రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, March 25, 2021

1030 : టిప్స్

        చిన్న సినిమాకి దానిదైన సొంత జీవితం ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాల ఛాయల్ని దగ్గరికి కూడా రానివ్వదు. పెద్ద సినిమాలన్నీ ఒకే పోతలో పోసినట్టున్నా చెల్లిపోవచ్చు. చిన్న సినిమాలకి ఏ కథకా కథగా యూనిక్ క్రియేషన్ వుంటుంది. ఇదే వాటిని నిలబెడుతుంది. అదే సమయంలో చిన్న సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్ట్రక్చర్ ని పాటిస్తే కథా కథనాలే కాదు, ప్రధాన పాత్ర ననుసరించి ఇతర పాత్రలు, పాత్ర చిత్రణలు, వాటి ప్రయాణాలు, చెప్పాలనుకున్న పాయింటూ సమస్తం ప్రభావ శీలంగా అర్ధవంతంగా వస్తాయి.         

స్ట్రక్చర్ వల్ల కాన్సెప్ట్ దానికదే లోతుపాతుల్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రక్చరే పట్టని స్క్రిప్టుతో చిన్న సినిమా చెత్త బుట్ట దాఖలవుతుంది. బుట్ట దాఖలయ్యే సినిమాలే మెట్ట వ్యవసాయం చేస్తున్నాయి. చినుకు పడదు, చిల్లులు మాత్రం పడుతూంటాయి నిర్మాత జేబుకి. 

        రామ్ సింగ్ చార్లీ స్ట్రక్చర్ లో వున్న అర్ధవంతమైన కథ, కథనమూ. కథనంలో దృశ్యాల అల్లిక చాలా సార్లు మెస్మరైజ్ చేస్తుంది. ఉదాహరణకి వూరికెళ్ళి పోయిన హీరోయిన్ పాత్ర కజ్రీ అక్కడెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు కన్పిస్తుంది. తీరా ఇటు ఓపెన్ చేస్తే భర్త పాత్ర రామ్ సింగ్ తోనే మాట్లాడుతున్నట్టు దృశ్యం థ్రిల్ చేస్తుంది. ఇంకో దృశ్యంలో బార్ దగ్గర ఒకడు అదే పనిగా వెక్కిరిస్తూంటే, పొట్టి లిల్లీపుట్ చూసి చూసి లాగిపెట్టి లెంపకాయ కొడతాడు. లెంపకాయ తిన్నవాడు పరమ కోపంగా చూస్తాడు. అంతే, దృశ్యం కట్ అయిపోతుంది. తర్వాతి దృశ్యంలో రామ్ సింగ్ ఇంటికి పరుగెత్తు కొచ్చి డబ్బులన్నీ తీసుకుని పరిగెడతాడు. 

        ఈ దృశ్యమేంటో కూడా అర్ధం గాకుండానే ఇదీ కట్ అయిపోతుంది. దీని తర్వాతి దృశ్యంలో  గాయపడిన లిల్లీపుట్ హాస్పిటల్లో పడి వుంటాడు. అక్కడికి డబ్బుతో వచ్చేస్తాడు రామ్ సింగ్. ఇలా మొదటి దృశ్యంతో సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండో దృశ్యంతోనూ సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండిటి అర్ధాలూ మూడో సీన్లో స్పష్టం చేస్తాడు దర్శకుడు. ఇదీ దృశ్య మాలిక అంటే. రొటీన్ మెలోడ్రామాని తొలగించే ఈ మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనపు టెక్నిక్ వల్ల కథ చెడకుండా సినిమా నిడివి, షూటింగ్ సమయం, బడ్జెట్ ఎంతో ఆదా అయ్యాయి. దీన్ని గుర్తించి తెలుగులో ఎవరైనా పాటిస్తారా? సందేహమే. ఇలా కథని బట్టి దానిదైన యూనిక్- పర్సనలైజుడు డైనమిక్స్ తో కథనం చిన్న సినిమాకే సాధ్యమవుతుందని గమనించాల్సి వుంటుంది.

సికిందర్