రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఏప్రిల్ 2017, బుధవారం


     డార్క్ మూవీస్ కీ  యాక్షన్ మూవీస్ కీ  తేడాల గురించి తెలుసుకుంటే తప్ప డార్క్ మూవీస్ జానర్ కి న్యాయం చేయలేరు. న్యాయం చేయకపోతే నాల్గు డబ్బులు రావు. రోమాంటిక్ కామెడీ జానర్ లక్షణాలు తెలీక రోమాంటిక్ కామెడీ లనుకుంటూ ఎలా ఇప్పుడు మార్కెట్ లేని రోమాంటిక్ డ్రామాలు  తీసేసి దెబ్బ తినేస్తున్నారో,  అలా డార్క్ మూవీస్ అనుకుని యాక్షన్ మూవీస్ తీసేసి దెబ్బ  తినేసే  అవకాశం చాలా  వుంది. రోమాంటిక్ కామెడీలతో చేసిన జానర్ పరమైన తప్పిదాలు మళ్ళీ డార్క్ మూవీస్ తో కూడా జరక్కుండా చూసుకోవాల్సి వుంటుంది. జానర్ స్పృహ, మర్యాద, డిసిప్లిన్ అనేవి లేకపోతే ఈ రకమైన సినిమాలు తీయడమే వృధా. దేని క్రియేటివ్ పరిధి, పరిమితులు దాని కుంటాయి. గుండుగుత్తగా ఆన్ని జానర్స్ కీ కలిపి ఒకే క్రియేటివ్ ప్రపంచం లేదు. క్రియేటివిటీని  జాతీయం చేయడం కుదరదు. క్రియేటివిటీ చిన్న చిన్న గణ రాజ్యాలుగానే వుంటుంది. డార్క్ మూవీస్  ఖచ్చితంగా వాస్తవికతని డిమాండ్ చేస్తాయి. డార్క్ మూవీస్ వాస్తవికత ఎన్నటికీ మాయనిది. ఏ కాలంలో నైనా వాటికి  వాస్తవికతే ఆభరణం.  వాస్తవికత లేకపోతే  డార్క్ మూవీస్ లేవు.  ఈ రోజుల్లో ‘మాభూమి’ లాంటి వాస్తవిక కథా చిత్రం, లేదా ఆర్టు సినిమా తీస్తే ఎవ్వరూ చూడరు. కానీ అదే వాస్తవికతతో కూడిన డార్క్ మూవీస్ తీస్తే చూస్తున్నారు. ‘నగరం’ లాంటి డార్క్ మూవీ వాస్తవికతతో,  జీవనోపాధి కోసం ఓ హీరో పడే పాట్లుగా ఆర్ట్ సినిమా  తీస్తే ఎవరైనా చూస్తారా? ఎవ్వరూ చూడరు బహుశా. 


          యాక్షన్ మూవీస్ కి ఈ వాస్తవికతతో పనిలేదు. ఎందుకంటే వీటి విషయంలో వినోదమే ప్రధానం. ఈ వినోదాన్ని పండించడం కోసం లాజిక్ ని తీసి పక్కన పెడతారు. ‘ఖైదీ’ లాంటి యాక్షన్ మూవీ లో పోలీస్ స్టేషన్ లో  పది మంది పోలీసులని కొట్టి వెళ్ళిపోతాడు చిరంజీవి. ఇలా నిజజీవితంలో సాధ్యం కాకపోయినా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. యాక్షన్ మూవీస్ లో ప్రేక్షకులు కోరుకునేది నిజ జీవితంలో సాధ్యపడని ఈ ఎస్కేపిజమే, లాజిక్ కాదు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ –8’ అనే యాక్షన్ మూవీ చాలా పెద్ద ఎస్కేపిస్టు ఫేర్. టాప్ స్టార్స్ తో యాక్షన్ మూవీస్  ఇలా ఎంత వాస్తవ  విరుద్ధంగా వున్నా వాటికేం ప్రమాదం రాదు. కానీ ఇదే లాజిక్ లేకుండా డార్క్ మూవీస్ తీస్తే అది జానర్ మర్యాద అన్పించుకోదు. జానర్ మర్యాదతో లేనిది ఈ రోజుల్లో ఏదీ ఆడడం లేదని గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం. 


యాక్షన్ మూవీ 
           ఒక డార్క్ మూవీ తీస్తూ అందులో పైన చెప్పుకున్న చిరంజీవి ఫైట్ లాంటిది పెట్టారనుకోండి, అది డార్క్ మూవీగా ఫెయిల్ అయినట్టే. అలాగే చిరంజీవిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారణ చేశారనుకోండి, అనుమానం తీరక లాకప్ లో   పెట్టారనుకోండి- ఇది డార్క్ మూవీ రచన అవుతుంది, యాక్షన్ మూవీ కాదు.

          యాక్షన్ మూవీకి ఎక్కువ బడ్జెట్ కావాలి. వాటిలో స్టంట్స్,  ఛేజెస్ వుండాలి. కాల్చివేతలు, పేల్చివేతలు, విధ్వంసాలు, మారణహోమాలూ  వుండాలి. నాన్ స్టాప్ యాక్షన్ తో వుండాలి. స్పీడు ప్రాణమవ్వాలి. యాక్షన్ సీన్స్ లో లాజిక్ వుండనవసం లేదు. గాలిలో విన్యాసాలు చేసి శత్రువుల్ని తన్న వచ్చు. ఏదో ఒక అంశం గురించి హీరో విలన్లు పోరాడు కోవాలి. విలన్ ఎంత మందిని చంపినా పోలీసులు వచ్చి కేసులు నమోదు చేసుకోనవసరం లేదు. యాక్షన్ లో ఎంత మంది చచ్చినా శవాలకి అంత్య క్రియల గురించి ప్రేక్షకులు బెంగ పెట్టుకోనవరసం లేదు. యాక్షన్ మూవీస్ లో హీరో క్యారక్టర్ డెవలప్ మెంట్ అంత ప్రధానం కాదు. కథ ఫోకస్ అంతా బిగ్ యాక్షన్ మీదే వుంటుంది. స్టోరీ లైన్ సరళంగా వుంటుంది. బోలెడంత కథలో ప్రేక్షకులు చిక్కుబడి పోకుండా బోలెడు యాక్షన్ తో దూసుకెళ్ళేలా చేయడమే యాక్షన్ మూవీస్ ప్రధానోద్దేశం. ‘శివ’ లో బోలెడంత  కథ వుండదు- ఏకత్రాటిపై సింపుల్  కథే  పరిగెడుతూ శివ- భవానీల యాక్షన్ - రియాక్షన్ల సంకుల సమరంగా వుంటుంది.


          యాక్షన్ మూవీస్ రాయడం తేలిక. తీయడం కూడా దర్శకుడికి తేలికే. యాక్షన్ సీన్స్ అన్నీ స్టంట్ మాస్టర్లు తీసేసి వాళ్ళే ఎడిటింగ్ చేసేస్తారు. పాటలు డాన్స్ మాస్టర్లు తీసేసి వాళ్ళే ఎడిటింగ్ చేసేస్తారు. దర్శకుడు తీయడానికి మిగిలేది ఓ గంట టాకీ పార్టు మాత్రమే. 
డార్క్ మూవీ 
          డార్క్ మూవీస్ ఇలా కాదు. యాక్షన్ సీన్స్, పెద్దగా పాటలూ వుండని డార్క్ మూవీస్ మొత్తం కథ మీదే ఆధారపడి నడుస్తాయి. కాబట్టి దర్శకుడికే సినిమా బరువంతా తానే మోసే పనుంటుంది.  ఒక నేరం చుట్టూ జరిగే వాస్తవిక ధోరణిలో గల కథలే వీటిలో వుంటాయి.  వీటిలో స్థాపించే కథలు  నిజ జీవితంలో ఎవరికైనా జరగవచ్చు. ‘పింక్’ లో రిసార్ట్స్ లో తనతో మిస్ బిహేవ్ చేసిన వాణ్ణి సీసా పెట్టి కొట్టి పారిపోయి, ఉల్టా తనే కేసులో ఇరుక్కునే హీరోయిన్ కథ లాంటిది ఎవరికైనా జరగ వచ్చు. ‘16-డి’ లో విశృంఖల ప్రేమాయణాల పర్యవసానంగా జరిగే దారుణాల్లాంటి కథ ఎవరి జీవితాల్లోనైనా సంభవించ వచ్చు.  వీటి కథలు, కథనాలూ సంక్లిష్టంగా వుంటాయి. 

          కాబట్టి వీటిని మెదడు పెట్టి చూడాల్సిందే. మెదడు పెట్టి చూసేలా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగల శక్తి ప్రస్తుతం డార్క్ మూవీస్ కే వుంది. ఆర్ట్ సినిమాల్ని మెదడు పెట్టి చూడాలి. గొప్పగొప్ప సాంఘికాలు, ‘మేఘ సందేశం’ లాంటి మానసిక సంఘర్షణాత్మకాలూ మెదడు పెట్టి చూడాల్సిందే. సామాజిక సినిమాలు, స్త్రీవాద సినిమాలు, భక్తి  సినిమాలూ మొదలైనవి ఖచ్చితంగా మెదడు పెట్టే చూడాలి. ఇందుకు గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులు సిద్ధంగా లేరు.  ఎందుకంటే దేశపరిణామాల్ని బట్టి  ప్రేక్షకుల మనోభావాలుంటాయి. 2000 సంవత్సరం నుంచి ఆర్ధిక సంస్కరణల ఫలితాలూ, ప్రపంచీకరణ ఫలాలూ  ఒకేసారి దండిగా చేతిలో వచ్చి పడుతూంటే వాటిని అనుభవించే స్థితికి చేరుకున్నారు ప్రేక్షకులు. ఉపాధి కోసం, ఉద్యోగాలకోసం ఇక ప్రభుత్వాల మీద ఆధారపడే అవస్థ తప్పింది. పట్టణం నుంచీ పల్లెదాకా టీనేజీ  కుర్రకారు పుష్కలంగా పాకెట్ మనీతో తిరుగుతున్నారు. 1980, 90 లనాటి ఆకలి కేకలు, నిరుద్యోగ పొలికేకలు ఇక లేవు. ఆ కవిత్వాలు, ఆ పోరాటాలు, ఆ ఉద్యమాలు, ఆ తీవ్రవాదమూ, ఆ సినిమాలూ తీసి అవతల పారేసి – ఎంజాయ్ చేస్తున్నారు పల్లెనుంచి నగరం దాకా. 


          ఇది గమనించారు గనుకనే సినిమాల అర్థాన్నే మార్చేసి  కేవలం ఎంటర్ టైన్మెంట్! ఎంటర్ టైన్మెంట్!!  ఎంటర్ టైన్మెంట్!!!  అనే ధోరణిలోనే సినిమాలు  తీస్తూ రంజింప జేస్తూ వచ్చారు. సినిమాల్ని ఇక మెదడు పెట్టి చూసే అవరమే లేకుండా పోయింది. ఎంటర్ టైన్ చేయడానికి నాల్గు వెర్రి వేషాలతో, మూడు జాడింపులతో, ఓ రెండు వాయింపులతో టపటప లాడించేసి  వదిలేస్తే సరి- పెద్ద పెద్ద బకెట్లతో కూల్ డ్రింకులు, పెద్ద పెద్ద ట్రేలు వొళ్ళో పెట్టుకుని ఫాస్ట్ ఫుడ్డులూ లాగిస్తూ చూసేసి దులిపేసుకుని వెళ్ళిపోతున్నారు. మెదడుతో పనేలేదు! సినిమాలు చూడ్డానికి తినడం అవసరమా? 


          ఈ నేపధ్యంలో రివ్యూ రైటర్లు ఈ పాత్ర చిత్రణ ఇలా వుండాల్సింది కాదు, ఇక్కడ ఈమె ఇలా ఏడ్వాల్సింది కాదు, అక్కడ ఆయన అలా అరవాల్సింది కాదు-  అని  విశ్లేషణలు చేస్తే - వీళ్ళెవర్రా? అని తలలు బాదుకుంటున్నారు  ప్రేక్షకులు. మెదడుకి ఆలోచనలు పెట్టే పనే వద్దంటున్నారు. మెదడుని పోటీ పరీక్షలు రాయడానికి, విదేశాల్లో జాబ్స్ చేసుకోవడానికి మాత్రమే కఠినాతి కఠినంగా వాడుకుంటామంటున్నారు. 


          ఇలా ఆర్ధిక సంస్కరణలు - ప్రపంచీకరణ అనే దేశ పరిణామాలతో కూడిన నేపధ్యంలోంచి  అన్ని మాధ్యమాల్లో ఎంటర్ టైన్మెంట్ ప్రధానమైన వాతావరణమే కన్పిస్తూండవచ్చు. ఆకలి బాధలో, ఇంకే సామాజిక సమస్యలో కళా రూపాలుగా స్థానం కోల్పోయి వుండ వచ్చు. కానీ కళా రూపంగా నేరం దాని స్థానాన్ని కోల్పోవడం లేదు. ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణ ఎంత ఎంటర్ టైన్మెంట్ ని తెచ్చిపెట్టాయో- సమాజంలో అన్నే నేరాల్నీ  తెచ్చి పెట్టాయి. మనం ఒకటి అర్ధం జేసుకుంటే, 1930 లలో అమెరికాలో   ఏర్పడిన ఆర్ధిక మాంద్యం  నేపధ్యంలోంచే  ఫిలిం నోయర్ అనే డార్క్ మూవీ జానర్ సినిమాలు పుట్టుకొచ్చాయి. డబ్బు లేకపోయినా నేరాలే, డబ్బెక్కువైపోయినా నేరాలే! అలా ఇప్పుడు ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణ నేపధ్యంలో డబ్బెక్కువైపోయి నేరాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి. ఉన్నత వర్గాల హై ప్రొఫైల్ నేరాలు మునుపెన్నడూ లేనంతగా జరుగుతున్నాయి.  వాళ్ళ ఎంటర్ టైన్మెంట్స్  శృతి మించి నేరాలకి దారి తీస్తున్నాయి. కాబట్టి ఎంటర్ టైన్మెంట్ - నేరాలు ఈ రెండూ ఆర్ధిక సంస్కరణలు – ప్రపంచీకరణలకి రెండు ముఖాలు. వీటిలో ఎంటర్ టైన్మెంట్ అనే ఒకే ముఖాన్ని చూపిస్తూ వచ్చారు సినిమాల్లో. క్రైం ఎలిమెంట్ అనే రెండో ముఖాన్ని కూడా పట్టుకోగల్గడంతో  షైతాన్, జానీ గద్దార్, పింక్,  కహానీ -2, 16- డి, నగరం,  మెట్రో, కనుపాప  లాంటి నియో నోయర్ సినిమాలు వచ్చేసి హిట్టవుతున్నాయి. 


          అయితే ఇందాక చెప్పుకున్నట్టు, ఇలా మెదడు పెట్టి చూడాల్సిన సాంఘికాలు, సామాజికాలు, విప్లవాత్మకాలు, అనేక వాదాలు, మానసిక సంఘర్షణలూ...లాంటి కథలతో కూడిన ఆలోచనాత్మక సినిమాలని చూడ్డానికి ఇష్ట పడని  ప్రేక్షకులు, అంతే మెదడుకి పని కల్పించి చూడాల్సిన పై నియో నోయర్ సినిమాల్ని ఓపిగ్గా ఆలోచనలు లగ్నం చేసి చూసి ఎలా హిట్ చేయగల్గుతున్నారు?


          స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ ఏం చెప్పారో ఒకసారి ఇక్కడ చూడాలి- మనిషి పరిణామ క్రమం సరీసృపాల నుంచి క్షీరదాలకి, క్షీరదాల నుంచి ఆదిమానవుడికి, ఆదిమానవుడి నుంచి వివేక వంతుడైన మనిషి గా ఏర్పడినప్పుడు- ప్రతీ పరిణామ దశలో మెదడు పొరలు కమ్ముకుంటూ వచ్చింది. సరీసృపాల యాంత్రిక,  కేవల భౌతిక మెదడు (రెప్టీలియన్ కాంప్లెక్స్) మీద, భావోద్వేగాలతో కూడిన క్షీరదాల మెదడు (లింబిక్ సిస్టం) పొరకమ్మింది.  భావోద్వేగాలతో కూడిన క్షీరదాల మెదడు మీద ఆలోచనా శక్తి పెంచుకున్న  మనిషి  మెదడు (నియో కార్టెక్స్) పొర కమ్మింది. వీటన్నిటి మధ్యా ఎక్కడో ఆథ్యాత్మిక మెదడు వుంటుంది- దీని స్థానాన్ని ఇంకా కనుగొనలేదు. 
            కాబట్టి  ప్రేక్షకులకి డార్క్ మూవీస్ ఆకర్షించడానికి గల కారణ మేమిటో ఇప్పుడు తెలిసిపోతోంది. పొరలు పొరలుగా మూడు రకాల మెదడులు కలిగివున్నప్పుడు, కింది పొరలో వున్న జంతు సమానమైన వొరిజినల్ సరీసృపాల మెదడుని, ఈ జానర్ సినిమాలు సంతృప్తి పరుస్తున్నాయన్న మాట! నేరాలు ఈ మెదడుతోనే జరుగుతాయి. ఈ మెదడుని అణిచి పెట్టుకుని మనుషులు గొప్ప బుద్ధి గలవాళ్ళుగా వుండడానికి తంటాలు పడుతూంటారు. అది తన్నుకొ చ్చినప్పుడు తప్పుడు పనులన్నీ చేసేస్తారు. 

          తప్పుడు పనులు చేసే మెదడు తమలోనే వుంది కాబట్టి, ఆ తప్పుడు పనులు చేయకుండా వుండేదెలా, లేదా చేసేస్తే బయట పడేదెలా అన్న కుతూహలమే ఈ సినిమాలని దృష్టి కేంద్రీకరించి చూసేలా చేస్తుంది. మనిషి మెదడెలా వుంటుందో, అదెలా పనిచేస్తుందో అర్ధం జేసుకోకుండా సరైన సినిమాలు తీయలేరు. 


         
నేటి పరిస్థితులు డిమాండ్ చేస్తున్న ఈ డార్క్ మూవీస్ జానర్ ని తెలుగు సినిమాలు టచ్ చేయడం లేదు. హిందీ, తమిళ, మలయాళ సినిమాలు ఈ బాటలో నడుస్తున్నాయి. ఇప్పడు  తెలుగులో ప్రారంభించాలంటే ఏం చేయాలి?  వాటిని ఎలా తీర్చిదిద్దాలి?  వాటి జానర్ మర్యాదని ఇతర భాషల్లోలాగా ఎలా కాపాడాలి?  ఒక పూర్తి స్థాయి నియో నోయర్ డార్క్ మూవీ ఎలా వుంటుంది?....మొదలైన విషయాలతో రేపు ముగింపు వ్యాసం చూద్దాం. 


-సికిందర్

http://www.cinemabazaar.in/