఎన్నిరోజులో, ఎన్ని నెలలో తెలియదు. భార్యా పిల్లలేమవుతారో, పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడో తెలీదు. జీవితం అస్తవ్యస్తమైపోతుంది. సినిమాల్లో చంపి ఇంకా కథని కంటిన్యూ చేస్తున్నాడని చూపించే లిబర్టీ తీసుకోక తప్పదు. చంపి సస్పెండ్ అయినట్టు చూపించే తాలూకు కథైతే వాస్తవికత ఎలాగూ వుంటుంది. 


     పోలీసు తన పై అధికారిని ధిక్కరించి కేసులో ముందుకు పోతాడు. చివరికి కేసుని పరిష్కరించాడు కాబట్టి ఆ ధిక్కారం మాఫీ అయిపోతుంది. నిజజీవితంలో క్రమశిక్షణా చర్యలకి గురవుతాడు. పరిస్థితిని బట్టి డిస్మిస్ కూడా అవచ్చు, ప్రాసిక్యూట్ అవొచ్చు. 

    ఇంటరాగేషన్ సీన్లో పోలీసు అధికారి నిందితుణ్ణి తిడతాడు, హింసిస్తాడు. గన్ తీసి నోట్లో పెట్టి, నిజం చెప్పమంటాడు. నిజ జీవితంలో ఇలా చేస్తే సస్పెండ్ అవుతాడు. ఇంటరాగేషన్ గదిలోకి గన్ తో వెళ్ళకూడదు. నిందితుడి చేత స్టేట్ మెంట్ ఇప్పించే ప్రయత్నాలు చేయకూడదు. అమెరికాలో లాగా మనకి ‘మిరాండా వార్నింగ్’ అనేది లేకపోయినా, నిందితుడి చేత పోలీసులు ఇప్పించుకునే ఒప్పుకోలు వాంగ్మూలం కోర్టులో చెల్లదు. మేజిస్ట్రేట్ ముందు నిందితుడు చెప్తేనే చెల్లుతుంది. ఇంటరాగేషన్ లో నిందితుడికి హక్కులున్నాయి. అతడేదీ చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో పోలీసులు నిందితుడికి ‘మిరాండా వార్నింగ్’ గుర్తు చేస్తారు. నిందితుడి హక్కులు తెలియజేసి, నువ్వేం చెప్పినా నీకు వ్యతిరేకంగా వాడుకుంటామని హెచ్చరిస్తారు. కొన్ని ఇంటరాగేషన్ టెక్నిక్స్  తెలుసుకోవడం అవసరం. ఇంటరాగేషన్ చాలా వరకూ సైకలాజికల్ గా వుంటుంది. అడిగిందానికి నిందితుడి కనుగుడ్లు ఎడమవైపు తిరుగుతూంటే, చేసింది గుర్తు చేసుకుంటున్నాడనీ; కుడి వైపు తిరుగుతూంటే అడిగిందానికి ఏం చెప్పాలా ఆలోచిస్తున్నా డనీ అర్ధం. ఇలాటి సైకలాజికల్ అంశాలతోనూ, క్లూస్ తోనూ లిబర్టీ తీసుకోలేరు. ఆపరేటింగ్ పార్టుతోనే తీసుకోవాలి అవసరాన్ని బట్టి. 


         శాఖలో ర్యాంకులు నిర్దుష్టంగా చిత్రించాలి. డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ డిసిపి ర్యాంకు అధికారి అధ్వర్యంలో వుంటుంది. ఈయన కింద ఏడిసిపి, ఎసిపిలు, ఇన్స్ పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వుంటారు. క్షేత్రస్థాయిలో కేసుల్ని పరిశోధించేది ఇన్స్ పెక్టర్లే. వీళ్ళని డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లంటారు. ఎస్సైని డిటెక్టివ్ ఎస్సై అంటారు. పోలీస్ డిటెక్టివ్ క్రైం సినిమాలకి డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, డిటెక్టివ్ ఎస్సై పాత్రలుండాలి. వాళ్ళనలా  పిలవాలి. 

        డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ తోనే క్లూస్ టీం వుంటుంది. ఫింగర్ ప్రింట్ / ఫుట్ ప్రింట్స్ బ్యూరో, మిస్సింగ్ పర్సన్స్ బ్యూరో, డాగ్ స్క్వాడ్ వుంటాయి. నేరస్థలంలో క్లూస్  టీం సేకరించిన సాక్ష్యాధారాలని ఫోరెన్సిక్ లాబ్ కి పంపిస్తారు. ఈ లాబ్ డైరెక్టర్ అధ్వర్యంలో వుంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, డాక్యుమెంట్స్ విభాగాల్లో వివిధ టెక్నీషియన్లు, అసిస్టెంట్లు వుంటారు. 

        ఇకపోతే జాతీయంగా సీబీఐ వేరు, రాష్ట్రీయంగా పోలీస్ శాఖ వేరు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో వుండే సీబీఐకి దేశవ్యాప్తంగా ఒకే ప్రొసీజర్ వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలో వుండే పోలీస్ శాఖలకి వేర్వేరు ప్రొసీజర్స్ వుండొచ్చు. హైదరాబాద్ లో వున్నట్టుగా విజయవాడలో వుండక పోవచ్చు. అలాగే జాతీయ సంస్థ ఎన్ఐఏ ప్రొసీజర్స్ వేరే వుంటాయి.  

     పోలీస్ డిటెక్టివ్ అవాలంటే సీఐడీ పరీక్షలు రాస్తారు. ఇంటర్మీడియేట్ పాసయితే అసిస్టెంట్ సబిన్స్ పెక్టర్ గా చేరతారు. డెస్క్ జాబ్ లోనైనా, ఫీల్డ్ వర్క్ లో నైనా మంచి స్కిల్స్ తో వుంటారు. వేగవంతమైన ఆలోచన, నిర్ణయాలు తీసుకోగల శక్తీ వుంటుంది. సబిన్స్ పెక్టర్ స్థాయిలో చేరేందుకు గ్రాడ్యుయేషన్ చేసి, వివిధ యూనివర్సిటీలు ఆఫర్ చేసే క్రిమినాలజీ కోర్సు చేస్తారు. ఉద్యోగ నిర్వహణలో సూక్ష్మగ్రాహీ, కుశాగ్రబుద్దీ అయివుంటారు. మంచి జ్ఞాపక శక్తీ, వూహాశక్తీ, మనోనేత్రంతో చూడగల దార్శనికతా కలిగి వుంటారు. కాబట్టి పోలీస్ డిటెక్టివులని మామూలు పోలీసులుగా చూపిస్తే జానర్ మాన మర్యాదలు పోతాయి. 

        ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిటెక్టివ్ స్క్రిప్టు తయారు చేసుకుంటే ప్రొఫెషనల్ గా వుంటుంది. ఇక క్రైం థ్రిల్లర్ సబ్ జానర్ కథాకథనాల గురించి వచ్చే వ్యాసంలో తెలుసుకుందాం. ఏవైనా సందేహాలుంటే ఈమెయిల్ లేదా వాట్సాప్ చేయవచ్చు.


సికిందర్       

17, మార్చి 2020, మంగళవారం

920 : జానర్ మర్యాద


        జానర్ మర్యాదల గురించి కొనసాగింపు వ్యాసంగా మొదట ప్రస్తుత ట్రెండ్ మీద దృష్టి పెడితే, మొత్తానికి ఇటీవల రోమాంటిక్ కామెడీ (?) ల తాకిడి తగ్గి, సస్పెన్స్ థ్రిల్లర్ల (?) హవా నడుస్తోంది. వీటి జానర్ మర్యాదలు తెలియజేయాలని కొందరు రాస్తున్నారు. ఒక సహకార దర్శకుడు డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్ (?) జానర్ ఎనాలిసిస్ రాయాలని కోరారు. ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ అని అనెయ్యడం అనాలోచితంగా జరిగిపోయి వుండొచ్చు. జానర్ సంబంధ సాంకేతిక పదాలు ఇష్టానుసారం వాడేస్తే ఇక జానర్ మర్యాదలు ఎంత చెప్పినా అర్ధంగావు. ప్రేమ కథలన్నిటినీ కలిపి రోమాంటిక్ కామెడీలని ఒకే పదం వాడెయ్యడం, నేర కథలన్నిటినీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అనుకోవడం చేస్తే ఇక జానర్ మర్యాదల గురించి చెప్పుకోవడం అసాధ్యమైపోతుంది. ఒక జానర్ లో ఎన్నో సబ్ జానర్లు వుంటాయి. నిజంగా జానర్ మర్యాదల్ని అమలుచేసి, ఒక వైవిధ్యాన్నిచాటుకోవాలనుంటే, ముందు తెలుసుకుని మాట్లాడాల్సింది ఏ సబ్ జానర్ కింద చేస్తున్న కథ వస్తుందన్నదే. ఇది ఐడియా దశలోనే నిర్ణయమవాలి. ఐడియా దగ్గరే కట్టుబడక పోతే ఇక కథతో ఏ కట్టుబాట్లూ వుండవు. ఏ జానర్ మర్యాదలూ వుండవు. లవ్ జానర్లో రోమాంటిక్ కామెడీలు మాత్రమే వుండవు. రోమాంటిక్ డ్రామాలుంటాయి, రోమాంటిక్ సస్పెన్సులుంటాయి. అడల్ట్ రోమాన్సులుంటాయి, ఎరోటిక్ రోమాన్సులుంటాయి. ఇలా అనేక సబ్ జానర్లుగా వర్గీకరణ చెంది వుంటుంది లవ్ జానర్. ఇది తెలుసుకోక రోమాంటిక్ కామెడీ లంటూ తీస్తూ వచ్చిన సినిమాలు దాదాపూ అన్నీ ఒకే మూసలో రోమాంటిక్ డ్రామాలే. ఇలా వుంటే ఇక జానర్ మర్యాదల గురించి తెలుసుకుని ప్రయోజనమేముంటుంది.   

       
లాగే నేర కథలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కావు. నేర కథలు ప్రధానంగా క్రైం జానర్. దీనికింద సబ్ జానర్స్ గా మిస్టరీ, క్రైం థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్, ఎరోటిక్ థ్రిల్లర్, లీగల్ థ్రిల్లర్, మెడికల్ థ్రిల్లర్, మిలిటరీ థ్రిల్లర్... ఇలా ఎన్నో వుంటాయి. దేని జానర్ మర్యాద దానిదే. సస్పెన్స్ థ్రిల్లర్ అనే సబ్ జానర్ కూడా లేదు. కారణం, సస్పెన్స్ నేది అన్ని జానర్ల కథల్లోనూ వుండేదే. ఇది కథలకి సస్పెన్స్ ని కల్పించే టూల్ తప్ప, టైపు కాదు. జానర్ కాదు. పైన చెప్పుకున్న క్రైం సబ్ జానర్ లో కథలు ఒక నేరం చుట్టూ వుంటాయి. ఈ కథలు స్టార్స్ తో తీసినప్పుడు హాలీవుడ్ సినిమాల్లోలాగా వాటివైన జానర్ మర్యాదలతో వుండక పోవచ్చు. అన్ని మసాలాలూ కలిపేసి వుండొచ్చు. స్టార్స్ కుండే ఇమేజి అలా డిమాండ్ చేస్తుంది కాబట్టి. వీటికి జానర్ మర్యాదల గురించి కంగారుపడ నవసరం లేదు.    స్టారేతర సినిమాలకి మనసుంటే మర్యాదలు, బంధుత్వాలు కలుపుకోవచ్చు. మనసే లేకపోతే  కొత్త హీరోల, చిన్న హీరోల క్రైం జానర్ ని కూడా స్టార్స్ సినిమాల్లాగా సర్వ కళా సమ్మేళనం చేసుకోవచ్చు. తీసేది కోటి రూపాయల క్రైం జానరైనా, పదుల కోట్ల స్టార్ సినిమాల్లా వుండాలని కలలుగంటే, స్టార్ సినిమాలకి చీప్ నకళ్ళు తయారవుతాయి తప్ప, జానర్ స్పెసిఫిక్ సినిమాలు రావు. అదే టిక్కెట్ కి వైభవోపేతంగా స్టార్ సినిమాలు లభిస్తోంటే, చీప్ నకళ్ళతో ఆడియెన్స్ కేంపని? ఇదీ పాయింటు. 

డిటెక్టివ్- పోలీస్ డిటెక్టివ్ 
        కాబట్టి క్రైం జానర్ తో చీప్ నకళ్ళే కావాలో, ఒరిజినాలిటీ కావాలో ఎవరికి వారే నిర్ణయించుకుని బరిలోకి దిగాలి. ముందుగా ఐడియాతో ఈ స్పష్టత కొస్తే దానికి తగ్గ వ్యాపారం తెలుస్తుంది. వ్యాపార రేంజి తెలుస్తుంది. ఈ రేంజి చాలనుకుంటే అదే రేంజిలో తీసుకోవచ్చు. గొడవుండదు. దానికి తగ్గ ఫలితం ముందే తెలుస్తుంది కాబట్టి సమస్య వుండదు. ముందుగా క్రైం జానర్లో పైన అడిగిన ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ చూద్దాం. ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ అనడం జానర్ ని పిలవడంలో అస్పష్టతే అయినా, ఇందులో ప్రధానంగా ‘డిటెక్టివ్’ అనే పదం వుంది. అంటే నేర కథ. నేర కథల్లో డిటెక్టివ్ అంటే నేర పరిశోధన, దర్యాప్తు వగైరా. అంటే మిస్టరీ సబ్ జానర్. నేరాల్ని శోధించే నేర కథలు మిస్టరీ సబ్ జానర్ కింది కొస్తాయి. మిస్టరీ అంటే రహస్యంతో ముడిపడి వున్నది. అంటే ఒక నేరం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే రహస్యం డిటెక్టివ్ తెలుసుకునే కథనంతో కూడిన కథావస్తువు.

        దీని జానర్ మర్యాదలేమిటో చూద్దాం: డిటెక్టివ్ సాహిత్యానికి ఆద్యుడు షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త అర్ధర్ కానన్ డాయల్ కాదు. ఎడ్గార్ అలెన్ పో. 1841 లో ఈయన రాసిన ‘మర్డర్స్ ఇన్ ది రూ మార్గ్’ చరిత్రలో మొదటి డిటెక్టివ్ కథ. ఈయన సృష్టించిన ఆగస్ట్ పైన్ మొదటి డిటెక్టివ్. ఈ ప్రసిద్ధ డిటెక్టివ్ కథా క్రమంలో ‘పో’ కల్పించిన ఎనిమిది దశల్ని తీసుకుని, షెర్లాక్ హోమ్స్ పాత్రని సృష్టించి, ‘ఏ స్టడీ ఇన్ స్కార్లెట్’ అని మొదటి డిటెక్టివ్ కథ 1887 లో రాశాడు డాయల్. డాయల్ తో సరిసమానమైన అగథా క్రిస్టీ కూడా ఆగస్ట్ పైన్ తోనే స్ఫూర్తి పొంది, హెర్క్యూల్ పైరట్ పాత్రని సృష్టిస్తూ, ‘ది మిస్టీరియస్ ఎఫైర్ ఇన్ స్టైల్స్’  అనే తన తొలి  డిటెక్టివ్ కథ 1920 లో రాసింది. 

        ‘పో’ రాసిన కథని హోమ్స్ పరిశీలించి ఫాలో అయిన ఎనిమిది  కథన దశలేమిటో చూద్దాం. ఈ దశలే ఆయన రాసిన చిన్న కథలతో బాటు నవలల్లో వుంటాయి. నవలల ఆధారంగా తీసిన సినిమాల్లోనూ వుంటాయి. 1. ముందుగా అనుచరుడు డాక్టర్ వాట్సన్ తో షెర్లాక్ హోమ్స్ పూర్వపు కేసులు చర్చిస్తూ కథా ప్రారంభం, 2. కొత్త క్లయంట్ వచ్చి సమస్య చెప్పుకోవడం, హోమ్స్  ఆ కేసు స్వీకరించడం, 3. క్లయంట్ ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు మొదలెట్టడం, ఒక కీలక ఆధారం దొరకడం, ఇది అంత ప్రధానం కాదన్నట్టుగా పాఠకులకి అన్పించేలా చేయడం, 4. వాట్సన్ ఆ ఆధారంతో పొరపాటు విశ్లేషణ చేయడం, 5. ప్రభుత్వ డిటెక్టివ్ ఇంకో ఫాల్స్ క్లూ ఇవ్వడం, ప్రభుత్వ డిటెక్టివ్ కాకపోతే దినపత్రికో, క్లయంటో, లేక కేసులో బాధితుడు లేదా బాధితురాలో, ఇంకో సాక్షియో ఆ ఫాల్స్ క్లూ నివ్వడం, 6. తర్జనభర్జనలతో కేసు అంతు చిక్కక వాట్సన్ అయోమయంలో పడ్డం, హోమ్స్ క్లూస్ అన్నిటినీ కలిపి ఊహాగానం చేస్తూ, నిర్ణయం చెప్పకపోవడం, 7. అనూహ్యంగా హోమ్స్ కేసుని బద్దలు కొట్టి దోషిని పట్టుకోవడం, 8. తను కనుగొన్న వాస్తవాలన్నిటినీ కలిపి హేతుబద్ధ వివరణ నిస్తూ ముగించడం. 


      ఏ  షెర్లాక్ హోమ్స్ కథైనా నవలైనా ఈ ఎనిమిది దశలతో టెంప్లెట్ గా వుంటుంది. కొమ్మూరి సాంబశివరావు రాసిన తెలుగు డిటెక్టివ్ నవలలు కూడా ఇదే టెంప్లెట్ లో వుంటాయి. అగథా క్రిస్టీ ‘పో’ నే ఫాలో అయినా కొంత తేడా చూపిస్తూ ముందడుగేసింది. 1. ఒక హత్య జరుగుతుంది, హెర్క్యూల్ పైరట్ ప్రవేశిస్తాడు, 2. తన చుట్టూ కొందరు అనుమా నితులుంటారు, ప్రశ్నించడం మొదలెడతాడు, 3. ఒకరొకరుగా అనుమానితుల్ని ప్రశ్నిస్తూంటే ఆసక్తికర విషయాలు బయటపడుతూంటాయి, 4. ఎనాలిసిస్ చేసుకోవడం మొదలెడతాడు, 5. అనుమానితుల్లో కొందరి ప్రవర్తన, చర్యలు దృష్టి నాకర్షిస్తాయి, 6. ఇక ఫలానా అనుమానితుడు లేదా అనుమానితురాలు దోషి అని పట్టేసుకుంటాడు, 7. ఆ దోషి ఒక్కరే కావచ్చు, లేదా అనుమానితులందరూ దోషులు కావచ్చు, అసలు హత్య జరిగిందో లేదో కూడా తేలక పోవచ్చు, దోషిని పట్టుకోబోతే హత్యకి గురైన వ్యక్తే సజీవంగా దొరకవచ్చు!

        కానన్ డాయల్  క్లూస్ తో కేసుల్ని పరిష్కరిస్తే, అగథా క్రిస్టీ అనుమానితులతో ఆట చూపిస్తూ సర్ప్రైజ్ ముగింపుల్నిస్తుంది. ఈ తేడా గమనించాలి ఈ జానర్లో. డిటెక్టివ్ సాహిత్యానికి ‘పో’ సహా వీరిద్దరూ స్థిరీ కరించిన ఓవరాల్ జానర్ మర్యాద - రహస్యాన్ని దర్యాప్తు చేసేదే, ఛేదించేదే. ఇందువల్ల  నేర కథల్లో (క్రైం జానర్లో) ఇవి మిస్టరీ సబ్ జానర్లవుతున్నాయి. ఇందులో చివరి వరకూ దోషి ఎవరో తేలదు. దోషిని పట్టుకున్నాక అతడి మీద నేర నిరూపణ చేస్తూ డిటెక్టివ్ అనే వాడు మొత్తం మొదట్నుంచీ కేసు పూర్వాపరాలు పారాయణం చేస్తూ, దోషికాపాదించి తీర్పు చెప్తాడు. అంటే ఏది ఎందుకు జరిగిందో, ఎవరు ఎలా చేశారో చివరి వరకూ కథ పట్టుబడని ప్రక్రియ అన్నమాట. కాన్ఫ్లిక్ట్ తెలిస్తేనే కదా కథేమిటో తెలిసేది. కాన్ఫ్లిక్ట్ ని చివరికి వరకూ తోసేసి డిటెక్టివ్ విప్పి చెప్పినప్పుడు,  ఆ సస్పెన్స్ కథని ఎండ్ సస్పెన్స్ కథ అంటారు. అప్పారావు సుబ్బారావు దగ్గరి కొచ్చి, వచ్చిన పని చెప్పకుండా రెండు గంటలు సోది చెప్పి, చల్లగా ఫిఫ్టీ అప్పడగడాని కొచ్చానని అసలు విషయం చెప్తే, ఈడ్చి కొట్టాలన్పిస్తుంది సుబ్బారావ్ కి. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా?         ఇలా ఎండ్ సస్పెన్స్ కూడా సుబ్బారావ్ సిండ్రోమే. కథేమిటో ముందే కాన్ఫ్లిక్ట్ చూపించకుండా, మూసి పెట్టిన కథ తాలూకు ఏవేవో కథనాలు చూపిస్తే ఎలా అర్ధమయ్యేది. స్క్రీన్ మీద రియల్ టైం స్టోరీ ప్రత్యక్షంగా నడవాలి. ఎండ్ సస్పెన్స్  అప్పటి నవలల్లో కాబట్టి సరిపోయింది. సినిమాల్లో సరిపోవడం లేదని హాలీవుడ్ ఆలస్యంగా గ్రహించింది. చదవడం వేరు, సినిమాగా చూడ్డం వేరు. పైగా సుమారు 1980 ల తర్వాత డిటెక్టివ్ సాహిత్యానికి కాలం చెల్లింది తెలుగు సహా. తరం మారిన నవ పాఠకులకి, నవీన ప్రేక్షకులకి చివరివరకూ కథ తెలియని వాదోపవాదాలేమిటో, ఆ క్లూక్లూ కూడబలుక్కుని ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సాగే, పడక్కుర్చీ మేధావి డిటెక్టివ్ కథలేమిటో నచ్చలేదు. యాక్షన్ తక్కువ, లెక్చర్ లెక్కువ. దీని బదులుగా యాక్షన్ తో కాన్ఫ్లిక్ట్ ఓరియెంటెడ్ గా కథ తెలిసిపోయి, సీన్ టు సీన్ సస్పెన్స్ నే కోరుకున్నారు. దీంతో పోలీస్ డిటెక్టివ్ పాత్రలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలు కేవలం కాల్పనిక సాహిత్యంలో కన్పించేవే. విదేశాల్లో ప్రైవేట్ డిటెక్టివులు సమాజంలో తెలిసిన వ్యక్తులే అయినా, కాల్పనిక కథల్లో అంత పాపులర్ డిటెక్టివులు నిజ జీవితంలో ఎవరూ లేరు. ఇంకా నిజ జీవితంలో మెలిటా నార్వుడ్, వర్జీనియా హాల్, సిడ్నీ రీల్లీ మొదలైన పాపులర్ గూఢచారులున్నారు. ప్రైవేట్ డిటెక్టివులకి దర్యాప్తుల్లో పోలీస్ డిటెక్టివులకున్నంత యాక్సెస్ వుండదు. క్రైం సీన్లోకి కూడా వెళ్ళలేరు. పోలీస్ డిటెక్టివులకి ఫోరెన్సిక్  సైన్స్ కూడా అందుబాటులో వుంటుంది. డిటెక్టివ్ కథలకంటే  పోలీస్ డిటెక్టివ్ కథలు నేటి పాఠకులకి, ప్రేక్షకులకి వాస్తవికంగా అన్పించి వెంటనే కనెక్ట్ అవుతారు కూడా. 

మిస్టరీ కావాలా, థ్రిల్లర్ కావాలా?
        బ్రిటన్నుంచి రచయిత్రి రూత్ రెండెల్  ‘చీఫ్ ఇన్స్ పెక్టర్ రెగ్ వెక్స్ ఫర్డ్’ అనే పోలీస్ డిటెక్టివ్ పాత్రని సృష్టించి బాగా పాపులర్ చేసింది. ఆమెకెప్పుడూ అవార్డులే. 25 అవార్డులు పొందింది. ఈ పోలీస్ డిటెక్టివ్ పాత్రతో 24 నవలలు రాసింది. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్ళు వుంటారు. ఒక కూతురితో సమస్యలే వుంటాయి. ఈ ఫ్యామిలీ సబ్ ప్లాట్ ప్రతీ నవల్లో క్యారీ అవుతూంటుంది.  పోలీస్ డిటెక్టివ్ ని ఫ్యామిలీ మ్యాన్ గా చిత్రించవచ్చు. మామూలు డిటెక్టివ్ కి ఫ్యామిలీ, పెళ్ళాం  పిల్లలూ, పిల్లీ మేకా అంటే కుదరదు. జానర్ మర్యాద కాదు. అతను ఎవర్ గ్రీన్ బ్యాచిలర్ గా తిరుగుతూ వుండాల్సిందే, ఇలాగే స్పై పాత్ర కూడా. తెలుగులో వచ్చిన ఏ డిటెక్టివ్ పాత్రకి కూడా ఫ్యామిలీ వుండదు. రూత్ రెండల్ రాసిన ‘ఎండ్ ఇన్ టియర్స్’ (2005) నవల్లో ఒక యాక్సిడెంట్ కేసు కథ, ఫ్యామిలీ ఉపకథ ఉత్తమంగా వుంటాయి. 

        డిటెక్టివ్ నవలలు పోయి పోలీస్ డిటెక్టివ్ నవలలు రాజ్యమేలుతున్నాయి ఇప్పటికీ కూడా. ఎడ్ మెక్ బెయిన్ ‘87 వ ఏరియా పోలీస్ స్టేషన్’ అని క్రియేట్ చేసి అందులో పోలీస్ డిటెక్టివ్ పాత్రలతో ఎన్నో నవలలు రాశాడు. స్టీవ్ కరెల్లా, అలివర్ వీక్స్, మేయర్ మేయర్ వంటి పోలీస్ డిటెక్టివ్ పాత్రలు పాఠకుల అభిమాన పాత్రలయ్యాయి. స్టీవ్ కరెల్లా చెవిటి మూగని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సినిమాల విషయానికొస్తే ‘ఎల్ ఏ కాన్ఫిడెన్షియల్’, ‘హీట్’, ‘ఇన్ ది హీట్ ఆఫ్ ది నైట్’, ‘ది ఫ్రెంచ్ కనెక్షన్’, ‘డర్టీహేరీ’ సిరీస్, ‘బేవర్లీ హిల్స్ కాప్’ సిరీస్ వంటివెన్నో వచ్చాయి, వస్తున్నాయి. 


     ప్రైవేట్ డిటెక్టివ్ నవలలకీ పోలీస్ డిటెక్టివ్ సినిమాలకీ తేడా ఏమిటంటే, పోలీస్ డిటెక్టివ్ సినిమాలు ఎండ్ సస్పెన్స్ కథల్ని తీసి పక్కన పెట్టాయి, సీన్ టు సీన్ సస్పెన్స్ ని కనిపెట్టాయి. అంటే మిస్టరీ సబ్ జానర్ నుంచి విడిపోయి, క్రైం థ్రిల్లర్ అనే సబ్ జానర్ కి తెర తీశాయి. అంటే పోలీస్ డిటెక్టివ్ కథలు, సినిమాలు క్రైం థ్రిల్లర్సే తప్ప మిస్టరీలు కావన్న మాట.  మాస్ మార్కెట్ అయిన సినిమాల మీద గౌరవముంటే పనికొచ్చే ఈ తేడా గుర్తించాలి. ఈ తేడాతో ఈ క్రైం థ్రిల్లర్ అనే సబ్ జానర్ కి ఎండ్ సస్పెన్స్ కాకుండా, సీన్ టుసీన్ సస్పెన్స్ అనే కథన ప్రక్రియని చేపట్టారు. ఇదెలా వుంటుంది? ఎవరు చంపారో ప్రేక్షకులకి చూపించేస్తారు. పోలీస్ డిటెక్టివులకి తెలియకుండా దర్యాప్తు ప్రారంభిస్తారు. ప్లాట్ పాయింట్ వన్ లేదా ఇంటర్వెల్ కొచ్చేసరికల్లా ఇన్వెస్టిగేషన్ లో డిటెక్టివ్ పోలీసులకి హంతకుడెవరో రివీల్ చేసేస్తారు. ఇక వాణ్ణి పట్టుకోవడానికి యాక్షన్ ప్రారంభిస్తారు. వాడెలా దొరుకుతాడనేది సీను సీనుకీ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ, రియల్ టైంలో లైవ్ కథనం చేస్తారు. ఇందువల్లే ఇది చప్పటి ఎండ్ సస్పెన్స్ కథనం కాకుండా, వేడి పుట్టిస్తూ వుండే  సీన్ టు సీన్ సస్పెన్స్ అయింది. 

        అంటే, మిస్టరీలు కాకుండా వచ్చే అన్ని ఇతర సినిమాల్లో లాగే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరో, ఇంటర్వెల్లోనో కాన్ఫ్లిక్ట్ చూపించేసి కథేమిటో తేలిసేలా చేసేస్తారు. హీరోకి గోల్ ని ఏర్పాటు చేసి, గోల్ కోసం మిడిల్ సంఘర్షణ ప్రారంభిస్తారు. దీనివల్ల మిస్టరీలు తప్ప అన్ని జానర్ల సినిమాల్లో వుండే - కథేమిటో అర్ధమై, ఈ కథెలా ముగుస్తుందన్న ఇన్వాల్వ్ మెంట్ ని క్రియేట్ చేస్తారు. మిస్టరీ లొక్కటే అన్ని జానర్లు, సబ్ జానర్లూ కాదని సినిమాలకి నష్టాన్ని తెచ్చే ఎండ్ సస్పెన్స్ అనే ప్రింట్ మీడియా వ్యాపకంతో వుంటున్నాయి. 

        స్థూలంగా ప్రైవేట్ డిటెక్టివ్ కథలకీ, పోలీస్ డిటెక్టివ్ కథలకీ తేడా ఏమిటంటే, ప్రైవేట్ డిటెక్టివ్ కథలు నేరాన్ని పరిశోధించడం గురించి, పోలీస్ డిటెక్టివ్ కథలు నేరస్థుణ్ణి పట్టుకోవడం గురించి. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చివరి వరకూ నేరస్థుడెవరో (విలన్) తెలియని ఎండ్ సస్పెన్స్ పాసివ్ కథలు, పోలీస్ డిటెక్టివ్ కథలు నేరస్థుడెవరో (విలన్) తెలిసిపోయి వాణ్ణి పట్టుకునే యాక్టివ్ - యాక్షన్ కథలు. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చివరి వరకూ విలనే లేని, ‘నాకో విలన్ కావాలీ’ అని విలన్ ని వెతుక్కుంటున్నట్టు సాగే ఏకపక్ష కథలు, పోలీస్ డిటెక్టివ్ కథలు విలన్ తెరపైకొచ్చి యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేకి తెరతీసే ద్వైపాక్షిక కథలు. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చిట్ట చివరికి డిటెక్టివ్ నేరస్థుణ్ణి కనుగొని, వాడిపై నేరాభియోగం చేసే కేసు పూర్వపరాల పారాయణంతో వుంటాయి, పోలీస్ డిటెక్టివ్ కథలు కేసు పూర్వాపరాలు ప్రేక్షకులకి తెలిసిపోయిన నేపథ్యంలో పారాయణం, ప్రసంగం, పచ్చి పులుసూ లేని పోలీస్ బ్యాంగ్ తో వుంటాయి. మాస్ మార్కెట్ అయిన సినిమాలకి ఏది బావుంటుంది? 

        చిట్టచివరికి సస్పెన్స్ విప్పి మొత్తం కథంతా ఎనాలిస్ చేస్తూ (రివ్యూ రైటర్ రివ్యూ రాసినట్టు), ముందు జరిగిన దృశ్యాల తాలూకు మాంటేజెస్, కట్ షాట్స్ వేస్తూ, ప్రేక్షకులకి గుర్తు చేస్తూ - చూశారా నా టాలెంట్ - అని దర్శకుడు థ్రిల్లానందం పొందవచ్చు, ప్రేక్షకులకది నిద్రానందాం. ఇంతసేపూ విలనెవరో దాచింది గాక, వాడి గురించి కతలు. 


షెర్లాక్ తాతతో సినిమాలు? 
        తెలుగుకి వద్దాం. తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం 1980 లలోనే అంతరించి పోయింది. మధు బాబు యాక్షన్ ఓరియెంటెడ్ అడ్వెంచరస్ షాడో వచ్చేశాడు. కాబట్టి ఇప్పటి తరానికి డిటెక్టివులు తెలియరు. పైగా ఆ డిటెక్టివులు మనకి సాంఘిక మూలాలు లేని, సమాజంలో కన్పించని, కేవలం అప్పట్లో నవలల్లో కన్పించిన కాల్పనిక పాత్రలే. ఇప్పటి మేకర్లు షెర్లాక్ హోమ్స్ కి ఉత్తేజితులై తెలుగులోకి దింపేస్తున్నారు. ప్రైవేట్ డిటెక్టివ్ కథలకీ, పోలీస్ డిటెక్టివ్ కథలకీ సినిమాల కొచ్చేసరికి తేడా లెలా వుంటాయో పైన తెలుసుకున్నాం. హాలీవుడ్ లో ప్రైవేట్ డిటెక్టివ్ సినిమాలొస్తున్నాయి కదా అంటే, వస్తున్నాయి. 2007 లో తీసిన ‘జోడియాక్’ కథని 1960-70 లలో స్థాపించి చూపెట్టారు. అందులో కార్టూనిస్టు అవసరార్ధం డిటెక్టివ్ అవతార మెత్తుతాడు. ఈ పరిశీలనలన్నిటి దృష్ట్యా, తెలుగు సినిమాలకి ఇంకా ప్రైవేట్ డిటెక్టివులే అవసరమో, లేక పోలీస్ డిటెక్టివులు కావాలో ఎవరికివారే నిర్ణయించుకోవాలి.

        తెలుగు సినిమాల్లో పోలీస్ అనగానే ఇంకా అదే మూసలో ఎస్సై పాత్రనే చూపిస్తున్నారు. ఏ కథకైనా ఎస్సైనే. మామూలు పోలీస్ స్టేషన్నుంచి పోలీస్ శాఖలో ఇంకో  విభాగమైన క్రైం బ్రాంచ్ ని తెరపైకి తేవడం లేదు. ఆనాటి డిటెక్టివ్ నవలల్లో డిటెక్టివ్ కి సాయంగా పోలీస్ డిటెక్టివ్ పాత్ర వుండేది. కొమ్మూరి నవలల్లో డిటెక్టివ్ యుగంధర్ పాత్రకి పోలీస్ డిటెక్టివ్ పాత్ర - డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ స్వరాజ్య రావు పాత్ర. సినిమాల్లోకి మాత్రం ఈ సాంఘిక మూలలున్న, ప్రేక్షకులు గుర్తించగల్గే, పోలీస్ డిటెక్టివ్ పాత్రలు దిగిరాలేదు. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ అనే పాత్ర సినిమాల్లో ఎక్కడా చూడం. ప్రభుత్వ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లని వదిలేసి, ఎవరో ప్రైవేట్ డిటెక్టివ్ లంటూ తాతల కాలం నాటి షెర్లాక్ హోమ్స్ ని కాపీ కొడుతూ కృతకంగా తీస్తారట.

        ఈ వ్యాసంలో క్రైం జానర్లో సబ్ జానరైన మిస్టరీ (డిటెక్టివ్) తో, క్రైం జానర్లోనే ఇంకో సబ్ జానరైన క్రైం థ్రిల్లర్ (పోలీస్ డిటెక్టివ్) తోనూ వున్న లాభ నష్టాలు తెలుసుకున్నాం. వచ్చే వ్యాసంలో మిస్టరీని వదిలేసి, క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల్ని విపులంగా చూద్దాం.

సికిందర్
(బయట ఇంకా ఎసైన్ మెంట్స్ పూర్తికానందున
పోస్టులు రెగ్యులర్ గా రావడానికి ఓవర్ టైం చేద్దాం)
(సమయాభావం చేత ఈ వ్యాసం పేజీ మేకప్ కుదరలేదు.
రాత్రికి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేద్దాం)