రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 16, 2024

1424 : రివ్యూ



రచన-దర్శకత్వం : కేవీఆర్ మహేంద్ర
తారాగణం : సూర్య తేజ ఏలే, మీనాక్షీ గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం :  వెంకట్ ఆర్ శాఖమూరి
నిర్మాత: పాయల్ సరాఫ్
విడుదల : ఏప్రిల్ 5, 2024
***
        తెలంగాణ పీరియడ్ సినిమా దొరసాని (2019) దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, ప్రముఖ చిత్రకారుడు ఏలే ధని  కుమారుడు సూర్యతేజని పరిచయం చేస్తూ భరతనాట్యం అనే తెలంగాణ క్రైమ్ కామెడీ తీశాడు. పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ తీసిన కీడాకోలా అనే తెలంగాణ క్రైమ్ కామెడీకి ఒక ప్రత్యేక శైలి వుంది. లాజిక్ ని కామెడీ చేసే మెంటల్ పాత్రలతో కొత్తదనం సంతరించుకుని ఓవర్సీస్ లో కూడా హిట్టయ్యింది. మరి ఈ క్రైమ్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వుంది? దీన్ని ఒకసారి చూడొచ్చా?  చాలా కాలం తర్వాత దర్శకుడి రెండో సినిమా ఏ స్థాయిలో వుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

రాజు సుందరం (సూర్యతేజ) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూంటాడు. రొటీన్ గానే ఇంట్లో కష్టాలకి, గర్ల్ ఫ్రెండ్ (మీనాక్షి గోస్వామి) ని ఒప్పించడానికీ డబ్బులుండవు. డైరెక్టర్ అయిపోదామని కథలు చెప్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తూంటాడు. కథల కోసం మైక్రోఫోన్లు ఏర్పాటు చేసి మనుషుల మాటలు రహస్యంగా వింటూ వాటిని కథలుగా రాస్తూంటాడు. మరోపక్క దివాకర్ (హర్షవర్ధన్) అనే పెద్ద క్రిమినల్ డ్రగ్స్ దందా చేస్తూంటాడు. ఓ రోజు రెండు కోట్ల దందా గురించి మైక్రోఫోన్లో విని, డబ్బు సంపాదనకి ఇదే మార్గమని వాళ్ళ అడ్డాకి వెళ్తాడు రాజు సుందరం. అక్కడ భగతనాట్యం అనే కోడ్ నేమ్ తో డ్రగ్స్ డీల్ జరుగుతూంటే బ్యాగు లాక్కుని పారిపోతాడు. ఆ బ్యాగులో డబ్బులుండవు, డ్రగ్స్ వుంటాయి. ఈ క్రమంలో శకుని (అజయ్ ఘోష్) అనే పోలీసు అధికారికి చిక్కుతాడు. ఇక్కడ్నుంచి బయటపడి డ్రగ్స్ తో ఏం చేశాడు, వాటిని తానే అమ్మి డబ్బు సంపాదించాడా, లేక ఇంకేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

తెలంగాణ ఫీల్ ఏం లేదు గానీ క్రైమ్ కామెడీకి పనికొచ్చే కథే. అయితే చేతిలో వున్నది కథలా భావించి తీయలేదు. ఏదో కాకరకాయ, ఎలా తీసినా క్రైమ్ కామెడీ అయిపోతుంద
నుకుని తీసినట్టుంది. ఇందుకే క్లయిమాక్స్ సహా విషయం ఆషామాషీగా వుంది. డ్రగ్స్ కి పెట్టిన పేరు భరతనాట్యం సెన్సారింగ్ లో భగత నాట్యం అని పలకడంగా మారిపోవడం ఈ కంటెంట్ కి తగిన న్యాయమే. ఫస్టాఫ్ అసలు కథేంటో ఎవరైనా చెప్పగలిగితే  ఈ సినిమా బడ్జెట్ వాళ్ళకి ఇచ్చేయవచ్చు.
       

ఫస్ట్ హాఫ్ అంతా హీరో సినిమా కథలు వినిపిస్తూ చేసే కొత్తదనం లేని కామెడీలు
, విలన్ దివాకర్, అతడి గ్యాంగ్ తో ఇబ్బంది పెట్టే కామెడీలూ సాగుతూ గంటపాటు ఓపికని పరీక్షిస్తూ- ఇంటర్వెల్ కి హీరో చేతికి డ్రగ్స్ రావడంతో ఆసక్తికర మలుపే వస్తుంది.
        
అయితే సెకండాఫ్ లో ఆ డ్రగ్స్ తో హీరో ఏం గేమ్ ఆడుకోవాలో ప్లానింగ్ లేకపోవడంతో తిరిగి సహన పరీక్షగా మారిపోయి ఆశ వదులుకునేలా చేస్తుంది. ఇందులో విలనీలు కూడా పాత సినిమాల్లో సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి విలనీల్లా తీరుబడి డైలాగులతో వుంటాయి. పాత హిందీ సినిమాల్లో విలన్ అజిత్ అనుచరులు మోనా డార్లింగ్, రాబర్ట్ లతో వుండే కామెడీ చాలా పాపులరైంది. ఏ సినిమాలోనైనా విలన్ అజిత్ కి మోనా డార్లింగ్, రాబర్ట్ లు వుండాలల్సిందే. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అజిత్- మోనా డార్లింగ్- రాబర్ట్ లతో కొత్త కొత్త జోకులు పుట్టిస్తున్నారు. వాళ్ళని సజీవంగా వుంచుతున్నారు.
       
ఇలాటి క్రియేటివిటీని ఈ క్రైమ్ కామెడీలో మిస్సయ్యారు.
ముత్యాలముగ్గు లో రావు గోపాలరావుని, జస్టిస్ చౌదరి లో సత్యనారాయణనీ తీసుకుని వాళ్ళ స్టయిల్ విలనీతో ఎంటర్ టైన్ చేసివుంటే ఈ కథ లేని సినిమాకి ఇదే పెద్ద ఆకర్షణ అయ్యేది.  కథ లేని సినిమాగా తీయాలనుకుని వుంటే, కథ లేకుండా  కేవలం క్యారక్టర్లతో ఎలా నడిపారో ఎల్ డొరాడో (1966) అనే కౌబాయ్ క్లాసిక్ చూసి తెలుసుకుని వుండొచ్చు.
        
ఇక షరా మామూలుగా సెకండ్ హాఫ్ ఆ డ్రగ్స్ కోసం, డబ్బుల కోసం అందరూ వెంటబడడం చూసి చూసి వున్నఅరిగిపోయిన  సీన్లే. ఇంతకంటే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ హీరో పాత్రకి క్రియేటివిటీ తెలియకుండా పోయింది. క్వెంటిన్ టరాంటినో తీసిన పల్ప్ ఫిక్షన్ లో ఒక బ్రీఫ్ కేసు కోసం వేట వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో పాత్రలకి తప్ప ప్రేక్షకులకి తెలీదు. చివరికా బ్రీఫ్ కేసు చేజిక్కుంచుకున్న పాత్ర మూత తెరిచి చూస్తే, బ్రీఫ్ కేసులోంచి అతడి మొహం మీద వెలుగు పడుతూంటుంది. తృప్తిగా చూస్తూంటాడు. ఆ ముగింపులో కూడా బ్రీఫ్ కేసులో ఏముందో ఆడియెన్స్ కి చూపించరు. చూపిస్తే డబ్బులో. డ్రగ్సో, వజ్రాలో వుంటే సర్ప్రైజ్ ఏముంటుంది? అందుకే ఇంకేదో గొప్పది వున్నట్టు ప్రేక్షకుల వూహకే వదిలేస్తారు. ఇది కథనంలో ఉపయోగపడే ఒక ప్లాట్ డివైస్ అనీ, దీన్ని మెక్ గఫిన్ అనాలనీ, సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టి చెప్పాడు.

మొత్తానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన కథ ఇలా నడిపిస్తే, ఇక సినిమాలేం తీస్తాడో వూహించాల్సిందే. కొసమెరుపేమిటంటే,  దీనికి పార్ట్ 2 వుంటుందని సూచించారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరోగా సూర్యతేజ యాక్టింగ్ ఫర్వాలేదు, స్పీడుంది. స్పీడుతో ఓవరాక్షన్ చేయకుండా నిగ్రహింఛుకున్నాడు. హీఓయిన్ మీనాక్షి గోస్వామి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ హిందీ, తెలుగు కాలిపి మాట్లాడుతూంటుంది. షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ లా వుంది. సినిమా హీరో అవ్వాలనే పాత్రలో వైవా హర్ష తన అనుభవంతో కామెడీని బాగా హేండిల్ చేశాడు. పోలీసాఫీసర్ గా అజయ్ ఘోష్, విలన్ గా హర్షవర్ధన్ లది పాత కాలపు విలనీ.
        
చాలా పరిమిత బడ్జెట్ తో తీసినట్టున్నారు. ప్రొడక్షన్ క్వాలిటీ గురించి చూడకూడదు. పాటలు ఒక్కటి కూడా కనెక్ట్ కావు. డ్రగ్స్ తీసుకుంటే ఆ మత్తు భరతనాట్యం చేయిస్తుందని చెప్పడం కవి హృదయమేమో.  దీన్ని సెన్సార్ ఖండించి, భగతనాట్యం గా పాత్రల చేత పలికించింది.
—సికిందర్