రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 4, 2022

1140 : రివ్యూ!


 రచన- దర్శకత్వం: తిరుమల కిషోర్ 
తారాగణం : శర్వానంద్, రశ్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ , ఛాయాగ్రహణం : సుజిత్ సారంగ్
నిర్మాత: సుధాకర్ చెరుకూర
విడుదల : మార్చి 4, 202
***

        2017 లో మహానుభావుడు తర్వాత నుంచి హిట్లు లేక 5 వరస పరాజయాలు పూర్తి చేసుకున్న శర్వానంద్, ఇక రిపీట్ టైటిల్ తో ఆడవాళ్ళూ మీకు జోహార్లు అంటూ వచ్చేశాడు. ఒకే రకమైన సినిమాలు తీసే దర్శకుడు తిరుమల కిషోర్ తో ఇక పక్కా హిట్ అన్న నమ్మకంతో రంగంలోకి దిగాడు. 1981 లో కె బాలచందర్ తీసిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సామాజిక కథ. కృష్ణం రాజు, జయసుధ, సరిత, భానుచందర్, చిరంజీవి (అతిధిపాత్ర) నటీనటులు. అది హిట్టయ్యింది. మరి అదే టైటిల్ ని రిపీట్ చేస్తూ శర్వానంద్ అందిస్తున్న ఈ తాజా కనుక ఎలావుంది? ఈసారైనా హిట్ దక్కిందా? తెలుసుకుందాం.

కథ  

చిరంజీవి (శర్వానంద్) కళ్యాణమండపం నడుపుతూ వుండే 36 ఏళ్ల బ్రహ్మచారి. అతడికి తల్లి  (రాధికా శరత్ కుమార్) తో పాటు ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు వుంటారు. వీళ్ళ కారణంగా పెళ్ళి కాదు. ఏ సంబంధం వచ్చినా వాళ్ళకి అమ్మాయి నచ్చదు. కాలం గడిచిపోతూంటుంది. ఓ రోజు ఆద్య (రశ్మికా మందన్న) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. అయితే తన తల్లి కారణంగా పెళ్ళి చేసుకోలేనంటుంది. ఆమె తల్లి వకుళ (ఖుష్బూ) కి పెళ్ళిళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకిష్టం లేదు? ఏమిటామె కథ? చిరంజీవి ఆమెని ఎలా ఒప్పించి ఆద్యని పెళ్ళి చేసుకున్నాడు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

ఇంటినిండా లేడీస్, అందులో ఓ పెళ్ళి కథ అనే హమ్ ఆప్కే హై కౌన్ లాంటి కథ. రకరకాల హమ్ ఆప్కే హై కౌన్ లు ఆల్రెడీ ప్రేక్షకులు చూసేశారు. ఇదే దర్శకుడు తీసిన నేనూ శైలజ చూశారు. ఇందులో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్తాడు సమస్య చక్కదిద్దడానికి. ప్రస్తుత సినిమాలో కూడా ఇదే పని మీద హీరోయిన్ ఇంటికి హీరో వెళ్తాడు. తేడా ఏమిటంటే, నేనూ శైలజ లో హీరోయిన్ కి పెళ్ళి నిర్ణయమై వుంటుంది. ఆమె తండ్రికోసం హీరోని కాదనుకుంటుంది. ప్రస్తుత సినిమాలో హీరోయిన్ పెళ్ళయే పరిస్థితి వుండదు. ఈమె తల్లి కోసం  హీరోని కాదనుకుంటుంది. ఒక టెంప్లెట్ సక్సెస్ అయిందని దాన్నే మార్చి చూపించడం, అది నటించడానికి హీరో ఒప్పుకోవడం, ప్రేక్షకుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగిపోతూంటుంది.

        కానీ ఏ కథయినా, అదే ఎన్నిసార్లు తీసినా, కథలా వుంటే పర్వాలేదు. వర్కౌట్ అయిన టెంప్లెంట్ నే వాడేసి, కథ లేకుండా చేస్తే- కేవలం ఆడవాళ్ళ బృందంతో గ్లామర్ షో గా మార్చేస్తే- కథ మర్చిపోయి ప్రేక్షకులు కళ్ళప్పగించి చూస్తారనుకోవడం వర్కౌట్ కాదు. ఈ మూవీలో కథని, దానికి సంబంధించిన సంఘర్షణని, భావోద్వేగాలని, మెలోడ్రామాని, సముచిత పరిష్కారాన్నీ ఆశించకుండా, కేవలం నవ్వుకోవడాలతో గ్లామర్ షో కోసం చూడాలనుకుంటే చూడొచ్చు.

నటనలు సాంకేతికాలు

శర్వానంద్ బరువెక్కి బొద్దుగా మారడం ఇంటినిండా ఆడవాళ్ళు పెట్టిన తిండి వల్లే కావచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. శర్వానంద్ ముందుగా ఫిజిక్ పట్ల జాగ్రత్త వహించకపోతే ఫ్లాపుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. పాత్రగా చూస్తే శర్వానంద్ చేయడానికేమీ లేదు. పాత్ర ఎదుర్కోవడానికి సరైన సమస్యే లేనప్పుడు, సంఘర్షణే లేనప్పుడు, పాత్ర ఏముంటుంది? ఇంట్లో ఆడవాళ్ళతో కామెడీ, రశ్మికతో రోమాన్స్, ఖుష్బూతో వుండీ లేని ఎమోషన్స్. సాంగ్స్ తో ఎంటర్టైన్మెంట్. అయితే ఇంత లైటర్ వీన్ పాత్రేసినప్పుడు, ముగింపులో కూడా ఓ హేపీ మూడ్ తో ప్రేక్షకుల్ని ఇంటికి పంపాల్సింది. ఇది జరగలేదు. కథంటూ వుంటే అందులోంచి ఏమైనా లాగి ముగింపుతో రంజింప జేయవచ్చు.

        రశ్మిక గ్లామర్, కాస్ట్యూమ్స్, స్టయిలింగ్ లతో మైమరపించే ప్రయత్నం చేసింది. హీరోయిన్ పాత్రకి ఐక్యూ తప్ప ఏమున్నా చూసేసేందుకు అలవాటు పడ్డారు కాబట్టి, రశ్మిక సక్సెస్ ఫుల్ గా కథా కథనాలనే బరువు బాధ్యతల నుంచి తప్పించుకోగల్గింది.  

        ఇక ఇతర నటీనటులు, ఆడవాళ్ళ బృందం షరా మామూలే. ఖరీదైన పట్టుచీరెలూ నగలతో మనం షాపింగ్ మాల్ కి టూర్ వెళ్ళినట్టు అన్పింపజేస్తారు. ఎవరికెవ రేమవుతారో బంధుత్వాలు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమైపోతుంది. ప్రదీప్ రావత్ కామెడీ చేయబోయాడు గానీ, అది కామెడీలా లేదు.

        దేవిశ్రీప్రసాద్ కూడా మనసు పెట్టి సంగీతం చేయలేదు. మొదటి రెండు పాటలు  కాస్త  ఫర్వాలే దన్పిస్తాయి. మాస్ పాటల్ని దంచి కొడుతూ క్లాస్ పాటలతో టచ్ కోల్పోతున్నాడేమో తెలీదు. సుజిత్ సారంగ్ కెమెరా, ప్రొడక్షన్ విలువలు రశ్మిక గ్లామర్ తో పోటీపడుతూ వున్నాయి. సినిమాల్లో ప్రొడక్షన్ విలువలున్నంత రిచ్ గా విషయం వుండదు.

        ఫస్టాఫ్ శర్వానంద్ కి పెళ్ళి కుదరని కామెడీలూ, రశ్మిక తో రోమాన్స్. ఆమె తల్లి కారణంగా పెళ్ళి చేసుకో ననడంతో పూర్తవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ కాని కాన్ఫ్లిక్ట్ తో సెకండాఫ్ ప్రారంభమైతే, కాన్ఫ్లిక్ట్ కాని ఈ కాన్ఫ్లిక్ట్ తో కూడా సంబంధం లేని ఫ్యామిలీ ప్రదర్శన వుంటుంది. కథే లేదు, వున్న కథ లోకీ వెళ్ళరు ఇంత మంది ఆడవాళ్ళూ కలిసి. శర్వానంద్ రశ్మిక తల్లి ఖుష్బూ కంపెనీలో చేరడం, పెళ్ళిళ్ళతో ఆమెకున్న  అభ్యంతరం గురించి ఒక్క మాటలో చెప్పే ఫ్లాష్ బ్యాక్ రావడం, సినిమా కొలిక్కి రావడం...

        ఈ సినిమాలో ఆడవాళ్ళని  చూస్తే జెలసీ పుడుతుంది. వీళ్ళకేనా జోహార్లు, వీళ్ళు చెప్పాలనుకున్న కథకి కాదా?

—సికిందర్