రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, జనవరి 2014, శుక్రవారం

రివ్యూ ..
ఇదో పరాకాష్ఠ !

లవ్ యూ బంగారమ్
తారాగణం : రాహుల్ హరిదాస్, శ్రావ్య, రాజీవ్ తదితరులు
సంగీతం : మహిత్ నారాయణ్    నేపధ్య సంగీతం : జె బి
కెమెరా :  అరుణ్ సూరపనేని    ఎడిటింగ్ : ఎస్ బి ఉద్ధవ్
బ్యానర్ ; క్రియేటివ్ కమర్షియల్స్- మారుతీ  టాకీస్
నిర్మాతలు : వల్లభ, మారుతి      సమర్పణ : కే ఎస్ రామారావు
రచన- దర్శకత్వం : గోవి ( గోవింద రెడ్డి)
విడుదల : జనవరి 24, 2014
***
ప్రేమ కథలు కిరాతకంగా తీస్తేనే ఈ తరం దర్శకుడనే పేరొస్తుందని ఒకానొక  ‘ఈ రోజుల్లో’ సందర్భంతో కొత్త దర్శకులు కొందరికి నమ్మకం ఏర్పడి నట్టుంది. అలాటి కొత్త దర్శకుడు ‘గోవి’ అనగా గోవిందరెడ్డి, సినిమా ప్రారంభంలో తను దర్శకుడైనందుకు  కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ,  కుటుంబాలు ఇబ్బంది పడే సినిమా తీసి ‘ గ్రో అప్’ అని సినిమాలో ఒక భోళా పాత్రకి క్లాసు పీకించిన చందంగానే సదరు కుటుంబాలకే జ్ఞాన బోధ చేసే దాకాపోయాడు. సుప్రసిద్ధ  క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ఈ యజ్ఞంలో పాలుపంచుకునేందుకు ఎలాటి మొహమాటమూ పడకుండా - ఈ తరహా సినిమాలకి ఇప్పటి ట్రెండ్ లో బ్రాండ్ నేమ్ గా వెలుగొందుతున్న దర్శకుడు మారుతి తో జతకట్టి సక్సెస్ కళ్ళ జూడా లనుకుంది. అధినేత కే ఎస్ రామారావే చెప్పినట్టు, తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డబ్బులొచ్చే సినిమాలు మారుతీ తీస్తున్నాడు కాబట్టి ఈ జాయింట్ వెంచర్ ఇలా తెరకెక్కిం దన్నమాట!

‘ఈ రోజుల్లో’ తర్వాత ఈ సమీక్షకుడితో మారుతి ఒక విషయం చెప్పాడు- తను నానా ప్రయోగాలూ చేసి 5-డీలో  ‘ఈ రోజుల్లో’ తీసినట్టు  ఇంకెవరైనా 5-డీతో ప్రయత్నాలు చేస్తే చేతులు కాల్చుకుంటారని! అంతేగానీ అసలు అదేపనిగా  ‘ఈ రోజుల్లో’ లాంటి అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీస్తే అట్టర్ ఫ్లాపై పోతారని చెప్పలేదు. చెప్పాల్సిన పనిలేదు-చేసి చూపిస్తున్నాడు గనుక. ప్రస్తుత సినిమాతో  పరాకాష్టకి చేరిన తన ఈ బ్రాండు ‘క్రియేటివిటీ’ తో తన గమ్యం ఏమిటో తనకే తెలుస్తుందిక!

సరైన సినిమాల్లేక త్రిశంకు స్వర్గం లో కొట్టు మిట్టాడుతున్న ‘హేపీ డేస్’ ఫేం హీరో రాహుల్ హరిదాస్ ఈ సినిమాతో నటనలో కాస్త మెరుగయ్యాడు తప్పితే,  ఈ సినిమా తన కెరీర్ లో చెప్పుకో దగ్గదేం కాదు- గత సినిమా ‘ప్రేమ ఒక మైకం’ లాగే. శేఖర్ కమ్ముల అతడికి సృష్టించిన గుర్తుండిపోయిన ‘టైసన్’ లాంటి పాత్రని సృష్టించడంలో ఇతర దర్శకులు విఫలమైనట్టే ‘గోవి’కూడా చేతులెత్తేశాడు.

ఈ తరం ప్రేక్షకులకి యువజంట పెళ్లి కథ చెప్పాలనుకున్నారు. అభద్రతా భావంతో అనుమానాలు పెంచుకు తిరిగే హీరోని, ఆత్మవిశ్వాసం ఉరకలేసే  హీరోయిన్ తో కలిపి ఆ వైవాహిక జీవితం అనుమానాలతో ఏ మలుపులు తిరుగుతుందో చూపాలనుకున్నారు. విషయం కొత్తదేమీ కాదు, చాలాసార్లు చాలా సినిమాల్లో వచ్చేసిన ఈ పాత విషయాన్నే కొత్తగా ఏమైనా చెప్పారేమో ఈ క్రింద చూద్దాం.

ప్రేమో కామమో...
వైజాగ్ లో ఆకాష్ ( రాహుల్) ఓ సెల్ ఫోన్ల కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్. మీనాక్షి (   ) ఓ రాజకీయనాయకుడి కూతురు. ఫ్రెండ్స్ తో జల్సాగా తిరగడమే ఆమె పని. ఆకాష్ తండ్రి కూడా రాజకీయ నాయకుడే. సంపాదన లేని ఆ తండ్రి కొడుకు జీతమంతా లాగేసుకుని రాజకీయాలకి- తన తండ్రి విగ్రహ ప్రతిష్టాపన పన్లకీ తగలేస్తూంటాడు. ఓ సంఘటనలో ఆకాష్, మీనాక్షీలు కలుస్తారు. ఈ కలయిక కాస్తా ప్రేమకి  దారితీస్తే, రాజకీయ ప్రత్యర్ధులైన తండ్రులవల్ల పెళ్లి కుదరక పారిపోయి పెళ్లి చేసుకుంటారు. అంతలో రాహుల్ కి మేనేజర్ గా ప్రమోషన్ వచ్చి హైదరా బాద్ కి బదిలీ అవుతాడు.

ఇక్కడ ఓ ఏడాది ఇద్దరి కాపురం సజావుగా సాగిపోతుంది. అప్పుడు ఒంటరిగా ఇంట్లో బోరు భరించలేక మనాక్షి ఉద్యోగం చేస్తానని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరుతుంది. అలా జాబ్ కి వెళ్తున్న  ఆమెకి  బాల్య స్నేహితుడు మదన్ (రాజీవ్) తారసపడతాడు. ఇతడి గురించి ముందే చెప్పి ఉంచింది రాహుల్ కి.  ఇప్పుడామె ఆ మదన్ ని కలుస్తూ ఉండడంతో,  రాహుల్ కి అనుమాన బీజాలు నాటుకుని ఆమె కదలికల్ని కనిపెడుతూంటాడు. లోలోన కుమిలి పోతూంటాడు. తన సంగతి తెలిసిపోయిందని ఆమెకి తెలిసినా ప్రవర్తన మార్చుకోదు. ఇంతలో ఈ ముగ్గురి మధ్యకి అసలు గేమ్ ఆడుతున్న ఓ దుష్టుడు బట్టబయలవుతాడు...

ఇదీ విషయం. ఈ విషయాన్ని వీలైనంత అశ్లీలాన్ని జోడించి చెప్పారు. విషయం కాదు ప్రధానం, యువప్రేక్షకులకి కామోద్దీపన కల్గించడమే ముఖ్యమన్నట్టుగా సాగించారు. ఇందుకు హీరోయిన్ శ్రావ్య శాయశక్తులా సహకారం అందించింది. హీరో హీరోయిన్ల శృంగార చేష్టలకి పెళ్లి అనే లైసెన్సు ఇచ్చేయడంతో హద్దు లేకుండా పోయింది. అక్షేపణీయం కాని యూత్ అప్పీల్ ని రాజెయ్యడానికి ఇది చాలా తెలివిన ప్లానింగ్. పెళ్ళికాని యువజంట తో ఇలాటి చిత్రీకరణలు తీవ్ర విమర్శల పాలవుతాయి కాబట్టి  -పెళ్లి జరిపించేసి ఆ ముసుగులో యదేచ్ఛగా పడకగది దృశ్యాలకి తెరతీసినట్టుంది. మున్ముందు మారుతికి, మారుతి గ్రూప్ దర్శకులకీ ఇలాటి కొత్త కొత్త టెక్నిక్ లు ఎన్నితడతాయో వేచి చూడాల్సిందే!




contd..