రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, December 9, 2017

562 : సందేహాలు - సమాధానాలు




Q :    మా రోమాంటిక్ కామెడీ నిర్మాణం పూర్తయి విడుదలకి సిద్ధమవుతోంది. టైటిల్ ని మీరే సరిదిద్దారు. రోమాంటిక్ కామెడీల గురించి మీరు చెప్పే థియరీలు మేం పాటించలేదు. ఒకరు చెప్పింది పాటించాలంటే ప్రాబ్లం వస్తోంది. ఎవరికి వచ్చింది, నచ్చింది  వారు రాసుకుని  తీసుకునే స్వేచ్ఛ లేదా? రోమాంటిక్ కామెడీలని మీరెందుకు అంత చిన్న చూపు చూస్తారు?
- శ్రీనివాస్ ఆర్,  కో- డైరెక్టర్
A
:    మీ హిందీలో పెట్టిన  టైటిల్ తెలుగు అక్షరాలు సరిచేయమంటే సరిచేశామంతే. మీ రోమాంటిక్ కామెడీ సబ్జెక్ట్ ఏమిటో తెలీదు. ఇన్ని సంవత్సరాల పరిచయంలో మీరెన్నో సబ్జెక్టులు చెప్పారు, దీని గురించి చెప్పలేదు, మనం అడగలేదు. చెప్పడం మీ చేతిలో లేకపోవచ్చు. ఐతే ఈ బ్లాగులో సొంత థియరీలు చెప్పడం లేదు. ఎవరో ప్రూవ్ చేసుకున్న మేధావులు చెప్పినవి, చెబుతూ వున్నవీ  మాత్రమే తెలుగుకి పరీక్షించి నాణ్యమైనవి చేరవేస్తున్నామంతే. పరీక్షించగల్గేంత సొంత తెలివితేటలు మాత్రమే మనకున్నాయి. థియరీలు మనవల్ల కాదు. వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఐతే ఒకటి – అటు మేధావుల్నీ ఒప్పుకోక, ఇటు రివ్యూ రైటర్లనీ ఒప్పుకోక సాధిస్తున్నదేమిటి?  90 శాతానికి  పైగా అట్టర్ ఫ్లాపులేగా?  ఒకటేమిటంటే- అర్ధవంతమైన స్వేచ్ఛ, అనర్ధదాయకమైన స్వేచ్ఛ అని రెండుంటాయి. మీరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, మీదే స్వేచ్ఛ? అర్ధవంతమైన స్వేచ్చే అయితే ఇన్నేళ్ళుగా తీస్తున్న రోమాంటిక్ కామెడీలన్నీ బాక్సాఫీసు దగ్గర ఎందుకు తన్నేస్తున్నాయి? ఇలాటి స్వేచ్ఛ మీదే చిన్నచూపు తప్ప, రోమాంటిక్ కామెడీల మీద కాదు. రోమాంటిక్ కామెడీల్ని ఎంత బాగా ఎప్పుడు ఎంజాయ్ చేయవచ్చంటే, ఒక ‘హేపీ భాగ్ జాయేగీ’  లాగా, ఒక ‘బరేలీకి బర్ఫీ’ లాగా, ఒక ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లాగా, ఆఖరికి ‘అహ నాపెళ్ళంట’ లాగా తీయగల్గినప్పుడు! రాసుకునే, తీసుకునే స్వేచ్ఛ అంటూ ఇవాళ్టి తెలుగు దర్శకులు పక్కన పెడుతున్న రోమాంటిక్ కామెడీ జానర్ థియరీ పాలన అంతా ఈ హిట్టయిన  రోమాంటిక్ కామెడీల్లో వుందంటే నమ్ముతారా?  థియరీల్నిఅంగీకరించే మనసున్నప్పుడే  అర్ధవంతమైన స్వేచ్ఛ అనుభవంలో కొచ్చి, ఏవో మంచి పనులు చేయగల్గుతాం. స్వేచ్ఛ స్వతంత్రంగా వుండదు, అది సాపేక్ష పదం.
Q :    కథకి అదెక్కడ జరుగుతోందో ప్రాంతాన్ని / లొకేషన్ ని  తెలియజేసే అవసరముంటుందా?
-దిలీప్ కుమార్,  ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ
 
A :   ప్రొడక్షన్ రీత్యా అవసరమే. సీను పేపరు మీద ప్రాంతం / లొకేషన్ రాసినప్పుడే అదెక్కడ తీయాలో తెలుస్తుంది. కథాపరంగా అయితే తప్పనిసరి కాదు. ఎన్నో కథలు, నవలలు ఆ  ఇతివృత్తాలు నడిచే ప్రాంతాల్ని తెలపకుండానే వస్తూంటాయి. ఐతే సినిమా కథల్లో  ప్రాంతం పేరు ప్రస్తావిస్తే, ఆ ప్రాంతానికి వెళ్లి తీయక తప్పదు. పాత్ర జూబ్లీ హిల్స్ వెళ్తున్నానని చెప్తే, దాని వెంట వెళ్లి జూబ్లీ హిల్స్ చూపించాల్సిందే – అక్కడ సీను అవసరముంటే. ఒకవేళ పాత్ర జూబ్లీ హిల్స్ వెళ్తున్నానని చెప్పివెళ్లి, తర్వాత వచ్చి పడుకుంటే జూబ్లీ హిల్స్ వెళ్లి వచ్చినట్టే  అర్ధం వస్తుంది. ‘అది రాజోలు పట్టణం’  అని అక్షరాలేస్తే మాత్రం,  రాజోలు చూపించాల్సిందే. పాత్రని ఒక రిచ్ అపార్ట్ మెంట్ ఇంటీరియర్ లో చూపిస్తూ,  అది అమెరికాలో వున్నట్టు చెప్పి చీట్ చేయవచ్చు. ఫారిన్ లో పాటలు తీస్తే, ఆ దేశాల పేర్లు వేస్తే  నవ్వుకుంటారు ప్రేక్షకులు. ఫారిన్లో కథ నడుస్తూంటే దేశం పేరు చెప్పాలి తప్పదు. ఐతే కథ రాసేటప్పుడు ప్రాంతాల్ని/ లొకేషన్స్ ని బడ్జెట్టే నిర్ణయిస్తుంది. కోటి రూపాయలతో తీసే కథకి జూబ్లీ హిల్స్ సీన్లు రాస్తే ఐదు కోట్లు బడ్జెట్ అవుతుంది. హీరో చీప్ లొకేషన్ అనుకుని బతుకమ్మ కుంట వెళ్తున్నానని చెప్పినా కష్టమే. షూటింగ్ అయ్యేసరికి నల్లకుంట నాలా అవుతుంది బ్యానర్ పరిస్థితి. బడ్జెట్ భారీగా వుంటే ఎలాగూ బతుకమ్మ కుంట సెట్ వేస్తారు. కథ ఫలానా ప్రాంతంలో జరుగుతున్నట్టు రిజిస్టర్ చేయాలి తప్పదనుకున్నప్పుడు ఈ ప్రశ్నలుంటాయి-  దేనికి? కథ డిమాండ్ చేస్తోందా లేక కథకుడు సొంత కోరికలు పెట్టుకున్నాడా? (సొంత వూళ్ళో తీసుకోవాలని ఉబలాటంగా వుంటుంది), కథ డిమాండ్ చేయకపోయినా, కథని అక్కడ తీస్తే కథకే సొగసు వస్తుందా? (ఈవీవీ సత్యనారాయణ ‘చెవిలో పువ్వు’ గుంటూరులో తీస్తే కథకి ఆ నేటివిటీ, ఫీల్ ప్లస్ అయ్యాయి),  ఇతర సినిమాలు ఆ ప్రాంతాల్లో తీశారనా? ( మలయాళ సినిమాలు గ్రామాల్లో తీయాలంటే ముందు ఆ గ్రామాలు చూసి సీన్లకి లొకేషన్స్ డిసైడ్ చేసుకుని ఆ నేపధ్యంలో రాసుకుంటారు. ప్రతీ గ్రామంలో ఏదోవొక లాండ్ మార్క్ స్థలం వుంటుంది. అక్కడ కీలక సన్నివేశాలో, పతాక సన్నివేశమో తీసేలా ప్లాన్ చేస్తారు. అంతవరకూ సినిమాలో ఆ లాండ్ మార్క్ ప్లేసులు ఎక్కడా ఫ్రేములోకి కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు).
          మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి –బడ్జెట్ స్క్రిప్టు  పరిమితులు...


సికిందర్