రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఏప్రిల్ 2015, సోమవారం

రెండోది ఇలా!

చన-  – దర్శకత్వం : సుధీర్ వర్మ
తారాగణం :  నాగ చైతన్య, కృతీ సనన్ , పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, రవిబాబు, ప్రవీణ్, సత్య తదితరులు
సంగీతం : సన్నీ ఎం ఆర్,   ఛాయాగ్రహణం : రిచర్డ్ ప్రసాద్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర ,   నిర్మాత : బి వి ఎస్ ఎన్ ప్రసాద్
విడుదల :  24 ఏప్రెల్ 2015

*** 

There are two ways, my way and highway
 -Quentin Tarantino 
        సర్ప్రైజ్!  ‘స్వామిరారా’ ప్రామిజింగ్ యువ దర్శకుడు రెండో సినిమాకే డీలాపడి, పాత ప్రేక్షకులు ఎన్నోసార్లు చూసి విసిగిపోయిన అదే కాలం చెల్లిన మూస ఫార్ములాతో న్యూవేవ్ థ్రిల్లర్ నీ కాచి వడబోసి చిక్కటి కషాయాన్ని తయారు చేశాడు! బ్రహ్మాండమైన యూత్ అప్పీల్ తో హిట్టయిన పక్కా న్యూవేవ్ థ్రిల్లర్ ‘స్వామిరారా’ కి ఆదర్శంగా పెట్టుకున్న క్వెంటిన్ టరాంటినోనీ, రాంగోపాల్ వర్మనీ, ఈ సినిమాలో ఓ సీనులో ఓ గదిలో పోస్టర్లకే  పరిమితం చేసేసి, 1970-80 లనాటి ‘తల్లి జబ్బుతో మరణించెను, మరియు తండ్రి చేయని నేరానికి  జైలుకెళ్ళెను, మరియు అనాధ అయిన చిన్నారి హీరో దొంగ గా మారి, మరియునూ ఆ చోరీ సొత్తుతో చెల్లిని డాక్టరీ  వరకూ  చదివించుకొనిన’  బాపతు పాత చింతకాయ రివెంజి స్టోరీని వడ్డించాల్సి వచ్చింది!  వెరసి వన్ ఫిలిం వండర్ గా మిగిలిపోయిన యువ దర్శకుల జాబితాలో తనూ చేరిపోతున్న సూచన లిచ్చుకున్నట్టయ్యింది!

          ‘షోలే’ తీసిన సిప్పీ మళ్ళీ అలాటిదే ‘షాన్’ తీసి బోల్తా పడినట్టు, లేదా ‘అత్తారింటికి దారేది’ తీసిన దర్శకుడు మళ్ళీ అలాటిదే ‘సన్నాఫ్ సత్యమార్తి’ తీసి దెబ్బ తిన్నట్టూ - ఈ దర్శకుడు కూడా  తనకి ఎలాగో కుదిరిన ‘స్వామిరారా’ లాంటి దొంగల కథనే రిపీట్ చేయడం వినా కొత్త ఐడియా రాలేదు. ఈ సినిమాలో బ్రహ్మానందం చేత దర్శకుడు పలికించే డైలాగు - స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపిస్తారు, తీసేటప్పుడు నరకం చూపిస్తారు- అనేది ఈ దర్శకుడికే వర్తిస్తుంది బహుశా!

I have never been insecure about my work
   -Ram Gopal Varma 
        నాగచైతన్యకి యాక్షన్ సినిమాలు కలిసిరావడం లేదంటే కారణం ప్రామిజింగ్ దర్శకులు నాగ చైతన్యతో ఇలా పాత మూస రివెంజులు తీస్తూ కూర్చోవడమే!

          సాధారణంగా ఈ తరహా మూస రివెంజులు స్టార్లకి పెట్టి తీస్తారు. నాగచైతన్య లాంటి స్టార్ తో అలాటి అవకాశం రాగానే దర్శకుడు తన ‘స్కూల్’ ని తీసి పక్కన పెట్టేసి, బిగ్ స్టార్ల బరిలోకి వెళ్ళిపోవాలని ఆరాటపడినట్టుంది ఈ తరహా కషాయంతో. టాప్ పొజిషన్ కి చేరుకోవాలనుకోవడంలో తప్పేం లేదు, ఆ చేరుకునేందుకు ఇలా వేసుకున్న బాటలోనే సిన్సియారిటీ కన్పించడం లేదు. తను లాజిక్ ని డిమాండ్ చేసే న్యూవేవ్ థ్రిల్లర్ వైపు ఉండాలా, లేక లాజిక్ ని ఎగవేసే మూస ఫార్ములా వైపు ఉండాలా -ఏదో ఒక్కదానికే కట్టుబడాలన్నజానర్ మర్యాదని తీసి గట్టుమీద పెట్టినట్టే వుంది!

          ఈ మూస + న్యూవేవ్ కాక్ టెయిల్ లో కూడా సమంజసమైన కథా కథనాలు కన్పించవు.  బలహీన కథ, దానికి హాస్యాస్పదమైన బలహీన కథనం, అతి బలహీన అర్ధంలేని పాత్రలు, సెకండాఫ్ లో ఏం చేయాలో అర్ధంగానట్టు శ్రీనువైట్లే వాడేసి వదిలేసిన బ్రహ్మానందం టైపు కామెడీ తో బ్రహ్మానందంతోనే ఎపిసోడు!  ఒరిజినాలిటీ జోలికి పోకుండా, కొన్ని పాత తెలుగు సినిమాలు చూసి ఈ సినిమా కథ అల్లేసినట్టుంది.

           అప్పుడెప్పుడో చిన్నప్పుడు చందూ (నాగ చైతన్య) తల్లి జబ్బున పడి దగ్గుతుంటుంది శాంతాకుమారిలా.  రొటీన్ గా వైద్యానికి డబ్బుల్లేవు కారు డ్రైవరైన గుమ్మడి లాంటి తండ్రి సీతారాం ( రావురమేష్) దగ్గర. చందూ చిన్నారి చెల్లెలు తల్లి బాధ చూసి డాక్టర్నై పోతానని పిల్ల శపథం చేసేస్తుంది తధాస్తు దేవతలు వణికిపోయేలా. రొటీన్ గా ఆ తల్లి చనిపోతుంది. ఓ సత్యనారాయణ లాంటి కిరాతకుడు భీమవరం వెళ్ళడానికి గుమ్మడి సీతారాం కార్లో బయల్దేరి, దార్లో ఓ మాయ చేసి డబ్బుతో పారిపోవాలనుకుంటాడు రొటీన్ గా. వాణ్ణి చంపి ఆ నేరం గుమ్మడి సీతారాం మీదే వేసి  డబ్బుతో పారిపోతాడు నాగభూషణం లాంటి మాణిక్యం కూడా రొటీన్ గానే.  గుమ్మడి సీతారాం యావజ్జీవ ఖైదీ అవుతాడు జైల్లో ఫార్ములా ప్రకారం. ఇక అనాధ అయిపోయిన చందూకి అప్పుడే ఐదారేళ్ళ వయసులోనే, ఓ జామపళ్ళు అమ్మేవాడు అన్యాయం చేస్తున్నాడని తీవ్రంగా అన్పించేసి - అన్యాయంతోనే తను బతకాలని ఆ క్షణాన్నే రొటీన్ గా, అసురలోకం ఆనందించేలా ప్రతినబూని- చిల్లర దొంగగా మారిపోయి-చెల్లెలి శపథం కూడా నెరవేర్చడానికి  కంకణం కట్టుకుంటాడు కాంతారావులా. ఇలా పెద్దవాడై ఇప్పుడు చంద్రకళలా వున్న చెల్లెల్ని మంది సొమ్ముతో మెడిసిన్ చదివిస్తూనే, మరో వైపు మంది దగ్గర కొట్టేస్తున్న సొమ్ముతోనే  తండ్రిని జైల్లోంచి విడిపించుకోవాలన్న మహత్తర లక్ష్యంతో ఊరుమీద పడి దోచేస్తూంటాడు-
ఇదీ యువ హీరో నాగ చైతన్యకోసం తీర్చిదిద్దిన అద్భుతమైన వ్యక్తిత్వమున్న పాత్ర!

          తనలాంటి సాటి యువకుణ్ణి, అదీ జాబ్ చేసుకుంటూ న్యాయంగా సంపాదించుకుంటున్న వాణ్ణి,  సెల్ ఫోన్ అమ్ముతానంటూ బుట్టలో వేసుకుని, సబ్బు అంటగట్టి నలభై వేలు కొట్టేసి  ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం తనకి అన్యాయంగా ఏమీ అన్పించదు. ఇలాటి అమాయకులే ఇతడి బాధితులు. ఆ సొమ్ములతో విలాసవంతమైన జీవితం. మెడికో అయిన ఆ అర్భక చెల్లెలి పాత్రకి  అన్న ఏం చేసి సంపాదిస్తున్నాడన్నఆలోచనే వుండదు. ఇంకో నిరర్ధక పాత్ర పోలీసు అధికారి రిచర్డ్ ( రవిబాబు) అని ఉంటాడు. ఇతడికి చందూ  దగ్గర లంచం కూడా సరిగ్గా డిమాండ్ చేసి లాగడం చేతగాదు.

          జైల్లో వున్న తండ్రి విషయానికొస్తే, లెక్కప్రకారం ఇప్పుడు చందూ ఈ వయసుకొచ్చేటప్పటికి, తండ్రి ఎప్పుడో యావజ్జీవం పూర్తి చేసుకుని విడుదలై పోయి వుండాలి. కానీ చందూ వచ్చి అధికార్లకి రెండు కోట్లు లంచమిచ్చి విడిపించడం కోసమే  ప్రభుత్వం అతణ్ణి పట్టుక్కూర్చున్నట్టుంది. అది కూడా పంద్రాగస్టున రొటీన్ గా ప్రభుత్వం విడుదల చేసే సత్ప్రవర్తనగల ఖైదీల కోటాలోనే తండ్రిని అంత డబ్బు పెట్టి విడిపించుకుంటు న్నాడాయె ఉదారంగా!

          డామ్ ష్యూర్ గా గుమ్మడి లాంటి ఆ తండ్రి సత్ప్రవర్తనగల ఖైదీయే అయివుండాలి ( నిజానికి ఇది రావు రమేష్ లాంటి సమర్ధుడికి పనీపాటా లేని నిరర్ధక పాత్ర!). ఈ లెక్కన శిక్షాకాలం పూర్తి కాకుండానే ఎప్పుడో విడుదలై పోవాలి కదా? క్రైం  థ్రిల్లర్ తీస్తూ కాకమ్మ కథలు చెప్తే ఎలా? పోనీ ఈ పంద్రాగస్టున అయినా గుండెజబ్బుతో వున్న తండ్రిని విడుదల చేయాలని చందూ డిమాండ్ చేయొచ్చుగా? జామకాయల  దగ్గర అన్యాయాన్ని  సహించక అసురలోకాన్ని ఆనందింప జేసిన వాడు,  ప్రభుత్వం ఇంత ‘అన్యాయం’ చేస్తున్నా లంచంతో కాళ్ళ బేరాలేమిటి? అసురలోకం మండి పడదా?

          కథనం ఇంకెంత  దయనీయంగా  ఉన్నదంటే, ఈ తండ్రి ఎపిసోడ్ కి ఒక ఎజెండా అంటూ లేకుండా, గజిబిజిగా రెండు పాయింట్లు ఇరికించి వున్నాయి. 1. గుండెపోటుతో హాస్పిటల్లో చేర్చిన తండ్రికి అర్జెంటుగా చేయాల్సిన యాంజియో ప్లాస్టీ సర్జరీకి ప్రభుత్వ అనుమతి కావాలని చెప్తాడు డాక్టర్. ఈ డాక్టర్ సలహా ప్రకారం హోం మంత్రి పియ్యే ( జీవా) ని కలుస్తాడు చందూ. అనుమతి కోసం ఆ పియ్యే పది లక్షలు డిమాండ్ చేస్తాడు. ఈ పదిలక్షలు ఎక్కడ కొట్టేయాలా అని ప్లాన్లేస్తాడు చండూ. ఇదంతా అవసరమా? యావజ్జీవ ఖైదీ ఆరోగ్య బాధ్యత జైలు అధికారులది కాదా? ఇది డిమాండ్ చేయొచ్చుగా ఒక హీరోగా చందూ?

          2. ఇంకా ఈ విషయం ఇలా ఉండగానే, పంద్రాగస్టు వ్యవహారం వస్తుంది. దీనికి మళ్ళీ కోట్ల రూపాయలు లంచమిచ్చి తండ్రిని విడిపించుకోవాలని ప్లాను! ఆపరేషనుకి పది లక్షలు- ఇప్పుడు పంద్రాగస్టున విడిపించుకోవడానికి రెండు కోట్లు! ఇతను కథానాయకుడా, వెర్రిబాగుల వాడా? పంద్రాగాస్టున ఘోర నేరాలు చేసిన ఖైదీలనే సత్ప్రవర్తన కలిగివుంటే, విడుదల చేస్తున్నప్పుడు, ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న హీరో తండ్రి ఎందుకు విడుదల కాడు?అసలు తండ్రి ఆపరేషన్ అప్పుడే విడుదలై పోయే పరిస్థితి వుండగా, మళ్ళీ పంద్రాగస్టు ప్రహసనమేమిటి?

          ఎందుకంటే,  హీరో కోసం కథ నడిపించాలి కాబట్టి. ఇంకెక్కడో తను కొట్టేయాల్సిన రెండున్నర కోట్ల రూపాయల సీన్ ఎదురు చూస్తోంది కాబట్టి,  ఆ సీన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ పంద్రాగస్టు ఎపిసోడ్ నడిచి చందూకి రెండు కోట్లు అవసరపడి తీరాలి. ఇలావుంది కథనం. కథలో ప్రధాన పాత్రే తన ప్రాథమ్యాలని ఎంచుకుని కథని నడపాలి తప్ప, ప్రధాన పాత్ర కోసం పనిగట్టుకుని కథని నడపరాదన్న ప్రాథమిక పాఠం పట్టనందువల్లే ఈ గజిబిజి కథనం. సమస్య ప్రధాన పాత్రకి ఎదురవకుండా, కథకే ఎదురయినట్టుంది ఈ కథనం. ఎవరైనా కథానాయకుడి కి ఎదురయిన సమస్యని ఆ కథా నాయకుడ్నే పరిష్కరించుకోనిస్తారా? లేక కథలో రచయితకి ఓ సమస్య ఎదురయ్యిందని చెప్పి- ఆ సమస్య తను పరిష్కరించుకోవడానికి కథానాయకుణ్ణి బలిచేస్తారా? ఇందుకే సినిమా సాంతం నాగచైతన్య పాత్ర చైతన్యం లేని పేలవమైన పాసివ్  పాత్రగా లా తిరుగాడు తూంటుంది...

          నాగచైతన్యే కాదు, ఎక్కడో నేపాల్ భూప్రకంనలు ఇక్కడ బెజవాడ దాకా ప్రాకినట్టు- నాగచైతన్య పాత్రతో మొదలైన విధ్వంసం- కృతీ సనన్, రావురమేష్, రవిబాబు, పోసాని తదితరులు పోషించిన పాత్రలన్నిటికీ ఎగబ్రాకి వాటిని డమ్మీలుగా మార్చేసింది. కేవలం ముందే ఫిక్సయిపోయిన కథా కథనాల కోసం!

          క్యారక్టర్ సింప్టమ్స్ ని డయాగ్నసిస్ చేస్తే- ఇటు మూస ఫార్ములా మాస్ ధోరణులతోనైనా  హుషారెక్కించకుండా, అటు న్యూవేవ్ ఇంటలిజెంట్ చర్యలతోనైనా థ్రిల్లూ కల్గించకుండా, పాత్రలన్నీ త్రిశంకుస్వర్గంలో వేలాడాయి పాపం!  

***

          సినిమా ప్రారంభమే పట్టపగలు బ్యాంకు దోపిడీ జరుగుతుంది. ఈ ప్రారంభ సన్నివేశమే ‘స్వామిరారా’ క్వాలిటీ ముందు దిగదుడుపుగా వుండి షాకిస్తుంది. ఏమిటి- ‘స్వామిరారా’ దర్శకుడేనా? అన్పించేలా ఆషామాషీగా లాగించేసిన ధోరణి కన్పిస్తుంది. అలా రెండున్నర కోట్లు ఈజీగా దోచుకున్న దొంగలు ఓ ఫ్లాట్ లో కూర్చుని గొడవపడతారు. యాభై లక్షలు బాస్ కిచ్చేసి, చెరో కోటితో పరారవుదామని ఒకడంటే, కాదు అది చాలా రిస్కూ, బాస్ చంపేస్తాడని రెండో వాడంటాడు. ఇంతకీ ఈ చంపేసేంత బాస్ ఎవడయ్యా అంటే, హీరో చిన్నప్పటి విలన్, తండ్రిని జైలుకి పంపిన మాణిక్యం ( పోసాని) అనే జోకరే! ఈ జోకర్ కి ఇతడికంటే పరమ కిరాతకంగా కన్పించే అనుచరులు ఎందుకు భయపడతారంటే- ఇందాకా చెప్పుకున్నట్టు కథకోసమే! ఫిక్సయిపోయిన కథే ప్రాణం, పాత్రలు కాదు! కథని బట్టే పాసివ్ పాత్రలు- యాక్టివ్ పాత్రల్ని బట్టి కథ కాదన్న మాట!

          ఒక ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సినిమా తీస్తే అదెంతో మంచి స్టడీ మెటీరియల్ ని అందించాలి, వర్ధమాన దర్శకులకి స్ఫూర్తి కల్గించాలి. 12 కోట్ల రూపాయల బడ్జెట్ గల సినిమాతో ఇలా ధ్వంస రచన చేయకూడదు.

          సరే, అలా గొడవ పడి ఒకరికొకరు గన్స్ గురి పెట్టుకుంటారు దోపిడీ దొంగలు. మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్ కాని మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్ లాంటిదన్న మాట (మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్ లో ముగ్గురు ప్రత్యర్ధులు ఒకరికొకరు గన్స్ గురిపెట్టుకుంటారు. ఎవరు ముందు షూట్ చేసినా ఈ స్టాండాఫ్ లో రెండో వాడే బతికి బయట పడతాడు. ఇది ఈ సిట్యుయేషన్ థియరీ. ఎవరూ చావకుండా దీనికో సూపర్ రేషనల్ థియరీ కూడా వుంది. ముగ్గురూ కాంప్రమైజ్ అయిపోవడమే. క్వెంటిన్ టరాంటినో సినిమాల్లో ఇవి కన్పిస్తూంటాయి).

          అన్నట్టు ఇదే ఫ్లాట్ లోదర్శకుడి కుల దైవాలైన క్వెంటిన్ టరాంటినో, రాం గోపాల్ వర్మల పోస్టర్లు గోడకి అంటించి వుంటాయి. మూసగా ప్రారంభమైన సినిమా ఈ సన్నివేశంతో న్యూవేవ్ గా మారిందేమిటా అనుకుంటాం. మూడ్ ని డిస్టర్బ్ చేసే ఈ చిత్రణతో అర్ధోక్తిలో వదిలేస్తాడు ఈ సన్నివేశాన్ని. కట్ చేస్తే హీరోమీద ప్రారంభమౌతుంది కథనం. హీరో ఎంట్రీ, చోరీలు, చెల్లెలు, తండ్రి ట్రాకులు, మాణిక్యం జోకర్ కామెడీలు, రిచర్డ్స్ పసలేని బిల్డప్పులు, హీరోకి హీరోయిన్ తో పరిచయం – ప్రేమా.. ఈ హీరోయిన్ (కృతీ సనన్) కూడా హీరో చెల్లెలు చదువుతున్న కాలేజీలోనే ఫార్ములా ప్రకారం మెడికో! ఈమె వారానికి రెండు మూడు సినిమాలు చూసేస్తూ, సిగరెట్లు పీల్చి పారేస్తూ,  హీరో వెంట పడి తిరిగే భావి డాక్టరమ్మ- అరిగిపోయిన ఫార్ములా పాత్ర!

          ఇలా గంటంపావు గడుస్తున్నాకథ పాయింటుకే  రాదు. కథేమిటో అర్ధంగాదు. కథకీ కథనానికీ త్రీయాక్ట్స్ అనే ఫ్రేమింగ్ ఉంటుందన్న స్పృహే వున్నట్టు కన్పించదు. లాజిక్ నీ, క్యారక్టరైజేషన్ నీ, స్ట్రక్చర్ నీ కూడా ఎగేసి, స్టార్ డమ్ కి నిచ్చెన వేసుకోవాలన్న ఆదుర్దాయే కన్పిస్తుంది అంతటా.

          ఈ గంటంపావు సేపూ ముక్కలు ముక్కలుగా అది కాసేపు ఇది కాసేపు దృశ్యాలు మారిపోతూ స్క్రీన్ టైం వెస్ట్ అవడమే తప్ప విషయం  కనపడదు. ముప్పావు గంట సమయంలోనే ఇరికించేసి మూడు పాటలు పెడుతూ సహన పరీక్ష. ఈ పాట లేమైనా అద్భుతమా అంటే అదీ కాదు. ‘స్వామిరారా’ కి పనిచేసిన ఇదే సంగీత దర్శకుడు అందులో జాజ్ మ్యూజిక్ ని ఫ్యూజన్ చేసి కొత్తదనంతో హుషారెక్కించాడు. సంగీతం ఆ సినిమాకి ఎసెట్ అయ్యింది. ప్రస్తుతం అలాటి క్రియేషన్ ఏమీలేని అపస్వరాల మూట అయింది.

          చివరికి ఇంటర్వెల్లో పైన చెప్పుకున్న పియ్యే చెప్పిన ప్రకారం, ఆ పదిలక్షల్ని అందించడానికి ఒక ఫ్లాట్ కెళ్తాడు చందూ. ఆ ఫ్లాట్ కాదనుకుని ఇంకో ఫ్లాట్ బజర్ నొక్కుతాడు. అంతే, ఆ ఫ్లాట్ లో ఒకరికొకరు గన్స్ గురి పెట్టుకుని మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్లో వున్న దొంగలిద్దరూ, పోలీసులనుకుని పరస్పరం కాల్చుకు చచ్చిపోతారు!

          ప్రారంభించిన కథని తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకురావడమనే ఈ కథనపు టెక్నిక్ ని క్వెంటిన్ టరాంటినో తన ప్రథమ సినిమా ‘పల్ప్ ఫిక్షన్’ లో పరిచయం చేశాడు. దీన్నే ఆల్రెడీ ‘స్వామిరారా’ లో వాడేసుకున్నాడు దర్శకుడు. మళ్ళీ ఇదే రిపీట్ చేస్తూ జాలి కల్గించాడు దర్శకుడు. మూసఫార్ములాలో ఇలాగే న్యూవేవ్/ఆఫ్ బీట్ కథనపు టెక్నిక్కులకి పాల్పడిన ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ అనే ఫ్లాప్ ఉండనే వుంది. అందులో సన్నివేశాల్ని  ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, రిట్రీట్ అయి, రియల్ టైం లో రిపీట్ చేసే,  మాస్ సినిమాలకి నప్పని ఆఫ్ బీట్ టెక్నిక్ వుంది. ఇలా ‘పల్ప్ ఫిక్షన్’ టెక్నిక్ ని కూడా ఈ మూసఫార్ములాలోకి జొప్పించి రసభంగం గావించాడు  దర్శకుడు. నిజానికి అంతవరకూ మూస ఫార్ములా కథనాన్ని ఫాలో అవుతున్న ప్రేక్షకులకి ఈ టర్నింగ్ ఏమిటో అర్ధంగాలేదు.

          ఇలా ఒక శైలీ శిల్పం అనేదికూడా లేకుండా ఎలాపడితే అలా సినిమా చుట్టేసిన విధం కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకేముంది, చందూ  ఆ రెండున్నర కోట్లు తీసుకుని పారిపోతాడు! ఈ సీను కోసమే  హాస్పిటల్లో ఆ గజిబిజి బీట్స్ అన్నమాట!
***


          తన కుటుంబాన్ని నాశనం చేసిన మాణిక్యం తో  చందూ రివెంజి కూడా ఆషామాషీ గానే వుంటుంది. అసలు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనే ఎక్కడా వుండదు. అప్పనంగా మాణిక్యం డబ్బు దొరికేసరికి ఆ డబ్బుతో తండ్రిని విడిపించేస్తాడు. దీంతో మాణిక్యం హాస్పిటల్లోనే వున్న చందూ  తండ్రినీ, చెల్లెల్నీ కిడ్నాప్ చేసి, ఆ డబ్బు డిమాండ్  చేస్తాడు. వాళ్ళని విడిపించుకోవడానికి మళ్ళీ బుల్లెట్ బాబు ( బ్రహ్మానందం) అనే మూవీ స్టార్ని మోసం చేసి డబ్బు సంపాదించడానికి హీరోయిన్ తో బయల్దేరతాడు చందూ. ఇంత సిల్లీ హీరోని ఏ కథలోనైనా చూస్తామా!

          ఇక ఓ అరగంట కథ లాగించెయ్యడానికి, శ్రీను వైట్ల వదిలేసిన ‘సెకండాఫ్ లో బ్రహ్మానందం తో కామెడీ ట్రాకు’  అనే తప్పనిసరి తద్దినం ఫార్ములాయే శరణ్యమయింది దర్శకుడికి! ఇదయ్యాక మాణిక్యం పాత్రతో ఇదే శ్రీను వైట్ల ‘గుడ్ బై లెనిన్’ కథని 'దూకుడు' లో ప్రకాష్ రాజ్ పాత్రకి వాడేసినట్టే, దాన్నే రూపం మార్చి క్లయిమాక్స్ అంతా మాణిక్యం పాత్రకి పెట్టి లాగించేశాడు దర్శకుడు. ఇంత అతుకులబొంతని నేషనల్- ఇంటర్నేషనల్ సినిమాలతో దిగ్విజయంగా కుట్టిన యువ ప్రామిజింగ్ దర్శకుడు అభినందనీయుడే!

          డైలాగులు కూడా ఇంకా హచ్ కుక్కలా వెంటపడ్డావ్ అంటూ అవుట్ డేటెడ్ గా వున్నాయి. హచ్ సెల్ కనెక్షనూ, కుక్కతో హచ్ యాడ్సూ కన్పించకుండా పోయి ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకో చోట వారానికి రెండు మూడు సినిమాలు కాదు ముఖేష్ యాడ్ చూస్తే తెలుస్తుంది...అంటూ హీరోయిన్ని  ఉద్దేశించి హీరో అనే డైలాగేదో వుంది. ఈ ముఖేష్ యాడ్ ఏమిటా అని తికమక పడతాం. అప్పుడు మన బుర్రకి తడుతుంది- అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం గుట్కా  తింటే ఏమౌతుందో ముఖేష్ అనే రోగిని చూపిస్తూ థియేటర్లలో యాడ్ ఫిలిమ్స్ వేయించేది ప్రభుత్వం. అదన్న మాట! ఈ అవుట్ డేటెడ్ లోనూ మెదడుకి పరీక్షే!

          చాలా చోట్ల- చాలా చోట్లా- కథ చెప్తే అందులో లాజిక్కులు లాగి, పాత్రచిత్రణల్ని ప్రశ్నించి ముప్పుతిప్పలు పెట్టి పొమ్మనే నిర్మాతలూ, హీరోలూ వున్నారు. ప్రస్తుత సినిమా దర్శకుడికి ఇంత ఈజీ గోయింగ్ నిర్మాతా, హీరో దొరకడం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం!  ఇలాగే కంటిన్యూ అయి సినిమాలు తీస్తూ కొత్త చరిత్ర రాస్తూ వుండాలని కోరుకుందాం!

— సికిందర్