రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, మార్చి 2017, బుధవారం

రివ్యూ!
రచన- చిత్రీకరణ-  దర్శకత్వం: జీవా శంకర్తారాగణం: విజయ్ ఆంటోనీ, మియా జార్జ్, త్యాగరాజన్, సంగిలి మురుగన్, స్వామినాథన్, మారి ముత్తు, జయకుమార్, శంకర్ తదితరులు
మాటలు: భాష్యశ్రీ, సంగీతం: విజయ్ ఆంటోనీ 
బ్యానర్ : ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్
నిర్మాతలు: మిర్యాల రవీందర్ రెడ్డి, లైకా ప్రొడక్షన్స్
విడుదల : ఫిబ్రవరి 24, 2017
***

          ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ మూస కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా డార్క్ మూవీస్ హీరోగా పాపులర్ అవుతున్నట్టు కన్పిస్తోంది. తమిళంలో నటించిన ఏడు  సినిమాల్లో తెలుగులో నాల్గు డబ్ అయ్యాయి. ‘సలీం’, ‘బిచ్చగాడు’, ‘బేతాళుడు’ లతో బాటు, ప్రస్తుత ‘యమన్’ ని కూడా చూస్తే ఇవన్నీ డార్క్ మూవీసే. నైరాశ్యాన్నీ , ద్వేషాన్నీ, స్వార్ధాన్నీ, అనైతికతనీ  ప్రదర్శించే పాత్రల ‘చీకటి కథలు’ గా అతణ్ణి ఆశ్రయిస్తున్న దర్శకులు తీస్తున్నారు. ఒక్కో కథకి ఒక్కో రంగాన్ని ఎంచుకుని తీస్తున్నారు. ‘సలీం’ తో వైద్యరంగాన్నీ, ‘బిచ్చగాడు’ తో ఆథ్యాత్మిక రంగాన్నీ, ‘బేతాళుడు’తో మనోవైజ్ఞానిక రంగాన్నీ తీసుకున్నట్టు, ఇప్పుడు దర్శకుడు జీవా శంకర్ తను వచ్చేసి రాజకీయరంగాన్ని తీసుకున్నాడు.

          కానీ రాజకీయ సినిమాలు కూడా మూస చట్రంలోనే ఇరుక్కుని ఒక దగ్గర ఆగిపోయాయి. కోడిరామకృష్ణ వచ్చేసి ఆనాడు ‘అంకుశం’, ‘భారత్ బంద్’ లు తీస్తూ అప్పట్లో రాజకీయరంగంలో కొత్తగా మొదలైన వెన్నుపోటు రాజకీయాల్ని తెరకెక్కించింది మొదలు, అవే రిపీటవుతూ వస్తున్నాయి ఒక మూసలో. ‘యమన్’ కూడా ఇందుకేమీ తీసిపోదు – రాజకీయాల్లో ఇంకేమీ వైపరీత్యాలు లేనట్టుగా. ఐతే విచిత్రమేమిటంటే, ఈ వెన్నుపోట్ల కథలతో ఇవి రాజకీయ సినిమాలుగా కూడా వుండడం లేదు, మాఫియా తరహా వాతావరణంతో ఇంకో మాఫియా సినిమా చూస్తున్నట్టుగానే  వుంటున్నాయి.

     ‘యమన్’ కూడా  డబ్బు అవసరమున్న ఒక సామాన్యుడు,  నేరమయ రాజకీయాల్లో ఇరుక్కుని, తన ప్రాణ రక్షణకి తప్పని సరై రాజకీయాల్లో ఉన్నతస్థాయికి  ఎదగాలని ప్రయత్నించే కథే.  ఒకడు రాజకీయాలో ఏ స్థాయికి ఎదిగితే ఎవడికి అవసరం? వాడు ప్రజలకి ఏం చేశాడన్నది అవసరం.  మాఫియా పాత్ర ప్రజలకి ఏమీ చెయ్యదని తెలుసు కాబట్టి, వాడొక్కడి నీచ కథగా అది వర్కౌట్ అవుతుంది. ప్రజలతో సంబంధముండే  రాజకీయ పాత్రని మాఫియా పాత్రలాగా ప్రజా క్షేత్రం నుంచి విడదీసి చూపిస్తే ఎలా వర్కౌట్ అవుతుంది? రాజకీయ పాత్రకీ, మాఫియా పాత్రకీ తేడా గుర్తించలేనంత  బిజీ లైఫ్ లో పడిపోయి ఇలాటి సినిమాలు తీస్తూంటారేమో!


          అశోక చక్రవర్తి అలియాస్ అశోక్ (విజయ్ ఆంటోనీ) పుట్టక ముందే తండ్రి (విజయ్ ఆంటోనీ) చనిపోతాడు. కులాంతర వివాహం చేసుకున్నాడని బావ చంపేస్తాడు. అశోక్ పుట్టాక తల్లి చనిపోతుంది. అలా అతడికి యమన్ (యముడు) అనే పేరొస్తుంది. పెద్దయ్యాక
యమన్ తాతతో వుంటాడు. తాత ఆపరేషన్ కి డబ్బు అవసరముంటుంది. ఆ డబ్బుకోసం ఒక కారు యాక్సిడెంట్ కేసుని  మీదేసుకుని జైలుకి పోతాడు. ఆ కారు యాక్సిడెంట్ సాంబా అనే వ్యాపారికి జరుగుతుంది. అది నరసింహా అనే ఇంకో వ్యాపారి జరిపిస్తాడు. నరసింహానే యమన్ ని జైల్లోంచి బయటికి తీస్తాడు. దీంతో యమన్ ని చంపాలని సాంబా ప్రయత్నిస్తాడు. పంచాయితీ కరుణాకర్ (త్యాగరాజన్) అనే ఎమ్మెల్యే దగ్గరి కొస్తుంది. రాజీ చేస్తాడు. తర్వాత సాంబా నరసింహాలు ఒకటై యమన్ మీద హత్యాప్రయత్నం చేస్తారు. కరుణాకర్ ఆదుకుని యమన్ ని తనతో కలుపుకుంటాడు, బార్ లైసెన్స్ ఇప్పిస్తాడు. బార్ నడుపుతున్న యమన్ కి కౌన్సిలర్ తో తగాదా వస్తుంది ( పెద్ద నగరంలో కౌన్సిలర్ వుంటాడా,  కార్పొరేటర్ వుంటాడా?). కరుణాకర్ యమన్ ని చంపాలని మంత్రితో చేతులు కలుపుతాడు. ఈ మంత్రి అప్పట్లో యమన్ తండ్రిని చంపినవాడే. ఇప్పుడు  యమన్, కరుణాకర్, మంత్రీ ఈ ముగ్గురి మధ్యా ఏం జరిగిందన్నది  మిగతా కథ. ఈ కథలో అహల్య (మియా జార్జి) అనే సినిమానటి కూడా వుంటుంది. ఈమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు యమన్. 

      వర్మ తీసిన మాఫియా సినిమాలు ఇలాటి కథలే. అయితే ఆ కథలు ఉద్రిక్తభరితంగా వుండేవి. ప్రస్తుత కథ చప్పగా వుంటుంది. కారణం, స్క్రీన్ ప్లే అనే వొక వేడి వేడి పదార్థ ముంటుందని  పట్టించుకోకుండా ఐస్ క్రీం చప్పరిస్తున్నట్టు ఎంతసేపూ కూర్చుని మాటాడుకునే పాత్రలే. కూర్చుని మాటాడి గుబులు పుట్టించడానికి ఇక్కడ సర్కార్ లేడు, గాడ్ ఫాదరూ లేడు. ఫిర్యాదులూ పంచాయితీలూ వీటితోనే సీన్లు చప్పగా సాగుతూంటాయే తప్ప, ఎక్కడా హై పాయింట్ వుండదు. స్క్రీన్ ప్లేకి వుండాల్సిన సెంట్రల్ పాయింటూ దాని చుట్టూ కథ సంగతి సరే. యాక్షన్ తో కథ చెప్పడం వుండదు. రానురాను యాక్షన్ సీన్లకి అవకాశం వుండని నాటకం చూస్తున్నట్టు తయారవుతుంది. ఈ ఫిర్యాదులూ పంచాయితీల మధ్య యమన్ ఒక బాధిత పాత్ర. ఎంత సేపూ తనని చంపబోయే వాళ్ళ నుంచి కాపాడుకుంటూ పారిపోవడమే తప్ప, రియాక్టివ్ గా ఆత్మరక్షణ చేసుకోవడమే తప్ప ( దీన్నే గొప్ప యాక్షన్ అనుకున్నారేమో) - పరిస్థితిని తన చేతుల్లోకి తెచ్చుకుని, గేమ్  తను ఆడే  ఆలోచనే వుండని పాసివ్ పాత్రగా వుండి పోతాడు. ఇంటర్వెల్ సీన్ అయితే గమ్మత్తయిన చేష్టతో ఒక బలహీనమైన, హాస్యాస్పదమైన సీను! 

          ఈ మొత్తం ప్రహసనంతో వాళ్ళెవరో వాళ్ళ పదవుల కోసం వాళ్ళు చంపుకునే గొడవ- మనకెందుకన్నట్టు  తయారవుతుంది. ఈ రాజకీయ పాత్రలు ప్రజలకోసం పోరాటంలో భాగంగా చంపుకుంటే  ఆడియెన్స్ కనెక్ట్ వుండేదేమో. అయితే  ముందే చెప్పుకున్నట్టు డార్క్ మూవీ జానర్ లో ఇది నైరాశ్యాన్నీ, ద్వేషాన్నీ, స్వార్ధాన్నీ, అనైతికతనీ  ప్రదర్శించే పాత్రల చీకటి కథే. కానీ కథే సరిగ్గా లేదు, అది  రాజకీయ కథో మాఫియా కథో అన్నట్టు వుంది. జానర్ స్పష్టత, జానర్ మర్యాద అనే తీర్ధం పుచ్చుకుని పెన్ను పట్టుకోవాలని కూడా బిజీ లైఫ్ లోపడి మర్చిపోయారేమో!

          తెలుగులో రోమాంటిక్  డ్రామాకీ,  రోమాంటిక్ కామెడీ కీ జానర్ తేడా తెలీక వారం వారం ఎలా చేతులు కాల్చుకుంటున్నారో, అలా పొలిటికల్ జానర్ తెలీక మరో రొటీన్ మాఫియా తీసినట్టుందిది.
 

          విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ తర్వాత దారితప్పిన రెండో సినిమా ఇది. గత ‘బేతాళుడు’ తో బెజారెత్తించి, ఇపుడు ‘యమన్’ తో  భేజా ఫ్రై చేశాడు. ఇక రాబోయే ‘అన్నాదురై’ తో  ఏం ట్రై చేస్తాడో చూడాలి.

           దర్శకుడే కెమెరా మాన్. డార్క్ మూవీ చిత్రీకరణ అంతా చేశాడు. అయితే క్వాలిటీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టలేదని తెలిసిపోతుంది. విజయ్ ఆంటోనీయే సమకూర్చిన సంగీతం చాలా బ్యాడ్. ఏదో పాత సినిమా డబ్బింగ్ పాటలు చూస్తున్నట్టు వుంటుంది. లుంగీ కట్టుకుని ఒక మాస్ సాంగ్ తను వేసువడం కూడా నవ్వొచ్చేలా వుంది. తను డార్క్ హీరోనే నటించాలి తప్ప, మాస్ హీరోగా ప్రయత్నిస్తే అసలుకే మోసం. ఇక హీరోయిన్ మియా జార్జి చాలా అందమైంది. సినిమా హీరోయిన్ గా పాత్రకూడా కారవాన్ లో సేదదీరేంత స్టేటస్ తో వుంది. కానీ యమన్ ని పెళ్లి చేసుకోగానే వంట చేసుకుంటూ వుండి పోవడమే నరేంద్ర మోడీకి వొళ్ళు మండించే పని!


          ముందే చెప్పుకున్నట్టు రాజకీయ సినిమాలు ఎక్కడో ఏ కాలంలోనో మూస ఫార్ములా చట్రంలో పర్మనెంట్ గా ఇరుక్కున్నాయి- వాటికి  దేశ కాల మాన పరిస్థితులతో పనుండదు!

-సికిందర్
http://www.cinemabazaar.in