రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, July 31, 2020

963 : రివ్యూ!


దర్శకత్వం వెంకటేష్ మహా
తారాగణం: సత్యదేవ్, నరేష్, సుహాస్, హరి చందన, రూప తది తరులు
సంగీతం: బిజిబల్, ఛాయాగ్రహణం: అప్పు ప్రభాకర్
బ్యానర్: ఆర్కా మీడియా
నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్ల గడ్డ, ప్రదాస్ దేవినేని
విడుదల: నెట్ ఫ్లిక్స్

***
        త్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మలయాళ రీమేక్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. ప్రముఖ సంస్థ ఆర్కే మీడియా నిర్మించింది. ఇటీవలే సత్య దేవ్ నటించిన థ్రిల్లర్ ‘47 డేస్’ విడుదలైన విషయం తెలిసిందే. సత్యదేవ్ వెరైటీ పాత్రల్ని ఎంచుకుని తనకి సూటయ్యే జానర్ రియలిస్టిక్ సినిమాలు నటిస్తూ పోతున్నాడు. ‘మనవూరి రామాయణం’ లో ఆటో డ్రైవర్ పాత్రతో, ‘ఘాజీ’ లో మెరైనర్ పాత్రతో మంచి గుర్తింపు పొందాడు. ఇప్పుడు మలయాళ రీమేక్ తో సాధారణ విలేజి ఫోటోగ్రాఫర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ పాత్ర తనకి ప్లస్ అయిందా, ఏ మేరకు అయింది - అలాగే కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఈసారి రీమేక్ తో ఏ మేరకు మెప్పించాడు ఓసారి చూద్దాం...

కథ
      మహేష్ (సత్యదేవ్) అరకులో చిన్నపాటి స్టూడియో నడుపుకునే ఫోటోగ్రాఫర్. వృద్ధుడైన తండ్రి మనోహర్ రావు (రాఘవన్) వుంటాడు. తండ్రి నుంచే ఫోటోగ్రఫీ నేర్చుకుని ఈ వృత్తిలోకి వచ్చాడు. వీళ్ళకి సన్నిహితుడైన ఎముకల నాటు వైద్యుడు బాబ్జీ (నరేష్) వుంటాడు. హైస్కూలు అప్పట్నించీ మహేష్ ప్రేమిస్తున్న స్వాతి (హరిచందన) వుంటుంది. వూళ్ళో ఏ సమస్యలు లేకుండా హాయిగా గడిచిపోతున్న మహేష్ జీవితంలో వూహించని సంఘటన జరుగుతుంది. రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటూంటే మహేష్ అడ్డుకోబోతాడు. అడ్డొచ్చిన మహేష్ ని జోగినాథ్ అనే పక్క వూరి వెల్డర్ విపరీతంగా కొడతాడు. అతడి బలం ముందు మహేష్ బలం ఏమాత్రం చాలదు. అందరి ముందూ దెబ్బలు తిన్నందుకు అవమానం ఫీలవుతాడు. ఎలాగైనా ఇక జోగినాథ్ ని కొట్టి పగదీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. అంతవరకూ కాళ్ళకి చెప్పులు వేసుకోనని పంతం బూనుతాడు. 

        మరి మహేష్ పగ తీరిందా? అంత బలం ఎలా వచ్చింది? జోగినాథ్ దొరికాడా? ఈలోగా స్వాతి ఏమైంది? జ్యోతి (రూప) తో మహేష్ ప్రేమ ఎలా మొదలయ్యింది? ఇవన్నీ తెలియాలంటే మిగతా సినిమా చూడాలి. 

నటనలు- సాంకేతికాలు
      సత్యదేవ్ పాత్ర యాంగ్రీ యంగ్ మాన్ రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాదు. నిజ జీవితంలో కనిపించే సహజ పాత్ర. కాబట్టి ఆ బాపతు హీరోయిజాలూ, రివెంజి డైలాగులూ, యాక్షన్ సీన్లూ లేకుండా తాజాగా కన్పిస్తుంది. అవమానం పొందే ముందు నల్గురితో అతడి సాధారణ జీవిత దృశ్యాలు, అవమానం పొందాక పగదీర్చుకునే లోపు ఎదురయ్యే అసలు జీవిత దృశ్యాలూ  పాత్రని అర్ధంజేసుకుని శాంతంగా, ప్రభావశీలంగా నటించాడు. అరకు నేటివిటీలో కలిసిపోతూ రాణించాడు. కాకపోతే మలయాళ ఒరిజినల్ ప్రకారం పాత్ర కిచ్చిన ముగింపుతో విషయ రాహిత్యంగా కన్పిస్తాడు. తన పాత్రని, నటనని, గోల్ నీ ఫాలో అవుతున్న ప్రేక్షకులు తప్పకుండా విలన్ని కొట్టి పైచేయి సాధిస్తాడనే అనుకుంటారు. ముగింపు తెలిసిపోతూనే వుంటుంది. కమర్షియల్ సినిమా ముగింపు. కానీ తనది కమర్షియల్ పాత్ర కాదు. అలాటి నటన కూడా లేదు. కానప్పుడు ప్రేక్షకులు వూహించని రియలిస్టిక్ ముగింపే నివ్వాలి. తనని కొట్టిన వాణ్ని బలం పెంచుకుని కొట్టడం తెలుస్తున్న, పేలవమైన కమర్షియల్ ముగింపు. దీన్ని రివర్స్ చేసి తను మెచ్యూర్ అయిన పాత్రగా ఎదిగినట్టు చూపలేక పోయాడు. మెచ్యూరిటీ పరంగా ఎక్కడున్న వాడు అక్కడే వుండి పోతూ, ఇవ్వాల్సిన పాజిటివ్ మెసేజ్ ఇవ్వలేక  పోయాడు. 


        ఇతర పాత్రల్లో నరేష్ సహా అందరూ (చాలా మంది కొత్త వాళ్ళు) అరకు మనుషుల్లాగే కన్పిస్తారు. హీరోయిన్లు హరి చందన, రూప సినిమాకి రూరల్ రోమాంటిక్ విలువని చేకూరుస్తారు. బ్యాడ్ క్యారక్టర్ జోగినాథ్ గా నటించిన రవీంద్ర విజయ్, హీరో తండ్రి పాత్రలో రాఘవన్ పర నటులైనా నేటివిటీలో కలిసిపోయారు. 

        బిజిబల్ సంగీతంలో రెండు పాటలు మాంటేజీల్లో వస్తాయి. అప్పు ప్రభాకర్ కెమెరా వర్క్, రవితేజ ఎడిటింగ్ చెప్పుకోదగ్గవి. 

కథాకథనాలు
  2016 లో విడుదలైన మలయాళ ‘మహేషింటే ప్రతీగారం’ రీమేక్ కథ ఇది. దీనికి కంచరపాలెం తీసిన దర్శకుడు వెంకటషే నేటివ్ ఫీల్ కి సరైన న్యాయం చేయగలడు. మలయాళ వాసన లేకుండా అచ్చమైన తెలుగు కథలా తీశాడు. కథనంలో గానీ, దృశ్యాల చిత్రీకరణలో గానీ రెగ్యులర్ తెలుగు సినిమాలకి అలవాటు పడిన- దర్శకుడి అహం బయటపడే - ఎలాటి కమర్షియల్, టెక్నికల్ కాలుష్యాలు జొరబడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలాటి సినిమాకి అగ్రనిర్మాతలు చేయూత నివ్వడం ఒకెత్తు. వాస్తవిక దృక్పథం పెల్లుబికే  కథలతో బ్రతికే ఆరోగ్యకరమైన ఇలాటి చిన్న సినిమాలకి అగ్రనిర్మాతల వల్లే బలం లభిస్తుంది. 


        మలయాళ సినిమాలంటే తేలికపాటి సంఘర్షణలతో కూడిన లైటర్ వీన్ సినిమాలు. తెలుగు ప్రేక్షకులు ఏళ్లకేళ్ళు పిచ్చి పిచ్చి లైటర్ వీన్ ప్రేమ సినిమాలకి అలవాటు పడ్డారుగానీ, ఇలాటి తేలికపాటి కాన్ఫ్లిక్ట్ వుండే మలయాళ మార్కు మంత్రాలకి కాదు. కాన్ ఫ్లిక్ట్ వుంటుంది, కానీ ఆ కాన్ఫ్లిక్ట్ తోనే కథ వుండదు. కథ పాత్రకి చెందిన ఇతర జీవిత కోణాల్ని సృశిస్తూ పోతూ, చిట్ట చివరికి ఎదుటి పాత్రతో అమీ తుమీకి దిగి కాన్ఫ్లిక్ట్ తేల్చు కుంటుంది. ప్రస్తుత కథ కూడా ఇదే బాపతు. 

        తనని కొట్టిన వాణ్ని కొట్టాలి సత్య దేవ్. ఇంత చిన్న కాన్ఫ్లిక్ట్. ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ ని పట్టుకుని కథ నడిపితే సిల్లీగా వుంటుంది. అందుకని కొట్టిన వాడు దుబాయ్ వెళ్లి పోతాడు. చేసేది లేక వాడు  వచ్చాకే కొడదామని ఇతర వ్యాపకాల్లో పడిపోతాడు సత్యదేవ్. ఆ ఇతర వ్యాపకాలు ఇద్దరు భామలతో ప్రేమలు, వాటి అతీగతీ, ఫోటోగ్రఫీలో తండ్రి నుంచి ఇంకాస్త జ్ఞానం, కుంగ్ ఫూ నేర్చుకోవడం, ఇతర కార్యక్రమాలు వగైరా వగైరా. ఇక కొట్టిన వాడు దుబాయి నుంచి రాగానే వాణ్ని కుంగ్ ఫూతో పబ్లిగ్గా కొట్టి పడేసి, పోయిన పరువు రాబట్టుకుంటాడు. 

        ఈ కథ పాయింటు 2001 లో వచ్చిన హాలీవుడ్ హిట్, టిమ్ అలెన్ నటించిన ‘జో సమ్ బడీ’ లో కూడా వుంది. టిమ్ ని కూతురు ముందు ఒక బలవంతుడు అన్యాయంగా కొడతాడు. టిమ్ కి గొప్ప అవమాన మైపోతుంది. అదే కూతురి ముందు వాణ్ని కొట్టి ప్రూవ్ చేసుకోవాలని సిద్ధమై పోతాడు. ఇందుకు కరాటే, కుంగ్ ఫూ వంటి వన్నీ నేర్చుకుంటాడు. వీడేంట్రా అని నవ్వుతున్నా పట్టించుకోడు. చివరికి పుష్టిగా, బలంగా తయారై కూతురి స్కూలు ముందు ఈవెంట్ పెట్టి వాణ్ని రమ్మంటాడు. కానీ వాడికంటే బలవంతుడుగా మారిన తను కొట్టడు. కొట్టి పైచేయి సాధిస్తే అది కథ ఎందుకవుతుంది? ఇది స్పోర్ట్స్ కథ కాదు కదా? అందుకని కొట్టడానికంటే మించిన మెసేజ్ ఒకటుంది. ఆ మెసేజి వల్ల తను మెచ్యూర్డ్ వ్యక్తిగా ఎదగగల అవకాశం....ఇగోని  మెచ్యూర్డ్ ఇగో మార్చే ముగింపే కదా మంచి కథా లక్షణం. మలయాళంలో, తెలుగు రీమేక్ లో ప్లాట్ క్లయిమాక్స్ ని ప్లాట్ క్లయిమాక్స్ గానే ముగించారు. ‘జో సమ్ బడీ’ లో ప్లాట్ క్లయిమాక్స్ గాకుండా, చక్కటి స్టోరీ క్లయిమాక్స్ చేశారు...

-సికిందర్