రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, సెప్టెంబర్ 2016, ఆదివారం

రివ్యూ:










రచన – దర్శకత్వం : ప్రభు సాలమన్

తారాగణం: ధనుష్‌, కీర్తీ సురేష్‌, గణేష్‌ వెంకట్రామన్‌, హరీష్‌ ఉత్తమన్‌, రాధా రవి, తంబిరామయ్య తదితరులు
సంగీతం: డి, ఇమాన్,  ఛాయాగ్రహణం: వెట్రివేల్‌ మహేంద్రన్‌
బ్యానర్‌:  ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌
నిర్మాతలు : ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి
విడుదల: సెప్టెంబరు 22, 2016
***

          కొలవరివాలా ధనుష్ తో తమిళ దర్శకులు చేస్తున్న ప్రయోగాలు బెడిసికొ డుతున్నాయి. వేలురాజ్ అనే రియలిస్టిక్ సినిమాల దర్శకుడు గత సంవత్సరం ధనుష్ ని నిలువునా మాస్ క్యారక్టర్ లోకి దింపి ‘మాస్’ అంటూ తీస్తే అది తెగ ఆర్ట్ ఫిలిమే అయింది. ఇప్పుడు ఇంకో ప్రేమ కథల దర్శకుడు ప్రభు సాలమన్ ధనుష్ ని ‘టైటానిక్’ లెవెల్ కి నిలువునా లేపి ‘రైల్’ అంటూ తీస్తే ఇది నాటు ఫిలిమే అయింది. ధనుష్ ఇంకో రెండు సినిమాలు షూటింగుల్లో వున్నాయి. అవేమవుతాయో మరి. ‘మాస్’ కి  సీక్వెల్ గా ఇంకోటి కూడా ఎనౌన్స్ చేశారు. ఈ మూడు సినిమాల రాకని వచ్చే సంవత్సరం తెలుగు ప్రేక్షకులు ధైర్యంగా కాచుకోవాలి తప్పదు! 

          ప్రేమ కథల స్పెషలిస్టు ప్రభు సాలమాన్ ‘రైల్’ అంటూ తీసిన ఈ డిజాస్టర్ జానర్ మూవీ ఈ మధ్య తెలుగులో వచ్చిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే డిజాస్టర్ జానర్ మూవీ లాగే,  ప్రేమ కథని చెప్పలేక పట్టాల మీద ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికులే  కాదు, ప్రేమ కథలు కూడా రైలు పట్టాల మీద ఆత్మహత్యలు చేసుకోగలవన్న కొత్త సత్యాన్ని పాతాళం లోంచి తవ్వి తీసి చూపెట్టింది.
        టైటానిక్ లో పేద చిత్రకారుడు  డీ కాప్రియో ఓడలో ప్రయాణిస్తున్న దొరసాని విన్ స్లెట్ ని ప్రేమిస్తే, క్యాటరింగ్ బాయ్ ధనుష్ వచ్చేసి రైల్లో ప్రయాణిస్తున్న దొరసాని సేవకురాలు కీర్తీ సురేష్ తో అడ్జెస్ట్ అయిపోయాడు. దర్శకుడు ప్రభు సాలమన్ కిది నచ్చలేదు. అందుకని ఇద్దరి ప్రేమ కథనీ నుజ్జు చేసి, వీడియో గేమ్ లా రైలాట ఆడుకోవడంలో పడిపోయాడు.
        ఇలా దర్శకుడి వ్యసనం  ప్రేక్షకుల వ్యసనం అవుతుందా?

కథ 
      క్యాటరింగ్  బాయ్ బల్లి శివాజీ (ధనుష్  పాత్ర పేరు తమిళంలో పూచియప్పన్, ఈ తెలుగు డబ్బింగ్ లో ఇతర పాత్రలు బల్లీ  అనే పిలుస్తాయి) ఒక చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకుని చక్కగా జీవితం గడపాలని కలలు గంటూంటాడు. తోటి క్యాటరింగ్ బాయ్ (కరుణా కరణ్) తన కవితలతో ఆటలు పట్టిస్తూంటాడు. క్యాటరింగ్ మేనేజర్ చంద్రకాంత్ ( తంబి రామయ్య) కి కూడా ఎవర్నైనా ప్రేమించాలని ఉబలాటంగా వుంటుంది. ఇలా ప్రయాణిస్తున్న ఢిల్లీ- చెన్నై  దురంతో ఎక్స్ ప్రెస్ ట్రైను లో సినిమా హీరోయిన్ శిరీష కూడా ప్రయాణిస్తోందని తెలుస్తుంది. ఆమెకి క్యాటరింగ్ చేయడానికి పోటీలు పడతారు. చివరికి కూపే లోకి ఆహార పదార్ధాలతో బల్లి వెళ్లి- ఆ హీరోయిన్ మేకప్ టచప్ గర్ల్ సరోజ(కీర్తీ సురేష్) అని వుంటుంది- చూడగానే ఆమెని ప్రేమించడం మొదలెడతాడు. ఆమె అస్సలు ఒప్పుకోదు. కానీ ఆమెకి పాటలిష్టమని గ్రహించి, ఫోన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రితో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు బల్లి. దీంతో ఆమె బల్లిలా అతుక్కుని - తనకి సింగర్ ని అవ్వాలని వుందని చెప్పి, సిరివెన్నెలకి తనని పరిచయం చేసి రెహమాన్ దగ్గరికి వెళ్ళేలా చూడమని వెంటపడ్డం మొదలెడుతుంది. 

        ఇలా సాగుతూండగా ఓ  స్టేషన్ లో కేంద్ర మంత్రి (రాధారవి) ఈ రైలెక్కుతాడు. ఈ రోజుల్లో ఏ మంత్రి  రైలెక్కుతాడు, ఏ హీరోయిన్ రైల్లో ప్రయాణిస్తుంది. మంత్రి వెంట ఇద్దరు ఎన్ ఎస్ జీ కమాండోలుంటారు.  వాళ్ళల్లో నందకుమార్ ( హరీష్ ఉత్తమన్) అనే కమాండో  ఏదో మానసిక సమస్యతో కర్కశంగా వుంటాడు. ఇతను చిన్న విషయానికే బల్లితో శత్రుత్వం పెంచుకుంటాడు. ఇంకో స్టేషన్లో  కొందరు దొంగలు ఎక్కుతారు. ఇలా పోతూ పోతూ ట్రైను అసిస్టెంట్ డ్రైవర్ సీనియర్ డ్రైవర్ తో గొడవపడి ట్రైను మిస్సవుతాడు. వెళ్తున్న రైల్లో సీనియర్ డ్రైవర్ గుండె పోటుతో చచ్చి పోతాడు. స్పీడందుకుని ఎక్కడా ఆగకుండా దూసుకు పోతూంటుంది ట్రైను. దీన్నాపేదెవరు, ఎలా ఆపారు, బల్లి- సరోజలు ఏమయ్యారు, వాళ్ళ ప్రేమ ఏమయ్యింది మొదలైనవి తెలుసుకోవాలంటే ఈ ‘రైల్’ ఎక్కాల్సిందే. 

ఎలావుంది కథ 
      2010 లో డెంజిల్ వాషింగ్టన్ నటించిన ‘అన్ స్టాపబుల్’ నుంచి స్ఫూర్తి పొంది నట్టుంది ఈ కథ. అది గూడ్స్ రైలైతే ఇది ప్రయాణీకుల రైలు. అది నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా కథయితే, ఇది ఆ కథలోంచి పాయింటు ఎత్తుకున్న కల్పిత కథ. దీనికి ప్రేమ కథ అల్లారు. సాధారణంగా ఇలాటి డిజాస్టర్ జానర్ కథల్ని ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతిలో చెప్తారు : ప్రేమ కథనే ప్రధానంగా చెప్పాలనుకుంటే ఇతర పాత్రల జీవితాల- కథల- ఉపకథల జోలికెళ్ళకుండా- ‘టైటానిక్’ లోలాగా,  కేవలం ఆ ప్రేమ జంట ఏమవుతుందన్న దానిమీదే ఫోకస్ చేసి కథ నడిపిస్తారు. అప్పుడది ప్రమాదం నేపధ్యంలో ప్రమాదంలో పడ్డ ప్రేమ కథగా –అదే ప్రధాన కథగా సాగుతుంది. 

        లేదంటే ప్రమాదాన్నే ప్రధాన కథగా నడిపించే పద్ధతిని అవలంబిస్తారు. అప్పుడిం దులో ఏ పాత్రకీ ఒక కథంటూ వుండదు. అన్ని పాత్రల కథా ఒక్కటే- ప్రమాదం- ఆ ప్రమాదంలోంచి బయటపడేందుకు ప్రయత్నించడం అయివుంటుంది, అంతే.  హాలీవుడ్ లో పేరెన్నిక గన్న ‘పాసిడాన్ అడ్వెంచర్’, ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’  ఇలాంటివి. హిందీలో కూడా  ‘బర్నింగ్ ట్రైన్’ అని వచ్చింది. 

        ప్రభు సాలమన్ ఈ రెండు విడి విడి పద్ధతుల్ని కలిపేసి గందరగోళం సృష్టించాడు. ప్రమాద కథ నేపధ్యంలో ప్రేమ కథని సృష్టించిన వాడు దాంతో సరిపెట్ట కుండా- దీని తర్వాత మళ్ళీ సినిమాలు తీసే ఛాన్సు దక్కక పోవచ్చు అన్నట్టు- లేనిపోని పాత్రలన్నిటి ఉపకథలు కూడా కలిపేసి – ‘టైటానిక్’ లో ‘టవరింగ్ ఇన్ ఫెర్నో’  కూడా చూపించినట్టు అనితరసాధ్య సృష్టి చేశాడు. 

        ఒక కథ అనుకున్నప్పుడు  ఇలాటి కథతో ఇతర సినిమా లెలా వచ్చాయని రీసెర్చి చేసి తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. రీసెర్చిని పాయింట్లు కాపీ కొట్టడం కోసమే చేస్తే ఎలా? ప్రయాణీకులు లేని గూడ్స్ రైలు కథ చూసి, దానికి ప్రయాణీకుల్ని జోడించి, తన కథగా మార్చుకుంటున్నప్పుడు - ప్రయాణీకుల కథల్లో కూడా పైన చెప్పుకున్నట్టు రెండు వెరైటీలు వేచి చూస్తూంటాయని కూడా తెలుసుకోవాలి. పాపం ప్రభు సాలలమన్ కోసం అంతగా వేచి చూస్తున్న రెండు వెరైటీలు లబోదిబోమన్నాయి-  ఆయన  అత్యాశకి పోయి రెండిటినీ చెరబట్టేసరికి. అవి బై వన్- గెట్ వన్ గా ఛస్తే వుండవు!

ఎవరెలా చేశారు 
      నకి మామగారు రజనీకాంత్ లాంటి ‘రోబో’ ఒక్కటి కూడా దొరకలేదని అలిగినట్టు- ఈ ‘రైలు’ కన్పించగానే దీన్నే  రోబోగా ఫీలైపోయి ఎక్కేసి వీరంగం వేశాడు ధనుష్. ఇప్పుడు తనకీ చెప్పుకోవడానికి ఒక ధనుష్ రోబో అంటూ దక్కింది. 100-120 స్పీడుతో వెళ్ళే రైలు టాపు పైన హీరోయిన్ తో డాన్సులూ, దొంగలతో ఫైట్లూ- రైలు తగలబడుతున్నా కూడా  టాపు మీద ఆనంద విహారాలూ చేస్తాడు. ‘దిల్సే’ లోకూడా మణిరత్నం ట్రైను టాపు మీద ఛయ్య ఛయ్యా పాట పెట్టారు. కానీ ఆ ట్రైను స్లోగా పోతూంటుంది పాట కోసమే అన్నట్టు. ధనుష్ ఫిజిక్ కి ఆ ఎత్తున దూసుకుపోయే రైలు మీద క్లయిమాక్స్ వరకూ అదే పనిగా అన్ని విన్యాసాలు ఎలా సాధ్యమో  ప్రభువుకే తెలియాలి. బల్లి కాబట్టి జారిపోయే, ఎగిరిపోయే లక్షణాలు లేవేమో? 

        రైలు లోపల ప్రేమిస్తున్నప్పుడు, కేటరింగ్ బాయ్ గా సర్వ్ చేస్తున్నప్పుడూ  నవ్విస్తూ బాగానే వుంటాడు. కోపిష్టి కమాండోని ఆటలు పట్టిస్తూ కూడా బాగానే ఎంటర్ టైన్ చేస్తాడు. ఇంటర్వెల్ కి అరగంట ముందు దారితప్పడం మొదలెడతాడు కథతో బాటు (ఇంటర్వెల్ గంటన్నరకి పడుతుంది!). ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ప్రారంభమయ్యాక 18  నిమిషాల వరకూ కన్పించడు! ఒక హీరో ఇంత సేపు తెరమీద కన్పించకపోవడం ఇదే మొదటి సారేమో! ఆ తర్వాత వచ్చి ఏం చెయ్యాలో తెలీక టాపు మీదే వుండిపోతాడు. 

        హీరోయిన్ కీర్తీ సురేష్ చూడ్డానికి సింపుల్ గా బావుంది. ఆ పాత్రలో నటన కూడా ఫర్వాలేదు. పాడ రాకపోయినా, కనీసం గాత్ర శుద్ధి లేకపోయినా, సింగర్ నవుతానన్న నమ్మకంతో తన పేరు చిత్రా ఘోషల్ గా మార్చుకుని పాడతానని హీరోని భయపెట్టే సీన్లొక్కటే ఆమెకి రాణించాయి- రైలుకి ప్రమాదం మొదలయ్యాక ఆ పాటా లేదు, ప్రేమా లేదు. 

        కమెడియన్ తంబి రామయ్య , 2010లో ప్రభు సాలమన్ తీసిన ‘మైనా’ (ప్రేమఖైదీ) అనే హిట్ లో హెడ్ కానిస్టేబుల్ గా బాగా అలరించాడు. అది ఈసారి ఓవరాక్టింగ్ వల్ల మిస్సయ్యింది. ఇంకో కమెడియన్ కరుణా కరణ్ ఫర్వాలేదు గానీ, కమాండోగా నటించిన మలయాళీ నటుడు హరీష్ ఉత్తమన్ కే సరైన పాత్రలేక వూరికే చచ్చిపోతాడు.

         సంగీత దర్శకుడు ఇమాన్ మెలోడీ పాట లివ్వడానికి ప్రయత్నించాడు-  ఈ గందరగోళపు సినిమాలో ఇవే కాసేపు రిలీఫ్ నిస్తాయేమో. మహేంద్రన్ ఛాయాగ్రహణం చెప్పుకో దగ్గది. సీజీ వర్క్స్ లో చెన్నై సెంట్రల్ ధ్వంసమయ్యే  దృశ్యం మాత్రం హైలైట్. 

చివరికేమిటి?
      ‘మైనా’, ‘కుమ్కీ’ లాంటి అద్భుత సినిమాలు తీసిన ప్రభు సాలమన్ ఆ తర్వాత టెక్నాలజీ మీద మోజు పెంచుకుని ప్రేమ కథలని డిజాస్టర్ మూవీస్ జోన్ లోకి తోసేశాడు. 2014 లో సునామీ నేపధ్యంలో సీజీ టెక్నాలజీని వాడుకుని ‘కాయల్’ అనే ప్రేమ కథ తీసి, మళ్ళీ ఇప్పుడు అదే  ఒరవడిలో ‘రైల్’ అనే ప్రేమ కథ తీశాడు. ఈ ప్రమాద నేపధ్యాలతో కథ చెప్పడంలో తన సహజ శక్తిని కోల్పోయాడు. మూసఫార్ములాకి మళ్లిపోయాడు. అతుకుల బొంతలా తీయడం మొదలెట్టాడు బిగ్ బడ్జెట్స్ కెళ్ళి. 

        బిగ్ బడ్జెట్ సినిమా అంటే బోలెడుమంది నటులతో భారీ కథ అని కాదు. బిగ్ బడ్జెట్ సినిమా అంటే భారీహంగులతో కూడిన సింపుల్ కథ. ‘భారతీయుడు’ నుంచీ ‘సింహా’ వరకూ ఇలాగే వుంటాయి. ప్రభు సాలమన్ నడుస్తున్న రైల్లో నడుస్తున్న ప్రేమ కథ మీద దృష్టి పెట్టకుండా- ఫస్టాఫ్ గంటన్నర పాటు సహనాన్ని పరీక్షిస్తాడు. లవ్ ట్రాక్ నడుస్తూండగా దీనికి ట్విస్ట్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూంటే, గంట సేపటికి కేంద్ర మంత్రి ఎంటరై, అతడి కమాండో తో ప్రేమకథకి ఏదో పాయింటు ఎస్టాభ్లిష్ అవుతుందని ఆశిస్తాం, ఇంతే కదా? లేకపోతే విలన్లా కొత్త పాత్ర రావడమెందుకు? అది జరగదు. అంతలో మంత్రిని ఎవరో కాల్చి చంపుతారు. పోనీ ఇదే కథవుతుందేమో అనుకుంటాం. ఇదీ జరగదు. గన్ పోయిందని కమాండో కంగారు పడుతూంటాడు. మంత్రి పిల్చి ఆ గన్  మోహన పడేసి, ఎక్కడ పడితే అక్కడ పారేసుకోకని తిడతాడు- అంటే మంత్రి హత్య జరగడం కమాండో ఇమాజినేషన్ అన్న మాట! ఈ సమయంలో ప్రేక్షకుల్ని ఇలా చీట్ చేస్తారా? దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎలా చెప్పాలనుకుంటున్నాడు?

        ఇంతలో రైల్లో టెర్రరిస్టులా ఒక అనుమానాస్పద వ్యక్తి ఎక్కుతాడు. సరే, వీడితో ట్విస్ట్ వస్తుందనుకుంటాం- ఇదీ జరగదు. సెకండాఫ్ లో వీడితో పాటు వున్న దొంగలు దోపిడీకి పాల్పడతారట. హీరోకీ కమాండోకీ కొట్లాట వచ్చి హీరోని ఒక కూపేలో బంధించేస్తాడు కమాండో. హీరో బందీ అయిపోతే కథ నెవరు నడుపుతారు. అప్పుడు ఒక బర్రె కథకి ట్విస్టు ఇచ్చి ఇంటర్వెల్ నిస్తుంది. బర్రె గుద్దుకుని రైలాగి పోవడంతో, ఇంకో పెద్ద గొడవ మొదలవుతుంది- తాగుబోతు అసిస్టెంట్ డ్రైవర్ సీనియర్ తో గొడవ పెట్టుకుంటాడు. జీడిపాకంలా వీళ్ళ గొడవే సాగుతూంటుంది. సాగిసాగి చివరికి అసిస్టెంటూ గార్డూ గల్లా గల్లా పట్టుకుని కుస్తీ పట్లు పడుతూంటే, వాళ్ళని వదిలి పారేసి సీనియర్ డ్రైవర్ రైలుని లాగించేస్తాడు.  కొంత దూరంలో ఎవరూ ఆపకుండానే తన గుండాగిపోయి చచ్చిపోతాడు. ఇక రైలూ, రైలుతో బాటు కథా, కథతో బాటూ మనమూ ఇంటర్వెల్ అనే ఘోరమైన గోతిలో పడతాం! 

        సింపుల్ గా తాగుబోతు అసిస్టెంట్ తాగి పడిపోయాడు, డ్రైవర్ హార్ట్ ఎటాక్ తో పోయాడు- దిక్కుమాలిన కథకి రైలు దైవాధీనమైంది అంటే సరిపోదా? ఈ బర్రె లేంటి, కుస్తీ పోటీ లేంటి, బూతు లేంటీ, పావు గంట సేపు బుర్ర తినెయ్యడ మేంటీ, హీరోగారు షాట్ గ్యాప్ లో కారవాన్ లో కూర్చున్నట్టు- కూపేలో బందీ అయిపోయి సినిమాని గాలికి వదిలెయ్యడ మేంటీ?

        సెకండాఫ్ 18 నిమిషాలవరకూ హీరో గారు కన్పించనే  కన్పించరు. కన్పించాక కూపే  లోంచి బయటపడి-  రైలు ఎందుకిలా పోతోందో తెలుసుకోడు. అసలు ఫీల్ కాడు. టాపెక్కి పాటలూ ఫైట్లూ వేసుకుంటాడు. పొలోమని ఇంకిన్ని పాత్రలు సబ్ ప్లాట్స్ వేసుకుని  వచ్చేస్తాయి.రైలాపడానికి హీరో కాకుండా రకరకాల రైల్వే అధికారులు, పోలీసు అధికారులు, ఎన్ ఎస్ జీ  కమాండోలు, రాపిడ్ యాక్షన్  ఫోర్స్ వాళ్ళూ, మీడియా వాళ్ళూ  దిగిపోయి కథని పంచేసుకుని ఇష్టా రాజ్యం చేస్తారు, అందరిదీ ఒకటే కంగారు- రైలుని టెర్రరిస్టులు హైజాక్ చేశారని లాజిక్ లేని ప్రహసనాలకి  హాస్యాస్పదంగా తెర తీస్తారు. ఒక ఛానెల్ యాంకర్ రెండేసి సీన్ల కోసారి రాజకీయ నేతల్ని కూర్చో బెట్టుకుని చర్చ మొదలెడతాడు ఈ హైజాక్ మీద. లైవ్ ఇస్తూ రెచ్చిపోతాడు. అంత స్పీడుతో పోతున్న రైల్లో ఏం జరుగుతోందో కార్లో వెంటాడుతూ రిపోర్టర్ లైవ్ ఇస్తోందట!  రైలు కట్ట పక్కనే చెన్నై దాకా సాఫీగా రోడ్డు వేశారేమో రైలుని వెంటాడ్డానికి... 

        డ్రైవర్ చనిపోయి రైలుకీ పరిస్థితి వచ్చిందని చివరి దృశ్యాల్లోనే  హీరో తెలుసుకుంటాడు! అంతటి అమోఘమైన పాసివ్ పాత్ర. ఇలా ధనుష్- ప్రభు సాలమన్ లు రకరకాల పాత్రల ఉపకథలతో ప్రేమ కథని ఇంటర్వెల్ లోపే చంపేసి, ధనుష్ బల్లి పాత్రని కూడా బలి చేసి, రైలుతో రోబోటాడుకుని  వదిలేశారు!
       


-సికిందర్
http://www.cinemabazaar.in