రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 15, 2016

రివ్యూ!


రచనదర్శకత్వం: కోడి రామకృష్ణ 
దిగంత్, రమ్య, విష్ణువర్ధన్, రాజేష్‌వివేక్, సాయి కుమార్, ముకుల్‌దేవ్‌, రవి కాలే దర్శన్, సాధు కోకిల, తదితరులు. 
సంగీతం: గురుకిరణ్‌,
 ఛాయాగ్రహణం: హెచ్‌.సి.వేణు 
బ్యానర్స్: ఇన్‌బాక్స్ పిక్చ‌ర్స్ ప్రై.లి
, బ్లాక్ బ‌స్ట‌ర్ స్టూడియోస్‌, పెన్ మూవీస్‌
నిర్మాతలు: సాజిద్‌ఖురేషి
, సోహైల్‌అన్సారీ, ధవల్‌గడ 
విడుదల:
14 అక్టోబర్, 2016
***
      అసలు టైటిల్లోనే వ్యాకరణ దోషం, ఆ పైన రాసి తీసిందంతా కషాయం. కోడి రామకృష్ణ రేపెప్పుడైనా ‘శంకరాభరణం’ పేరుతో సినిమాతీస్తే దాని టైటిల్ ‘శంకరభరణం’ అవుతుందేమో. లేక తెలుగుని మర్చిపోతున్న- లేదా తెలుగునే ఖాతరు చెయ్యని ఇవ్వాళ్టి  లోకం కోసం సులభగ్రాహ్యంగా వుండేందుకు ‘సంస్కరించి’  ఇలా టైటిల్స్ పెడుతున్నారేమో. ‘నాగాభరణం’  కాస్తా ‘నాగభరణం’ అయ్యింది. సినిమాలో టైటిల్ సాంగ్ ని మాత్రం సింగర్  ‘నాగాభరణం...’ అనే ఇంతెత్తున రాగం తీసి పాడతాడు. భక్తీ-శక్తి ఫాంటసీ తీస్తున్నప్పుడు పెట్టిన మకుటం పట్లే భక్తిభావం లేకపోతే ఆ పైన చేసిన కృషిని ఎలా నమ్మాలి. ఇదొక  కలశం కోసం పోరాటమన్నారు కాబట్టి- కలశం అంటే భరిణె కూడా అవుతుందనుకుని, ఆ భరిణెని కాస్తా భరణం చేసి నాగ యొక్క భరణం = నాగభరణం అని పెట్టారేమోనని కూడా సినిమాని చూసి జస్టిఫై చేసుకోవడానికి వెంటనే బయల్దేరి వెళ్తాం. కానీ భరణం అంటే మనోవర్తి అని అర్ధం కదా, ఒకవేళ నాగదేవత మగాడైన హీరోకే భరణం రివర్స్ లో ఇస్తోందా అన్న ఇంకో పురుగు మనల్ని దొలుస్తుంది. ఇలా నాగ +ఆభరణం = నాగాభరణం కొచ్చిన తిప్పలు ఇన్నీ అన్నీ కావు!

        భాష స్లిప్ అవుతున్నట్టే ఇప్పుడు కథా కథనాల్లోనూ, దర్శకత్వం లోనూ స్లిప్ అవుతున్నారు 130 సినిమాలు తీసిన కోడి రామకృష్ణ. దీన్నర్ధం జేసుకోగలం. ఒకే కళ్ళద్దాలు  కెరీర్ అంతా ధరిస్తే ఈ సమస్య తప్పదు. తరంతరం సినిమాలు చూసే కళ్ళు మారిపోతూంటాయి ప్రేక్షకుల్లో. ఎనభై దాటింత్తర్వాత కూడా కౌబాయ్ నటుడు క్లింట్ ఈస్ట్ వుడ్ ఇప్పుడు కొత్త కళ్ళద్దాలతో  ‘సల్లీ’ తీసి పేరు తెచ్చుకున్నాడు. అదే  ‘గాడ్ ఫాదర్’ కపోలా ఐదేళ్ళ క్రితం ‘ట్విక్స్ట్’ తీసి విఫలమయ్యాడు. కళ్లద్దాలతోనే జాతకాలన్నీ. 

        ‘అరుంధతి’ కళ్ళద్దాలు ఇప్పుడు లేవు రామకృష్ణకి. ‘అరుంధతి’ కి లాంటి మేకింగ్ లో పాటుపడే నిర్మాత (శ్యామ్ ప్రసాద్ రెడ్డి) తోడ్పాటు కూడా లేదు. దీంతో ఈ ఫాంటసీకి ఆథ్యాత్మిక విలువ వున్నా, ఆ ఆథ్యాత్మిక ఔన్నత్యాన్ని  సాధించే గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నారు. కేవలం గ్రాఫిక్స్ హంగామాగా మార్చేశారు - మైనస్ కథా కథనాలతో. 

        కథ ఎత్తుగడ బ్రహ్మాండమే - ‘బద్రినాథ్’ ఎత్తుగడలాగే. ఆ తర్వాత ఎత్తుగడతో సంబంధంలేని రొటీన్ ఫార్ములా లవ్- మసాలా నడకే ‘బద్రీనాథ్’ లాగే. తెలిసి తెలిసి ‘బద్రినాథ్’ టెంప్లెట్ లో ఎలా పడిపోయారో రామకృష్ణ. 

      గ్రహణం సమయంలో దేవతలు తమశక్తి యుక్తుల్ని కోల్పోతూంటారని సినిమా మొదలెట్టారు. దేవతలు నిర్వీర్యమవగానే  దుష్ట శక్తులు రెచ్చిపోయి లోకాన్ని అతలాకుతలం చేస్తూంటాయని చూపిస్తారు. గ్రహణ సమయంలో ఈ దుష్ట శక్తులనుంచి లోకాన్ని కాపాడాలని దేవతలు ఎంతో శ్రమించి ఒక మహాకలశాన్ని తయారు చేస్తారు. దీన్ని భూగోళం మీద ఒక చోట ప్రతిష్టించి శివయ్య (సాయికుమార్) కుటుంబీకుల్ని రక్షకులుగా నియమిస్తారు. ఈ కలశాన్ని ప్రతిష్టించిన చోట దుష్ట శక్తులు చొరబడకుండా  అష్ట దిగ్బంధం చేస్తారు. ఈ కలశానికి ‘నాగభరణం’ అని పేరుపెడతారు.  

        ఇక దుష్ట శక్తులు దీన్ని చేజిక్కించుకుని దేవతల్ని ఆడించాలని చెయ్యని ప్రయత్నం వుండదు యుగయుగాలుగా. చచ్చి పుడుతూ చచ్చి పుడుతూ వున్న మహా దుష్టశక్తి కపాలి ( రాజేష్ వివేక్) కలశం కోసం  చెయ్యని ప్రయత్నం వుండదు.  ఒక దాడిలో ఆ కలశాన్ని కాపాడుకొస్తున్న శివయ్య చనిపోతాడు. అతడి కూతురు నాగమ్మ (రమ్య)  ఆ కలశం బాధ్యత తీసుకుంటుంది. నాగదేవత ఆమెకి కన్పిస్తూ పూర్తి మద్దతు ప్రకటిస్తూంటుంది. మళ్ళీ కపాలి దాడిలో నాగమ్మ కూడా చనిపోతుంది. చనిపోతూ కపాలిని కూడా చంపి- ఇంకో జన్మెత్తి ఆ కలశాన్ని కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఇదీ ఎత్తుగడ. 

       
ఇప్పుడు ఫ్రెష్ గా నాగమ్మ మానసగా పుట్టడంతో ప్రస్తుత కాలపు కథ ప్రారంభమవుతుంది. కపాలిగాడు ఇప్పుడూ పుట్టి ఆ కలశం కోసం కేకలు పెడుతూంటాడు. ఇప్పుడా కలశం దూరంగా ఆర్కియాలజీ శాఖ వాళ్ళ ఆధీనంలో ఢిల్లీలో వుంటుంది. ఈ శాఖ వాళ్ళు సంగీత పోటీలు పెడతారు. ఈ వరల్డ్ మ్యూజిక్ షోలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ కలశాన్ని ఇచ్చి పారేస్తామని ప్రకటిస్తారు- గెలిచిన వాళ్ళు దాన్ని తీసుకుని ఏం చేసుకుంటారో అర్ధంగాదు. దానికిప్పుడు దివ్యశక్తులు లేవా? ఇందుకేనా దుష్ట శక్తులుగా ఇప్పుడు టెర్రరిస్టులు తెగిస్తున్నారు. అయినా ఒక పురాతత్వ విలువ కలిగిన వస్తువుని పాత తుక్కు కింద వదిలించుకుంటారా పురాతత్వ శాఖ వాళ్ళు? అలా వదిలించుకుంటున్న ఆ  కలశంలో ఇంకేముందని కపాలిగాడు మళ్ళీ పుట్టి కేకలేస్తున్నాడో కూడా అర్ధంగాదు. 

        ఈ మ్యూజిక్ షోకి నాగచరణ్ (దిగంత్) పోటీ పడతాడు. ఈ నాగ చరణ్ ఆ కలశాన్ని గెలిస్తే దాన్ని కొట్టేయాలని ఒక విలన్ (ముకుల్ దేవ్) అతడి గ్యాంగూ బయల్దేరతారు. ఇదీ విషయం. ఇక పైనేం జరుగుతుందో వెండితెర మీద చూడాల్సిందే.
***

      వెండి తెర మీద - ప్రధానంగా కన్నడ సోదరులకు -  వాళ్ళ దివంగత  అభిమాన హీరో  విష్ణు వర్ధన్ ని గ్రాఫిక్స్ తో  ప్రాణప్రతిష్ఠ చేసి చూపిస్తే,  బ్రహ్మాండంగా ఈ ఫాంటసీ వర్కౌట్ అవుతుందన్న ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకుని ఈ సినిమా తీసినట్టు అన్పిస్తుంది.  క్లయిమాక్స్ లో ఇలా విష్ణు వర్ధన్ తో సృష్టించిన పోరాట దృశ్యాలు అద్భుతమే కాదనలేం. ‘మకుట’ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థకి- మగధీర, ఈగ, బాహుబలి లాంటి ఎన్నో అద్భుతాల దిగ్గజానికి- ఈ క్రెడిట్ అంతా పోతుంది. అయితే కోడి రామకృష్ణ ఆధ్వర్యం లో ఈ గ్రాఫిక్స్ హంగామా అంతా కూడా ‘అరుంధతి’ లో లాగా కథలో కలిసిపోతేనే అందం. ఎత్తుగడ తర్వాత కథే లేనప్పుడు,  కోడి రామకృష్ణే స్వయంగా మొన్న అన్నట్టు-  గ్రాఫిక్స్‌ సినిమాని ఎలివేట్‌ చేయాలి, కానీ సినిమాలో గ్రాఫిక్స్‌ పెట్టకూడదనే దాన్ని అర్ధం జేసుకోలేం. ఆయన చెప్పిందాంట్లో రెండోదే నిజం చేశారు. 

        ఈ సినిమాని అందరూ కన్నడ నటులతో- ఒకరిద్దరు హిందీ వాళ్ళతో తీసి తెలుగులో డబ్ చేశారు. దర్శకుడు తెలుగువాడే. తెలుగు నటుల్ని కూడా కొందర్ని పెట్టుకుని  జాగ్వార్ లా కన్నడ- తెలుగు సినిమాలాగా తీయలేక పోయారు. 

        ఆ
ధ్యాత్మిక విలువ వుండే కథల్ని ఎందుకని ఆ పాయింటుని ఓపెనింగ్ బ్యాంగ్ గా గొప్పగా ఇచ్చి వదిలేస్తారో తెలీదు. అయిడియాని దాని పరిధి మేర విస్తరించలేనప్పుడు అంతంత విస్తారమైన బడ్జెట్లెందుకు? ఒకప్పటి చరిత్రని పునరావృతం చేస్తూ టెర్రరిస్టులు దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారని మొదలెట్టిన ‘బద్రీనాథ్’  వ్యవహారం, ఆ కథ వదిలేసి  ఓ దేవాలయానికి రక్షకుడుగా వున్న హీరో మసాలా రొటీన్ ప్రేమ కథగా మార్చేశారు.దీనికి  ఫ్యాక్షన్ టైపు హీరోయిన్ తండ్రి విలన్! ఇది సక్సెస్ అయ్యిందా? 

       
కోడిరామకృష్ణ కథ ఎత్తుగడ అచ్చం  ‘అఖిల్’ కథకి  ఎత్తుగడలాలాగే లేదా? అక్కినేని అఖిల్ ని పరిచయం చేస్తూ గత నవంబర్ లో విడుదల చేసిన ‘అఖిల్’ లో- పూర్వకాలంలో ఎప్పుడో కొందరు ఋషులు భూగోళం బాగోగుల కోసం,  ‘జువాఅనే ఒక గోళాన్ని తయారు చేసి తీసికెళ్ళి భూమధ్య రేఖ దగ్గర ఓ ఆఫ్రికన్ గూడెం లో పడేస్తారు. సూర్యగ్రహణాలు  పూర్తయ్యాక వెలువడే తొలి సూర్య కిరణాలు చాలా ప్రమాదకరమని వాళ్ళు నమ్ముతారు. కనుక ఆ తొలి సూర్య కిరణాలు ఈ జువాగోళం మీద పడితే వాటి దుష్ప్రభావం నుంచి భూగోళం తప్పించుకుంటుందని శాస్త్రం చెప్తారు (ఓజోన్ పొర ఏం చేస్తున్నట్టో మరి). అలా ఆ గోళాన్ని గూడెం వాసులు తరతరాలుగా కాపాడుకొస్తూంటారు. దీని గురించి తెలుసుకున్న ఒక రష్యన్ సైంటిస్టు దాన్నికాజేసి ప్రపంచాన్ని ఆడించాలని కుట్ర పన్నుతాడు. ఆ గోళం అతడి గ్యాంగ్ చేతిలో పడకుండా, బోడో అనే గూడెం వాసి ఒకడు తీసుకుని పారిపోతాడు. వాణ్ణి వెతికి పట్టుకునే పనిలో వుంటుంది ఆఫ్రికన్ గ్యాంగ్. ఇదీ ఎత్తుగడ. దీని తర్వాత నడిపించింది అంతా హీరో గారి ‘బద్రీనాథ్’  మార్కు మూస ప్రేమకథే గా? ఇదీ సక్సెస్ అయిందా? 

       రామకృష్ణ జువా గోళం అనకుండా ‘నాగభరణం’ అనే కలశాన్ని తయారు చేశారు. అసలు సర్వ సృష్టీ దేవతల నియంత్రణలో వుండాల్సింది వాళ్ళే గ్రహణాలకి గిలగిల లాడి పోవడమేంటో? సరే, ఈ కలశం మీదికి దుష్ట శక్తిని తోలి,  హీరోగారి మ్యూజికల్  కథ నడిపారు రామకృష్ణ.  కానీ కలశం మీదికి తోలిన బాపతు దుష్ట శక్తులు ఇప్పుడున్నాయా? కాలాన్ని బట్టి ప్రతీకలు మారుతూంటాయి. పురాణాల్లో వుండే రూపాలతో రాక్షసులు ఇప్పుడు మన మధ్య తిరుగడం లేదు. ఇప్పటి ప్రపంచ రాక్షసుడు టెర్రరిస్టు. ప్రతీకలు ఎప్పుడూ వర్తమాన కాలపు గుర్తులుగా వుంటాయి- వెంటనే ఆడియెన్స్ కనెక్ట్ అవడానికి- ఫీలవడానికీ. స్టీవెన్ స్పీల్ బెర్గ్  ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’  తీసినప్పుడు- ప్రతీకలుగా అడాల్ఫ్ హిట్లర్ నీ, అతడి జర్మన్ నాజీ సైనికుల్నీ చూపించాడు. వాళ్ళు దేనికి ప్రతీకలో మనకి తెలుసు. వాళ్ళకో బుద్ధి  పుడుతుంది.  బైబిల్ కాలంలో నిర్గమ కాండం సందర్భంగా దేవుడు మోజెస్ కి బహూకరించిన నిబంధనల పెట్టె (Arc of Covenant) ని చేజిక్కించుకుంటే తమకి అజేయ శక్తి అమరుతుందని నమ్మి దాని కోసం వేట ప్రారంభిస్తారు. ఆర్కియాలజిస్టు అయిన హీరో దీన్ని అడ్డుకోవడానికి సాహస యాత్ర ప్రారంభిస్తాడు. చివరికి ఆ పెట్టెని  చేజిక్కించుకున్న నాజీ సైనికులు,  దాన్ని తెర్చి భస్మీపటలమై పోతారు.  దైవశక్తి ఎప్పుడూ దైవ శక్తే. ఆద్యంతం ఈ పెట్టె కోసమే కథ జరిగి దాని  మహత్తుతో ముగుస్తుంది. ఆథ్యాత్మిక విలువున్న ఈ థ్రిల్లర్  అంతే ఆథ్యాత్మిక  ఔన్నత్యంతో ముగుస్తుంది. అంటే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని  తీరుస్తుంది- అందుకే అంత ఘనవిజయం సాధించింది. 

     రామకృష్ణ  ఏం చేశారు. అంతటి దేవతల మహత్తు కలిగిన కలశాన్ని ఎందుకూ పనికి రాని వస్తువుగా మ్యూజికల్ షోకి  బహుమతిగా దిగజార్చేశారు! దైవ శక్తి ఎక్కడైనా తరిగిపోతుందా? ఆ కలశం కోసం అందరూ కొట్టుకుంటున్నారని ఆర్కియాలజీ శాఖ స్వాధీ నం చేసుకుంటుందా? ఆర్కియాలజీ శాఖ అష్ట దిగ్బంధాన్ని కూడా ఛేదించేసిందా? కేరళలో పద్మనాభ స్వామి ఆలయంలో ఆరో నేలమాళిగకి  నాగబంధం వుందని తెలిసి దాన్ని తెరవడానికే సాహసించలేదు. అదీ దైవ శక్తి తడాఖా అంటే. 

        కలశాన్ని మ్యూజికల్ షోకి పెట్టేశారంటేనే దానికే శక్తీ లేదని అర్ధమైపోతోంది. మరెందుకు కపాలిగాడూ విలన్ గ్యాంగూ దానికోసం అర్రులు చాస్తున్నారు. ఇక గత జన్మలో నాగమ్మకి అండగా వుంటానన్న నాగదేవత ఆమె కపాలిగాడితో తలపడుతున్నప్పుడు ఎక్కడికి పోయింది. చచ్చిపోయేటప్పుడు వచ్చి వచ్చే జన్మలో హెల్ప్ చేస్తానని అంటుందా. నాగమ్మ మళ్ళీ జన్మించాక ఆమెలోంచి బుసలుకోడుతూ లేచి శత్రువుల్ని కాటేస్తుందా. ఈ పని గత జన్మలోనే చేయవచ్చుగా. 

        ఆ నాడు దేవతలు ప్రసాదించిన మహత్తు కలిగిన ఆ నాగాభారణ కలశం ఇప్పటికీ అదే దివ్యశక్తితో వుందనీ, దీన్ని నాశనం చేయడానికో, హస్తగతం చేసుకోవడానికో టెర్రరిస్టులు బయల్దేరరానీ- కాలీన స్పృహతో ఈ ఫాంటసీ చేసి వుంటే అర్ధంపర్ధం వుండేది.


-సికిందర్