రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 17, 2022

1192 : స్క్రీన్ ప్లే సంగతులు

 

 

      చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ 2 కూడా హిట్. హిందీ, ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని రాష్ట్రాల నుంచి వసూళ్ళు బ్రేక్ ఈవెన్ దాటేశాయి. ఇలాటి హిట్టయిన సినిమా స్క్రీన్ ప్లే సంగతులు కూడా అద్భుతంగా వుండాలి. కానీ స్క్రీన్ ప్లే సంగతులు అద్భుతంగా లేకపోయినా ఒక్కోసారి సినిమాలు హిట్టవుతూంటాయి. సినిమా హిట్టవడానికి అర్ధవంతమైన స్క్రిప్టు వుండనక్కర్లేదనీ నిరూపి స్తూంటారు ఒక్కోసారి ప్రేక్షకులు. బజారులో ఒక వస్తువు కొనేప్పుడు దాని గురించి ఎంతో ఆలోచించి కొంటారు. కానీ సినిమాల్ని ఆలోచనాత్మకంగా చూసి ఆమోదించరు. అందులో ఏదో ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అదొక్కటి పట్టుకుని ఓకే అనేస్తారు. వీళ్ళ ముందు స్క్రీన్ ప్లే సంగతులు రాసేవాడు ఓడిపోతాడు. రాయకుండా వుండడమే మంచిదనుకుంటాడు. రాయాలా వద్దా...రాయాలా వద్దా...అని ఆగి ఆగి రాస్తూంటాడు. రాస్తూంటే ఈ కింది విధంగా వచ్చింది...పాఠకులకి నచ్చకపోతే తిరస్కరించే హక్కు ఎలాగూ వుంది.

కథ  

గ్రీస్ లోని ఒక లైబ్రరీలో  ప్రొఫెసర్ రావు ద్వాపర యుగంలో కృష్ణుడికి సంబంధించిన ఒక రహస్యం తెలుసుకుంటాడు. శాస్త్ర సాంకేతికాభివృద్ధి పేరుతో మనుషులు ప్రకృతిని నాశనం చేస్తారని, దాని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లెదుర్కొంటారనీ, దీన్నుంచి రక్షణగా తన కాలి కడియాన్ని తీసిచ్చాడు ఉద్ధవుడనే వాడికి కృష్ణుడు ఆనాడు. ఉద్ధవుడు దాన్ని ఒక రహస్య ప్రదేశంలో భద్రంగా దాచాడు. ఈ సమాచారంతో ప్రొఫెసర్ రావు- ఇప్పుడా రహస్య ప్రదేశం అన్వేషణ ప్రారంభిస్తాడు.

డాక్టర్ కార్తీక్ (నిఖిల్) కి తల్లిదండ్రులు, చెల్లెలు వుంటారు. సదానంద (శ్రీనివాస రెడ్డి) అనే మేనమామ, రవి (సత్య ) అనే ఫ్రెండ్ వుంటారు. కార్తీక్ కి అంధ విశ్వాసాలంటే పడవు. హేతువాది. మూఢ విశ్వాసులతో తలపడుతూంటాడు. ఒక రోజు మూఢ విశ్వాసి అయిన నగర మేయర్ని హాస్పిటల్లో లాగి కొడతాడు. సస్పెండ్ అవుతాడు.

ఇంకో రోజు ఆవు వచ్చి ఇంట్లో తులసి కోటని కుమ్మి కూల్చేస్తుంది. కార్తీక్ తల్లి (తులసి) తాంత్రికుడ్ని పిలుస్తుంది. అతనొచ్చి మొక్కేదైనా తీర్చుకోలేదా అంటాడు. ఏడాది క్రితం కార్తీక్ జబ్బు పడ్డప్పుడు, ద్వారకా వెళ్ళి 108 కేజీల వెన్న కృష్ణుడికి సమర్పించుకుంటానని మొక్కుకున్నానంటుంది. అయితే వెంటనే ద్వారక వెళ్ళి ఆ మొక్కు తీర్చుకో మంటాడు.

ఇలాటివి ఇష్టం లేని కార్తీక్ ని తీసుకుని ద్వారకా వెళ్తుంది తల్లి. అక్కడ ప్రొఫెసర్  రావు హత్యలో ఇరుక్కుంటాడు కార్తీక్. కార్తీక్ ని చంపడానికి గ్యాంగ్ వెంటపడతారు. కార్తీక్ తో ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) కలుస్తుంది. ఎవరీ ముగ్ధ? ప్రొఫెసర్ రావుని చంపిందెవరు? కార్తీక్ వెంట ఎందుకు పడుతున్నారు? కృష్ణుడి కడియం గురించి కార్తీక్ కెలా తెలిసింది? ఆ కడియాన్ని కార్తీక్ చేజిక్కించుకున్నాడా? ఏం జరిగింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ  

ట్రెజర్ హంట్- ఫాంటసీ జానర్ కథ. చనిపోతూ ఒకడు ఇంకొకడి చెవిలో నిధి రహస్యం చెప్పడం, అనుచరుల్ని నేలలో మొండెం దాకా పాతి పెట్టి, హీరోని చెట్టుకి తలకిందులుగా వేలాడదీసే లాంటి కౌబాయ్ మూవీ టెంప్లెట్ సీన్లు సహా. అయితే కృష్ణుడు పురాణ పాత్ర కాదనీ, అతను నిజంగానే వుండిన చరిత్ర అనీ, అన్ని శాస్త్ర సాంకేతిక విషయాలూ చెప్పిన ఆల్ ఇన్ వన్ సైంటిస్టు అనీ- మైథాలజీ అని నమ్మే వాళ్ళకి మైథాలజీ కాదూ హిస్టరీ అనీ చెప్పారు. ఇలాంటప్పుడు ఈ కథ హిస్టారికల్ థ్రిల్లర్ గా వుండాలి. ఇలాలేదు. ఇంతా చెప్పి మైథాలజీ లోకే తీసికెళ్ళారు.

ఇంకోటేమిటంటే, కృష్ణుడి కడియం దొరికితే అది ఏ మానవాళి సమస్యని తీరుస్తుందో  చెప్పక పోవడం. కృష్ణుడు మానవాళి సమస్యని తీర్చుకోమనే కడియం ఇచ్చాడు, తమాషాకి ఇవ్వలేదు.
కథ ఎత్తుగడలో కృష్ణుడు ఏ ఉద్దేశంతోనైతే కడియం ఉద్ధవుడికిచ్చాడో ఆ సెటప్ ని తర్వాత కథనంలో పే ఆఫ్ చేయకపోవడం. కథ ఇరవై నిమిషాలు పోయాక మంత్రికి సైంటిస్టు రిపోర్టు ఇస్తాడు మహమ్మారి (కోవిడ్) గురించి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమనీ, ఇది వ్యాపిస్తే ప్రపంచానికే ప్రమాదమనీ, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకి తెలిసేలోగా మనమే యాంటీ డోట్ తయారు చేయాలనీ, అప్పుడే ప్రపంచాన్ని ఏలుకో గలమనీ మంత్రి అంటాడు.

ఆ ప్రపంచాన్ని ఏలుకునే శక్తిగల అస్త్రమే ఈ కడియమన్న అర్ధంలో ఎక్కడా కథ నడపకపోవడం, కనీసం మంత్రి చర్చించిన ఈ పాయింటు హీరోకి కూడా తెలియకపోవడం ఈ కథ ప్రత్యేకత. మహమ్మారి అనే అంశమే ఇక వుండదు. మహమ్మారితో ముంచుకొస్తున్న ప్రమాదం, కడియం కోసం హీరో పరుగులు, కడియంతో ప్రమాద నివారణ -అనే ఏక వాక్య లాగ్ లైన్ తో కథ వుండక పోవడాన్ని గమనించాలి.

అన్నీ శాస్త్రాల్లో వున్నాయి, మనమే ప్రపంచానికి ఎత్తి చూపడం లేదు, మన గొప్ప మనమే చెప్పుకోవడం లేదు - అని ఓ పక్క అనుపమ్ ఖేర్ పాత్ర చేత ఆరోపణ చేయిస్తూనే,   కృష్ణుడి కడియంతో ప్రపంచానికేం చేస్తారో చెప్పకపోతే ఆ ఆరోపణ కర్ధం లేదు. చెప్పాలిగా? మా కృష్ణుడి కడియం చూడండి అంతర్జాతీయ ముప్పునెలా తుప్పు వదిలిస్తుందో చూపించాలిగా? సినిమాని యూనివర్సల్ అప్పీల్ చెయ్యాలిగా?

ఇదే హాలీవుడ్డోళ్ళు అయితే ప్రపంచాన్ని కాపాడే గుత్తాధిపత్యం తమదే అన్నట్టు ఇండిపెండెన్స్ డే’, ఆర్మగెడ్డాన్’, కంటేజన్ లాంటి డిజాస్టర్ మూవీస్ అడపాదడపా తీసి ప్రపంచం మీద పడేస్తారు. కంటేజన్ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టడం గురించే.

కోవిడ్ కంటే ముందు ప్రారంభించిన కార్తికేయ 2 కోవిడ్ వల్ల నిర్మాణం ఆగిపోతూ ఆగిపోతూ సాగింది. బహుశా ఈ సినిమాలో కోవిడ్ పాయింటు ఈ సమయంలో జోడించారు. అందుకని అంటీ ముట్టనట్టు వుంది. కొత్తగా వచ్చిన కోవిడ్ పాయింటుతో కథ నడపాలంటే కథ మొత్తం మార్చాల్సి వస్తుంది. అందుకని కథని ఇలా వదిలేశారు.

మిథికల్ థ్రిల్లర్స్ రాసే అశ్విన్ సంఘీ నవల ది కృష్ణ కీ కథకీ, కార్తికేయ 2 కీ పెద్ద తేడా అన్పించదు. వీకీపీడియాలో కథా సంగ్రహం ప్రకారం - చరిత్ర ప్రొఫెసర్ సైనీ, మిత్రుడు అనిల్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. అనిల్ ఆర్కియాలజిస్టు. అతను సింధు నాగరికతకి చెందిన ముద్రికల సంకేత భాషని ఛేదించాడు. దీని కోసమే చంపి వుంటారని తెలుసుకున్న ప్రొఫెసర్ సైనీ, తన మీద నింద తొలగించుకోవడానికి, అనిల్ హత్యా రహస్యం తెలుసుకునే ప్రయాణానికి సమకడతాడు.

పురాణాల చీకటి కోణాల్ని తడుముతూంటే, తారక్ అనే సీరియల్ కిల్లర్ గురించి తెలుస్తుంది. ఈ తారక్ తను విష్ణువు చివరి అవతారమైన కల్కి అని నమ్ముతాడు. ప్రొఫెసర్ సైనీ అన్వేషణ కొనసాగిస్తూ, ద్వారకా, బృందావన్ ల కెళ్తాడు. బృందావన్ని ఔరరంగ జేబు కృష్ణుడి శమంతక మణి కోసం ధ్వంసం చేసిన శిథిలాల్ని చూస్తాడు.

ప్రొఫెసర్ సైనీ ముందున్న ఇంకో సమస్య- సంకేత భాష కోసం అనిల్ మిత్రుల్ని కూడా శత్రువులు టార్గెట్ చేశారు. వాళ్ళని కూడా  కాపాడాలి. సంకేత భాష విడి విడి నాల్గు భాగాలుగా ఎక్కడెక్కడో వుంది. వాటిని కనుగొని జోడిస్తేనే శమంతక మణి రహస్యాన్ని విప్పే తాళం చెవి (కీ) అవుతుంది.

యాదవ కుల తెగలైన సైనీ, భోజ, వృషినీ, కుకూర, చేడీ ల సంతతి దగ్గర  సంకేత భాష ఒక్కో భాగముందని తెలుసుకున్న ప్రొఫెసర్ సైనీ, తనూ పంజాబ్‌లోని సైనీ తెగకి చెందిన కృష్ణుడి వంశపారంపర్య వారసుడేనని తెలుసుకుని ... ఇలా మలుపులు తిరుగుతూ థ్రిల్లింగ్ గా సాగుతుంది కథనం. ప్రొఫెసర్ సైనీ ద్వారా మహాభారతానంతర చరిత్రని వివరంగా వర్ణిస్తాడు రచయిత. ప్రధాన కథాంశానికి సమాంతరంగా కృష్ణుడి జీవిత చరిత్రని చిత్రిస్తాడు.

కార్తికేయ 2లో కృష్ణుడు కల్పన కాదు చరిత్ర అని చెప్తూనే కడియంతో కల్పిత కథ చేశారు. ఆల్ ఇన్ వన్ అయిన సైంటిస్టు మహమ్మారికి విరుగుడేం చెప్పాడో చరిత్ర వుంటే చెప్పొచ్చు. కడియంతో చెప్పిన కథ కూడా మహమ్మారి కోసంగాక, కడియం కోసమే కడియమన్నట్టు సాగడం అర్ధవిహీనంగా మార్చింది కథనాన్ని. కృష్ణ కీ తో ఈ కథ పోలికలు మహమ్మారిని తీసేస్తే దాదాపూ ఒకటే.

పోతే, దేవుళ్ళ  మరణాల గురించి చెప్పుకోకూడదు, వినకూడదు, చదవకూడదన్న ఆంక్షని పక్కన బెట్టి కృష్ణుడి నిర్యాణాన్ని చూపించేశారు! ప్రారంభ దృశ్యం వద్దన్నా వెంటాడే బ్యాడ్ ఇంప్రెషన్.

సినిమా భక్తి ప్రవచనాల వల్ల, ఫాంటసికల్ చిత్రణల వల్ల; కడియం, నెమలి, నెమలి పింఛం, దుర్బిణీ వంటి దైవాంశ కలిగిన ప్లాట్ డివైసుల వల్ల, ప్రేక్షకుల ఆత్మిక దాహం తీర్చే సాధనంగా హిట్టయి వుండాలి. కథా కథనాలతో కాదు.

మతం క్రియాశీలంగా వున్న హిందీ రాష్ట్రాల్లో దీని డబ్బింగ్ వెర్షన్ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లని కింద బోర్లా పడేసి ఇందుకే పుంజుకుంటోంది. ద్వారకా, మధుర, రాధా కుంద్, బుందేల్ ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పుణ్య ప్రదేశాల్లో సినిమాని  తిప్పడం వల్ల పాన్ ఇండియా అప్పీల్ వచ్చి వుంటుంది.

స్ట్రక్చర్ సంగతులు

హీరోకి సస్పెన్స్, ప్రేక్షకులకి ఓపెన్ కథ అన్నప్పుడు హీరోకి సస్పెన్స్ ఎంతవరకుండాలి? కథ ప్రారంభిస్తే ఇంటర్వెల్ వరకూ హీరోకి కథ (సస్పెన్సుగా వుంచిన విషయం) తెలియకుండా వుండాలా? వుంటే బోరు కొట్టదా? ప్రేక్షకులు ఓపెన్ కథలో విహరిస్తూంటే, హీరో వచ్చేసి ఎంతకీ ఆ కథలోకి రాకపోతే బోరే కొడుతుంది.

ఉదాహరణకి కథా ప్రారంభంలో హత్య జరిగిందనుకుందాం. ఆ హత్యని, హంతకుడ్నీ ప్రేక్షకులకి చూపించేశారు. హీరోకి తెలియకుండా వుంచారు. హీరో ఆ హంతకుడెవరా అని తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఇంటర్వెల్ దాకా పోతే అది కథ అన్పించుకోదు. ఇది బోరు కొడుతుంది.

అందుకని 15, 20 నిమిషాల్లో హీరోకి ఏదో క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ప్రకారం హంతకుడెవరో తెలిసిపోయి వాడి వేట, అంటే యాక్షన్ మొదలెట్టేస్తాడు. హంతకుడితో ఎలుకా పిల్లీ చెలగాటంగా. ఇది బోరు కొట్టదు. ఎందుకంటే 15, 20 నిమిషాల్లో హంతకుడెవరో తెలిసిపోవడంతో హీరో అంతవరకూ ప్రేక్షకులకే తెలిసిన కథలోకి వచ్చేశాడు. దాంతో బిగినింగ్ ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. హీరోకి హంతకుడ్ని పట్టుకునే గోల్ ఏర్పడింది- దాంతో మిడిల్ ప్రారంభమై యాక్షన్లోకి దిగిపోయాడు. యాక్టివ్ గా పాత్రగా వున్నాడు.  

హీరోకి ఇంటర్వెల్ వరకూ హంతకుడెవరో తెలియకపోతే అంతవరకూ ప్రేక్షకులకి తెలిసిన విషయం - అంటే కథ - హీరోకి తెలియదు. తెలియకపోతే బిగినింగ్ ముగియదు. ముగియక పోతే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడదు. ఏర్పడక పోతే పాసివ్ పాత్రగా హీరోకి గోల్ ఏర్పడదు. ఏర్పడకపోతే మిడిల్ ప్రారంభంకాదు. ప్రారంభం కాకపోతే కథ ప్రారంభం కాదు. బిగినింగ్ లో వుండేది కథకాదు. ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతం మాత్రమే. ఇలా ఇంటర్వెల్ వరకూ ఉపోద్ఘాతమే చెప్తారా?

ఇదే జరిగింది కార్తికేయ 2 లో. ప్రారంభంలో ప్రొఫెసర్ పరిశోధన, కృష్ణుడి కడియం రహస్యం ఎపిసోడ్, ప్రొఫెసర్ అన్వేషణ, కడియం కోసం ఒక విలన్ గ్యాంగ్, ఇంకో సీక్రెట్ సొసైటీ, మంత్రికి కోవిడ్ వైరస్ రిపోర్టు, మంత్రి ప్రపంచాధిపత్యం సాధించాలనడం...వంటి వన్నీ జరుగుతూంటే హీరో నిఖిల్ కివేమీ తెలియవు!

అతను హేతువాది అన్న విషయం తెలియడానికి మూడు నాల్గు సీన్లు నడుస్తాయి. అతను హేతువాది అన్న విషయం ఆల్రెడీ కార్తికేయ 1 చూపించేశారు. మళ్ళీ చూపిస్తూ హాస్పిటల్లో పాముని పట్టుకోవడం, హాస్పిటల్లో హోమం నిర్వహిస్తున్నాడని మేయర్ని కొట్టడం, సస్పెండ్ అయి ఇంటి దగ్గర తల్లితో వాదన, ఫ్రెండ్స్ తో కామెడీ, ఆవు తులసి కోటని కుమ్మే ఎపిసోడ్, చివరికి మొక్కు తీర్చుకోవడానికి తల్లితో ద్వారకా బయల్దేరడం- ద్వారకాలో భక్తి, కామెడీ, ఇంతలో ప్రొఫెసర్ మీద హత్యా ప్రయత్నం, అందులో తను ఇరుక్కోవడం....

అయినా ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడదు. తనని ఎవరు కేసులో ఇరికిస్తున్నారో తెలియదు. అసలు ద్వారకా వచ్చిన పని పెండింగులో వున్న మొక్కు తీర్చుకుంటే ఇలా జరిగేది కాదేమో. తులసి కోట దగ్గర్నుంచీ ఇప్పటి దాకా కృష్ణుడే తనకి వ్యతిరేకంగా  పని చేస్తున్నాడు!

ఇంతలో తల్లీ కూడా మాయమై పోతే ఇదొక సస్పెన్సు. పరుగులు, ప్రొఫెసర్ మీద దాడి చేసిన గ్యాంగ్ ఎటాక్, ఈ గ్యాంగ్ ఎవరో కూడా నిఖిల్ కి తెలీదు, మనకి తెలుసు. ఇంకొంత వెతుకులాట తర్వాత తల్లి తిరిగొచ్చేసి కామెడీ చేస్తుంది. గుళ్ళో భజన కార్యక్రమంలో భక్తితో వూగి పోయానంటుంది. అమ్మా తల్లీ, ముందు నువ్వా మొక్కు తీర్చుకోమ్మా, 108 కేజీల వెన్న ఏదీ?- అన్పిస్తుంది మనకి.

తర్వాత హీరోయిన్ అనుపమ ఎంట్రీ. సెకండాఫ్ లో ఈమెకూడా మాయమై తిరిగొచ్చేసి ఉత్తుత్తి సస్పెన్సు  క్రియేట్ చేస్తుంది. ఇంతలో ఆభీర తెగకి చెందిన వాళ్ళ దాడి. దీనికి కథతో సంబంధముండదు. సబ్ ప్లాట్ కాదు. సెకండాఫ్ లో ఇంకో కథతో సంబంధంలేని గ్యాంగు బంధిస్తుంది.

ఇంతవరకూ నిఖిల్ ఈ దాడులు చేస్తున్నదెవరో తెలుసుకునే అన్వేషణలోనే వుంటాడే గానీ, కడియం గురించి అతడికేమీ తెలీదు. ఇంటర్వెల్లో గానీ తెలిసి, ఒక డైలాగుతో బలహీనంగా ముగిస్తాడు.

ప్రేక్షకులకి ఓపెన్ కథ, హీరోకి సస్పెన్స్ అన్న స్కీము ఇంతసేపు వర్కౌట్ కాదు. ఒకటే జరగాలి- ప్రారంభంలో ప్రొఫెసర్ తో బాటు కృష్ణుడి ఎపిసోడ్ చూపించాక, మొత్తం కడియానికి సంబంధించిన ట్రాక్ ఎత్తేయాలి. ఎత్తేసి డాక్టర్ గా తన రోజువారీ ప్రపంచంలో వున్న నిఖిల్ కి, అరగంట లోపు అడ్మిట్ అయిన ఒక కోవిడ్ రోగితో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి కలకలం రేగాలి. ప్రొఫెసర్ వచ్చేసి వైరస్ ని అంతం చేసే మహిమగల కృష్ణుడి కడియం గురించి చెప్పాలి. ఇద్దరూ దాని వేటలో బయల్దేరాలి. నిఖిల్ గోల్ ఆ కడియంతో ప్రపంచ విపత్తునాపడం. ఇక జాతీయ, అంతర్జాతీయ శక్తులూ కడియాన్ని కైవసం చేసుకునే పథకాలతో నిఖిల్ సంఘర్షణ! సింపుల్ గా ఇలా వుంటుంది బలమైన కథ.

ఇక సెకండాఫ్ లో ప్రారంభమయ్యే కథ చూస్తే ఈ మిడిల్ విభాగంలో మిడిల్ బిజినెస్ వుండదు. ప్రొఫెసర్, అనుపమ్ ఖేర్ పాత్రలతో పరిశోధనేతప్ప విలన్లతో యాక్షన్ వుండదు. విలన్లు ఎందుకున్నారో తెలీదు, కనపడరు. చివరి అరగంట నిఖిల్ విలన్లు లేని ఏకపక్ష అన్వేషణతో వివిధ ప్రదేశాలు టూరు వేసి కడియాన్ని కనుగొనడంతో అయిపోతుంది కథ. ఎందుకు కనుగొన్నాడో, దాని అవసరమేమిటో ఇప్పటికీ తెలీదు నిఖిల్ కి...

మరి ఎలా హిట్టయ్యింది ఈ కథ? కథనాపుతూ అనేక చోట్ల భక్తి ప్రవచనాలతో భక్తి రసాన్ని పంచడం వల్ల హిట్టయ్యిందని చెప్పొచ్చు.

—సికిందర్