రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, జూన్ 2019, శనివారం

834 : స్క్రీన్ ప్లే సంగతులు


     చివరికి మంగళ సూత్రంతో కూడా ట్విస్టులు. ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ తో అమ్మ మంగళ సూత్రమని చెప్పి, సెకండ్ ఫ్లాష్ బ్యాక్ తో మేనత్త మంగళ సూత్రమని ట్విస్ట్ ఇచ్చారు. కథనంలో తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాకుల్ని దృష్టిలో పెట్టుకుని కథనాన్ని వివరించు కుంటున్నప్పుడు, ఆ ఫ్లాష్ బ్యాకుల్లో కొన్ని పాయింట్స్ కథనంతో మ్యచ్ కావడంలేదని గమనించాం. మంగళ సూత్రం మిస్ మ్యాచ్ కూడా వున్న విషయం ముందే తెలిసినప్పటికీ, దీన్ని కూడా కలిపి వివరిస్తూ పోతే హెవీ అవుతుందనీ, విశ్లేషణ కన్ఫ్యూజింగ్ గా  వుంటుందని, ఆపి చివర్లో చెపుదామని అనుకున్నాం. ఇంకోటేమిటంటే ఫ్లాష్ బ్యాకుల్లో మిగతా పాయింటుల్లాగా ఇది కూడా కేవలం ఒక పాయింటు కాదు. ప్లాట్ డివైస్. కథలో ప్రాధాన్యమున్న మంగళ సూత్రం, ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ప్లాట్ డివైస్ గా ప్లే అవుతూ పోయింది. సీత దాంతోనే భూటాన్ పోయింది. దాంతోనే పెళ్లి నాటక మాడింది. దాంతోనే ఇంకేదో చేసింది... అమ్మ మంగళ సూత్రానికి మేనత్త మంగళ సూత్రమని ట్విస్టిచ్చాక, అమ్మ మంగళ సూత్రమేమైనట్టు? దీనికి ట్విస్టు కుదర్లేదేమో గానీ, మేనత్త మంగళ సూత్రానికింకో ట్విస్టిచ్చారు. ముగింపులో ఈ లక్షల విలువైన  మంగళ సూత్రం కూడా వుండదు, పసుపు తాడు కడతాడు! శవ్వ! శవ్వ! (కోట శ్రీనివాస రావు).
         గత వ్యాసం ప్లాట్ పాయింట్ టూ వరకూ వచ్చాం. దీని గురించి చూద్దాం. లాయర్ సీతకి రెండో ఫ్లాష్ బ్యాక్ తో వాస్తవాలు చెప్పాక, సీత రియాక్షన్ తో ప్లాట్ పాయింట్ టూ ఏర్పడింది. మేనత్త  ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్తే ఇచ్చి పారేస్తానంది ఇప్పుడు కూడా అదే తల పొగరుతో సీత. కానీ ఇప్పుడు మంగళ సూత్రం మేనత్తదని లాయర్ చెప్పాక, ఆ మంగళ సూత్రాన్ని కూడా వాపసు చేయాలి నిజానికి సీత. అలా చేయదు. ఇక - మా అమ్మదని  చెప్పి ఇప్పుడు మనత్తదని అంటావేంటి? -  అని కూడా లాయర్ని ప్రశ్నించదు.  


        ‘మీ అమ్మగారైన శ్రీమతి స్వరాజ్యం గారు సుమంగళిగా స్వర్గస్థులైన కారణంగా, హిందూ సాంప్రదాయం ప్రకారం, ఆవిడ మంగళ సూత్రం కూతురికి గానీ కోడలికి గానీ చెందుతుంది. నువ్వు వారికి ఒక్కగానొక్క సంతానం గాబట్టి, ఆ మంగళ సూత్రాన్ని నీకు రాశారు’ అని అప్పుడు సీత తండ్రి రాసిన వీలునామా చదివాడు లాయర్ ప్లాట్ పాయింట్ వన్ సీనులో. ఇప్పుడు ప్లాట్ పాయింట్ టూ సీనులో -  మీ అమ్మది కాదు, మేనత్తదని అంటున్నాడు...

        దీన్నెలా అర్ధం జేసుకోవాలి. అమ్మదని వీలునామా చదివిన లాయరే ఇప్పుడు మేనత్తదని ఎలా అంటున్నాడు. మేనత్త మంగళ సూత్రం గురించే తండ్రి అలా రాశాడా? మరి అమ్మ మంగళ సూత్రమేమైంది? మేనత్త మంగళ సూత్రమైతే అమ్మదని ఎలా రాశాడు. మేనత్త మంగళ సూత్రమైతే తన కూతురికి చెందాలని తనెలా రాస్తాడు. తన చెల్లెలు (సీత మేనత్త) వల్ల కలసివచ్చిన సంపదకి మేనల్లుడ్నే వారసుడిగా తను నిర్ణయించాక, ఆ సంపద  పుట్టడానికి మూలమైన చెల్లెలి మంగళ సూత్రాన్ని కూడా మేనల్లుడికే రాయాలి. ఎవరి కిచ్చుకుంటాడో ఇచ్చుకుంటాడు మేనల్లుడు. తనెవరు కూతురికి రాయడానికి? పైగా చెల్లెలు ఇంకా చాలా బంగారం వొలిచి ఇచ్చింది. అదేమైంది? ఇకపోతే, కూతురు మేనల్లుడ్ని చేసుకుంటేనే అతడికి చెందుతున్న 5 వేల కోట్ల ఆస్తికి అర్హురాలవుతుందని తనెలా రాస్తాడు. స్వార్ధం కాదా? చెల్లెలి వల్ల కలిగిన సంపదని ముట్టుకోలేదని అంత నిస్వార్ధంగా చెప్పిన తను, మేనేజర్ గా భావించుకుని బతికిన తను- కూతురికి మేనల్లుడితో పెళ్లి లింకు పెట్టి ఆ సంపదతో స్వార్ధానికి పోవడం లేదా? ఇదేం గొప్ప తండ్రి పాత్ర? అసలు గందరగోళంగా వున్న వీలునామా వ్యవహారం దృష్ట్యా, ఏం గోల్ మాల్ చేశాడో విచారణ జరిపించాలి. అమ్మ మంగళ సూత్రం, మేనత్తిచ్చిన ఇంకా బంగారం ఏమయ్యాయి? చాలా గూడుపుఠానీ వుంది. 

        ఇదే ఫ్లాష్ బ్యాక్ సీనులో, చెల్లెలి సంపద మనం అనుభవించడానికి వీల్లేదని భార్య వొంటి మీది నగలు తీసేసుకుంటాడు ఇదే సీత తండ్రి. ఆ భార్య కోపంతో కూతురి వొంటిమీది నగలు కూడా తీసేయబోతూంటే -  మేనల్లుడ్ని చూపించి, కూతురు మేనల్లుడికి చెందుతుందని, కాబట్టి మేనల్లుడికి చెందింది కూతురికీ చెందుతుందనీ అనేస్తాడు! అంటే అప్పట్నించే చెల్లెలి సంపదతో స్వార్ధానికి పోయాడన్నమాట? నీ కూతురు నా కొడుకుని చేసుకోవాలని చెల్లెలేమీ మాట తీసుకోలేదే? 

      మరొక విషయమేమిటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ సీనంతా సీత వుండగానే, ఆమె సాక్షిగానే జరుగుతుంది. తండ్రి ఏమంటున్నాడో, తల్లి ఏమంటున్నదో అక్కడే వుండి వింటూంటుంది. ఆమే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో వున్నాక, ఇక లాయర్ ఈ ఫ్లాష్ చెప్పే అవసరమే లేదు. ‘నీకంతా తెల్సు, ఒకసారి గుర్తు చేసుకోమ్మా’ అంటే ఆమె పాయింటాఫ్ వ్యూలో ఈ ఫ్లాష్ బ్యాక్ రన్ అవడం న్యాయం. గతాన్ని ఆమే గుర్తు చేసుకుంటే -ఎక్కడో కలుక్కు మని, ఆమెలో మార్పు రావడానికి ఈ ఫ్లాష్ బ్యాక్ దోహద పడేది. అప్పుడు ప్లాట్ పాయింట్ టూ కి న్యాయం జరిగేది. లాయర్ పాయింటాఫ్ వ్యూలో కాక, సీత పాయింటాఫ్ వ్యూలో వుండాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఇది. 

        ఇంకోటేమిటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వుంటూ అంతా చూస్తూ, వింటూ వున్న సీతకి - పెద్దయాక ప్రదర్శిస్తున్న బుద్ధులు వచ్చే అవకాశమే లేదు. ఇది వీడి పెళ్ళాం, వీడి బంగారం వేసుకునే హక్కు దీనికుంది- అని తండ్రి అంత స్పష్టంగా అనేశాక ఇంకేం కావాలి పిచ్చి పిల్లకి. అసలు పిల్లల ముందు ఈ విషయాలు మాట్లాడడం నాన్సెన్స్. ప్రేక్షకులకి తెలియడం కోసం మాట్లాడుతున్నాడు. ప్రేక్షకులకి తెలియడం కోసం మాట్లడడానికి బెటర్ ఆప్షన్స్ వున్నాయి. 

        సీత నుంచి రామ్ విడిపోయి భూటాన్ వెళ్ళిపోయి ఇరవై ఏళ్లయింది. ఆస్తి అతనిదే నని చిన్నప్పుడే సీతకి తెలుసు. పెళ్లి చేసుకోవడానికి పేచీ ఏమిటో అర్ధంగాదు. ఇక సీత తల్లి, రామ్ ని చిత్రహింసలు పెట్టడం గురించి...ఆస్తికి వీడు వారసుడు, వీడికి మన కూతురు పెళ్ళాం -  అని భర్త చెప్పాక వాణ్ణి కాల్చి వాతలు పెట్టడమేమిటి? అనుభవిస్తున్న ఆస్తి వాడిదని తెలిసినందుకా? రేపు కూతురు అనుభవించ కూడదా? బికారికిచ్చి చేస్తుందా?

        పాత్రతో కథ గాక, కథతో పాత్రని ఆలోచిస్తే ఇలాగే వుంటుంది. కథతో పాత్రని ఆలోచిస్తే ఇతర మాధ్యమాల్లో చెల్ల వచ్చు. కానీ కథతో పాత్రని సినిమాకి ఆలోచిస్తే కోట్లు మునుగుతాయి. సినిమాకి ఎట్టి పరిస్థితిలో పాత్రతో కథని ఆలోచించాల్సిందే. ఈ కథతో పాత్ర విధానమే సీత పాత్రని చాలా డ్యామేజీ చేస్తూ వచ్చింది మొదట్నించీ. ఈ ఫ్లాష్ బ్యాక్ తెలిశాక కూడా సీతలో మార్పు రాదు. చనిపోయిన మేనత్త పట్ల ఏ మాత్రం కనికరం వుండదు. వంద గ్రాముల బంగారమని మాట్లాడుతుంది. పాత్రలో మార్పు తేవడం కోసం గాకపోతే కథలో ఫ్లాష్ బ్యాక్ ఎందుకుంటుంది? అదీ ప్లాట్ పాయింట్ టూ అనే కథకి రెండో మూలస్థంభమయిన మలుపు దగ్గర? ప్లాట్ పాయింట్ టూ అంటేనే పాత్రకి రియలైజేషన్ ఘట్టం కాదా? రియలైజ్ అయి, ఆ రియలైజేషన్ లోంచి తనకి పరిష్కార మార్గం గోచరమై, కథని ముగించడానికి ముందుకి  తీసికెళ్ళడం కాదా? ఇలా వుండవా కథలు? 

        ఇక సీత పాత్ర కథకుడి చేతిలో పూర్తిగా పతనమై సర్వనాశనమవడానికి - శవ్వ! శవ్వ! అన్పించడానికి - ఈ ప్లాట్ పాయింట్ టూ సీను లోంచి ఆమె బయటికి ఒకటే పరుగు తీయడంతో బీజం పడుతుంది...ఆ పరుగు కథకి ఫైనల్ మరణ శాసనం రాసేసింది... 

     ఎండ్ విభాగం కథనం :  వాళ్ళమ్మ ఇచ్చిన వంద గ్రాముల బంగారానికి వడ్డీ కట్టి చెప్పండి, ఇచ్చి పారేస్తాను -  అన్న తర్వాత, రూప వచ్చి చెప్తుంది, అవతల రామ్ నెవరో కొడుతున్నారని. వెంటనే కంగారుగా పరుగు దీస్తుంది సీత. రామ్ ని చంపాలన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చంపే కార్యక్రమం మొదలయింది. వాళ్ళని కొట్టి ఎదుర్కోమని అరుస్తుంది. శాంతి వచనాలు పలుకుతాడు. తనే  ఫైటింగ్ కి దిగుతుంది. ఫైటింగ్ లో ప్రమాదంలో పడడంతో రామ్ కాపాడి తను మొదలెడతాడు ఫైటింగ్. ఇది చూస్తున్న ఎమ్మెల్యే రామ్  మీద కాల్పులు జరిపి లాక్కెళ్ళి పోతాడు.

        సీతని రప్పించడానికి గాయపడిన రామ్ ని తన ఇంట్లో పడేసి కూర్చుంటాడు. అనుకున్నట్టుగానే వచ్చేస్తుంది సీత. ట్విస్ట్. రామ్ పరిస్థితికి చలించి వెంటనే హాస్పిటల్ కి తీసికెళ్ళాలని ఒకటే బతిలాడుకుంటుంది. ముందు తనతో పడుకోవాలంటాడు. పడుకుంటుంది. ట్విస్ట్. రామ్ లేచి ఎమ్మెల్యేని తన్ని  సీతతో పారిపోతాడు. ట్విస్ట్. పారిపోతూ సీత రాం కి సరెండర్ అయిపోతుంది. ఏడ్చేస్తూ మనం ఒకటవుదామంటుంది. ట్విస్ట్.   

        కారులో పారిపోతున్న వాళ్ళని వెనక నుంచి వచ్చి డాష్ ఇస్తాడు ఎమ్మెల్యే. ట్విస్ట్. పెద్ద ప్రమాదం జరిగి తలో దిక్కు పడతారు. భూటాన్ సన్యాసులు రామ్ నెత్తుకెళ్ళి పోతారు. ట్విస్ట్. కళ్ళు తెర్చి విషయం తెలుసుకున్న సీత భూటాన్ వెళ్ళిపోతుంది. ట్విస్ట్. అక్కడ రామ్ ఫోటోకి దండ వేసి వుంటుంది. ట్విస్ట్. చనిపోయాడని అంటాడు గురువు. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ట్విస్ట్. బయట వున్న రామ్ వచ్చేస్తూంటే ఫోటోకి దండ తీసేస్తారు సన్యాసులు. ట్విస్ట్. రామ్ మానసిక శక్తులకి సీత వచ్చినట్టు తెలుస్తుంది. ట్విస్ట్. ఆమెని కలవాలని మారాం చేస్తాడు. వదిలేస్తారు. సీత కోసం పరుగెత్తడం మొదలెడతాడు రామ్. కారులో వెళ్ళిపోతున్న సీత మానసిక శక్తులకి రామ్ బతికే వున్నాడని తెలుస్తుంది. ట్విస్ట్. పరుగెత్తుకొస్తున్న రామ్ ని చూసి కారు దిగి వాటేసుకుంటుంది. పసుపు తాడు కట్టేస్తాడు. ట్విస్ట్.

        ఎమ్మెల్యే వచ్చేసి అగ్రిమెంట్ చూపిస్తాడు. ట్విస్ట్. అగ్రిమెంట్ ని పాటించాలి కదాని సీతని ఇచ్చేస్తాడు రామ్. ట్విస్ట్. సీతని ఎమ్మెల్యే కారులో తీసుకుపోతూంటే, రామ్ వచ్చేసి వీల్లేదంటాడు. ట్విస్ట్. ఆమె నా భార్య కదా అంటాడు. ఎమ్మెల్యేని లాగి ఎటాక్ చేస్తాడు. ఎమ్మెల్యేకి గుండు తగుల్తుంది. చూస్తే ఆ గుండు పేల్చింది మండోదరి, అంటే ఎమ్మెల్యే భార్య. ట్విస్ట్. ట్విస్ట్. ట్విస్టుల మీద ట్విస్టులు. ఆరగంట సేపు సాగే ఈ ముగింపులో కూడా  ట్విస్టులాష్టమి.  

        “చిమ్మ చీకటిని తరిమి కొట్టడానికి ఒక చిన్న దీపమైనా కావాలి
        చెడు నిండిన లోకం ప్రక్షాళన కోసం ఒక్క మంచి వాడైనా కావాలి”
        - అన్న కొటేషనుతో సుఖాంతం!

       క్లయిమాక్స్ కుదరడం లేదంటే దాని లోపం ప్లాట్ పాయింట్ వన్ లో వున్నట్టని సామాన్య సూత్రం. ప్లాట్ పాయింట్ వన్ లో ఏం లోపం జరిగిందో దాన్ని మరమ్మత్తు చేస్తే క్లయిమాక్స్ సరిగ్గా కుదురుతుంది. ప్లాట్ పాయింట్ వన్ ఎంత ఫేక్ గా వుందో చూశాం. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కథ అనుభవిస్తోంది. కథని ఎలా ముగించాలో అర్ధంగానట్టు ట్విస్టుల మీద ట్విస్టులు. ఈ అరగంట ఎండ్ విభాగంలో ఆరుసార్లు ముగిస్తూ మళ్ళీ ట్విస్టు లిచ్చి పొడిగించుకుంటూ పోయారు. లాజిక్ గీజిక్ మంట గలిసి,  సహనానికి పరీక్ష మొదలై పోయింది ఈ ముగింపుతో. కథ పట్టుకు ప్రయాణిస్తే కుక్క తోకట్టుకుని గోదారీది నట్టే. పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే నక్క తోక తొక్కి వచ్చినట్టే. 

        ఇంతకీ సీత ప్లాట్ పాయింట్ టూలో ఫ్లాష్ బ్యాక్ తెలిసింతర్వాత, తనలో ఏ మార్పూ ప్రదర్శించక, రామ్ ని కొడుతున్నారని తెలియగానే ఎందుకు పరుగెత్తుకుని పోయినట్టు? రామ్ ని కొడుతూంటే అది చూసి ఆమెలో మార్పు వచ్చినట్టు చిత్రించారు. ఆమెలో మార్పు తేవడానికి ఈ సంఘటనా? అదీ ప్లాట్ పాయింట్ టూ తర్వాత? ఫ్లాష్ బ్యాక్ కే ఏ మానవత్వమూ మేల్కొనని ఆమె, రామ్ కొడుతూంటే మారిపోతుందా? మారిపోతే, మూలంలో మారాల్సిన విషయంలో- తండ్రితో, మేనత్తతో- ఇన్నర్ గా మారకుండా, ఇలా ఔటర్ గా మారిపోతే చాలా? ఔటర్ గా మారడమంటే ఆస్తి కోసమేనా? రామ్ ని కొట్టి చంపేస్తే, వాడితో పెళ్ళీ, దాంతో ఆస్తీ వుండవని అలా పరిగెట్టిందా? మరెందుకు పరిగెట్టింది?

        ఆమె ఈ పరుగు పాత్ర పతనానికీ, సర్వ నాశనానికీ దారి తీశాయి. ఫ్లాష్ బ్యాక్ తో మార్పు వచ్చి పరుగెత్తి వుంటే వేరే అర్ధాలు వచ్చేవి కావు. ఇందుకే ప్లాట్ పాయింట్ టూలో పాత్ర మారాలానేది. మారకుండా పరుగెత్తితే ఇలాగే ఆస్తి పోతోందన్న ఆదుర్దా కొద్దీ పరుగెట్టిందన్న అర్ధం వస్తుంది! వాడెలా పోతే నాకెందుకని గత సీన్లలో అన్న తనే, ఇప్పుడు వాడికోసం పరుగెడుతోందంటే ఇంకెందుకు? ప్రేమ పెంచుకుందనా? 

        ఇక సీత పాత్ర లేదు. చచ్చిపోయింది. ఇక్కడ్నించీ ఏం చూపించినా చూడనవసరం లేదు. ఇన్నర్ గా మారకుండా ఇప్పుడు ఔటర్ గా రామ్ గురించి మార్పు ప్రదర్శిస్తోందంటే, ఇది కూడా నిజం కాదు. ఆస్తి కోసం నటన! 

        ఇక్కడ ఇంకో గమ్మత్తు వుంది. ఎమ్మెల్యే రామ్ ని గాయపర్చి తీసి కెళ్ళిపోయాక, ఎమ్మెల్యేతో ఆ పూట సహజీవనానికి లొంగిపోయింది!! రామ్ లేచి అది జరక్కుండా చూశాడు, వేరే సంగతి. కానీ లొంగింది ఎమ్మెల్యే బెదిరింపులకి. అప్పుడు రామ్ నెలా పెళ్ళిచేసుకోవాలనుకుంది? ఆస్తి ఎలా వస్తుందనుకుంది? అవన్నీ వదులుకుంటూ బలి పీఠం ఎక్కిందా తన పాపాలకి? లేక జాలి పడి  రామే పెళ్లి చేసుకుంటాడనుకుందా? అంత దిగజారిందా? ఈ సన్నివేశం లో ఆమె ఎమోషనల్ మజిలీ, లేదా మానసిక స్థితి ఏమిటి? మానసిక స్థితిని వివరించని సన్నివేశ మెలా వుంటుంది? సన్నివేశాన్ని పాత్ర మీద రుద్దడమేనా?
        ఈ సీతకి వేరే రావణుడెవరూ లేరు, వున్నది ఒక్కడే కథకుడు!
        “చిమ్మ చీకటిని తరిమి కొట్టడానికి ఒక చిన్న దీపమైనా కావాలి
         చెడు నిండిన లోకం ప్రక్షాళన కోసం ఒక్క మంచి వాడైనా కావాలి”... ఏ చిమ్మ చీకటి? ఎవరా మంచోడు? 

(అయిపోయింది)

సికిందర్