రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, December 18, 2017

566 : సందేహాలు - సమాధానాలు




          Q :  థ్రిల్లర్ / సైకో థ్రిల్లర్ జానర్ ఎలిమెంట్స్ ఏవో చెప్పగలరా?
                  - దిలీప్ కుమార్, ఈఎల్ ఎఫ్ విశ్వవిద్యాలయం 
          A : థ్రిల్లర్ అనేది కేవలం జానర్ పేరు. దీని కింద సైకో థ్రిల్లర్ అనేది సబ్ జానర్. ఇంకా యాక్షన్ థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్, క్రైం థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్, సోషల్ థ్రిల్లర్, స్పై థ్రిల్లర్, హార్రర్ థ్రిల్లర్, సూపర్నేచురల్ థ్రిల్లర్, ఎరోటిక్ థ్రిల్లర్, లీగల్ థ్రిల్లర్,  టెక్నో థ్రిల్లర్ మొదలైనవన్నీ కూడా థ్రిల్లర్ జానర్ కింద వచ్చే  సబ్ జానర్లే.  మళ్ళీ ఈ సబ్ జానర్స్ కి సూపర్ సబ్ జానర్లున్నాయి. క్రైం థ్రిల్లర్ సబ్ జానర్లో పోలీస్ ప్రోసీజురల్ అనేది సూపర్ సబ్ జానర్. మళ్ళీ పోలీస్ ప్రోసీజురల్ సూపర్ సబ్ జానర్ కి డిటెక్టివ్, నోయర్ అనే రెండు సబ్ సూపర్ జానర్లున్నాయి. 

          కాబట్టి ముందుగా పై వర్గీకరణని అర్ధం జేసుకోవాలి. థ్రిల్లర్ రాయాలనుకుంటే ఏ థ్రిల్లర్ రాయాలన్న ప్రశ్న వేసుకోకుండా రాయడం కష్టం. సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుని మర్డర్ మిస్టరీ నో, పొలిటికల్ థ్రిల్లర్ నో  రాసేయడం కరెక్ట్ కాదు. సస్పెన్స్, థ్రిల్ అన్నవి  అన్ని సబ్ జానర్స్ లో వుంటాయి. ఇవి లేకుండా ఏ సబ్ జానరూ వుండదు. ఆ మాటకొస్తే ప్రేమకథల్లో, కుటుంబ కథల్లో కూడా ఇవి వుంటాయి. ఇవి ఆయా థ్రిల్లర్ సబ్ జానర్లని నడిపేందుకు తోడ్పడే డైనమిక్స్ / ఎలిమెంట్సే తప్ప  మరోటి కాదు. 

          థ్రిల్లర్ అనేది జానర్ ని తెలిపే ఒక హెడ్డింగ్ లాంటిది మాత్రమే తప్ప దానికి నిర్వచనం లేదు. ఆ హెడ్డింగ్ కింద వుండే  సబ్ జానర్లకే నిర్వచనాలుంటాయి. ఒక్కో సబ్ జానర్ కి ఒక్కో నిర్వచనం వుంటుంది. కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ రాస్తున్నామనుకుని మర్డర్ మిస్టరీ నీ, పొలిటికల్ థ్రిల్లర్ నీ  ఒకేలా రాసేస్తే ఏం జరుగుతుందంటే- ఆ సబ్ జానర్ మర్యాద చెడుతుంది. ప్రతీ సబ్ జానర్ కీ దానికంటూ ఓ మర్యాద వుంటుంది. మిస్టరీ సాగినట్టు పొలిటికల్ సాగదు, పొలిటికల్ సాగినట్టు మిస్టరీ సాగదు. మిస్టరీ ఎండ్ సస్పెన్స్ అనే ఎలిమెంటుని కోరుకుంటుంది, పొలిటికల్ సీన్ టు సీన్ సస్పెన్స్ ఎలిమెంటుని కోరుకుంటుంది. ఇలా దేనికవి కొన్ని ప్రత్యేకించిన  ఎలిమెంట్స్ ని  కలిగి  వుంటాయి. 

          ఈ మొత్తం సబ్ జానర్స్ ని లాజికల్,  నాన్ లాజికల్ సబ్ జానర్స్ గా విడగొట్టాలి. యాక్షన్ థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్, హార్రర్ థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్, సోషల్ థ్రిల్లర్, సూపర్నేచురల్ థ్రిల్లర్, ఎరోటిక్ థ్రిల్లర్ – వీటి కథనాలు లాజికల్ గా వుండనవసరం లేదు (వుంటే అంతకన్నా మేలు చేసిన వాళ్ళుండరు). ఇవి సైకలాజికల్ గా కాక ఫిజికల్ గా సాగే అడ్వెంచ
రస్ కథనాలతో వుంటాయి కాబట్టి లాజిక్ ని ఎగేస్తూ సాగిపోవచ్చు.  వీటిని నాన్ లాజికల్ సబ్ జానర్స్ గా సర్దేయవచ్చు. రాయడం కూడా సులభం. అయితే వీటికుండే  సబ్ జానర్ మర్యాదల్ని పాటిస్తేనే ఇవి నిలబడతాయి. 

          ఇక క్రైం థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, స్పై థ్రిల్లర్, లీగల్ థ్రిల్లర్,  సైకలాజికల్ థ్రిల్లర్, టెక్నో థ్రిల్లర్ – వీటికి లాజిక్ అత్యవసరం. క్రైం థ్రిల్లర్ కింద పోలీస్ ప్రోసీజురల్, డిటెక్టివ్, నోయర్ అన్నవి కూడా లాజికల్ కథనాలని డిమాండ్ చేస్తాయి.ఇది వీటి జానర్ మర్యాద. థృవ, వెంకటాపురం అనే పోలీస్ ప్రోసీజురల్స్ వచ్చాయి. థ్రిల్లర్ జానర్లో ఇది  క్రైం సబ్ జానర్ కింద, సూపర్ సబ్ జానర్ గా వర్గీకరణ చెందిన బాపతు అని తెలుసుకోకపోవడం వల్ల,  లాజిక్ వుండని యాక్షన్ థ్రిల్లర్స్ కింద జమకట్టేసి కలిపి కొట్టేశారు. ఇంకొక విచిత్రమేమిటంటే, థృవని  మళ్ళీ మైండ్ గేమ్స్ అనే సైకలాజికల్ సబ్ జానర్ తో కూడా నింపేశారు. ఇందుకే ముందుగా వర్గీకరణని అర్ధం జేసుకుంటే,  యాదృచ్ఛి కంగా ఆ సబ్ జానర్ మర్యాద మీదకి  దృష్టి పోతుంది. థ్రిల్లర్ వర్గీకరణ తెలిసిన కథకుడు ఆ రాస్తున్న సబ్ జానర్ మర్యాదని దాటి రాయలేడు. తెలియకపోవడం వల్లే నకిలీ సబ్ జానర్ థ్రిల్లర్లు చూపించి, అసలీ నోట్లు దండుకుంటున్నారు. అమాయక ప్రేక్షకులు నిత్యం మోసపోతూనే వుంటారు. వాళ్లు ఎప్పటికీ  ఈ సబ్ జానర్ల వేర్వేరు మర్యాదల్ని,  వీటి అసలయిన మజాతో అనుభవించే అదృష్టానికి నోచుకోలేరు. రొటీన్ గా అన్నిటికీ అదే కలిపికొట్టు నా సామిరంగా టైపు  కల్తీనే ఆస్వాదిస్తూ వుంటారు. 

          ఇక ప్రతీ సబ్ జానర్ మర్యాదేమిటో  రాయడం ఇక్కడ కుదరదు కాబట్టి, ప్రశ్నలో అడిగిన సైకో థ్రిల్లర్ సబ్ జానర్ గురించే తెలుసుకుందాం. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ సబ్ జానర్ కింద కొస్తుంది. మైండ్ గేమ్స్ తో కూడి కావచ్చు, హత్యలతో కూడి కావచ్చు. సైకో థ్రిల్లర్ అయినప్పుడు, ఈ సబ్  జానర్ మర్యాదేమిటో చూద్దాం. సైకో అనగానే కిల్లరే అయివుంటాడు. ఇది లాజిక్ ని డిమాండ్ చేసే సబ్ జానర్. సైకో కాబట్టి అతడి మనసు సంగతులు ఇల్లాజికల్ గానే  వుండొచ్చు, అతడి కథ, అతడితో నడిచే కథనమూ, పాల్పడే చర్యలూ  ఇల్లాజికల్ గానే వుండొచ్చు. కానీ అతణ్ణి ఎదుర్కొనే పాత్రకి లాజిక్ వుండి తీరాలి. అతను లాజికల్ గా ఆలోచించి, లాజికల్ గా ప్రవర్తించి తీరాలి. చివరికి ఇల్లాజికల్ సైకో కిల్లర్ ని ఒక లాజికల్ ఎండ్ కి తీసు కొచ్చి, లాజిక్ ని స్థాపించే, లాజిక్ కి జయం కల్గించే తీరులో ముగింపు నివ్వాలి ఆ పాత్ర. సైకో కథలంటేనే లాజిక్ కీ ఇల్లాజిక్ కీ మధ్య జరిగే తప్పొప్పుల నిగ్గు తేల్చే సమరం  కాబట్టి,  ఇవి  ఆర్గ్యుమెంట్ సహిత కథలే అవుతాయి తప్ప, కేవలం స్టేట్ మెంట్ మాత్రపు బలహీన గాథలు కావు. అయ్యాయంటే ఈ సబ్ జానర్ మర్యాద చెడి అట్టర్ ఫ్లాపయి తీరతాయి. 

          ఎలిమెంట్స్ గా డ్రామా, మిస్టరీ, హార్రర్, రోమాన్స్, కామెడీ వుండొచ్చు. హార్రర్ అంటే ఘోస్ట్ హార్రర్ కాదు, సైకో చంపే తీరు అంత భయానకంగా వుండడమన్న మాట. ఇక సైకో మీద పై చేయి యాక్షన్ థ్రిల్లర్స్ లో లాగా ఫిజికల్ యాక్షన్ తో వుండకూడదు, మెంటల్ యాక్షన్ తో, ఎత్తుగడలతో వుండాలి. సైకో కిల్లర్ ఎవరో చూపించకుండా దాచి పెడితే అది ఎండ్ సస్పెన్స్ కి దారితీసి రక్తి కట్టదు. సైకో కిల్లర్ ఎవరో వెల్లడైపోవాలి. అతను దొరక్కుండా మరిన్ని హత్యలు చేస్తూపోవాలి. సైకో కిల్లర్స్ మానసిక స్థితి తెలియాలంటే వాళ్ళ మీద కొన్ని పాపులర్ పుస్తకాలున్నాయి. 

          సైకో కిల్లర్ కథా పథకమంతా కూడా ఎలుకా పిల్లీ చెలగాటంగా వుంటుంది. ఇందులో ఇటు హీరో గానీ, అటు సైకో గానీ ఎవరూ పాసివ్ గా వుండడానికి వీల్లేదు. ఎవరూ కూడా రియాక్టివ్ గా వుండడానికి వీల్లేదు. ఒకర్నొకరు దెబ్బ తీసుకుంటూ ప్రోయాక్టివ్ గా వుండాలి. సాధారణంగా సైకోని హీరో మట్టుబెట్టాలని చూస్తూంటాడు. దీన్ని రోల్స్  రివర్స్ చేసి, తనని పట్టుకోవాలని ప్రయత్ని
స్తున్న హీరోనే సైకో చంపాలని వెంటబడే డైనమిక్స్ తీసుకోవచ్చు. 

          ఎలిమెంట్స్ లో ఫ్లాష్ బ్యాక్స్ ని కూడా కల్పించవచ్చు. కథనం 1 – 2 – 3 ఆర్డర్ లో లీనియర్ గా వుండొచ్చు, లేదా  2 -1- 3 ఆర్డర్ లో నాన్ లీనియర్ గానూ వుండొచ్చు. ఏదైనా బాగా విజయవంతమైన సైకో థ్రిల్లర్ ని తీసుకుని,  దాని వన్ లైన్ ఆర్డర్ వేసుకుని చూస్తే ఈ సబ్ జానర్ ఎలా వుంటుందో, వుండాలో; ఏఏ ఎలిమెంట్స్ పనిచేస్తాయో  మొత్తం అర్ధమవుతుంది.  



సికిందర్