రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, జూన్ 2016, బుధవారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -15

స్ట్రక్చర్ నేర్చుకునేందుకు  శివ ని ఎంచుకోవడానికి కారణాలు,   ఇది సార్వజనీన ప్రమాణాలతో కూడిన నిర్మాణంతో వుండడం మొదటిదైతే,  ఈ స్క్రీన్ ప్లేలో నేర్చుకోవడానికి సూటి కథకి అడ్డు తగిలే కామెడీ ట్రాకులూ సబ్ ప్లాట్లూ వంటివి లేకపోవడం రెండోది. దీనివల్ల కథ, పాత్రలు ఎలా ప్రయాణిస్తున్నాయో ఏకత్రాటిపై స్పషంగా కన్పిస్తూ, అర్ధం జేసుకోవడానికి సులభంగా వుంది. ఇప్పుడు శివ మిడిల్ విభాగాన్ని ఫాలో అవుతూ దాని నిర్మాణాన్ని చూద్దాం. స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం మిగతా బిగినింగ్ఎండ్ విభాగాలకన్నా పరిమాణంలో రెట్టింపు వుంటుందని తెలిసిందే.  సుమారుగా బిగినింగ్  ఇరవై సీన్లతో  25 శాతం స్క్రీన్ ప్లేని ఆక్రమిస్తే, మిడిల్  నలభై సీన్లతో  50 శాతం స్క్రీన్ ప్లేని ఆక్రమిస్తుంది; అలాగే ఎండ్ మరో ఇరవై సీన్లతో   25 శాతం స్క్రీన్ ప్లే ని ఆక్రమిస్తుంది. మిడిల్ విభాగం ఇంటర్వెల్ కి ముందు ఒకభాగం, ఇంటర్వెల్ తర్వాత ఇంకో భాగంగా వుంటుందని తెలిసిందే.  మొత్తం ఒకేసారి 50 సీన్లతో మిడిల్ భారం మీదేసుకుంటే ఎటునుంచి ఎటుపోవాలో తెలీక కన్ఫ్యూజన్ తో దారి తప్పిపోచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మధ్యలో సూర్యాపేట,  ఆతర్వాత  కోదాడ చేరుకోవాలని తెలీకపోతే గందరగోళమే. హైదరాబాద్ నుంచి సూర్యా పేట చేరుకోకుండా మధ్యలో  నార్కట్ పల్లి దగ్గర రైట్ టర్న్ తీసుకుని అద్దంకి హైవే మీద పడ్డా, లేదా సూర్యా పేట చేరుకుంటూ  అక్కడ్నించీ  కోదాడ వెళ్ళాలని తెలీక   లెఫ్ట్ టర్న్ తీసుకుని  జామ్మని  జనగామ రూట్లో దూసుకుపోయినా తేలేది మరెక్కడో!



కాబట్టి మిడిల్ ఎత్తుకుని క్లయిమాక్స్ దాకా బారుగా వెళ్ళాలంటే ముందుగా పించ్ -1, ఆ తర్వాత ఇంటర్వెల్, ఇంకా తర్వాత పించ్ -2 ల మీదుగా వెళ్ళాలని  తెలుసుకుంటే సీన్లు వేయడం సులభమవుతుంది. ముందుగా మిడిల్ మొదటి భాగాన్ని తీసుకుని, పించ్-1  కి దారి తీసే సీన్లు వేసుకున్నాక, ఆ తర్వాత పించ్- 1 నుంచీ సినాప్సిస్ లో రాసుకున్న ప్రకారం ఇంటర్వెల్ కి దారి తీసే సీన్లు వేసుకోవాలి. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మిడిల్ మొదలైనప్పుడు, అక్కడ్నించీ పించ్- 1 వరకూ ఎన్నైతే సీన్లు వుంటాయో, అవన్నీ పించ్- 1 కి డ్రైవ్ చేసేట్టు చూసుకోవడం ముఖ్యం. అప్పుడు పించ్- 1 నుంచీ సినాప్సిస్ లో  రాసుకున్న ఇంటర్వెల్ కి చేరేలా సీన్లు వేసుకోవాలి. ప్లాట్ పాయింట్ వన్ కీ, ఇంటర్వెల్ కీ మధ్య పించ్- 1 అనేది, ఇంటర్వెల్ ని ప్రేరేపించే ఘట్టం. దీన్ని ఉత్ప్రేరకం -1 అని కూడా అనొచ్చు. కింది పటం ఒకసారి చూడండి.


        ‘శివ’ ని ఆధారంగా చేసుకుని బిగినింగ్ విభాగం సీన్లు  ఎలా వేయాలో స్ట్రక్చర్ ని  గత 5వ  అధ్యాయంలో నేర్చుకున్నాం. ‘శివ’ బిగినింగ్ లో మొత్తం 20 సీన్లున్నాయి. ఇప్పుడు 21 వ సీన్నుంచి మిడిల్ చూద్దాం. ఈ మిడిల్ మొత్తం 52 సీన్లతో వుంది- జేడీని కొట్టినందుకు ప్రిన్సిపాల్ శివని మందలించడం దగ్గర్నుంచీ, సెకండాఫ్ లో చిన్నాకి గణేష్ గురించిన సమాచారం తెలిసే సీను వరకూ. ముందుగా ఇంటర్వెల్  వరకూ 30 సీన్ల స్ట్రక్చర్ నేర్చుకుందాం.

        మిడిల్ వన్ లైన్ ఆర్డర్ :
        21. జేడీ ని కొట్టినందుకు ప్రిన్సిపాల్ శివని మందలించడం, జేడీ చేసే పన్లకి మీరు యాక్షన్ తీసుకోకపోతే  నేనింకేం  చేయాలని శివ అనడం.
        22. క్యాంటీన్లో శివ అండ్ ఫ్రెండ్స్ ఎలక్షన్స్ గురించి చర్చ, ఇంతకాలం ఎదురులేకుండా జేడీ గెలుస్తూ వచ్చాడనీ, ఇప్పుడు శివ నిలబడి వాణ్ణి ఓడించాలనీ ఫ్రెండ్స్ అంటే, కాదని నరేష్ ని నిలబెడదామని శివ నిర్ణయించడం.
        23. జిమ్ లో శివ ఆశాల సరదా రోమాంటిక్ సీను.
        24. జేడీని కొట్టినందుకు కాలేజీ బయట గణేష్ శివకి వార్నింగ్ ఇవ్వడం.
        25. ఫ్రెండ్స్ వచ్చి శివ ని సెకెండ్ షోకి పిలిస్తే రాననడం, ఆశా వచ్చి పిలిస్తే  వెళ్ళడం.
        26. థియేటర్ కి  ఆశా వెంట వచ్చిన శివని చూసి ఫ్రెండ్స్ జోకులెయ్యడం.
        27. థియేటర్ లో  సినిమా చూస్తూ ఆశా డ్రీమ్ సాంగ్.
        28. సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తున్న నరేష్ ని గణేష్ అనుచరులు చంపెయ్యడం.
        29. హాస్పిటల్లో నరేష్ శవాన్ని శివ చూడడడం.
        30. హోటల్ దగ్గర జేడీ మీద శివ ఎటాక్ చేయడం.
        31.  అరెస్టయిన జేడీ ని విడిపించుకోవడానికి నానాజీ రావడం, నానాజీ భవానీ కుడి భుజమని శివకి సీఐ చెప్పడం, అసలు భవానీ ఎవరని శివ అడిగితే, పొలిటీషియన్  మాచిరాజు అనుచరుడని కొంత చరిత్ర విప్పడం.
        32. శివ రౌడీలతో గొడవపడుతున్నాడని వదిన కోపగించుకోవడం, అన్న కూడా మందలించడం.
        33. క్యాంటీన్ లో మూడీ గా వున్న శివని ఆశా టీజ్ చేయడం, తన బర్త్ డే అని చెప్పడం.
        34. శివ, ఆశా రెస్టారెంట్ కి వెళ్ళడం, అక్కడ సాంగ్.
        35. భవానీ ఓపెన్ అవడం, విశ్వనాధంని కలవడానికి బయల్దేరడం.
        36. మాచిరాజు ప్రత్యర్ధి విశ్వనాధం వార్నింగ్ ఇస్తే భవానీ పొడిచి చంపెయ్యడం.
        37. కాలేజీ గోడ మీద ఎలక్షన్లో శివ నిలబడుతున్నట్టు మల్లి రాస్తూంటే, జేడీ చూసి
ఎలర్ట్ అవడం.
        38. జేడీ వెళ్లి భవానీకి ఈ విషయం చెప్పడం, శివ మనకి పనికిరావచ్చనీ, మన తరపున పోటీ చేయమని చెప్పమనీ భవానీ నానాజీతో ఆనడం.
        39. ఈ విషయం  చెప్పడానికి గణేష్ వస్తే శివ కొట్టి పంపించడం.
        40. టైం  చూసి శివని నరికి పారెయ్యమని భవానీ ఆదేశించడం.
        41. భవానీ విశ్వనాధాన్ని ఆధారాలు దొరక్కుండా చంపేశాడనీ, శివ జాగ్రత్తగా ఉండాలనీ సీఐ అనడం, ఆశా కూడా సమర్ధించడం, ప్రతీ వాడూ మనకెందుకని అనుకోబట్టే ఈ పరిస్థితులొచ్చాయని శివ అనడం.
        42. శివకి తన క్లాస్ మేట్ బాషా చెల్లెలి పెళ్లి వుందని తెలియడం.
        43. శివ అతడి ఫ్రెండ్స్ బాషా చెల్లెలి పెళ్ళికి హన్మకొండ  వెళ్తున్నారని భవానికి తెలియడం.
        44. అన్నకూతురికి జ్వరమనీ,  హాస్పిటల్ కి తీసికెళ్ళమనీ శివతో వదిన అనడం.
        45. ఈ పరిస్థితి చెప్పి,  పెళ్ళికి రాలేనని శివ ఫ్రెండ్స్ కి చెప్పడం.
        46. అన్న కూతురితో సైకిలు మీద శివ  హాస్పిటల్ కి బయల్దేరడం.
        47. నానాజీ భవానీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.
        48. శివ ఫ్రెండ్స్ ని  గణేష్ మాటు వేసి చంపేస్తే, శివ మన మీదికి రావచ్చు కాబట్టి,  వాడి ఫ్రెండ్స్ ని మనం చంపామని వాడికి తెలిసేలోగా వాణ్ణి కూడా లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
        49. సైకిల్ మీద పోతున్న శివ ని కారులో భవానీ గ్యాంగ్ ఛేజ్ చేయడం, శివ వాళ్ళని ఎదుర్కోవడం.
        50. హన్మకొండ వెళ్ళే దారిలో శివ ఫ్రెండ్స్ మీద ఎటాక్ జరగడం, మల్లిని గణేష్ చంపెయ్యడం.
        *విశ్రాంతి.
***
      మిడిల్ బిజినెస్ ప్రకారం ఒక గోల్ పెట్టుకున్న హీరో ఆ గోల్ కోసం వ్యతిరేక శక్తులతో/పరిస్థితులతో  సంఘర్షిస్తాడు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ చేపట్టినప్పుడు అందులోంచి పుట్టే కోరిక, రిస్క్, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ ఈ మిడిల్ బిజినెస్ లో వ్యక్తమవుతూ వుంటాయి.  అలాగే ప్లాట్ పాయింట్ వన్ సంఘటనలోనే  ఇంకో నాల్గు సప్లిమెంటరీలు పుట్టుకొస్తాయి,  అవి : పాత్ర చిత్రణలు, ప్రధాన పాత్రకి కల్పించిన అంతర్గత- బహిర్గత సమస్యలు, క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్. ఇవన్నీ మిడిల్లో నడుస్తున్న సీన్లలో కన్పిస్తూ వుండాలి. వీటిలో క్యారక్టర్ ఆర్క్ పడుతూ లేస్తూ వుంటే, టైం అండ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ పైపైకి పోతూ వుండాలి. 

          ముందుగా గోల్ ఎలిమెంట్స్  చూద్దాం : 1. కోరిక : హీరో తన కెదురైన సమస్యని పరిష్కరించడం ద్వారా, తనకో, ఇతరులకో లబ్ది చేకూర్చాలన్న బలమైన కాంక్షని కలిగి వుండడం.

         1. కోరిక : అంతవరకూ కాలేజీలో పరోక్షంగా భవానీ అకృత్యాల్ని భరిస్తూ వచ్చిన శివ, ఇక ప్రత్యక్షంగా అతడితో తలబడాలన్న కోరికతో ఎదురు తిరిగి ఇక్కడ జేడీ మీద దాడి చేశాడు. విద్యా వ్యవస్థలో మాఫియాల జోక్యానికి ముగింపు పలకాలన్న బలమైన కోరిక ఇది. దీన్ని సపోర్టు చేసే సమాచారమంతా మనకి బిగినింగ్ విభాగంలోని సీన్ల ద్వారానే అందింది. కాలేజీలో భవానీ మనుషులు జేడీ సహా ఎలా పీక్కు తింటున్నారో చూశాం. అంతే కాదు, ఇంకో రూపంలో ఈ మాఫియా పడగ నీడ ఇంటిదగ్గర శివ కుటుంబంలోకీ జొరబడిన వైనాన్నికూడా  చూశాం. ఈ నేపధ్య బలంతో పుట్టిన శక్తివంతమైన కోరిక ఇది.

            2. పణం : భవానీ లాంటి కరుడు గట్టిన మాఫియాతో తలపడేందుకు సర్వస్వాన్నీ పణంగా ఒడ్డాడు  శివ. ఇక్కడ్నించీ జీవితం ఓడిడుకుల పాలవుతుందని తెలుసు : విద్యార్ధి జీవితం, కుటుంబ జీవితం కూడా. ఇంకా హీరోయిన్ తో ప్రేమ కూడా రిస్కులో పడవచ్చు. ఇదేమీ అతను  డైలాగుల్లో చెప్పడం లేదు. చెప్పకూడదు కూడా. సన్నివేశంలో ఈ ఫీల్ వ్యక్తమవ్వాలి, అది వ్యక్తమవుతోంది : బిగినింగ్ విభాగంలో మనం చూసిన అతడి అందమైన విద్యార్థి జీవితం లోంచి, అందమైనది కాకపోయినా కమిటైన కుటుంబ జీవితం లోంచీ. ఇక హీరోయిన్ తో గడుపుతున్న జీవితం లోంచి  రిస్కులో పడిన ప్రేమనీ ఫీలవుతున్నాం. 

            3. పరిణామాల హెచ్చరిక : ఏ బ్యాకింగ్ లేనివాడు అంత పెద్ద మాఫియా మీద యుద్ధం ప్రకతించాడంటే ఏంటి పరిస్థితి. బిగినింగ్ విభాగంలో అన్న కూతురితో శివ బాంధవ్యాన్ని చూపించుకు రావడం చూస్తేజరుగనున్న పరిణామాల్లో ఆ అమ్మాయికే ఇందులో కీడు ఎక్కువన్న సంకేతం ఇవ్వకనే ఇచ్చేస్తోందీ గోల్ ఏర్పడే ఘట్టం- మొదటి మూలస్థంభం. 

            4. ఎమోషన్ : పై మూడింటిని గమనంలోకి తీసుకున్న మనం, యాదృచ్ఛికంగా ఎమోషన్ ని ఫీలవుతున్నాం. చాలా బలమైన ఎమోషన్. లాజిక్ తగ్గడమో, ఇంకేదో లోపించడమో జరిగిన నామమాత్రపు ఎమోషన్ కాదు. ఇంత రిస్కు చేస్తున్నందుకు హీరో మీద ప్రేమా సానుభూతీ ఇంకా పెరిగి,  అతడి గోల్ ని మన గోల్ గా ఓన్ చేసుకుని, ఇన్వాల్వ్ మెంట్ తో, కథలో అతను ఇంకా మున్ముందు  కెళ్ళాడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాం.

        పై నాలుగు ఎలిమెంట్స్ బిగినింగ్ విభాగపు కథనంలో ఏర్పాటైతేనే వాటి ఆధారంగా మిడిల్ ముందుకు సాగుతుంది. అంటే సంఘర్షణ మొదలవుతుంది. ఈ సంఘర్షణ హీరోకీ అతడి ఎదుటి పాత్రకీ మధ్య యాక్షన్ రియాక్షన్ల సంకుల సమరంగా సాగుతుంది. ఒక రాయి హీరో వేస్తే, బదులుగా  ఇంకో రాయి ఎదుటి వాడు వేస్తాడు. ఆ దెబ్బ తగిలో తప్పించుకునో హీరో ఇంకో రాయితో సమాధానం చెప్తే,  ఈ దెబ్బ తగిలో తప్పించుకునో ఎదుటి వాడు ఇంకో రాయి విసురుతాడు. ఇద్దరికీ ఒకే పాయింటు మీద పోరాటం జరుగుతూంటుంది. పాయింటు కోసం హీరో, పాయింటుని చెడగొట్టేందుకు ఎదుటు వాడూ...ఈ పోరాటంలో ఒక్కోసారి దెబ్బలు తప్పించుకోలేక గాయాలపాలు కావచ్చు ఇద్దరూ.  దేన్నో, ఇంకెవర్నో   కోల్పోతూ కూడా వుండొచ్చు కూడా. ఇంటర్వెల్ దగ్గరి కొచ్చేసరికి హీరోయే తీవ్రంగా నష్టపోయి దిక్కు తోచని స్థితిలో పడతాడు. ఇదీ ఇంటర్వెల్ వరకూ మిడిల్ మొదటి భాగంలో వుండాల్సిన  బిజినెస్. 

        ఇప్పుడు మిడిల్ మొదటి భాగం సీన్లలో పైవన్నీ ఎలా సర్దుకున్నాయో చూద్దాం-
        పైన పొందుపరచిన మిడిల్ మొదటి భాగం వన్ లైన్ ఆర్డర్ లో 30 సీన్లున్నాయి.
వీటిలో మొదటి సీను (21), అంతకి ముందు ప్లాట్ పాయింట్ వన్ లో జేడీని శివ కొట్టిన ఫలితంగా ప్రిన్సిపాల్ రియాక్షన్ గా వేస్తూ మిడిల్ ప్రారంభించారు. 

        దీని తర్వాత ఇంటర్వెల్ వరకూ 29 సీన్లు రెండు సీక్వెన్సులుగా ఏర్పడ్డాయి. అంటే రెండు టాపిక్స్ మీద నడిచాయి : మొదటి టాపిక్ కాలేజీ ఎలక్షన్స్, రెండో టాపిక్ శివ క్లాస్ మేట్ బాషా చెల్లెలి పెళ్లి. మొదటి టాపిక్ సీక్వెన్సులో 20 సీన్లు, రెండో టాపిక్ సీక్వెన్సులో 9 సీన్లూ వున్నాయి. ఎలక్షన్  అంశం చుట్టూ మొదటి సీక్వెన్స్ శివకీ,  భవానీకీ మధ్య పోరాటాన్ని క్రమంగా పెంచుతూ పోతే, బాషా చెల్లెలి పెళ్లి చుట్టూ రెండో సీక్వెన్స్ ఆ పోరాటాన్ని  ఉధృతం చేసింది. మొదటి సీక్వెన్స్  స్క్రీన్ ప్లే నడకలో పించ్ పాయింట్ -1 దగ్గర ముగిస్తే, ఇంటర్వెల్ కి దారి తీయించే ఆ పించ్ పాయింట్ -1 అక్కడ్నించీ బాషా   చెల్లెలి పెళ్లి సీక్వెన్సు ని ఎత్తుకుని ఇంటర్వెల్ లో ముగించింది నియమాల ప్రకారం.
                                     ***

  మొదటి సీక్వెన్స్                  22. క్యాంటీన్లో శివ అండ్ ఫ్రెండ్స్ ఎలక్షన్స్ గురించి చర్చ, జేడీ మీద శివ పోటీ చేయాలంటే, కాదని నరేష్ ని నిలబెడదామని శివ అనడం.

          23. జిమ్ లో శివ ఆశాల సరదా రోమాంటిక్ సీను.
        24.
జేడీని కొట్టినందుకు కాలేజీ బయట గణేష్ శివకి వార్నింగ్ ఇవ్వడం.
        25.
ఫ్రెండ్స్ వచ్చి శివ ని సెకెండ్ షోకి పిలిస్తే రాననడం, అదే ఆశా వచ్చి పిలిస్తే వెళ్ళడం.
        26. థియేటర్ కి  ఆశా వెంట వచ్చిన శివని చూసి ఫ్రెండ్స్ జోకులెయ్యడం.
        27.
థియేటర్ లో  సినిమా చూస్తూ ఆశా డ్రీమ్ సాంగ్.
        28.
సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తున్న నరేష్ ని గణేష్ అనుచరులు చంపెయ్యడం.
        29.
హాస్పిటల్లో నరేష్ శవాన్ని శివ చూడడడం.
        30.
హోటల్ దగ్గర జేడీ మీద శివ ఎటాక్ చేయడం.
        31
అరెస్టయిన జేడీ ని విడిపించుకోవడానికి నానాజీ రావడం, నానాజీ ఎవరో శివకి సీఐ చెప్పడం, భవానీ బ్యాక్ గ్రౌండ్ కూడా చెప్పడం.
        32.
శివ రౌడీలతో గొడవపడుతున్నాడని వదిన కోపగించుకోవడం, అన్న కూడా శివ ని మందలించడం.         
       
33. క్యాంటీన్ లో మూడీ గా వున్న శివని ఆశా టీజ్ చేయడం, ఈ రోజు తన బర్త్  డే అని చెప్పడం.
       
34. శివ ఆశా రెస్టారెంట్ కి వెళ్ళడం, సాంగ్.
        35.
భవానీ ఓపెన్ అవడం, విశ్వనాథం ని కలవడానికి వెళ్ళడం.
        36.
మాచిరాజు ప్రత్యర్ధి విశ్వనాధం వార్నింగ్ ఇస్తే భవానీ పొడిచి చంపెయ్యడం.
        37. కాలేజీ గోడమీద ఎలక్షన్ లో శివ నిలబడుతున్నట్టు మల్లి నినాదాలు రాస్తూంటే జేడీ చూసి ఎలర్ట్ అవడం.
        38. జేడీ వెళ్లి భవానీకి ఈ విషయం చెప్పడం, జేడీని తప్పించి,  శివని మన తరపున పోటీ  చేయాల్సిందిగా కోరమని గణేష్ ని భవానీ ఆదేశించడం.

       
39. ఈ రాయబారంతో గణేష్  వెళ్తే శివ కొట్టి పంపించడం.
        40. ఇక టైం చూసి, శివ ని ఫ్రెండ్స్ తో బాటు చంపెయ్యమని భవానీ ఆదేశించడం. 

       
ఈ సీక్వెన్సులో కథని ప్రధాన పాత్ర శివే యాక్టివ్ గా వుండి నడిపిస్తున్నాడని గమనించాలి. కథ బోరుకొట్టకుండా వుండాలంటే ప్రధాన పాత్రే  కథని నడపాలి. ఎత్తుకోవడమే ఎలక్షన్ తో మొదలు పెట్టి, కాలేజీ చరిత్రలో మొట్ట మొదటి సారిగా జేడీకి నరేష్ ని పోటీ పెట్టించి,  ప్రేక్షకుల దృష్టిలో భవానీకి మళ్ళీ సవాలు విసిరాడు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జేడీ ని కొట్టి సవాలు విసిరింది గాక, వెంటనే మళ్ళీ ఇంకో సవాలుకి సిద్ధమవుతున్నాడు. ఇలా కాకుండా జేడీని కొట్టేశాం కదా, ఇంకేముంది మన జోలికెవడూ రాడనేసి, ఆశాతో శివ లవ్ ట్రాక్ మొదలెట్టుకో లేదు. ఆ లవ్ ట్రాక్ లో కామెడీలూ డ్యూయెట్టూ అయిపోయాక,  స్వయంగా భావానీయే కథని గుర్తు చేస్తూ శివకి గట్టి బ్యాంగ్ నివ్వలేదు. అప్పుడు శివ తెలివి తెచ్చుకుని భవానీ మీది కెళ్ళలేదు. ఇలా జరిగివుంటే శివ ఉత్త పాసివ్- రియాక్టివ్ పాత్ర అయిపోయేవాడు. 

        జేడీ ని కొట్టినందుకు రియాక్షన్ గా గణేష్ కాలేజీకి శివ దగ్గరి కొస్తాడు. ఇది మొదటి సారి ఇద్దరూ ముఖా ముఖీ అవడం, దీన్ని గుర్తు పెట్టుకుని ఒక టెర్రిఫిక్ షాట్ తో రిజిస్టర్ చేస్తాడు దర్శకుడు. శివతో గణేష్ బచ్చా గాడనుకుని తేలిగ్గా మాట్లాడతాడు. బుద్ధిగా చదువుకోమంటాడు. భవానీ సంగతి నీకు తెలీదు, నరేష్ ని విత్ డ్రా చేసుకోమంటాడు. అప్పుడు శివ- ఇంకా నరేష్ ని నిలబెట్టాలని ఖచ్చితంగా అనుకోలేదు,ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను నువ్వొచ్చాక. భవానీ గాడు ఏమైనా చెప్పానుకుంటే వాణ్ణి వచ్చి చెప్పమను, నీలాటి చెంచా గాళ్ళని పంప వద్దని చెప్పు- అంటాడు. దీంతో జేడీకి మండిపోయి కొట్టబోతాడు. గణేష్ ఆపి- చిన్న వయసుకదా కొంచెం పొగరెక్కువ, మళ్ళీ కలుద్దాం - అనేసి వెళ్ళిపోతాడు. 

        ఈ సీన్లో ప్రధానంగా  గమనించాల్సిందేమిటంటే, శివ భవానీకే నేరుగా సవాలు విసురుతున్నాడు- బచ్చాగాళ్ళతో పెట్టుకోదల్చుకోలేదు. అంటే భవానీ కంటే తనే ఎక్కువ అనే సంకేతాలిస్తున్నాడు. భవానీ గాడూ అంటూ నిర్లక్ష్యంగా సంబోధిస్తూ రెచ్చ గొడుతున్నాడు పరిణామాల్ని లెక్క చెయ్యకుండా. తనకి చెంచాగాళ్ళతో  బచ్చాగాళ్ళతో  పని లేదు- భవానీ గాడు ఏమైనా చెప్పానుకుంటే వాణ్ణి వచ్చి చెప్పమను - అనేశాడు. అంటే,  కథ హీరోకీ విలన్ కీ మధ్య అయినప్పుడు అది వెంటనే డైరెక్టుగా మొదలై పోవాలి. ఇంకా చల్లకొచ్చి ముంత దాచడమనే  వ్యవహార ముండకూడదు. ఇప్పుడు చాలా  సినిమాల్లో చూపిస్తున్నట్టు- విలన్ చాటుగా వుంటే,  క్లయిమాక్స్ వరకూ హీరో అతడి బచ్చాలతోనే పోరాడుతూ వుండడ మనే నాన్చుడు, బలహీన, పాసివ్  వ్యవహారం ఇక్కడ లేదు.

        రెండో దేమిటంటే, శివ అన్న మాటలకి జేడీని ఆపకుండా గణేష్ ఫైటింగ్ మొదలెట్టేసి వుంటే, ఈ సీనులో  కథని నిలబెట్టే సస్పెన్స్ మిగిలేది కాదు. ఫైట్ చేయడం కంటే, చిన్న వయసుకదా కొంచెం పొగరెక్కువ, మళ్ళీ కలుద్దాం - అనేసి గణేష్ వెళ్ళిపోవడం సెన్సాఫ్ డేంజర్ ని పెంచింది. అలా వెళ్ళిన గణేష్ వూరుకోడని, ఇంకేదో చేస్తాడని  మనకి తెలుసు.  ఆ  ప్రమాదాన్ని శివ ఎలా ఎదుర్కొంటాడనే ఉత్కంఠ ఇక్కడ పుడుతోంది. ఇలా సీక్వెన్సులో ఈ మొదటి సీన్లోనే శివ క్యారక్టర్ ఆర్క్ పైకి లేవడమేగాక, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ కూడా పైకి లేచింది టెన్షన్ ని పెంచేస్తూ. 

        సీక్వెన్స్ ఎత్తుగడని ఇలా ఎస్టాబ్లిష్ చేశాక, ఇంకా వాదోపవాదాలు పెట్టుకోలేదు. నేరుగా యాక్షన్లో కెళ్ళిపోయే సీన్లు మొదలయ్యాయి. 25 నుంచీ 30 వ సీను వరకూ శివ ఆశాతో ఫ్రెండ్స్ తో సినిమా కెళ్ళడం, సినిమా చూసి ఒంటరిగా తన గదికి వెళ్తున్న నరేష్ ని గణేష్ గ్యాంగ్ మాటువేసి చంపెయ్యడమూ, హాస్పిటల్లో నరేష్ శవాన్ని చూసి శివ చలించడమూ, అక్కడ మల్లి సమాచారమివ్వడమూ జరుగుతాయి. తాము సినిమా కెళ్ళి నట్టు జేడీకి తెలిసి గణేష్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్తాడు మల్లి. 

        శివ ఇక్కడ తను చేపట్టిన గోల్ తాలూకు పరిణామాల హెచ్చరిక వాస్తవ రూపం దాల్చడం మొదటి సారిగా ప్రత్యక్షంగా చూశాడు. తను ఒక మిత్రుణ్ణి కోల్పోయాడు. యాక్షన్ = ఎలక్షన్ లో నరేష్ ని నిలబెడుతున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు సీక్వెన్స్ ఎత్తుగడలో శివ గణేష్ కి సవాలు విసిరాడు; దీని రియాక్షన్ = గణేష్ నరేష్ ని చంపేశాడు.  సవాలు విసిరినప్పుడు గణేష్ శివతో దెబ్బలాటకి దిగకుండా సైలంట్ గా వెళ్ళిపోయాడు. దెబ్బలాటకి దిగివుంటే నరేష్ కి కాలేజీలో మద్దతు పెరిగి ఎలక్షన్ గెలుస్తాడనేమో, ఇలా గుట్టుగా మట్టు బెట్టేసి ఎలక్షన్లో అడ్డు తొలగించుకున్నాడు. వ్యూహాలు ప్రతివ్యూహాలుగా వాస్తవిక ధోరణిలో ఈ కథ నడుస్తోంది. 

        నరేష్ హత్యకి యాక్షన్ గా శివ వెళ్లి జీడీని కొడతాడు. పోలీసులు వచ్చి జేడీని అరెస్టు చేస్తారు. పోలీస్ స్టేషన్ కి భవానీ కుడి భుజం నానాజీ వచ్చి బెయిలు మీద జేడీ ని విడిపించుకుపోతాడు. అక్కడే శివ ఆశా వుంటారు. నానాజీ అనుచరుడు ‘శివ అంటే అతనే’  అని నానాజీకి శివని చూపిస్తాడు. శివకి మొదట గణేష్ తెలిశాడు, ఇప్పడు నానాజీ తెలు స్తున్నాడు. నానాజీ వెళ్ళిపోతూ శివ మీద ఓ లుక్కేస్తాడు. ఇలా ఈ సీను కూడా కథని పెంచుతోంది. 

        ఇప్పటివరకూ భవానీ ప్రేక్షకులకి కన్పించలేదు. అతడి గురించి పాత్రలు అనుకుంటూ ప్రేక్షకులకి ఆసక్తి పెంచడమే జరుగుతోంది. ఇక్కడ శివ అసలీ భవానీ ఎవరని సీఐని అడిగేసరికి,  భవానీ బ్యాక్ గ్రౌండ్ తెలుస్తుంది. ఒకప్పుడు బస్టాండు కూలీగా వుండే భవానీ రౌడీయిజంలోకి దిగి, మాచిరాజు దృష్టిలో పడి అతడి రాజకీయ అవసరాలకి ఉపయోగపడుతున్నాడని సీఐ చెప్తాడు. అంటే శివ భావానీతోనే  కాదు, మాచిరాజు అనే పవర్ఫుల్ పొలిటీషియన్ తో కూడా తలపడాలని సూచనలందాయి. కథ ఇంకా చిక్కన
వుతోంది. కథ మొదటినుంచీ విడతల వారీగా భవానీ గురించి ఇస్తూ వస్తున్న వివరణ పర్వం (ఎక్స్ పొజిషన్) ఇక్కడ కొలిక్కి వచ్చింది. ఇంకా ముందు సీన్లలో భవానీ గురించి చెప్పుకోవడాని కేమీ లేదు- ఇక అతను ఓపెన్ అవడానికి రంగం సిద్ధమయ్యింది.
        భవానీ గురించి సీఐ వివరాలు చెప్పాక, తర్వాతి 32వ సీనులో శివ ఇంటి కొస్తాడు. ఇక్కడ వదిన రుసరుస లాడుతూంటుంది- పోలీస్ స్టేషన్ కెక్కాడనీ, రౌడీ లతో దెబ్బ లాడుతున్నాడనీ. అన్న మరో సారి మందలిస్తాడు. శివ అదే మౌనంతో ఉంటాడు. బిగినింగ్ విభాగం నుంచీ  శివకి ఇంట్లో వదినతో సమస్య వుందని చూపిస్తూ వచ్చారు. ఇది అంతర్గత సమస్య. బహిర్గత సమస్య భవానీ. పోలీస్ స్టేషన్ లో భవానీతో బహిర్గత సమస్య తాలూకు సీను అయిపోయాక, వెంటనే వదినతో అంతర్గత సమస్య తాలూకు సీను వేయడం మంచి డైనమిక్స్. డైనమిక్స్ అంటే పరస్పర వ్యతిరేకమైన పరిస్థితుల్ని బొమ్మాబొరుసులుగా చూపిస్తూ పోవడమే.         ఇదిమంచి కథన పధ్ధతి కింది కొస్తుంది. 

        ఇప్పుడొకసారి బిగినింగ్ విభాగం లోకి వెళ్దాం. బిగినింగ్ విభాగంలో ఇంకేమేం మిగిలున్నాయి ముందుకు  నడిపించడానికి? శివ, అతడి ఫ్రెండ్స్, ఆశా, సీఐ మిడిల్ లోకి ట్రావెల్ అయ్యారు. జేడీ, గణేష్ కూడా ట్రావెల్ అయ్యారు. భవానీ గురించిన ఎక్స్ పొజిషన్ కూడా మిడిల్లోకి ట్రావెల్ అయ్యింది; అన్నావదినలూ  వాళ్ళ కూతురు కూడా మిడిల్లోకి ట్రావెల్ అయ్యారు. ఇక లెక్చరర్, ప్రిన్సిపాల్ లకి ఇంకా కథతో పనిలేదు కాబట్టి అక్కడే ఆగిపోయారు. 

        భవానీ ఎక్స్ పొజిషన్ తో బాటు, శివ అంతర్గత- బహిర్గత సమస్యలూ తెగిపోకుండా మిడిల్లోకి బదలాయింపు అయి కొనసాగుతున్నాయి. ఈ మూడూ కూడా ఎమోషన్స్.  ఇవి శివ క్యారక్టర్ ఆర్క్ ఉత్థాన పతనాలతో బాటు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ కీ అక్కరకొస్తున్నాయి.  తెర మీద సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పడిపోకుండా,  సీన్లు ఈ టైం అండ్ టెన్షన్ గ్రాఫ్  ని పోషిస్తున్నాయి. 

        కాబట్టి ఇక బిగినింగ్ విభాగంలో బ్యాలెన్స్ ఏమీ లేదు. ఇక కథ కోసం వెనక్కి చూడకుండా, బిగినింగ్ ని మర్చిపోయి, పూర్తిగా మిడిల్ మొదటి భాగంపై దృష్టిని కేంద్రీ కరించడమే.

        ఇక ఇంట్లో తీవ్రతరమవుతూన్న పరిస్థితికి మూడీగా మారి పోయిన శివని,  ఆశా టీజ్ చేసి మూడ్ మార్చేస్తుంది. ఇప్పుడు తాజాగా శివ పాత్ర వున్న ఈ మానసిక స్థితికి ఆశా దృష్టికోణంలో ఆమెకా చిలిపి ప్రవర్తన అవసరమే. ఏదో ప్రేక్షకులకి ఒక పాట కోసం సమయమైంది కాబట్టి దానికేదో లీడ్ వేయలేదు. లవ్ సాంగ్ అనే effect అవసరమే,  దీని cause కూడా అర్ధవంతంగా వుండాలి- అది పాత్రల్లోంచి, కథలోంచి పుడితే వాటిని ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.  

        ఈ పాట అయిపోగానే మనం చాలా సేపు పనిచేసిన కంప్యూటార్ లో రీఫ్రెష్ బటన్ నొక్కినట్టు,  కథనాన్ని ఛేంజ్ ఓవర్ తో రీఫ్రెష్ చేసుకోవాలి. అలా రిఫ్రెష్ చేసినప్పుడు కథనంలో మళ్ళీ పాత విషయం, మళ్ళీ పాత పాత్ర రాకూడదు. కొత్త విషయంతో కొత్త పాత్ర రావాలి. డైనమిక్స్ అంటే ఇది కూడా. అలా బిగినింగ్ నుంచీ ఎక్స్ పొజిషన్ లో నలుగుతూన్న విలన్ భవానీ పాత్ర,  ఈ 35 సీన్లో తెరపైకి వస్తాడు. ఇప్పటికి సమయం 52 వ నిమిషం. ‘షోలే’ లో కూడా గబ్బర్ సింగ్  ఎక్స్ పొజిషన్లో నలిగీ నలిగీ గంట తర్వాత కన్పిస్తాడు. 

        భవానీ పాత్ర పరిచయం ఇంత వరకూ పరోక్షంగా అయింది. ఇప్పుడు ప్రత్యక్షంగా అవుతోంది. అవుతూనే ‘ఎవడ్రా ఆ శివ గాడూ?’ అని కేకలేయలేదు. అప్పుడిది పాత్ర ప్రత్యక్ష పరిచయ సీను అవదు, పరిచయానంతర సీనులా వుంటుంది.  అందుకని విశ్వనాధం మనిషి అతడి దగ్గరికి వచ్చి విశ్వనాథం కలవాలనుకుంటున్నట్టు చెప్పడంతో, ఈ ప్రత్యక్ష పరిచయ సీను అర్ధవంతంగా ప్రారంభమవుతుంది. మనకి భవానీకీ  శివకీ మధ్య నడుస్తున్న కథ మాత్రమే తెలుసు. కానీ భవానీ గురించి చివరి ఎక్స్ పొజిషన్ లో (31 వ సీన్ లో) భవానీ గాడ్ ఫాదర్ మాచిరాజు ప్రస్తావనతో కథ ఇంకో  లెవెల్ పైకి వెళ్ళింది. కాబట్టి దీని కంటిన్యుటీగా ఇక్కడ ప్రత్యక్ష పరిచయ  సీను పడాలి. విశ్వనాథం మనిషి భవానీ దగ్గరికి రావడంతో ఈ ప్రత్యక్ష పరిచయ సీను ప్రారంభం. విశ్వనాథాన్ని కలవడానికి భవానీ ఒక స్పాట్ కి వెళ్తాడు. అక్కడ తేడాలొచ్చి తన గాడ్ ఫాదర్ అయిన మాచిరాజు రాజకీయ ప్రత్యర్థి  విశ్వనాథాన్ని, మాచిరాజు శ్రేయస్సు దృష్ట్యా పొడిచి చంపేస్తాడు భవానీ. ఇంత గురు భక్తి ప్రదర్శించుకున్న భవానీ మాచిరాజుతో ఏమనుభవించాలో అదే అనుభవించి తీరతాడు చివరికి. ఇలాటి జీవితాలు ఇలాగే వుంటాయి. ఇదింకో డైనమిక్స్ తో కూడిన పాత్రచిత్రణ. 

        ఇదయ్యాక ఇప్పుడు ప్రధాన కథలోకి భవానీని రప్పిస్తాడు శివ- ఎలక్షన్లో తనే నిలబడుతున్నట్టు మళ్ళీ గోడమీద రాయడంతో అది చూసి జేడీ వెళ్లి భవానీకి చెప్పడంతో.

        సీన్ 38 : విషయం చెప్పిన జేడీని బయటికి పంపించేసి, నానాజీతో చాలా వ్యూహాత్మకంగా మాట్లాడతాడు భవానీ : “నానాజీ, ఈ జేడీ  ప్రతిదానికీ మన హెల్ప్ అడుగుతాడు? ఈ స్టూడెంట్ లీడర్లు మనకి బలం అవాలి గానీ, మన బలం మీద వీళ్ళు  బ్రతక్కూడదు. వాడు చెప్పిందాన్ని బట్టి ఈ శివ అంత తేలిగ్గా కొట్టి పారేసే వాళ్ళాలేడు... సరీగ్గా వాడుకుంటే మనకి పనికి రావచ్చు... నువ్వొక పనిచెయ్ (గణేష్ తో-)  వెళ్లి అతణ్ణి కలువ్. ఎలక్షన్ లో నిలబడమని చెప్పు, కానీ మన తరపున”  

       
దీంతో భవానీ ఎంత యూజ్ అండ్ థ్రో టైపో తెలిసిపోతోంది. జేడీని కరివేపాకులా తీసి పారేశాడు. ఇప్పుడు శత్రువైనా సరే, తనక్కావాల్సింది వ్యాపారాభివృద్ధి కాబట్టి శివకి గాలం వేస్తున్నాడు- జేడీకి హేండిచ్చి శివని ఎలక్షన్లో నిలబెట్టాలని ఆలోచన చేశాడు. జేడీకి రుచి చూపిస్తున్న ఇదే యూజ్ అండ్ థ్రో పాలసీని, మాచి రాజు నుంచి తను కూడా రుచి చూడ బోతున్నాడు చివర్లో భవానీ!

        ఇలా పాత్రచిత్రణలూ డైనమిక్స్ కలిసి కథని సజీవం చేస్తాయి. వెనకటి యాక్షన్-  రియాక్షన్ ల ప్లేలో నరేష్ ని చంపించినందుకు గాను యాక్షన్ తీసుకుని శివ జేడీ ని కొట్టాడు, అరెస్టయిన జేడీ రియాక్షన్ గా బెయిలు మీద విడుదలైపోయాడు. దీనికి యాక్షన్ గా శివ ఎన్నికల్లో నిలబడుతున్నట్టు మల్లి గోడ మీద రాశాడు. దీనికి రియాక్షన్ గా జేడీ వెళ్లి భవానీకి చెప్పాడు, దీనికి రియాక్షన్ గా భవానీ శివతో బేరసారాలకి దిగాడు. ఈ బేర సారాలకి గణేష్ తనదగ్గరికొస్తే ఇప్పుడు ఇంకో యాక్షన్ గా శివ గణేష్ ని కొట్టి పంపిస్తాడు.   

        దీనికి రియాక్షన్ భవానీ చూపిస్తాడు : “నానాజీ, ఈ వూళ్ళో మనమేం చేసినా చెల్లుతోందంటే, జనానికి మనమంటే భయం గనుక. ఇప్పుడెవడో శివ అనేవాడు, పది మందిలో గణేష్ ని కొట్టాడని తెలిసికూడా నేనేం చేయలేదనుకో, జనానికి మనమంటే భయం తగ్గుతుంది. అడ్డమైన వాడూ ఎదురు తిరుగుతాడు. కానీ మనకు బలముందని వెనకా ముందూ చూడకుండా తొందర పడకు. వాడి మీద ఓ కన్నెసి వుంచు, కరెక్ట్ టైం చూసి వాణ్ణీ వాడి ఫ్రెండ్స్ నీ నరికి పారేయ్!”
        దీంతో ఈ సీక్వెన్స్ ముగుస్తుంది.  
       పై సీక్వెన్స్ ని జాగ్రత్తగా గమనిస్తే,  ఇందులో బిగినింగ్- మిడిల్-ఎండ్ విభాగాలు కన్పిస్తాయి.. మొత్తంగా ఒక స్క్రీన్ ప్లే ఎలాగైతే  బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలుగా వుంటుందో, ఈ విభాగాల్లో వుండే సీక్వెన్సులు కూడా  వాటి బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలతో వుంటాయి. మళ్ళీ  ఈ సీక్వెన్సుల్లో  వుండే ఒక్కో సీనూ వాటి బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలతో వుంటుంది.  స్క్రీన్ ప్లే పటిష్టంగా వుండాలంటే ఈ ఏర్పాటు తప్పనిసరి. జానర్ తో సంబంధం లేకుండా ఏ కథయినా సీక్వెన్సులతోనే వుంటుంది : ఫస్టాఫ్ లో నాలుగు సీక్వెన్సులు, సెకండాఫ్ లో ఇంకో నాలుగు సీక్వెన్సులు మొత్తం 8 సీక్వెన్సులు వుంటాయి.  అంటే స్క్రీన్ ప్లే బిగినింగ్ లో రెండు, మిడిల్ మొదటి భాగంలో రెండు, మిడిల్ రెండో భాగంలో మరో రెండు, ఎండ్ లో ఇంకో రెండూ వుంటాయి. 

        శివ మిడిల్ మొదటి భాగంలో రెండు సీక్వెన్సులు గమనించాం- ఒకటి ఎలక్షన్ టాపిక్ తో, రెండు బాషా చెల్లె పెళ్లి టపిక్ తో. 

        మొదటి సీక్వెన్స్ (22 నుంచి 40వ సీను వరకు)  పైన విశ్లేషించాం. ఇది సీక్వెన్స్ గా ఎలా నిర్మాణమై వుందో ఈ కింద చూద్దాం : 

బిగినింగ్: ఎత్తుగడతో సాధారణ స్థితి :
       
22. క్యాంటీన్లో శివ అండ్ ఫ్రెండ్స్ ఎలక్షన్స్ గురించి చర్చ, జేడీ మీద శివ పోటీ చేయాలంటే, కాదని నరేష్ ని నిలబెడదామని శివ అనడం.
          23. జిమ్ లో శివ ఆశాల సరదా రోమాంటిక్ సీను.
        24.
జేడీని కొట్టినందుకు కాలేజీ బయట గణేష్ శివకి వార్నింగ్ ఇవ్వడం.
        25.
ఫ్రెండ్స్ వచ్చి శివ ని సెకెండ్ షోకి పిలిస్తే రాననడం, అదే ఆశా వచ్చి పిలిస్తే వెళ్ళడం.
        26. థియేటర్ కి  ఆశా వెంట వచ్చిన శివని చూసి ఫ్రెండ్స్ జోకులెయ్యడం.
        27.
థియేటర్ లో  సినిమా చూస్తూ ఆశా డ్రీమ్ సాంగ్.
        28.
సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తున్న నరేష్ ని గణేష్ అనుచరులు చంపెయ్యడం.

 మిడిల్ – హత్యతో అసాధారణ స్థితి- సంఘర్షణ :
       
29. హాస్పిటల్లో నరేష్ శవాన్ని శివ చూడడడం.
        30.
హోటల్ దగ్గర జేడీ మీద శివ ఎటాక్ చేయడం.
        31
అరెస్టయిన జేడీ ని విడిపించుకోవడానికి నానాజీ రావడం, నానాజీ ఎవరో శివకి సీఐ చెప్పడం, భవానీ బ్యాక్ గ్రౌండ్ కూడా చెప్పడం.
        32.
శివ రౌడీలతో గొడవపడుతున్నాడని వదిన కోపగించుకోవడం, అన్న కూడా శివ ని మందలించడం.         
       
33. క్యాంటీన్ లో మూడీ గా వున్న శివని ఆశా టీజ్ చేయడం, ఈ రోజు తన బర్త్  డే అని చెప్పడం.
       
34. శివ ఆశా రెస్టారెంట్ కి వెళ్ళడం, సాంగ్.
        35.
భవానీ ఓపెన్ అవడం, విశ్వనాథం ని కలవడానికి వెళ్ళడం.
        36.
మాచిరాజు ప్రత్యర్ధి విశ్వనాధం వార్నింగ్ ఇస్తే భవానీ పొడిచి చంపెయ్యడం.
        37. కాలేజీ గోడమీద ఎలక్షన్ లో శివ నిలబడుతున్నట్టు మల్లి నినాదాలు రాస్తూంటే జేడీ చూసి ఎలర్ట్ అవడం.

          ఎండ్ – పరిష్కారం :

        38. జేడీ వెళ్లి భవానీకి ఈ విషయం చెప్పడం, జేడీని తప్పించి,  శివని మన తరపున పోటీ  చేయాల్సిందిగా కోరమని గణేష్ ని భవానీ ఆదేశించడం.

       
39. ఈ రాయబారంతో గణేష్  వెళ్తే శివ కొట్టి పంపించడం.
        40. ఇక టైం చూసి, శివ ని ఫ్రెండ్స్ తో బాటు చంపెయ్యమని భవానీ ఆదేశించడం.
        కథలో ఒక్కో సీక్వెన్స్ ఎక్కడ్నించి ఎక్కడి దాకా వుందో గుర్తించి,  దాన్ని పై విధంగా విభజించుకుని ఆర్డర్  వేసుకుంటే సులభంగా వుంటుంది, ఏ సీను తర్వాత ఏమిటనే గందరగోళం వుండదు.

     రెండో సీక్వెన్స్ భాషా చెల్లెలి పెళ్లి టాపిక్ తో  సీన్లు ఇలా వున్నాయి :


41. భవానీ విశ్వనాధాన్ని ఆధారాలు దొరక్కుండా చంపేశాడనీ, శివ జాగ్రత్తగా ఉండాలనీ సీఐ అనడం, ఆశా కూడా సమర్ధించడం, ప్రతీ వాడూ మనకెందుకని అనుకోబట్టే ఈ పరిస్థితులొచ్చాయని శివ అనడం. 
        42. శివకి తన క్లాస్ మేట్ బాషా చెల్లెలి పెళ్లి వుందని తెలియడం.
        43. శివ అతడి ఫ్రెండ్స్ బాషా చెల్లెలి పెళ్ళికి హన్మకొండ  వెళ్తున్నారని భవానికి తెలియడం.
        44. అన్నకూతురికి జ్వరమనీ,  హాస్పిటల్ కి తీసికెళ్ళమనీ శివతో వదిన అనడం.
        45. ఈ పరిస్థితి చెప్పి,  పెళ్ళికి రాలేనని శివ ఫ్రెండ్స్ కి చెప్పడం.
        46. అన్న కూతురితో సైకిలు మీద శివ  హాస్పిటల్ కి బయల్దేరడం.
        47. నానాజీ భవానీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.
        48. శివ ఫ్రెండ్స్ ని  గణేష్ మాటు వేసి చంపేస్తే, శివ మన మీదికి రావచ్చు కాబట్టి,  వాడి ఫ్రెండ్స్ ని మనం చంపామని వాడికి తెలిసేలోగా వాణ్ణి కూడా లేపెయ్యమని భవానీ ఆదేశించడం. 
        49. సైకిల్ మీద పోతున్న శివ ని కారులో భవానీ గ్యాంగ్ ఛేజ్ చేయడం, శివ వాళ్ళని ఎదుర్కోవడం. 
        50. హన్మకొండ వెళ్ళే దారిలో శివ ఫ్రెండ్స్ మీద ఎటాక్ జరగడం, మల్లిని గణేష్ చంపెయ్యడం.

          పై సీన్లు ఏవి ఎందుకున్నాయో సులభంగా అర్ధమైపోతున్నాయివేరే విశ్లేషణ అవసరం లేదుమొదటి సీక్వెన్స్ ముగింపులో శివనీఫ్రెండ్స్ నీ చంపెయ్యమని భవానీ ఆదేశించిన నేపధ్యంలోబాషా చెల్లెలి పెళ్లి టాపిక్ తో ఈ రెండో  సీక్వెన్స్  ప్రారంభ
మయ్యిందిఈ సీక్వెన్స్ స్క్రీన్ ప్లేలో పించ్ -1 దగ్గర మొదలయ్యిందిసహజంగానే ఇంటర్వెల్ కి దారి తీసిందిమల్లి హత్యతో ఈ సీక్వెన్స్ ముగుస్తూ ఇంటర్వెల్ పడింది.

          
ఈ సీక్వెన్స్ నిర్మాణం ఇలా వుంది :  
 బిగినింగ్ -సాధారణ స్థితి : 
          41. భవానీ విశ్వనాధాన్ని ఆధారాలు దొరక్కుండా చంపేశాడనీ, శివ జాగ్రత్తగా ఉండాలనీ సీఐ అనడం, ఆశా కూడా సమర్ధించడం, ప్రతీ వాడూ మనకెందుకని అనుకోబట్టే ఈ పరిస్థితులొచ్చాయని శివ అనడం.
        42. శివకి తన క్లాస్ మేట్ బాషా చెల్లెలి పెళ్లి వుందని తెలియడం.
        43. శివ అతడి ఫ్రెండ్స్ బాషా చెల్లెలి పెళ్ళికి హన్మకొండ  వెళ్తున్నారని భవానికి తెలియడం.
        44. అన్నకూతురికి జ్వరమనీ,  హాస్పిటల్ కి తీసికెళ్ళమనీ శివతో వదిన అనడం.
        45. ఈ పరిస్థితి చెప్పి,  పెళ్ళికి రాలేనని శివ ఫ్రెండ్స్ కి చెప్పడం.

మిడిల్ – అసాధారణ సత్తి- సంఘర్షణ : 
        46. అన్న కూతురితో సైకిలు మీద శివ  హాస్పిటల్ కి బయల్దేరడం.
        47. నానాజీ భవానీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.
        48. శివ ఫ్రెండ్స్ ని  గణేష్ మాటు వేసి చంపేస్తే, శివ మన మీదికి రావచ్చు కాబట్టి,  వాడి ఫ్రెండ్స్ ని మనం చంపామని వాడికి తెలిసేలోగా వాణ్ణి కూడా లేపెయ్యమని భవానీ ఆదేశించడం.  

ఎండ్ – పరిష్కారం :
        49. సైకిల్ మీద పోతున్న శివ ని కారులో భవానీ గ్యాంగ్ ఛేజ్ చేయడం, శివ వాళ్ళని ఎదుర్కోవడం. 
        50. హన్మకొండ వెళ్ళే దారిలో శివ ఫ్రెండ్స్ మీద ఎటాక్ జరగడం, మల్లిని గణేష్ చంపెయ్యడం.



(next : మిడిల్ రెండో భాగం)
-సికిందర్