రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 29, 2022

1199 : బాలీవుడ్ ఆర్టికల్

ప్పుడు బాలీవుడ్ లో అందరి కళ్ళూ బ్రహ్మాస్త్ర : పార్ట్ వన్- శివ మీదే వున్నాయి. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడంతో వరస ఫ్లాపులెదుర్కొన్న బాలీవుడ్ ఇప్పుడైనా ప్రేక్షకుల దర్శన భాగ్యం కలగక పోతుందా అన్న ఆశతో వుంది. పైగా సౌత్ సినిమాల తాకిడికి విలవిల లాడుతున్న బాలీవుడ్ కి తగిన సమాధానం చెప్పగల అస్త్రంగా  బ్రహ్మాస్త్ర కన్పిస్తోంది. నాల్గేళ్ళుగా నిర్మాణంలో వుండి సెప్టెంబర్ 9 న విడుదలకి సిద్ధమవుతోంది. హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో బ్రహ్మాండమైన విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. హీరో రణబీర్ కపూర్ ప్రోమో కార్యక్రమాలు చేపట్టి వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్నాడు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఖరీదైన మెగా మూవీ ఇది. స్పిరిచ్యువల్ ఫాంటసీ -అడ్వెంచర్ థ్రిల్లర్ గా వున్న ఈ క్లాస్- మాస్ కమర్షియల్  ప్రేక్షకుల్ని తప్పకుండా థియేటర్ల బాట పట్టిస్తుందని నమ్ముతున్నారు.

        హిందీ నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లని నిర్లక్ష్యం చేసి మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంతో, సింగిల్ స్క్రీన్ మార్కెట్ ని కూడా సౌత్ సినిమాలు వశపర్చుకున్నాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సింగిల్ స్క్రీన్ సినిమా లక్షణాలతో కూడా వుంది గనుక ఈ సెగ్మెంట్ లో కూడా వ్యాపారం చేసుకుంటుందని లెక్కలు కడుతున్నారు.

షోమాన్ రాజ్ కపూర్ మనవడు రణబీర్ కపూర్ నటించిన గత 8 సినిమాల్లో రెండే హిట్టయ్యాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర లో హీరోయిన్ అలియా భట్ తో జత కట్టి వస్తున్నాడు. ఇంకా భారీ తారాగణముంది- అమితాబ్ బచ్చన్, నాగార్జున, అతిధి పాత్రలో షారూఖ్ ఖాన్ మొదలైన స్టార్లు.

బ్రహ్మాస్త్ర కథని లీకు వీరుల కోసమేం దాచిపెట్టలేదు. నిర్మాతలే కథని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇక స్టార్ల పేరు చెప్పుకుని ప్రమోషన్లు నిర్వహిస్తే  ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. స్టార్ సినిమా కదాని పోతే గత వారం లైగర్ కూడా జాడించి తన్నింది ప్రేక్షకుల్ని. అందుకని విషయం (కథ) చెప్పేస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. విషయం చెప్పాలంటే విషయంలో విషయం వుండాలి. విషయం లేకపోతే విషయం చెప్పే ధైర్యం చేయలేరు. అందుకని ప్రేక్షకులకిదో భరోసా నిస్తుంది. ఈ పద్ధతే బెటర్.

బ్రహ్మాస్త్ర కథలో రణబీర్ కపూర్ కి పంచభూతాల్లో ఒకటైన అగ్నితో వింత సంబంధముంటుంది. దాంతో బ్రహ్మాస్త్రాన్ని మేల్కొల్ప గల శక్తిని కలిగి వుంటాడు. ఈ అతీత శక్తి, విశ్వాన్ని నాశనం నాశనం చేయగలదని, సృష్టిని నాశనం చేయగలదని, జీవులని అంతమొందించ గలదనీ తెలుసు కుంటాడు. మరోవైపు,  దుష్ట శక్తుల రాణి జునూన్ కూడా బ్రహ్మాస్త్రాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో వుంటుంది. బ్రహ్మాస్త్రం కోసం వీళ్ళిద్దరి పోరాటమే ఈ మూవీ. ఇది పురాణ, దైవిక ఘటనల ఆథ్యాత్మిక థ్రిల్లర్ గా వుంటుంది. ప్రస్తుతం నార్త్ లో వున్న మతాభిమానపు భక్తి వాతావరణంలో కార్తికేయ 2 లాగే ఇది కూడా హిట్టవుతుందని నమ్ముతున్నారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీ పదేళ్ళ కల ఈ ప్రతిష్టాత్మక మూవీ. దీని తెర వెనుక కథనాన్ని వివరించే వీడియోని  అలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ  సిమ్లాలో రైటింగ్ వర్క్ చేపట్టిన 2011 నుంచీ దాంతో సాగిన పదేళ్ళ ప్రయాణం గురించి చెప్పుకొస్తాడు. అతడి మొదటి సినిమా  వేక్ అప్ సిద్ (2009) అప్పుడప్పుడే విడుదలై, రెండవ మూవీ యే జవానీ హై దీవానీ (2013) కోసం పని చేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. ఎల్లప్పుడూ సిమ్లా  పర్వతాల్లో చాలా శక్తిని, బలమైన ఆధ్యాత్మికతనీ పొందుతాననీ చెప్పాడు. హిమాలయాల శక్తి నుంచే తనకి బ్రహ్మాస్త్రం కథకి ఐడియా పుట్టిందని నమ్ముతున్నట్టు వీడియోలో చెప్పాడు.

బ్రహ్మాస్త్ర  మూడు భాగాల కథగా ప్లాన్ చేశారు. అంటే మూడు సినిమాలు. ప్రస్తుతం మొదటి భాగం విడుదలవుతోంది. మొదటి భాగం ప్రధానంగా శివగా రణబీర్ కథతో వుంటుంది. భారతీయ ప్రేక్షకుల కోసం బ్రహ్మాస్త్ర తో ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం, భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఇంతవరకూ రాని కంప్యూటర్ మాయా జగత్తుని సృష్టించడం అయాన్ చేపట్టిన బాధ్యత. అత్యంత ఆధునిక సాంకేతిక విలువలతో పురాతన భారతీయ మూలాలు - సంస్కృతి, ఆధ్యాత్మికతలని లోతుగా చూపించే విజువల్ వండర్ గా హామీ ఇస్తున్నాడు.

తన జీవితంలో 10 సంవత్సరాలు ఈ మూవీ  కోసం వెచ్చించానని, ప్రారంభంలో బ్రహ్మాస్త్ర అనేది ఒక హాస్యాస్పదమైన ఆలోచనగా వుండేదనీ, క్రమంగా దీని మీద ఆత్మ విశ్వాసం బలపడిందనీ, చెప్పుకొచ్చాడు. చేయాలనుకున్నది ఎలా చేయాలో రోడ్‌మ్యాప్ లేదు, విజువల్ ఎఫెక్ట్స్ వ్యయాన్ని నియంత్రించే ప్రణాళికల్లేవు, ఈ సవాళ్ళని ఎలాగైనా అధిగమించగలిగితే, సినిమా అనుకున్నట్టు సరిగ్గా వస్తే, నిజంగా ఇది మార్గదర్శక సంచలనాత్మక చలన చిత్రమవుతుందనీ, దేశం గర్వించదగ్గ కానుక అవుతుందనీ చెప్పుకొచ్చాడు.

దీన్ని  కరణ్ జోహార్, అపూర్వా మెహతా, నమిత్ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ కలిసి నిర్మించారు. ఇదీ విషయం. ఇప్పుడు దీనికి ప్రేక్షకులే మాత్రం తరలి వస్తారన్నది ప్రశ్న. ఈ ప్రశ్న వుండగా బాలీవుడ్ సినిమాల కడుపు కొట్టే ట్రెండ్ ఒకటి ఇటీవల నడుస్తోంది. ప్రతీ పెద్ద హిందీ సినిమానీ  ఏదో వంకపెట్టుకుని సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిపిస్తున్నారు. దీని కారణంగా కూడా ప్రేక్షకులు రావడానికి వెనుకాడ వచ్చు. ఈ బాయ్ కాట్ పోకిరీల ఆటకట్టించే చర్యలు తీసుకుంటేగానీ సినిమాల పరిస్థితి మెరుగు పడదు. హీరో యిన్ ఆలియా భట్ ఏదో అన్నదని బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అని కొత్త రాగ మెత్తుకున్నారు మానసిక రోగులు.

***