రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, July 21, 2017

485 : రివ్యూ!

రచన దర్శకత్వం : శేఖర్ కమ్ముల
తారాగణంవరుణ్ తేజ్, సాయి పల్లవి, రాజా చెంబోలు, సాయిచంద్, శరణ్యా ప్రదీప్, గీతా భాస్కర్, హర్షవర్థన్ రాణే  
సంగీతం: శక్తికాంత్, ఛాయాగ్రహణం : సినిమాటోగ్రఫీ: విజయ్ సీ కుమార్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: దిల్ రాజు
విడుదల : జూలై 21, 2017
***
         
దేళ్ళ క్రితం ‘హేపీ డేస్’ తర్వాత సక్సెస్ అనేది అందని మానిపండు అయిపోయిన శేఖర్ కమ్ములకి మూడేళ్ళ క్రితం ‘అనామిక’ మరీ చేదు అనుభవం. మూడేళ్ళ తర్వాత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ‘ఫిదా’ తో వచ్చారు. తన రేంజి ఎంతో అంతలోనే వుంటూ,  తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడే అదే రొటీన్ ప్రేమ సినిమాకి రాజీ పడ్డారు కమ్ముల. సక్సెస్ లేని వరుణ్ తేజ్ కూడా  శేఖర్ కమ్ములని నమ్మి చూద్దామని నడుం కట్టాడు. వీళ్లిద్దరితో బాటు ‘ప్రేమమ్’ హీరోయిన్ సాయి పల్లవికి ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలికారు తెలుగులోకి నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు మరో రొటీన్ ప్రేమ సినిమా అని చెప్పుకోవడానికి మొహమాట పడక్కర్లేని  ‘ఫిదా’ కి, ప్రేక్షకులు ఎంతవరకు ఫిదా అవుతారో ఓసారి చూద్దాం...

కథ 
     అమెరికాలో వరుణ్ (వరుణ్ తేజ్)  అన్నతో వుంటూ మెడిసిన్ హయ్యర్ స్టడీస్ చేస్తూంటాడు న్యూరాలజీలో. ఒక మాట్రిమోనియల్ వెబ్సైట్లో అన్నకి సంబంధం చూసి,  దిల్ రాజు గారి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కి పంపిస్తాడు వరుణ్. ఆ సంబంధం నచ్చి సెకండ్ ఒపీనియన్ కోసం వరుణ్ ని పిలిపించుకుంటాడు అన్న. వరుణ్ వచ్చి పెళ్లి కూతురి చెల్లెలు  భానుమతి (సాయిపల్లవి)ఆకర్షణలో పడతాడు. ఆమె అక్కతో వరుణ్ అన్నకి పెళ్ళయిపోతుంది. ఈ లోగా వరుణ్ మీద ప్రేమ పెంచుకున్న భానుమతి - అతను ఇంకో అమ్మాయితో వుండడం చూసి హర్ట్ అవుతుంది. అతణ్ణి తిరస్కరిస్తుంది. అమెరికా తిరిగి వెళ్ళిపోయినా, ఆమెని మర్చిపోలేక పోతాడు వరుణ్. అతను చేసే ప్రయత్నాలన్నీ తిప్పికొడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆమెకున్న ఇగో, అపార్ధం వగైరా ఎలా తొలగి వరుణ్ కి దగ్గరయ్యిందనేది మిగతా కథ. 


ఎలా వుంది కథ      





 కథకాదు, గాథ. ఒక కథానాయకుడు గానీ, కథానాయిక గానీ లేని అచ్చమైన గాథ. ఇద్దర్లో ఎవరో ఒకరు సమస్య చేపట్టి కథ నడిపిస్తే అప్పుడు కథవుతుంది. కానీ కథే ఇద్దర్నీ నడపడం వల్ల ఇద్దరూ పాసివ్ పాత్రలుగా మారి గాథ అయింది. సహజంగానే ఈ గాథలో పాయింటు లేదు, ఆర్గ్యుమెంటు లేదు. జడ్జి మెంటు కూడా లేదు. మలుపుల్లేవు, ఆశ్చర్యాల్లేవు. పోతే, అపార్ధాల ప్రేమకథ అనే ఎన్నో సార్లు చూసిన అదే రొటీన్ గాడిలోనే పడింది. అలాగే ఇది ‘అమీతుమీ’ లాగా మరోసారి తెలంగాణా యాస మాట్లాడే తెలంగాణా అమ్మాయితో లవ్ స్టోరీ. విశేషమేమిటంటే, అపార్ధంతో మానసిక సమస్యలనే పరిస్థితి  ఇద్దరికీ వుండేందుకు వీల్లేదు. ఎందుకంటే, హీరో న్యూరాలజీ చదువుతున్నాడు, హీరోయిన్ అక్క ఎమ్మే సైకాలజీ చదివింది. వీళ్ళు మనసు కష్ట పెట్టుకుని సినిమా సాంతం ఇలా జీవించడ మేమిటి? కమ్ముల సార్ ఇది పట్టించుకోలేదు. ఎందుకంటే స్టార్ వేల్యూ వుంటే ప్రేమ సినిమాల్ని  అంత సీరియస్ గా తీసుకోనవసరంలేదు. పైపైన రాసేసి తీసేస్తే సరిపోతుంది. ఇకపోతే, ఈ ప్రేమల స్థాయి కూడా పాత్రలకి అతకని  అపరిపక్వ టీనేజర్ల స్థాయిలో వుంది. హీరో హీరోయిన్ల పాత్రలు టీనేజర్లా అనే సందేహం వస్తుంది.

       
ఎవరెలా చేశారు 

          డాక్టరీ చేసి అమెరికాలో న్యూరాలజీ చదివే ఎన్నారై పాత్ర పోషించాడు వరుణ్ తేజ్. స్వస్థలం వైజాగ్. గెటప్ విషయంలో పెద్దగా మేకోవరేమీ లేదు. కానీ నడక సంగతి సరి చూసుకోవాల్సిన అవసరముంది. అలా నడిస్తే హీరోలా వుండడు. హీరోయిన్ కూడా అతడి కాళ్ళు చూసి జోకేస్తుంది ఓ సీనులో. కాళ్ళకి మేకోవర్ అవసరం. చైల్డ్ ఆర్టిస్టుతో ఓ సీనులో వీపు తొక్కించుకుంటే చాలదు. పాత్ర ప్రకారం పాసివ్ గా బాగానే నటించాడు. ఫస్టాఫ్ అంతా బాన్సువాడలో హీరోయిన్ తో పెళ్ళింట సరదా సరదా పనులు, చిలిపి చిలిపి చేష్టలులో కలర్ఫుల్ గా కనువిందు చేశాడు. విజయ్ సి. కుమార్ విజువల్స్ ఏంతో  ప్లస్ అయ్యాయి తనకి. కమ్ముల క్రియేటివిటీ, దిల్ కరెన్సీ ఎలాగూ వున్నాయి. సెకండాఫ్ లో అమెరికా వెళ్లాకే సరదాలు తీరి బాధలు ఎక్కువయ్యాయి కథ ప్రకారం. ఈ బాధల్లో వదిన సెంటిమెంటుతో ఫ్యామిలీ ప్రేక్షకుల్ని కంట తడి పెట్టించగలడు. తను ఎందుకు కంట తడిపెడుతున్నాడని ప్రశ్న వేస్తే మాత్రం  పాత్రే వుండదు. రివాజుగా కాబోయే న్యూరాలజిస్టు అనే పాత్ర పరిచయం తర్వాత ఆ హోదానే పట్టించుకోకుండా పాత్రని నడపడం కమ్ముల తప్పుకాదు. ఆయనకంటే ముందునుంచే  తెలుగు సినిమాలు చేస్తున్నదే ఆయనా చూసి చేశారు. 

          అసలు అపార్ధం దగ్గర కూడా ఒక ప్రశ్న వస్తే పాత్రే ప్రశ్నార్ధకమవుతుంది. అన్న పెళ్ళికి హైదరాబాద్ నుంచి తన ఆడ స్నేహితురాలు కూడా వస్తే, ఆమెని హీరోయిన్ కి ఎందుకు పరిచయం చెయ్యడు? పరిచయం చేయకుండా ఆమెతో చాటుమాటుగా గుంభనంగా వ్యవహరిస్తే తను ప్రేమిస్తున్న హీరోయిన్ కి అనుమానాలు రావా? అసలు హైదరాబాద్ నుంచి పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ ని పరిచయం చేయడం కనీస మర్యాద కదా?  అలా చేస్తే హీరోయిన్ కి అపార్ధం చేసుకోదు, అపార్ధం చేసుకోకపోతే తాము విడిపోరు, విడిపోక పోతే సెకండాఫే వుండదని దర్శకుడు జోక్యం చేసుకుని వరుణ్ పాత్రని కిల్ చేశాడా? శేఖర్ కమ్ముల నుంచి ఇలాటి పాత్ర చిత్రణల్ని, కథనాల్ని ఆశించం. 

      ఇక హీరోయిన్ సాయిపల్లవి పాత్ర అటు క్లాస్ కీ, ఇటు మాస్ కీ హుషారు తెచ్చేలా  వుంది ఫుల్ జోష్ తో. ఆమె సహజనటి. ఇంత చెప్తే ఇంకింత చేసేస్తుంది. పూర్తిగా సినిమాని తనే డామినేట్ చేసింది. ఆమెలో దేన్ని హైలైట్ చేస్తే సూటిగా హృదయాల్లో నాటుకుంటుందో ఆ నవ్వుమోహాన్ని క్లోజప్స్ వేస్తూ ఆడుకున్నారు కమ్ముల. డాన్సుల్లో కూడా ఆమె మేటి. ఆమెకి వాడిన తెలంగాణా యాస తెలుగుకి ఇంటర్ స్టేట్ సినిమాలు ఇక తప్పవేమోనన్న అభిప్రాయన్ని కల్గిస్తుంది. 

          ఇతర పాత్రల్లో అందరూ ఓకే. హీరోయిన్ తండ్రిగా మరోసారి తెలంగాణా పాత్ర వేశారు సాయి చంద్. శక్తి కాంత్ సంగీతం, విజయ్ కుమార్ ఛాయాగ్రహణం చాలా హైలైట్ అయ్యాయి. తెలంగాణా గ్రామీణ ప్రాంతాన్ని, పాత్రల్ని ఫార్ములా మూసలో కాకుండా రియలిస్టిక్ గా చూపించడం బావుంది. శేఖర్ కమ్ముల రాసిన డైలాగుల్లో ఒకే ఒక్కటి – ప్రేమ పుట్టకుండానే చచ్చిపోయింది - అనే హీరోయిన్ అనే మాట తప్పితే మరేం చెప్పుకోదగ్గది లేదు. భాషని  తెలంగాణా జీవితంలోంచి తీసుకోలేదు. తెలంగాణా భాషలో ఆయన నిజామాబాద్ మాండలికాన్ని పట్టుకోవాల్సింది. వెళ్ళొస్తాం అనడాన్ని నడుస్తాం అంటారు నిజామాబాద్ వాసులు. ఇలాటి మాటలు కోస్తా  హీరో ని కన్ఫ్యూజ్ చేసి కామెడీ పుట్టిస్తాయి.  ఎన్నారై  హీరోకి అమెరికాలో కూడా ‘కైకూ’ (ఎందుకూ) అనే హైదరాబాదీ ఉర్దూ యాస ఎలా పట్టిందో మరి. హీరో కైకూ అన్నప్పుడు, హీరోయిన్ కిస్కూ (ఎవరికీ ) అంటూంటే హాలు పైకప్పులు లేచిపోయేవి. ‘అమీతుమీ’ లో మోహనకృష్ణ ఇంద్రగంటి రొటీన్ రోమాంటిక్ కామెడీనే భాషా ప్రయోగాలతో ఇన్నోవేట్ చేశారు. హిందీ ‘టూ స్టేట్స్’ లో భిన్న రాష్ట్రాలకి చెందిన హీరో హీరోయిన్ కుటుంబాల మధ్య తిండి దగ్గర్నుంచి  ఆచార వ్యవహారాలు ఎలాంటి హాస్య ప్రహసనాలని  సృష్టిస్తాయో చూసిందే. 

చివరికేమిటి 
       చూసిందే చూడరా...అనేదే తెలుగునాట పాపులర్ సామెత కాబట్టి ఆ కోవలోనే ఇది మరొక రొటీన్ – కథ తెలిసిపోయే ప్రేమ సినిమా. పాత్ర చిత్రణలు చూడవద్దు. పాత్రల మాటల ప్రకారం  కథనం చూడకూడదు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివే హీరోయిన్, పెళ్లి చేసుకుని అత్తారింటికి ఎందుకెళ్లాలి? పుట్టింట్లోనే వుండకూడదా? నేను నాన్నని వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళననే ‘స్త్రీ విమోచన’ పాయింటు మీదే కథ నడుస్తుందని అనుకోరాదు. పెళ్లి చేసుకుని వెళ్తున్న అక్కతో కూడా ఇదే వాదించినా, తండ్రి సెంటి మెంటు కూడా ఎంత పండిస్తూనే వున్నా, ఇదేం పాయింటు కాదు. ఇది వదిలేసి హీరోయిన్ వేరే అపార్ధం చేసుకుని రొటీన్ ఎడబాటు బాధలే పడుతుంది.  చివరికి హీరోని పెళ్లి చేసుకుని అతడితోనే  వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి లొంగి, చెప్పే ఓటమి డైలాగులు పాత్రని మరీ బ్యాడ్ గా తాయారు చేస్తాయి. కానీ ప్రేక్షకులు ఇదంతా ఆలోచించరనుకుంటారు కమ్ముల. ఈ మాత్రం దానికి హీరోయిన్ ని పెద్ద ఆరిందాలా చూపించడ మెందుకని కూడా అడక్కూడదు. లాజిక్ అనేదాన్ని మర్చిపోయి, కేవలం కళ్ళప్పగించి అలా అలా చూసేస్తే సరిపోతుంది. కానీ కోడిరామకృష్ణ గానీ, కోదండరామిరెడ్డి గానీ స్మాల్ మూవీస్ లో ఎలాటి బలమైన, ఆలోచింపజేసే  స్త్రీ పాత్రల్ని  సృష్టించారో కళ్ళముందు మెదులుతూనే వుంటాయి మనకి. 

          ఫస్టాఫ్ గంటా పది నిమిషాలకి ఇంటర్వెల్ వరకూ కూడా ఇద్దరూ ప్రేమల్ని ప్రకటించుకోరు. ‘కథ’ ముందు కెళ్లదు. ప్రేమ ప్రకటించ కుండానే హీరోయిన్ కి అపార్ధం వచ్చేస్తుంది. ఈ అపార్ధాన్ని చిటికెలో తొలగించవచ్చు. కానీ అది చేయరు.  ఎమ్మే సైకాలజీ అక్క కూడా ఏం చేయాలో అర్ధం గావడం లేదని చేతులెత్తేస్తుంది. పాత్రల మధ్యకి  దర్శకుడు దూరాడని ఆమె అర్ధం జేసుకోదు. చిట్ట చివరి సీను వరకూ  అపార్ధమనే బ్రహ్మ పదార్ధం కంటిన్యూ అవుతూనే వుంటుంది.  ఇలాగే ఇంటర్వెల్ లో చిన్న మాట చెప్పలేని హీరోయిన్ బాధతో  సెకండాఫ్ అంతా సాగదీసిన ‘కాదలి’ అనే ప్రేమ సినిమా వచ్చింది. అది ఎందుకు ఆడలేదంటే,  ఆ బడ్జెట్ లేని సినిమాలో స్టార్లు లేరు మరి. 

          సినిమా ఎక్కువ సార్లు మాంటేజెస్ తోనే సాగుతుంది. ఫస్టాఫ్ అంతా హీరోయిన్ ఇంట్లో అక్క పెళ్లి నేపధ్యమే. ఇది సెకండాఫ్ లో ప్రయాణాలు కట్టడంలో కూడా కొనసాగు తూనే వుంటుంది. అంతలోనే  అమెరికా చేరాక మళ్ళీ అక్కడ అక్క  డెలివరీ నేపధ్యమే. 

          శేఖర్ కమ్ముల తన మేధస్సుని పక్కనబెట్టి, అపార్ధాల ప్రేమ అనే సేఫ్ జోన్ లోనే  బిస్కెట్ వేసి,  ఆడిందే ఆటగా  ఆడుకుంటే చాలనుకున్నారు. 


-సికిందర్  
http://www.cinemabazaar.in