రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 30, 2025

1384 : స్క్రీన్ ప్లే సంగతులు

 

ముందుగా ఒక విజ్ఞప్తి : ‘హరిహర వీరమల్లు’ రివ్యూగానీ, స్క్రీన్ ప్లే సంగతులు గానీ ఎందుకివ్వడం లేదంటే- విడుదల ఆలస్యమైన సినిమాలకి ఇచ్చి లాభంలేదని తేలింది. కొన్నేళ్ళ పాటు నిర్మాణం జరుపుకుని విడుదలైన ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ ల పరిస్థితి తెలిసిందే. నాలుగైదేళ్ళు నిర్మాణ కార్యక్రమాల్లో చిక్కుకుని తీరా విడుదలైతే అవి ఏ రూపు రేఖలతో వున్నాయో తెలిసిందే. వీటి గురించి ఏం రాయగలం, ఎలా రాయగలం. అందుకని ఇవే కారణాలతో ‘హరిహర వీరమల్లు’ ని కూడా పక్కన పెట్టాం. ‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్  జస్టిస్ డినేయ్డ్ అంటారు కోర్టు విచారణలకి సంబంధించి. అంటే న్యాయం చేద్దామని కూర్చుని అది ఆలస్యం చేస్తే  అన్యాయం చేయడం కిందికే వస్తుందని అర్ధం. సినిమాల గురించి నేరుగా కాకపోయినా, ఈ మాట ఆలస్యం వల్ల కలిగే ప్రతికూల పరిణామాల్ని హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా చట్టపరమైన సందర్భాల్లో. సినిమా విడుదలల విషయంలో కూడా జాప్యం ప్రభావం ప్రేక్షకుల మీద తీవ్రంగా పనిచేస్తుంది. సినిమా నిర్మాణంలో, విడుదలలో ఆలస్యం చేయడమంటే సస్పెన్స్ క్రియేట్ చేసి ప్రేక్షకుల్ని ఉత్కంఠతో చంపడం కాదు- సస్పెన్స్ క్రియేట్ చేసి  ఉత్కంఠతో చంపడమనేది సినిమాల్లో చూపించే కథలతోనే సాధ్యమవుతుంది తప్ప సినిమాని ఎప్పుడో ఐదేళ్ళ తర్వాత రిలీజ్ చేస్తే కాదు.

‘ది 100’ స్క్రీన్ ప్లే సంగతులు విషయానికొస్తే- హీరో ఆర్కే సాగర్, దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ కలిసి ప్రయత్నించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తో, ప్రస్తుతం నడుస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ల ట్రెండ్ లో సంఖ్యని పెంచ గలిగారు, క్వాలిటీని కాదు. ఈ సంఖ్యని పెంచే  ఊపులో టైటిల్ గా పెట్టిన 100 అనే సంఖ్యకి చెప్పిన భాష్యం నమ్మశక్యంగా లేకపోవడం మొత్తం చెప్పుకొచ్చిన కథనే ప్రశ్నార్ధకం చేసింది. ఈ సంఖ్యని కథని నిలబెట్టడానికి తగిన విధంగా అన్వయించి వుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకో రేంజిలో వుండేది.

సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా ఒక టెంప్లెట్ లోనే  వస్తున్నాయి. నగరంలో వరుస హత్యలు, వాటిని పరిశోధిస్తూ పోలీసు అధికారి, హంతకుడెవరన్నది సస్పెన్స్. ఒక మూసలో ఇవే కథలు తిప్పి తిప్పి తీస్తున్నారు. ఈ తీయడంలో మెళకువ లోపించి విఫలమవుతున్నారు. నేర పరిశోధన, సస్పెన్స్, థ్రిల్స్ ఈ మూడూ ఒక ప్యాకేజీ అయితే, ఈ మూడిటికీ పోటీ పెట్టాల్సిన చోట  ప్యాకేజీ విప్పి, మూడుకి మూడూ మిస్ చేసి, లేదా ఒకటుంచి ఇంకోటి మిస్ చేసి -దాన్నే సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోమంటున్నారు.

         ఈ కథలో విక్రం (ఆర్కే సాగర్) కొత్తగా శిక్షణ పొంది జాయిన్ అయిన ఏసీపీ.  నగరంలో డెకాయిటీ హత్యలు జరుగుతూంటాయి. ఒరిస్సాకి చెందిన ముఠా అమావాస్య నాడు వీటికి పాల్పడుతూ వుంటుంది. ఇళ్ళ మీద దాడి చేసి బంగారం మాత్రమే దోచుకుంటారు. ఆ బంగారాన్ని ఒరిస్సాలో తమ అమ్మవారికి సమర్పించుకుని, అంతరించిపోతున్న తమ తెగని కాపాడుకోవాలని వాళ్ళ ఉద్దేశం.

        వీళ్ళని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న విక్రంకి దొరక్కుండా ఇంకో దోపిడీ చేస్తారు. వీళ్ళు బంగారాన్ని ఎక్కడ అమ్ముతున్నారో కనిపెట్టడానికి విక్రం పోలీస్ ఇన్ఫార్మర్ లని దింపుతాడు. దాంతో ఆ దోపిడీ బంగారం ఒక వ్యాపారస్తుడి ఇంట్లో దొరుకుతుంది. ఆ బంగారంలో ఒక నెక్లెస్ ని గుర్తు పడతాడు విక్రం. ఈ నెక్లెస్ ఒక కార్యక్రమంలో భరత నాట్యం చేస్తున్నప్పుడు తెగి కింద పడితే, తనే తీసి అందించాడు ఆ నాట్య కారిణి ఆరతీ (మీషా నారంగ్) కి విక్రం.

        ఇప్పుడు ఆ నెక్లెస్ తో విక్రం ఆమె ఇంటికెళ్తే  ఆమె తండ్రి ఈ నెక్లెస్ తమది కాదంటాడు. వొత్తిడి చేస్తే చెప్పేస్తాడు. దోపిడీ ముఠా తమ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఈ నెక్లెస్ తో బాటు ఇంట్లో బంగారం దోచుకోవడమే గాక, ఆరతిని  రేప్ చేశారంటాడు. తను ప్రేమిస్తున్న ఆరతి రేప్ కి గురైనట్టు తెలుసుకుని షాకవుతాడు విక్రం. ఇక మళ్ళీ అమావాస్యకి వలపన్ని ఆ ముఠాని పట్టుకుంటే, రేప్ చేసింది వాళ్ళు కాదని తేలుతుంది. మరెవరు? వాళ్ళు ముసుగులు ధరించి వుండడంతో రేప్ చేసిందెవరో ఆరతికి తెలీదు. ఇలా క్లిష్టంగా మారిన కేసుని విక్రం ఎలా పరిష్కరించాడు? చివరికి రేపిస్టుగా దొరికిందెవరు? వాడ్ని ఏం చేశాడు విక్రం? ఇదీ మిగతా కథ.

స్క్రీన్ ప్లే సంగతులు

కథ మధుప్రియ (విష్ణు ప్రియ)  అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో మొదలవుతుంది. ఈ ఆత్మహత్యకి కారణం సెకండాఫ్ లో తెలుస్తుంది. ఆరతి రేప్ కి గురవడంతో ఆమె తల్లి  లక్ష్మి (లతా గోపాలస్వామి) ఆత్మహత్య చేసుకుంటుంది. విక్రం కి కేసులో సహాయపడే సైకియాట్రిస్టు అయిన మదర్  డాక్టర్ లత (కళ్యాణీ నటరాజన్), ఫ్రెండ్ విద్య (ధన్యా బాలకృష్ణన్) వుంటారు. మరో వైపు కార్పోరేట్ కంపెనీ సిఈఓ వల్లభ్ (తారక్ పొన్నప్పన్) వుంటాడు.

        స్థూలంగా ఈ కథ ఆరతిని రేప్ చేసిన గుర్తు తెలియని రేపిస్టుని పట్టుకోవడం గురించే. అంటే రొటీన్ గా హంతకుడెవరన్నది సస్పెన్స్ లో వుంచి నడుపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ టెంప్లెట్ కథ లాంటిదే అన్నమాట. ఆ గుర్తు తెలియని రేపిస్టుని ఎవరు పట్టుకోవాలి? ఏసీపీ విక్రమే. అంటే ఇది విక్రం నడిపే తన కథే నన్న మాట. ఇలా చెప్పడం ఎందుకంటే, ఓపెనింగ్ లో ఐపీఎస్ గా విక్రం ట్రైనింగ్ పొందే సీన్స్ తోనే కథ ప్రారంభమై, అతడి మీదే 100 టైటిల్ తో ముగుస్తుంది. అంటే మొదట్లో  డెకాయిటీల్ని, తర్వాత రేపిస్టునీ పట్టుకుని అభినందనలు పొందే విక్రం కెరీర్ గ్రాఫ్ గురించన్న మాట ఈ కథ.

అంతేగానీ రేప్ బాధితురాలు ఆరతీ గురించి కాదన్నమాట. ఇందుకే ఆరతి విషయం పక్కకెళ్ళి పోయి, విక్రం కోసం విక్రం ఎలివేషన్స్ తో, మాస్ హీరోయిజంతో కథ నడపడం వల్ల అసలు ఎమోషన్లే పలకని ఫ్లాట్ గా కథనంగా మారింది కథ. తను ప్రేమించిన రరేప్ బాధితురాలు ఆరతి కోసమైనా ఒక ఎమోషనల్ డ్రైవ్ తో కథ నడుపుకోడు విక్రం. తన కెరీర్  గ్రాఫ్ కోసం దర్యాప్తులో తెలివి తేటలు ప్రదర్శించుకోవడం  అన్నట్టుగానే  వుంటుంది కథ

     ఇలా చిట్ట చివరికి రేపిస్టుని పట్టుకున్నాక, తన సర్వీస్ రివాల్వర్ ఆరతి కిచ్చి  కాల్చి చంపమంటాడు. ఆమె వాడ్ని కాల్చి చంపుతుంది. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపడంతో చంపింది తనే అవుతాడు. ఆమె కోసం ఈ రిస్కు తీసుకున్నాన్నమాట. వెంటనే తర్వాతి సీన్లో- ఇలా రేపిస్టు ని విక్రం చంపినా, ఐపీసీ సెక్షన్ 100 ప్రకారం ఆత్మ రక్షణ కోసం చంపడం నేరం కాదు కాబట్టి, క్లీన్ చిట్ ఇచ్చేస్తాడు పై అధికారి. దీంతో కథ ముగిసిపోతుంది. ఇదన్నమాట ది 100 కి అర్ధం.

ఇంత సింపుల్ గా జరిగిపోతుందా? పోకీసు అధికారి ఆత్మ రక్షణ పేరుతో ఒకర్ని చెంపి బయట పడిపోగలడా? సెక్షన్ 100 పోలీసుల గురించేనా? కాదు, సెక్షన్ 100 ప్రైవేట్ వ్యక్తుల గురించి. పోలీసుల గురించి సెక్షన్ 99 లో వుంది. ఐపీసీ సెక్షన్ 99 ప్రకారం ఆత్మ రక్షణ పేరుతో చంపే అధికారం పోలీసులకి లేదు! సినిమా కోసం సినిమా కథ ఇలాగే తీయవచ్చంటే ఇక చెప్పేదేమీ వుండదు!

ఇక పైన చెప్పుకున్నట్టు కథనం లో సస్పెన్, థ్రిల్ ఏమాత్రం అనుభవం కావు. విక్రం ఇన్వెస్టిగేషన్ ఏమాత్రం కథని పరుగులు తీయించదు. కారణం, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ని యాక్షన్ తో కాక డైలాగులతో నడపడం! పైగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదలు పాటించకుండా, మూస కమర్షియల్ ఫార్ములా రూపం లో దృశ్యాల్ని చూపించడం. దీని కంతటికీ ప్రధాన కారణం ఈ కథని విక్రం కథగా నడపడమే.

అదే ఆరతి కథగా నడిపి వుంటే- చిట్ట చివర్లో చెప్పే  టైటిల్ 100 అర్ధం,  కథ మధ్యకి  వచ్చి బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింటుగా, యాక్షన్ ని ప్రేరేపిస్తూ వుండేది. ఆరతి తనని  రేప్  చేస్తున్నప్పుడే రేపిస్టుగని కాల్చి చంపి, ఈ విషయం ప్రేక్షకుల నుంచి కూడా దాచిపెట్టి- ఇంటి మీదికి దోపిడీ కొచ్చిన ముఠాలో ఒకడ్ని తనే కాల్చి చంపినట్టు అబద్ధం చెప్పి, సెక్షన్ 100 ఆసరా తీసుకుని వుంటే, ఈ పాయింటు మీద కథ ఆసక్తికరంగా సాగేది. సెక్షన్ 100 ప్రకారం తను నిర్దోషినని వాదించడమే ఆమెతో కథ. ఆమెని విడిపించడానికి తగిన సాక్ష్యధారాల కోసం విక్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే, ఆరతి ఇరుకునపడి -తనని రేప్ చేసినందుకే రేపిస్టుని చంపానని  బ్యాంగ్ ఇస్తే - ముగింపు బ్లాస్ట్ అయి- బద్దలైన ఆమె రోదనలతో - షాక్ వేల్యూతో ఈ కథ వేరే ర్న్జిలో వుండేది.

సికిందర్