రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 17, 2025


 

1364 : బుక్ రివ్యూ!


  ప్రపంచ సినిమా చరిత్రలో సస్పెన్స్ బ్రహ్మ సర్ ఆల్ఫ్రెడ్ జోసెఫ్ హిచ్ కాక్ (1899-1980) మీద వెలువడినన్ని పుస్తకాలు ఇంకే సినిమా కళాకారుల గురింఛీ వెలువడలేదేమో. వందలాది పుస్తకాలు హిచ్ కాక్ గురించి రాశారు. ఈ పుస్తకాలు విద్యార్ధుల, విమర్శకుల, చరిత్రకారుల నిశిత విశ్లేషణలకి వనరులుగా కొనసాగుతున్నాయి. హిచ్ కాక్ పుస్తకాల రచయిత కాకపోయినా, ఆయన గురించి లెక్కలేనన్ని విశ్లేషణలు, జీవిత చరిత్రలు, ఆయన కళాత్మక శైలుల పరిశీలనలూ మొదలైనవి అధ్యయన గ్రంధాలుగా కోకొల్లలుగా వెలువడ్డాయి. ఆల్ఫ్రెడ్  హిచ్ కాక్ పేరు చెబితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వెంటనే గుర్తుకు వస్తాయి. ప్రపంచ సినిమా చరిత్రలో మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ గా ప్రఖ్యాతుడైన ఆయన సినిమాలు కేవలం  వినోద సాధనలగానే గాక, ఆలోచనలకి గట్టి ఆహారం అందిస్తాయి. మన దేశంలో కూడా హిచ్ కాక్ సినిమాల్ని విరగబడి చూశారు, చూస్తున్నారు, ఇంకా  చూస్తారు. అయితే విచిత్రమేమిటంటే, మన దేశంలో ఇంత  ప్రఖ్యాతుడైన హిచ్ కాక్ మీద ఒక్క పుస్తకమూ వెలువడక పోవడం. 1925 నుంచి సినిమాలు తీయడం మొదలెట్టిన హిచ్ కాక్ మీద విదేశాల్లో 2015 లో కూడా పుస్తకాలు రాసి హిచ్ కాక్ ని స్మరించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మన దేశంలో తొలిసారిగా -ముఖ్యంగా తెలుగు ప్రచురణా రంగం నుంచి హిచ్ కాక్ కెరియర్ కి శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్నట్టు, 2024 డిసెంబరులో ఒక పుస్తకం వెలువడింది- అదే మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్ అనే వివిధ తెలుగు సినిమా ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనం.

        సీనియర్ జర్నలిస్టు, రచయిత పులగం చిన్నారాయణ, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి కలిసి ఈ సంకలనాన్ని ముందుకు తెచ్చారు. దీని వెనుక ఎంత కృషి జరిగిందన్నది వీరి మాటల్లోనో పుస్తకంలో చదవొచ్చు. 45 మంది దర్శకులు, 7 గురు రచయితలు, 10 మంది జర్నలిస్టుల నుంచి అడిగి రాయించుకుని శ్రమ కోర్చి సేకరించిన 62 వ్యాసాలు ఈ హార్డ్ కవర్ ఎడిషన్లో కొలువుదీరాయి. ఇది మన దేశంలో ల్యాండ్ మార్క్ పుస్తకమవుతుందని చెప్పొచ్చు.
       
528 పేజీలున్న ఈ పుస్తకంలో విఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు
, వంశీ గార్ల దగ్గర్నుంచీ, సుధీర్ వర్మ, సాగర్ చంద్ర గార్ల వరకూ45 మంది దర్శకులు, సత్యానంద్ గారి నుంచీ గోపీమోహన్ గారి వరకూ 7 గురు రచయితలూ, ప్రభు గారి దగ్గర్నుంచీ చల్లా భాగ్యలక్ష్మి గారి వరకూ 10 మంది జర్నలిస్టులూ రాసిన విశిష్ట ఆర్టికల్స్ ని ఇందులో పొందుపర్చారు.
       
45 మంది దర్శకులు రాసిన వ్యాసాల్లో హిచ్ కాక్ సినిమాల్లో వారు గమనించిన హిచ్ కాక్ ట్రీట్ మెంట్ నీ
,  టెక్నిక్ నీ, టెక్నాలజీనీ పాఠకుల దృష్టికి తేవడమన్నది  ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్కో దర్శకుడు ఒక్కో హిచ్ కాక్ సినిమా తీసుకుని విశ్లేషించారు. ఇతర దర్శకుల్లా కాకుండా హిచ్ కాక్ కేవలం ఒక్క సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కే కట్టుబడి వరుసగా 53 సస్పెన్స్ థ్రిల్లర్లు తీస్తూ పోవడం వల్లే కళలో ఆయన్ని నిష్ణాతుడిగా గుర్తించి మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అని కీర్తించడం మొదలెట్టారు. ఇంకే దర్శకుడికీ ఈ బ్రాండింగ్ ఏర్పడలేదు. అటు సాహిత్యంలో చూస్తే అప్పట్లో సర్ అర్ధర్ కానన్ డాయల్,  అగథా క్రిస్టీ, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్, జేమ్స్ హేడ్లీ ఛేజ్ మొదలైన ప్రఖ్యాత రచయితలు వారు క్రైమ్- సస్పెన్స్ థ్రిల్లర్ నవలలు రాసే మాస్టర్స్ ఆఫ్ క్రైమ్ -సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్పించుకున్నారు. ఇంకో జానర్ లో కూడా వేలు పెట్టి వుంటే ఈ గుర్తింపు వచ్చేది కాదు. అయితే హిచ్ కాక్ వరసగా సస్పెన్స్ థ్రిల్లర్లే తీసినా దేనికది ప్రత్యేకంగా వుండేలా చూస్తాడు. ఒకే మూసలో చుట్టేయకుండా, ఏ కథకా ట్రీట్ మెంట్ నీ, టెక్నిక్ నీ, టెక్నాలజీని కొత్తగా మధించి మన కందిస్తాడు.
       
అందుకే 45 మంది దర్శకులు విశ్లేషించిన సినిమాల్లో ఏ సినిమాని హిచ్ కాక్ ఏ ట్రీట్ మెంట్ తో
, టెక్నిక్ తో, టెక్నాలజీతో ప్రత్యేకం చేశాడో చెప్పారు. కథా కథనాలు, పాత్రచిత్రణలూ వివరిస్తూనే, మేకింగ్ లో హిచ్ కాక్ తీసుకున్న నిర్ణయాల్ని వివరించారు. ఉదాహరణకి-సింగీతం శ్రీనివాసరావు అమావాస్య చంద్రుడు’,‘మయూరి’, పుష్పక విమానం’, అపూర్వ సహోదరులు’,  ఆదిత్య 369’, మేడమ్ వంటి ప్రయోగాత్మకాలు కూడా తీసి హిట్ చేశారు. ఈ ప్రయోగాలు చేసే తత్వం తనకి హిచ్ కాక్ తత్వం నుంచే అబ్బిందని, హిచ్ కాక్ రియర్ విండో ని విశ్లేషిస్తూ పేర్కొన్నారు.
       
ఈ సినిమాలో హిచ్ కాక్ ఒక సన్నివేశానికిచ్చిన బ్యూటీఫుల్ ట్రీట్ మెంట్ ని వివరిస్తూనే
, ఒక అపార్ట్ మెంట్ లో జరుగుతున్న సంఘటనలని హీరో తన అపార్ట్ మెంట్లోంచి బైనాక్యులర్ తో చూస్తూ తెలుసుకునే విషయాలే ప్రేక్షకులకి తెలియాలి తప్ప, కెమెరా ఆ ఎదుటి అపార్ట్ మెంట్లోకి వెళ్ళి వేరే చూపించకూడదన్న శిల్పానికి ఎలా కట్టుబడ్డాడన్నది వివరంగా చెప్పారు. కథ హీరో చూసే బైనాక్యులర్ నుంచి మాత్రమే ప్రేక్షకులకి తెలియాలన్న ఛాలెంజీని స్వీకరించడం హిచ్ కాక్ మెథడ్ అన్నారు. హిచ్ కాక్ తీసిన ఇంకా చాలా అనితర సాధ్యమైన షాట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ విలువైన వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.
       
దర్శకుడు వంశీ
సైకో తీసుకుని కథ చెప్పారు. చివర్లో ఈ కథ సినిమాగా తయారవడానికి తెరవెనుక జరిగిన ఆసక్తికర కథ చెప్పారు. రేలంగి నరసింహారావు మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ చిన్న కథా వస్తువు తీసుకుని బాగా స్క్రీన్ ప్లే చేసి, మంచి డైలాగ్స్ తో, మంచి ఫోటోగ్రఫీతో హిచ్ కాక్ తెరకెక్కించారని చెప్పారు. ముఖ్యంగా మొదటిరెండు సీన్లు చిత్రించిన విధానం గురించి, తర్వాత హీరో పట్ల  హీరోయిన్ ప్రదర్శించే రెండు షేడ్స్ గురించి తెలిపారు. పూరీ జగన్నాథ్ వచ్చేసి టు క్యాచ్ ఏ థీఫ్ సినిమా విశేషాలు చెప్పారు. 1955 లో ఎలాటి డ్రోన్ గానీ, నేటి సదుపాయాలు గానీ లేని కాలంలో హిచ్ కాక్ ఛేజింగ్ దృశ్యాల తీయడం, తక్కువ లైటింగ్ తో గొప్ప విజువల్ లగ్జరీ ప్రదర్శించడం గొప్పగా వున్నాయన్నారు. నిజానికి నాడు హిచ్ కాక్ చేసిన టెక్నికల్, టెక్నాలాజికల్ ప్రయోగాలు నేటి సినిమాలకి బడ్జెట్ ఆదా చేసే మార్గాలే. కానీ ఎంత మంది పాటిస్తారు.
       
హరీష్ శంకర్
డయల్ ఎమ్ ఫర్ మర్డర్ గురించి రాస్తూ, ఇందులో కథ చెబుతూ హిచ్ కాక్ అంచెలంచెలుగా సస్పెన్స్ ని రివీల్ చేస్తూ వెళ్ళిన విధానాన్ని హైలైట్ చేశారు. ఇంద్రగంటి మోహన కృష్ణ వెర్టిగో ని విశ్లేషించారు.  ఇందులో ప్రధానాకర్షణగా వున్న ఎడిటింగ్ గురించి వివరించారు. మన విమర్శకులు సినిమాల్లో ల్యాగ్ వుందనీ, స్లోగా వుందనీ చెబుతారనీ చెబుతూ, వీళ్ళలో చాలా మందికి గతికీ, వేగానికీ తేడా తెలియదని చురక వేశారు. వెర్టిగో లో హిచ్ కాక్  గతి (pace) ని ఎంత బాగా మేనేజ్ చేశాడో చెప్పుకొస్తూ, అతి వేగం ఎక్కడా వుండదనీ, అలాగని నెమ్మదిగా వుండదనీ, కెమెరా గానీ, ఎడిటింగ్ గానీ అస్సలు కంగారు పడవనీ, గతి గురించి అర్ధమయ్యేట్టు చెప్పారు. ఇక ఎంఎల్ నరసింహం హిచ్ కాక్ మూకీల కాలంలో 1925- 1929 మధ్య తీసిన 9 మూకీ సినిమాలని నవరత్నాలుగా పేర్కొంటూ జనరల్ నాలెడ్జిగా   అందించారు.

       
ఇంకా శివనాగేశ్వరరావు
, చంద్ర సిద్ధార్థ, వి ఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, వర ముళ్ళపూడి, వీర శంకర్. జనార్ధన మహర్షి, దేవీ ప్రసాద్, సాగర్ చంద్ర మొదలైన దర్శకులు హిచ్ కాక్  సినిమాల్లో తాము గమనించిన విశేషాల్ని రికార్డు చేశారు. ఇవన్నీ ఉపయోగపడేవే. ప్రతి ఒక్కరూ సినిమాల గురించి ఏకరువు పెడుతూ, వాటి తెర వెనుక విశేషాలు కూడా అందించారు. దీంతో పుస్తకానికి ఒక సమగ్రత వచ్చింది. ఈ తెర వెనుక విశేషాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.
       
రచయితలు  సత్యానంద్
, గోపీ మోహన్, దశరధ్, వి ఐ ఆనంద్ తదితరులు హిచ్ కాక్ సినిమాల్లో భయం, మనస్తత్వాలు, భావోద్వేగ తీవ్రత, సంగీతం, వస్త్రాలంకరణ, సాంకేతిక అంశాలు, రైటింగ్, మేకింగ్, అప్ గ్రేడింగ్ ల గురించి వివరంగా చర్చించారు. జర్నలిస్టు ప్రభు హిచ్ కాక్ ఇచ్చిన ఇంటర్వ్యూల భాగాల్ని ఒక చోట కూర్చారు. ఇంకా జలపతి, వడ్డి ఓం ప్రకాష్, చల్లా భాగ్యలక్ష్మి, జోస్యుల సూర్య ప్రకాష్ వంటి ప్రముఖ  జర్నలిస్టులు  హిచ్ కాక్ కి సంబంధించి ఇతర అంశాలపై దృష్టి సారించారు.  పోతే, ఈ పుస్తకానికి మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ముందు మాట ఆయన శైలిలో ఒక నాస్టాల్జియా! 
       
ప్రతి వొక్కరూ చదవాల్సిన పుస్తకం.  ఓటీటీల్లో విభిన్న సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు వాటిని థీమాటికల్ గా అర్ధం జేసుకోవాలంటే
, హిచ్ కాక్ ఆవిష్కరించిన సినిమా కళనీ తెలుసుకోవాల్సిందే. హిచ్ కాక్ తెలిస్తే అన్నీ తెలిసినట్టే. ఈ పుస్తకం మొదటి ముద్రణ  అమ్ముడైపోయి రెండో ముద్రణకి సిద్ధమైంది. వెంటనే మీ కాపీలు బుక్ చేసుకోండి.

—సికిందర్
మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్
పేజీలు : 528, వెల : రు. 650/-
లభించు చోట్లు :
అక్షౌహిణి మీడియా, హైదరాబాద్    
889 779 8080
నవోదయ బుక్ హౌజ్, హైదరాబాద్
9000 413413
సాహితి ప్రచురణలు, విజయవాడ
81210 98500
అమెజాన్ లో కూడా అందుబాటులో వుంది. 
ఈ క్రింది లింకు ద్వారా పొందవచ్చు: